• facebook
  • whatsapp
  • telegram

 వాణిజ్యం, వ్యవస్థాపనలపై విభజన ప్రభావం

అశాస్త్రీయ పంపకాలతో అంతులేని అన్యాయం! 
 


 

అశాస్త్రీయ పంపకాల వల్ల అవశేషాంధ్రప్రదేశ్‌కు అన్ని విధాలుగా నష్టాలు, కష్టాలే మిగిలాయి. ఆస్తులను ప్రాంతాల ప్రాతిపదికన, అప్పులను జనాభా ఆధారంగా పంచడంతో భరించలేని భారం పడింది. పారిశ్రామిక, సేవారంగాలన్నింటికీ హైదరాబాద్‌ కేంద్రం కావడంతో ఏపీకి వ్యవసాయమే దిక్కయింది. విత్తన ఉత్పత్తి సామర్థ్యం తగ్గిపోయి, ప్రకృతి వైపరీత్యాల బెడదతో సేద్యాన్ని పూర్తిగా నమ్ముకోలేని పరిస్థితులు నెలకొన్నాయి. పాడిపరిశ్రమ దెబ్బతింది. మౌలిక సదుపాయాలు లేవు. ప్రభుత్వ, ప్రైవేటు ప్రధానా కార్యాలయాలన్నీ తెలంగాణలోనే ఉండిపోయాయి. పన్ను ఆదాయం పడిపోయింది. ఐటీరంగ రాబడి నామమాత్రమైపోయింది. విద్యుత్తు కొరత పెరిగిపోయింది. ఆస్తులు తక్కువై, అప్పులు ఎక్కువై ఆర్థిక వనరుల సమతూకం గతితప్పి అభివృద్ధి కుంటుపడిపోయింది. విభజనతో తలెత్తిన ప్రతికూలతలు, వాటి ఫలితాలతోపాటు కొత్త రాష్ట్రంలో వాణిజ్యం, వ్యవస్థాపనలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అభ్యర్థులు సమగ్రంగా తెలుసుకోవాలి. 


ఉమ్మడి రాష్ట్రంలో 58 శాతం జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు 46 శాతం ఆదాయాన్ని కేటాయించే విధంగా విభజన జరిగింది. 14వ ఆర్థిక సంఘం ఈ విషయాన్ని నిర్ధారించింది. ఆస్తులను అవి ఉన్న ప్రాంతం ప్రాతిపదికన, అప్పుల చెల్లింపు బాధ్యతను జనాభా ప్రాతిపదికన పంపిణీ చేశారు. విలువైన ఆస్తులన్నీ హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్నాయి. విద్యుత్తు కేటాయింపులను వినియోగం ప్రాతిపదికగా చేశారు. తిరిగి చెల్లించాల్సిన పన్నుల భారం (ట్యాక్స్‌ రిఫండ్‌) జనాభా ప్రాతిపదికన 58.32 శాతం (ఆంధ్రప్రదేశ్‌), 41.68 శాతం (తెలంగాణ) లెక్కన కేటాయించారు. అదేవిధంగా వసూలు కావాల్సిన పన్ను వసూళ్లకు భౌగోళిక ప్రాంతాన్ని ప్రాతిపదిక చేశారు. ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌కు రూ.3,800 కోట్లు నష్టం వాటిల్లింది. మొత్తం రూ.1.3 లక్షల కోట్ల భారీ అప్పుల భారాన్ని ఏపీ ఖాతాకు బదలాయించారు. దీనికితోడు ఉమ్మడి రాష్ట్ర అవిభాజ్య అప్పు రూ.24 వేల కోట్లు ఆంధ్రప్రదేశ్‌ ఖాతా పుస్తకాల్లో అవశేష ఆంధ్రప్రదేశ్‌పై తీరని భారంగా మోపారు. ఇది ఆంధ్రప్రదేశ్‌ వనరుల సమీకరణ పరిమితి (FRBM) పై తీవ్ర ప్రభావం చూపింది. ఇలాంటి ముందుచూపు లేని, అశాస్త్రీయంగా, అన్యాయంగా చేసిన రాష్ట్ర విభజన అవశేష ఆంధ్రప్రదేశ్‌లో వాణిజ్యం, వ్యవస్థాపనలకు ప్రతికూలంగా మారింది.


ఉమ్మడి సంస్థల విభజన సరైన పద్ధతిలో జరగకపోవడంతో రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ అభివృద్ధి, క్రియాశీలతల పరంగా అసమతౌల్యాన్ని స్పష్టించి, ఇతర కీలక రంగాలపై వ్యతిరేక ప్రభావాన్ని చూపింది. వాణిజ్యం, వ్యవస్థాపనలకు ప్రధాన ఆధారాలైన వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాలను రాష్ట్ర విభజన కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. ఉదాహరణకు దక్షిణ భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో  రంగాల వారీగా రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (GSDP) ని పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ రంగానికి ఎక్కువ వాటా, సేవా రంగంలో తక్కువ వాటా ఉంది. అవశేష ఆంధ్రప్రదేశ్‌లో పట్టణీకరణ తక్కువగా ఉండటం, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తరహా మెట్రోపాలిటన్‌ నగరాలు లేకపోవడంతో GSDPలో సేవలు, పారిశ్రామిక రంగాల వాటా తక్కువగా ఉంది. ఇది ఆర్థిక వెనుకబాటుతనానికి నిదర్శనమే కాకుండా భవిష్యత్తు పురోగతికి, వాణిజ్యం, వ్యవస్థాపనలకు అవరోధం.

వ్యవసాయ రంగం: రాష్ట్ర విభజన వ్యవసాయ రంగంపైనా ప్రతికూల ప్రభావాన్ని చూపింది. నవ్యాంధ్రలో దాదాపు 60 శాతం మందికి వ్యవసాయమే ప్రధానాధారం. పునర్‌వ్యవస్థీకరణ ఫలితంగా వ్యవసాయ పరిశోధన, అభివృద్ధి, వ్యవసాయ శాస్త్రవేత్తలకు శిక్షణ లాంటివి నవ్యాంధ్రకు దూరమయ్యాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ఏకైక వ్యవసాయ విశ్వవిద్యాలయం హైదరాబాద్‌లో ఉండటంతో అది తెలంగాణ అంతర్భాగమైపోయింది. దీనికితోడు DNA ఫింగర్‌ప్రింటింగ్, టిష్యూ కల్చర్, ఆయిల్‌ అనాలసిస్‌ లేబొరేటరీలు, ట్రాన్స్‌జెనిక్‌ క్రాప్స్‌ మానిటరింగ్‌ లేబొరేటరీ, బయో పెస్టిసైడ్స్‌ క్యాలిటీ కంట్రోల్‌ లేబొరేటరీ, పెస్టిసైడ్‌ రెసిడ్యూ టెస్టింగ్‌ లేబొరేటరీ లాôటి సంస్థలన్నీ హైదరాబాదులోనే ఉన్నాయి. వ్యవసాయ శిఖరాగ్ర శిక్షణ సంస్థ అయిన సమేటి (SAMETI) కూడా అక్కడే ఉంది. నవ్యాంధ్రలో ఈ సంస్థలు తిరిగి ఏర్పాటు చేయడానికి ఆర్థిక, మానవ వనరుల సమస్య ఏర్పడింది.


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ జిల్లాలు ధాన్యం విత్తన ఉత్పత్తిలో గణనీయంగా ప్రగతి సాధించాయి. ఆంధ్రప్రదేశ్‌లోని 309 యూనిట్లతో పోలిస్తే తెలంగాణలో 969 ప్రైవేటు విత్తన ప్రాసెసింగ్‌ యూనిట్లు ఉన్నాయి. విభజనతో అవశేష ఆంధ్రప్రదేశ్‌కు సరిపడా విత్తన ఉత్పత్తి, ప్రాసెసింగ్‌ సామర్థ్యాలు లేకుండా పోయాయి. అవశేష ఆంధ్రప్రదేశ్‌ ఉనికి, స్థల స్వభావం రీత్యా వరదలు, తుపానులతోపాటు కరవు పీడిత ప్రాంతం. 2008-09 నుంచి 2013-14 వరకు ఆరేళ్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రకృతి వైపరీత్యాల వల్ల దెబ్బతిన్న వ్యవసాయ భూమి 20.18 లక్షల హెక్టార్లు. అందులో సీమాంధ్ర 13 జిల్లాల్లోనే 15.16 లక్షలు హెక్టార్లు అంటే 75 శాతం కంటే ఎక్కువ. విభజన వల్ల ఏర్పడిన ఇలాంటి ప్రతికూల అంశాలు అవశేష ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ రంగానికి సంబంధించి వాణిజ్యం, వ్యవస్థాపనలను నీరుగారుస్తున్నాయి.

పాడి పరిశ్రమ: ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం పాడి ఉత్పత్తుల విక్రయాల కోసం విజయ మార్కెటింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేసింది. విజయ బ్రాండ్‌ మార్కెట్‌ను దేశవ్యాప్తంగా విస్తరించింది. అయితే ఉమ్మడి రాష్ట్రంలో ఈ మార్కెట్‌ ఎక్కువగా హైదరాబాద్‌కే పరిమితమైంది. గోదావరి జిల్లాలు, కడప, చిత్తూరు లాంటి ప్రాంతాల్లో పాల ఉత్పత్తి సంఘాలను పునరుద్ధరించడానికి ఎలాంటి చర్యలు చేపట్టలేదు. దీంతో రాష్ట్ర విభజనానంతరం అవశేష ఆంధ్రలో పాడి పరిశ్రమ దెబ్బతింది. హైదరాబాదులోని పాల ఉత్పత్తుల ఫ్యాక్టరీ తెలంగాణకు సంక్రమించింది. నవ్యాంధ్రలో పాడి పశువుల దాణా ఫ్యాక్టరీ కూడా లేకుండా పోయింది. జాతీయ యానిమల్‌ బయోటెక్నాలజీ సంస్థ (SIAB), కేంద్ర మెట్ట భూమి వ్యవసాయ సంస్థ(CRIDA), సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మైక్రోబయాలజీ(CCMB), భారత ఇమ్యునోలాజికల్‌ లిమిటెడ్‌ (IIL),పశుధారణ పరిశోధన కేంద్రం, కోళ్ల పరిశ్రమకు చెందిన AICRP, కోళ్ల పరిశ్రమకు సంబంధించిన ప్రాజెక్టు డైరెక్టరేట్‌ లాంటివన్నీ తెలంగాణ రాష్ట్రానికి సంక్రమించాయి. అవశేష ఆంధ్రప్రదేశ్‌లో అలాంటి జాతీయ సంస్థలేవీ లేవు.

పారిశ్రామిక రంగం: ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాలు పారిశ్రామికీకరణకు అనేక చర్యలు తీసుకున్నాయి. పరిశ్రమల స్థాపన, అభివృద్ధికి వీలుగా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు 11 పారిశ్రామిక ప్రాంతాలను ఏర్పాటు చేశాయి. అందులో 6 ప్రాంతాలు తెలంగాణలోనే ఉన్నాయి. 1952 నుంచి 1980 వరకు ఏర్పాటైన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో 85 శాతం హైదరాబాదు, పరిసర ప్రాంతాల్లో ఏర్పాటయ్యాయి. 1992 నుంచి ఇన్ఫర్మేమేషన్‌ టెక్నాలజీ (IT), ఎలక్ట్రానిక్స్, బయోటెక్నాలజీ, BPO మొదలైన పరిశ్రమలు 95 శాతం వరకు హైదరాబాదు పరిసరాల్లోనే కేంద్రీకృతమయ్యాయి. ఇంజినీరింగ్, ఔషధ, వస్త్ర, తోళ్ల పరిశ్రమలతోపాటు సినీ పరిశ్రమ కూడా హైదరాబాదు, రంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లోనే వ్యాపించి ఉన్నాయి. బహుళజాతి సంస్థలతో పాటు ప్రధాన ప్రైవేటు, ప్రభుత్వ రంగ సంస్థలు తమ ప్రధాన కార్యాలయాలను హైదరాబాదులోనే ఏర్పాటు చేసుకున్నాయి.


కేంద్ర ప్రభుత్వం 2005 నుంచి ఉమ్మడి రాష్ట్రానికి మంజూరు చేసిన 182 ప్రత్యేక ఆర్థిక మండళ్ల SEZ లో తెలంగాణ ప్రాంతంలోనే 150 ఉన్నాయి. 1956 నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం స్థాపించిన రాష్ట్ర స్థాయి ప్రభుత్వరంగ సంస్థలు, విభజన చట్టంలోని 9, 10వ షెడ్యూళ్లలో పేర్కొన్న సుమారు 85 శాతం వరకు సంస్థలు తమ ప్రధాన కార్యాలయాలను హైదరాబాదులోనే స్థాపించాయి. సూక్ష్మ, కుటీర, చిన్నతరహా పరిశ్రమలు; మౌలిక సంస్థలన్నీ రాజధాని ప్రాంతంలోనే కేంద్రీకృతమై ఉన్నాయి. నవ్యాంధ్రలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల ప్రధాన కార్యాలయాలు కూడా చాలావరకు హైదరాబాదులోనే ఉన్నాయి. అవన్నీ వ్యాపార కార్యకలాపాలను హైదరాబాదు కేంద్రంగా నిర్వహిస్తూ అక్కడే పన్నులు చెల్లిస్తున్నాయి.


1990 నుంచి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం IT, బయోటెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, హార్డ్‌వేర్‌ పరిశ్రమల మౌలిక సదుపాయాలను సీమాంధ్రలోని 13 జిల్లాల్లో విస్తరించలేదు. ఎలాంటి ప్రోత్సాహకాలనూ ప్రకటించలేదు. ఫలితంగా 13 జిల్లాల్లో సేవారంగ పరిశ్రమల స్థాపన జరగలేదు. ఉమ్మడి రాష్ట్రంలో నవ్యాంధ్ర 13 జిల్లాల్లో సరైన పారిశ్రామిక మౌలిక సదుపాయాలను కల్పించకపోవడం, రాజధాని లేకపోవడం వల్ల ప్రైవేటు పెట్టుబడిదారులు, విదేశీ వ్యాపారులు రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అనుకున్న స్థాయిలో ముందుకురావడం లేదు. నవ్యాంధ్రలో పరిశ్రమల స్థాపనకు ఉన్న ప్రతికూల పరిస్థితులు, వాతావరణం కూడా పరిశ్రమల అవస్థాపనపై ప్రభావం చూపుతున్నాయి.

సేవా రంగం:  మైక్రోసాఫ్ట్, ఒరాకిల్, డెల్, డెలాయిట్, హెచ్‌ఎస్‌బీసీ, బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా, సీఎంసీ, టీసీఎస్, ఇన్ఫోసిస్‌ మొదలైన బహుళజాతి కంపెనీలు తమ శాఖలను హైదరాబాద్‌ కేంద్రంగానే స్థాపించాయి. ఇవేవీ నవ్యాంధ్రలో శాఖలను ఏర్పాటు చేయలేదు. ఫలితంగా అవశేష ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామికంగా, ఐటీ రంగంలో పూర్తిగా వెనుకబడింది. ఐటీ రంగం నుంచి నవ్యాంధ్ర ఆర్థిక వ్యవస్థకు రాబడి నామమాత్రంగా మారింది.


రెవెన్యూ లోటుతోనే ప్రారంభమైన అవశేష ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన మౌలిక సదుపాయాలైన అంతర్జాతీయ విమానయాన కేంద్రాల ఏర్పాటు, ఓడరేవుల అభివృద్ధి, కారిడార్ల ఏర్పాటు, జాతీయ - అంతర్జాతీయ కళాశాలల స్థాపన, విద్యుత్తు ఉత్పత్తి, రహదారులు, కొత్త రాజధాని నిర్మాణం మొదలైనవి ఏర్పాటు చేయడం సవాలుగా మారింది.

విద్యుత్తు రంగం:  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను విభజించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలుగా వేర్వేరు రాష్ట్రాలుగా చేయడం ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్తు రంగాన్ని కుంగదీసింది. 2014, మే 8 నాటి జీవో 20ను పరిగణనలోకి తీసుకుని ఏపీ జెన్‌కో స్టేషన్‌ల నుంచి ఉత్పత్తయ్యే విద్యుత్తు కేటాయింపులు జరగడం వల్ల ఏపీ జెన్‌కో స్టేషన్‌ల మొత్తం ఉత్పాదక సామర్థ్యంలో కేవలం 46.11% మాత్రమే నవ్యాంధ్రప్రదేశ్‌ వాటాగా నిర్ణయించారు. ఇందుకోసం 2006-07 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్తు వినియోగానికి సంబంధించిన వివరాలను ప్రాతిపదికగా తీసుకున్నారు.  ఉత్పత్తి కేంద్రాలపై యాజమాన్యపు హక్కులు, వాటిని ఏర్పాటు చేసిన భౌగోళిక ప్రాంతం ఆధారంగా సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలకే దఖలు పరిచినప్పటికీ, విద్యుత్తును కేటాయించడంలో భౌగోళిక ఉనికిని పరిగణనలోకి తీసుకోలేదు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్‌ 1,142 మెగావాట్ల ఉత్పాదక సామర్థ్యాన్ని కోల్పోయింది. ఫలితంగా ఏటా 8,700 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తు కొరత అవశేష ఆంధ్రప్రదేశ్‌ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ ఇబ్బందిని అధిగమించడానికి బహిరంగ మార్కెట్‌లో విద్యుత్తు కొనుగోలుకు రూ.వేల కోట్లు వెచ్చించాల్సి వస్తోంది.

రచయిత: వి.కరుణ

Posted Date : 15-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌