• facebook
  • whatsapp
  • telegram

సహజ వనరులు - అభివృద్ధి

ప్రకృతి ప్రసాదించిన సమాజ సంపద

అవసరాలకు ఉపయోగపడే వాటిని వనరులు అంటారు. భూమి, నీరు, సూర్యకాంతి,  ఇనుము, బొగ్గు, ఏదైనా ప్రాజెక్టు, చివరికి ఒక మనిషి నైపుణ్యాన్ని కూడా వనరుగా పరిగణించవచ్చు. ప్రాంతాలు, వ్యక్తులు, దేశం, ప్రపంచం అభివృద్ధికి అవి అత్యంత కీలకం. వాటిలో సమాజానికి ప్రకృతి ప్రసాదించిన సంపద అయిన సహజ వనరుల ప్రాధాన్యాన్ని, సమర్థ వినియోగాన్ని పోటీ పరీక్షల కోసం అభ్యర్థులు తెలుసుకోవాలి. 

   

ఎకానమీ పరంగా వనరులను మూడు రకాలుగా విభజించారు. అవి 1. సహజ వనరులు 2. మానవ వనరులు, 3. మూలధన వనరులు లేదా మానవ నిర్మిత వనరులు.


సహజ వనరులు: ప్రకృతిలో లభించే వనరులన్నింటినీ సహజ వనరులు లేదా ప్రకృతి వనరులు అంటారు. వీటిని మళ్లీ రెండు రకాలుగా విభజిస్తారు. 1. పునరుద్ధరించగలిగిన వనరులు 2. పునరుద్ధరించలేని వనరులు.


వస్తుసేవల ఉత్పత్తిలో ఉపయోగించే పదార్థాలు, శక్తి లాంటి వాటిని సహజ వనరుల రూపంలో వాతావరణం అందిస్తుంది. మనిషి వినియోగించే అనేక వస్తువుల ఉత్పత్తికి అవసరమైన సహజ వనరులను, వాటి భాగాలను భూమి సమకూరుస్తుంది.


1) పునరుద్ధరించగలిగిన వనరులు: అడవులు, మొక్కలు, చేపలు లాంటి వాటిని తక్కువ కాలంలోనే సహజంగా పునరుద్ధరించవచ్చు. సూర్యరశ్మి, నీరు, వాయువు లాంటి వనరులు మానవుడు ఉపయోగిస్తున్నా నిరంతరం నాణ్యత, తరుగుదల లేకుండా లభిస్తూనే ఉంటాయి. ఈ వనరుల పునరుద్ధరణ రేటు కంటే వాటి వినియోగ రేటు తక్కువ ఉన్నంతవరకు వాటిని పునరుద్ధరించవచ్చు. ఈ వనరులు రెండు రకాలు.

* పరిమితంగా పునరుద్ధరించగలిగిన వనరులు: బొగ్గు నిల్వలు, చేపల ఉత్పత్తి మొదలైనవి.

* అపరిమితంగా పునరుద్ధరించగలిగిన వనరులు: సౌరశక్తి, వాయు శక్తి


2) పునరుద్ధరించలేని వనరులు: ప్రకృతిలోని వాతావరణంలో కొన్ని వనరులను పునరుద్ధరించడానికి వీలు కాదు. ఉదా: శిలాజ ఇంధన వనరులు

* సహజ వనరుల్లో భూవనరులు, ఖనిజ వనరులు, అటవీ వనరులు, జల వనరులు ముఖ్యమైనవి.


 

భూవనరుల లభ్యత

సహజసిద్ధంగా పరిమిత పరిమాణంలో, ప్రకృతిలో లభించే అన్నివనరుల సమూహాన్ని భూవనరులు అంటారు. నేటి కాలంలో ప్రకృతిలో లభించే ఖనిజాలు, అటవీ ఉత్పత్తులు, నీరు, నేల అన్నింటినీ కలిపి భూవనరులుగా పరిగణిస్తారు. భూగోళంలోని 20% శాతం భాగంలో భూవనరులు విస్తరించి ఉన్నాయని అంచనా.

భూవనరుల ఉపయోగాలు: * వ్యక్తులకు, సమాజాలకు భూమి సంపదగా ఉపయోగపడుతుంది.

* వ్యవసాయం, అనుబంధ వృత్తులైన పాడి పరిశ్రమ, కోళ్ల పరిశ్రమ, చేపల పెంపకం లాంటి కార్యకలాపాలు భూవనరుల లభ్యతపై ఆధారపడి ఉంటాయి.

* తయారీ, పరిశ్రమల్లో ఉపయోగించే అనేక ఖనిజాలు, లోహలు, భూగర్భం నుంచే వస్తాయి.

* పెరిగే జనాభాకు ఆహారం, ఉపాధిని భూమి కల్పిస్తుంది.

* వివిధ రవాణా సౌకర్యాలకు భూమి ఉపయోగపడుతుంది.

భారతదేశంలో భూమి వినియోగం: దేశంలో భూవినియోగ తీరు వ్యవస్థాపరమైన, శామ్రికుల మూలధన లభ్యత ప్రక్రియకు సంబంధించిందని చెప్పవచ్చు.

* భారత్‌లో మొత్తం భూ విస్తీర్ణం 328 మిలియన్‌ హెక్టార్లు (ప్రపంచంలో 7వ స్థానం)

* స్థూల సాగు నేల - 200.86 మి.హె.

* నికర సాగు నేల - 141.43 మి.హె.

* వ్యవసాయానికి ఉపయోగపడని భూమి 18%

* పచ్చిక మైదానాలు 10%

* బీడు భూములు 8%

* అటవీ భూమి 23.34%

* దేశ భూభాగంలో సాగునీటి వసతి ఉన్న భూమి 45% నుంచి 47%కు పెరిగింది.

* రెండు పంటలు పండే వ్యవసాయ భూమి 23%.

భూక్షీణతకు కారణాలు: భూవనరుల క్షీణత ముఖ్యంగా వ్యవసాయ వినియోగానికి సంబంధించినది.

* అదనంగా వ్యవసాయ భూమి కోసం నరికివేయడం.

* పేలవపరమైన వ్యవసాయ పద్ధతులు అవలంబించడం ద్వారా భూకాలుష్యాన్ని పెంచి, భూసారాన్ని రక్షించలేకపోవడం.

* భారీ యంత్రాలు, పనిముట్లు ఉపయోగించి నేలను దున్ని ఎండకు వదిలేయడం.

* అవసరానికి మించి పశుసంపదను పెంచడంతో పచ్చిక బయళ్లు తగ్గడం.

* పెరుగుతున్న పట్టణీకరణ, ప్లాస్టిక్‌ వినియోగం అధికంగా పెరగడం.

గత 60 సంవత్సరాల కాలంలో భూమి క్షీణత వల్ల నీరు, గాలి భూసార కోత వల్ల భూవనరుల నాణ్యత, ఉత్పాదకత తగ్గిపోతోంది. భూమిని సమర్థంగా వినియోగించడానికి తగిన వ్యూహాన్ని రూపొందించి అమలుచేయాలి. పారిశ్రామిక, పట్టణాభివృద్ధికి ఎంత భూమిని కేటాయించాలో హేతుబద్ధంగా నిర్ణయించాలి.

ఖనిజ వనరులు 

భూమి అంతర్భాగంలో లభించే ఖనిజాలు పునరుద్ధరించలేని సహజ వనరులు. అవి భౌతిక, నిర్జీవ పదార్థాలు. కొన్ని వందల ఏళ్ల క్రితం నుంచి జరుగుతున్న భౌగోళిక ప్రక్రియల వల్ల ఖనిజాలు ఏర్పడతాయి. ఖనిజాలను మూడు రకాలుగా వర్గీకరిస్తారు.1) లోహ ఖనిజాలు  2) అలోహ ఖనిజాలు  3) ఇంధన ఖనిజాలు


లోహ ఖనిజాలు: వీటిని ఫెర్రస్, నాన్‌ఫెర్రస్‌ ఖనిజాలుగా వర్గీకరించారు.

ఫెర్రస్‌: ఇనుము క్రోమియం, మాంగనీసు, నికెల్‌ మొదలైనవి.

నాన్‌ ఫెర్రస్‌: కాపర్, లెడ్, జింక్, అల్యూమినియం.

అలోహ ఖనిజాలు: మైకా, ఆస్‌బెస్టాస్, లైమ్‌స్టోన్, జిప్సం, డోలమైట్, సోడియం, క్లేక్లోరైడ్, వజ్రాలు, బంగారం, వెండి, రత్నాలు.

ఇంధన ఖనిజాలు: బొగ్గు, లిగ్నైట్, చమురు, సహజ వాయువు, థోరియం, యురేనియం మొదలైనవి.

ఖనిజ వనరుల ఉపయోగం: * పారిశ్రామిక ముడి పదార్థాలుగా, ఇంధనాలుగా ఉపయోగపడతాయి.

* జీడీపీ వృద్ధికి ఖనిజ రంగం తోడ్పడుతుంది.

* గనుల రంగం లక్షల మందికి ఉపాధి కల్పిస్తుంది.

* విదేశీ మారక ద్రవ్య ఆర్జనకు ఉపయోగపడతాయి.

*  వెనుకబడిన రాష్ట్రాలు, ప్రాంతాలు, ఆదివాసీ ఆవాసాల వద్ద ఖనిజ వనరులు ఉంటాయి. గనుల తవ్వకం వల్ల ఈ ప్రాంతాల అభివృద్ధి జరుగుతుంది.

* మన దేశ జీడీపీలో ఖనిజాల వాటా సగటున 2% ఉంది. 2030లో ఈ వాటా 5% పెంచాలని లక్ష్యంగా ఉంది.

* మన దేశంలో 7 లక్షల మంది శ్రామికులకు గనుల రంగం ప్రత్యక్ష ఉపాధి కల్పిస్తోంది.

* మన దేశం నుంచి బాక్సైట్, మైకా వంటి అనేక ఖనిజాలు ఎగుమతి అవుతున్నాయి.

ఖనిజ వనరుల వినియోగం: ఖనిజాల ఉత్పత్తిలో ప్రపంచంలోని మొదటి పది స్థానాల్లో భారతదేశం ఉంది. దేశంలో 89 ఖనిజాలు ఉన్నట్లు గుర్తించారు.

* 2021-22లో బెరైటీస్‌ ఉత్పత్తిలో మూడవ స్థానం.

* క్వానైట్, విండల్‌ సైట్, సిల్లమనైట్‌ ఉత్పత్తిలో నాలుగో స్థానం.

* ఇనుము, స్టీలు ఉత్పత్తిలో 5వ స్థానం.

* బాక్సైట్‌ ఉత్పత్తిలో ఆరో స్థానం.

* అల్యూమినియం ఉత్పత్తిలో ఎనిమిదో స్థానం.

* పెట్రోలు ఉత్పత్తిలో భారత్‌ 25వ స్థానంలో ఉంది.

* బొగ్గు నిక్షేపాలలో ప్రపంచంలో నాలుగో స్ధానం.(దేశంలోని 98% బొగ్గు నిక్షేపాలు బిహార్, బెంగాల్, మధ్యప్రదేశ్, ఒడిశా, గోదావరి ప్రాంతాల్లో, మిలిగిన 2% అస్సాం, మేఘాలయ, నాగాలాండ్‌లో లభిస్తున్నాయి.)

* లిగ్నైట్‌ ఖనిజం తమిళనాడు, పాండిచ్చేరి, రాజస్థాన్, గుజరాత్‌లో అధికం.

* ద్రవరూప బంగారంగా భావించే పెట్రోలు నిక్షేపాలు అస్సాం, గుజరాత్‌లో ఉన్నాయి. దేశంలో 13 పెట్రోలు రిఫైనరీలున్నాయి.

* ప్రపంచ ఇనుము నిక్షేపాలలో 6.6% మన దేశంలో ఉన్నాయి.

* 2020లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని ‘సోన్‌భద్రా’ వద్ద 2,294 టన్నుల అతిపెద్ద బంగారం నిక్షేపాలను కనుక్కున్నారు.

* బంగారం ఉత్పత్తిలో 98% కర్ణాటకలోని కోలార్‌ గనుల నుంచి లభిస్తుంది.

* వెండి నిక్షేపాలు రాజస్థాన్‌లో అధికం

దేశంలో మైనింగ్‌ విధానం


1975లో మైనింగ్‌ అండ్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ రెగ్యులేషన్‌ చట్టం (MMRD) ను అమలుచేశారు. ఈ చట్టం ఖనిజ వనరులను రెండు రకాలుగా వర్గీకరించింది.

* మినరల్స్‌ (చమురు, సహజవాయువు తప్ప మిగిలిన ఖనిజాలు)

* మినరల్‌ ఆయిల్స్‌ (అన్నిరకాల చమురు, సహజ వాయువులు)

* 1988లో మినరల్‌ కన్జర్వేషన్‌ డెవలప్‌మెంట్‌ రూల్స్‌ను రూపొందించారు. 

* 1991లో నూతన ఆర్థిక విధానానికి అనుగుణంగా మైనింగ్‌ రంగంలో సరళీకరణ చేపట్టారు.

* 1999లో మైనింగ్‌ విధాన నియంత్రణలను ప్రవేశపెట్టారు.

* 2008లో జాతీయ ఖనిజ విధానం (NMP) రూపొందించారు.

* 2011లో పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో ‘మైన్స్‌ అండ్‌ మినరల్స్‌ డెవలప్‌మెంట్‌ యాక్ట్‌’గా ఆమోదించారు.

అటవీ వనరులు

అడవులు భూమి క్షీణతను నివారించి, జలవనరులను అభివృద్ధి చేస్తాయని, తద్వారా తాగునీటి సమస్య తీరుతుందని 12వ ప్రణాళిక ముసాయిదా పేర్కొంది.

* భారతీయ అటవీ నివేదిక - 2019 ప్రకారం దేశంలో మొత్తం అడవుల విస్తీర్ణం 7,12,249 చ.కి.మీ. (21.67%)

ఎ) దట్టమైన అడవులు - 99,278 చ.కి.మీ. (3.02%)

బి) మధ్యస్థ దట్టమైన అడవులు - 3,08,472 చ.కి.మీ. (9.38%)

సి) విస్తారమైన అడవులు - 3,04,499 చ.కి.మీ. (9.26%)

నోట్‌: అడవులు, చెట్లతో కలిపి అడవుల శాతం 24.56%

అటవీ విధానం - చట్టాలు

1) స్వాతంత్య్రానంతరం దేశంలో మొదటి అటవీ చట్టాన్ని 1952లో రూపొందించారు. ఈ విధానం ప్రకారం దేశ భూభాగంలో 33% అడవులు ఉండాలి. కొండలు, పీఠభూమి ప్రాంతాల్లో 60%, మైదాన ప్రాంతాల్లో 20% అడవులు ఉండాలని నిర్ణయించారు.

2) 1970లో అడవుల అభివృద్ధికి, భూమి కోత, వరదల నివారణ, కలప, పశుగ్రాసం, వంటచెరకు మొదలైన వాటికి దీర్ఘకాలిక చర్యలు చేపట్టారు.

3) 1976లో సామాజిక అడవుల పెంపకం చేపట్టాలని నిర్ణయించారు.

4) 1980లో అటవీ సంరక్షణ చట్టాన్ని ప్రవేశపెట్టారు. ఈ చట్టం వల్ల అడవుల ఆక్రమణ 1.5 లక్షల హెక్టార్ల నుంచి 16,500 హెక్టార్లకు తగ్గింది.

5) 1985లో ‘నేషనల్‌ బోర్డ్‌ ఫర్‌ అన్‌యుటిలైజ్డ్‌ ల్యాండ్స్‌’ చట్టం చేశారు. దీని ద్వారా 95 మి.హె. నిరుపయోగంగా ఉన్న భూమిలో వంటచెరకు, పశుగ్రాసం పెంచాలని నిర్ణయించారు.

6) 1992లో National Afforestation and Forest Developement Board (NAFDB) స్థాపించారు.

ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియా - 2019 ప్రకారం భారతదేశంలో అడవులను 16 రకాలుగా వర్గీకరించారు.

* అటవీ విస్తీర్ణం పెరిగిన రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, కేరళ మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. 

* పెద్ద అడవులున్న రాష్ట్రాలు: మధ్యప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌.

* మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో అధిక అడవుల వాటా ఉన్న రాష్ట్రాలు: మిజోరం (85.4%), అరుణాచల్‌ప్రదేశ్‌ (79.63%), మేఘాలయ (76.35%)

* అటవీ విస్తీర్ణం కోల్పోయిన రాష్ట్రాలు: మణిపుర్, అరుణాచల్‌ప్రదేశ్‌, మిజోరం.

* పంచవర్ష ప్రణాళికలో అడవులపై ప్రణాళిక వ్యయంలో కేవలం 0.5% - 1% మాత్రమే ఖర్చు చేశారు.

జలవనరుల లభ్యత

నీరు ఒక ముఖ్యమైన ప్రాణాధార శక్తి. ఆర్థికాభివృద్ధికి ముఖ్యమైన సాధనం. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో ప్రధాన ఉత్పత్తి కారకం. సముద్రాలు, సరస్సులు, నదులు, కాలువలు, నేలలోని తేమ, వాతావరణంలోని నీటిఆవిరి, భూగర్భ జలాల మొత్తాన్ని ధరిత్రిపై ఉన్న జలవనరులు అంటారు. భూమి ఉపరితలంపై ప్రతి చదరపు సెంటిమీటర్‌కు సుమారు 273 లీటర్లు నీరు ఉంది. అయితే ఈ మొత్తంలో కేవలం 2.8% మాత్రమే మంచి నీరు ఉందని అంచనా.

* భారత్‌లో ఏటా సగటున 4000 బీసీఎం (బిలియన్‌ క్యూబిక్‌ మీటర్‌) అవపాతం (వర్షపు నీరు + మంచు) లభిస్తుంది. ఈ అవపాతం రాజస్థాన్‌లో 110 బీసీఎం కంటే తక్కువ ఉండగా, అస్సాంలో 2400 బీసీఎం కంటే ఎక్కువ లభిస్తుంది.

* కేంద్ర జల సంఘం లెక్కల ప్రకారం 2005లో దేశంలోని నదులన్నింటి పరీవాహక ప్రాంత విస్తీర్ణం 23.25 లక్షల చదరపు కి.మీ. వీటన్నింటిలో గంగానది పరీవాహక ప్రాంతం పెద్దది. సింధూ నది పరీవాహక ప్రాంతం (12.7%) రెండో స్థానం, గోదావరి పరీవాహక ప్రాంతం (12.3%) మూడో స్థానం, కృష్ణా నది పరీవాహక ప్రాంతం (10.25%) నాలుగో స్థానంలో ఉన్నాయి. అన్ని నదీ పరీవాహక ప్రాంతాల్లో భూగర్భ జలాలు అధికంగా ఉన్నాయి. గంగానది పరీవాహక ప్రాంతంలో 41.66%, గోదావరి పరిధిలో 9.41%, సింధు నది పరిధిలో 6.13%, కృష్ణా పరీవాహక ప్రాంతంలో 6.11% భూగర్భజలాలున్నాయి.

జల సంఘం అంచనాల ప్రకారం 2025 - 2050 మధ్యకాలంలో వివిధ రంగాలకు అవసరమయ్యే జలవనరుల పరిమాణం. (బీసీఎంలలో)

* గృహ అవసరాల డిమాండ్‌: 73 - 102

* వ్యవసాయ రంగం డిమాండ్‌: 910 - 1072

* పారిశ్రామిక డిమాండ్‌: 23 - 63

* విద్యుత్‌ రంగ డిమాండ్‌: 15- 130

* ఇతర అవసరాల డిమాండ్‌: 7- 280

- 1945లో కేంద్ర జలసంఘం నాగ్‌పుర్‌లో ఏర్పాటైంది.

- 1956లో అంతర్‌రాష్ట్ర నదీ జలాల వివాద చట్టం ప్రకారం ట్రిబ్యునల్స్‌ ఏర్పాటుచేశారు.

రాష్ట్రాల మధ్య నదీజలాల వివాదాలు

* కావేరి జలాలు - తమిళనాడు, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరి 

* కృష్ణా జలాలు - ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర

* గోదావరి జలాలు - ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా, మధ్యప్రదేశ్‌

* రావి, బియాస్‌ జలాలు - పంజాబ్, హరియాణా

* యమున జలాలు - హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌

* నర్మదా జలాలు - రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర

* మహదాయి జలాలు - గోవా, కర్ణాటక, మహారాష్ట్ర

నోట్‌: కృష్ణా ట్రిబ్యునల్స్‌(2) 1969, 2004లో ఏర్పాటయ్యాయి. గోదావరి ట్రిబ్యునల్‌ 1969లో ఏర్పాటైంది.

1983లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ముఖ్యమంత్రుల మధ్య ఒప్పందం ద్వారా కృష్ణా మిగులు జలాలను తమిళనాడుకు మంచినీటి సరఫరా చేయడానికి, రాయలసీమకు సాగునీరు అందించటానికి తెలుగు గంగ ప్రాజెక్టు పథకం ప్రారంభించారు.

* మొదటి జాతీయ జలవిధానం 1987లో ప్రకటించారు. దీన్ని 2002, 2012లలో సమీక్షించి సవరణలు చేశారు.

జాతీయ జలవిధానం 2012లోని అంశాలు

నీటికి దేశ ఆర్థిక వస్తువుగా ప్రాధాన్యం కల్పించడం, ప్రైవేటు భాగస్వామ్యం కల్పించి జలవనరులను సంరక్షిస్తూ, సమర్థంగా వినియోగించడం దీనిలోని ముఖ్యాంశాలు.

* ప్రజలందరికీ కనిష్ఠ పరిమాణంలో నీరు లభించేలా చేయడం.

* వ్యవసాయ, విద్యుత్తు వినియోగంపై రాయితీని తగ్గించడం.

* జల క్రమబద్ధీకరణ అధికార వ్యవస్థను నెలకొల్పడం.

* నీటి వినియోగదారుల సంఘాలను బలోపేతం చేయడం.

* గ్రామీణ, పట్టణ నీటి సరఫరా మధ్య ఉన్న తేడాను తగ్గించడం.

* జాతీయ జలవ్యవస్థ చట్టాన్ని ప్రోత్సహించడం.

* నిర్వాసితుల కుటుంబాల పునరావాస వ్యయంలో కొంత భాగాన్ని ప్రాజెక్టుల వల్ల ప్రయోజనం పొందిన కుటుంబాల వారు భరించేలా చేయడం.


మాదిరి ప్రశ్నలు


1. కిందివాటిలో అపరిమితంగా పునరుద్ధరించగలిగే సహజ వనరు?

1) బొగ్గు      2) చేపలు      3) బంగారం      4) సౌరశక్తి


2. వ్యవసాయానికి ఉపయోగపడని భూమి ఎంత శాతం?

1) 8%       2) 18%       3) 10%       4) 20%


3. కిందివాటిలో భూవనరుల క్షీణతకు కారణం?

1) అడవులను నరికివేయడం            2) పేలవమైన వ్యవసాయ పద్ధతులు అవలంబించడం

3) అధికంగా పశుసంపద కలిగి ఉండటం         4) పైవన్నీ


4. కిందివాటిలో నాన్‌ఫెర్రస్‌ ఖనిజం కానిది? 

1) ఇనుము      2) కాపర్‌      3) జింక్‌       4) అల్యూమినియం


5. లిగ్నైట్‌ ఏ ఖనిజ సంపదకు ఉదాహరణ?

1) లోహ       2) అలోహ       3) ఇంధన       4) పైవన్నీ


6. పెట్రోల్‌ ఉత్పత్తిలో ప్రపంచంలో భారత్‌ ఏ స్థానంలో ఉంది?

1) 20వ స్థానం      2) 10వ స్థానం       3) 25వ స్థానం      4) 15వ స్థానం


7. జాతీయ ఖనిజ విధానాన్ని ఎప్పుడు అమలు చేశారు?

1) 1975        2) 2008       3) 2010         4) 2011


8. అడవులు, చెట్లతో కలిపి దేశంలో అడవుల శాతం ఎంత?

1) 21.67%      2) 24.56%      3) 25.60%       4) 33%


9. 1952 అటవీ విధానం ప్రకారం మైదాన ప్రాంతాలలో ఎంత శాతం అడవులు ఉండాలి?

1) 66%       2) 60%       3) 20%         4) 25%


10. కేంద్ర జలసంఘం లెక్కల ప్రకారం విద్యుత్‌ శక్తి కోసం నీటికి డిమాండ్‌ ఎంత?

1) 15 బీసీఎం       2) 73 బీసీఎం        3) 7 బీసీఎం       4) 63 బీసీఎం

సమాధానాలు: 1-4,   2-2,   3-4,   4-1,   5-3,   6-3,   7-2,   8-2,   9-3,   10-1.

రచయిత: ధరణి శ్రీనివాస్‌

Posted Date : 06-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌