• facebook
  • whatsapp
  • telegram

 భార‌త జీడీపీ వృద్ధిరేటు - తీరుతెన్నులు

కొవిడ్‌19 వ్యాప్తిని నిరోధించడానికి కేంద్రం అమలు చేసిన కారణంగా లాక్‌డౌన్‌ వల్ల భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువ బాగా క్షీణించింది. జాతీయ గణాంకాల కార్యాలయం (NSO), గణాంకాలు, కార్యక్రమాల మంత్రిత్వశాఖ నివేదిక ప్రకారం 2019 - 20 తొలి త్రైమాసికంలో స్థిర ధరల వద్ద  (2011 - 12) స్థూల దేశీయోత్పత్తి, జీడీపీ విలువ 35.35 లక్షల కోట్లుగా నమోదైంది. 2020 - 21 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (ఏప్రిల్‌ - జూన్‌) స్థిర ధరల వద్ద స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువ రూ.26.90 లక్షల కోట్లుగా ఎన్‌ఎస్‌ఓ అంచనా వేసింది. 2019 - 20 లో జీడీపీ వృద్ధిరేటు 5.2%తో పోలిస్తే, 2020 - 21లో ఏకంగా 23.9% పతనమైంది. లాక్‌డౌన్‌ నిబంధనలను ప్రభుత్వం క్రమంగా తొలగించినా ఆర్థిక కార్యకలాపాలు, సమాచార సేకరణ వ్యవస్థలపై ఆ ప్రభావం పడిందని ఎన్‌ఎస్‌ఓ తెలిపింది.

2019 - 20 లో తొలి త్రైమాసికంలో స్థిరధరల (2011 - 12) వద్ద స్థూల అదనపు విలువ (గ్రాస్‌ వాల్యూ యాడెడ్‌ - జీవీఏ) రూ.33.08 లక్షల కోట్లు కాగా 2020 - 21లో అదే కాలానికి ఈ విలువ 25.53 లక్షల కోట్లుగా నమోదైంది. అంటే జీవీఏ వృద్ధి 22.8 శాతం పతనమైంది. 

2019 - 20లో ప్రస్తుత ధరల వద్ద తొలి త్రైమాసికంలో జీడీపీ విలువ రూ.49.18 లక్షల కోట్లు కాగా, 2020 - 21లో ఈ విలువ రూ.38.08 లక్షల కోట్లుగా అంచనా వేశారు. 2019 - 20 ప్రస్తుత ధరల వద్ద జీడీపీ వృద్ధి 8.1 శాతంతో పోలిస్తే, 2020లో ఇది 22.6 శాతానికి పతనమైంది.

2019 - 20లో ప్రస్తుత ధరల వద్ద తొలి త్రైమాసికంలో జీవీఏ రూ.44.89 లక్షల కోట్లుగా నమోదైంది. 2020 - 21లో అదే విలువ రూ.35.66 లక్షల కోట్లుగా అంచనావేశారు. ప్రస్తుత ధరల వద్ద జీవీఏ వృద్ధి 20.6 శాతానికి పతనమైంది. 

రంగాల  వారీగా స్థిర ధరల వద్ద జీవీఏ తొలి త్రైమాసిక   (ఏప్రిల్‌ - జూన్‌) (2020-21) గణాంకాలు 

దేశంలో ఇప్పటికీ వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై ఆధారపడి దాదాపు 60% మంది జీవిస్తున్నారు. వ్యవసాయరంగం జీవీఏ గతేడాది  (2019 - 20) తొలి త్రైమాసికంలో 3% కాగా, ఈ ఏడాది 3.4% వృద్ధి చెందింది.

తయారీ రంగం: ఈ రంగంలో స్థూల అదనపు విలువ (జీవీఏ) వృద్ధి 39.3% క్షీణించింది. 2019 - 20 ఏప్రిల్‌ - జూన్‌లో ఇది 3% పెరిగింది.

నిర్మాణరంగ జీవీఏ 50.3%; విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా తదితర సేవల విభాగం 7% చొప్పున క్షీణించాయి. అవి గత ఏడాది (2019- 20) ఏప్రిల్‌ - జూన్‌లో వరుసగా 5.2% (నిర్మాణ రంగం), 4.7% (తయారీ రంగం, క్వారీయింగ్‌), 8.8% (విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా) చొప్పున రాణించాయి

వాణిజ్యం, హోటళ్లు, రవాణా, కమ్యూనికేషన్స్, బ్రాడ్‌ కాస్టింగ్‌ సంబంధిత సేవలు 47%; విత్తం, రియల్‌ ఎస్టేట్, వృత్తి సేవలు 5.3% మేర క్షీణించాయి. గత ఏడాది 2019 - 20 వరుసగా ఇవి 3.5%, 6% మేర రాణించాయి. 

1950 - 51 జీడీపీ గణాంకాలు అందుబాటులో ఉన్నప్పటి నుంచి  1958, 1966, 1967, 1973, 1983 ఆర్థిక సంవత్సరాల్లో ఐదుసార్లు మైనస్‌ వృద్ధి నమోదైంది. స్వాతంత్య్రానంతరం 1958, 1966, 1980లో చోటుచేసుకున్న మూడు మాంద్యాలకు ప్రధాన కారణాల్లో ఒకటి తగిన వర్షపాతం లేకపోవడం. 

ప్రైవేట్‌ అంతిమ వినియోగ వ్యయం(PFCE) 

ప్రైవేట్‌ అంతిమ వినియోగ వ్యయం అంటే ప్రజలు వివిధ రకాల వస్తు, సేవలపై చేసే ఖర్చు. గత ఏడాదిలో  (2019 - 20) స్థిర ధరల (2011 - 12) వద్ద తొలి త్రైమాసికంలో (ఏప్రిల్ ‌- జూన్‌) స్థూల దేశీయోత్పత్తిలో ప్రైవేట్‌ అంతిమ వినియోగ వ్యయం 56.4% కాగా, 2020 - 21 ఆర్థిక సంవత్సరంలో 54.3% గా ఉంది.

మాదిరి ప్రశ్నలు

1. కిందివాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి.

A) 2019 - 20 ఆర్థిక సంవత్సరంలో స్థిర ధరల (2011 - 12)  వద్ద తొలి త్రైమాసికం (ఏప్రిల్‌ - జూన్‌)లో జీడీపీ విలువ రూ.35.35 లక్షల కోట్లు, జీడీపీ వృద్ధిరేటు 5.2% శాతం.

B)  2020 - 21 ఆర్థిక సంవత్సరంలో స్థిర ధరల (2011 - 12)  వద్ద తొలి త్రైమాసికం (ఏప్రిల్‌ - జూన్‌)లో జీడీపీ విలువ రూ.26.90 లక్షల కోట్లు, జీడీపీ వృద్ధిరేటు 23.9 శాతం తగ్గింది.

C)  2019 - 20 ఆర్థిక సంవత్సరంలో స్థిర ధరల  (2011 - 12) వద్ద తొలి త్రైమాసికం (ఏప్రిల్‌ - జూన్‌)లో జీవీఏ విలువ రూ.33.08 లక్షల కోట్లు ఉండగా, జీవీఏ వృద్ధిరేటు 4.8% శాతంగా ఉంది.

D)  2020 - 21 ఆర్థిక సంవత్సరంలో స్థిర ధరల (2011 - 12) వద్ద తొలి త్రైమాసికం (ఏప్రిల్‌ - జూన్‌)లో జీవీఏ విలువ రూ.25.53 లక్షల కోట్లు ఉండగా, జీవీఏ వృద్ధిరేటు 22.8% శాతం తగ్గింది. 

1) A, B సరైనవి      2) B, C, D  సరైనవి   

3) C, D  సరైనవి      4) అన్నీ సరైనవే


2. 2019 - 20లో ప్రస్తుతధరల వద్ద తొలి త్రైమాసికం (ఏప్రిల్‌ - జూన్‌)లో మన దేశ జీడీపీ విలువ రూ. 49.18 లక్షల కోట్లు, అదే త్రైమాసికంలో ప్రస్తుతధరల వద్ద జీడీపీ వృద్ధి రేటు 8.1% శాతం. 2020 - 21లో తొలి త్రైమాసికంలో ప్రస్తుతధరల వద్ద జీడీపీ విలువ రూ.38.08 లక్షల కోట్లు కాగా, వృద్ధి రేటు ఎంత శాతానికి తగ్గింది?

1) 22.6%   2) 21.6%    3) 20.6%    4) 19.6% 

3. జాతీయ గణాంక కార్యాలయం  2020 ఆగస్టు 31 న ప్రకటించిన నివేదిక ఆధారంగా 2020-21లో స్థిరధరల (2011 -12) వద్ద తొలి త్రైమాసికం (ఏప్రిల్‌ - జూన్‌)లో మనదేశ వాస్తవ జీడీపీ వృద్ధి రేటు ఎంత శాతం క్షీణించింది?

1) 21.3%    2) 22.3%  3) 23.9%    4) 24.10%


4. జాతీయ గణాంక కార్యాలయం 2020, ఆగస్టు 31న ప్రకటించిన నివేదిక ప్రకారం 201920లో స్థిరధరల (2011 - 12) వద్ద తొలి త్రైమాసికం (ఏప్రిల్‌ - జూన్‌)లో స్థూల అదనపు విలువ (జీఏఏ)లో వ్యవసాయరంగంలో 3 శాతం వృద్ధిరేటు ఉండగా, అదే త్రైమాసికం (ఏప్రిల్‌ - జూన్‌)లో స్థిరధరల (2011) వద్ద 2020 - 21లో ఎంత శాతానికి పెరిగింది?

1) 1.1%     2) 2.2%   3) 3.3%    4) 3.4%


5. ఎన్‌ఎస్‌ఓ 2020, ఆగస్టు 31న ప్రకటించిన నివేదిక ప్రకారం 2020 - 21లో స్థిరధరల (2011 - 12) వద్ద తొలి త్రైమాసికం (ఏప్రిల్‌ - జూన్‌)లో జాతీయ తయారీరంగం వృద్ధిరేటు ఎంత శాతానికి క్షీణించింది?

1) 39.3%     2) 23.3%   3) 47%  4) 50.3%


6. 2020 - 21 ఆర్థిక సంవత్సరంలో స్థిరధరల (2011 - 12) వద్ద తొలి త్రైమాసికం (ఏప్రిల్‌ - జూన్‌)లో జీవీఏలో విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇతర సేవల వినియోగం ఎంత శాతం క్షీణించాయి?

1) 5%       2) 6%   3) 7%      4) 8%


7. 2020 - 21 ఆర్థిక సంవత్సరంలో స్థిరధరల (2011 - 12) వద్ద తొలి త్రైమాసికం (ఏప్రిల్‌ - జూన్‌)లో జీవీఏలో విత్తం, రియల్‌ ఎస్టేట్, వృత్తి సేవలు ఎంత శాతం క్షీణించాయి?

1) 5.3%    2) 4.3%    3) 2.3%  4) 6.3%


8. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎకనమిక్‌ అఫైర్స్‌ (ఆగస్టు 2020) నివేదిక ప్రకారం 2020 - 21 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్‌ - జూన్‌)లో ప్రైవేట్‌ అంతిమ వినియోగ వ్యయం (PFCE) ఎంత శాతం క్షీణించింది?

1) 26.7%    2) 27.7%    3) 28.8%   4) 29%


9. గ్లోబల్‌ ఎకనమిక్‌ ప్రాస్పెక్ట్స్‌ (వరల్డ్‌ బ్యాంక్‌ గ్రూప్‌) 2020 జూన్‌ నివేదిక ప్రకారం మన దేశ వాస్తవ స్థూల దేశీయోత్పత్తి (రియల్‌ జీడీపీ) ఎంత శాతం క్షీణిస్తుందని అంచనా వేసింది? 

1) 1.2%  2) 2.2%  3) 3.2%  4) 4.2%


10. 2014 - 19 మధ్య నమోదైన సగటు జీడీపీ వృద్ధిరేటు?

1) 5.4%    2) 6.4%  3) 7.4%   4) 8.4%

సమాధానాలు

1-4,  2-1,  3-3,  4-4,  5-1,  6-3,  7-1,  8-1,  9-3,  10-3.

స్థూల దేశీయోత్పత్తిలో వ్యయం అంచనా - తొలి త్రైమాసికం (ఏప్రిల్‌-జూన్‌) 2020 - 21 (స్థిర ధరల వద్ద)

 

జీడీపీలో వ్యయం అంచనాలు తొలి త్రైమాసికం  (ఏప్రిల్‌-జూన్‌) 2020-21 (ప్రస్తుత ధరల వద్ద)

Posted Date : 06-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌