• facebook
  • whatsapp
  • telegram

1991లో భారతదేశ ఆర్థిక వ్యవస్థ

భారత్‌ నేడు ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి రేటు ఉన్న దేశంగా గుర్తింపు పొందింది. దీనికి కారణం మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తన పాలనాకాలంలో ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలే. 1991 జులైలో పీవీ అప్పటి ఆర్థికమంత్రి మన్మోహన్‌ సింగ్‌తో కలిసి దేశ ఆర్థికాభివృద్ధికి వ్యూహాలు రచించారు. వీటినే రావు - మన్మోహన్‌ అభివృద్ధి నమూనాగా పిలుస్తారు. భారతదేశం తన అభివృద్ధి ప్రస్థానంలో అనేక ఎత్తుపల్లాలు, సామాజిక, రాజకీయ, ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొంది. 

1991లో భారత్‌లో తీవ్ర ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. ఈ సమయంలోనే ఆర్థిక సంస్కరణల ప్రాధాన్యాన్ని గుర్తించి, వాటిని ప్రవేశపెట్టారు. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. మన ఆర్థిక వ్యవస్థను విపత్కర పరిస్థ్థితుల నుంచి బయటపడేయడానికి ఈ సంస్కరణలను అత్యవసర శస్త్రచికిత్సలాగా ఉపయోగించారా? లేక అంతర్జాతీయ ద్రవ్యనిధి లాంటి సంస్థల ఒత్తిడి, ఆదేశాల ఫలితమా? లాంటి ప్రశ్నలకు సమాధానాలు లభించాలంటే 1991 ముందు భారత్‌తోపాటు ప్రపంచ స్థితిగతులు, పరిణామాలను పరిశీలించాలి.


1991 నాటి ఆర్థిక సంక్షోభం 

స్వాతంత్య్రానంతరం మన దేశం అనేక ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్నా వాటిని ఆర్థిక సంక్షోభంగా ఎప్పుడూ పరిగణించలేదు. 199091లో మాత్రం పరిస్థితులు చేయిదాటి దేశ ఆర్థిక నిర్వహణ సంక్షోభంలో పడింది. ఇది ప్రపంచ వేదికలపై చర్చలకు దారితీసింది. మన ఆర్థిక భద్రత ప్రశ్నార్థకమైంది.


నిర్వచనం: దేశ అవసరాలు, దిగుమతులకు లేదా పాత అప్పులు చెల్లించేందుకు ప్రభుత్వం వద్ద తగినన్ని సొంత నిధులు లేకపోవడం వల్ల వచ్చే సమస్యనే ఆర్థిక సంక్షోభం అంటారు. 1991 నాటి ఆర్థిక సంక్షోభం ప్రధానంగా రెండు రకాల లోటుల సంచిత (Cumulative) ఫలితంగా తలెత్తింది.

1) దేశీయ విత్త లోటు (Fiscal deficit) 

2) విదేశీ వ్యాపార లోటు (Current account deficit)


విదేశీ వ్యాపార లోటు   విత్త లోటు  ఆర్థిక సంక్షోభం


విత్త లోటు 

కేంద్ర ప్రభుత్వ సంవత్సర ఆదాయం కంటే వ్యయాలు ఎక్కువైనప్పుడు, ఆ లోటును దేశీయ రుణాలతో భర్తీచేయడాన్ని విత్తలోటు అంటారు. దీనివల్ల ప్రభుత్వంపై అప్పులు, వడ్డీల భారం పెరిగి క్రమంగా రుణ చెల్లింపు సామర్థ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది. రుణ ఊబిలో కూరుకుపోవచ్చు.


విదేశీ వ్యాపార లోటు

ఒక దేశం ఇతర దేశాలకు వస్తుసేవల ఎగుమతుల ద్వారా ఆదాయం పొందుతుంది. దిగుమతుల ద్వారా వ్యయాలు చేస్తుంది. దీన్నే విదేశీ చెల్లింపుల శేషం అంటారు. ఎగుమతుల కంటే  దిగుమతులు ఎక్కువగా ఉన్నప్పుడు ఆదాయాలకంటే వ్యయాలు ఎక్కువవుతాయి. అప్పుడు దిగుమతులకు చెల్లించడానికి తగినంత విదేశీ కరెన్సీ లేక అప్పులు చేయాల్సి వస్తుంది. దీన్నే విదేశీ వర్తక లోటు అంటారు. ఈ రెండు లోటుల్లో ఏ ఒక్కటి ఉన్నా దాన్ని చాలావరకు అధిగమించవచ్చు. ఇవి అనేక అంతర్గత, బహిర్గత అంశాలపై ఆధారపడి ఉంటాయి. ఒకదాన్ని మరొకటి ప్రభావితం చేస్తాయి. 1991లో ఈ రెండూ ఒకేసారి అధికస్థాయిలో మన దేశంలో సంభవించాయి. వాటి ప్రభావం అన్ని రంగాలపై పడి,  ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారింది. దీంతో సంస్కరణలు తప్పనిసరి అయ్యాయి.  


స్వదేశీ పరిస్థితులు

1980 దశాబ్దంలో దేశ స్థూల ఆర్థిక నిర్వహణ గాడి తప్పింది. విత్తలోటు, విదేశీ వర్తకలోటు, అధిక ద్రవ్యోల్బణం లాంటి సమస్యలు ఎక్కువయ్యాయి. 198182 లో దేశ జీడీపీలో విత్తలోటు 5.1 శాతం ఉంది. 1991 నాటికి అది 7.8 శాతానికి పెరిగింది. 198589 మధ్య ఇది సగటున 10 శాతంగా ఉంది. దీనివల్ల స్వదేశీ అప్పులు దేశ ఆదాయంలో సుమారు 49.7 శాతానికి చేరాయి. ఇది భరించరాని భారంగా పరిణమించింది. కేంద్ర ప్రభుత్వ రాబడిలో 39 శాతం నిధులు వడ్డీ చెల్లింపులకే ఖర్చు చేయాల్సి వచ్చింది. ఇది ఇలాగే కొనసాగితే దేశం అపుల ఊబిలోకి జారుకునే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించారు. 

* 80వ దశాబ్దంలో దేశంలో ప్రభుత్వ వ్యయాలు గతంలో కంటే పెరిగాయి. ఇది మంచి పరిణామమే. అయితే ఆ పెరుగుదలకు కావాల్సిన నిధులు సొంత రాబడి లేదా పొదుపుల నుంచి సమకూరాలి. కానీ అలా జరగలేదు. అప్పు చేసి, ఖర్చు పెట్టారు.

* భారత్‌లో రెవెన్యూ ఖాతాలో అభివృద్ధియేతర వ్యయాలు విపరీతంగా పెరిగాయి. దీంతో విత్తలోటు అధికమైంది. దేశంలో ఓటుబ్యాంకు రాజకీయాలు ప్రారంభమై సంక్షేమ పథకాలు, ఉచిత సబ్సిడీలకు కేటాయింపులు పెరిగాయి. పన్ను మినహాయింపులు ఎక్కువై వసూళ్లు తగినంతగా జరగలేదు.

* అనేక ప్రభుత్వ కంపెనీలు నిర్వహణ సామర్థ్యం కొరవడి, నష్టాల్లో కూరుకుపోయాయి. ఆ భారం అంతా బడ్జెట్లపై పడింది. ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, వడ్డీ చెల్లింపులు, రక్షణ వ్యయాలు ఏటేటా పెరుగుతూ వచ్చాయి.

* పెరుగుతున్న బడ్జెట్‌ లోటును పూడ్చటానికి ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి, ఇతర వాణిజ్య సంస్థల నుంచి రుణాలు తీసుకున్నారు. దేశీయంగా ప్రభుత్వ రుణాలు పెరగడంతో ఆమేరకు ప్రైవేటు రంగానికి నిధుల కొరత ఏర్పడింది. కొత్త కరెన్సీ ముద్రణ చేయడం వల్ల దేశంలో ద్రవ్య సప్లై, వస్తువుల డిమాండ్‌ పెరిగి, క్రమంగా ద్యవ్యోల్బణానికి దారితీసింది. వినియోగదారుల సూచిక ప్రకారం 1991లో ద్రవ్యోల్బణం 11.2 శాతానికి పెరిగింది. దీంతో ప్రజలకు జీవనభారం అధికమైంది.

* 80 దశాబ్దం మధ్య నుంచి దేశంలో ఇంతకాలం సాగిన నిర్బంధ  ప్రణాళిక వ్యవస్థపై  విమర్శలు ప్రారంభమయ్యాయి. విదేశీ పెట్టుబడులు, వ్యాపారాలను సరళీకరిస్తూ రాజీవ్‌గాంధీ స్వల్ప మార్పులు తెచ్చారు. తర్వాత వచ్చిన ప్రధానులు వి.పి.సింగ్, చంద్రశేఖర్‌ వాటిని కొనసాగించారు.

* రాజీవ్‌గాంధీ మంత్రివర్గంలో ఆర్థిక శాఖ నిర్వహించిన వి.పి.సింగ్‌ సరళీకృత పారిశ్రామిక విధానాలను ప్రవేశపెట్టారు. తాను ప్రధాని అయ్యాక వాటిని ఇంకా పెంచారు. ఈయన హయాంలో పారిశ్రామిక మంత్రిగా ఉన్న అజిత్‌ సింగ్‌ (మాజీ ప్రధాని చరణ్‌సింగ్‌ కుమారుడు)ఈ విధానాలను ప్రోత్సహించారు. 1990 నాటికి ఆర్థిక సంస్కరణల వాదిగా గుర్తింపు పొందడానికి, పెట్టుబడుల ఆకర్షణకు వి.పి.సింగ్‌ ప్రయత్నించారు.

* క్రమంగా 1990 నాటికి గత ప్రభుత్వాలు చేపట్టిన విధానాలతో విభేదిస్తూ, తర్వాత వచ్చిన ప్రధానులందరూ సరళీకృత ప్రైవేటు పెట్టుబడిదారీ విధానాన్ని ప్రోత్సహించారు. అప్పటికే అధికారులు, నాయకుల్లో ఈ మార్పులు, సంస్కరణలపై ఏకాభిప్రాయం కుదిరినట్లుగా భావించవచ్చు. దీన్నే నూతన పారిశ్రామిక విధానం-1990 అని పిలిచారు.

* ప్రధానిగా స్వల్పకాలం పనిచేసిన చంద్రశేఖర్‌ (నవంబరు 1990 - జూన్‌ 1991) దేశ చరిత్రలో మొదటిసారి పారిశ్రామిక శాఖను తనవద్దే ఉంచుకున్నారు. ఆ రంగంలోని సంస్కరణలను స్వయంగా పర్యవేక్షించేందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సంప్రదాయాన్ని తర్వాతి ప్రధాని పీవీ నరసింహారావు కొనసాగించారు.

* రాజీవ్‌గాంధీ నుంచి పీవీ నరసింహారావు వరకు ఒకే ఆర్థిక నిపుణుల బృందం నూతన ఆర్థిక విధానాలకు రూపకల్పన చేసింది.  వీరిలో కొంతమందికి పశ్చిమ దేశాలతో అకడమిక్‌ సంబంధాలు ఉన్నాయి. కొందరు మంత్రులు రాజీవ్‌గాంధీ నుంచి పీవీ వరకు  కేబినెట్‌లో పనిచేశారు. ఈ పరిణామాలు సరళీకరణ ఆర్థిక విధానాల పట్ల ఒక ఉమ్మడి ఏకాభిప్రాయం, కార్యాచరణ ఏర్పడటానికి దోహదం చేశాయి.

* పీవీ నరసింహారావు మంత్రివర్గంలో ఆర్థికశాఖ మంత్రిగా పనిచేసిన మన్మోహన్‌ సింగ్‌ ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టారు.  అంతకుముందు మాజీ ప్రధాని చంద్రశేఖర్‌ వద్ద సీనియర్‌ ఆర్థిక సలహాదారుగా పనిచేసిన అనుభవంతో భారతదేశ ఆర్థిక పరిస్థితులపై మన్మోహన్‌సింగ్‌కు స్పష్టమైన అవగాహన ఏర్పడింది.

* రాజీవ్‌గాంధీ తర్వాత దేశంలో అన్నీ సంకీర్ణ ప్రభుత్వాలే అధికారంలోకి వచ్చాయి.  దీంతో రాజకీయ అనైక్యత, మండల్‌-మందిర్‌ సమస్య మొదలైన కారణాల వల్ల బలమైన ఆర్థిక సంస్కరణలు అమలు చేయడంలో విఫలమయ్యాయి. కానీ పీవీ నరసింహారావు వాటన్నింటినీ అధిగమించి సంస్కరణలను అమలు చేశారు.


విదేశీ పరిస్థితులు

విదేశాల్లో చోటుచేసుకున్న కొన్ని సంఘటనలు కూడా భారతదేశం ఆర్థిక సంస్కరణల వైపు మొగ్గు చూపడానికి ప్రేరేపించాయి.

* నాటి సోవియట్‌ రష్యా అంతర్గత కారణాలతో విచ్ఛిన్నం కావడంతో, ఆర్థికంగా బలహీనపడింది. దీంతో మనదేశానికి అంతవరకు చేస్తున్న ఆర్థిక, రక్షణ సహాయాలు తగ్గాయి. ప్రత్యామ్నాయ దేశాల సహాయం కోసం అన్వేషణ ప్రారంభించాల్సి వచ్చింది. 

* ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్ట్, సామ్యవాద విధానాలపై విశ్వాసం సన్నగిల్లింది. బలమైన కమ్యూనిస్ట్‌ దేశమైన చైనా 1978 నుంచే ఆర్థిక సంస్కరణలు మొదలుపెట్టి, మార్కెట్‌ ఆధారిత విదేశీ పెట్టుబడులను ఆకర్షించింది.

* అప్పటి ఇంగ్లండ్‌ ప్రధాని మార్గరెట్‌ థాచర్‌ ప్రయివేటీకరణను, రష్యా అధ్యక్షుడు గోర్బచేవ్‌ సోషల్‌ డెమోక్రసీ విధానాలను అవలంబించారు. ఇవి వ్యక్తి స్వేచ్ఛను, ప్రైవేటు రంగాన్ని బలపరిచాయి. అమెరికా పెట్టుబడిదారీ విధానాలతో అభివృద్ధిలో అగ్రగామిగా నిలిచింది. ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి లాంటి అంతర్జాతీయ సంస్థల్లో మెజారిటీ వాటాను సాధించి ప్రాబల్యం పెంచుకుంది.

* మరోవైపు సింగపూర్, తైవాన్, దక్షిణ కొరియా, హాంకాంగ్‌ దేశాలు అప్పటికే సరళీకృత ఆర్థిక విధానాలు అమలుచేసి పారిశ్రామికంగా అభివృద్ధి సాధించి భారత్‌ సహా అభివృద్ధిచెందుతున్న దేశాల దృష్టిని ఆకర్షించాయి.

* 1970వ దశాబ్దం చివర్లో లాటిన్‌ అమెరికా దేశాలు రుణ చెల్లింపుల ఎగవేత సమస్యలు ఎదుర్కొని, చెడ్డపేరు తెచ్చుకున్నాయి. దీంతో విదేశీ రుణదాతలు అప్పులు ఇవ్వడానికి ప్రత్యామ్నాయ దేశం కోసం వెతకసాగారు. ఈ అవకాశాన్ని మన ప్రభుత్వాలు, కంపెనీలు ఉపయోగించుకుని, విదేశీ రుణాలను పొందాయి. ముఖ్యంగా జపాన్‌ నుంచి ఎక్కువ మొత్తంలో అప్పు సమకూరింది.

* దేశంలో 1976 నుంచే మాధ్యమిక మూలధన వస్తు దిగుమతులను సులభతరం చేశారు. కానీ మన ఎగుమతులు పెరగలేదు. అలాగే రాజకీయ కారణాల వల్ల విదేశీ సహాయాలు కూడా తగ్గుతూ వచ్చాయి. అయినా, విదేశీ రుణాలతో మన విత్త లోటును భర్తీ చేయడానికి ప్రయత్నాలు కొనసాగాయి. ఫలితంగా వడ్డీల భారం పెరిగింది. 

* 1990 నాటికి వడ్డీలకు చెల్లించే వ్యయం మన దేశ రక్షణ లేదా సబ్సిడీల వ్యయం కంటే ఎక్కువగా ఉంది.

* దేశ అభివృద్ధి కోసం 1980లోనే అంతర్జాతీయ ద్రవ్యనిధి (International Monetary Fund) నుంచి నిధుల రూపంలో సహాయం పొందాం. అప్పటి నుంచి మనం వారి ఆదేశాలు, సలహాలను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాటిస్తూ వస్తున్నాం.

* దేశంలో విదేశీ చెల్లింపుల సమస్య 80 దశాబ్దంలో పెరిగింది. దిగుమతులను సులభతరం చేయడం, ఎగుమతులు ఆశించినంతగా పెరగకపోవడం వల్ల విదేశీ వ్యాపారంలో ఆదాయం కంటే వ్యయాలు పెరిగి వ్యాపారలోటు ఏర్పడింది. 

* సంకీర్ణ ప్రభుత్వాల పాలనలో ఏర్పడిన అనిశ్చితి వల్ల ఎన్‌ఆర్‌ఐలకు దేశీయ మార్కెట్లపై విశ్వాసం సన్నగిల్లి తమ డిపాజిట్లను వెనక్కి తీసుకున్నారు. ఫలితంగా విదేశీమారక నిల్వలు తగ్గిపోతూ వచ్చాయి. ఈ లోటును భర్తీ చేయడానికి విదేశీ రుణాలు పెంచుకోవాల్సి వచ్చింది.

* 1991 నాటికి కరెంటు ఖాతాలో లోటు దేశీయ ఆదాయంలో 3.69 శాతానికి పెరిగింది. దీనివల్ల విదేశీ అప్పులు మన రాబడిలో 26 శాతానికి చేరాయి. ఇది నాటి భారతదేశ ఆర్థిక స్థితి ప్రకారం మోయలేని భారం. దీనిలో దాదాపు సగం అప్పులు ప్రభుత్వ రంగానివే.

* ముఖ్యంగా దేశంలో పెట్టుబడులు - పొదుపుల మధ్య సమతౌల్యం పాటించడంలో చోటుచేసుకున్న వైఫల్యం కారణంగా, ఆ లోటును భర్తీ చేయడానికి ఎక్కువ వడ్డీకి అప్పులు చేయాల్సివచ్చింది. విదేశాల నుంచి దిగుమతులకు సమానంగా ఎగుమతులు పెరగకపోవడం విదేశీ చెల్లింపుల సమస్యకు బీజం వేసింది.

* మన కరెన్సీ విలువ అధికంగా ఉండటం, విలువ తగ్గించడానికి పాలకులు సమ్మతించకపోవడం వల్ల విదేశీ వ్యాపారంలో మన ఎగుమతులు, రాబడులు పెరగలేదు.

* మరోవైపు 1990 నాటి గల్ఫ్‌ సంక్షోభం వల్ల ఆయిల్‌ ధరలు విపరీతంగా పెరిగాయి. భారతదేశం డాలర్ల రూపంలో అధికంగా చెల్లించాల్సి వచ్చింది. దీంతో దిగుమతుల భారం పెరిగింది.

* ఇది ఇలాగే కొనసాగితే ఇకముందు చెల్లింపులకు విదేశీమారక నిల్వలు పూర్తిగా కరిగిపోతాయని నిపుణులు హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా భారతదేశ పరపతి రేటు పడిపోతుంది. అదే జరిగితే విదేశీ రుణాలు లభించవు. అధిక వడ్డీలు చెల్లించాల్సి వస్తుంది. ఈ పరిస్థితినే విదేశీ చెల్లింపుల సంక్షోభం అంటారు.

* ఈ స్థితి నుంచి బయటపడటానికి నాటి చంద్రశేఖర్‌ ప్రభుత్వం 1991 మేలో 20 టన్నుల బంగారాన్ని జ్యూరిచ్‌ (స్విట్జర్లాండ్‌) నగరంలో విక్రయించడం ద్వారా, 240 మిలియన్‌ డాలర్ల నిధులు సమకూర్చుకుంది. 

* 1991 జూన్‌ నాటికి విదేశీమారక నిల్వలు ఒక బిలియన్‌ డాలర్‌ లోపునకు పడిపోయాయి. 1991 జులైలో మరో 47 టన్నుల బంగారాన్ని బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ దగ్గర కుదువపెట్టి, చెల్లింపులు జరిపారు.

* అయితే, ఈ సంక్షోభం అప్పటికప్పుడు పుట్టుకొచ్చింది కాదు. దశాబ్దాల స్వదేశీ, విదేశీ అంశాలు, రాజకీయ,  పాలనాపరమైన కారణాలు ఈ పరిస్థితికి దారితీశాయి. 

* లాంటి విపత్కరమైన ఆర్థిక సంక్షోభ సమయంలో కేంద్రంలో 1991 జులైలో పి.వి. నరసింహారావు నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఆయన ప్రధానిగా ఉన్న సమయంలోనే స్వదేశీ, విదేశీ పరిస్థితుల ప్రభావంతో ఆర్థిక సంస్కరణలకు అంకురార్పణ చేశారు. కొద్దికాలంలోనే ఆర్థిక సంక్షోభ ప్రమాదం నుంచి దేశాన్ని రక్షించడమే కాక భావి భారత ఆర్థిక ప్రగతికి కావలసిన సరికొత్త పునాదులు వేశారు.

Posted Date : 06-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌