• facebook
  • whatsapp
  • telegram

వ్యవసాయ రంగం - సంస్కరణలు

భారతదేశ ఆర్థికాభివృద్ధికి వ్యవసాయ రంగం ‘వెన్నెముక’ లాంటిది. దేశ ఆర్థిక వ్యవస్థలోని మూడు రంగాల్లో వ్యవసాయ రంగాన్ని ‘ప్రాథమిక రంగం’గా పేర్కొంటారు. మన దేశ వ్యవసాయ రంగంలో ప్రధానంగా వ్యవసాయం, అడవులు, చేపలు పట్టడం, గనులు, క్వారీయింగ్‌ మొదలైన ఉప రంగాలు ఉంటాయి. వ్యవసాయ రంగ పనితీరు దేశ ఆర్థికాభివృద్ధిని ప్రభావితం చేస్తుంది.

*  ‘నీతి ఆయోగ్‌ స్ట్రాటజీ ఫర్‌ న్యూ ఇండియా జీ 75 నివేదిక’ ప్రకారం భారతదేశంలో మొత్తం పని సామర్థ్యం (Total work force) 52 కోట్లు. వ్యవసాయం ద్వారా ఉపాధి పొందుతున్న వారు దాదాపు 49% కాగా, స్థూల అదనపు విలువ (జీవీఏ)లో ఈ రంగం వాటా 15% ఉంది. భారత ప్రభుత్వం మొదటి పంచవర్ష ప్రణాళికలో (1951 - 56) వ్యవసాయాభివృద్ధికి అధిక ప్రాధాన్యం కల్పించి వివిధ కార్యక్రమాలను అమలు చేసింది. 

స్వయం సమృద్ధ ప్యాకేజ్‌

2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలని కేంద్రప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా వ్యవసాయ మౌలిక సదుపాయాలకు రూ.లక్ష కోట్లు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగానికి రూ.10,000 కోట్లు, తేనెటీగల పెంపకానికి రూ.500 కోట్లు కేటాయించింది.  

*  వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధికి కేంద్ర కేబినెట్‌ 2020 జులై 8న ఆమోదం తెలపగా, ఆగస్టు 9న ప్రారంభించారు. ఈ పథకం కింద ప్రభుత్వం నాలుగేళ్లలో రూ.లక్ష కోట్లు ఖర్చు చేయనుంది. ఈ కేటాయింపుల్లో రూ.10,000 కోట్లు 2020 - 21లో, ఆ తర్వాత మూడేళ్లలో ఏడాదికి రూ.30 వేల కోట్ల చొప్పున ఖర్చు చేస్తారు. 

* రూ.2 కోట్ల వరకు రుణానికి 2 శాతం రిబేట్‌ ఇస్తారు. వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పన, వ్యవసాయ పరపతి సంఘాలు, రైతు ఉత్పత్తి సంఘాలు, వ్యవసాయాధార వ్యాపారులు, పంట నూర్పిడి అనంతర సహాయం ఇందులో ఉంటాయి. 

వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి

ఇది మధ్యకాల, దీర్ఘకాల రుణ సహాయ సదుపాయ పథకం. పంట దిగుబడి అనంతర వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ - నిర్వహణా సదుపాయాల ఏర్పాటులో పెట్టుబడికి, సమూహ వ్యవసాయ ఆస్తులను సమకూర్చుకోవడానికి రుణ సదుపాయం కల్పిస్తారు.

* వడ్డీలో కొంత భాగాన్ని ప్రభుత్వమే చెల్లించే పద్ధతి (ఇంట్రెస్ట్‌ సబ్‌వెన్షన్‌) క్రెడిట్‌ గ్యారంటీ ద్వారా ఈ పథకం కింద రుణం అందిస్తారు.

* ఈ పథకం గడువు 2020 నుంచి 2029వ వరకూ ఉంటుంది.

* ఈ పథకం కింద బ్యాంకులు, ఆర్థిక సంస్థలు లక్ష కోట్ల రూపాయల మేర రుణాలు అందిస్తాయి. సంవత్సరానికి 3% ఇంట్రెస్ట్‌ సబ్‌వెన్షన్, సి.జి.టి.ఎం.ఎస్‌.ఇ. పథకం కింద క్రెడిట్‌ గ్యారెంటీ పద్ధతిలో గరిష్ఠంగా 2 కోట్ల రూపాయల వరకూ రుణాలు ఇస్తారు. 

* సామాజిక, సమూహ వ్యవసాయ సదుపాయాలను, పంట దిగుబడి అనంతరం వ్యవసాయ మౌలిక సదుపాయాలను సమకూర్చే కృషిలో భాగంగా, రైతులకు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు వ్యవసాయ ఉత్పత్తి సంఘాలకు ఈ పథకం అండగా ఉంటుంది.

* రైతులు తమ ఉత్పత్తులను నిల్వచేసి, ఎక్కువ ధరకు విక్రయించగలుగుతారు.  వృథాను తగ్గించడానికి, అదనపు విలువ పొందడానికి కూడా వీలుంటుంది.

* ఈ పథకాన్ని ఆమోదించిన 30 రోజుల్లో 2,280కి పైగా వ్యవసాయ ఉత్పాదక సంఘాలకు రూ.1000 కోట్లు విడుదలయ్యాయి.  

* పీఎం కిసాన్‌ పథకం కింద ఎనిమిదిన్నర కోట్ల మంది రైతులకు ఆరో విడతగా రూ.17 వేల కోట్లను విడుదల చేశారు. ఈ పథకానికి సంబంధించిన నగదు ప్రయోజనాన్ని ఆధార్‌తో అనుసంధానించిన రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా బదిలీ అయ్యాయి. ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ 10 కోట్ల మందికి పైగా రైతులు రూ.90 వేల కోట్ల నగదు ప్రయోజనం పొందారు.

* వ్యవసాయ ఉత్పాదనలకు మరింత ఎక్కువ ధర లభించేందుకు ఈ పథకం కింద గోదాములు నిర్మిస్తారు. గ్రేడింగ్, సార్టింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేస్తారు. 

కిసాన్‌ రైలు

కేంద్రం ప్రభుత్వం 2020 ఆగస్టు 7న నూతనంగా ప్రారంభించిన మొదటి కిసాన్‌ రైలు మహారాష్ట్రలోని దేవలాలీ నుంచి బిహార్‌లోని దానాపూర్‌ వరకు ప్రయాణిస్తుంది. ఇది నాసిక్‌ రోడ్డు, మన్మాడ్, జలగావ్, భుసవాల్, బుర్హాన్‌పూర్, ఖండ్వా, ఇటార్సీ, జబల్‌పూర్, కాట్నీ, సాత్నా, మణిక్‌పూర్, ప్రయాగ్‌రాజ్, చెవోకీ, పండిట్‌ దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ్‌ నగర్, బక్సర్‌ స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుంది. 

* అనంతపురం - దిల్లీ మధ్య కిసాన్‌ రైలును ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి 2020 సెప్టెంబరు 9న తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పచ్చజెండా ఊపి ప్రారంభించారు. దీన్ని ఉద్యాన ఉత్పత్తుల రవాణాకు ప్రవేశపెట్టారు. 322 టన్నుల పండ్లను అనంతపురం నుంచి దిల్లీలోని ఆజాద్‌పూర్‌ మండీకి రవాణా చేశారు. ఈ కిసాన్‌ రైలు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మొదటిది కాగా, దేశంలో రెండోది.

ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి 

2019 ఫిబ్రవరి 24న ప్రారంభమైన పీఎం కిసాన్‌ పథకం కింద అర్హులైన రైతులకు సంవత్సరానికి రూ.6,000 చొప్పున నగదు బదిలీ చేస్తారు. రైతులకు కొన్ని మినహాయింపులకు లోబడి ఈ ప్రయోజనం అందుతుంది. రైతులు వ్యవసాయ సంబంధమైన అవసరాలకు, కుటుంబానికి చేదోడుగా దీన్ని ఉపయోగించుకోవాలి. 

* కర్జ్‌ మాఫీ మార్గాన్ని అనుసరించిన యూపీఏ ప్రభుత్వం రూ.72,000 కోట్ల రైతుల రుణాన్ని మాఫీ చేసింది. ప్రస్తుత ఎన్‌డీఏ ప్రభుత్వం రుణంతో సంబంధం లేని కర్జ్‌ ముక్తి పద్ధతిని అమలు చేసింది. 

ఇతర అంశాలు

* ఉత్పత్తి: కొవిడ్‌-19 సంక్షోభం ఉన్నప్పటికీ వ్యవసాయ రంగంలో 295.67 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి జరగవచ్చని అంచనా. అంటే 3.7 శాతం అధికం. 2019 - 20లో ఇది 2.9 శాతంగా నమోదైంది. పండ్లు, కూరగాయల ఉత్పత్తి 52% మేర పెరిగింది. ఖరీఫ్‌లో విత్తిన ప్రదేశం 13.92 శాతం పెరిగింది. వరి సాగుబడిలో పెరుగుదల 19.04%. ఆర్గానిక్‌ ఉత్పత్తుల ఎగుమతులు 2020 జులై వరకు 78% పెరిగాయి.

* ఆదాయం: రైతుల ఆదాయం 20% నుంచి 68 శాతం వరకు పెరిగింది.

* స్టార్టప్‌: యువతలో ఉపాధి, రైతుల ఆదాయం పెంచటానికి 346 వ్యవసాయ సంబంధ స్టార్టప్స్‌ సంస్థలకు రూ.3,671.75 లక్షల నిధి ద్వారా సాయం అందుతోంది.

* ఉద్యానవనరంగం: గత 5 ఏళ్లలో ఉద్యానవనరంగంలో రూ.10,500 కోట్లు పెట్టుబడి పెట్టగా 8.83 లక్షల మంది రైతులకు కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది.

* నీటిపారుదల: సూక్ష్మ నీటిపారుదల ద్వారా నీటి వాడకం పెరిగింది. నీటిపారుదల మీద ఖర్చు 50% తగ్గింది. ఎరువుల బదులు వేప పూత పూసిన ఎరువుల వాడకం పెరిగింది.

* సంప్రదాయ వ్యవసాయ అభివృద్ధి: సేంద్రియ వ్యవసాయం కింద దాదాపు 6 లక్షల హెక్టార్లలో పంటలు సాగు చేస్తున్నారు. అదనంగా 25 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సేంద్రియ వ్యవసాయం చేపట్టేందుకు పథకం సిద్ధం చేశారు. 

కనీస మద్దతు ధరలు 

రైతులకు తమ పంట ఉత్పత్తుల అమ్మకంపై భరోసా కల్పించేందుకు మార్కెట్లోకి రాకముందే వివిధ వ్యవసాయ ఉత్పత్తులకు ప్రభుత్వం కనిష్ఠ ధరలను ప్రకటిస్తుంది. వీటినే ‘కనీస మద్దతు ధరలు’(Minimum
Support Prices) అని కూడా అంటారు. 

* మన దేశంలో కేంద్ర గిడ్డంగుల సంస్థను (సీడబ్ల్యూసీ) 1957 లో ఏర్పాటు చేశారు. 

* ఎల్‌.కె.ఝా సూచనల ప్రకారం కేంద్ర ప్రభుత్వం 1965లో వ్యవసాయ ధరల కమిషన్‌ (ఎ.పి.సి.), భారత ఆహార సంస్థ (FCI) ను నెలకొల్పింది. 

* రాష్ట్ర ప్రభుత్వాలు ‘రాష్ట్ర గిడ్డంగుల సంస్థ’ (ఎస్‌డబ్ల్యూసీ)లను ఏర్పాటు చేశాయి.

* వ్యవసాయ ధరల కమిషన్‌ను 1985లో ‘వ్యవసాయ వ్యయాల ధరల కమిషన్‌’గా (Commission for Agricultural Costs and Prices మార్చారు. 

* వ్యవసాయ వ్యయాల ధరల కమిషన్‌ (సీఏసీపీ) ప్రధాన లక్ష్యం వ్యవసాయ ఉత్పతులైన వరి, గోధుమ, జొన్న, సజ్జ, మొక్కజొన్న, పప్పుధాన్యాలు, చెరకు, నూనెగింజలు, పత్తి, జనుము మొదలైనవాటి ధరల నిర్ణయంపై ప్రభుత్వానికి సూచనలు ఇవ్వడం.

* రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి ప్రభుత్వం మద్దతు ధరను ఖర్చుకు ఒకటిన్నర రెట్లు చేసింది. 

* 2014 - 19 మధ్య 1870 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాలను సేకరించి రూ.4.34 లక్షల కోట్లు చెల్లించింది. 

* 2009 - 14 మధ్య కాలంలో 1670 లక్షల మెట్రిక్‌ టన్నులకు ప్రభుత్వం చెల్లించిన మొత్తం రూ. 2.88 లక్షల కోట్లు

* కనీస మద్దతు ధరను నిర్ణయించడంలో ప్రభుత్వం ఎం.ఎస్‌.స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులను అమలు చేసింది


 

Posted Date : 08-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌