• facebook
  • whatsapp
  • telegram

మానవ వనరులు - జనాభా వృద్ధి రేటు

సాంద్రతలో ఉత్తరం.. నియంత్రణలో దక్షిణం!


ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో భారత్‌ రెండో స్థానంలో ఉంది. అయితే మన దేశమంతటా జనాభా విస్తరణ, జనన- మరణాల రేటు, ఆయుర్దాయం ఒకేవిధంగా లేవు. జనసాంద్రత విషయంలో మైదానాలకు, అటవీ, ఎడారి ప్రాంతాలకు అధిక వ్యత్యాసం కనిపిస్తోంది. సాంద్రత ఉత్తర భారత రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంటే, నియంత్రణలో దక్షిణాది రాష్ట్రాలు ఆదర్శంగా నిలిచాయి. గ్రామాలతో పోలిస్తే పట్టణాల్లో లింగనిష్పత్తి మెరుగ్గా ఉంది. స్త్రీలలో విద్య, ఆర్థిక స్వాతంత్య్రం పెరిగిన చోట ప్రసూతి రేటు తగ్గుతోంది. ఇలాంటి లక్ష్యాలను సాధించేందుకు ప్రభుత్వాలు నిరంతరం ప్రయత్నిస్తుంటాయి. మానవవనరుల అధ్యయనంలో భాగంగా అభ్యర్థులు ఈ వివరాలను గణాంకాల సహితంగా తెలుసుకోవాలి. 


ఒక నిర్దిష్ట ప్రదేశంలో రెండు కాలాల్లో పెరిగే జనాభాను జనాభా వృద్ధి అంటారు. జనాభా పెరుగుదలకు రెండు అంశాలు దోహదపడతాయి.

1) సహజ అంశాలు (జనన, మరణ రేట్లు) 2) వలసలు (వచ్చిన వలసలు, పోయిన వలసలు).

జనాభా వృద్ధి రేటును 3 రకాలుగా అంచనా వేస్తారు.

1) సహజ వృద్ధి రేటు = జనన రేటు - మరణ రేటు

2) వలస వృద్ధి రేటు = వలస వచ్చినవారు - వలస వెళ్లినవారు.

3) వాస్తవ వృద్ధి రేటు = (జనన రేటు + వలస వచ్చినవారు), (మరణ రేటు + వలస వెళ్లినవారు)


ఈ జనాభా వృద్ధిని 10 సంవత్సరాలకు లెక్కిస్తే దశాబ్ద వృద్ధి రేటు అని, సంవత్సరానికి లెక్కిస్తే వార్షిక వృద్ధి రేటు అని అంటారు. రెండు కాలాల మధ్య పెరిగితే ధనాత్మక జనాభా వృద్ధి రేటు అని, రెండు కాలాల మధ్య జనాభా తగ్గితే రుణాత్మక జనాభా వృద్ధి రేటు అని అంటారు.


జనాభా వృద్ధి రేటు = ((ప్రస్తుత సంవత్సరం జనాభా - గత సంవత్సరం జనాభా)/గత సంవత్సర జనాభా) x 100

జనాభా వృద్ధి రేటు అన్ని దశాబ్దాల్లో ఒకేవిధంగా లేదు. 

ఉదా: 1941-1951 మధ్య వార్షిక రేటు 1.25%గా ఉంటే, 1951-61 మధ్య 1.96%గా ఉంది. 1991-2001 మధ్య 1.97%, 2001- 2011 మధ్య 1:64%గా నమోదైంది.

భారతదేశంలో 1921లో రుణాత్మక వృద్ధిరేటు నమోదు కాగా, 1971లో అధిక వృద్ధి రేటు (24.8%) నమోదైంది.

- 2001- 2011 మధ్య పురుష జనాభా వృద్ధి రేటు 17.1%. స్త్రీ జనాభా వృద్ధి రేటు 18.3%.

- గ్రామీణా జనాభా వృద్ధి రేటు 12.3%. పట్టణ జనాభా వృద్ధి రేటు 31.8%.

- గ్రామాల్లో స్త్రీ జనాభా వృద్ధి కంటే పురుష జనాభావృద్ధి తక్కువ. పట్టణాల్లో ఇది విరుద్ధంగా ఉంది.

అధిక జనాభా వృద్ధి రేటున్న రాష్ట్రాలు: మేఘాలయ - 27.9%, అరుణాచల్‌ప్రదేశ్‌ - 26.03%, బిహార్‌ - 25.4%; 

కేంద్రపాలిత ప్రాంతాలు: దాద్రానగర్‌ హవేలీ - 55.9%, డామన్‌ డయ్యూ - 53.8%, పుదుచ్చేరి - 28.1%.

అల్ప జనాభా వృద్ధి ఉన్న రాష్ట్రాలు: నాగాలాండ్‌ - -0.6%, కేరళ - 4.9%, గోవా - 8.2%; 

కేంద్రపాలిత ప్రాంతాలు: లక్షదీవులు - 6.3%, అండమాన్‌ నికోబార్‌ దీవులు - 6.9%, చండీగఢ్‌ - 17.2%.

* 2001లో అధిక జనాభా వృద్ధి రేటు ఉన్న నాగాలాండ్‌ (64.5%), 2011 వచ్చేసరికి రుణాత్మక వృద్ధి రేటు సాధించడం విశేషం.

* 2011లో అధిక జనాభావృద్ధి ఉన్న జిల్లా కురుంగ్‌కుమె (111%) (అరుణాచల్‌ ప్రదేశ్‌).

* తక్కువ జనాభా వృద్ధి ఉన్న జిల్లా - లాంగ్‌లెంగ్‌ (-58%) (నాగాలాండ్‌)

జనసాంద్రత

ఒక చదరపు కిలోమీటరుకు నివసించే జనాభాను జనసాంద్రత అంటారు.

జనసాంద్రత = మొత్తం జనాభా/మొత్తం విస్తీర్ణం

* ఉత్తర భారతదేశంలో సారవంతమైన నేలలు, గంగానది పరీవాహక ప్రాంతం వల్ల అధిక జనసాంద్రత కనిపిస్తుంది. ఉదా: పశ్చిమ బెంగాల్, ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, పంజాబ్‌.

* హిమాలయ పర్వత ప్రాంతాలు, అడవి, ఎడారి ప్రాంతాలు నివాసానికి అనుకూలంగా లేకపోవడం వల్ల, తక్కువ జనసాంద్రత ఉంటుంది.

ఉదా: అరుణాచల్‌ ప్రదేశ్, మిజోరాం, సిక్కిం, మణిపుర్‌.

* అధిక జనసాంద్రత ఉన్న రాష్ట్రాల్లో కేరళ తప్ప అన్నీ ఉత్తర భారతదేశ రాష్ట్రాలే.

* తక్కువ జనసాంద్రత ఉన్న రాష్ట్రాలన్నీ ఈశాన్య, హిమాలయ రాష్ట్రాలే.

అధిక జనసాంద్రత రాష్ట్రాలు: బిహార్‌ - 1106 మంది, పశ్చిమ బెంగాల్‌ - 1028, కేరళ - 860 


కేంద్రపాలిత ప్రాంతాలు: దిల్లీ - 11,320, చండీగఢ్‌ - 9,258.


అల్ప జనసాంద్రత ఉన్న రాష్ట్రాలు: అరుణాచల్‌ప్రదేశ్‌ - 17, మిజోరం - 52, సిక్కిం - 86; 


కేంద్రపాలిత ప్రాంతాలు: అండమాన్‌ నికోబార్‌ దీవులు - 46, దాద్రానగర్‌ హవేలీ - 700.


* 2011 లెక్కల ప్రకారం అధిక జనసాంద్రత ఉన్న జిల్లా - నార్త్‌ఈస్ట్‌ దిల్లీ (37,346 మంది). తక్కువ జనసాంద్రత ఉన్న జిల్లా - దిబాంగ్‌ వ్యాలీ (1) (అరుణాచల్‌ప్రదేశ్‌)

లింగ నిష్పత్తి

ప్రతి వెయ్యి మంది పురుషులకు ఎంతమంది స్త్రీలు ఉన్నారో లెక్కించడాన్ని స్త్రీ, పురుషుల నిష్పత్తి లేదా లింగ నిష్పత్తి అంటారు. ఇది స్త్రీ, పురుషుల సమానత్వానికి సామాజిక సూచిక.

లింగ నిష్పత్తి = మహిళల సంఖ్య / పురుషుల సంఖ్య

స్వాతంత్య్రం నాటి లింగ నిష్పత్తితో పోలిస్తే నేటికీ ఈ నిష్పత్తి తక్కువగానే ఉంది. 


కారణాలు:

* పురుషుల కంటే స్త్రీలలో మరణాల రేటు అధికంగా ఉండటం.

* ఆడ శిశువుల జననం పట్ల అశ్రద్ధ.

* అధిక పేదరికం.

* ఆడపిల్లలను భారంగా భావించడం.

* కౌమార దశలో సమస్యల వల్ల స్త్రీ మరణాలు పెరగడం.

* కాన్పు సమయంలో స్త్రీలు అధికంగా చనిపోవడం.

* బాలికల్లో శిశుమరణాలు రేటు అధికంగా ఉండటం.

* లింగ నిర్ధారణ పరీక్షల ద్వారా భ్రూణహత్యలు పెరగడం.

* 1971లో ప్రవేశపెట్టిన గర్భస్రావక చట్టం ద్వారా కూడా భ్రూణహత్యలు పెరిగాయి.

* స్త్రీ సాధికారత పట్ల శ్రద్ధ వహించకపోవడం.

* భారత్‌లో తగ్గుతున్న స్త్రీలను అమర్త్యసేన్‌ ‘Missing women in India' అని వ్యాఖ్యానించారు.

అధిక లింగ నిష్పత్తి ఉన్న రాష్ట్రాలు:            

1. కేరళ 1084                                       

2. తమిళనాడు 996                                 

3. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ 993                         

(నోట్‌ : నవ్యాంధ్రప్రదేశ్‌ 997)                         

కేంద్రపాలిత ప్రాంతాలు                                  

1. పుదుచ్చేరి 1037                                 

2. లక్షదీవులు 947                                 

3. అండమాన్‌ నికోబార్‌ దీవులు 876               

తక్కువ లింగ నిష్పత్తి ఉన్న రాష్ట్రాలు

1. హరియాణా 879

2. జమ్మూ- కశ్మీర్‌ 889

3. సిక్కిం 890

4. పంజాబ్‌ 895

కేంద్రపాలిత ప్రాంతాలు       

1. డామన్‌ డయ్యూ  618

2. దాద్రానగర్‌ హవేలి - 774

3. చండీగఢ్‌  818

* లింగ నిష్పత్తి అధికంగా ఉన్న జిల్లా పుదుచ్చేరిలోని ‘మహె‘ (1176 మంది), తక్కువగా ఉన్న జిల్లా డామన్‌ డయ్యూలోని డామన్‌ (533).

* అభివృద్ధి చెందిన దేశాల్లో లింగ నిష్పత్తి అధికంగా ఉంటుంది. ఉదా: జపాన్‌ (1055), అమెరికా (1025)

పిల్లల లింగ నిష్పత్తి

0-6 సంవత్సరాల మధ్య ప్రతి 1000 మంది బాలురకు, ఎంతమంది బాలికలు ఉన్నారో తెలియజేసేది పిల్లల లింగ నిష్పత్తి.


సంవత్సరం        పిల్లల లింగనిష్పత్తి

1961                  - 976 

1991                  - 945

2001                 - 927

2011                 - 918


* పట్టణాల్లో పిల్లల లింగనిష్పత్తి 905, గ్రామాల్లో 923.

* జమ్ము-కశ్మీర్‌లో పిల్లల లింగ నిష్పత్తి గణనీయంగా తగ్గింది.

* ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్‌ల్లో ఈ నిష్పత్తి తగ్గితే, హరియాణా, పంజాబ్‌లో పెరిగింది.

అధికంగా ఉన్న రాష్ట్రాలు                     

1) అరుణాచల్‌ప్రదేశ్‌ - 972                   

2) మేఘాలయ 970                         

3) మిజోరం 970                             

కేంద్ర పాలిత ప్రాంతాలు                     

1) అండమాన్‌ దీవులు 968                 

2) పుదుచ్చేరి 967                          

3) దాద్రానగర్‌ హవేలీ 926                   

తక్కువ ఉన్న రాష్ట్రాలు

1) హరియాణా 834

2) పంజాబ్‌ 846

3) జమ్ము- కశ్మీర్‌ 862

కేంద్ర పాలిత ప్రాంతాలు

1) దిల్లీ  871

2) చండీగఢ్‌ 880

3) డామన్‌ డయ్యూ 904

బాలికలు తగ్గడానికి కారణాలు: * ఎక్కువమంది మగ పిల్లలనే కావాలనుకోవడం.* భ్రూణ హత్యలకు పాల్పడటం.* శైశవ, బాల్య దశలో ఆడపిల్లలు చనిపోవడానికి కారణం సురక్షితమైన నీరు లేకపోడం, పారిశుద్ధ్యం లోపించడం, వైద్య సదుపాయాల కొరత.


బాలికల సంఖ్య పెంచేందుకు కేంద్రం ప్రారంభించిన పథకాలు:

1) బేటీ బచావో బేటీ పఢావో: ఈ పథకాన్ని 2015, జనవరి 22లో హరియాణాలోని పానిపట్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. దీన్ని 3 మంత్రిత్వ శాఖలు నిర్వహిస్తాయి. అవి 1) మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ 2) ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ 3) మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

సామూహిక ప్రచారం: ఇందులో బాలికల జననాలు, వారి ఎదుగుదల, స్త్రీ సాధికారత లాంటి అంశాలతో ప్రచారం చేస్తారు. మొదట 100 జిల్లాల్లో ఈ ప్రచారాన్ని ప్రారంభించారు.

వివిధ విభాగాల భాగస్వామ్యం (మల్టీ సెక్టోరల్‌ యాక్షన్‌): బాలికలకు వైద్యం, రక్షణ వంటి అంశాలపై మూడు మంత్రిత్వ శాఖలు చర్యలు తీసుకుంటాయి. దీనిని మొదట 161 జిల్లాల్లో ప్రారంభించారు. ప్రస్తుతం 640 జిల్లాల్లో అమలు చేస్తున్నారు.

సుకన్య సమృద్ధి యోజన: ఈ పథకాన్ని 2015, జనవరి 22న ప్రారంభించారు. ఇందులో కనీస డిపాజిట్‌ రూ. 250 అయితే, గరిష్ఠం రూ.1,50,000. పదేళ్ల లోపు వయసున్న బాలికలంతా అర్హులు. అమ్మాయికి 21 సంవత్సరాలు వచ్చిన ఈ ఖాతా ముగుస్తుంది. 18 సంవత్సరాల తర్వాత ఉన్నత విద్య కోసం కొంతమొత్తాన్ని ఈ ఖాతా నుంచి తీసుకోవచ్చు. 21 లేదా 18 ఏళ్ల తర్వాత వివాహం చేసుకుంటే, ఖాతాలో ఉన్న నగదును తీసేసుకోవచ్చు. ఈ ఖాతాపై ఇచ్చే వడ్డీ రేటు 7.6%.

జననాల రేటు: ప్రతి 1000 మంది జనాభాకు ఎంతమంది జన్మిస్తున్నారో ఇది తెలియజేస్తుంది.

జనన రేటు = సంవత్సరంలో సజీవ జననాల సంఖ్య/సంవత్సరం మధ్య జనాభా × 1000

మరణాల రేటు: ప్రతి 1000 మంది జనాభాకు ఎంతమంది చనిపోతున్నారో ఇది తెలియజేస్తుంది.

మరణ రేటు = సంవత్సరంలో మరణాల సంఖ్య /సంవత్సరం మధ్య జనాభా × 1000

* ఒక దేశ జనాభా జనన, మరణ రేట్ల మధ్య తేడాను డెమోగ్రాఫిక్‌ గ్యాప్‌ అంటారు.

జనన రేటు కేరళలో తక్కువగా, బిహార్‌ అధికంగా ఉంది. మరణ రేటు పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రలో తక్కువగా, ఒడిశాలో ఎక్కువగా నమోదైంది.

శిశు మరణాల రేటు:  ప్రతి 1000 మంది జననాలకు మొదటి పుట్టినరోజు కూడా చూడకుండా చనిపోయే శిశువుల సంఖ్యను శిశుమరణాల రేటు (IMR) అంటారు. 20వ శతాబ్దం మొదటి దశకంలో శిశు మరణాల రేటు 218గా ఉండేది. 2018 నాటికి 32కి తగ్గింది. మశూచిని పూర్తిగా నిర్మూలించడం, ఇతర అంటువ్యాధుల్ని తగ్గించడంతో ఈ పురోగతి నమోదైంది. దేశంలో గ్రామాల కంటే పట్టణాల్లోనే శిశుమరణాల రేటు తక్కువ.

పెద్ద రాష్ట్రాల్లో అధిక శిశు మరణాల రేటు ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్‌ (48), తక్కువ ఉన్న రాష్ట్రం కేరళ (7). చిన్న రాష్ట్రాల్లో శిశు మరణాల రేటు ఎక్కువ ఉన్న రాష్ట్రం అరుణాచల్‌ప్రదేశ్‌ (37), తక్కువ ఉన్న రాష్ట్రం నాగాలాండ్‌ (4). అధిక శిశు మరణాల రేటు ఉన్న కేంద్రపాలిత ప్రాంతం డామన్‌ డయ్యూ (16), తక్కువ ఉన్నది అండమాన్‌ దీవులు (9).


ప్రసూతి మరణ రేటు: ప్రతి లక్ష మందిలో సంవత్సరానికి చనిపోయే తల్లుల సంఖ్యను ప్రసూతి మరణరేటు (MMR) అంటారు. 2011లో దేశంలో ఎంఎంఆర్‌ రేటు 112. అధికంగా ఎంఎంఆర్‌ ఉన్న రాష్ట్రం అస్సాం (215), అల్పంగా ఉన్న రాష్ట్రం కేరళ (43). ఆంధ్రప్రదేశ్‌లో ఎంఎంఆర్‌ 65, తెలంగాణలో 63.


ఎంఎంఆర్‌ను తగ్గించేందుకు పథకాలు:

1) 2005లో ప్రారంభించిన జాతీయ గ్రామీణ ఆరోగ్యమిషన్‌ (NRHM)

2) 2005లో జనసంఖ్య స్థిర కోష్‌ (JSK)

3) 2011లో ప్రారంభించిన జననశిశు సురక్షా కార్యక్రమం ((JSSK)

4) పోషణ అభియాన్‌

5) ప్రధానమంత్రి సురక్షిత్‌ మాతృత్వ అభియాన్, ప్రధానమంత్రి మాతృ వందన యోజన.

*2030 నాటికి ఎంఎంఆర్‌ని 70 దిగువకు తేవడమే ఈ పథకాల లక్ష్యం.


మొత్తం ప్రసూతి రేటు: ఒక స్త్రీ తన పునరుత్పాదక వయసులో ఎంతమంది పిల్లలకు జన్మ ఇస్తుందో తెలియజేసేదాన్ని మొత్తం ప్రసూతి రేటు (TFR) అంటారు. స్త్రీ విద్యాస్థాయి పెరిగే కొద్ది టీఎఫ్‌ఆర్‌ తగ్గుతుంది.

ఇది 1961లో 5.9, 1971లో 5.4, 1981లో 4.6, 1991లో 3.8, 2001లో 3.1, 2011లో 2.7 గా ఉంది.  

అధిక టీఎఫ్‌ఆర్‌ ఉన్న రాష్ట్రం బిహార్‌ (3), తక్కువ ఉన్నది సిక్కిం (1).

ఆయుర్దాయం: సగటున ఒక వ్యక్తి జీవించే కాలాన్ని ఆయుర్దాయం అంటారు. దీన్ని నిర్ణయించే అంశాలు. 1) ఆరోగ్య సదుపాయాలు 2) పౌష్టికాహార లభ్యత 3) తక్కువ శిశు మరణాల రేటు. 

* 1951లో భారత్‌లో సగటు ఆయుర్దాయం 32 సంవత్సరాలు ఉంటే 2013-77 మధ్యకాలంలో 69 సంవత్సరాలకు చేరింది. 

* పురుష సగటు ఆయుర్దాయం 67.8 ఏళ్లు, స్త్రీల ఆయుర్దాయం 70.4. 

* గ్రామాల్లో ఇది 67.7 సంవత్సరాలు కాగా పట్టణాల్లో 72.4 ఏళ్లు.

* అధిక ఆయుర్దాయం ఉన్న రాష్ట్రం కేరళ (75.3), అల్ప ఆయుర్దాయం ఉన్న రాష్ట్రం ఛత్తీస్‌గఢ్‌ (65.2).

రచయిత: ధరణి శ్రీనివాస్‌ 

Posted Date : 06-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌