• facebook
  • whatsapp
  • telegram

 రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వనరులపై విభజన ప్రభావం

 ఆదుకోవడంలో అంతులేని ఆలస్యం! 

శాస్త్రీయత లేకుండా జరిగిన రాష్ట్ర విభజనతో నవ్యాంధ్ర అన్నివిధాలుగా దెబ్బతింది. ఆస్తులను ప్రాంతాల ప్రాతిపదికన కేటాయించడంతో తెలంగాణ లాభపడింది. అప్పులను జనాభా ఆధారంగా లెక్కగట్టడంతో ఏపీ నష్టపోయింది. ప్రభుత్వ నిర్వహణకు అవసరమైన రెవెన్యూ వసూళ్లు పూర్తిగా తగ్గిపోయాయి. ఈ సందర్భంగా ఏర్పడే ఆర్థిక లోటును కేంద్రం భర్తీ చేయాలని విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ, ఆ నిధుల మంజూరులో దాదాపు దశాబ్ద కాలం ఆలస్యం జరిగింది. ఆదాయం తగ్గి, అప్పులు పెరిగిపోయిన పరిస్థితుల్లో విభజిత ఆంధ్రప్రదేశ్‌ ఎదుర్కొంటున్న ఆర్థిక అవస్థలు, వనరుల పంపకంలో ఏర్పడిన నష్టం, లోటు భర్తీలో కేంద్ర ప్రభుత్వ తాత్సారం గురించి పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. సంబంధిత గణాంకాలను గుర్తుంచుకోవాలి.


రాష్ట్ర ప్రభుత్వానికి సొంత పన్నుల ఆదాయం, పన్నేతర ఆదాయం, కేంద్రం నుంచి పన్నుల వాటా, గ్రాంట్లు ప్రధాన ఆదాయ వనరులు. విభజన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ వనరులపై తీవ్ర ప్రభావం పడింది. ఆదాయ వనరుల పరంగా ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లకు కారణం రాబడి, వ్యయాల్లో తీవ్రమైన వ్యత్యాసాలే. అలాగే ఆస్తులు, అప్పుల పంపకం కోసం తీసుకున్న హేతుబద్ధత లేని నిర్ణయాలు కూడా కారణంగా పేర్కొనవచ్చు. ఆస్తులను భౌగోళిక ప్రదేశం ఆధారంగా, అప్పులను జనాభా నిష్పత్తిలో పంచారు. అన్నిరకాల ముఖ్యమైన ఆస్తులు హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో ఉండటంతో ఆంధ్రప్రదేశ్‌ అన్ని ప్రధాన ఆస్తులను కోల్పోయింది. ఇది నవ్యాంధ్ర ఆర్థిక వనరులపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది.


 నవ్యాంధ్రప్రదేశ్‌ సొంత ఆదాయం, కేంద్ర పన్నుల వాటా; గ్రాంట్లు, మార్కెట్‌ నుంచి రుణాలు సహా మొత్తం రెవెన్యూ వసూళ్లు సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పటి కంటే 50 శాతం పైగా తగ్గిపోయాయి. అయితే జనాభా నిష్పత్తి ఆధారంగా అప్పులు, జీతాలు, రాయితీలు కేటాయించడంతో సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పటి కంటే 60 శాతానికి మించి వ్యయం పెరిగింది. దీంతో అసాధారణమైన రెవెన్యూ లోటు, ఆర్థిక లోటు ఏర్పడ్డాయి.


రాబడిలోనూ తెలంగాణ కంటే ఏపీ చాలా వెనుకబడి ఉంది. ఈ విషయాన్ని 14వ ఆర్థిక సంఘం ధ్రువీకరించింది. మొత్తం పన్ను వసూళ్లలో వ్యాట్‌ (జీఎస్టీ అమలుకు ముందు) వాటా, పన్నేతర ఆదాయం కూడా తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్‌కు చాలా తక్కువగా ఉంది. కేవలం 47% రాష్ట్ర ఆదాయంతో విభజన ఆంధ్రప్రదేశ్‌ ఉమ్మడి రాష్ట్ర జనాభా (58.32%) అవసరాలను 2014-15 విభజన సంవత్సరంలో తీర్చాల్సి వచ్చింది. జీతాలు, పింఛన్లకే రాష్ట్ర రాబడిలో 73 శాతం ఖర్చు చేయాల్సి రావడంతో ఉమ్మడి రాష్ట్రంలోని 58 శాతం ఖర్చుతో పోలిస్తే ఇది చాలా అధికం. దీంతో అభివృద్ధి కార్యక్రమాలపై వ్యయానికి అవకాశం లేకుండా పోయింది.

చట్టంలో ఏముంది?: ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టం-2014లోని సెక్షన్‌-46లో ఆదాయం, పంపిణీ గురించి పేర్కొన్నారు. నవ్యాంధ్రప్రదేశ్‌ ఎదుర్కొనే ఆర్థిక లోటును పూడ్చడానికి కేంద్ర ప్రభుత్వం తగిన నిధులు కేటాయించి ఆర్థిక వెసులుబాటు చర్యలు తీసుకోవాలని ఇదే చట్టంలోని సెక్షన్‌-46(2)లో పేర్కొన్నారు. ఏపీ విభజన బిల్లుపై చర్చ సందర్భంగా అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ 2014, ఫిబ్రవరి 20న రాజ్యసభలో ఇదే హామీ ఇచ్చారు. నవ్యాంధ్రలో తొలి ఏడాది (అపాయింటెడ్‌ డే నుంచి 14వ ఆర్థిÄక సంఘం సిఫార్సులు ఆమోదం పొందే రోజు వరకు) తలెత్తే ఆర్థిక లోటును కేంద్రం 2014-15 బడ్జెట్‌లో భర్తీ చేస్తుందని హామీ ఇచ్చారు.

ఆర్థికలోటుపై జాయింట్‌ కమిటీ: రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలు ఎదుర్కొనే ఆర్థిÄక సంక్షోభం గురించి అప్పటి రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ రాష్ట్రపతి పాలన సమయంలోనే 2015, మార్చి 20న కేంద్ర ఆర్థిక మంత్రికి లేఖ రాశారు. విభజిత ఆంధ్రప్రదేశ్‌ 2014, జూన్‌ 2 నుంచి 2014, మార్చి 31 వరకు ఎదుర్కొనే ఆర్థిక లోటు అంచనాకు, కేంద్ర బడ్జెట్‌ 2014-15లో ఈ లోటు భర్తీకి నిధులు కేటాయించే విధంగా తగిన సూచనలు ఇచ్చేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి, హోంమంత్రి, ప్రణాళిక సంఘం ఉన్నతాధికారులు, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ అధికారులతో ఒక జాయింట్‌ కమిటీని నియమించాలని ఆ లేఖలో గవర్నర్‌ కోరారు. అపాయింటెడ్‌ డే 2014, జూన్‌ 2 నుంచి విభజిత ఆంధ్రప్రదేశ్‌ 2014-15 ఆర్థిక సంవత్సరం పది నెలల్లో రూ.15,691 కోట్ల లోటులో ఉంటుందని పేర్కొన్నారు.

గవర్నర్‌ అభ్యర్థనకు స్పందించిన కేంద్ర హోంశాఖ ఒక జాయింట్‌ కమిటీని అప్పటి ప్రణాళికా శాఖ, ఆర్థిక శాఖ, హోంశాఖ ప్రతినిధులతో నియమించింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో విభజిత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఎదుర్కొనే ఆర్థిక లోటును లెక్కించాలని ఈ కమిటీకి సూచించింది. అయితే ఆ కమిటీలో ఏపీ ప్రతినిధులను భాగస్వాములను చేయలేదు. వనరులకు సంబంధించిన సమాచారమంతా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అపాయింటెడ్‌ డే, ఎన్నికలకు ముందే 2014 ఏప్రిల్, మేలో జాయింట్‌ కమిటీకి అందించింది. నవ్యాంధ్ర రెవెన్యూ లోటును భర్తీ చేసేందుకు కేంద్ర బడ్జెట్‌ 2015లో రూ.15,691 కోట్లు కేటాయించాలని అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. అయితే విభజన చట్టంలోని సెక్షన్‌-46(2)లో పేర్కొన్నట్లుగా ఆర్థిక లోటు భర్తీకి 2014-15 కేంద్ర బడ్జెట్‌లో ఎలాంటి ప్రతిపాదన చేయలేదు. దీంతో వనరుల కొరతను అధిగమించడానికి సొంత ప్రభుత్వ ఖాతాలపై ఆధారపడటం, బహిరంగ మార్కెట్‌లో అప్పులు తేవడం మినహా ఆంధ్రప్రదేశ్‌కు మరో మార్గం లేకుండాపోయింది.

నవ్యాంధ్ర ఆర్థిక ఖాతాలపై కాగ్‌ నివేదిక: కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (CAG) విభజిత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక ఖాతాలను తనిఖీ చేసి, లోటు భర్తీకి 2014-15లో కేంద్ర ప్రభుత్వ తాత్కాలిక నిధి (అడ్‌హాక్‌ గ్రాంటు)గా రూ.2,303 కోట్లు విడుదల చేసింది. ఆ తర్వాత 2014, జూన్‌ 2 నుంచి 2015 మార్చి 31 వరకు ఇంకా రూ.13,775.76 కోట్ల రెవెన్యూ లోటు ఉందని నిర్ధారించింది. అంటే రాష్ట్ర విభజన వల్ల పది నెలల కాలానికి ఆంధ్రప్రదేశ్‌ మొత్తం రూ.16,078.76 కోట్ల లోటులో ఉందని నిర్ధారించింది. ఈ మొత్తం రాష్ట్ర విభజనకు ముందు రాష్ట్రపతి పాలన సమయంలో అప్పటి గవర్నర్‌ రాసిన లేఖలో పేర్కొన్న లోటు అంచనా రూ.15,691 కోట్లకు ఇంచుమించు సమానంగా ఉంది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో అంత తీవ్రమైన ఆర్థిక లోటు ఉండటంతో కొత్త రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలపై ప్రతికూల ప్రభావం పడింది.

కేంద్రం నుంచి లభించిన మద్దతు: ఆర్థిక లోటు భర్తీకి గ్రాంటు కింద 2014-15లో కేంద్ర ప్రభుత్వం రూ.2,303 కోట్లు, 2015-16లో రూ.500 కోట్లు, 2016-17లో రూ.1176.50 కోట్లు విడుదల చేసింది. ఈ మొత్తం కలిపినా రూ.3979.50 కోట్లు మాత్రమే. 2016, సెప్టెంబరు 8న కేంద్ర ఆర్థిక మంత్రి మాట్లాడుతూ ఏపీ విభజన చట్టం ప్రకారం, 2014-15 ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక లోటు భర్తీ చేస్తామన్న హామీని ఆ ఏడాదిలో జరిగిన నిర్దిష్ట ఖర్చుల ప్రాతిపదికన నెరవేరుస్తామన్నారు. పింఛన్‌ పథకాలు తదితరాలను తాత్కాలికంగా అంచనా  వేసి ఆర్థిక లోటును లెక్కించడం వల్ల వాటిని మరింత దిద్దుబాటు చేయాల్సి ఉందన్నారు. ఇప్పటికే ఆర్థిక లోటు కింద రూ.3979.50 కోట్లు అందించినట్లు, మిగిలింది వార్షిక వాయిదాల్లో చెల్లించనున్నట్లు పేర్కొన్నారు.

2017, మే 4న కేంద్ర ఆర్థికమంత్రి కొత్త పథకాలైన రుణ ఉపశమనం (రూ.7,069.67 కోట్లు), వృద్ధాప్య పింఛన్లు (రూ.3,391.20 కోట్లు), విద్యుత్తు పంపిణీ సంస్థలైన డిస్కంలకు ఆర్థిక పునరుద్ధరణ ప్యాకేజీ (రూ.1500 కోట్లు) కింద చేసిన మొత్తం వ్యయం రూ.11,960.87 కోట్లను మొత్తం ఆర్థిక లోటు అయిన రూ.16,078.76 కోట్ల నుంచి మినహాయించడంతో మిగిలిన ఆర్థిక లోటు రూ.4,117.89 కోట్లలో 2014-15, 2015-16, 2016-17ల్లో కేంద్రం విడుదల చేసిన మొత్తం రూ.3,979.50 కోట్లు మినహాయిస్తే నవ్యాంధ్రప్రదేశ్‌కు ఇంకా కేవలం రూ.138.39 కోట్లు మాత్రమే ఆర్థిక లోటు కింద విడుదల చేయాల్సి ఉందని తెలిపారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారమే కొత్త పథకాలపై ఖర్చు చేశామని, వాటిని లోటు భర్తీ కింద పరిగణించకూడదని నాటి నవ్యాంధ్ర ముఖ్యమంత్రి 2017, సెప్టెంబరు 25న కేంద్ర ఆర్థికమంత్రికి లేఖ రాశారు. ఆ తర్వాత 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆర్థిక లోటు సహాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ కేంద్రం జాప్యం చేస్తూ వచ్చింది.

తొమ్మిదేళ్ల తర్వాత: రాష్ట్ర విభజన జరిగి దాదాపు 9 సంవత్సరాల తర్వాత నవ్యాంధ్రకు రావాల్సిన 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వనరుల అంతరం పూడ్చడానికి కేంద్ర ఆర్థిక శాఖ 2023, మే 19న ప్రత్యేక సాధారణ ఆర్థిక సాయం కింద రూ.10,460.87 కోట్లను మంజూరు చేసింది. దీంతో 2014-15 ఆర్థిక సంవత్సరానికి కాగ్‌ లెక్కించిన మొత్తం ఆర్థిక లోటు రూ.16,078.76 కోట్లలో గతంలో ఇచ్చిన రూ.3979.50 కోట్లు, 2013 మే నెలలో మంజూరు చేసిన రూ.10,460.87 కోట్లతో కలిపి మొత్తం రూ.14,440.37 కోట్లను కేంద్రం నుంచి నవ్యాంధ్రకు వనరుల అంతరం పూడ్చేందుకు సహాయంగా అందింది.

ఇక్కడ లోటు, అక్కడ మిగులు:  14వ ఆర్థిక సంఘం కాలవ్యవధి ముగిసేసరికి అంటే 2019-20 చివరి నాటికి ప్రత్యేక హోదా రాష్ట్రాలతో పాటుగా ఆర్థిక లోటు ఉండే రాష్ట్రం విభజిత ఏపీ మాత్రమేనని 14వ ఆర్థిక సంఘం నివేదిక స్పష్టంగా పేర్కొంది. అంతేకాకుండా కేంద్ర పన్నుల్లో వాటా (డివాల్యూషన్‌) తీసివేస్తే విభజిత ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక లోటు రూ.31,646 కోట్ల నుంచి 2019-20 నాటికి రూ.47,240 కోట్లకు పెరుగుతుందని అంచనా వేసింది. కేంద్ర పన్నుల్లో వాటా లెక్కలోకి తీసుకుంటే ఏపీ రెవెన్యూ లోటు (2015-16 నుంచి 2019-20 వరకు) రూ.22,112 కోట్లు ఉండవచ్చని అంచనా. అయితే తెలంగాణ మాత్రం ఇందుకు విరుద్ధంగా డివాల్యూషన్‌ ముందున్న రాబడి మిగులు 2015-16లో రూ.818 కోట్ల నుంచి 2019-20 నాటికి రూ.8,900 కోట్లకు పెరిగింది. డివాల్యూషన్‌ తర్వాత తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ మిగులు 2015-16 నుంచి 2019-20 నాటికి రూ.1,18,678 కోట్లకు చేరే అవకాశం ఉందని అంచనా వేసింది. దీనిని బట్టి విభజన ప్రభావం విభజిత ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక వనరులపై ఎంత ప్రతికూల ప్రభావం చూపుతుందో అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకు నవ్యాంధ్రప్రదేశ్‌ రెవెన్యూ లోటు 2021-22 (ఖాతాలు)లో రూ.8,160 కోట్లు, 2022-23 (సవరించిన అంచనాలు)లో రూ.29,107 కోట్లు, 2023-24 (బడ్జెట్‌ అంచనాలు)లో రూ.22,316 కోట్లుగా ఉండగా; తెలంగాణలో 2022-23 (సవరించిన అంచనాలు)లో రూ.2,979.93 కోట్లు రెవెన్యూ మిగులులో ఉంది. అదేవిధంగా 2013-24 (బడ్జెట్‌ అంచనాలు)లో రూ.4,881.74 కోట్లు మిగులుతో ఉంది.

రచయిత: వి.కరుణ


 

Posted Date : 22-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌