• facebook
  • whatsapp
  • telegram

కొత్త రాజధాని ఏర్పాటుపై కమిటీలు - పరిణామాలు

1 ఆర్థిక భారం.. 3 నయా నిర్దేశం!


  రాష్ట్రం విడిపోయింది. రాజధాని లేకుండా పోయింది. కమిటీలు వేశారు. ప్రపంచస్థాయి క్యాపిటల్‌ కట్టాలని సూచనలు వచ్చాయి. ఆ మేరకు నిర్ణయాలు జరిగి పనులు ప్రారంభమయ్యాయి. ఇంతలో ప్రభుత్వం మారింది. రాజధానిపై మళ్లీ కొత్త కమిటీలు      అధ్యయనం చేశాయి. పాత ప్రణాళిక ఆర్థికంగా అత్యంత భారమని తేల్చాయి. అభివృద్ధి,  అధికార వికేంద్రీకరణ ప్రధాన సూత్రాలుగా మూడు రాజధానుల ప్రతిపాదన తెరపైకి తెచ్చాయి. ఈ పరిణామాలపై పరీక్షల్లో ప్రశ్నలు వస్తున్నాయి. వీటిపై అభ్యర్థులు సమగ్ర అవగాహన పెంపొందించుకోవాలి. 


ఆంధ్ర రాష్ట్రం 1953లో మద్రాసు నుంచి విడిపోయినప్పుడు ఎదురైన ప్రధాన సమస్య రాజధాని లేకపోవడం. అదే ఇబ్బంది 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజనతో పునరావృతమైంది. ‘ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టం- 2014’లోని సెక్షన్‌-3లో పేర్కొన్న ప్రాంతాలతో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. హైదరాబాద్‌ నగరం తెలంగాణ ప్రాంతానికి దక్కింది. సెక్షన్‌-5 ప్రకారం హైదరాబాద్‌ 10 సంవత్సరాలు మించని కాలానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా, ఆ తర్వాత తెలంగాణకు రాజధానిగా ఉంటుంది. దీంతో అవశేష ఆంధ్రప్రదేశ్‌కు మళ్లీ రాజధాని లేకుండా పోయింది.


శివరామకృష్ణన్‌ కమిటీ: ఏపీ విభజన చట్టం-2014లోని సెక్షన్‌-6లో పేర్కొన్న విధంగా అవశేష ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని ఏర్పాటుపై అధ్యయనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 2014, మార్చి 28న కె.సి.శివరామకృష్ణన్‌ కమిటీని ఏర్పాటుచేసింది. ఇందులో ప్రొఫెసర్‌ కె.టి.రవీంద్రన్, అరోమర్‌ రెవి, డాక్టర్‌ రతిన్‌ రాయ్, జగన్‌ షా సభ్యులుగా ఉన్నారు. విభజన చట్టం అమల్లోకి వచ్చిన 6 నెలల్లోగా కమిటీ తగిన సూచనలు చేయాలని కేంద్రం నిర్దేశించింది. ఈ కమిటీకి పరిశోధకులుగా అరిందం జనా, భాను జోషి, నితిన్‌.కె రాయిసా వకీల్, రాజీవ్‌.ఆర్‌ నియమితులయ్యారు.


* నిపుణుల కమిటీ 188 పేజీల నివేదికను 2014, ఆగస్టు 27న కేంద్రానికి అందజేసింది. ఇందులో మొత్తం 6 భాగాలు ఉన్నాయి. 3వ భాగంలో రాజధానికి సంబంధించి 1) నూతన గ్రీన్‌ ఫీల్డ్‌ రాజధాని నగరం ఏర్పాటు 2) ప్రస్తుతం ఉన్న నగరాలను విస్తరించడం 3) అభివృద్ధి వికేంద్రీకరణ అనే మూడు విధానాలను వివరించింది. రాజధానిని ఎక్కడ ఏర్పాటు చేయాలో కూడా విస్పష్టంగా సూచించింది.


గత రాష్ట్ర ప్రభుత్వ చర్యలు: నాటి రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నిర్మాణానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసేందుకు 2014, జులై 20న రాజధాని సలహా సంఘాన్ని ఏర్పాటు చేసింది. కొత్త రాజధానిని సింగపూర్‌ తరహాలో ప్రపంచస్థాయి నగరంగా నిర్మించాలనే ఆశయంతో కృష్ణా నదీ తీరంలో కృష్ణా, గుంటూరు జిల్లా మధ్యలో నిర్మించాలని నిర్ణయించింది. ఈ తీర్మానాన్ని 2014, సెప్టెంబరు 3న రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. నూతన రాజధాని నిర్మాణానికి అవసరమైన భూసేకరణ కోసం 2014, సెప్టెంబరు 24న మంత్రిత్వ స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని ప్రాంతం అభివృద్ధి, ప్రణాళిక, సమన్వయం, కార్యనిర్వహణ, నిధుల సేకరణ, రాజధాని నగర నిర్మాణం వంటి అంశాలతో కూడిన ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఏపీ సీఆర్‌డీఏ) చట్టాన్ని 2014 డిసెంబరు 30న చేసింది. ఆ రోజు నుంచే ఆ చట్టం అమల్లోకి వచ్చింది. అప్పటివరకు ఉన్న ‘విజయవాడ - గుంటూరు - తెనాలి - మంగళగిరి అభివృద్ధి ప్రాధికార సంస్థ’ రద్దయింది. కొత్త రాజధాని నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 2014, డిసెంబరు 8న ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం రాజధాని బృహత్‌ ప్రణాళిక (మాస్టర్‌ ప్లాన్‌) బాధ్యతను సింగపూర్‌ ప్రభుత్వం తీసుకుంది. ఏడు నెలల వ్యవధిలో పర్‌స్పెక్టివ్‌ ప్లాన్, రాజధాని నగర మాస్టర్‌ప్లాన్, సీడ్‌ కేపిటల్‌ డెవలప్‌మెంట్‌ ప్లాన్‌లను అందజేసింది.


* సీఆర్‌డీఏ చట్టం ప్రకారం రాజధాని నగరం అభివృద్ధికి కావాల్సిన విస్తీర్ణాన్ని 122 చదరపు కిలోమీటర్లుగా 2014 డిసెంబరు 30న ప్రకటించగా, అనంతరం 217.23 చ.కి.మీ.లకు పెంచింది. 2015, ఏప్రిల్‌ 23న నూతన రాజధాని పేరును అమరావతిగా ప్రకటించింది.


* స్విస్‌ ఛాలెంజ్‌ పద్ధతిలో భాగంగా అంతర్జాతీయ పోటీ అనంతరం 2017, మే 8న రాష్ట్ర ప్రభుత్వం రాజధాని నగరం (217.23 చ.కి.మీ.)లో సీడ్‌ కేపిటల్‌ ఏరియా (16.9 చ.కి.మీ)లోని 6.84 చ.కి.మీ. విస్తీర్ణంలో రాజధాని నగర ‘స్టార్టప్‌ ఏరియా’ మాస్టర్‌ డెవలపర్‌గా సింగపూర్‌ కన్సార్టియం అయిన ‘అసెండాస్‌- సింగ్‌ బ్రిడ్జ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, సెంబ్‌కార్ప్‌ డెవలప్‌మెంట్‌ లిమిటెడ్‌’లను ఆమోదించింది.


తాత్కాలిక సచివాలయ సముదాయం: 2016, ఫిబ్రవరి 17న తాత్కాలిక సచివాలయ కాంప్లెక్స్‌ (సచివాలయం, అసెంబ్లీ) భవనాలు, సముదాయ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. 45 ఎకరాల్లో యుద్ధప్రాతిపదికన నిర్మించి 2016, ఏప్రిల్‌ 26న లాంఛనంగా ప్రారంభించారు. 2016, అక్టోబరు 3 నుంచి ప్రభుత్వ కార్యకలాపాలన్నీ ఈ సముదాయం నుంచే జరుగుతున్నాయి.


భూసమీకరణ పథకం (LandPooling Scheme): రాజధాని నిర్మాణానికి కావాల్సిన భూమిని రైతుల నుంచి సేకరించడం కోసం రైతులకు సమ్మతమైన ‘భూ సమీకరణ పథకం’ వైపు మొగ్గు చూపింది. విధివిధానాలను ‘ఆంధ్రప్రదేశ్‌ కేపిటల్‌ సిటీ ల్యాండ్‌ పూలింగ్‌ స్కీమ్‌ రూల్స్‌-2015’గా 2015, జనవరి 1న ప్రకటించారు. ఈ పథకంలో భాగంగా రైతులు స్వచ్ఛందంగా ప్రభుత్వానికి  భూములు అందజేస్తారు. ప్రతిఫలంగా ప్రభుత్వం రైతులకు పరిహారం అందజేస్తుంది. ఈ పథకాన్ని శివరామకృష్ణన్‌ కమిటీ చాలావరకు సమర్థించింది.


* 2015, జనవరి 2న ప్రారంభమైన భూసమీకరణ పథకం 2015, ఫిబ్రవరి 28న ముగిసింది. ఈ పథకం కింద 47,573.10 ఎకరాలకు నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఇందులో 38,581.15 ఎకరాలు సమీకరించడం లక్ష్యం కాగా, 33,036 ఎకరాల భూమిని 29 గ్రామాల రైతుల నుంచి సమీకరించారు. 2015, అక్టోబరు 22న ప్రధానమంత్రి చేతుల మీదుగా కొత్త రాజధాని నగరం శంకుస్థాపన కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా ‘ఉద్దండరాయునిపాలెం’ వద్ద నిర్వహించారు.


ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ దృక్పథం: 2019 మధ్యలో అధికారం చేపట్టిన ప్రస్తుత ప్రభుత్వం అభివృద్ధి ఫలాలను విస్తరించాలనే ఉద్దేశంతో పరిపాలనా వికేంద్రీకరణకు మొగ్గు చూపింది. దీనిలో భాగంగా 2019, డిసెంబరు 18న ఇప్పటి ముఖ్యమంత్రి శాసనసభలో మొదటిసారిగా మూడు రాజధానుల ప్రతిపాదనను ప్రకటించారు. 


జి.ఎన్‌.రావు కమిటీ (నిపుణుల కమిటీ): రాజధానిపై సలహాలు, సూచనల కోసం రాష్ట్ర ప్రభుత్వం విశ్రాంత ఐఏఎస్‌ అధికారి జి.ఎన్‌.రావు ఆధ్వర్యంలో 2019, సెప్టెంబరు 13న నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ అదే ఏడాది డిసెంబరు 20న నివేదిక సమర్పించింది. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకోవాలని పలు సిఫార్సులు చేసింది. అభివృద్ధిని వికేంద్రీకరించే విధంగా శాసన రాజధానిగా అమరావతిలో చట్టసభలు, కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నంలో సచివాలయం, న్యాయ రాజధానిగా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. వాటితో పాటు విశాఖపట్నం, అమరావతిల్లో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేయాలని సూచించింది.


బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూపు (బీసీజీ) నివేదిక: బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూపు 2020, జనవరి 3న నివేదిక సమర్పించింది. ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతి నిర్మాణం సాధ్యం కాదని అభిప్రాయపడింది.‘విస్తరణ రాజధాని నమూనా’ని అనుసరించాలని పేర్కొంది. విశాఖపట్నంలోనే పూర్తిస్థాయి రాజధాని ఏర్పాటు మంచిదని సూచించింది.


ఉన్నత స్థాయి (హైపవర్‌) కమిటీ: జి.ఎన్‌.రావు కమిటీ, బీసీజీ కమిటీలతో పాటు రాజధాని అంశంపై ఏర్పాటైన శివరామకృష్ణన్‌ కమిటీ ఇచ్చిన నివేదికలను సమగ్రంగా పరిశీలించి ప్రభుత్వానికి అభివృద్ధి వికేంద్రీకరణపై సిఫార్సులు చేసేంద]ుకు 2019, డిసెంబరు 29న 16 మంది సభ్యులతో ఉన్నతస్థాయి కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ 2020, జనవరి 17న నివేదిక అందజేసింది. హైపవర్‌ కమిటీ రాష్ట్రంలోని 3 ప్రాంతాల్లో వేర్వేరు సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిస్థితులున్నాయని, సామాజిక ప్రగతి ఫలాలను వివిధ ప్రాంతాల్లోని ప్రజలు సమానంగా అనుభవించే విధంగా చూడాలని సూచించింది. దీంతో ఏపీ సీఆర్‌డీఏ రద్దు బిల్లులను 2020, జనవరి 20న రాష్ట్ర కేబినెట్‌ ఆమోదించడంతో, అదే రోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత గవర్నర్‌ ఆమోదంతో 2020, జులై 1న ‘ఆంధ్రప్రదేశ్‌ పరిపాలన వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమీకృతాభివృద్ది చట్టం’ వచ్చింది. దీని ప్రకారం రాష్ట్రానికి అమరావతి శాసన రాజధానిగా, విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా ఉంటాయి. ఈ మూడు రాజధానుల అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉంది. 

Posted Date : 16-07-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌