• facebook
  • whatsapp
  • telegram

మాన‌వ వ‌న‌రులు - వృత్తులవారీ వ్య‌వ‌స్థ‌

దేశ ప్రగతికి మేలైన మూలధనం!

 

  దేశ నిర్మాణానికి, ఆర్థిక వ్యవస్థ వృద్ధికి మానవ వనరులే అత్యంత కీలకం. విద్యావంతులు, నైపుణ్యం ఉన్నవారు, ఆరోగ్యవంతులైన శ్రామికులతో వ్యవస్థాగత అభివృద్ధి, మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయి. శ్రామిక శక్తి సామర్థ్యాలపైనే వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల పురోగతి ఆధారపడి ఉంటుంది.అందుకే ఆ మానవ వనరులను నైపుణ్యంతో కూడిన శ్రామిక శక్తిగా తీర్చిదిద్దేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం కృషి చేస్తుంటాయి.ఈ వివరాలపై పోటీ పరీక్షార్థులకు సమగ్ర అవగాహన ఉండాలి.

  ఆర్థిక వ్యవస్థలో వివిధ వృత్తుల్లో పనిచేసే జనాభా వివరాలను తెలియజేసేదే వృత్తులవారీ వ్యవస్థ. దాని ప్రాతిపదికన ఆర్థిక వ్యవస్థను ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాలుగా విభజించారు. ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి తొలి దశలో ఎక్కువగా శారీరక శ్రమ చేసే పనివారు ఉంటారు. తర్వాతి దశలో సేవా రంగం విస్తరించి సేవా శ్రామికులు అధికమవుతారు. 20వ శతాబ్దం మధ్యకాలం వరకు శ్రామికులు చేసే పనులు, అవసరాలకు అనుగుణంగా వారి యూనిఫాం ఉండేది. శ్రామికుల సమూహాలను మూడు పెద్ద విభాగాలుగా వర్గీకరిస్తారు. అవి 1) బ్లూ కాలర్‌ శ్రామికులు 2) వైట్‌ కాలర్‌ శ్రామికులు 3) ప్రత్యేక ఆధారిత శ్రామికులు.

బ్లూ కాలర్‌ శ్రామికులు: చేసే పని వల్ల అయ్యే మురికి, మాలిన్యాలు కనిపించకుండా దుస్తులు ధరించే వారిని బ్లూ కాలర్‌ శ్రామికులు అంటారు. వీరు శారీరక శ్రమ చేస్తుంటారు. ఇందులో రెండు ఉప విభాగాలున్నాయి. 

ఎ) స్కార్‌లెట్‌ కాలర్‌ శ్రామికులు ఉదా: దుకాణాలలో పనిచేసేవారు (మహిళలు)

బి) నలుపు కాలర్‌ శ్రామికులు ఉదా: బొగ్గు గనులు, చమురు పరిశ్రమల్లో పనిచేసేవారు

వైట్‌ కాలర్‌ శ్రామికులు: వీరు కార్యాలయాల్లో పనిచేస్తుంటారు. ఇందులో నాలుగు రకాల వారున్నారు.

ఎ) పింక్‌ కాలర్‌ శ్రామికులు 

ఉదా: ఆఫీసులో గుమాస్తాలు

బి) గ్రే కాలర్‌ శ్రామికులు

ఉదా: ఐటీ రంగంలో పనిచేసేవారు

సి) గోల్డ్‌ కాలర్‌ శ్రామికులు 

ఉదా: డాక్టర్లు, ఇంజినీర్లు (అధిక డిమాండ్‌ ఉన్నవారు)

డి) రెడ్‌ కాలర్‌ శ్రామికులు 

ఉదా: సూర్యకాంతి కింద పనిచేసేవారు- వ్యవసాయం తదితరాలు

ప్రత్యేక ఆధారిత శ్రామికులు: వీరిని తిరిగి మూడు రకాలుగా వర్గీకరించారు. 

ఎ) గ్రీన్‌ కాలర్‌ శ్రామికులు 

ఉదా: పర్యావరణ పరిరక్షణ పనులు చేసేవారు.

బి) ఎల్లో కాలర్‌ శ్రామికులు 

ఉదా: ఫొటోగ్రాఫర్లు, ఫిల్మ్‌ మేకర్లు.

సి) ఆరెంజ్‌ కాలర్‌ శ్రామికులు 

ఉదా: నిర్మాణ పనులు, పారిశుద్ధ్య పనులు చేసేవారు.

శ్రామిక శక్తి

   శ్రమ అనేది ప్రాథమిక ఉత్పత్తి కారకం. శ్రామిక శక్తి పరిమాణం ఆర్థిక కార్యకలాపాల స్థాయిని నిర్ణయిస్తుంది, 15 - 59 ఏళ్ల వయసున్న జనాభాపై ఆధారపడుతుంది. 15 ఏళ్లలోపున్న పిల్లలు, 60 ఏళ్లు దాటిన వృద్ధులను ఉత్పాదక కార్యకలాపాల లెక్కల్లోకి తీసుకోరు. వారిని అనుత్పాదక జనాభాగా పరిగణిస్తారు.

* మన దేశంలో 1971 - 2011 మధ్య నాలుగు దశాబ్దాల్లో శ్రామిక శక్తి 18 కోట్ల నుంచి 46 కోట్లకు పెరిగింది. ఈ కాలంలో దేశ జనాభా సగటు వార్షిక వృద్ధి రేటు 2% ఉంటే శ్రామికశక్తి వృద్ధిరేటు 2.48% ఉంది. 2011 తర్వాత 1.82 శాతానికి తగ్గింది.

* శ్రామికశక్తిలో ప్రధాన శ్రామికులు, ఉపాంత శ్రామికులు ఉంటారు. ఒక ఆర్థిక సంవత్సరంలో 183 రోజులకు మించి ఉపాధి పొందేవారు ప్రధాన శ్రామికులు. 183 రోజులకంటే తక్కువ రోజులు ఉపాధి పొందేవారు ఉపాంత శ్రామికులు.

* 1971లో ప్రధాన శ్రామికులు 96.8% కాగా ఉపాంత శ్రామికులు 3.2%.

* 2011లో ప్రధాన శ్రామికులు 75.2%, ఉపాంత శ్రామికులు 24.8%. ప్రధాన శ్రామికుల్లో పురుషులు 75.4%, మహిళలు 24.6%.

* 1971లో గ్రామీణ శ్రామికులు 82.5% ఉంటే 2011 నాటికి 77.4%కి తగ్గారు.

* 1971లో మొత్తం శ్రామిక జనాభాలో పురుషులు 79.9% ఉండగా, 2011 నాటికి 68.9 శాతానికి తగ్గారు. మహిళా శ్రామికులు 20.1% నుంచి 31.1 శాతానికి పెరిగారు.

వృత్తులవారీ జనాభా విభజనను నిర్ణయించే అంశాలు: 1) భౌగోళిక అంశాలు 2) ఉత్పాదక శక్తుల అభివృద్ధి 3) ప్రత్యేకీకరణ 4) తలసరి ఆదాయ స్థాయిలో మార్పు

* వ్యవసాయ రంగంలో ఎక్కువ శాతం శ్రామికులు పనిచేస్తుంటే వాస్తవిక తలసరి ఆదాయం అల్పస్థాయిలో ఉంటుంది. అదే ద్వితీయ, తృతీయ రంగాల్లో ఎక్కువ మంది పనిచేస్తుంటే తలసరి ఆదాయం ఎక్కువగా ఉంటుంది. - కొలిన్‌క్లార్క్‌

* అభివృద్ధి జరిగే కొద్దీ ఉద్యోగిత, పెట్టుబడులు ప్రాథమిక రంగం నుంచి ద్వితీయ, తృతీయ రంగాలకు తరలిపోతాయి. -ఏజీబీ ఫిషర్‌

* అభివృద్ధి జరిగేటప్పుడు వ్యవసాయంపై ఆధారపడిన శ్రామికులు తర్వాత పారిశ్రామిక, సేవా రంగాలకు వెళ్లిపోతారు. -సైమన్‌ కుజినెట్స్‌

మానవ వనరులు - విద్య

  పశ్చిమ దేశాల్లో సాధారణ మూలధనం కంటే మానవ మూలధనం వల్లే ఉత్పత్తి ఎక్కువగా పెరుగుతున్న విషయాన్ని గమనించవచ్చు. విద్య, నైపుణ్యాలు, ఆరోగ్య సేవలు మానవ మూలధనానికి దోహదపడుతాయి. థియోడర్‌ షుల్జ్‌ ప్రకారం విద్యలో పెట్టుబడి మానవ మూలధన కల్పనను పెంచుతుంది.

భారతదేశంలో విద్యావిధానం: రాజ్యాంగంలో 45వ అధికరణ ప్రకారం 14 సంవత్సరాల్లోపు పిల్లలందరికీ సార్వత్రిక, ప్రాథమిక విద్య అందించాలి. దేశంలో 1950 దశకం ప్రారంభం నుంచి మూడు దశాబ్దాల వరకు విద్యపై వ్యయం జీడీపీలో శాతంగా చూస్తే స్తబ్దుగా ఉంది. 1952 - 53 మాధ్యమిక విద్యపై మొదలియార్‌ కమిషన్‌ ఏర్పాటైంది. 1964లో విద్యపై నియమించిన డి.ఎస్‌.కొఠారి కమిషన్‌ 1966లో నివేదిక అందజేసింది. విద్యపై ప్రభుత్వ పెట్టుబడి జీడీపీలో 6% ఉండాలని ఈ కమిషన్‌ కీలక సూచన చేసింది.  1968లో జాతీయ విద్యా విధానం ప్రకటించారు. నేడు అమలవుతున్న 10 + 2 + 3 విద్యావిధానాన్ని ఈ కమిటీనే సూచించింది. 1951లో అక్షరాస్యత 18% ఉండగా, 2011 నాటికి 73 శాతానికి పెరిగింది.

విద్యాహక్కు చట్టం: 6 నుంచి 14 సంవత్సరాల్లోపు పిల్లలకు ఉచిత, నిర్బంధ విద్యను ప్రాథమిక హక్కుగా మారుస్తూ 86వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. దీనికి అనుగుణంగా ఆర్టికల్‌ 21-ఎ నిబంధనను రాజ్యాంగంలో చేర్చారు. 2009లో చట్టం అయినప్పటికీ 2010, ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వచ్చింది.

ముఖ్యాంశాలు: * 6 నుంచి 14 సంవత్సరాల్లోపు వయసున్న పిల్లలందరికీ ఉచిత, నిర్బంధ విద్యను సమీప పాఠశాలలో అందించాలి. 

* సమీపంలో పాఠశాల లేకపోతే మూడేళ్లలో ఏర్పాటు చేయాలి. 

* ఉపాధ్యాయులు ప్రైవేటు ట్యూషన్‌లు చెప్పకూడదు. 

* పాఠశాల ప్రవేశ సమయంలో క్యాపిటేషన్‌ ఫీజు తీసుకోకూడదు.

2020 జాతీయ విద్యావిధానం: ఇస్రో మాజీ ఛైర్మన్‌ కస్తూరి రంగన్‌ నేతృత్వంలో కొత్త జాతీయ విద్యావిధానం ముసాయిదాను కేంద్రానికి సమర్పించారు.

ముఖ్యాంశాలు: 1) 2030 నాటికి పాఠశాల విద్యలో 100% స్థూల నమోదు నిష్పత్తి సాధించాలి.

2) సార్వత్రిక అందుబాటు, ఓపెన్‌ పాఠశాలల విస్తరణ ద్వారా 2 కోట్ల మంది పిల్లలను స్కూలుకి తీసుకురావాలి.

3) ప్రస్తుతం ఉన్న 10 + 2 + 3 విద్యావిధానం స్థానంలో 5 + 3 + 3 + 4 విద్యా విధానాన్ని ప్రతిపాదించారు. ఇది 3 - 18 సంవత్సరాల కాలానికి వర్తిస్తుంది.

ఎ) ఫౌండేషన్‌ స్టేజ్‌ - ప్రీ ప్రైమరీ, గ్రేడ్‌ 1, 2 (3 - 8 సంవత్సరాలు: అయిదేళ్లు)

బి) ప్రిపరేటరీ స్టేజ్‌ - గ్రేడ్స్‌ 3 నుంచి 5 (8 - 11 సంవత్సరాలు: మూడేళ్లు)

సి) మిడిల్‌ స్టేజ్‌ - గ్రేడ్స్‌ 6 నుంచి 8 (11 - 14 సంవత్సరాలు: మూడేళ్లు)

డి) సెకండరీ స్టేజ్‌ - గ్రేడ్స్‌ 9 నుంచి 12 (14 - 18 సంవత్సరాలు: నాలుగేళ్లు)

4) 10, 12 తరగతులకు బోర్డు పరీక్షలు ఉంటాయి.

5) 6వ తరగతి నుంచి వృత్తి విద్య ప్రారంభమవుతుంది.

6) అవకాశం ఉన్నంత వరకు లేదా 5వ తరగతి వరకు మాతృభాష లేదా ప్రాంతీయ భాషలో బోధించాలి.

7) 2030 నాటికి బోధనా అర్హత డిగ్రీ 4 సంత్సరాలు ఉండాలి. (ఇంటిగ్రేటెడ్‌ బీ.ఎడ్‌)

ఆరోగ్య విధానం

శ్రామికుల సామర్థ్యం వారి ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. పనిచేసే వారి ఆరోగ్యం మెరుగుపడితే జాతీయ సంపద పెరుగుతుంది.

జాతీయ ఆరోగ్య విధానం - 2002: ఈ విధానం ప్రకారం 2005 నాటికి పోలియో, కుష్ఠు వ్యాధిని నిర్మూలించాలి. 2007 నాటికి హెచ్‌ఐవీని సున్నా స్థాయికి తీసుకురావాలి. 2010 నాటికి కాలా అజార్‌ (విష జ్వరం)ను నిర్మూలించాలి.

జాతీయ ఆరోగ్య విధానం-2017: 1) ప్రభుత్వ ఆసుపత్రుల్లో ద్వితీయ, తృతీయ స్థాయి వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలి. 

2) వ్యక్తి జేబు నుంచి వైద్యానికి చేసే వ్యయం తగ్గించాలి. 

3) 2025 నాటికి జీడీపీలో ఆరోగ్యంపై వ్యయం 1.15% నుంచి 2.5%కి పెంచాలి. 

4) 2025 నాటికి ఆయుర్దాయం 70 సంవత్సరాలకు పెంచాలి. 

5) శిశుమరణాలను 2025 నాటికి 23కు తగ్గించాలి. 

6) సంతానోత్పత్తి రేటు 2.1కి తగ్గించాలి. 

7) 2020 నాటికి ప్రసూతి మరణాల రేటు 100కి తగ్గించాలి. 

8) ప్రస్తుత స్థాయి నుంచి ప్రజారోగ్య సదుపాయాలను 2025 నాటికి 50% పెంచాలి.

9) 1.5 లక్షల ఆరోగ్య, వెల్‌నెస్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలి.

ఆరోగ్యానికి సంబంధించిన ప్రధాన పథకాలు:

జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్‌ (2005): ఆరోగ్యంపై ప్రభుత్వ వ్యయం 0.9% నుంచి 2.3% పెంచడం, అందరికీ నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించడం ఈ మిషన్‌ ఉద్దేశం. 2013లో జాతీయ ఆరోగ్య పట్టణ మిషన్, జాతీయ గ్రామీణ ఆరోగ్యమిషన్‌ కలిపి జాతీయ ఆరోగ్యమిషన్‌గా ఏర్పాటు చేశారు.

జననీ సురక్ష యోజన: ఇది 100% కేంద్ర ప్రభుత్వ పథకం. నైపుణ్యం ఉన్న వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో సంస్థాగత ప్రసవాలు నిర్వహించి, ప్రసూతి మరణాల రేటు తగ్గించడం కోసం 2005లో ఈ పథకాన్ని ప్రారంభించారు.

రోగి కళ్యాణ్‌ సమితి (2006): ఆస్పత్రుల్లో మెరుగైన సదుపాయాల కల్పనకు, ఆరోగ్య నియమాలు పెంచేందుకు ఉద్దేశించింది.

ప్రధానమంత్రి స్వాస్థ సురక్ష యోజన (2006): తృతీయ స్థాయి ఆరోగ్య సేవల విషయంలో ప్రాంతాల మధ్య అసమానతలను తగ్గించేందుకు, వైద్య విద్యలో నాణ్యత పెంచేందుకు ఉద్దేశించిన పథకం.

రాష్ట్రీయ స్వాస్థ బీమా యోజన: అవ్యవస్థీకృత రంగంలో ఉన్న పేదలకు రూ.30 వేల ఆరోగ్య బీమా అందించే పథకం. దీనికి కేంద్ర, రాష్ట్ర నిధులు 75 : 25 నిష్పత్తిలో, ప్రత్యేక రాష్ట్రాలకు 90 : 10 నిష్పత్తిలో అందుతాయి.

జననీ శిశు సురక్షా కార్యక్రమం (2011): గర్భిణులు, వ్యాధికి గురైన నవజాత శిశువులకు అయ్యే మందులు, వినియోగ వస్తువులు, భోజన ఖర్చులను ప్రభుత్వమే భరించి, ఉచిత సేవలు అందించేందుకు ఉద్దేశించింది.

స్వచ్ఛ భారత్‌ మిషన్‌ (2014): 2014, అక్టోబర్‌ 2న ప్రారంభించారు. 2019, అక్టోబరు 2 నాటికి బహిరంగ మలవిసర్జనను పూర్తిగా నిర్మూలించాలన్నది లక్ష్యం. స్వచ్ఛభారత్‌ మిషన్‌లో భాగంగా గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి ఇచ్చే ఆర్థిక సహాయం రూ.12 వేల నుంచి రూ.15 వేలకు పెంచారు.

ప్రధానమంత్రి జన్‌ ఆరోగ్య యోజన (2018): పేద, బలహీన కుటుంబాలకు సంవత్సరానికి కుటుంబానికి రూ.5 లక్షల మేర ద్వితీయ, తృతీయ స్థాయి వైద్యానికి రక్షణ కల్పించే విధంగా 2018, సెప్టెంబరు 23న ప్రధానమంత్రి ఈ పథకాన్ని ప్రారంభించారు. 10 కోట్ల మంది లబ్ధిదారులకు వర్తిస్తుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం.

రచయిత: ధరణి శ్రీనివాస్‌

Posted Date : 06-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌