• facebook
  • whatsapp
  • telegram

సుస్థిరాభివృద్ధి - పర్యావరణం

ఏ దేశమైనా ఆర్థికంగా ఎదగాలంటే పర్యావరణంలో లభించే సహజవనరులే కీలకం. ప్రస్తుత మానవులు వాటిని ఉపయోగించుకుంటూ, తర్వాతి తరాలకు అందించడాన్ని సుస్థిరాభివృద్ధి అంటారు. పర్యావరణం, ఆర్థిక వ్యవస్థ ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. అందుకే పర్యావరణాన్ని కాపాడుకుంటూనే సుస్థిరాభివృద్ధి కోసం కృషిచేయాలి. 

పర్యావరణం

పర్యావరణం అనే భావనలో జీవ, నిర్జీవ అంశాలు ఉంటాయి. జీవ అంశాల్లో మొక్కలు, పక్షులు, జంతువులు మొదలైనవి ఉంటే; నిర్జీవ అంశాల్లో గాలి, నీరు, భూమి తదితరాలు  ఉంటాయి. వీటి మధ్య ఉన్న పరస్పర సంబంధాన్ని అధ్యయనం చేయడమే పర్యావరణశాస్త్ర ముఖ్య ఉద్దేశం.


విధులు: పర్యావరణం ప్రధానంగా 4 ముఖ్యమైన విధులను నిర్వహిస్తుంది.

* ఇది పునరుత్పాదకం అయ్యే, కాని వనరులను సరఫరా చేస్తుంది. పునరుత్పాదక వనరులకు అడవుల్లోని చెట్లు, మహాసముద్రాల్లోని చేపలు మొదలైనవి ఉదాహరణలు. పునరుత్పాదకంకాని వనరులకు ఉదాహరణ శిలాజ ఇంధనాలు. 

* ఇది వ్యర్థాలను తనలో కలుపుకుంటుంది.
* జెనెటిక్, జీవ వైవిధ్యాన్ని అందించడం ద్వారా జీవ మనుగడను కొనసాగిస్తుంది.


విపత్తు: ఎలాంటి ఆటంకాలు లేనప్పుడు పర్యావరణం తన విధులను సమర్థంగా నిర్వహిస్తుంది. అయితే మానవ తప్పిదాలతో విపత్తులు సంభవించి జీవమనుగడే ప్రశ్నార్థకమవుతోంది. 


కారణాలు: 

* సహజ వనరుల పునరుత్పాదక రేటు కంటే వాటి వెలికితీత రేటు అధికంగా ఉండటం.

* ప్రకృతి తనలో కలుపుకోగల సామర్థ్యానికి మించి వ్యర్థాల ఉత్పత్తి జరుగుతుండటం. పునరుత్పాదకం అయ్యే, కాని శక్తి వనరులను పెద్ద ఎత్తున వెలికి తీయడం వల్ల వాటిలో కొన్ని పూర్తిగా అంతరించి పోయాయి. వాటికి ప్రత్యామ్నాయం కోసం శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. దీనికోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది. వీటితో పాటు పర్యావరణ క్షీణత కారణంగా గాలి, నీటి వనరుల్లో నాణ్యత తగ్గి ప్రజలు అనారోగ్యంబారిన పడుతున్నారు. ఫలితంగా ఆరోగ్యం మీద చేసే వ్యయం పెరిగిపోతోంది. గ్లోబల్‌ వార్మింగ్, ఓజోన్‌ పోర క్షీణత లాంటి పర్యావరణ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది. పర్యావరణం ప్రతికూల ప్రభావాలతో ఖర్చులు అధికమయ్యాయి. 

మూలం: పారిశ్రామిక విప్లవానికి ముందు వనరుల సరఫరా కంటే డిమాండ్‌ తక్కువగా ఉండేది. ఫలితంగా పునఃసృష్టి ద్వారా వనరుల సమతౌల్యానికి వీలుండేది. ఆవరణ వ్యవస్థలో వ్యర్థాలు తక్కువగా ఉండేవి. పారిశ్రామిక విప్లవం, జనాభా పెరుగుదల వల్ల వనరులకు డిమాండ్‌ పెరిగింది. పర్యావరణంలో వ్యర్థాలు పెరిగి అనేక సమస్యలు ఆవిర్భవించాయి.

గ్లోబల్‌ వార్మింగ్‌ 

భూవాతావరణంలో గ్రీన్‌ హౌస్‌ వాయువులు పెరిగిపోయి, భూమి సగటు ఉష్ణోగ్రతలు అధికం కావడాన్ని గ్లోబల్‌ వార్మింగ్‌ అంటారు. శిలాజ ఇంధనాల వాడకం, అడవులు నరకడం మొదలైన మానవ చర్యల వల్ల గాలిలో  CO2, మీథేన్‌ లాంటి గ్రీన్‌హౌస్‌  వాయువులు ఎక్కువయ్యాయి. వీటికి ఉష్ణాన్ని గ్రహించే సామర్థ్యం ఉంటుంది. దీంతో భూఉపరితలం వేడెక్కుతోంది. గత వందేళ్లలో భూఉపరితల ఉష్ణోగ్రతలు 1.1°F (0.6°C) పెరిగాయి. దీంతో ధ్రువప్రాంతాల్లో మంచు కరిగిపోయి, సముద్ర మట్టం పెరిగింది. 

ఓజోన్‌ పొర క్షీణత: స్ట్రాటో ఆవరణంలో ఉండే క్లోరిన్, బ్రోమిన్‌ సంబంధ పదార్థాల వల్ల ఓజోన్‌ పొర క్షీణిస్తోంది. రిఫ్రిజిరేటర్లు, ఎయిర్‌ కండిషనర్ల నుంచి వెలువడే క్లోరోఫ్లోరోకార్బన్లు (CFC), బ్రోమోఫ్లోరోకార్బన్లు  (Halons) వాతావరణంలో చేరి క్లోరిన్, బ్రోమిన్‌ పదార్థాలుగా మారుతున్నాయి. 

* అంటార్కిటికా ప్రాంతంలో ఓజోన్‌ పొర అధికంగా దెబ్బతిన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీని క్షీణత వల్ల సూర్యుడి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలు నేరుగా భూమిపై పడి, మానవుల్లో అనేక వ్యాధులకు కారణమవుతున్నాయి. జలాశయాల్లో ఫొటోప్లాంక్టన్‌ (నాచు)ల ఉత్పత్తి తగ్గి, జలచరాలను ప్రభావితం చేస్తోంది. 

* ఓజోన్‌ పొరను కాపాడేందుకు మాంట్రియల్‌ ప్రొటోకాల్‌ను తీసుకొచ్చారు. దీని ప్రకారం  CFC, కార్బన్‌ టెట్రాక్లోరైడ్, ట్రైక్లోరోఈథేన్‌ (మిథైల్‌ క్లోరోఫాం) లాంటి రసాయనాల వాడకాన్ని ప్రపంచవ్యాప్తంగా నిషేధించారు. CFCకి ప్రత్యామ్నాయంగా వాడుతున్న HFC (హైడ్రోఫ్లోరోకార్బన్‌)లు కూడా ఓజోన్‌ పొరకు హాని కలిగిస్తున్నట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 

* ఓజోన్‌ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఏటా సెప్టెంబరు 16న నిర్వహిస్తున్నారు.

భారతదేశ పర్యావరణ పరిస్థితి 

భారతదేశంలో పర్యావరణం రెండు కారణాల వల్ల క్షీణిస్తోంది. అవి: 

1. పేదరికం    2. పారిశ్రామికాభివృద్ధి


పేదరికం: దేశంలో అనేకమంది ప్రజలు తమకు లభించిన సహజ వనరులను (ఉదా: వంట చెరకు) అధికంగా వినియోగిస్తున్నారు. దీనివల్ల పర్యావరణం కలుషితం అవుతోంది. పేద వర్గాల ప్రజలు తమ మనుగడ కోసం పర్యావరణంపైనే అధికంగా అధారపడుతున్నారు. దీంతో వారికి తగినంత ఆహారం, ఆరోగ్యదాయక జీవన ప్రమాణాలు లభించడంలేదు. ఈ విధంగా పర్యావరణం, పేదరికం ఒకదానికొకటి అంతర సంబంధాన్ని కలిగిఉన్నాయి. పేదరికం పర్యావరణంపై అధికంగా ఒత్తిడి కలగజేస్తుంటే, పర్యావరణ సమస్యలు పేదలపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతున్నాయి.   


పారిశ్రామికాభివృద్ధి: దీనివల్ల పర్యావరణ కాలుష్యం నానాటికీ ఎక్కువవుతోంది. ప్రస్తుతం మన దేశంలో ప్రధానంగా వాయు, నీటి కాలుష్యాలు; మృత్తికా క్రమక్షయం; అటవీ నిర్మూలన; జీవవైవిధ్యం దెబ్బతినడం లాంటి అనేక అంశాలు పర్యావరణ సమస్యలుగా ఉన్నాయి.


మృత్తికా క్షీణతకు కారణాలు

* అటవీ నిర్మూలన.

* వంటచెరకు, పశుగ్రాసం సేకరణ 

* పోడువ్యవసాయం  నీ అడవుల్లో కార్చిచ్చు

* మృత్తికా సంరక్షణ చర్యలు చేపట్టకపోవడం 

* ఎరువులు, పురుగుమందుల అధిక వినియోగం 

* సాగునీటి వ్యవస్థల నిర్వహణలో సరైన  ప్రణాళిక లోపించడం

* భూగర్భ జలాలను అధికంగా తోడెయ్యడం 

* వ్యవసాయం, ఇళ్లు, పరిశ్రమల కోసం పరిమితంగా ఉన్న భూమిపై ఒత్తిడి కలిగించడం వల్ల మృత్తికా క్షీణత ఏర్పడుతుంది.
  మన దేశంలో తలసరి అటవీ భూమి 0.08 హెక్టార్లుగా ఉంది. మనిషి కనీస అవసరాలు తీర్చాలంటే అది 0.47 హెక్టార్లుగా ఉండాలి. మన దేశంలో ఏడాదికి 5.3 బిలియన్‌ టన్నుల మృత్తికా క్రమక్షయం జరుగుతోందని శాస్త్రవేత్తల అంచనా. దీనివల్ల భూమిలోని NPK పోషకాలను అధిక మొత్తంలో కోల్పోతున్నాం.


వాయు కాలుష్యం 

మన దేశంలో వాయు కాలుష్యం పట్టణ ప్రాంతాల్లో; పరిశ్రమలు, థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు ఉన్నచోట అధికంగా ఉంటోంది. నగరాల్లో నివసించే 80% మందికి వ్యక్తిగత వాహనాలు ఉన్నాయి. వీటి సంచారం ఎక్కువగా ఉండటంతో అక్కడ గాలి కలుషితం అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా మొదటి 10 పారిశ్రామిక దేశాల్లో భారత్‌ ఒకటిగా నిలిచింది. దీంతోపాటు పర్యావరణ కాలుష్యం, ప్రణాళిక లేని పట్టణీకరణ, ప్రమాదాలకు అవకాశం లాంటి అంశల్లోనూ మనం ముందున్నాం.

నీటి కాలుష్యం

 భారత్‌లో నీటి కాలుష్యాన్ని అరికట్టేందుకు 1974లో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలిని, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలిని ఏర్పాటుచేశారు. మురుగు నీరు, పారిశ్రామిక వ్యర్థాల విడుదలకు ఇవి ప్రమాణాలను నిర్దేశిస్తాయి. ఈ సంస్థలు కాలుష్య నివారణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సాంకేతిక సలహాలు అందిస్తాయి.
 

సుస్థిరాభివృద్ధి 

పర్యావరణ సంరక్షణ, దాని అభివృద్ధి కోసం 1992లో ‘పర్యావరణం - అభివృద్ధి’ అనే అంశంపై ఐక్యరాజ్య సమితి సమావేశం (UNCED - United Nations Conference on Environment and Development) జరిగింది. ఇందులో ‘‘భవిష్యత్తు తరాలవారు తమ అవసరాలను తీర్చుకోగలిగే సామర్థ్యాన్ని దెబ్బతీయకుండా, ప్రస్తుత తరాల వారి అవసరాలను తీర్చే అభివృద్ధినే సుస్థిరాభివృద్ధి’’గా  నిర్వచించారు. 

* ‘‘భవిష్యత్తు తరాలవారికి భూగ్రహాన్ని మంచిగా అందించాల్సిన నైతిక బాధ్యత ప్రస్తుత తరాల వారిపై ఉంది’’ అని నార్వే మాజీ ప్రధాని హార్లెం బ్రంట్‌లాండ్‌ పేర్కొన్నారు. 

* సుస్థిరాభివృద్ధి సాధించాలంటే కింది చర్యలు చేపట్టాలని పర్యావరణ ఆర్థికవేత్త హెర్నన్‌ డేలీ పేర్కొన్నారు.

* సముద్రంలో ప్రయాణించే నౌకలో అది మోయగలిగే సామర్థ్యం మేరకే ప్రజలను ఎక్కిస్తారు. అలాగే, పర్యావరణం భరించగల పరిమితులలోపు మాత్రమే మానవ జనాభా ఉండాలి.

* ఉత్పాదకాలను సమర్థవంతంగా వాడే సాంకేతిక ప్రగతి కావాలి.

* పునరుత్పాదక శక్తి వనరులను సుస్థిరంగా ఉపయోగించాలి. అంటే వీటి వెలికితీత వాటి పునఃసృష్టి కంటే తక్కువగా ఉండాలి.

* పునరుత్పాదకం కాని శక్తి వనరుల తగ్గుదల రేటు ప్రత్యామ్నాయ శక్తి వనరుల ఉత్పత్తి రేటు కంటే ఎక్కువగా ఉండకూడదు.

* కాలుష్యం వల్ల పర్యావరణానికి కలిగిన నష్టాలను సరిచేయాలి.


సుస్థిరాభివృద్ధి కోసం వ్యూహాలు 

సంప్రదాయేతర ఇంధన వనరుల వాడకం: భారతదేశం థర్మల్, జలవిద్యుత్‌పై అధికంగా ఆధారపడుతోంది. ఈ రెండూ పర్యావరణంపై దుష్ప్రభావాన్ని కలిగిస్తున్నాయి. థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు గ్రీన్‌హౌస్‌ వాయువు CO2తో పాటు బూడిద (fly ash)ను పర్యావరణంలోకి విడుదల చేస్తున్నాయి. బూడిదను సరిగ్గా వినియోగించకపోతే భూమి, నీటి కాలుష్యానికి దారితీస్తుంది. జల విద్యుత్‌ కేంద్రాల నిర్మాణానికి పెద్దఎత్తున అడవులను నిర్మూలిస్తున్నారు. ఈ పరిమితుల నేపథ్యంలో పవన, సౌర శక్తి లాంటి సంప్రదాయేతర ఇంధన వనరులను అధికంగా వినియోగించాలి.

గ్రామీణ ప్రాంతాల్లో గోబర్‌ గ్యాస్, ఎల్‌పీజీని ఉపయోగించడం: గ్రామీణ ప్రాంతాల్లో వంట చెరకునే ఇంధనంగా ఉపయోగిస్తున్నారు. దీనివల్ల గాలి కలుషితమవుతోంది. దీనికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ఆయా ప్రాంతాల్లో సబ్సిడీతో కూడిన ఎల్‌పీజీని అందించాలి. ప్రజలు గోబర్‌ గ్యాస్‌ ప్లాంట్‌లు ఏర్పాటుచేసుకునేందకు రాయితీలు, రుణాలు అందించాలి.

పట్టణ ప్రాంతాల్లో సీఎన్‌జీ వాడకం: కంప్రెస్డ్‌ నేచురల్‌ గ్యాస్‌ (సీఎన్‌జీ)లో అధిక పీడనం వద్ద మీథేన్‌ను నిల్వ చేస్తారు. పెట్రోల్, డీజిల్‌తో పోలిస్తే ఇది తక్కువ కాలుష్యకారకాలను విడుదల చేస్తుంది. దిల్లీ ప్రజా రవాణా వ్యవస్థలో సీఎన్‌జీ వాహనాల వాడకం వల్ల అక్కడ వాయు కాలుష్యం చాలా వరకు తగ్గింది. 

చిన్నతరహా జల విద్యుత్‌ కేంద్రాల ఏర్పాటు: పర్వత ప్రాంతాల్లో నిరంతరం ప్రవహించే ప్రవాహాల శక్తిని విద్యుత్‌ శక్తిగా మార్చేందుకు చిన్నతరహా జల విద్యుత్‌ కేంద్రాలను ఏర్పాటుచేయాలి. ఇవి స్థానిక అవసరాలకు తగ్గట్టు శక్తిని సరఫరా చేస్తాయి.

సంప్రదాయ విజ్ఞానం, పద్ధతులు:  పూర్వం భారతీయులు పర్యావరణంలో భాగంగా జీవించేవారు. వివిధ రకాల వృక్షజాతుల నుంచి మూలికలు తయారుచేసి వాటిని వైద్యంలో వాడేవారు. భారత్‌లో పాశ్చాత్య వైద్య విధానం వచ్చాక మన సంప్రదాయ పద్ధతులైన ఆయుర్వేదం, యునాని మొదలైనవి అడుగున పడిపోయాయి. మళ్లీ వీటిని ఆచరించాల్సిన అవసరం ఏర్పడింది.

బయో కంపోస్టింగ్‌: వ్యవసాయ ఉత్పత్తులను పెంచే ఉద్దేశంతో గత 5 దశాబ్దాలుగా కంపోస్ట్‌ వాడకం తగ్గించి రసాయనిక ఎరువుల వినియోగాన్ని పెంచారు. దీంతో గాలి, నీరు, నేల కాలుష్యానికి గురయ్యాయి. వానపాములు సులభంగా సేంద్రీయ పదార్థాన్ని కంపోస్ట్‌గా మార్చగలవు. కాబట్టి రైతులు  బయో కంపోస్టింగ్‌ పద్ధతులు అనుసరించేలా చర్యలు చేపట్టాలి

బయోపెస్ట్‌ కంట్రోలింగ్‌: రసాయన పురుగు మందుల వినియోగం పెరగడం వల్ల భూమి, జల వనరులు పూర్తిగా కలుషితమయ్యాయి. వాటి అవశేషాలు ఆహార ఉత్పత్తుల్లో చేరడం వల్ల మానవ ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపిస్తోంది. ఈ సమస్యకు పరిష్కారంగా వేప లాంటి వృక్ష ఉత్పత్తులను పెస్టిసైడ్లుగా ఉపయోగించాలి. మిశ్రమ వ్యవసాయం, పంటల మార్పిడి పద్ధతులను అవలంబించాలి

Posted Date : 06-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌