• facebook
  • whatsapp
  • telegram

భారత ఆర్థికవ్యవస్థ లక్షణాలు

భారతదేశం స్వాతంత్య్రం సాధించి ఏడు దశాబ్దాలు దాటింది. ఐఎంఎఫ్‌ నివేదిక - 2018 ప్రకారం నామినల్‌ జీడీపీలో ఆరో పెద్ద దేశంగా అవతరించింది. విదేశీ మూలధనంలోనూ ముందంజలో ఉంది. ఇంత అభివృద్ధి సాధించినా ఇప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశంగానే గుర్తిస్తున్నారు. 

దేశాల వర్గీకరణ

రెండో ప్రపంచ యుద్ధానంతరం బ్రిటిష్‌ ప్రభుత్వం నుంచి స్వాతంత్య్రం పొందిన భారత్‌ లాంటి అనేక దేశాలు అభివృద్ధి కోసం ప్రణాళికలు ప్రారంభించిన నేపథ్యంలో పరిపాలకులు, ఆర్థిక శాస్త్రవేత్తలు ‘అభివృద్ధి’ అనే పదాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్ర]వ్యనిధి లాంటి సంస్థలు దేశాల ప్రగతికి సహాయం చేయడానికి వివిధ దేశాలను పోల్చుకునే అవసరం ఏర్పడింది. ఫలితంగా మొదట.. ప్రపంచ దేశాలను అభివృద్ధి చెందిన, వెనుకబడిన దేశాలుగా వర్గీకరించి అధ్యయనం చేశారు. ఆ తర్వాత అభివృద్ధి కొనసాగిస్తున్న మూడో రకం దేశాలను అభివృద్ధి చెందుతున్న లేదా వర్ధమాన దేశాలుగా పేర్కొన్నారు. ఈ విభజన కోసం అనేక రకాల సూచికలను ఉపయోగించారు. 

ఆర్థికవ్యవస్థ నిర్మాణంలో మార్పులు


ఏ దేశ ఆర్థిక ప్రగతి అయినా మూడు రంగాల (ప్రాథమిక, ద్వితీయ, తృతీయ)పై ఆధారపడి ఉంటుందని మొదటిసారి అలెన్‌ ఫిషర్, కొలిన్‌ క్లార్క్, జీన్‌ ఫోర్‌స్టై అనే ఆర్థికవేత్తలు ప్రతిపాదించారు. ఇదే విధానం ఇప్పటికీ అన్ని దేశాలలో అమల్లో ఉంది. వీరి ప్రతిపాదన ప్రకారం అభివృద్ధి చెందిన దేశాల్లో ఆదాయం, ఉపాధిలో ద్వితీయ, తృతీయ రంగాలు అధిక వాటాను కలిగి ఉంటాయి. దీనికి భిన్నంగా ప్రాథమిక లేదా వ్యవసాయ రంగం వెనుకబడిన దేశాల్లో ప్రధానపాత్ర పోషిస్తుంది. ఈ సూచిక ఆధారంగా 1951 నాటికి మనదేశ జనాభాలో సుమారు 80% ప్రజలు గ్రామాల్లో నివసిస్తూ వ్యవసాయంపై ఆధారపడి జీవించేవారు. ఈ రంగం నుంచే సగానికిపైగా ఆదాయం లభించేది కాబట్టి మన దేశాన్ని వెనుకబడిన దేశంగా పిలుస్తున్నారు. 

2018 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థలో వచ్చిన మార్పును పరిశీలిస్తే వ్యవసాయ రంగం శ్రామికుల్లో సగం మందికి ఉపాధి కల్పిస్తుంటే మన జాతీయాదాయంలో మాత్రం దాని వాటా గణనీయంగా తగ్గి 14.39%కి చేరింది. సేవల రంగం అతిపెద్ద రంగంగా మారి 54.15% ఆదాయాన్ని అందిస్తుంది. ఉపాధి, ఆదాయంలో వ్యవసాయేతర రంగాల వాటా పెరిగితే ఆ దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా చెప్పవచ్చు. కానీ మనదేశం ఇప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశమే.  

తలసరి ఆదాయం

ఐక్యరాజ్య సమితి నిపుణుల ప్రకారం అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, పశ్చిమ యూరప్‌ దేశాల వాస్తవ తలసరి ఆదాయం కంటే తక్కువ ఆదాయం కలిగినవన్నీ వెనుకబడిన దేశాలే. ప్రపంచ బ్యాంక్‌ కూడా తలసరి ఆదాయం ప్రామాణికంగా 1978 నుంచి దేశాల వర్గీకరణను ప్రారంభించింది. ఆయా దేశాల ప్రజల సగటు ఆదాయమైన తలసరి ఆదాయం లెక్కింపులో శాస్త్రీయత, సారుప్యత లోపించి అనేక విమర్శలు రావడంతో ప్రపంచ బ్యాంక్‌ వెనుకబడిన, అభివృద్ధి చెందిన దేశాలు అనే పదాలను పక్కన పెట్టి దేశాలను నాలుగు రకాలుగా వర్గీకరించింది. 

1)   అల్పాదాయ దేశాలు: స్థూల జాతీయ తలసరి ఆదాయం 995 డాలర్ల కంటే తక్కువ కలిగిన దేశాలు

2)  దిగువ మధ్య ఆదాయ దేశాలు: స్థూల జాతీయ తలసరి ఆదాయం 996 నుంచి 3895 డాలర్ల మధ్య

3)  ఎగువ మధ్య ఆదాయ దేశాలు: స్థూల జాతీయ తలసరి ఆదాయం 3896 నుంచి 12055 డాలర్ల మధ్య

4)  అధిక ఆదాయ దేశాలు: స్థూల జాతీయ తలసరి ఆదాయం 12056 డాలర్ల కంటే ఎక్కువుగా ఉన్న దేశాలు 

ప్రపంచ బ్యాంక్‌ నివేదికల ప్రకారం 2001 తర్వాత వివిధ దేశాల అభివృద్ధి తీరుతెన్నుల్లో మార్పులు రావడం వల్ల క్రమంగా అల్పాదాయ దేశాల సంఖ్య తగ్గి అభివృద్ధి చెందుతున్న, అధిక ఆదాయ దేశాల సంఖ్య పెరుగుతుంది. ప్రస్తుతం పది మందిలో ఒకరు మాత్రమే అల్పాదాయ దేశాల్లో జీవిస్తున్నారు. సుమారు 73 శాతం మంది ప్రజలు వర్ధమాన/మధ్య ఆదాయ దేశాల్లో ఉన్నారు.  2017 నాటికి ప్రపంచ బ్యాంక్‌ అంచనా ప్రకారం భారత స్థూల జాతీయ తలసరి ఆదాయం 1,927 డాలర్లుగా ఉండటంతో మన దేశాన్ని దిగువ మధ్య ఆదాయ దేశంగా చెప్పవచ్చు.


అభివృద్ధి సామర్థ్యం

జాకోబ్‌ వీనర్‌ లాంటి ఆర్థికవేత్తలు అభివృద్ధి సామర్థ్యం, అవకాశాల ఆధారంగా ఒక దేశ వెనుకబాటుతనాన్ని అంచనావేయడం సులభమని చెప్పారు. వీరి అభిప్రాయం ప్రకారం 1951లో ప్రణాళిక సంఘం ‘తక్కువ ఉపయోగించిన/అసలు ఉపయోగించని మానవ వనరులు, వినియోగించని సహజ వనరులను కలిగి ఉన్న దేశాన్ని వెనుకబడిన దేశం’గా నిర్వచించింది. అయితే ఇటీవల అనేక నూతన సూచికలు అందుబాటులోకి రావడంతో వివిధ దేశాల అభివృద్ధిలోని దశ దిశలను, నాణ్యతను వాటి ద్వారా అధ్యయనం చేస్తున్నారు. ముఖ్యంగా మానవాభివృద్ధి సూచిక, లింగ సాధికారత సూచిక, బహుళ పేదరిక సూచిక, యూఎన్‌వో 17 అంశాల సుస్థిరాభివృద్ధి సూచికలను ఉపయోగిస్తున్నారు. గత 70 ఏళ్ల ప్రగతిలో భారత్, చైనా లాంటి దేశాలు అల్పాదాయ దేశాల నుంచి అభివృద్ధి చెందుతున్న దేశాలుగా పరిణామం చెందాయి.


భారతదేశ ఆర్థికాభివృద్ధి లక్షణాలు

*  మన దేశంలోని సుమారు 46 కోట్ల మంది శ్రామికుల్లో సగం వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో పనిచేస్తూ తక్కువ ఆదాయంతో జీవిస్తున్నారు. మనం ఈ రంగాల్లో ఉత్పాదకతలో వెనుకబడి ఉన్నాం.

*  1951-1981 మధ్య 30 ఏళ్లపాటు జీడీపీ వృద్ధి రేటు 3.5% మాత్రమే ఉంది. 1981-2001 మధ్య 5.5%, 2001-2018 మధ్య సరాసరి 6.7% మాత్రమే సాధించగలిగాం. 

*  జనాభా పెరగడం వల్ల తలసరి ఆదాయం తక్కువగా ఉంది. పట్టణీకరణ, ఆధునికీకరణలో సేవలరంగం పాత్ర పెరుగుతుంది. 

*  దేశంలో అక్షరాస్యత 2011 నాటికి 74%కి పెరిగినప్పటికీ విద్యలో నాణ్యత లోపించింది. ఉన్నత విద్యలో స్థూల నమోదు నిష్పత్తి  అమెరికా లాంటి దేశాల్లో 80% పైగా ఉండగా మన దేశంలో 25% మాత్రమే ఉంది. 

*  ప్రపంచంలో అత్యధిక యువ జనాభా మన దేశంలో ఉన్నప్పటికీ నిరుద్యోగిత రేటు అధికంగా ఉంది. కేవలం 3% విద్యార్థులు మాత్రమే వృత్తి నైపుణ్య శిక్షణ పొందుతున్నారు. జపాన్, దక్షిణ కొరియా, చైనా దేశాల్లో ఇది 50%పైగా ఉంది.

*  విస్తారమైన అడవులు, ఖనిజాలు, నదులు, సముద్ర తీరప్రాంతం ఉన్నా వాటిని సద్వినియోగం చేసుకోవడంలో వెనుకబడి ఉన్నాం. ఇప్పటికీ మన దేశంలో 60% సాగు రుతుపవనాలపైనే ఆధారపడి ఉంది.

*  భారత్‌ లాంటి దేశాల్లో మూలధన కల్పన తక్కువగా ఉండటం వల్ల అల్ప వృద్ధి రేటు, సహజవనరుల వినియోగం తక్కువగా ఉంటుంది. 1950-51లో దేశ జీడీపీలో పొదుపు 8.9% ఉండగా ఇటీవల 30%కి చేరింది. అయితే ఆ సమయంలో మూలధన నిష్పత్తి ఎక్కువగా ఉంది. మన దేశంలో 2012-13 నుంచి 2016-17 మధ్య 6.3 - 4.0 శాతానికి తగ్గింది. దేశంలో సాంకేతిక పరిజ్ఞానం, మానవ వనరుల నాణ్యత పెరిగేకొద్దీ మూలధన నిష్పత్తి తగ్గుతుంది. అమెరికా, జపాన్‌ దేశాల్లో ఈ నిష్పత్తి ఇంకా తక్కువగా ఉండటం వల్ల తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఉత్పత్తి సాధిస్తున్నారు. 

*  రంగరాజన్‌ కమిటీ ప్రకారం 2011-12 నాటికి భారత్‌లో 29.5% మంది పేదరిక గీత కింద ఉన్నారు అంటే పది మందిలో ముగ్గురు పేదవారే. 

*  గ్రామాల్లో ప్రచ్చన్న నిరుద్యోగం ఉండగా పట్టణాల్లో చదువుకున్న యువతలో నిరుద్యోగ సమస్య రోజు రోజుకూ పెరుగుతుంది. అంతర్జాతీయ కార్మిక సంస్థ నివేదిక ప్రకారం 2014-2019 కాలానికి భారతదేశంలో నిరుద్యోగిత రేటు 3.6%గా ఉంది. గతంలో కంటే నిరుద్యోగిత రేటు పెరగడం గమనార్హం.   

*  అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ద్వంద్వ ఆర్థిక లక్షణాలు ఎక్కువ. పరస్పర విరుద్ధమైన అభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞానం, డిమాండు స్థాయులు దేశంలో కనిపిస్తాయి

ఉదా:   భారీయంత్రాలు వాడే పరిశ్రమలు - మానవ శ్రమతో కూడిన కుటీర పరిశ్రమలు.*   అభివృద్ధి చెందుతున్న దేశాల్లో విదేశీ వ్యాపార లోటు సహజంగా ఉంటుంది. ఈ దేశాల్లో అవసరాలు ఎక్కువ. మన దేశం ప్రధానంగా ఆయిల్, ఎలక్ట్రానిక్‌ యుద్ధ పరికరాలు, బంగారం దిగుమతి చేసుకుంటుంది. ఎగుమతులు పెరుగుతున్నప్పటికీ మనం వ్యవసాయ, వస్త్ర, ముడి ఖనిజాల ఉత్పత్తులపైనే ఆధారపడుతున్నాం. దిగుమతుల కంటే ఎగుమతుల విలువ తక్కువగా ఉండటం వల్ల విదేశీ వ్యాపారఖాతాలో లోటు ఉంటుంది. మానవాభివృద్ధి, సుస్థిరాభివృద్ధిలో మన దేశం మధ్య స్థాయి పనితీరును కనబరుస్తుంది.


 

Posted Date : 18-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌