• facebook
  • whatsapp
  • telegram

ఆహార భద్రత

‘ఆరోగ్యదాయక జీవితాన్ని పొందేందుకు అవసరమైన, తగినంత, సురక్షితమైన పౌష్టికాహారాన్ని ప్రజలందరికీ అన్ని కాలాల్లో ఆర్థికంగా, భౌతికంగా అందుబాటులో ఉంచడమే ఆహార భద్రత’ అని ఆహార, వ్యవసాయ సంస్థ ్బనీతివ్శీ నిర్వచించింది. ఈ నిర్వచనాన్ని అనుసరించి ఆహార భద్రతలోని అంశాలు: 

i)  ఆహార లభ్యత అంటే దేశీయంగా ఆహార ఉత్పత్తి, ఆహార దిగుబడులు, ప్రభుత్వ ధాన్యాగారాల్లోని ఆహార నిల్వలు (Availability).. 

ii)  ప్రతి ఒక్కరికీ ఆహారం అందుబాటులో ఉండాలి (Accessbility).

iii) ప్రతి వ్యక్తి తన ఆహార అవసరాలను తీర్చుకునేలా తగినంత, సురక్షితమైన, పౌష్టికత ఉన్న ఆహారాన్ని కొనుగోలు చేసేందుకు అవసరమైన నగదును కలిగి ఉండాలి (Affordability).

ఆహార భద్రత ఎందుకు?

ఆహార భద్రత లేకుంటే ఆకలి చావులు సంభవించే ప్రమాదం ఉంది. ప్రజల రోగ నిరోధకశక్తి క్షీణించి వ్యాధులు సంక్రమిస్తాయి. 1943లో బెంగాల్‌లో సంభవించిన క్షామం (తీవ్ర ఆహార కొరత) కారణంగా సుమారు 30 లక్షల మంది మరణించారు. నేటికీ దేశంలో కొన్ని ప్రాంతాల్లో ఆకలి చావులు సంభవిస్తున్నాయి. ఉదాహరణ: ఒడిశాలోని కలహండి, కాశీపుర్‌ జిల్లాలు, రాజస్థాన్‌లోని బరాన్‌ జిల్లా, ఝార్ఖండ్‌లోని పలమావు జిల్లా. 

* ఆహార భద్రత లోపిస్తే ఆకలి ఏర్పడుతుంది. ఆకలి అనేది పేదరికానికి సూచిక మాత్రమే కాదు, పేదరికాన్నీ తెస్తుంది. ఆకలి రెండు రకాలు. i) తీవ్ర ఆకలి  ii) రుతు సంబంధ ఆకలి.

* మనదేశంలో పేదవారి వద్ద తగినంత ఆదాయం లేక, ఆహార పదార్థాలు కొనుగోలు చేయలేక తీవ్ర ఆకలితో బాధపడుతున్నారు.

* గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయంపై ఆధారపడినవారికి, పట్టణ ప్రాంతాల్లో నిర్మాణ రంగ కార్మికులకు ఏడాదిలో కొన్ని రోజులు పని ఉండదు. అప్పుడు వారు రుతు సంబంధ ఆకలికి గురవుతారు.

ఆహార అభద్రతకు లోనయ్యేవారు

*  గ్రామీణ ప్రాంతాల్లో భూమిలేని పేదలు, చిన్న, ఉపాంత రైతులు, సంప్రదాయ చేతివృత్తుల వారు.

* పట్టణాల్లో రోజువారి శ్రామిక మార్కెట్‌లో పనిచేసే వారు.

* ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలోని కొన్ని వర్గాల వారు తగినంత భూమి లేక అల్ప ఉత్పాదకతతో ఆహార అభద్రతకు లోనవుతుంటారు.

* ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు పనికోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే బాధిత ప్రజలు.

* బాలింతలు, గర్భిణులు, అయిదేళ్లలోపు చిన్నారులు. 

* ఆర్థికంగా వెనకబడిన రాష్ట్రాలు, పేదరిక రేటు  అధికంగా ఉన్న, గిరిజన ప్రాంతాలు అధికంగా ఉన్న రాష్ట్రాలు, ప్రకృతి వైపరీత్యాలకు లోనయ్యే ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్, ఒడిశా, పశ్చిమ్‌ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో ఆహార అభద్రతకు లోనయ్యే ప్రజలు ఎక్కువగా ఉన్నారు.

ప్రభుత్వాల కృషి

దేశంలో ప్రజలందరికీ ఆహార భద్రత కల్పించేందుకు ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపట్టాయి. ఇలా అమలు చేస్తున్న పేదరిక నిర్మూలన కార్యక్రమాల్లో కొన్ని పూర్తిగా ఆహార భద్రత కల్పించేందుకు ఉద్దేశించినవే. ఉదాహరణకు, ప్రజా పంపిణీ వ్యవస్థ(PDS n- Public Distribution System),  మధ్యాహ్న భోజన పథకం(MDM - Mid Day Meals)  సమగ్ర శిశు అభివృద్ధి పథకం(ICDS n- Integrated Child Development Scheme).. మరికొన్ని పథకాల ద్వారా పేద ప్రజల కొనుగోలు శక్తిని పెంచి, ఆహార భద్రతను కల్పించేందుకు కృషిచేస్తున్నాయి. ఉదాహరణకు, ఉపాధి పథకాలైన MGNREGA (Mahatma Gandhi National Rural Employment Guarantee Act), PMEGP (Prime Minister Employment Guarantee Programme). ప్రజా పంపిణీ వ్యవస్థ నిర్వహణకు జాతీయ ఆహార సంస్థ (FCI) ఆహార ధాన్యాలను రైతుల నుంచి కొనుగోలు చేసి నిల్వ చేస్తుంది. ఈ నిల్వలనే బఫర్‌ నిల్వలు (ప్రధానంగా వరి, గోధుమ) అంటారు. ఈ బఫర్‌ నిల్వలను ప్రభుత్వాలు కిందివిధంగా ఉపయోగిస్తాయి:

*  మార్కెట్‌లో ధరల స్థిరీకరణకు.  ఆహార ధాన్యాల ధరలు అధికంగా ఉన్నప్పుడు ప్రభుత్వాలు మార్కెట్‌లోకి తమ వద్ద ఉన్న ఆహార ధాన్యాలను ఓపెన్‌ మార్కెట్‌ సేల్‌ స్కీం (OMSS) ద్వారా సరఫరా చేస్తాయి. 

* మార్కెట్‌లో ఆహార ధాన్యాల ధరలు తక్కువగా ఉన్నప్పుడు FCI జోక్యం చేసుకుని కనీస మద్దతు ధరల వద్ద ఆహార ధాన్యాలు కొనుగోలు చేస్తుంది.

* ప్రతికూల వాతావరణ స్థితిగతులు/ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఆహార నిల్వలను వినియోగిస్తాయి.

* ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు తక్కువ ధరకు (మార్కెట్‌ ధర కంటే తక్కువ ధర = జారీ ధర) అందిస్తాయి.

ప్రజా పంపిణీ వ్యవస్థ  

ఆహార భద్రతను సాధించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న అతి ముఖ్యమైన కార్యక్రమం ప్రజా పంపిణీ వ్యవస్థ ( PDS ).  దీని పరిణామ క్రమం..

* 1943లో బెంగాల్‌లో క్షామం సంభవించిన అనంతరం రేషనింగ్‌ వ్యవస్థకు అంకురార్పణ జరిగింది.

* 1960ల్లో హరిత విప్లవానికి ముందు తీవ్రమైన ఆహార కొరత సంభవించినప్పుడు ఈ రేషనింగ్‌ వ్యవస్థను మరింత విస్తరించారు.

* 1970ల్లో NSSO నివేదికలో పేదరిక స్థాయులు అధికంగా ఉండటంతో మూడు ముఖ్యమైన ఆహార సంబంధ కార్యక్రమాలను ప్రవేశపెట్టారు. అవి: 1) ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS).  2) సమగ్ర శిశు అభివృద్ధి పథకం (ICDS -1975). 3) పనికి ఆహార పథకం (1977-78)

      ప్రారంభంలో ప్రజా పంపిణీ వ్యవస్థ సార్వత్రికంగా ఉండేది. పేదలు, పేదలు కానివారి మధ్య ఎలాంటి విచక్షణ ఉండేది కాదు. 1992 లో పరిచయం చేసిన Revamped PDS (RPDS) దేశవ్యాప్తంగా 1700 బ్లాకుల్లో అమలైంది. మారుమూల, వెనకబడిన ప్రాంతాలకు ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రయోజనాలను అందించడం దీని ప్రధాన ఉద్దేశం.

      దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోని పేదలను దృష్టిలో ఉంచుకుని 1997లో ‘లక్షిత ప్రజా పంపిణీ వ్యవస్థ’ TPDS ను ప్రారంభించారు. మొదటిసారిగా పేదలు, పేదలు కానివారికి వేర్వేరు ధరలను అమలు చేశారు. ఒక కుటుంబానికి 35 కిలోల ఆహార ధాన్యాలు అందించారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు (పేదలు) కిలో బియ్యం రూ.5.65, దారిద్య్రరేఖకు ఎగువన ఉన్న కుటుంబాలకు కిలో బియ్యం రూ.8.30 చొప్పున అందించారు. గోధుమలు, ముతక ధాన్యాల ధరల్లోనూ వ్యత్యాసాలు కనిపిస్తాయి.

*  2000లో ‘అంత్యోదయ అన్నయోజన’ (AAY)  ‘అన్నపూర్ణ పథకం’ అనే రెండు ప్రత్యేక కార్యక్రమాలు ప్రారంభించారు.

      దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాల్లోని అత్యంత నిరుపేదలే (Poorest of the Poor) లక్ష్యంగా 2000, డిసెంబరులో కేంద్రప్రభుత్వం అంత్యోదయ అన్నయోజన ్బతిత్త్శ్రి పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా కోటి నిరుపేద కుటుంబాలకు 25 కిలోల ఆహార ధాన్యాలను అధిక సబ్సిడీ ధరలకు (గోధుమలు కిలో రూ.2, బియ్యం కిలో రూ.3) అందించారు. 2002, ఏప్రిల్‌లో ఆహార ధాన్యాల పరిమాణాన్ని 25 కిలోల నుంచి 35 కిలోలకు పెంచారు. 2003 జూన్‌లో 50 లక్షల నిరుపేద కుటుంబాలు, 2004 ఆగస్టులో మరో 50 లక్షల కుటుంబాలను అదనంగా ఈ పథకంలో చేర్చడంతో ప్రస్తుతం దీనిద్వారా రెండు కోట్ల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. 

      నిరుపేద సీనియర్‌ సిటిజన్లకు (65 ఏళ్లు దాటినవారికి) 10 కిలోల ఆహార ధాన్యాలను ఉచితంగా అందించే ఉద్దేశంతో 2000  ఏప్రిల్‌లో అన్నపూర్ణ పథకాన్ని ప్రారంభించారు.ప్రజలు గౌరవప్రద జీవనాన్ని పొందేందుకు, చౌకధరల దుకాణాల ద్వారా తగినంత పౌష్టికాహారాన్ని అందించే లక్ష్యంతో 2013లో జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ పథకం 2013 జులై నుంచి అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం 75% గ్రామీణ ప్రజలు, 50% పట్టణ ప్రజానీకం ఆహార భద్రత పొందేందుకు అర్హత ఉన్న కుటుంబాలుగా వర్గీకరించారు. ఈ కుటుంబాలనే ‘ప్రాధాన్యతా కుటుంబాలు’ అంటారు. దేశ జనాభాలో 2/3వ వంతు ఆహార భద్రతా చట్టం పరిధిలోకి వస్తారు. రాష్ట్ర స్థాయి కవరేజ్‌ను 201112 నాటి NSSO హౌసింగ్‌ సెన్సస్‌ డేటా ఆధారంగా ప్రణాళికా సంఘం నిర్ణయించింది. ఈ డేటా మేరకు ఆంధ్రప్రదేశ్‌లో 60.96% గ్రామీణ కుటుంబాలు, 41.14% పట్టణ కుటుంబాలను ఎంపిక చేశారు.

       ఈ చట్టం కింద ఐసీడీఎస్‌ ద్వారా గర్భిణులు/బాలింతలకు, MDM ద్వారా 6 నుంచి 14 సంవత్సరాల వయసున్న పిల్లలకు భోజన సౌకర్యం కల్పిస్తున్నారు. గర్భిణులకు మాతృత్వ ప్రయోజనాల కింద రూ.6,000 అందిస్తారు.

    ఆహార భద్రత చట్టం ద్వారా లబ్ధిదారులను రెండు కేటగిరీలుగా వర్గీకరిస్తారు. అంత్యోదయ అన్నయోజన (ఏఏవై), ప్రాధాన్య కుటుంబాలు. ప్రాధాన్య కుటుంబాలకు చెందిన ప్రతి వ్యక్తికి నెలకు 5 కిలోల చొప్పున ఆహార ధాన్యాలు (ముతక ధాన్యాలు కిలో రూ.1, గోధుమలు కిలో రూ.2, బియ్యం కిలో రూ.3్శ పంపిణీ చేస్తారు. పేదల్లో అత్యంత పేదలకు ఏఏవై కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి నెలకు 35 కిలోల ఆహార ధాన్యాలు అందిస్తారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 80 కోట్ల మంది ఈ పథకం ద్వారా లబ్ధిపొందుతున్నారు. 

    ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఆహార ధాన్యాలను పంపిణీ చేసేందుకు దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో రేషన్‌ దుకాణాలు ఏర్పాటయ్యాయి. వీటినే చౌకధరల దుకాణాలు  అంటారు. వీటిలో ఆహార ధాన్యాలు, పంచదార, కిరోసిన్‌ మొదలైనవి నిల్వ చేస్తారు. ఈ సామగ్రిని మార్కెట్‌ ధరల కంటే తక్కువకు పేదలకు పంపిణీ చేస్తారు. రేషన్‌ కార్డు ఉన్న ఏ కుటుంబమైనా నిర్దిష్ట పరిమాణంలో ఈ వస్తువులను దగ్గరలోని రేషన్‌ దుకాణం నుంచి ప్రతి నెల కొనుగోలు చేయొచ్చు. ప్రస్తుతం మూడు రకాల రేషన్‌ కార్డులు అమల్లో ఉన్నాయి.

* నిరుపేదలకు ఇచ్చే అంత్యోదయ కార్డులు

* దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారికి అందించే బీపీఎల్‌ కార్డులు

*  మిగతా అందరికీ ఏపీఎల్‌ కార్డులు

ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రయోజనాలు

* ధరల స్థిరీకరణ సాధించడం.

* వినియోగదారులకు చౌకధరల వద్ద ఆహార ధాన్యాలు అందుబాటులో ఉంచడం.

* మిగులు ఉన్న రాష్ట్రాల నుంచి ఆహార ధాన్యాలు సేకరించి, కొరత ఉన్న రాష్ట్రాలకు సరఫరా చేయడం ద్వారా ఆకలి, క్షామాన్ని నివారించడం.

*  ప్రజా పంపిణీ వ్యవస్థ, కనీస మద్దతు ధరలతో ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరగడంతో పాటు అనేక ప్రాంతాల్లో రైతులకు ఆహార భద్రత కలుగుతుంది.

ప్రపంచ ఆకలి సూచిక - 2020 నివేదిక

ప్రపంచ ఆకలి సూచిక (Global Hunger Index - GHI)ను మూడు అంశాలు, నాలుగు సూచీల సహాయంతో రూపొందిస్తారు.

అంశాలు (3): 

1. సరిపడా ఆహార సరఫరా లేకపోవడం (1/3) (Inadequate food supply)

2. పిల్లల్లో అల్ప పోషకత్వం (1/3) (Child undernutrition)

3. పిల్లల్లో మరణాలు (1/3) (Child mortality)

సూచీలు 4:

1. పోషకాహార లోపం (Under Nutrition):

* సరిపడా ఆహార సరఫరా లేకపోవడం

* మొత్తం జనాభా, వయోజనులు, చిన్న పిల్లలు

* అంతర్జాతీయ ఆకలి సూచికలు, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను కలుపుకొని ఉపయోగిస్తారు.

2. అయిదేళ్లలోపు పిల్లల్లో ఎత్తుకు తగిన బరువు లేకపోవడం (1/6) (Child wasting) (తీవ్రమైన పోషకాహార లోపం)

3. అయిదేళ్లలోపు పిల్లలు వయసుకు తగిన ఎత్తు లేకపోవడం (1/6) (Child stunting) (దీర్ఘకాల పోషకాహార లోపం)

4. అయిదేళ్లలోపు పిల్లల్లో మరణాలు(Under Five Mortality Rate n- UFMR)(సరిపడా పోషకాహారం లేకపోవడం, అనారోగ్య పర్యావరణం)

ఆకలి(Hunger): సరిపడినంత కేలరీల ఆహారం లేకపోవడాన్ని ఆకలి అంటారు.(Lack of sufficient calories)

అల్ప పోషకత్వం(Undernutrition): కేలరీలు లభించినా, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాల లాంటి పోషకాలు లోపించడం.

పోషకాహార లోపం(Malnutrition): అల్ప పోషకత్వం, అధిక పోషకాలు, (అధిక పోషకాల వల్ల అధిక బరువు, ఆస్తమా, నాన్‌ - కమ్యునికబుల్‌ వ్యాధులు పెరుగుతాయి.) అసమతౌల్య ఆహారం ఉంటుంది.

* ప్రపంచ ఆకలి సూచీని వాషింగ్టన్‌లోని అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధన సంస్థ (International Food Policy Research Institute) ప్రతి సంవత్సరం విడుదల చేస్తుంది. జీహెచ్‌ఐ నివేదిక - 2020ను అక్టోబరు 16న ప్రకటించారు.

జీహెచ్‌ఐ - సుస్థిరాభివృద్ధి  లక్ష్యాల్లో ప్రాధాన్యం

*  యునైటెడ్‌ నేషన్స్‌ (యూఎన్‌) సహస్రాబ్ది లక్ష్యాలను(Millennium Development Goals (MDG) 2000 - 2015) ఎనిమిది అంశాల్లో సాధించాలని నిర్దేశించింది. వీటిలో ప్రధానమైంది, మొదటిది ‘తీవ్రమైన పేదరికం, ఆకలిని లేకుండా నిర్మూలించడం’(Eradicate Extreme Poverty and Hunger).

* యునైటెడ్‌ నేషన్స్‌ (యూఎన్‌) 17 సుస్థిరాభివృద్ధి(Sustainable Development Goals (SDG) -2015 - 2030) లక్ష్యాలను రూపొందించింది. వీటిలో రెండో లక్ష్యం ‘జీరో హంగర్‌’. అంటే ఆకలిని అంతమొందించడం (End Hunger) ఆహార భద్రతను సాధించడం (Achieve Food Security), పోషకత్వ అభివృద్ధి(Improved Nutrition), సుస్థిర వ్యవసాయాన్ని(Sustainable Agriculture)
ప్రోత్సహించడం.

* సుస్థిరాభివృద్ధి రెండో లక్ష్యమైన ‘జీరో హంగర్‌’ పురోగతిని ఎనిమిది అంశాల ఆధారంగా అంచనా వేస్తారు.

అవి:

1. అందరికీ సురక్షితమైన, పౌష్టికరమైన, సరిపడా ఆహారం పొందేలా నిర్ధారించడం.

2. పోషకాహార లోపాన్ని అధిగమించడం.

3. చిన్న కమతాదారులు ఆహార ఉత్పత్తిని, రెట్టింపు ఆదాయాన్ని పొందడం.

4. సుస్థిర, స్థితిస్థాపక ఆహార వ్యవస్థను అందించడం.

5. వ్యవసాయ జీవవైవిధ్యాన్ని నిర్వహించడం.

6. గ్రామీణ మౌలిక సదుపాయాలు, సేవలపై పెట్టుబడులు పెంచడం.

7. ప్రపంచ వ్యవసాయ వాణిజ్య వక్రీకరణలను నిరోధించడం

8. ఆహార వస్తువుల మార్కెట్‌ పనితీరును సరిగ్గా నిర్ధారించడం.

 

జీహెచ్‌ఐ 2020 నివేదిక - ప్రపంచవ్యాప్త ధోరణులు

ప్రపంచవ్యాప్తంగా 2019 నాటికి 8.9% ప్రపంచ జనాభా పోషకాహార లోపం (దీర్ఘకాలిక ఆకలి)తో బాధపడుతున్నారు. 2018 నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతోంది. అంటే 2019లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 690 మిలియన్ల జనాభా పోషకాహార లోపాన్ని ఎదుర్కొంటున్నారు. 2018తో పోలిస్తే 10 మిలియన్ల ప్రజలు పెరిగారు. అంటే దాదాపు 2014 నుంచి 60 మిలియన్ల ప్రజలు పెరిగారు.

*  ‘కొవిడ్‌ -19’ ప్రభావం వల్ల నికర ఆహార దిగుమతులు ఉన్న దేశాల్లో పోషకాహార లోపంతో బాధపడుతున్నవారు అదనంగా 80 మిలియన్లు పెరిగారు. చైల్డ్‌ స్టంటింగ్‌తో (అయిదేళ్లలోపు వయసు ఉన్న పిల్లల్లో వయసుకు తగ్గ ఎత్తులేకపోవడం - దీనికి కారణం దీర్ఘకాలిక పోషకాహార లోపం) అదనంగా 7 లక్షల మంది పిల్లలు బాధపడ్డారు.

* ‘మహమ్మారి’ ్బశ్చి-్ట’్ఝi‘్శ వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదురవడంతో చైల్డ్‌ వాస్టింగ్‌ (అయిదేళ్లలోపు పిల్లల్లో ఎత్తుకు తగిన బరువు లేకపోవడం) పిల్లల సంఖ్య పెరుగుతుందని, తక్కువ, మధ్యస్థ ఆదాయం ఉన్న దేశాల్లో 6.7 మిలియన్ల పిల్లలు తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నారని నివేదిక పేర్కొంది. అదనంగా దాదాపు 1,30,000 మంది పిల్లలు మరణించారు.

* 2019లో 135 మిలియన్ల ప్రజలు తీవ్రమైన ఆహార సంక్షోభంలో ఉన్నారు.

* 2020 చివరి నాటికి అదనంగా 130 మిలియన్ల ప్రజలు తీవ్రమైన ఆహార సంక్షోభంలోకి వెళ్తారని, మొత్తం 265 మిలియన్ల ప్రజలు ఈ సమస్య ఎదుర్కొంటారని ప్రపంచ ఆహార కార్యక్రమం  (World Food Programme) హెచ్చరించింది.

* ప్రపంచవ్యాప్తంగా 2019లో 144 మిలియన్ల పిల్లలు (21.3% శాతం) చైల్డ్‌ స్టంటింగ్‌తో, 47 మిలియన్ల పిల్లలు (6.9%) చైల్డ్‌ వాస్టింగ్‌తో బాధపడుతున్నారు. 2018లో అయిదేళ్లలోపు వయసు ఉన్న పిల్లలు 5.3 మిలియన్ల (3.9% శాతం) మరణించగా వీరిలో చాలామంది పిల్లలు పోషకాహార లోపంతోనే మృతిచెందారు.

*  2019లో అధిక ఆదాయం ఉన్న దేశాల్లో అయిదేళ్లలోపు వయసు ఉన్న పిల్లల్లో 199 మంది పిల్లలకు గానూ ఒకరు మరణిస్తుండగా అభివృద్ధి చెందన దేశాల్లో 16 మంది పిల్లల్లో ఒకరు మరణిస్తున్నారు. 

* అయిదేళ్లలోపు వయసు ఉన్న పిల్లల్లో 45% పోషకాహారలోపంతో మృతి చెందుతున్నారు. 

* జీహెచ్‌ఐ - 2020 నివేదిక ప్రకారం ఆఫ్రికా సౌత్‌ ఆఫ్‌ ది సహారా (27.8 స్కోర్), దక్షిణ ఆసియా(26.0 స్కోరు)ల్లో అధిక ఆకలి, పోషకాహార లోప స్థాయి అధికంగా, తీవ్రంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల స్కోర్లు: ప్రపంచం 18.2; వెస్ట్‌ ఆసియా -  నార్త్‌ ఆఫ్రికా 12; ఈస్ట్‌ - సౌత్‌ఈస్ట్‌ ఆసియా 9.2; లాటిన్‌ అమెరికా, కరేబియన్‌ 8.4; యూరప్, సెంట్రల్‌ ఆసియా 5.8గా ఉన్నాయి.) 

* జీహెచ్‌ఐ - 2020 నివేదిక ప్రకారం భయంకరమైన(Alarming) ఆకలి బాధలున్న జాబితాలో మూడు దేశాలున్నాయి. అవి

1. మడగాస్కర్‌ (ర్యాంక్‌ - 105,  స్కోరు 36.0 (తీవ్రతస్థాయి)

2. టిమొర్‌ - లెస్టె(Timor n- Leste) (ర్యాంక్‌ - 106, స్కోరు - 37.6 

3. చాద్ ‌(Chad) (ర్యాంక్‌: 107, స్కోరు - 44.7 

* భయంకరమైన ఆకలి బాధలున్న ఎనిమిది ఇతర దేశాలను కూడా గుర్తించారు. ఈ దేశాలు 35 - 49.9 స్కోరును (తీవ్రతస్థాయి) కలిగి ఉన్నాయి.

1. బురుండి    2. సెంట్రల్‌ ఆఫ్రికన్‌ రిపబ్లిక్‌

3. కొమొరొస్‌  4. డెమొక్రాటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ ది కాంగో

5. సోమాలియా     6. దక్షిణ సూడాన్‌

7. సిరియా     8 యెమెన్‌ 

*  ఇంకా తీవ్రమైన ఆకలితో ఉన్న దేశాల జాబితాలో తాత్కాలికంగా 31 దేశాలను గుర్తించారు. అదనంగా  తొమ్మిది దేశాలు తీవ్రమైన ఆకలితో ఉన్న జాబితాలో తాత్కాలికంగా చేరాయి.

*  ప్రస్తుతం తాత్కాలికంగా 37 దేశాలు తక్కువ ఆకలి(Low Hunger)ని 2030 నాటికి సాధించడంలో విఫలం అయ్యాయని జీహెచ్‌ఐ స్కేల్‌ నిర్వచించింది.

* 107 దేశాలతో విడుదలైన ప్రపంచ ఆకలి సూచీలో భారత్‌ 94వ స్థానంలో ఉంది. తీవ్రమైన ఆకలి బాధలున్న దేశాల విభాగంలో నిలిచింది.

మాదిరి ప్రశ్నలు

1. జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని అమలు చేయడం ద్వారా భారతదేశంలో ఎంతమంది ప్రయోజనం పొందుతున్నారు? 

ఎ) 1/2 వంతు      బి) 2/3 వంతు    సి) 3/4 వంతు      డి) 4/5 వంతు


2. కింది ఏ వ్యవస్థలో భాగంగా లక్షిత వర్గాలను తిశిలి, తీశిలి గా వర్గీకరించారు? 

ఎ)  TPDS     బి) RPDS     సి) AAY     డి) ANNAPURNA


3. సమగ్ర బాలల అభివృద్ధి పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 

ఎ) 1972      బి) 1973    సి) 1975      డి) 1976


4. 2000 లో నిరుపేదల కోసం పీడీఎస్‌లో ఏ పథకాన్ని ప్రవేశపెట్టారు? 

ఎ) పనికి ఆహారం            బి) సంపూర్ణ గ్రామీణ రోజ్‌గార్‌ యోజన 

సి) ఉపాధి హామీ పథకం   డి) అంత్యోదయ అన్నయోజన


5. ప్రజా పంపిణీ వ్యవస్థకు కింది దేనితో సంబంధం ఉంది?  

ఎ) చౌక ధరల దుకాణాలు    బి) సహకార దుకాణాలు 

సి) సూపర్‌ బజార్లు            డి) పైవేవీకావు

6. కింది ఏది దారిద్య్రం డైమెన్షన్‌ కాదు? 

ఎ)  Affordable        బి) Arbitrality
సి)  Accessibility    డి) Availability


7. 1943 లో భారతదేశంలో అత్యంత వినాశకరమైన కరవు  ఎక్కడ సంభవించింది? 

ఎ) అసోం     బి) బిహార్‌   సి) బెంగాల్‌     డి) పంజాబ్‌ 


సమాధానాలు

1-బి   2-ఎ   3-సి   4-డి   5-ఎ   6-బి   7-సి

 

Posted Date : 08-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌