• facebook
  • whatsapp
  • telegram

ఉమ్మడి సంస్థల విభజన - 1

(మరికొన్ని ఆస్తులు)

వాటాల కేటాయింపు సంక్లిష్టం! 

అడుగు పడదు, గొడవ ముగియదు అన్నట్లుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఆస్తుల విభజన. ముఖ్యంగా తొమ్మిది, పది షెడ్యూళ్లలోని ఉమ్మడి సంస్థల విభజన సంక్లిష్టంగా మారింది. జనాభా ప్రాతిపదికన ఆస్తులను విభజించాలని ఆంధ్రప్రదేశ్‌ కోరుతుంటే, కొన్నింటికి జనాభా, మరికొన్నింటికి స్థానికత ఆధారం చేసుకోవాలని తెలంగాణ వాదిస్తోంది. ప్రధాన సంస్థలైన సింగరేణి, ఆర్టీసీ, దక్కన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ ల్యాండ్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్, డెయిరీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్, దిల్లీలోని ఏపీ భవన్‌ల విభజన ఎంతకూ తెగడం లేదు. ఈ సంస్థల పంపకంపై విభజన చట్టం ఏం చెబుతోంది, రెండు రాష్ట్రాల వాదనలు ఎలా ఉన్నాయి, కేంద్రం సూచనలు ఏమిటి అనే అంశాలపై పోటీ పరీక్షార్థులకు అవగాహన ఉండాలి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజనలో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉమ్మడి సంస్థల విభజన తీవ్ర వివాదానికి దారితీసింది. విభజన చట్టంలోని 9వ షెడ్యూల్‌ కింద 91, పదో షెడ్యూల్‌ కింద 142 ఉమ్మడి సంస్థలను పేర్కొన్నారు. చట్టంలో పొందుపరచని రాష్ట్రస్థాయి ఉమ్మడి సంస్థలు మరో 12 ఉన్నాయి. మొత్తంగా 245 సంస్థలు విభజించాల్సి ఉండగా వీటిలో కీలక సంస్థల విభజన అపరిష్కృతంగా ఉంది.

మొత్తం 245 సంస్థల ఆస్తుల విలువ రూ.1,42,601 కోట్లుగా రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. 9వ షెడ్యూల్‌లో పేర్కొన్న ఉమ్మడి సంస్థల ప్రధాన కార్యాలయాల విలువ సుమారు రూ.24,018.53 కోట్లు. వీటిలో రూ.22,556.45 కోట్లు అంటే 93.9 శాతం విలువైన ప్రధాన కార్యాలయాలన్నీ తెలంగాణలోనే ఉన్నాయి. 10వ షెడ్యూల్‌లో పేర్కొన్న ఉమ్మడి సంస్థల ప్రధాన కార్యాలయాల ఆస్తుల విలువ రూ.34,642.77 కోట్లు కాగా అందులో రూ.30,530.86 కోట్లు అంటే 88 శాతం విలువైన ఆస్తులు తెలంగాణలో ఉన్నాయి. ఆ రెండు షెడ్యూళ్లలో పేర్కొనని 12 ఉమ్మడి సంస్థల విలువ రూ.1,759 కోట్ల వరకు ఉండగా, అవన్నీ తెలంగాణలోనే ఉన్నాయి.

* ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్, ఆర్టీసీ, విశ్వవిద్యాలయాల ఆస్తులు, ఉన్నత విద్యామండలి, ఏపీ భవన్, దక్కన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ ల్యాండ్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ భూములు, ఏపీ స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్, సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ ఆస్తుల విభజన విషయంలో ప్రతిష్టంభన నెలకొంది.


సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ (SCCL): ఈ సంస్థను ఏపీ విభజన చట్టం-2014లోని 9వ షెడ్యూల్‌ కింద వరుస సంఖ్య-7లో చేర్చారు. అందువల్ల 53, 68 సెక్షన్లు వర్తిస్తాయి. వీటికి అనుగుణంగా కంపెనీ కార్యకలాపాలు అంతర్రాష్ట్ర వ్యవహారంగా మారడంతో ఈ సంస్థ ఆస్తులు, అప్పుల విభజన జరగాలని ఆంధ్రప్రదేశ్‌ కోరుతోంది.

విభజన చట్టంలోని సెక్షన్‌-92 ‘మౌలిక సదుపాయాలు, ప్రత్యేక ఆర్థిక చర్యలు’ గురించి వివరిస్తుంది. ఈ సెక్షన్‌కు 12వ షెడ్యూల్‌ను చేర్చారు. ‘బొగ్గు, చమురు-సహజ వాయువు, విద్యుత్తు ఉత్పత్తి-పంపిణీ’కి సంబంధించిన అంశాలను ఈ షెడ్యూల్‌ పరిష్కరిస్తుంది. ‘బొగ్గు’ పద్దు కింద ఈ షెడ్యూల్‌లో సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ మొత్తం ఈక్విటీగా 51 శాతం తెలంగాణ ప్రభుత్వం వద్ద, 49 శాతం కేంద్ర ప్రభుత్వం వద్ద ఉంటుంది. అందువల్ల సింగరేణి కాలరీస్‌కు సంబంధించిన రెండు నిబంధనలు ఉన్నాయి. అందులో ఒకటి.. కొత్తగా ఏర్పడిన రెండు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పుల కేటాయింపుతో షెడ్యూల్‌-9 వ్యవహరిస్తుంది. మరొకటి.. ‘బొగ్గు’ కు సంబంధించి స్థూల పద్దు కింద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి సంబంధించిన 51 శాతం ఈక్విటీని తెలంగాణకు అప్పగించడంతో షెడ్యూల్‌-12 వ్యవహరిస్తుంది. ఈ నేపథ్యంలో సామరస్యపూర్వక నిర్మాణ సూత్రాన్ని వర్తింపజేస్తూ, కంపెనీ ప్రధాన స్థానాల ఆస్తులు, అప్పులను జనాభా నిష్పత్తిలో విభజించాలి. అయితే బొగ్గు నిల్వలు తవ్వి నిర్వహించే హక్కులన్నీ తెలంగాణకే ఉన్నాయి.



 

* విభజన చట్టం సెక్షన్‌-66లోని నిబంధనలకు అనుగుణంగా 2017, మే 30న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తన వాదనకు పూర్తి ఆధారాలు చూపిస్తూ సింగరేణి కాలరీస్‌ ఆస్తులు పంచాలని కేంద్రానికి తెలిపింది. అలాగే సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ ఆస్తులు, అప్పుల విభజన అంశాన్ని చేపట్టాలని 2018, జనవరి 29న రాష్ట్ర ప్రభుత్వం ‘షీలా బిడే’ నిపుణుల కమిటీని కోరింది. అయితే సింగరేణిని విభజించడంపై తెలంగాణ అభ్యంతరం తెలిపింది. సింగరేణిలోని 51 శాతం వాటాను తెలంగాణకు బదలాయిస్తూ విభజన చట్టంలో కేంద్రం నిబంధనలు పొందుపరిచిన విషయాన్ని గుర్తుచేసింది. సింగరేణి అనుబంధ సంస్థ ‘ఆంధ్రప్రదేశ్‌ హెవీ మిషనరీ అండ్‌ ఇంజినీరింగ్‌ లిమిటెడ్‌’నే విభజించాలని స్పష్టం చేసింది.


ఏపీఎస్‌ఆర్టీసీ ఆస్తులు: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఆర్టీసీకి సుమారు రూ.30 వేల కోట్లకు పైగా ఆస్తులున్నాయి. హైదరాబాద్‌ చుట్టుపక్కల ఖాళీ స్థలాలు, భవనాలు, వర్క్‌షాపుల రూపంలో 11 విలువైన ఆస్తులున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో బస్సు డిపోలను ఏపీఎస్‌ఆర్టీసీ నడపగా, తెలంగాణలోని డిపోలను కొత్తగా ఏర్పడిన టీఎస్‌ఆర్టీసీ నడిపిస్తోంది. అయితే ఆర్టీసీ ఆస్తుల విభజన జరగకపోవడంతో టీఎస్‌ఆర్టీసీకి సాంకేతికంగా గుర్తింపు లేదని గతంలో కేంద్రం ప్రకటించింది. ఏపీఎస్‌ఆర్టీసీని 9వ షెడ్యూల్‌లోని వరుస సంఖ్య 26లో చేర్చారు.

* ఉమ్మడి రాష్ట్రంలో ఆర్టీసీకి ఉన్న ఆస్తులన్నింటినీ లెక్కగట్టి జనాభా ప్రాతిపదికన పంచాలని ఆంధ్రప్రదేశ్‌ డిమాండ్‌ చేస్తుండగా, హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లోని బస్‌భవన్‌లోని వాటాను మాత్రమే తెలంగాణ అంగీకరించింది.


దక్కన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ ల్యాండ్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ (DILL): ఉమ్మడి రాష్ట్రంలో అల్పాదాయ వర్గాలకు సొంతింటి కల నెరవేర్చేందుకు, పారిశ్రామిక అభివృద్ధి అవసరాల కోసం వివిధ సంస్థలకు భూములు కేటాయించడానికి దక్కన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ ల్యాండ్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ (డీఐఎల్‌ఎల్‌)ను ఏర్పాటు చేశారు. దీన్ని ఆంధ్రప్రదేశ్‌ హౌసింగ్‌ బోర్డుకు అనుబంధ కంపెనీగా ఏర్పాటు చేసి, 2007లో 5 వేల ఎకరాలు ఈ సంస్థకు కేటాయించారు. ఈ భూముల్లో ఎలాంటి ప్రాజెక్టులు మొదలు కాకపోవడంతో తెలంగాణ ప్రభుత్వం 2015, ఆగస్టు 22న G.O.MS.NO: 143 కింద ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో కేటాయించిన 4,999.14 ఎకరాలను రద్దు చేసింది (ఈ భూములు ఉమ్మడి మెదక్, నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ఉన్నాయి.)

* విభజన చట్టంలోని 9వ షెడ్యూల్‌లోని వరుస సంఖ్య-47 కింద నమోదై ఉన్న ఈ సంస్థ భూములపై తెలంగాణ ప్రభుత్వ చర్యపై ఆంధ్రప్రదేశ్‌ ‘హైకోర్టు’ను ఆశ్రయించి ‘స్టే’ తెచ్చుకుంది. ఈ కేసు ఇంకా పెండింగ్‌లోనే ఉంది.

* తెలంగాణ ప్రభుత్వం డీఐఎల్‌ఎల్‌ ఆస్తుల విభజనపై అభ్యంతరం తెలిపినప్పటికీ ఈ సంస్థ ఆస్తులను హెడ్‌క్వార్టర్‌ ఆస్తులుగా పరిగణిస్తూ వాటిని విభజించాలని ‘షీలా బిడే’ నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా కోరుతోంది.



ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (APSFC): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2007, ఆగస్టు 16న ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌కి రంగారెడ్డి జిల్లా గాజులరామారంలో సర్వే నంబరు 308లో 33.11 ఎకరాలు, సర్వే నంబరు 307/1లో 238.28 ఎకరాలు మొత్తంగా 271.39 ఎకరాలను, ఎకరాకు రూ.40 లక్షల చొప్పున 99 ఏళ్లకు లీజుకిచ్చింది.



 

* రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ ప్రభుత్వం 2015, అక్టోబరు 29న G.O.MS.NO: 195 కింద ఉత్తర్వులు జారీ చేసింది. APSFCకి కేటాయించిన భూమి నిరుపయోగంగా మారి, అన్యాక్రాంతం అవుతోందని పేర్కొంటూ గాజులరామారంలో గతంలో కేటాయించిన సర్వే నంబరు 308లో 33.11 ఎకరాలు, సర్వే నంబరు 307/1లో 220.23 ఎకరాలు మొత్తంగా 253.34 ఎకరాలను రద్దు చేసింది. W.P.NO:18442/2011కి సంబంధించిన కేసులో స్టేటస్‌ కో ఉండటంతో సర్వే నంబరు 307/1లో 18 ఎకరాలను పక్కనపెట్టారు. APSFC భూముల విషయంలో తెలంగాణ ప్రభుత్వ చర్యను వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్‌.. హైకోర్టును ఆశ్రయించి స్టే తీసుకుంది. ఈ కేసు ఇంకా పెండింగ్‌లో ఉంది.

APSFC అప్పటి బోర్డు ఏకపక్షంగా విభజన ప్రణాళికను సిద్ధం చేసిందని పేర్కొంటూ బోర్డును పునర్నిర్మించాలని 2016 మేలో తెలంగాణ, కేంద్రాన్ని కోరింది. అయితే కేంద్రం ఎలాంటి బోర్డును ఏర్పాటు చేయలేదు. APSFC అంశం కూడా ప్రధాన కార్యాలయం (హెడ్‌క్వార్టర్‌) నిర్వచనానికి సంబంధించింది. వివాదంలో ఉన్న భూములను ప్రధాన కార్యాలయ ఆస్తిలో భాగంగా పరిగణిస్తారా లేదా అనే విషయంపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.


ఆంధ్రప్రదేశ్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (APDDC): హెడ్‌క్వార్టర్‌ నిర్వచనం ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ తమకే చెందుతుందని తెలంగాణ పేర్కొంటోంది. తమ రాష్ట్ర ప్రాంతం నుంచి కూడా పాలసేకరణ జరిగింది కాబట్టి, వాటా ఇవ్వాల్సిందేనని ఆంధ్రప్రదేశ్‌ వాదించింది. APDDC కి చెందిన ఆస్తులను తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ డెయిరీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసి పూర్తిగా బదిలీ చేసుకుంది. దీంతో విభజన చట్టంలోని 9వ షెడ్యూల్‌లో వరుస సంఖ్య 70లో జాబితా పరిచిన APDDC ఆస్తుల విభజన పంచాయతీ కోర్టులకు చేరింది. ఈ కేసులో కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు 9వ షెడ్యూల్‌ సంస్థల విభజనలో ఎలాంటి అధికార పరిధి లేదని తెలంగాణ హైకోర్టు పేర్కొన్న విషయాన్ని తెలంగాణ తెలియజేయడంతో, దానిపై న్యాయ సలహా తీసుకుంటామని కేంద్ర హోం శాఖ ప్రకటించింది.


ఏపీ భవన్‌ ఆస్తులు: దిల్లీలోని ఏపీ భవన్‌ స్థలంపై తెలంగాణకే పూర్తి హక్కుందని, తెలంగాణ భవన్‌ నిర్మాణానికి ఆ స్థలాన్ని ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి 2016, జూన్‌ 23న కేంద్రానికి లేఖ రాశారు. అలాగే నిజాం నవాబుకు చెందిన హైదరాబాద్‌ హౌస్‌ను కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినందుకు పరిహారంగా కేటాయించిన 7 ఎకరాల స్థలాన్ని కూడా తెలంగాణకే ఇవ్వాలని కోరారు. అయితే విభజన చట్టంలోని సెక్షన్‌-48లో ‘భూమి, వస్తువుల పంపకం’ గురించి పేర్కొన్నారు. దాని ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హద్దులకు అవతల ఆస్తులు ఉంటే వాటిని జనాభా నిష్పత్తి ప్రకారం రెండు రాష్ట్రాలకు పంచాలి. ఏదైనా ఆస్తులను వాటి ఉనికి ఆధారంగా కాకుండా, మరోవిధంగా నూతన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు పంచాలని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడితే ఆ మేరకు బదిలీ అవుతాయి. అదేవిధంగా ఆస్తులు లేదా వస్తువుల పంపిణీలో వివాదాలు వస్తే కేంద్రం రెండు రాష్ట్రాల పరస్పర అంగీకారంతో పరిష్కరించేందుకు ప్రయత్నించాలి.’

ఏపీ భవన్‌ ఆస్తుల విభజనలో భాగంగా 2023, ఏప్రిల్‌ 26న రెండు రాష్ట్రాల అధికారులతో సమావేశం ఏర్పాటైంది. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు/ప్రతిపాదనలను రెండు రాష్ట్రాలకు 2023, మే 4న మినిట్స్‌ రూపంలో పంపించారు. దీనిలో భాగంగా దిల్లీలో తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి ఆస్తి అయిన ఏపీ భవన్‌ పరిధిలోని 19.73 ఎకరాల విభజనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు కేంద్రం కూడా తన ప్రతిపాదనను తెలిపింది.

* కేంద్రం తన ప్రతిపాదనలో భాగంగా 12.09 ఎకరాల్లోని ఏపీభవన్‌ (శబరి బ్లాక్, గోదావరి బ్లాక్, నర్సింగ్‌ హాస్టల్‌ బ్లాక్‌)ను పూర్తిగా ఆంధ్రప్రదేశ్‌ తీసుకోవాలని; పటౌడీ హౌస్‌లోని 7.64 ఎకరాలను తెలంగాణ తీసుకోవాలని పేర్కొంది. ఆస్తులను జనాభా నిష్పత్తిలో (58:42) రెండు రాష్ట్రాలు పంచుకోవాలని, ఆంధ్రప్రదేశ్‌కు అదనపు భూమి దక్కితే, ఆ విలువ మేరకు తెలంగాణ, ఏపీ నుంచి భర్తీ చేసుకోవాలని సూచించింది.

* తాజా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మినిట్స్‌ ప్రకారం ఏపీ భవన్‌ ఆస్తుల పంపకం ప్రతిపాదనలు/ఆప్షన్లు అయిదు రకాలుగా ఉన్నాయి.


ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపాదనలు

ఆప్షన్‌-ఎ : తెలంగాణకు శబరి బ్లాకు, పటౌడీ హౌస్‌లో సగభాగం, ఆంధ్రప్రదేశ్‌కు పటౌడీ హౌస్‌లో మిగిలిన సగభాగం, గోదావరి బ్లాకు, నర్సింగ్‌ హాస్టల్‌ బ్లాకు. 

ఆప్షన్‌-బి : ఆంధ్రప్రదేశ్‌కు మొత్తం పటౌడీ హౌస్, శబరి బ్లాకు, తెలంగాణకు గోదావరి బ్లాకు, నర్సింగ్‌ హాస్టల్‌ బ్లాకు.

ఆప్షన్‌-సి : తెలంగాణకు శబరి, గోదావరి బ్లాకులు; ఆంధ్రప్రదేశ్‌కు నర్సింగ్‌ హాస్టల్‌ బ్లాకు, పటౌడీ హౌస్‌.


తెలంగాణ ప్రతిపాదన:

ఆప్షన్‌-డి : తెలంగాణకు శబరి బ్లాకు, గోదావరి బ్లాకు, నర్సింగ్‌ హాస్టల్‌ (12.09 ఎకరాలు), ఆంధ్రప్రదేశ్‌కు పటౌడీ హౌస్‌ (7.64 ఎకరాలు). ఇది విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాటాకు విరుద్ధంగా ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్‌ కోల్పోయే దానికి విలువకట్టి ఆ మొత్తాన్ని తెలంగాణ చెల్లిస్తుంది. ఒకవేళ దీనికి అంగీకరించకపోతే ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన ఆప్షన్‌-సి ని పరిశీలించాలి.


కేంద్రం ప్రతిపాదన:

ఆప్షన్‌-ఇ : గోదావరి, శబరి బ్లాకులు; నర్సింగ్‌ హాస్టల్‌ బ్లాకుతో ఉన్న 12.09 ఎకరాలు ఆంధ్రప్రదేశ్‌కు, 7.64 ఎకరాలు విస్తీర్ణంలో ఉన్న పటౌడీ హౌస్‌ తెలంగాణకు.

ఈ ప్రతిపాదనల్లో భాగంగా సి, డి, ఇ లను పరిశీలించి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తమ అభిప్రాయాలను పంపాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కోరింది.

ఇంకా అనేక ఉమ్మడి సంస్థల విభజనకు సంబంధించిన వివాదాలు అలాగే ఉన్నాయి. 9వ షెడ్యూల్‌లోని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (APSCSCL)కు చెందిన, తెలంగాణ స్టేట్‌ సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ వినియోగించుకున్న రూ.354 కోట్లు తిరిగి చెల్లింపు చేయలేదు. అలాగే విభజన చట్టం ప్రకారం విద్యుత్తు బకాయిలను కూడా ఏపీకి తెలంగాణ చెల్లించలేదు.

* 10వ షెడ్యూల్‌లోని ‘ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌’ మొదలు మొత్తం 142 సంస్థలను జనాభా నిష్పత్తిలో పంచాలని ఆంధ్రప్రదేశ్‌ కోరుతోంది. కానీ తెలంగాణ మాత్రం 10వ షెడ్యూల్‌ సంస్థల నగదును జనాభా నిష్పత్తిలో, ఆస్తులను స్థానికత ఆధారంగా పంచాలని వాదిస్తోంది. ఆ విధంగా ఉమ్మడి సంస్థల విభజన సమస్యలతో నిండిపోవడంతో, అవశేష ఆంధ్రప్రదేశ్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది.


రచయిత: వి.కరుణ
 

Posted Date : 28-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌