• facebook
  • whatsapp
  • telegram

అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌

* ప్రపంచ దేశాల్లో భారత్‌ అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా గుర్తింపు పొందింది. మనది  మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. స్వాతంత్య్రానంతరం భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పంచవర్ష ప్రణాళికలు దశల వారీగా ఆర్థికాభివృద్ధిని సాధించడానికి 

* ఉపయోగపడ్డాయి. మొదట వ్యవసాయరంగం, తర్వాత పారిశ్రామిక, సేవా రంగాలు అభివృద్ధి సాధించాయి. ఆ ప్రణాళికల అమలు ద్వారా మనదేశ ఆర్థిక వ్యవస్థలో అనేక పరిణామాలు చోటుచేసుకుని, అభివృద్ధి దిశగా పురోగమించింది.


స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) రిసెర్చ్‌ విభాగం భారత ఆర్థిక వ్యవస్థ గురించి 2022, సెప్టెంబరు 3న ఒక నివేదికను విడుదల చేసింది. ఇంటర్నేషనల్‌ మానిటరింగ్‌ ఫండ్‌ (ఐఎంఎఫ్‌) అంచనాలు, బ్లూమ్‌బర్గ్‌ నివేదిక ఆధారంగా ఎస్‌బీఐ దీన్ని రూపొందించింది. దీని ప్రకారం, భారత్‌ బ్రిటన్‌ను వెనక్కి నెట్టి, అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. భారతదేశానికి ముందు వరుసలో అమెరికా, చైనా, జపాన్, జర్మనీ ఉన్నాయి. 


నివేదికలోని ముఖ్యాంశాలు 

* ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశ జీడీపీ వాటా 2014లో 2.6% ఉండగా, 2022 నాటికి 3.5 శాతానికి చేరింది. 2027లో ఈ విలువ 4 శాతానికి చేరే అవకాశం ఉంది. 

* 2014 నుంచి భారత్‌ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలను బట్టి 2029 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే వీలుంది. 

* 2014లో భారత్‌ 10వ స్థానంలో ఉంది. 

* 2022 వృద్ధిరేటు ప్రకారం చూస్తే, 2027 నాటికి జర్మనీని, 2029 నాటికి జపాన్‌ని భారత్‌ అధిగమించే సూచనలు ఉన్నాయి. 

* రాబోయే రోజుల్లో  చైనాలో కొత్త పెట్టుబడులు మందగించే అవకాశం ఉంది, ఈ మేరకు భారత్‌ లబ్ధి పొందుతుందని ఎస్‌బీఐ రిసెర్చ్‌ విభాగం పేర్కొంది.

* జనవరి - మార్చిలో భారత ఆర్థిక వ్యవస్థ 854.7 బిలియన్‌ డాలర్లుగా నమోదు కాగా, బ్రిటన్‌ ఆర్థిక వ్యవస్థ 816 బిలియన్‌ డాలర్లుగా ఉందని బ్లూమ్‌బర్గ్‌ తన నివేదికలో తెలిపింది. త్రైమాసికం చివరి రోజున డాలరు మారకం రేటు ఆధారంగా సర్దుబాటు పద్ధతిలో ఆ సంస్థ లెక్క కట్టింది.

* ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వృద్ధిని సాధిస్తోన్న దేశంగా భారత్‌ ఉంది. దీన్నిబట్టి వచ్చే కొన్నేళ్లలో బ్రిటన్, భారత్‌కు మధ్య ఈ అంతరం మరింత పెరగవచ్చని అంచనా.

* ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022 - 23) ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో భారతదేశ జీడీపీ 13.5 శాతం మేర వృద్ధి చెందింది. 

* 2022, ఆగస్టు 5న రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) జరిపిన ద్రవ్యవిధాన సమీక్షలో తొలి త్రైమాసికంలో భారత వృద్ధి 16.2% ఉంటుందని అంచనా వేసింది. సేవల రంగంలో గిరాకీ పెరగడమే దీనికి ముఖ్య కారణమని ఆర్‌బీఐ పేర్కొంది.


 

ప్రతికూలతలు

* పెరుగుతున్న వడ్డీరేట్లు, మాంద్యం భయాలు కలిసి రాబోయే త్రైమాసికాల్లో భారత దేశ ఆర్థిక వృద్ధిలో వేగం తగ్గే అవకాశం ఉంది.

* తయారీ రంగంలో కేవలం 4.8% వృద్ధి మాత్రమే ఉంది. ఇది ఆందోళన కలిగించే అంశం.

* ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా ఉన్నాయి. 

* వరుసగా ఏడు నెలల పాటు ద్రవ్యోల్బణం 6 శాతం కంటే ఎక్కువగా నమోదైంది. 

* అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరగడం, ఆ ప్రభావం భారత్‌పై ఎక్కువగా ఉండటం లాంటి అంశాలు మన ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావాలను చూపిస్తాయి. 


స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)

ఒక ఇంట్లో నలుగురు ఉన్నారనుకుంటే, వారంతా తలోపని చేసి, సంపాదించిన మొత్తాన్ని ఆ ఇంటి మొత్తం ఆదాయం అంటారు. అదే విధంగా ఒక దేశంలో ఉన్న వాళ్లంతా కలిసి ఉత్పత్తి చేసే వస్తు - సేవల విలువను జీడీపీ అంటారు. 2022 నాటికి భారతదేశ జనాభా 140.66 కోట్లుగా ఉందని అంచనా. ప్రపంచంలో ఏ దేశ స్థాయి ఏమిటనేది ఈ జీడీపీ వివరిస్తుంది.


మాదిరి ప్రశ్నలు

1. రాజ్యాంగ పరంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ...

1) ఫెడరల్‌ (సమాఖ్య) ఆర్థిక వ్యవస్థ      2) మిశ్రమ ఆర్థిక వ్యవస్థ

3) పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ      4) ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ

జ: 1


2. ఆర్థికాభివృద్ధి ప్రక్రియలో ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల భాగస్వామ్యం దృష్ట్యా భారత ఆర్థిక వ్యవస్థ.....

1) ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ      2) మిశ్రమ ఆర్థిక వ్యవస్థ

3) ప్రాచీన ఆర్థిక వ్యవస్థ          4) సామ్యవాద ఆర్థిక వ్యవస్థ

జ: 2


3. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆర్థిక నియంత్రణ అధికారాల విభజన ఉన్న రాజ్యాంగ వ్యవస్థను ఏమంటారు?

1) సమాఖ్య ఆర్థిక వ్యవస్థ      2) ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ

3) మిశ్రమ ఆర్థిక వ్యవస్థ      4) పట్టణ ఆర్థిక వ్యవస్థ

జ: 1


4. జాతీయాదాయ వృద్ధిరేటు కంటే తలసరి ఆదాయ వృద్ధిరేటు తక్కువగా ఉండటానికి కారణం?

1) తక్కువ జనాభా వృద్ధిరేటు       2) అధిక జనాభా వృద్ధిరేటు 

3) స్థిర జనాభా వృద్ధిరేటు       4) ఏదీకాదు

జ: 2


5. మానవాభివృద్ధి నివేదిక (హెచ్‌డీఐ) 2021లో భారత్‌ స్థానం? (ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం - యూఎన్‌డీపీ దీన్ని రూపొందిస్తుంది. మొత్తం - 191 దేశాలను పరిగణనలోకి తీసుకున్నారు.)

1) 130      2) 131     3) 132     4) 133

జ: 3


6. ఎస్‌బీఐ రిసెర్చ్‌ రిపోర్ట్‌ ప్రకారం, 2022లో ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఉన్న పది దేశాల్లో భారత్‌ ఎన్నో స్థానంలో ఉంది?

1) రెండు      2) మూడు        4) నాలుగు     4) అయిదు

జ: 4


7. మానవాభివృద్ధి సూచిక అనే భావనను ప్రతిపాదించింది?

1) మహబూబ్‌-ఉల్‌-హక్‌    2) సి.రంగరాజన్‌     3) అభిజిత్‌ బెనర్జీ     4) రఘురామ్‌ రాజన్‌

జ: 1


8. మానవాభివృద్ధి సూచికలో కింది ఏ అంశాన్ని గణన చేస్తారు?

1) ఆయుః ప్రమాణం (ఆరోగ్యం)         2) విద్య

3) తలసరి ఆదాయం (ఆదాయం)            4) పైవన్నీ

జ: 4


9. భౌతిక జీవన నాణ్యత సూచీలో గణన చేసే అంశం?

1) ఆయుః ప్రమాణం      2) శిశుమరణాల రేటు

3) మౌలిక అక్షరాస్యత      4) పైవన్నీ

జ: 4


10. మానవాభివృద్ధి సూచికను ప్రచురించే సంస్థ, ప్రారంభించిన సంవత్సరం?

1) యూఎన్‌డీపీ, 1990        2) నీతి ఆయోగ్, 1991

3) ప్రణాళికా సంఘం, 1992       4) ఐఎంఎఫ్, 1993

జ: 1


11. భారత ఆర్థిక వ్యవస్థలో కింది ఏ రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు?

1) వ్యవసాయం     2) పరిశ్రమలు      3) సేవారంగం     4) పైవన్నీ

జ: 1


12. మానవాభివృద్ధి నివేదిక (హెచ్‌డీఐ) 2021లో మొదటి స్థానంలో ఉన్న దేశం? (చివరి స్థానంలో దక్షిణ సూడాన్‌ ఉంది.)

1) స్విట్జర్లాండ్‌     2) నార్వే         3) ఆస్ట్రేలియా      4) సింగపూర్‌

జ: 1


13. ఆర్థికాభివృద్ధి సూచికగా కింది ఏ అంశాన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు?

1) తలసరి జాతీయ ఆదాయం   2) ఆర్థిక వృద్ధి     3) జీడీపీ   4) భౌతిక జీవన సూచిక

జ: 1


14. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగం?

1) తయారీ రంగం      2) సేవారంగం      3) పరిశ్రమల రంగం     4) వ్యవసాయ రంగం

జ: 2


15. భౌతిక జీవన నాణ్యత సూచీని అభివృద్ధి చేసింది?

1) అమర్త్యసేన్‌     2) డేవిడ్‌ మోరిస్‌     3) రంగరాజన్‌      4) రఘురామ్‌ రాజన్‌

జ: 2


16. మానవాభివృద్ధి సూచికను అభివృద్ధి చేయడంలో పాల్గొన్న భారత ఆర్థికవేత్త?

1) రంగరాజన్‌     2) అమర్త్యసేన్‌       3) అభిజిత్‌ బెనర్జీ     4) ఉర్జిత్‌ పటేల్‌

జ: 2


17. ఐక్యరాజ్యసమితి వర్తకం అభివృద్ధి సమావేశం (యూఎన్‌సీటీఏడీ) వర్గీకరణ ప్రకారం భారతదేశం కింది ఏ ఆర్థిక వ్యవస్థకు చెందుతుంది? (ప్రపంచ బ్యాంక్‌ వర్గీకరణ ప్రకారం భారత్‌ నిమ్న - మధ్యస్థ ఆదాయ దేశంగా ఉంటే, ఐఎంఎఫ్‌ ప్రకారం అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థగా ఉంది.)

1) అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ     2) వెనుకబడిన ఆర్థిక వ్యవస్థ

3) ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ         4) సమాఖ్య వ్యవస్థ

జ: 1


11  22  31  42  53  64  71  84  94  101  111  121  131  142  152  162  171 

Posted Date : 06-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌