• facebook
  • whatsapp
  • telegram

కేంద్ర - రాష్ట్ర విత్త సంబంధాలు 

భారత రాజ్యాంగంలో 268 నుంచి 293 వరకు ఉన్న అధికరణలు కేంద్ర - రాష్ట్ర విత్త సంబంధాలను వివరిస్తాయి. రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్‌లో మొదటి జాబితా  (List I), రెండో జాబితా  (List II)లో కేంద్ర - రాష్ట్రాల మధ్య పన్ను అధికారాలను విభజించారు.

కేంద్రం విధించే పన్నులు

ఆదాయపు పన్ను (వ్యవసాయ ఆదాయం మినహా)

ఎగుమతి, దిగుమతి సుంకాలు (Customs Duty)

ఎక్సైజ్‌ సుంకం (ఆల్కహాల్‌ ద్వారా తయారుచేసే మెడికల్, టాయిలెట్‌ ఉత్పత్తులపై) 

కార్పొరేషన్‌ పన్ను 

మూలధన ఆస్తుల విలువపై పన్ను (వ్యవసాయ భూములు మినహా). ఈ ఆస్తులు వ్యక్తులు లేదా కంపెనీలకు చెంది ఉండొచ్చు.

ఎస్టేట్‌ సుంకం (వ్యవసాయ భూములు మినహా) 

వారసత్వ పన్ను (వ్యవసాయ భూములు మినహా)

విత్త సంబంధ పత్రాలపై స్టాంప్‌ డ్యూటీ (చెక్కులు, ప్రామిసరీ నోట్లు, లెటర్స్‌ ఆఫ్‌ క్రెడిట్స్, బీమా పాలసీలు, షేర్లు/ డిబెంచర్ల బదిలీ పత్రాలు మొదలైనవి.)

వార్తాపత్రికల కొనుగోళ్లు/ అమ్మకాలు, వాటిలో ప్రచురించిన ప్రకటనలపై పన్నులు 

రైల్వే రవాణా (సరకులు, ప్రయాణికులపై పన్ను). జల, వాయు, రైలు మార్గాల ద్వారా వస్తు, ప్రయాణికుల రవాణాకు విధించే టెర్మినల్‌ పన్ను (యాత్రా స్థలాలు, పుణ్య క్షేత్రాలకు వెళ్లే రవాణాపై విధించే పన్నును టెర్మినల్‌ పన్ను అంటారు.) 

వస్తువుల (వార్తా పత్రికలు మినహా) అంతర్‌ రాష్ట్ర కొనుగోళ్లు/ అమ్మకాలపై పన్ను.

రాష్ట్రం విధించే పన్నులు

భూమి శిస్తు 

వ్యవసాయ ఆదాయంపై పన్ను 

వ్యవసాయ భూమిపై వారసత్వ పన్ను 

వ్యవసాయ భూమిపై ఎస్టేట్‌ సుంకం 

భూమి, భవనాలపై పన్ను 

ఖనిజ హక్కులపై పన్ను (ఖనిజాభివృద్ధికి పార్లమెంట్‌ విధించే పరిమితుల మేరకు)

మద్యం, నల్లమందు, మత్తు పదార్థాలపై ఎక్సైజ్‌ సుంకం 

స్థానిక ప్రాంతాల్లో ఉపయోగించే వస్తువులను తీసుకురావడానికి వాటిపై విధించే ప్రవేశపన్ను 

విద్యుత్‌శక్తి అమ్మకం/ వినియోగంపై పన్ను 

వస్తువుల కొనుగోళ్లు, అమ్మకాలపై పన్ను (వార్తాపత్రికలు మినహా) 

ప్రకటనలపై పన్ను (వార్తాపత్రికలు కాకుండా రేడియో, టీవీ లాంటి ప్రసార సాధనాల్లో ప్రచురించే వాటిపై)

రహదారులు, అంతర జల రవాణా ద్వారా రవాణా చేసే వస్తువులు, ప్రయాణికులపై విధించే పన్ను

రహదారులపై తిరిగే వాహనాలపై విధించే పన్ను 

జంతువులు, పడవలపై విధించే పన్ను 

టోల్‌ సుంకం 

వృత్తులు, వ్యాపారం, ఉపాధిపై పన్ను 

క్యాపిటేషన్‌ పన్ను (Capitation Tax): ఆదాయం, సంపదతో సంబంధం లేకుండా వ్యక్తులపై విధించే పన్నును క్యాపిటేషన్‌ పన్ను అంటారు. దీన్నే హెడ్‌ ట్యాక్స్‌ లేదా పోల్‌ ట్యాక్స్‌గా పేర్కొంటారు. 

విలాసం, వినోదం, పందేలు, జూదంపై పన్ను

స్టాంప్‌ డ్యూటీ (విత్త సంబంధ పత్రాలు మినహా)

గమనిక: రాజ్యాంగం అమల్లోకి వచ్చాక ఈ రకమైన పన్ను వ్యవస్థ ఉండేది. కేంద్రం జీఎస్‌టీ అమల్లోకి తెచ్చాక అనేక పన్నులు అందులో విలీనమయ్యాయి.

టోల్‌ ట్యాక్స్‌: జాతీయ హైవేల చట్టం - 1956, జాతీయ హైవేల నిబంధనలు - 2008 ప్రకారం దేశంలో ఉన్న జాతీయ రహదారుల వద్ద టోల్‌ ట్యాక్స్‌ను వసూలు చేస్తారు. రహదారుల నిర్మాణానికి అయ్యే ఖర్చు వసూలు, నిర్వహణ వ్యయం, వాహనాల భద్రతకు (దొంగతనాల నుంచి) ఈ పన్ను మొత్తాన్ని ఉపయోగిస్తారు. దేశంలోని అన్ని ఆరు, నాలుగు లైన్ల రహదారులపై టోల్‌ ట్యాక్స్‌ వసూలు చేస్తున్నారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఏటా ఈ ధరలు మారి ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వస్తాయి. అన్ని టోల్‌ ప్లాజాల్లో ఒకే విధమైన ధర ఉండదు. ప్రదేశాలు, దూరం ఆధారంగా పన్ను వసూలు చేస్తారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఉపరాష్ట్రపతి, గవర్నర్‌లకు పన్ను మినహాయింపు ఉంటుంది. రాష్ట్ర హైవేలపై ప్రయాణించే వాహనాలపై రాష్ట్ర ప్రభుత్వం టోల్‌ ట్యాక్స్‌ వసూలుచేస్తుంది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉమ్మడిగా పన్నులు విధించే అధికారం లేదు. పైన పేర్కొన్న రెండు జాబితాల్లో ప్రస్తావించని అంశాలపై పన్నును కేంద్రమే విధిస్తుంది. దీని ఆధారంగానే కేంద్రం సేవాపన్నును తెచ్చింది. కేంద్రపాలిత ప్రాంతాల్లో రెండు జాబితాల్లోని అంశాలపై కేంద్రమే పన్నులు విధిస్తుంది. కేంద్ర పన్నుల్లోని 11 అంశాల ద్వారా వచ్చిన ఆదాయమంతా కేంద్ర ప్రభుత్వానికే చెందదు. వీటిని 4 రకాలుగా విభజిస్తారు. అవి:

పన్ను విధించి, వసూలు చేసి, కేంద్రమే ఉపయోగించుకునేవి: కార్పొరేషన్‌ పన్ను, కస్టమ్స్‌ సుంకాలు, సంపద పన్ను, వడ్డీ పన్ను, బహుమతి పన్ను, ఆదాయపు పన్నుపై సర్‌ఛార్జి. పదో ఆర్థిక సంఘం (1995  2000) వరకు వీటి ద్వారా వచ్చిన ఆదాయం పూర్తిగా కేంద్రానికే దక్కేది. కానీ 2000లో చేసిన 80వ రాజ్యాంగ సవరణ ప్రకారం కేంద్రానికి పన్నులు, సుంకాల ద్వారా వచ్చిన మొత్తం రాబడిలో కొంతవాటాను రాష్ట్రాలకు అందించాలి. అయితే 268, 269 అధికరణల్లో పేర్కొన్న పన్నులు; 271వ అధికరణలో చెప్పిన సర్‌ఛార్జి, సెస్‌లను ఈ పంపకం నుంచి మినహాయించారు.

పన్ను విధించి, వసూలు చేసి, రాష్ట్రాలతో కలిసి పంచుకునేవి (270వ అధికరణ): ఆదాయపు పన్ను, ఎక్సైజ్‌ సుంకం, సేవా పన్ను.

పన్ను విధించి, వసూలుచేసి, రాబడిని రాష్ట్రాలకిచ్చేవి (269వ అధికరణ): వ్యవసాయ భూములు మినహా ఇతర ఆస్తులపై ఎస్టేట్‌సుంకం, వారసత్వపు పన్ను; జల/ వాయు/ రైలు రవాణా ద్వారా వస్తువులు, ప్రయాణికుల నుంచి వసూలుచేసే టెర్మినల్‌ పన్ను; రైల్వే రవాణాపై పన్ను (సరుకులు, ప్రయాణికులపై); స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ లావాదేవీలపై పన్ను; వార్తాపత్రికల అమ్మకం/ కొనుగోళ్లు, వాటిలో ప్రచురించిన ప్రకటనలపై పన్నులు. 

కేంద్రం పన్ను విధిస్తే, రాష్ట్రాలు వసూలు చేసుకొని, అనుభవించేవి (268వ అధికరణ): ఆల్కహాల్‌ వినియోగించి తయారుచేసే మెడికల్‌ ఉత్పత్తులు (నార్కోటిక్‌ డ్రగ్స్‌), టాయిలెట్‌ ఉత్పత్తులపై ఎక్సైజ్‌ సుంకం, విత్త సంబంధ పత్రాలపై స్టాంప్‌ డ్యూటీ.

1956లో జాతీయ అభివృద్ధి మండలిలో కుదిరిన ఒప్పందం ప్రకారం వస్త్రాలను తయారుచేసే మిల్లులు  (Mill made textiles), పంచదార, పొగాకుపై అదనపు ఎక్సైజ్‌ సుంకాలను 1957 నుంచి కేంద్రమే విధిస్తోంది. రాష్ట్ర అమ్మకం పన్నుల స్థానంలో ఇది ఉంది. కాబట్టి మొత్తం ఆదాయం రాష్ట్రాలకే చెందుతుంది. 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య స్పష్టమైన పన్నుల విభజన జరిగింది. అయినప్పటికీ ఎక్కువ ఆదాయం వచ్చే వనరులు కేంద్ర ప్రభుత్వం వద్దే ఉన్నాయి. బ్యాంకింగ్, కరెన్సీ - నాణేల ముద్రణ లాంటి కీలకాంశాలను కేంద్రమే పర్యవేక్షిస్తుంది. దీంతో కొత్తగా నగదు సృష్టించి ఆదాయవనరులను సమకూర్చుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయ వనరులు తక్కువగా ఉన్నాయి. అమ్మకం పన్ను మినహా ఇతర పన్నుల ద్వారా రాష్ట్రాలకు ఎక్కువ ఆదాయం సమకూరడం లేదు. అప్పులు చేసే విషయంలోనూ కేంద్రానికే ఆధిపత్యం ఉంది. 292 అధికరణ ప్రకారం పార్లమెంట్‌ కొన్ని పరిమితులను నిర్దేశించింది. దీని ప్రకారం దేశీయంగా లేదా విదేశాల నుంచి కేంద్రం అప్పు తీసుకోవాలంటే భారత సంఘటిత నిధిని సెక్యూరిటీగా ఉంచాలి. 293 అధికరణ ప్రకారం రాష్ట్రాలు దేశీయంగా మాత్రమే అప్పులు చేయాలి. 

ఆదాయంపరంగా కేంద్ర, రాష్ట్రాల మధ్య ఉన్న అసమానతలను క్షితిజ లంబ అసమానతలు అంటారు. సహజవనరుల లభ్యత, అభివృద్ధి తీరుతెన్నుల్లో వ్యత్యాసాల కారణంగా రాష్ట్రాల మధ్య కూడా ఆదాయాల పరంగా హెచ్చుతగ్గులు ఉన్నాయి. ఈ రకమైన అసమానతలను క్షితిజ సమాంతర అసమానతలు అంటారు. ఈ అసమానతలను గుర్తించిన రాజ్యాంగ నిపుణులు కేంద్రం నుంచి రాష్ట్రాలకు నిధులు బదిలీ, పంపిణీ చేయడానికి తగిన యంత్రాంగాన్ని రూపకల్పన చేశారు. అదే ఆర్థికసంఘం.

ఆర్థిక సంఘం

రాజ్యాంగంలోని 280వ అధికరణ ప్రకారం భారత రాష్ట్రపతి అయిదేళ్లకోసారి ఆర్థిక సంఘాన్ని నియమిస్తారు. అందులో ఒక ఛైర్మన్, నలుగురు సభ్యులు ఉంటారు. అది కింది విధులను నిర్వహిస్తుంది. 

పన్నుల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన నికర రాబడిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పంపిణీ చేయడం (క్షితిజ లంబ పంపిణీ).

రాష్ట్రాలకు వచ్చిన మొత్తం పన్ను రాబడిలో వివిధ రాష్ట్రాల వాటాలను నిర్ణయించడం (క్షితిజ సమాంతర పంపిణీ).     

కేంద్రం రాష్ట్రాలకు ఇవ్వాల్సిన గ్రాంట్స్‌ ఇన్‌ ఎయిడ్ల పరిమాణాన్ని నిర్ణయించి, వీటిని పొందడానికి రాష్ట్రాలకు ఉండాల్సిన అర్హతలను నిర్దేశించడం.

కేంద్ర, రాష్ట్ర ఆర్థిక సంబంధాలు, రాష్ట్రపతి సూచించిన ఇతర అంశాలపై విశ్లేషణ చేయడం.

275వ అధికరణ ప్రకారం ఆర్థిక సంఘం సలహా మేరకే గ్రాంట్లు ఇవ్వాలి. వీటి పరిమాణాన్ని ఆర్థికసంఘమే నిర్ణయిస్తుంది. 282వ అధికరణ ప్రకారం కేంద్రం తన విచక్షణతో గ్రాంట్లు ఇవ్వొచ్చు. ఇందులో గ్రాంట్ల పరిమాణాన్ని కేంద్రం నిర్ణయిస్తుంది. రాష్ట్రాలు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం నుంచి రుణాలు తీసుకోవచ్చు. కేంద్రం నుంచి రాష్ట్రాలకు వనరుల బదిలీ 3 విధాలుగా ఉంటుంది.  

1) పన్నుల్లో వాటా

2) గ్రాంట్లు 

3) రుణాలు రాష్ట్రాల మొత్తం వ్యయంలో 35 నుంచి 45% కేంద్ర ప్రభుత్వమే అందిస్తోంది.

విపత్తు సహాయ నిధి  (Calamity Relief Fund - CRF): జాతీయ విపత్తులు సంభవించినప్పుడు 8వ విత్తసంఘం వరకు రాష్ట్రాలకు మార్జిన్‌ మనీ పథకం ద్వారా కొంత సాయం చేసేవారు. ఇందుకు భిన్నంగా 9వ విత్త సంఘం ప్రతీ రాష్ట్రానికి విపత్తు సహాయ నిధిని ఏర్పాటు చేయాలని సూచించింది. దీనికి కేంద్రం, రాష్ట్రాలు 75 : 25 నిష్పత్తిలో నిధులు అందిస్తాయి. 

10వ విత్తసంఘం దీన్ని కొనసాగించి, కేంద్రానికి జాతీయ విపత్తు సహాయ నిధిని (NFCR) సిఫార్సు చేసింది. ఇది వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ప్రకృతి విపత్తుల వల్ల పంట నష్టం సంభవించినప్పుడు రైతులకు సాయం అందించడం దీని ఉద్దేశం. 

11వ విత్తసంఘం NFCR స్థానంలో NCCM (National Centre for Calamity Management) ని సిఫార్సు చేసింది. ఇది కూడా వ్యవసాయ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోనే పనిచేస్తుంది. 

13వ విత్తసంఘం జాతీయ విపత్తు సహాయ నిధి(NFCR)E NDRF (National Disaster Response Fund) లో; రాష్ట్రాల్లోని CRF ని SDRF (State Disaster Response Fund)లో విలీనం చేయాలని సూచించింది. 

SDRF కి కేంద్ర రాష్ట్రాలు సాధారణ రాష్ట్రాలకు 75 : 25 నిష్పత్తిలో, ప్రత్యేక కేటగిరి రాష్ట్రాల్లో 90 : 10 నిష్పత్తిలో నిధులు అందించాలని సూచించింది.

స్థానిక సంస్థలకు గ్రాంట్లు: 1993లో తీసుకొచ్చిన 73, 74వ రాజ్యాంగ సవరణలు పంచాయతీ, మున్సిపాలిటీలకు స్థానిక ప్రభుత్వాలుగా ఎదిగే అవకాశం కల్పించాయి. స్థానిక సంస్థలకు నిధులు అందించాలని మొదటిసారిగా 11వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది.

డెట్‌ రిలీఫ్‌: రాష్ట్రాలకు రుణభారం పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో వాటి కోశ సామర్థ్యం ఆధారంగా 10వ ఆర్థిక సంఘం ఒక డెట్‌ రిలీఫ్‌ పథకాన్ని సిఫార్సు చేసింది. రాష్ట్రాలు రుణాల కోసం కేంద్రంపై ఆధారపడటం తగ్గించాలని; మార్కెట్‌ నుంచి రుణాలు సేకరించాలని 12వ విత్తసంఘం సిఫార్సు చేసింది. ఇప్పటి వరకు 14 ఆర్థిక సంఘాల సిఫార్సులు అమలయ్యాయి. ప్రస్తుతం 15వ ఆర్థిక సంఘం సిఫార్సులు అమలవుతున్నాయి.

 ఆర్థిక సంఘం  ఛైర్‌పర్సన్ సిఫార్సులు అమలైన కాలం
1వ కె.సి.నియోగి 1952 - 57
2వ కె.సంతానం 1957 - 62
3వ ఎ.కె.చందా 1962 - 66
4వ పి.వి.రాజమన్నార్‌ 1966 - 69
5వ మహావీర్‌ త్యాగి 1969 - 74
6వ కె.బ్రహ్మానందరెడ్డి 1974 - 79
7వ జె.ఎం.షెలాట్ 1979 - 84
8వ వై.బి.చవాన్ 1984 - 89 
9వ   ఎన్‌.కె.పి.సాల్వే 1989 - 95
10వ కె.సి.పంత్‌ 1995 - 2000
11వ ఎ.ఎం.ఖుస్రో 2000 - 05
12వ సి.రంగరాజన్ 2005 - 10
13వ  విజయ్‌ ఎల్‌.కేల్కర్‌   2010 - 15
14వ వై.వి.రెడ్డి  2015 - 20
15వ ఎన్‌.కె.సింగ్‌ 2020 నుంచి
Posted Date : 15-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌