సాగులో అనంతపురం.. పచ్చికలో ప్రకాశం!
మనిషి జీవనానికి, సంక్షేమానికి నేలలు అంత్యంత అవసరం. ఆహారాన్ని అందించడంలో, నీటిని, వాతావరణాన్ని, పర్యావరణాన్ని పరిరక్షించడంలో, మొత్తం మీద ఒక ప్రాంతానికి సాంస్కృతిక గుర్తింపును తెచ్చిపెట్టడంలో అవి కీలకపాత్ర పోషిస్తాయి. అందుకే ఒక దేశం లేదా ఒక రాష్ట్రం గురించి అధ్యయనం చేసేటప్పుడు అక్కడి నేలలు, రకాలు, వాటి స్వభావాలు, విస్తరణ తదితర అంశాలను తెలుసుకోవాలి.
విభజన చట్టం ద్వారా తెలంగాణలోని ఖమ్మం జిల్లా నుంచి 7 మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపారు. ఇవన్నీ పోలవరం ప్రాజెక్టు ముంపునకు గురయ్యే మండలాలు. ఇందులో మూడు మండలాలను (బూర్గంపాడు, కుక్కునూరు, వేలేరుపాడు) పశ్చిమ గోదావరి జిల్లాలో కలపగా, నాలుగు మండలాలను (కూనవరం, చింతూరు, భద్రాచలం, వరరామ చంద్రాపురం) తూర్పు గోదావరి జిల్లాలో కలిపారు

*ఈ పట్టిక పరిశీలిస్తే అధిక భూమి నికర సాగు కింద ఉండగా, ఆ తర్వాత అడవులు, వ్యవసాయేతర భూమి ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
*ప్రస్తుత బీడు భూమి అంటే తాత్కాలికంగా సాగు చేయకుండా ఉండే భూమి. నిష్ప్రయోజన భూములు అంటే కొండలు, పర్వతాలు, ఇసుక నేలలుండే భూములు.
* అత్యధిక అటవీ భూమి ఉండే జిల్లాలు: కడప, తూర్పు గోదావరి, చిత్తూరు.
* అత్యధిక నిష్ప్రయోజన భూములున్న జిల్లాలు: కడప, అనంతపురం.
* అధిక వ్యవసాయేతర భూములుండే జిల్లాలు: నెల్లూరు, ప్రకాశం.
* అధిక పచ్చిక బయళ్లు ఉండే జిల్లాలు: ప్రకాశం, నెల్లూరు.
* అత్యధిక నికర సాగు నేల ఉండే జిల్లాలు: అనంతపురం, కర్నూలు.
వర్షపాతం: ఆంధ్రప్రదేశ్ సగటు వర్షపాతం 966 మి.మీ. ప్రాంతాల వారీగా అధిక వర్షపాతం కోస్తాంధ్రలో ఉంటుంది. వర్షం కురిసే కాలాన్ని బట్టి 1) నైరుతి రుతుపవన కాలం 2) ఈశాన్య రుతుపవన కాలంగా విభజిస్తారు.
నైరుతి రుతుపవన కాలం: నైరుతి రుతుపవనాలు జూన్ 2వ వారంలో ప్రవేశిస్తాయి. ఈ సమయంలోనే వ్యవసాయంలో ఖరీఫ్ కాలం ప్రారంభమవుతుంది. ఈ కాలంలోనే అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. సాధారణ సగటు వర్షపాతం 556 మి.మీ. కాగా 2021 - 22లో అత్యధికంగా 704 మి.మీ. కురిసింది. విజయనగరం, తూర్పు గోదావరి జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది.
ఈశాన్య రుతుపవన కాలం: అక్టోబరు మూడో వారంలో ఈశాన్య రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయి. వ్యవసాయంలో రబీ కాలం ప్రారంభమవుతుంది. సాధారణ సగటు వర్షపాతం 296 మి.మీ కాగా 2021 - 22లో 370.3 మి.మీ. నమోదైంది. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో అధిక వర్షం కురిసింది.
* మార్చి నుంచి మే మధ్యకాలాన్ని ‘మ్యాంగో షవర్స్’గా పేర్కొంటారు. ఈ కాలంలో రాష్ట్రంలో సగటు వర్షపాతం 98.3 మి.మీ.
భూకమతాలు - స్వరూపం: వ్యవసాయదారు సాగు చేసే భూ విస్తీర్ణాన్ని కమతం అంటారు. కమతాలను నాలుగు రకాలుగా వర్గీకరిస్తారు.
1) ప్రాథమిక కమతం: కేవలం కడుపు నింపడానికి సరిపడా ఆదాయం ఇచ్చే కమతం.
2) ఆర్థిక కమతం: కడుపు నింపడంతో పాటు ఇతర కనీస అవసరాలు తీర్చే కమతం. ప్రణాళిక సంఘం ప్రకారం 10 - 12 ఎకరాలు.
3.) అభిలషణీయ కమతం: ఆర్థిక కమతం × 3 రెట్లు
4) కుటుంబ కమతం: ప్రణాళిక సంఘం ప్రకారం (1961) అయిదుగురు కుటుంబ సభ్యులున్న రైతుకు సగటున రూ.1,200 వార్షిక ఆదాయం అందించే భూమి. ప్రణాళిక సంఘం 5 ఎకరాలను కుటుంబ కమతంగా నిర్ణయించింది.
సగటు కమతం = సొంత భూమి + కౌలుకు తీసుకున్న భూమి - కౌలుకు ఇచ్చిన భూమి
1970 - 71 నుంచి ప్రతి అయిదేళ్లకోసారి వ్యవసాయ గణాంకాల సేకరణ (సెన్సస్) జరుగుతుంది. పదో వ్యవసాయ గణాంకాలను 2015 - 16లో విడుదల చేశారు.
* రాష్ట్ర 10వ వ్యవసాయ సెన్సస్ ప్రకారం (2015 - 16) మొత్తం కమతాల సంఖ్య - 85.24 లక్షలు. * మొత్తం వ్యవసాయ భూమి - 80.04 లక్షల హెక్టార్లు.* 2015 - 16లో రాష్ట్ర సగటు కమతం 0.94 హెక్టార్లు.
కమతాలను వాటి భూమి పరిమాణం ఆధారంగా 5 రకాలుగా విభజిస్తారు.
1) ఉపాంత కమతం: ఒక హెక్టారు కంటే తక్కువ ఉన్న భూమి.
2) చిన్న కమతం: 1 - 2 హెక్టార్ల మధ్య ఉన్న భూమి.
3) దిగువ మధ్య కమతం: 2 - 4 హెక్టార్ల మధ్య ఉన్న భూమి.
4) మధ్యస్థాయి కమతం: 4 - 10 హెక్టార్ల మధ్య ఉన్న భూమి.
5) పెద్ద కమతం: 10 హెక్టార్ల కంటే ఎక్కువ ఉన్న భూమి.
రాష్ట్రంలో మొత్తం కమతాలు 85.24 లక్షలు, మొత్తం కమతాల విస్తీర్ణం 80.04 లక్షల హెక్టార్లు.
* 2005 - 06లో ఆంధ్రప్రదేశ్ సగటు కమతం 1.13 హెక్టార్లు.
* 2010 - 11లో ఆంధ్రప్రదేశ్ సగటు కమతం 1.06 హెక్టార్లు
* 2015 - 16లో ఆంధ్రప్రదేశ్ సగటు కమతం 0.94 హెక్టార్లు
* 2015 - 16లో ఎస్సీ రైతుల సగటు కమతం 0.68 హెక్టార్లు
* 2015 - 16లో ఎస్టీ రైతుల సగటు కమతం 1.07 హెక్టార్లు
కమతాల పరిమాణం తగ్గడానికి కారణాలు
* జనాభా పెరుగుదల
* వ్యవసాయ భూమి పెరగకపోవడం
* ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం
* భూసంస్కరణ చట్టాలు
* ప్రభుత్వ ఉచిత భూమి పంపిణీ విధానాలు
పరిష్కార మార్గాలు
* అభిలషణీయ కమతం పరిమితి విధించడం
* కమతాల ఏకీకరణ
* ఉమ్మడి సహకార వ్యవసాయం అవలంబించడం వ ర్యాంకు
2015 - 16 జిల్లాల వారీగా సగటు కమతం ర్యాంకులు
1) అనంతపురం (1.63 హెక్టార్లు) - 1వ ర్యాంకు
2) కర్నూలు (1.42 హెక్టార్లు) - 2వ ర్యాంకు
3) ప్రకాశం (1.16 హెక్టార్లు) - 3వ ర్యాంకు
4)కడప (1.15 హెక్టార్లు) - 4వ ర్యాంకు
12) తూర్పు గోదావరి (0.62 హెక్టార్లు) - 12వ ర్యాంకు
13) శ్రీకాకుళం (0.51 హెక్టార్లు) - 13వ ర్యాంకు
2015-16 లో అత్యధిక వ్యవసాయ భూమి ర్యాంకులు: అనంతపురం మొదటి, కర్నూలు 2వ, ప్రకాశం 3వ, గుంటూరు 4వ, శ్రీకాకుళం 12వ, విజయనగరం 13వ స్థానాల్లో ఉన్నాయి.
2015-16 అత్యధిక వ్యవసాయదారుల ర్యాంకులు: గుంటూరు (8.41 లక్షల మంది) మొదటి, తూర్పుగోదావరి (7.74 లక్షల మంది) 2వ, అనంతపురం (7.70 లక్షల మంది) 3వ, కడప (4.89 లక్షల మంది) 13వ స్థానాల్లో ఉన్నాయి.
* అత్యధిక ఉపాంత రైతులున్న జిల్లా - తూర్పుగోదావరి
* అత్యధిక చిన్నకారు రైతులున్న జిల్లా - అనంతపురం
* అత్యధిక దిగువ మధ్యతరగతి రైతులున్న జిల్లా - అనంతపురం
* అత్యధిక మధ్య తరగతి రైతులున్న జిల్లా - అనంతపురం
* అత్యధిక పెద్ద రైతులున్న జిల్లా - అనంతపురం
* అత్యధిక ఉపాంత భూములున్న జిల్లా - గుంటూరు
* అత్యధికంగా చిన్నకారు రైతుల భూములున్న జిల్లా - అనంతపురం
* అత్యధికంగా చిన్న, మధ్యస్థాయి భూములున్న జిల్లా - అనంతపురం
* అత్యధిక మధ్య స్థాయి భూములున్న జిల్లా - కర్నూలు
* అత్యంత పెద్ద వ్యవసాయ భూములున్న జిల్లా - అనంతపురం
రచయిత: ధరణి శ్రీనివాస్