• facebook
  • whatsapp
  • telegram

జాతీయ తయారీ విధానం

నిమ్జ్‌లు 

జాతీయ తయారీ విధానంలో ప్రపంచస్థాయి మౌలిక వసతులు ఉన్న గ్రీన్‌ ఫీల్డ్‌ పారిశ్రామిక టౌన్‌షిప్‌లుగా నిమ్జ్‌లను(NIMZ - National Investment  Manufacturing Zone) అభివృద్ధి చేస్తారు. ఇప్పటివరకు 14 నిమ్జ్‌లు అనుమతి పొందగా మూడు ఏర్పాటు దశలో ఉన్నాయి. అవి ప్రకాశం (ఆంధ్రప్రదేశ్‌), మెదక్‌ (తెలంగాణ), కళింగ నగర్‌ (జైపూర్‌ జిల్లా, ఒడిశా). ఈ విధానంలో కింది పరిశ్రమలకు ప్రాధాన్యం ఇస్తారు. అవి 

1. ఉపాధి సాంద్ర పరిశ్రమలు (ఉదా: టెక్స్‌టైల్స్, ఫుట్‌వేర్, ఫుడ్‌ ప్రాసెసింగ్, రత్నాలు, ఆభరణాలు) 

2. మూలధన వస్తు పరిశ్రమలు (భారీ యంత్రాలు, భారీ ఎలక్ట్రికల్‌ సామగ్రి, భారీ వాహనాలు) 

3. వ్యూహాత్మక ప్రాధాన్యం ఉన్న పరిశ్రమలు (ఐటీ హార్డ్‌వేర్, ఎలక్ట్రానిక్స్, డిఫెన్స్‌ ఎక్విప్‌మెంట్, టెలి కమ్యూనికేషన్స్, సోలార్‌ ఎనర్జీ)

4. అంతర్జాతీయ పోటీలో లబ్ధి పొందుతున్న రంగాలు (ఆటోమొబైల్స్, ఫార్మాస్యూటికల్స్‌) 

5. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు

6. ప్రభుత్వ రంగ సంస్థలు (ముఖ్యంగా రక్షణ, శక్తి రంగాలు)

ఇండస్ట్రియల్‌ కారిడార్లు 

ప్రపంచ స్థాయి మౌలిక వసతుల కల్పన ద్వారా తయారీ రంగంలో భారతదేశ పోటీతత్వాన్ని పెంచేందుకు 2007లో దిల్లీ - ముంబయి ఇండస్ట్రియల్‌ కారిడార్‌ (Delhi Mumbai Industrial Corridor - DMIC)ను కేంద్ర క్యాబినెట్‌ ఆమోదించింది. దిల్లీ నుంచి ముంబయిని అనుసంధానిస్తూ ఇండియన్‌ రైల్వేస్‌ నిర్మిస్తున్న బ్రాడ్‌ గేజ్‌ డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్‌ (Western Dedicated Freight Corridor)ను వెన్నెముకగా చేసుకుని సుస్థిర పారిశ్రామిక నగరాలను నిర్మించడం కారిడార్‌ ముఖ్య లక్ష్యం. 

    ఈ నూతన నగరాలను ఉత్తర్‌ ప్రదేశ్, హరియాణా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రల్లో నిర్మిస్తారు. డీఎంఐసీ కోసం తయారు చేసిన ప్రణాళికలో 24 ఇన్వెస్ట్‌మెంట్‌ నోడ్‌ ్బ11 ఇన్వెస్ట్‌మెంట్‌ రీజియన్లు, 13 ఇండస్ట్రియల్‌ ఏరియాలు)లను గుర్తించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా వీటిని అమలు చేస్తాయి. రాష్ట్ర ప్రభుత్వాల సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వం మొదటి దశలో ఎనిమిది నగరాలను  అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇలా మొదటిసారి భారత ప్రభుత్వం తయారీ రంగంతో కూడిన ప్రణాళికాబద్ధ పట్టణాభివృద్ధిని గ్రోత్‌ ఇంజిన్‌గా గుర్తించింది.   

  దిల్లీ ముంబయి ఇండస్ట్రియల్‌ కారిడార్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్ ‌(Delhi Mumbai Industrial Corridor Development Corporation Limited - DMICDC) అనేది డీఎంఐసీకి ఇంప్లిమెంటింగ్‌ ఏజెన్సీగా పనిచేస్తుంది. దేశంలోని అన్ని ఇండస్ట్రియల్‌ కారిడార్లను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 2016లో నేషనల్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఇంప్లిమెంటేషన్‌ ట్రస్ట్‌ (National Industrial Corridor Development and Implementation Trust - NICDIT) ను ఏర్పాటు చేసింది. 

    అంతకు ముందు డీఎంఐసీ కోసం ఏర్పాటు చేసిన ప్రాజెక్ట్‌ ఇంప్లిమెంటేషన్‌ ట్రస్ట్‌ ఫండ్‌ (DMIC n- Project Implementation Trust Fund) పేరును ఇలా మార్చారు. ఎన్‌ఐసీడీఐటీ అనేది డీఐపీపీ నియంత్రణలో పనిచేస్తుంది. ప్రతి ఇండస్ట్రియల్‌ నోడ్‌కు కంపెనీ చట్టం కింద నమోదైన ఒక స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌(SPV) ను ఏర్పాటు చేస్తారు. ఈ ఏర్పాటులో కేంద్ర ప్రభుత్వం  (NICDIT), రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడిగా పాలుపంచుకుంటాయి.

ఇతర పారిశ్రామిక కారిడార్లు 

*  చెన్నై - బెంగళూరు ఇండస్ట్రియల్‌ కారిడార్‌ (CBIC): ఈ కారిడార్‌ కింద మూడు రాష్ట్రాలు ఉన్నాయి. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక. దేశ జనాభాలో 3.7% ఈ ప్రాంతంలోనే ఉంది. తుమకూరు (తమిళనాడు), పొన్నేరి (కర్ణాటక), కృష్ణపట్నం (ఆంధ్రప్రదేశ్‌)లలో మూడు నోడ్‌లను గుర్తించారు. 

* వైజాగ్‌ - చెన్నై ఇండస్ట్రియల్‌ కారిడార్‌: కోల్‌కతా నుంచి ట్యూటికొరిన్‌ (వయా చెన్నై) వరకు ఉన్న తూర్పు తీర ప్రాంత ఆర్థిక కారిడార్‌ ్బనిదినిద్శి లో భాగంగా ఈ కారిడార్‌ను అభివృద్ధి చేశారు. ఇందులో 80% ప్రాంతం ఆంధ్రప్రదేశ్‌లో ఉంది. ఈ కారిడార్‌ అభివృద్ధికి ఆసియా అభివృద్ధి బ్యాంక్‌ (ECEC) ప్రణాళిక రూపొందించడంతో పాటు అవసరమైన రుణం కూడా అందించింది.  

* బెంగళూరు - ముంబయి ఇండస్ట్రియల్‌ కారిడార్‌ (BMIC): ఈ కారిడార్‌ కర్ణాటక, మహారాష్ట్రల్లో విస్తరించి ఉంది. కర్ణాటకలోని ధార్వాడ్, మహారాష్ట్రలోని సాంగ్లీ/ షోలాపూర్‌లను నోడ్‌లుగా గుర్తించారు.

* అమృత్‌సర్‌ - కోల్‌కతా ఇండస్ట్రియల్‌ కారిడార్‌ (AKIC): ఈస్టర్న్‌ డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్‌ ్బనిదీనీద్శిను అనుసంధానిస్తూ ఏకేఐసీని ఏడు రాష్ట్రాల్లో (పంజాబ్, హరియాణా, ఉత్తరాఖండ్, ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, ఝార్ఖండ్, పశ్చిమ్‌ బెంగాల్‌) అభివృద్ధి చేయనున్నారు. ఈడీఎఫ్‌సీ అనేది లుథియానా (పంజాబ్‌) నుంచి దంకుని (కోల్‌కతా దగ్గర, పశ్చిమ్‌ బెంగాల్‌) వరకు ఇండియన్‌ రైల్వేస్‌ నిర్మిస్తున్న బ్రాడ్‌ గేజ్‌ ఫ్రైట్‌ కారిడార్‌.


స్టార్టప్‌ ఇండియా

భారత ప్రభుత్వం సుస్థిర ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పన ఉద్దేశంతో ఆవిష్కరణలు, అంకురాలను ప్రోత్సహించేందుకు 2016, జనవరి 16న స్టార్టప్‌ ఇండియా పథకాన్ని ప్రారంభించింది. లక్ష్యాలను చేరుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. మూడు మూల స్తంభాలు, 19 కార్యాచరణ పాయింట్ల ద్వారా ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. అవి:

1. సరళీకరణ: స్టార్టప్‌ ఇండియా హబ్‌ ఏర్పాటు చేయడం, సులభంగా పేటెంట్‌ రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించడం మొదలైన ఆరు అంశాలు ఉంటాయి.

2. ఆర్థిక మద్దతు: రూ.10,000 కోట్లతో కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటు, క్రెడిట్‌ గ్యారంటీ ఫండ్‌ ఏర్పాటు చేయడం (సంవత్సరానికి రూ.500 కోట్లతో SIDBI ఆధ్వర్యంలో), పన్ను మినహాయింపులు ఇవ్వడం లాంటి ఆరు అంశాలు ఉంటాయి.

3. పరిశ్రమలు - విద్యకు మధ్య భాగస్వామ్యం, ఇంక్యూబేషన్‌: సెల్ఫ్‌ - ఎంప్లాయిమెంట్‌ అండ్‌ టాలెంట్‌ యుటిలైజేషన్‌ , అటల్‌ ఇన్నోవేషన్‌ మిషన్‌  కార్యక్రమాలను ప్రారంభించడం, జాతీయ సంస్థల్లో ఆవిష్కరణ కేంద్రాలను ఏర్పాటు చేయడం, ఐఐటీ మద్రాస్‌ మాదిరి ఏడు చోట్ల పరిశోధన పార్కులు ఏర్పాటు చేయడం లాంటి ఏడు అంశాలు ఉంటాయి. ఒక సంస్థను స్టార్టప్‌గా  పరిగణించాలంటే కింది అర్హతలు ఉండాలి.  

    1. రిజిస్ట్రేషన్‌ పూర్తయి ఐదు సంవత్సరాల లోపు గల కంపెనీల

    2. టర్నోవర్‌ రూ.25 కోట్లలోపు ఉన్న కంపెనీలు

    3. నూతన ఆవిష్కరణలు చేపట్టే కంపెనీలు. 


డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ పాలసీ అండ్‌ ప్రమోషన్‌ (DIPP) ఈ పథకాన్ని అమలు చేస్తుంది. ఈ పథకం ద్వారా భారతీయ యువత ఉద్యోగాలను కోరుకునే స్థితి నుంచి ఉద్యోగాలు సృష్టించేలా సిద్ధమవుతారు. 

2020 జనవరి నాటికి దేశంలోని స్టార్టప్‌లు 27,084. వీటిలో 55 శాతం టైర్‌-1 నగరాల్లోనే ఉన్నాయి. 43 శాతం స్టార్టప్‌లలో కనీసం ఒక మహిళా డైరెక్టర్‌ ఉన్నారు. స్టార్టప్‌లు అధికంగా ఉన్న మొదటి మూడు రాష్ట్రాలు  1. మహారాష్ట్ర  2. కర్ణాటక 3. దిల్లీ. అత్యధిక స్టార్టప్‌లు ఐటీ సేవల రంగంలో (13.9%) ఉన్నాయి. 

స్టాండ్‌ అప్‌ ఇండియా

ఈ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ 2016 ఏప్రిల్‌ 5న ప్రారంభించారు. ఎస్సీ/ఎస్టీ, మహిళల్లో ఉద్యమదారిత్వాన్ని అభివృద్ధి చేసేందుకు రూ.10 లక్షల నుంచి రూ.1 కోటి వరకు రుణాలు అందుబాటులో ఉంచేందుకు ఈ పథకాన్ని ప్రారంభించారు. ప్రతి వాణిజ్య బ్యాంకు శాఖ సంవత్సరానికి ఒక్కో కేటగిరికి ఒక్కో ప్రాజెక్టు చొప్పున కనీసం 2 ప్రాజెక్టులు మంజూరు చేయాలి. ఉద్యమదారులకు రూపే డెబిట్‌ కార్డులు జారీ చేస్తారు. రూ.10,000 కోట్లతో SIDBI ఆధ్వర్యంలో రీఫైనాన్స్‌ విండో ఏర్పాటు చేస్తారు. నేషనల్‌ క్రెడిట్‌ గ్యారంటీ ట్రస్ట్‌ కంపెనీ  (NCGTC) ఆధ్వర్యంలో రూ.5,000 కోట్లతో కార్పస్‌ ఫండ్‌ను ఏర్పాటుచేయడం ఉద్దేశం. 

ప్రధానమంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన  (నైపుణ్య భారత్‌) 

ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రధానమంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన (నైపుణ్య భారత్‌) పథకాన్ని ప్రారంభించింది. 2022 నాటికి 40 కోట్లమందిని నైపుణ్య శక్తులుగా తీర్చిదిద్దాలనేది ఈ పథకం లక్ష్యం. నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారు. దక్షిణ కొరియాలో 96%, జపాన్‌లో 80%, జర్మనీలో 75%, యూకేలో 68%  మందికి వృత్తి నైపుణ్యాలు ఉంటే భారత్‌లో కేవలం 5% మందికి మాత్రమే వృత్తి నైపుణ్యాలు ఉన్నాయి. 

నేషనల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పైప్‌లైన్‌ (NIP)

ఆర్థిక వృద్ధి సాధనకు అవస్థాపన సదుపాయాలు అత్యంత కీలకం. 2024 - 25 నాటికి అయిదు ట్రిలియన్‌ డాలర్ల జీడీపీ సాధించాలంటే భారతదేశం 1.4 ట్రిలియన్‌ డాలర్లు అంటే సుమారు రూ.100 లక్షల కోట్లు అవస్థాపన సౌకర్యాలపై వెచ్చించాలి. 2019 సెప్టెంబరులో ఇదే అంశంపై ఆర్థిక శాఖ కార్యదర్శి నేతృత్వంలో ఒక టాస్క్‌ ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ టాస్క్‌ఫోర్స్‌ 2019 డిసెంబరు 31న సమర్పించిన నివేదికలో 2020 - 25 ఆర్థిక సంవత్సరాల మధ్య రూ.102 లక్షల కోట్లు ఆర్థిక, సాంఘిక అవస్థాపన సదుపాయాలపై పెట్టుబడి పెట్టాలని నిర్దేశించింది. ఈ ఆర్థిక, సాంఘిక అవస్థాపన సదుపాయాల ప్రాజెక్టుల సమూహాన్ని నేషనల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పైప్‌లైన్‌ (NIP)అంటారు. వీటిలో శక్తి రంగం 24%, రోడ్లు 19%,  పట్టణ అవస్థాపన 16%,  రైల్వేలు 13% వాటా కలిగిఉన్నాయి. ఎన్‌ఐపీ ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టులకు నిధులు అందించడంలో సమాన వాటా (39% చొప్పున) కలిగిఉండగా, మిగిలిన 22% ప్రైవేట్‌ రంగం అందిస్తుంది. విద్యుత్‌ శక్తి (పునర్వినియోగ, అణు విద్యుత్‌తో సహా), రోడ్లు - రైల్వే - పోర్టులు - ఎయిర్‌పోర్టులు; పట్టణ అవస్థాపన , స్మార్ట్‌ సిటీలు, హౌసింగ్, జల జీవన్‌ మిషన్‌); టెలి కమ్యూనికేషన్‌; ఇరిగేషన్‌; సాంఘిక అవస్థాపన (విద్య, ఆరోగ్యం, క్రీడలు, పర్యటకం); పారిశ్రామిక అవస్థాపన (ఉక్కుతో సహా); గ్రామీణ అవస్థాపన (మంచినీరు, పారిశుద్ధ్యంతో సహా); వ్యవసాయ అవస్థాపన (ఫుడ్‌ ప్రాసెసింగ్, ప్రజా పంపిణీ వ్యవస్థతో సహా)లపై వ్యయం చేయాలన్నది లక్ష్యం. NIP కు నిధులు సమకూర్చడం అతిపెద్ద సవాలుగా ప్రభుత్వం భావిస్తోంది.

మేక్‌ ఇన్‌ ఇండియా  

పెట్టుబడుల ఆకర్షణ అనేది సంక్లిష్ట ప్రక్రియ. దీని కోసం వ్యాపారాలను సులభతరం చేయడం(Ease of Doing Business), ఎఫ్‌డీఐ సంస్కరణలు, మౌలిక వసతుల సృష్టి, కోశ ప్రోత్సాహకాలు, నైపుణ్యాభివృద్ధి లాంటి అనేక అంశాలపై దృష్టి సారించాలి. భారతదేశాన్ని పెట్టుబడుల స్వర్గధామంగా మార్చేందుకు ఈ అంశాలన్నింటిపై శ్రద్ధ చూపడానికి కేంద్రం 2014 సెప్టెంబరు 25న ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ ప్రమోషన్‌ అండ్‌ పాలసీ (DIPP) ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తుంది. కేవలం తయారీ రంగమే కాకుండా అన్ని రంగాల్లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ను అభివృద్ధి చేయడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. ఇది ప్రధానంగా నాలుగు మూలస్తంభాలపై ఆధారపడి ఉంటుంది. అవి:


(i) New Processes: ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ అభివృద్ధికి ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’ అనేది అత్యంత ముఖ్య కారకంగా గుర్తించి, వ్యాపారాన్ని సులభతరం చేసేందుకు అనేక చర్యలు చేపట్టారు. పారిశ్రామిక అనుమతులకు, ఇండస్ట్రియల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ మెమొరాండం (IEM)కు దరఖాస్తు చేసుకునేందుకు  24/7 అందుబాటులో ఉండేలా కేంద్రం వెబ్‌సైట్‌ను తీసుకొచ్చింది. పారిశ్రామిక అనుమతుల చెల్లుబాటును రెండు నుంచి మూడు సంవత్సరాలకు పెంచారు. పని గంటల విషయంలో కంపెనీలకు సౌకర్యంగా ఉండేలా, ఎక్కువమంది అప్రెంటిస్‌లను తీసుకునేందుకు వీలుగా శ్రామిక చట్టాలను సరళీకరించారు. పెట్టుబడిదారులకు సహకరించేందుకు ఇన్వెస్ట్‌ ఇండియాలో భాగంగా ఇన్వెస్టర్‌ ఫెసిలిటేషన్‌ సెల్‌ను ఏర్పాటు చేశారు. (కంపెనీ చట్టం ప్రకారం డీఐపీపీ కింద 2009లో విదేశీ పెట్టుబడిదారులకు పరిశ్రమల ఏర్పాటులో సహకరించేలా ఇన్వెస్ట్‌ ఇండియాను ప్రారంభించారు.) ముఖ్యమైన ప్రాజెక్టులకు భూసేకరణ సులభతరం చేసేందుకు ఆర్డినెన్స్‌ తెచ్చారు. రక్షణ ఉత్పత్తుల్లో అనేక వస్తువులను డీ లైసెన్సింగ్‌ చేశారు. శ్రామిక మంత్రిత్వ శాఖ ‘శ్రమ సువిధ’ అనే వెబ్‌పోర్టల్‌ను ప్రారంభించింది. ఉద్యమదారుల సందేహాలను తీర్చేందుకు www.makeinindia.com అనే వెబ్‌ పోర్టల్‌ ఏర్పాటు చేశారు. 

ii) New Infrastructure: ఇండస్ట్రియల్‌ కారిడార్లు, స్మార్ట్‌ సిటీల ద్వారా ప్రపంచ స్థాయి మౌలిక వసతులు కల్పించేందుకు కృషి జరుగుతోంది. పరిశోధన, ఆవిష్కరణలకు పెద్దపీట వేయడమే కాకుండా పరిశ్రమలకు అవసరమయ్యే నైపుణ్యం ఉన్న శ్రామికులను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తారు.

iii) New Sectors: భారత్‌ ప్రపంచానికి నేతృత్వం వహించేలా ఎదిగేందుకు అవకాశమున్న 25 రంగాలను గుర్తించారు. ఆటోమొబైల్స్, ఫార్మా, ఐటీ, రైల్వేస్, బయోటెక్నాలజీ, టెక్స్‌టైల్స్‌ మొదలైన ఈ రంగాలకు సంబంధించి ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలను రూపొందిస్తుంది. ఈ రంగాలకు ఎఫ్‌డీఐ నిబంధనలను సరళతరం చేస్తుంది.

iv) New Mindset: దేశాభివృద్ధిలో పరిశ్రమలను భాగస్వామిగా చేసేందుకు ప్రభుత్వ పాత్రను నియంత్రణకారి నుంచి ప్రోత్సాహకారిగా మార్చారు.

Posted Date : 08-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌