• facebook
  • whatsapp
  • telegram

రాష్ట్ర విభజన - స్థానికత సమస్యలు

స్పష్టత లేదు.. పరిష్కారం కాదు!
​​​​​​

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం తెచ్చిన దీర్ఘకాలిక చిక్కుల్లో స్థానికత అత్యంత ప్రధానమైనది. ఇది విద్యా, ఉద్యోగ విషయాలకు సంబంధించి ఆంధ్రులపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ముఖ్యంగా సీమాంధ్ర మూలాలు ఉండి తెలంగాణలో సంవత్సరాలుగా స్థిరపడిన ఉద్యోగులు, విద్యార్థుల స్థానికతపై గందరగోళాన్ని సృష్టించింది. కేంద్రం సరైన ఏర్పాట్లు చేయకపోవడం, పరిష్కార మార్గాలను సూచించకపోవడంతో సమస్య సంక్లిష్టంగా మారింది. తర్వాత కాలంలో అనేక మార్పులు, చేర్పులు చేసినప్పటికీ, ఇప్పటికీ వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ అంశంపై పరీక్షార్థులకు సమగ్ర అవగాహన ఉండాలి. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరులను అర్థం చేసుకోవాలి. విభజన చట్టంలోని సెక్షన్లను గుర్తుంచుకోవాలి.


రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులందరికీ నాణ్యమైన ఉన్నత విద్యకు సమాన అవకాశాలు కల్పించాలని ‘ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టం’లోని సెక్షన్‌-95 చెబుతోంది. ఇందుకోసం రాజ్యాంగంలోని 371D అధికరణ కింద పేర్కొన్న మేరకు అన్ని ప్రభుత్వ లేదా ప్రైవేటు, ఎయిడెడ్, అన్‌ఎయిడెడ్‌ ఉన్నత, సాంకేతిక, వైద్య విద్యాసంస్థల్లో ప్రస్తుతం ఉన్న ప్రవేశ కోటాలు, ఉమ్మడి ప్రవేశ ప్రక్రియను పదేళ్ల కాలానికి కొనసాగించాలని చెప్పింది. అయితే దీని అమలులో తలెత్తే సమస్యలను గుర్తించడంలో నాటి కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. విభజన చట్టంలోని సెక్షన్‌-95 అమలు కోసం ఉమ్మడి ప్రవేశ ప్రక్రియకు అవసరమైన సంస్థాగత నిర్మాణాన్ని రూపొందించలేదు. అందుకు తగిన యంత్రాంగాన్ని నియమించలేదు. ఫలితంగా చాలామంది విద్యార్థులు ఇంజినీరింగ్, మెడికల్‌ కోర్సులకు ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సి వచ్చింది. ఈ నిబంధనపై స్పష్టత లేకపోవడంతో వివాదం పెరిగింది. దీనికితోడు ఉమ్మడి రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్‌ మూలాలున్నవారు విద్య, ఉపాధి కోసం హైదరాబాదు (తెలంగాణ)కు వలస వెళ్లారు. దీంతో వారికి క్రమేణా తెలంగాణ స్థానికత వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఉద్యోగులు తెలంగాణ ప్రాంతాలు/హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేయడంతో వారి పిల్లలకు కూడా తెలంగాణ స్థానికత లభించింది. విభజన తర్వాత ఇలాంటి వారి స్థానికత విషయంలో గందరగోళం, ఆందోళన నెలకొంది. దానికి సంబంధించి విభజన చట్టంలో పరిష్కారం చూపలేదు.

విద్య, ఉపాధికి సంబంధించి విభజన అనంతర చొరవలు: హైదరాబాద్‌లో  ఎన్నోసంవత్సరాలుగా నివాసం ఉంటున్న ఆంధ్రప్రదేశ్‌ మూలాలున్న ప్రజలు, ఉద్యోగులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్‌కు తరలివెళ్లడానికి కొంత సంశయించారు. ఆంధ్రప్రదేశ్‌కు తిరిగివెళితే తమ స్థానికత,  పిల్లల చదువులు, ఉద్యోగాల విషయమై తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం వారి స్థానికతపై ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని ముందస్తు భరోసా ఇచ్చింది. 2017, జూన్‌ 2 నాటికి హైదరాబాద్‌ నుంచి ఎవరైతే నవ్యాంధ్రకు తరలివస్తారో వారంతా నవ్యాంధ్ర స్థానికులుగా గుర్తింపు పొందుతారని ప్రకటించింది. దీనికి అనుగుణంగా ప్రెసిడెన్షియల్‌ ఆర్డర్‌ - 1975కి సవరణలు చేస్తూ రాష్ట్రపతి ఆమోదం కోసం పంపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ - 371D లోని క్లాజ్‌ 1, 2లో దఖలు పడిన అధికారాలకు లోబడి నాటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆ సవరణలను ఆమోదించి ఉత్తర్వులు జారీ చేశారు. ఆ తర్వాత కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ 2016, జూన్‌ 9న గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీనిలో భాగంగా ‘ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ ఎంప్లాయిమెంట్‌ (ఆర్గనైజేషన్స్‌ ఆఫ్‌ లోకల్‌ కేడర్స్‌ అండ్‌ రెగ్యులేషన్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌) ఆర్డర్‌ - 1975’, ‘ఆంధ్రప్రదేశ్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ (రెగ్యులేషన్‌ ఆఫ్‌ అడ్మిషన్స్‌) ఆర్డర్‌ - 1974’ని సవరించి ఉత్తర్వులిచ్చారు. దీనిలో భాగంగా ఆ రెండు ఉత్తర్వుల్లో మొదటి రెండు పేరాలతో పాటు అదనంగా మూడో పేరా చేర్చారు. 2014, జూన్‌ 2 నుంచి మూడు సంవత్సరాల లోపు అంటే 2017, జూన్‌ 2 లోగా తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తరలివెళ్లినవారు రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో నివాసం ఉండాలనుకుంటారో, ఆ ప్రాంతంలో స్థానికులుగా గుర్తిస్తారు. వారికి అక్కడి స్థానికులతో సమానంగా గుర్తింపు, విద్య, ఉద్యోగాల్లో స్థానికత వర్తిస్తుంది.


అనంతరం రాష్ట్రపతి ఉత్తర్వులు-1975ని 2017లో ఒకసారి సవరించారు. తెలంగాణ నుంచి ఏపీకి తరలివచ్చే వారికి స్థానికత వర్తింపును మరో రెండేళ్లకు పెంచారు. 2019లో మరోసారి సవరించి మరో రెండేళ్లు అంటే 2021, జూన్‌ 1 వరకు పొడిగించారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు మరో మూడేళ్లు (2024 జూన్‌ 1 వరకు) పెంచారు. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన జరిగి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు ఏర్పాటైన 2014, జూన్‌ 2 నుంచి 2024 జూన్‌ 1 మధ్య తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తరలివచ్చిన అందరికీ ఆంధ్రప్రదేశ్‌ స్థానికత లభిస్తుంది.


రాష్ట్ర విభజన అనంతరం ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఏపీలోని 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేసింది. జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణలో భాగంగా 26 జిల్లాలను మొత్తం 6 జోన్లు, 2 మల్టీ జోన్లుగా విభజించాలనే ప్రతిపాదనను ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగా జోన్‌-I (శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్టణం, అనకాపల్లి), జోన్‌-II (అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ), జోన్‌-III(పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా) జోన్‌-IV (గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు), జోన్‌-V (తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్‌ఆర్‌ కడప), జోన్‌-VI (నంద్యాల, అనంతపురం, కర్నూలు, శ్రీ సత్యసాయి)గా ప్రతిపాదించింది. మొదటి మూడు జోన్లను ఒక మల్టీ జోన్‌గా; 4 నుంచి 6 జోన్లను రెండో మల్టీ జోన్‌గా చేయాలని యోచిస్తోంది. ఈ మేరకు రాష్ట్రపతి ఉత్తర్వు-1975కి సవరణ ద్వారా ‘ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ ఎంప్లాయిమెంట్‌ (ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ లోకల్‌ కేడర్స్‌ అండ్‌ రెగ్యులేషన్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌) ఆర్డర్‌-1975కు మార్పులు చేయాలి. అయితే ఇది ఇంకా ప్రతిపాదన దశలోనే ఉంది.

ఉన్నత విద్యావకాశాలు - ఆర్టికల్‌ 371D : ‘రాజ్యాంగంలోని ఆర్టికల్‌ - 371D కింద పేర్కొన్న విధంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, అన్‌ ఎయిడెడ్, ఉన్నత విద్య, సాంకేతిక, వైద్య విద్య ప్రవేశ కోటాల్లో రెండు రాష్ట్రాల విద్యార్థులకు సమానావకాశాలను కల్పించడానికి పదేళ్ల పాటు ఇప్పుడున్న (విభజన నాటికి ఉన్న) ఉమ్మడి ప్రవేశ విధానాన్ని కొనసాగించాలి.’ అని విభజన చట్టం-2014లోని సెక్షన్‌-95లో పేర్కొన్నారు.


విభజన చట్టంలోని సెక్షన్‌-97లో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌-371D ని సవరించి ఆంధ్రప్రదేశ్‌’ స్థానంలో ‘ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం లేదా తెలంగాణ రాష్ట్రం’ అనే పదాలను ఆర్టికల్‌-371D మార్జిన్‌ (ఉపశీర్షిక)లో చేర్చాలని పేర్కొన్నారు. అదేవిధంగా ఆర్టికల్‌-371D లోని మొదటి క్లాజ్‌ స్థానంలో ‘ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి లేదా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి, రాష్ట్రపతి జారీచేసిన ఉత్తర్వుల ద్వారా, ఒక్కో రాష్ట్రం అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆ రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలకు ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా విషయంలోనూ సమాన అవకాశాలు, సౌకర్యాలు కల్పించాలి. ఆ రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు ప్రభుత్వ ఉద్యోగ, విద్యా విషయాల్లో వేర్వేరు నిబంధనలను చేయవచ్చు’ అని పేర్కొన్నారు. అలాగే మూడో క్లాజ్‌లో ‘ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం’ పదానికి బదులుగా ‘ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి’ అనే పదాలు చేర్చాలని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం - 2014లోని సెక్షన్‌-97లో పేర్కొన్న విధంగా రాజ్యాంగంలోని ఆర్టికల్‌-371D ని సవరించారు. ఈ సవరణలకు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనల మేరకు కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్‌-371Dకి అనుగుణంగా రాష్ట్రపతి ఉత్తర్వులు - 1975కి మార్పులు చేస్తారు. విభజన చట్టం-2014లోని సెక్షన్‌-97 ప్రకారం ఆర్టికల్‌ - 371Dలో చేసిన మార్పుల ప్రకారం ఆయా రాష్ట్రాలు తమ అవసరాలకు అనుగుణంగా మార్పులను సూచించవచ్చు.

ఆర్టికల్‌ - 371D ప్రాముఖ్యత: వెనుకబాటుతనం, తక్కువ అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు ప్రత్యేక సౌకర్యాలు/అవకాశాలు కల్పించడానికి భారత రాజ్యాంగంలో ఆర్టికల్‌-371ని చేర్చారు. ఈ క్రమంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రత్యేక అవసరాల కోసం భారత రాజ్యాంగంలో 371D ఏర్పాటు చేశారు. 1956, నవంబరు 1న ఆంధ్రప్రదేశ్‌ అవతరణ అనంతరం 1969లో జరిగిన జై తెలంగాణ ఉద్యమం, 197273లో సంభవించిన జై ఆంధ్ర ఉద్యమంలో తొలిసారిగా స్థానికత అంశం కీలకంగా మారింది. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ సమైక్యతను కాపాడటానికి 1973లో భారత ప్రభుత్వం ‘ఆరు సూత్రాల పథకం’ను రూపొందించింది. ఈ పథకానికి రాజ్యాంగ భద్రత కల్పించడానికి 32వ రాజ్యాంగ సవరణ చట్టం చేశారు. ఇది 1974, జులై 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ రాజ్యాంగ సవరణ చట్టంలో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విద్య, ఉద్యోగాల విషయంలో అన్నిప్రాంతాల వారికి సమాన అవకాశాలు కల్పించడం, రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు, సీనియారిటీ, పదోన్నతులకు సంబంధించిన వివాదాలను పరిష్కరించడం కోసం ఒక పరిపాలనా ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేయడం లాంటి అంశాలతో ఆర్టికల్‌-371D భారత రాజ్యాంగంలో చేర్చారు. అలాగే కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో స్థాపించడం కోసం ఆర్టికల్‌-371D ని పొందుపరిచారు.


ఆర్టికల్‌ - 371Dలోని క్లాజ్‌ 1, 2 ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లోని ప్రజలకు విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాలు కల్పించడం కోసం అవసరమైన ఉత్తర్వులను ఎప్పటికప్పుడు జారీ చేసే అధికారాన్ని రాష్ట్రపతికి ఇచ్చారు.


ఆర్టికల్‌ - 371D ద్వారా లభించిన అధికారం ప్రకారం విద్యకు సంబంధించి 1974, జులై 1 న ‘ఆంధ్రప్రదేశ్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ (రెగ్యులేషన్‌ ఆఫ్‌ అడ్మిషన్స్‌) ఆర్డర్‌-1974’ పేరుతో భారత ప్రభుత్వం నోటిఫికేషన్‌ నంబర్‌ జి.ఎస్‌.ఆర్‌. 299 (E) ద్వారా ఉత్తర్వు జారీచేసింది. దీనిని తర్వాత అవసరాలకు అనుగుణంగా సవరిస్తూ వస్తున్నారు. అలాగే ఉద్యోగావకాశాలకు సంబంధించి 1975, అక్టోబరు 18న ‘‘ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ ఎంప్లాయిమెంట్‌ (ఆర్గనేషన్‌ ఆఫ్‌ లోకల్‌ కేడర్స్‌ అండ్‌ రెగ్యులేషన్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌) ఆర్డర్‌-1975’’ పేరుతో భారత ప్రభుత్వం నోటిఫికేషన్‌ నంబర్‌ జి.ఎస్‌.ఆర్‌.524 (E) ద్వారా ఉత్తర్వు జారీ చేసింది. దీనిని కూడా సవరిస్తూ వచ్చారు. వీటినే రాష్ట్రపతి ఉత్తర్వు లేదా ప్రెసిడెన్షియల్‌ ఆర్డర్‌ అని పేర్కొంటారు. విద్య, ఉపాధికి సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు ఉమ్మడి రాష్ట్రంలో ఉత్తర్వులు జారీ చేశారు. విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల అభ్యర్థన మేరకు ప్రెసిడెన్షియల్‌ ఆర్డర్‌కు సవరణలు చేస్తూ వస్తున్నారు.


 

రచయిత: వి.కరుణ       

Posted Date : 24-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌