• facebook
  • whatsapp
  • telegram

ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక విధానాలు

సమాజంలోని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ‘నవరత్నాలు’ పేరుతో అనేక కార్యక్రమాలను అమలు చేస్తోంది. వాటి ప్రయోజనాలు, అర్హతలు, అమలుతీరు మొదలైన వాటి గురించి పరీక్షార్థులకు అవగాహన అవసరం.

వైఎస్సార్‌ రైతు భరోసా

* 2019, అక్టోబరు 15న ఈ పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులు, కౌలు రైతులకు పంటకాలంలో పెట్టుబడి అవసరాలకు నగదు సాయాన్ని అందించడం దీని లక్ష్యం.

* దీని ద్వారా రైతుకు ఏడాదికి రూ.13,500 ఆర్థిక సాయం మూడు విడతల్లో అందుతుంది. ఈ సొమ్ముతో రైతులు నాణ్యమైన వ్యవసాయ ఉత్పాదకాలను కొనుగోలు చేసి, అధిక దిగుబడులు పొందుతారని ప్రభుత్వం భావిస్తోంది.

* 201920 రబీ సీజన్‌ నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చింది.

ముఖ్యాంశాలు:

* కేంద్రం పీఎం కిసాన్‌ ద్వారా అందించే రూ.6000 ఈ పథకంలో విలీనం చేశారు.

* మొదటి వాయిదా రూ.7500 మేలో (పీఎం కిసాన్‌ కింద రూ.2000).

* రెండో వాయిదా రూ.4000 అక్టోబరులో (పీఎం కిసాన్‌ కింద రూ.2000).

* మూడో వాయిదా రూ.2000 జనవరిలో (పీఎం కిసాన్‌ ద్వారా రూ.2000) చెల్లిస్తారు.

* భూమి లేని కౌలు రైతులకు, ROFR (Rights of Forest Rights)  సాగుదారులకు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌ నుంచి మూడు వాయిదాల్లో ఏడాదికి రూ.13,500 చెల్లిస్తారు.

* మొదటి వాయిదా - రూ.7500 మేలో  

* రెండో వాయిదా - రూ.4000 అక్టోబరులో 

* మూడో వాయిదా - రూ.2000 జనవరిలో చెల్లిస్తారు. 

* ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన కౌలురైతులు/  ROFR సాగుదారులే ఈ పథకానికి అర్హులు.


అర్హతలు:

భూ యాజమాన్య కుటుంబాలు: కమతం పరిమాణంతో సంబంధం లేకుండా.. 

* సాగుభూమిని కలిగి ఉన్న రైతులందరూ

* ROFR భూములను, D పట్టా భూములను సాగుచేస్తున్న రైతులు (వీరి పేర్లు రెవెన్యూ రికార్డుల్లో ఉండాలి.)

* ప్రభుత్వం భూసేకరణ చట్టం ద్వారా భూమిని తీసుకుని, సంబంధిత రైతులకు నష్ట పరిహారం చెల్లించకపోతే, ఆ భూమిని రైతు సాగు చేస్తుంటే ఈ పథకం వర్తిస్తుంది.

భూమిలేని సాగుదారులు: వ్యవసాయ/ ఉద్యానవన/ పట్టుపురుగుల పెంపకానికి సంబంధించిన భూములు లేని కౌలురైతులు ఈ పథకానికి అర్హులు. ఒక కుటుంబంలో జరిగిన కౌలు ఒప్పందాలకు ఈ పథకం వర్తించదు.

* పథకం ద్వారా లబ్ధి పొందేందుకు కౌలు రైతు సాగు చేయాల్సిన కనీస భూమి-

1. అన్ని వ్యవసాయ, హార్టీకల్చర్, సెరీకల్చర్‌ పంటలు - 1.0 ఎకరం (0.4 హెక్టార్లు)

2. పండ్లు, కూరగాయలు, పశుగ్రాసం పంటలు - 0.5 ఎకరాలు (0.2 హెక్టార్లు)

3. మిరియాల లాంటి పంటలు  (betel vine) - 0.1 ఎకరం (0.04 హెక్టార్లు)

* భూ యజమాని కుటుంబంతో పాటు ఆ భూమిని కౌలుకు సాగుచేస్తున్న రైతు కూడా ఈ పథకానికి అర్హుడే.

* భూ యజమాని తన భూమిని అనేకమంది కౌలుదారుకు కౌలుకు ఇస్తే వారిలో ఒక్కరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. వీరిలో ఎస్టీ కేటగిరీ వారికి మొదటి ప్రాధాన్యం ఉంటుంది. తర్వాత ఎస్సీ, బీసీ, మైనార్టీలకు ప్రాధాన్యం లభిస్తుంది.

* ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన కౌలుదారులకు మాత్రమే గుర్తింపు ఉంటుంది.

* ఒక కౌలుదారు అనేక కౌలు ఒప్పందాల్లో భాగస్వామిగా ఉంటే ఈ పథకం కింద వారి కుటుంబాన్ని ఒక యూనిట్‌గా పరిగణిస్తారు.

* ఒకే గ్రామంలో నివసిస్తున్న కౌలురైతుకు, ఉపాంత రైతుకు మధ్య జరిగిన కౌలు ఒప్పందాన్ని ఇందులో పరిగణనలోకి తీసుకోరు.

* ఇనామ్‌/ దేవాలయ భూములను సాగుచేస్తున్న కౌలు రైతులూ ఈ పథకానికి అర్హులే.

ఇతర అంశాలు: 

* రెవెన్యూ శాఖ వద్ద ఉన్న వెబ్‌ లాండ్‌ డేటా ఆధారంగా భూ యాజమాన్య కుటుంబాలను గుర్తిస్తారు. ఈ పథకానికి  RTGS డిపార్ట్‌మెంట్‌ సిస్టమ్‌ ఇంటిగ్రేటర్‌ పాత్రను పోషిస్తుంది. వెబ్‌ లాండ్‌ డేటా, ప్రజా సాధికార సర్వేలోని కుటుంబ సమాచారం, ప్రభుత్వ ఉద్యోగులు/ పింఛన్‌దార్లు/ ఐటీ వివరాల కోసం  CFMS డేటాను RTGS డిపార్ట్‌మెంట్‌ సేకరించి లబ్ధిదారులను గుర్తిస్తుంది.

* రైతు కుటుంబం అంటే ‘భార్య, భర్త, పిల్లలు’ అని అర్థం. పెళ్లయిన పిల్లలు ఉంటే వారిని వేరే యూనిట్‌గా భావించి ఆర్థిక సాయం అందించాలి.

* గ్రామ సచివాలయాల్లో కౌలు రైతులకు Crop Cultivator Rights Cards (CCRC) ను అందించాలి.

* ప్రస్తుత సంవత్సరం జూన్‌ 1 నుంచి తర్వాతి సంవత్సరం మే 31 వరకు వ్యవసాయ సంవత్సరంగా పరిగణిస్తారు.

* సొంత భూమి లేకుండా ఇతరుల భూమిని తీసుకొని సాగు చేసేవారిని కౌలు రైతులుగా పేర్కొంటారు. కౌలు ఒప్పందం 11 నెలలు ఉంటుంది. కౌలుదారు పేరు సంబంధిత భూ రికార్డుల్లో నమోదు కాదు.


అనర్హులు: 

* సంస్థాగత భూ యాజమానులు. 

* రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారు, ప్రభుత్వ ఉద్యోగులు, నెలవారీ పింఛన్‌ రూ.10,000 దాటిన మాజీ ఉద్యోగులు.

* గత ఆర్థిక సంవత్సరం ఆదాయ పన్ను చెల్లించిన వారు.

* MCI, AICTE లాంటి వృత్తిపరమైన బోర్డుల్లో నమోదై ప్రాక్టీస్‌ చేస్తున్న డాక్టర్లు, లాయర్లు, ఇంజినీర్లు, సీఏలు, ఆర్కిటెక్ట్‌లు మొదలైనవారు.

* గత ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య పన్ను, వృత్తి పన్ను, జీఎస్టీ చెల్లించిన వారు.

* వ్యవసాయ భూములను ఇంటి స్థలాలుగా మార్చినా, ఆక్వాకల్చర్‌ లేదా వ్యవసాయేతర అవసరాలకు భూమిని ఉపయోగించినా అనర్హులు అవుతారు.

* 2020-21 ఆర్థిక సంవత్సరంలో 51.59 లక్షల మంది రైతులు ఈ పథకం కింద లబ్ధి పొందారు. వీరిలో 1.54 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కేటగిరీలకు చెందిన కౌలు రైతులు, ROFR సాగుదారులు ఉన్నారు.

* ఈ పథకం అమలుకు రూ.6,928 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో పీఎం కిసాన్‌కి చెందినవి రూ.2,966 కోట్లు.
 

వైఎస్సార్‌ పింఛన్‌ కానుక

సమాజంలోని పేదలు, ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటున్న వర్గాలకు గౌరవప్రదమైన జీవితాన్ని అందించాలనే లక్ష్యంతో 2019, మేలో అధికారంలోకి రాగానే ప్రభుత్వం నవరత్నాల్లో భాగంగా వైఎస్సార్‌ పింఛన్‌ కానుక పథకాన్ని అమలు చేస్తోంది. దీని కింద పింఛన్ల పంపిణీలో రెండు కీలక మార్పులు తీసుకొచ్చారు. అవి:

* వృద్ధాప్య పింఛన్‌ పొందేందుకు ఉన్న అర్హత వయసును 65 నుంచి 60 ఏళ్లకు తగ్గించారు. (ప్రజా సాధికార సర్వే ప్రకారం ఈ తగ్గింపుతో మరో 5.5 లక్షల మంది అర్హత పొందారు.)

* ప్రభుత్వం పింఛన్‌ను రూ.2000 నుంచి రూ.2,250కు పెంచారు. ప్రస్తుతం రాష్ట్రంలో 13 రకాల పింఛన్‌లు అమల్లో ఉన్నాయి.

అర్హతలు:

* ప్రతిపాదిత లబ్ధిదారు బీపీఎల్‌ కుటుంబానికి చెంది, తెల్ల రేషన్‌ కార్డును కలిగి ఉండాలి.

* సంబంధిత జిల్లాలో స్థానిక నివాసాన్ని కలిగి ఉండాలి.

* ఏ ఇతర పింఛన్‌ పథకాల ద్వారా ప్రయోజనం పొందకూడదు.

* పింఛన్లను మంజూరు చేసే అధికారం గ్రామీణ ప్రాంతాల్లో  ఎంపీడీఓకు, పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్‌ కమిషనర్‌కు ఉంటుంది.

అనర్హులు: 

* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు.

* పింఛన్‌ పొందుతున్న మాజీ ఉద్యోగులు.

* ఆదాయపన్ను చెల్లింపుదారులు. 

* నెలవారీ జీతం పొందుతున్న ప్రయివేట్‌ ఉద్యోగులు.

* ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు.

* స్వాతంత్య్ర సమరయోధుల పింఛన్‌ పొందుతున్న వారు.
 

జగనన్న అమ్మఒడి

*  క్రాప్‌ కల్టివేటర్స్‌ రైట్స్‌ యాక్ట్‌ - 2019పై  రైతుల్లో అవగాహన కల్పించడం.

* గ్రామాల్లో కౌలు రైతులను గుర్తించేందుకు గ్రామ సభల ఏర్పాటు. గ్రామస్థాయిలోని రెవెన్యూ, వ్యవసాయ అధికారులు, వాలంటీర్లు, గ్రామపెద్దలను భాగస్వాములను చేయడం.

* భూ యాజమానులకు కింది అంశాలను తెలిపి, వారి సందేహాలను నివృత్తి చేయడం.

* భూ యాజమాన్య హక్కు బదిలీ కాదు. ఈ హక్కుకు భద్రత ఉంటుంది.

* కౌలు ఒప్పందాలపై ఎలాంటి న్యాయపరమైన ప్రాసిక్యూషన్‌కు అవకాశం లేదు.

* కౌలుదారు రుణం చెల్లించని పక్షంలో బ్యాంకులకు ఆ పంటను స్వాధీనం చేసుకునే హక్కు మాత్రమే ఉంటుంది. భూమిపై వారికి ఎలాంటి హక్కు లేదు.

* ఆంధ్రప్రదేశ్‌ కౌలురైతుల చట్టం - 1956ను అధికారికంగా రద్దు చేశారు.

* 201920 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చింది. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న పిల్లలకు విద్యను అందించడం దీని లక్ష్యం.

* 2020, జనవరి 9న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారు. బడిఈడు పిల్లలందరినీ పాఠశాలలో చేర్చడం, చేరిన వారు మానేయకుండా చూడటం, వారి ఆరోగ్య ప్రమాణాలను మెరుగుపరచడం ఈ పథకం ఉద్దేశం.

* ఈ పథకం ద్వారా ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు చదువుతున్న పేద విద్యార్థుల తల్లులకు ఏడాదికి రూ.15,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తారు. విద్యార్థి తల్లి లేదా సంరక్షక్షుడి (తల్లి లేని పక్షంలో) ఖాతాలో నేరుగా నగదు జమ అవుతుంది. కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుతున్నా రూ.15,000 జమ చేస్తారు.

ప్రయోజనాలు:
* ఆర్థిక ఇబ్బందుల కారణంగా మధ్యలోనే చదువు మానేసిన పిల్లలు తిరిగి బడికి వెళ్లేందుకు ఈ పథకం దోహదపడుతుంది.
* విద్య ప్రాధాన్యాన్ని తెలుపుతుంది. 
* బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించవచ్చు.
* స్థూలంగా రాష్ట్ర అక్షరాస్యత రేటును పెంచడానికి ఈ పథకం తోడ్పడుతుంది.
* విద్యార్థులు నాణ్యమైన విద్యను పొందుతారు. విద్యాహక్కు చట్టం (ళిగిని) సఫలీకృతానికి ఇది సహకరిస్తుంది.

అర్హతలు:

* రాష్ట్రంలో గుర్తింపు పొందిన అన్ని పాఠశాలలు/ జూనియర్‌ కళాశాలల్లో (ప్రభుత్వ, ప్రయివేట్, ఎయిడెడ్, అన్‌ఎయిడెడ్‌) 

* చదువుతున్న పిల్లలందరూ అర్హులే.
* పిల్లల తల్లి లేదా సంరక్షకురాలు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబానికి చెంది ఉండాలి. తెల్ల రేషన్‌ కార్డు ఉండాలి.
* కుటుంబ సభ్యులకు ఆధార్‌కార్డు లేదా ఓటరు గుర్తింపు కార్డు ఉండాలి.
* 75% కనీస హాజరు కలిగి ఉండాలి.
* విద్యా సంవత్సరం మధ్యలో చదువు ఆపితే ఈ పథకానికి అనర్హులు.

అమలు:
* 202021 ఆర్థిక సంవత్సరంలో పదో తరగతి వరకు చదువుతున్న 43.76 లక్షల విద్యార్థుల తల్లులు లేదా సంరక్షకుల ఖాతాల్లో రూ.6564 కోట్లు జమ చేశారు. 
* ఇంటర్మీడియట్‌ చదువుతున్న 4.34 లక్షల తల్లుల/సంరక్షకుల ఖాతాల్లో నగదు జమ చేశారు. 
 

వృద్ధాప్య (Oldage): 
* రాష్ట్రంలో 26 లక్షలమంది వృద్ధాప్య పింఛన్‌ పొందుతున్నారు.
* వీరికి ప్రతీ నెల రూ.2250 అందిస్తున్నారు.

అర్హతలు:
* 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉండాలి.
* నిరాశ్రయులై  (Destitute) ఉండాలి. ఎలాంటి జీవనాధారం లేనివారు, ఆధారపడేందుకు ఎవరూ లేనివారు అర్హులు.

వితంతు (Widow): 
* లబ్ధిదారుల సంఖ్య 6 లక్షలు.
* ప్రతీ నెల రూ.2250 అందుతుంది.

అర్హతలు: వివాహ చట్టం ప్రకారం 18 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉండాలి.

చేనేత (Weavers):
* లక్షమంది చేనేత కార్మికులకు నెలకు రూ.2250 నగదు అందిస్తున్నారు.

అర్హతలు:
* 50 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉండాలి. 
* నిరాశ్రయులై ఉండాలి.    

కల్లుగీత కార్మికులు (Toddy tappers):
* రాష్ట్రవ్యాప్తంగా 31 వేలమంది కల్లుగీత కార్మికులు పింఛన్‌ పొందుతున్నారు.
* వీరికి నెలకు రూ.2250 ఇస్తున్నారు.

అర్హతలు
* 50 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉండాలి.
* కల్లుగీత సహకార సంఘంలో లేదా tree for tappers పథకంలో సభ్యుడై ఉండాలి.

మత్స్యకారులు  (Fishermen): 
* రాష్ట్రంలో 50 వేలమంది మత్స్యకారులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు.
* వీరికి ప్రతీ నెల రూ.2250 నగదు అందుతుంది.

అర్హతలు: 50 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉండాలి.

ఒంటరి మహిళలు (Single women):
* రాష్ట్రంలోని 1.5 లక్షల మంది ఒంటరి మహిళలకు ఈ పథకం వర్తిస్తోంది. వీరికి అందే నగదు నెలకు రూ.2250.

అర్హతలు:
* 35 ఏళ్లు దాటిన, విడాకులు పొందిన మహిళ. విడాకులు తీసుకున్న ఏడాది తర్వాతే పింఛన్‌ వస్తుంది. 
* కుటుంబ మద్దతు లేని అవివాహిత మహిళలు. (గ్రామాల్లో 30 సం. లేదా అంతకంటే ఎక్కువ; పట్టణాల్లో 35 సం. లేదా అంతకంటే ఎక్కువ వయసును కలిగి ఉండాలి.)

చర్మకారులు (Cobblers): 
* లబ్ధిదారుల సంఖ్య 20 వేలు. నెలకు అందిస్తున్న మొత్తం రూ.2250.

అర్హతలు: 50 సం. లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉండాలి.

ART (Antiretroviral therapy): 
* రాష్ట్రవ్యాప్తంగా 30 వేలమంది ప్రతీ నెల రూ.2250 నగదు పొందుతున్నారు.

అర్హతలు:
* 6 నెలల పాటు నిరంతరంగా  ART చికిత్స పొందినవారు.    
* వయోపరిమితి లేదు.

కళాకారులు:
* ఈ పథకం ద్వారా 38 వేల మందికి నెలకు రూ.2250 పింఛన్‌ అందుతుంది.

డప్పు కళాకారులు  (Drum artists): 
* 30 వేలమంది డప్పు కళాకారులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు.
* వీరికి ప్రతీ నెల రూ.3000 నగదు అందుతోంది.

అర్హతలు: 50 సం. లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉండాలి. 

హిజ్రాలు (Transgenders): 
* రాష్ట్రవ్యాప్తంగా రెండు వేలమంది లబ్ధి పొందుతున్నారు.
* వీరికి ప్రతీ నెల అందించే నగదు రూ.3000

అర్హతలు: 18 సం. లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉండాలి.

దివ్యాంగులు:
* రాష్ట్రంలోని 6 లక్షలమంది దివ్యాంగులకు ప్రతీ నెల రూ.3000 అందిస్తున్నారు.

అర్హతలు:
* ఎలాంటి వయోపరిమితి లేదు
* సదరం ధ్రువీకరణ పత్రం ఆధారంగా కనీసం 40% వైకల్యం ఉన్నవారు. (ఇంతకు ముందు వైకల్యం 80% ఉన్నవారికి రూ.3000; 40  79% ఉన్నవారికి రూ.2000 ఇచ్చేవారు.) ప్రస్తుతం వైకల్య శాతంతో సంబంధం లేకుండా అందరికీ ఒకేలా సాయం చేస్తున్నారు.    

డయాలసిస్‌ రోగులు  (CKDU): 
* రాష్ట్రవ్యాప్తంగా 10వేలమంది డయాలసిస్‌ రోగులు ఈ పథకం కింద లబ్ధి పొందుతున్నారు.
* వీరికి ప్రతీ నెల రూ.10,000 నగదును అందిస్తున్నారు.

అర్హతలు
* ఎలాంటి వయోపరిమితి లేదు. 
* నిరంతరం కిడ్నీ డయాలసిస్‌ చేయించుకునే వారు (Chronic kidney disease of unknown etiology) ప్రభుత్వ/ ప్రైవేట్‌ వైద్యుల నుంచి ధ్రువీకరణ పొందాలి.      


ఇతరాలు
* తలసేమియా, సికిల్‌సెల్, హిమోఫీలియా వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.10,000 పింఛన్‌ ఇస్తున్నారు.
* ప్రమాదాలు/ పక్షవాతం/ తీవ్ర కండరాల క్షీణత కారణంగా వీల్‌ఛైర్‌/ మంచానికి పరిమితమైన వారికి ప్రభుత్వం నెలకు రూ.5000 అందిస్తోంది.
* బోదకాలు, దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధిగ్రస్తులకు (స్టేజ్‌ 3, 4, 5) నెలకు రూ.5000 లబ్ధి చేకూరుతుంది.
* లెప్రసీ వ్యాధిగ్రస్తులకు పింఛన్‌ రూపంలో నెలకు రూ.3000 అందిస్తున్నారు.

అమలు తీరు..
ఈ పథకాన్ని పారదర్శకంగా అమలు చేసేందుకు పింఛన్‌ పొందడానికి అర్హులైన వారి జాబితాను గ్రామ సచివాలయాల్లో బియ్యం కార్డుల అర్హుల జాబితాతో పాటు ప్రకటిస్తున్నారు.
* జిల్లాలో పింఛన్ల వ్యవస్థను RDA (District Rural Development Agency) ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ అమలు చేస్తారు.
* రాష్ట్ర స్థాయిలో గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ  SERP (Society for Elimination of Rural Poverty) సీఈఓ పింఛన్ల పథకాన్ని పర్యవేక్షిస్తారు.
* సాంఘిక భద్రతా పింఛన్ల కోసం 201920 సంవత్సరంలో రూ.15,675 కోట్లు ఖర్చు చేశారు. 
* 202021 ఆర్థిక సంవత్సరానికి వైఎస్సార్‌ పింఛన్‌ కోసం రూ.16,000 కోట్లు కేటాయించారు.
* ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ వాలంటీర్లే  నేరుగా పింఛన్లను సంబంధిత లబ్ధిదారులకు అందిస్తున్నారు.

 

ఉన్నత విద్యకు చేయూత..
* నవరత్నాల్లో భాగంగా పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ విధానంలో మార్పులు చేశారు. ఇందుకోసం ప్రభుత్వం కొత్తగా జగనన్న విద్యా దీవెన (రీయింబర్స్‌మెంట్‌ ఆఫ్‌ ట్యూషన్‌ ఫీజ్‌ - RTF), జగనన్న వసతి దీవెన (భోజన, వసతి ఖర్చులు -  MTF) పథకాలను తీసుకొచ్చింది. 202021 ఆర్థిక సంవత్సరంలో RTFకు రూ.3009 కోట్లు MTFకు రూ.2000 కోట్లు కేటాయించారు.
* ఉన్నత విద్యను కొనసాగించే విద్యార్థుల నిష్పత్తిని పెంచడం వీటి ఉద్దేశం.


జగనన్న విద్యా దీవెన

* ఈ పథకాన్ని 2019, నవంబరు 27న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు.
* దీని ద్వారా ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిస్‌ లాంటి ఉన్నత విద్యను అభ్యసించే పేద విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ లభిస్తుంది.
* 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకానికి రూ.4200 కోట్లు కేటాయించారు. అంతకు ముందు ఏడాది బకాయిల చెల్లింపునకు ప్రభుత్వం రూ.1880 కోట్లు విడుదల చేసింది.
* సుమారు 18 లక్షలమంది విద్యార్థులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందుతున్నారు.
* 2019-20 విద్యా సంవత్సరానికి విడుదలైన నిధులు పూర్తిగా కాలేజీల ఖాతాలకు సర్దుబాటు చేశారు. ఈ విద్యా సంవత్సరంలో ఎవరైనా విద్యార్థులు కళాశాలకు ఫీజు చెల్లించిన పక్షంలో, కళాశాల యాజమాన్యం నుంచి రిఫండ్‌ కోరవచ్చు. 202021 నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మొత్తాన్ని 4 వాయిదాల్లో విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమచేస్తున్నారు.


జగనన్న వసతి దీవెన

* దీన్ని 2020, ఫిబ్రవరి 24న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజయనగరంలో ప్రారంభించారు. 
* ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థుల భోజనం, ప్రయాణం, పుస్తకాల కొనుగోలు, వసతికి అయ్యే ఖర్చులకు  ప్రభుత్వమే ఈ పథకం ద్వారా ఆర్థికసాయం అందిస్తుంది.
* ఐటీఐ విద్యార్థులకు రూ.10000; పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ.15,000; డిగ్రీ, బీఫార్మసీ, మెడిసిన్‌ చదివే వారికి రూ. 20,000 అందిస్తున్నారు.
* ఈ మొత్తాన్ని 2 దశల్లో (ఫిబ్రవరి, జులై) విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నారు.
* 201920 ఆర్థిక సంవత్సరంలో రూ.2300 కోట్లు ఖర్చు చేశారు. దీని ద్వారా దాదాపు 16 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందారు.
* ఇంటర్‌ మినహా మిగిలిన అన్ని రకాల ఉన్నత చదువులు ఈ పథకం పరిధిలోకి వస్తాయి.

అర్హతలు: జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాల కింద లబ్ధి పొందేందుకు కింది అర్హతలు ఉండాలి.
* ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్‌ కళాశాలల్లో ఉన్నత చదువులు అభ్యసిస్తున్న విద్యార్థులు.
* కుటుంబ వార్షిక ఆదాయం రూ.2.5 లక్షలలోపు ఉన్నవారు.
* 10 ఎకరాల్లోపు మాగాణి; 25 ఎకరాల్లోపు మెట్ట; మెట్ట, మాగాణి కలిపి 25 ఎకరాల్లోపు ఉన్నవారు.
* కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా, పింఛన్‌ తీసుకుంటున్నా అనర్హులు అవుతారు. (పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు మినహాయింపు ఉంది.)
* కుటుంబంలో ఎవరికీ ఫోర్‌వీలర్‌ వాహనం ఉండకూడదు. (టాక్సీ, ఆటో, ట్రాక్టర్‌కు మినహాయింపు ఉంది.)
* కుటుంబంలో ఏ ఒక్కరైనా ఆదాయ పన్ను చెల్లిస్తే, అందులోని విద్యార్థులు అనర్హులు.
* పట్టణ ప్రాంతాల్లో 1500 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఇళ్లు ఉన్నవారు అనర్హులు. 

 

వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ

* ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఆరోగ్య రక్షణ కల్పించే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వైఎస్‌ఆర్‌ ఆరోగ్య బీమా పథకాన్ని ప్రారంభించింది. ప్రజలందరికీ ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా, నాణ్యమైన వైద్య సేవలను పొందడాన్ని ‘సార్వత్రిక ఆరోగ్య రక్షణ’ అంటారు. ఇందులో నివారణ, చికిత్స, పునరావాసం మొదలైన అంశాలు ఉన్నాయి.
* ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి 2007, ఏప్రిల్‌ 12న ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించారు. మొదట దీన్ని మహబూబ్‌నగర్, అనంతపురం, శ్రీకాకుళం జిల్లాల్లో పైలట్‌ ప్రాజెక్ట్‌గా అమలు చేశారు. దరఖాస్తు చేసుకున్న 20 రోజుల్లో సంబంధిత వ్యక్తులకు ఆరోగ్యశ్రీ కార్డులు మంజూరు చేయాలి.
* ప్రాణాంతక వ్యాధుల నుంచి పేదలు తమ ఆరోగ్యాన్ని సంరక్షించుకునేలా వారికి ఆర్థిక భద్రతను అందిస్తుంది.
* ఆరోగ్య బీమా విషయంలో ఈ పథకం మంచి పీపీపీ నమూనాగా పేరొందింది. దీని ద్వారా ప్రభుత్వ, ప్రయివేట్‌ రంగంలోని నెట్‌వర్క్‌ ఆసుపత్రుల ద్వారా ఎంపిక చేసిన వ్యాధులకు నగదు రహిత సేవలను అందిస్తున్నారు.
* ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నేతృత్వంలో డా.వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసింది. ఇది ఆరోగ్య, బీమా రంగాల్లోని నిపుణులను సంప్రదించి వారి సలహాలు, సూచనల మేరకు పథకాన్ని అమలు చేస్తోంది. నెట్‌వర్క్‌ ఆసుపత్రులతో ఈ ట్రస్ట్‌ ఒప్పందాన్ని కుదుర్చుకుంటుంది. అవస్థాపన సౌకర్యాల ఆధారంగా నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు గుర్తింపునిస్తుంది.
* చికిత్స కోసం ఆసుపత్రిని ఎంపిక చేసుకునే అవకాశం రోగికి ఉంది. 
* హెల్త్‌ క్యాంపుల్లో రోగులను గుర్తించి, డయాగ్నసిస్‌ చేసి, చికిత్సను అందిస్తుంది. దీంతో పాటు చికిత్స తర్వాత భవిష్యత్తులో కలిగే ఇబ్బందులను సైతం వివరిస్తుంది. ప్రభుత్వం నుంచి నగదు చెల్లింపులన్నీ ఆన్‌లైన్‌ విధానంలోనే జరుగుతాయి. దీంతో అక్రమాలు జరిగే ఆస్కారం ఉండదు.
* ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (First contact point), ఏరియా/ జిల్లా ఆసుపత్రులు, నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లోని ‘వైద్యమిత్ర’ల ద్వారా హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేశారు.
* ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ.5 లక్షల వరకు వైద్యసాయం అందిస్తున్నారు.
* హెల్త్‌క్యాంప్‌లు, నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో ఉచితంగా స్క్రీనింగ్, ఔట్‌ పేషెంట్‌ సేవలు అందిస్తున్నారు.
* 30 కేటగిరీల్లో (గుండె, కాలేయం, మూత్రపిండాలు, మెదడు మొదలైనవి.) ఎంపిక చేసిన 1059 వ్యాధులకు ఈ పథకం కింద ఆర్థిక సాయం అందుతుంది. శస్త్ర చికిత్స ద్వారా సరైన ప్రయోజనం చేకూరాలంటే చికిత్స తర్వాత రోగి వైద్యుల పర్యవేక్షణలో ఉండాలి. ఈ పథకం ద్వారా చికిత్స అనంతరం తిరిగి వైద్యుల సంప్రదింపులు, పరీక్షలు, మందులు, అవసరమైన చికిత్సను కూడా ఉచితంగా అందిస్తున్నారు. 
* రోగుల ఆహారం, రవాణా వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తుంది.
* రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఉన్న సుమారు 1.30 కోట్ల కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నాయి.

 

‘ఆరోగ్యశ్రీ’కి నూతన సవరణలు 

* నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు ఆంధ్రప్రదేశ్‌కు సమీపంలో ఉన్న బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నగరాల్లోని 130 నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ పథకాన్ని విస్తరించారు. (2019, నవంబరు నుంచి)
* ఆంధ్రప్రదేశ్‌ ఆసుపత్రుల్లో అందుబాటులో లేని కొన్ని నిర్దిష్ట వ్యాధులకు సంబంధించిన చికిత్సలు ఈ ఆసుపత్రుల్లో అందిస్తారు. రాష్ట్ర సరిహద్దుల్లో నివసిస్తున్న బీపీఎల్‌ కుటుంబాలకు ఇది ఉపయోగపడుతుంది.
* ఆదాయ పరిమితిని రూ.5 లక్షలకు పెంచారు. దీంతో దాదాపు 95% ప్రజలకు ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి వచ్చాయి.
* రోగులు కోలుకొనే సమయంలో వారికి భత్యం అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి 2019, డిసెంబరులో డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ‘ఆరోగ్య ఆసరా’ పథకాన్ని ప్రారంభించారు. 
* వైద్యుల సలహామేరకు చికిత్స అనంతరం రోగులు కోలుకునే వరకు రోజుకు రూ.225 లేదా నెలకు రూ.5000 చొప్పున అందిస్తారు. 
* కుటుంబంలోని వ్యక్తికి అనారోగ్యం కారణంగా శస్త్రచికిత్స జరిగినప్పుడు ఉపాధి లభించదు. ఆ సమయంలో కుటుంబసభ్యులకు ఆర్థికంగా ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. దీని ద్వారా సుమారు 5 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది.
* వైద్య ఖర్చులు రూ.1000 మించితే ఆ వ్యాధులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చేలా ప్రభుత్వం కృషి చేస్తోంది. 2020, జనవరి నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో పైలట్‌ ప్రాజెక్ట్‌గా దీన్ని అమలు చేస్తున్నారు. దీంతో పాటు ప్రస్తుతం అమల్లో ఉన్న 1059 రకాల చికిత్సలకు అదనంగా మరో వెయ్యి రకాల వైద్యసేవలను (2059) పశ్చిమ గోదావరి జిల్లాలో అమలు చేస్తున్నారు. డెంగీ, చికెన్‌ గున్యా, మలేరియా లాంటి సీజనల్‌ వ్యాధులను ఇందులో చేర్చారు.
* 2020, జనవరి నుంచి స్మార్ట్‌ హెల్త్‌ కార్డులను పంపిణీ చేస్తున్నారు. దాదాపు కోటి 42 లక్షల కార్డులు పంపిణీ చేస్తారు.

 

ఆరోగ్యశ్రీలో నమోదు చేసుకునే మార్గాలు
* ఆరోగ్యశ్రీలో నమోదు చేసుకోవడానికి మూడు మార్గాలు ఉన్నాయి. అవి:
I. పీహెచ్‌సీల్లోని వైద్యమిత్ర కౌంటర్లు
II. పీహెచ్‌సీలు/ నెట్‌వర్క్‌ ఆసుపత్రులు నిర్వహించే హెల్త్‌క్యాంప్‌లు
III. అత్యవసర సమయంలో నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో నమోదు చేసుకోవచ్చు. 
* లబ్ధిదారుల గుర్తింపులో హెల్త్‌క్యాంప్‌లు ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. ఇవి  IEC (Information, Education, Communication) కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. అంతేకాక స్క్రీనింగ్, కౌన్సెలింగ్‌లను నిర్వహించి, నెట్‌వర్క్‌ ఆసుపత్రులను సూచిస్తాయి.
* ఆర్థికంగా వెనుకబడిన వారి కుటుంబాల తరఫున ఆరోగ్యబీమా ప్రీమియంను ప్రభుత్వమే చెల్లిస్తుంది.


అర్హతలు:
* కుటుంబ వార్షిక ఆదాయం రూ.5 లక్షల లోపు ఉండాలి. 
* 12 ఎకరాల్లోపు మాగాణి; 35 ఎకరాల్లోపు మెట్ట భూమి; మెట్ట, మాగాణి కలిపి 35 ఎకరాల్లోపు ఉన్నవారు. 
* కుటుంబానికి ఒక కారు ఉంటే అర్హులే. అంతకంటే ఎక్కువ కార్లు ఉన్నవారు ఈ పథకానికి అనర్హులు.
* 3000 చదరపు అడుగుల్లోపు ఇల్లు కలిగి ఉన్నవారు.
* ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే ఆరోగ్య పథకం పరిధిలోకి రాని ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పథకం వర్తిస్తుంది.
* పౌర సరఫరాల శాఖ జారీ చేసే బీపీఎల్‌ రేషన్‌కార్డు కలిగి ఉన్న అన్ని కుటుంబాలు, జేవీడీ కార్డుకు అర్హత ఉన్న కుటుంబాలు అర్హులు.


ఎంప్లాయ్‌ హెల్త్‌ స్కీమ్‌: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పదవీ విరమణ పొందిన వారు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో (Empanelled Hospitals)  నగదు రహిత వైద్య సేవలను అందించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని  (EHS) అమలు చేస్తోంది. అంతకు ముందు ఈ పథకం స్థానంలో ‘మెడికల్‌ రీఎంబర్స్‌మెంట్‌’ పథకం అమల్లో ఉంది. పోస్ట్‌ హాస్పిటలైజేషన్‌ మెడికల్‌ కేర్, తీవ్ర వ్యాధులకు చికిత్స (Chronic diseases treatment) లాంటి నూతన అంశాలను ఈ పథకంలో చేర్చారు.
* నోటిఫైడ్‌ ఆసుపత్రుల్లో ముందుగా నిర్ణయించిన తీవ్రమైన వ్యాధులకు ఔట్‌ పేషెంట్‌ సేవలు అందిస్తారు.
* ఇన్‌పేషెంట్‌ చికిత్స కింద గుర్తించిన వ్యాధులకు సంబంధించి లిస్టెడ్‌ థెరపీలకు చికిత్స అందిస్తారు. డిశ్చార్జ్‌ అయ్యాక 10 రోజుల వరకు మెడికేషన్‌ ఖర్చులు పూర్తిగా నగదురహితంగా అందిస్తారు.
* కొన్ని గుర్తించిన లిస్టెడ్‌ థెరపీలకు ఏడాది పాటు ఫాలోఅప్‌ సేవలు అందిస్తారు. ఇందులో సంప్రదింపులు (కన్సల్టేషన్‌), మందులు మొదలైనవి ఉచితంగా అందిస్తారు.
* లబ్ధిదారు ఒక్కసారి రూ.2 లక్షల వరకు క్లెయిమ్‌ చేసుకునే వెసులుబాటు ఉంది. ముందుగా నిర్ణయించిన ప్యాకేజీల విషయంలో రూ.2 లక్షలు దాటి క్లెయిమ్‌ చేసుకోవచ్చు. రూ.2 లక్షలు దాటిన క్లెయిమ్‌లను డా.వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ సీఈఓ పరిష్కరిస్తారు. ఈహెచ్‌ఎస్‌ను ఈ ట్రస్ట్‌ అమలు చేస్తుంది. ఈ పథకంలో రాష్ట్రప్రభుత్వ వాటా 60% కాగా, ఉద్యోగులు/ పింఛనర్ల వాటా 40%గా ఉంది.


వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ హెల్త్‌ స్కీమ్‌ (WJHS) 

* రాష్ట్రంలోని జర్నలిస్ట్‌లు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు నగదు రహిత సేవలు అందించే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. 
* ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పర్యవేక్షణలో డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ ఈ పథకాన్ని అమలు చేస్తోంది.
* ఈ పథకానికి రాష్ట్రప్రభుత్వ చందా 50% కాగా, జర్నలిస్టుల చందా 50%.
* నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో ఎంపిక చేసిన వ్యాధులకు సంబంధించిన లిస్టెడ్‌ థెరపీలకు నగదు రహిత చికిత్స అందిస్తారు.
* ‘దీర్ఘకాల ఫాలోఅప్‌ థెరపీ’ అవసరమైన వ్యాధిగ్రస్తులకు ఏడాదిపాటు ఫాలోఅప్‌ సేవలు అందిస్తారు. సంప్రదింపులు (కన్సల్టేషన్‌), విచారణ (ఇన్వెస్టిగేషన్‌), మందులు అందించడం మొదలైన సేవలు ఇందులో భాగంగా ఉంటాయి. 


ఆరోగ్య రక్ష 

* దారిద్య్రరేఖకు ఎగువన (ఏపీఎల్‌) ఉన్న కుటుంబాల్లో ప్రాణాంతక వ్యాధుల బారిన పడినవారికి చికిత్స అందించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ‘ఆరోగ్య రక్ష’ పథకాన్ని ప్రారంభించింది. సుమారు 159 లక్షల కుటుంబాలు వివిధ రాష్ట్ర ప్రభుత్వ పథకాల (ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్, డబ్ల్యూజేహెచ్‌ఎస్‌) పరిధిలోకి రాగా, మిగిలిన 32 లక్షల కుటుంబాలు ఆరోగ్య రక్ష పరిధిలోకి వచ్చాయి.
* ఏపీఎల్‌ కుటుంబాల్లోని ఒక్కో వ్యక్తి ఏడాదికి రూ.1200 చెల్లించి ఈ పథకంలో  చేరొచ్చు. 2017, జనవరి 1 నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చింది.
* ప్రాణాంతక వ్యాధుల చికిత్స కోసం ఏడాదికి ఒక కుటుంబ సభ్యుడికి రూ.2 లక్షల వరకు ఆర్థికసాయం అందిస్తారు. ద్వితీయ, తృతీయ సంరక్షణ అవసరమయ్యే 1059 వ్యాధులకు 400 నెట్‌వర్క్‌ ఆసుపత్రుల ద్వారా నగదు రహిత సేవలు అందిస్తారు.
* దీర్ఘకాల ఫాలోఅప్‌ థెరపీ అవసరమయ్యే రోగులకు ఏడాదిపాటు సుమారు 138 ఫాలోఅప్‌ సేవలు అందిస్తారు. కన్సల్టేషన్, ఇన్వెస్టిగేషన్, మందుల పంపిణీ మొదలైన సేవలు ఇందులో భాగం. 

Posted Date : 18-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌