• facebook
  • whatsapp
  • telegram

భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ-రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా(ఆర్ బిఐ)


ఆర్‌బీఐ - మిగులు నిధుల వినియోగం

* దేశంలో ఆర్థిక అనిశ్చితి ఏర్పడినప్పడు దాన్ని తట్టుకునేందుకు కేంద్ర బ్యాంకు వద్ద కొన్ని నిధులు ఉండాలి. అవి భారీ మొత్తంలో ఉండాల్సిన అవసరం లేదు. ఈ నిల్వలు బ్యాలెన్స్‌ షీట్‌లో 5.5  6.5 శాతం మేర ఉంటే సరిపోతుందని బిమల్‌ జలాన్‌ కమిటీ సిఫార్సు చేసింది.

* దేశంలో ద్రవ్యలోటును 3.3 శాతానికి పరిమితం చేయాలనేది ఆర్‌బీఐ లక్ష్యాల్లో ఒకటి. దీనికోసం ఆర్‌బీఐ మిగులు నిధులను ఉపయోగిస్తుంది.

* నగదు లభ్యత సమస్యలకు పరిష్కరించేందుకు వాడుతుంది.

* బ్యాంకులకు అదనపు మూలధనం సమకూర్చేందుకు వినియోగిస్తుంది.

* పన్నుల ద్వారా తగినంత ఆదాయం రానప్పుడు కేంద్రం ఈ నిధులను వాడుకోవచ్చు. ప్రభుత్వం ఈ నిధులను తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు.

* ఆదాయ వ్యయాల తర్వాత ఆర్‌బీఐ కొంతమొత్తాన్ని అత్యవసర నిధికి (కంటింజెన్సీ ఫండ్‌) జమ చేస్తుంది. మిగిలిన భాగాన్ని డివిడెండ్‌ రూపంలో కేంద్రానికి బదిలీ చేస్తుంది. 

* 201213 వరకు ఆర్‌బీఐ కొంత మొత్తాన్ని అత్యవసర నిధికి కేటాయించింది. 201011, 201213 మధ్య ఆర్‌బీఐ తమ స్థూల లాభాల్లో 3245 శాతాన్ని బీమా చేసింది. దీంతో ఆర్‌బీఐ మొత్తం ఆస్తుల్లో అత్యవసర నిధి వాటా 910 శాతానికి చేరింది. 

* 201314, 201516లో ఆర్‌బీఐ ఈ విధానాన్ని మార్చి, మిగులు నిధులను ప్రభుత్వానికి బదిలీ చేసింది. మళ్లీ 201617 నుంచి బ్యాలెన్స్‌ షీట్‌లో కంటింజెన్సీ ఫండ్‌కి 6.8% కేటాయించింది. దీన్ని 6.5  5.5 శాతానికి పరిమితం చేయాలని బిమల్‌ జలాన్‌ కమిటీ సూచించింది. కేంద్ర బ్యాంకు బోర్డు 5.5 శాతం ఉంచాలని నిర్ణయించి, అదనంగా ఉన్న రూ.52,637 కోట్లను ప్రభుత్వానికి బదిలీ చేసింది.

* బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు ప్రజలకు విరివిగా రుణాలు ఇవ్వాలి. వీటిని వినియోగించడం ద్వారా వృద్ధి పెరుగుతుంది. అదే సమయంలో పెరిగిన డిమాండ్‌కి (గిరాకీ) అనుగుణంగా ద్రవ్యోల్బణం కూడా పెరుగుతుంది. 

* 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం తర్వాత 2009లో ప్రభుత్వం ఉద్దీపనల కోసం 6.5 బిలియన్‌ డాలర్లు (డాలర్‌ మారకపు విలువతో లెక్కిస్తే సుమారు రూ.46,800 కోట్లు) వెచ్చించింది. ఇది 2008 జీడీపీలో 0.5 శాతానికి సమానమని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) పేర్కొంది.

ఆర్‌బీఐ - ద్రవ్యవిధానం (MONETARY POLICY)

* ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి, ఉద్యోగిత, ధరల స్థాయులను ద్రవ్యసప్లయ్‌ ప్రభావితం చేస్తుంది. ఆర్థిక వ్యవస్థలో సమస్యలు ఏర్పడినప్పుడు, ద్రవ్యసప్లయ్‌లో మార్పులు చేసి ఆ పరిస్థితులను సరిదిద్దడాన్ని ద్రవ్య విధానం అంటారు.

* ద్రవ్యవిధానం ఆర్‌బీఐకి సంబంధించిన భావన. ఇది దేశంలోని ద్రవ్యసప్లయ్, చెలామణి, పరపతి నియంత్రణకు సంబంధించింది.

లక్ష్యాలు: మారకరేటును స్థిరంగా ఉంచడం ద్వారా విదేశీ చెల్లింపుల శేషంలో సమతౌల్యత సాధించడం.

* సంపూర్ణ ఉద్యోగిత, సుస్థిరాభివృద్ధి సాధించండం

* ఎగుమతులకు, పొదుపు పెట్టబడులకు ప్రోత్సాహం

* ఉపాధి కల్పించడం

* అవస్థాపన వసతుల అభివృద్ధి

* ఆర్‌బీఐ చెల్లించాల్సిన మొత్తంలో లోటు ఉన్నప్పుడు వాటిని భర్తీచేయడానికి తీసుకునే లావాదేవీలను అఫీషియల్‌ రిజర్వ్‌ సేల్‌ (అధికారిక నిల్వ విక్రయం) అంటారు.

* స్థూలదేశీయోత్పత్తిలో పెరుగుదల అనేది ఆర్థిక వృద్ధి లేదా అభివృద్ధి వినియోగ వ్యయం, పెట్టుబడిపై ఆధారపడి ఉంటుంది. ఈ రెండు ద్రవ్యసప్లయ్‌పై ఆధారపడి ఉంటాయి.

* ద్రవ్యసప్లయ్, ద్రవ్యడిమాండ్‌ మధ్య సమతౌల్యం ఉంటే, ధరల స్థాయి స్థిరంగా ఉంటుంది.

* ద్రవ్యడిమాండ్‌ కంటే ద్రవ్యసప్లయ్‌ పెరిగితే ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. ద్రవ్యసప్లయ్‌ తగ్గితే ప్రతి ద్రవ్యోల్బణం వస్తుంది. కాబట్టి సుస్థిరాభివృద్ధికి ధరల స్థిరీకరణ అవసరం.

* ద్రవ్యవిధాన ప్రధాన లక్ష్యం ‘ధరల స్థిరీకరణ’ (price stability)

* 1972 నుంచి ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడమే ద్రవ్యవిధాన ప్రధాన లక్ష్యంగా ఉంది.

ద్రవ్యవిధాన కమిటీ (MPTC):

* 2016, జూన్‌ 27న అప్పటి ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ సూచన మేరకు ద్రవ్యవిధాన కమిటీని ఏర్పాటు చేశారు. తొలి సమావేశం 2016, అక్టోబరు 3న ముంబయిలో జరిగింది.

* దీనికి ఆర్‌బీఐ గవర్నర్‌ అధ్యక్షత వహిస్తారు. ఒక డిప్యూటీ గవర్నర్‌తో సహా మొత్తం ఆరుగురు ఉంటారు.

ప్రస్తుత కమిటీ:

1) శక్తికాంతదాస్‌ (అధ్యక్షులు)

2) మైఖేల్‌ దెబ్రతా పాత్ర (ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌)

3) రాజీవ్‌ రంజన్‌    4) ఆశిమ గోయల్‌   

5) శశాంక బిదే     6) జయంత్‌ వర్మ

* ద్రవ్యవిధాన కమిటీ ఏడాదిలో కనీసం నాలుగుసార్లు సమావేశం అవ్వాలి. కనీసం నలుగురు సభ్యులు హాజరవ్వాలి. ప్రతి సభ్యుడికీ ఒక ఓటు ఉంటుంది. ప్రతి ఆరునెలలకోసారి ఆర్‌బీఐ ద్రవ్యవిధానాన్ని ప్రకటిస్తుంది.

సీగ్నియోరేజ్‌ (SEIGNIORAGE)

నాణేలను ముద్రించడానికి అయ్యే ఖర్చు, నాణెం ముఖ విలువ మధ్య తేడాను సీగ్నియోరేజ్‌ అంటారు. ఇది కరెన్సీ నాణేల ముద్రణ ద్వారా ఆర్‌బీఐ పొందే లాభం. ఆర్‌బీఐ పొందే నికర వడ్డీ ఆదాయంలో మొత్తం వ్యయం 7 శాతానికి మించకూడదు. దీంతో కేంద్రబ్యాంకు ఆర్జించే లాభం చాలా ఎక్కువగా ఉంటుంది.

ఖాతాదార్ల హక్కుల చార్టరు

దీన్ని 2014, డిసెంబరు 3న ఆర్‌బీఐ జారీ చేసింది. దీని ప్రకారం ఖాతాదార్లు అయిదు హక్కులు కలిగి ఉంటారు. అవి:

1) ఫెయిర్‌ ట్రీట్‌మొంట్‌     2)  ట్రాన్స్‌పరెన్సీ, ఫెయిర్, హానెస్ట్‌ డీలింగ్స్‌

3) న్యూటబిలిటీ            4) ప్రైవసీ

5) గ్రివెన్స్‌ రిడ్రెస్, కాంపన్సేషన్‌


ఆర్‌బీఐ కేంద్ర ప్రభుత్వానికి  బదిలీ చేసిన నిధులు


సంవత్సరం       నిధుల బదిలీ (రూ.కోట్లలో)


2012-13           33,010

2013-14           52,679

2014-15            65,896

2015-16           65,876

2016-17           30,659

2017-18           50,000

2018-19         1,76,051

2021-22            30,307

2022-23           87,416 

                      (ఈ మొత్తాన్ని చెల్లించేందుకు ఆర్‌బీఐ బోర్డు ఆమోదం తెలిపింది)

ద్రవ్యవిధాన సాధనాలు

ద్రవ్యవిధానం ద్వారా ఆర్‌బీఐ పరపతిని నియంత్రిస్తుంది. ఇందులో రెండు సాధనాలు ఉన్నాయి. అవి:


1. పరిమాణాత్మక నియంత్రణ సాధనాలు      2. గుణాత్మక నియంత్రణ సాధనాలు

పరిమాణాత్మక నియంత్రణ సాధనాలు

రెపోరేటు: బ్యాంకులకు ఆర్‌బీఐ ఇచ్చిన రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు. దీన్ని 1992లో ఎం.నరసింహం కమిటీ సూచన మేరకు ప్రవేశపెట్టారు. ద్రవ్యోల్బణం ఏర్పడినప్పుడు రెపోరేటు పెంచుతారు. ప్రతి ద్రవ్యోల్బణం సమయంలో రెపోరేటు తగ్గిస్తారు.

రివర్స్‌ రెపోరేటు: 1996లో ఎం.నరసింహం కమిటీ సూచనమేరకు దీన్ని ప్రవేశపెట్టారు. ఆర్‌బీఐ వద్ద వాణిజ్య బ్యాంకులు ఉంచే నిధులకు కేంద్ర బ్యాంకు ఇచ్చే వడ్డీరేటు. ద్రవ్యోల్బణం ఏర్పడితే రివర్స్‌ రెపోరేటు పెంచుతారు. ప్రతి ద్రవ్యోల్బణంలో తగ్గిస్తారు.

నగదు నిల్వల నిష్పత్తి: వాణిజ్య బ్యాంకులు సేకరించిన వివిధ రకాల డిపాజిట్లలో కొంత డబ్బును కేంద్రబ్యాంకు వద్ద నగదుగా ఉంచుతారు. దీన్ని నగదు నిల్వల నిష్పత్తి అంటారు. ద్రవ్యోల్బణం ఏర్పడినప్పుడు నగదు నిల్వల నిష్పత్తి పెంచుతారు. ప్రతి ద్రవ్యోల్బణంలో తగ్గిస్తారు. కేంద్ర బ్యాంకు నగదు నిల్వల నిష్పత్తి పెంచితే ద్రవ్యచలామణి తగ్గుతుంది. వస్తు, సేవలకు డిమాండ్‌ (గిరాకీ) తగ్గుతుంది.

బ్యాంకురేటు: వాణిజ్య, సహకార, అభివృద్ధి బ్యాంకులకు రుణాలు కల్పించినందుకు ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటును బ్యాంకురేటు అంటారు. ఈ రుణాన్ని ప్రత్యక్షంగా లేదా ఆయా బ్యాంకులు డిస్కౌంట్‌ చేసుకున్న వినిమయ బిల్లులు లేదా ట్రెజరీ బిల్లులు రీడిస్కౌంట్‌ చేయడం ద్వారా కేంద్రబ్యాంకు ఇస్తుంది. దీన్ని రీడిస్కౌంట్‌ రేటు అంటారు. ద్రవ్యోల్బణంలో పెంచుతారు, ప్రతిద్రవ్యోల్బణంలో తగ్గిస్తారు.

చట్టబద్ధ (శాసన) ద్రవ్యత్వ నిష్పత్తి: బ్యాంకులు నిధులను పూర్తిగా నగదు రూపంలో తనవద్దే ఉంచుకోకూడదు. అందులో కొంత మొత్తాన్ని ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడిగా పెట్టాలి. దీన్నే చట్టబద్ధ ద్రవ్యత్వ నిష్పత్తి అంటారు. దీన్ని బ్యాంకులు నగదు, బంగారం, నిర్దేశిత సాధనాల్లో భారం లేని పెట్టుబడిగా నిర్వహించాలి. దీన్ని ద్రవ్యోల్బణంలో పెంచుతారు, ప్రతిద్రవ్యోల్బణంలో తగ్గిస్తారు. బహిరంగ మార్కెట్లో కంపెనీలు, రిటైలర్లకు ఇచ్చే రుణవితరణను నియంత్రించేందుకు కేంద్రబ్యాంకు ఈ సాధనాన్ని ఉపయోగిస్తుంది. నగదు మినహా బాండ్ల రూపంలో ఉన్న నిధులను బ్యాంకులు రుణాలుగా ఇవ్వడానికి వీల్లేదు.

బహిరంగ మార్కెట్‌ చర్యలు: ఆర్‌బీఐ ప్రభుత్వ, ప్రభుత్వ ఆమోదం పొందిన సెక్యూరిటీలను కొనడం, అమ్మడాన్ని బహిరంగ మార్కెట్‌ అంటారు. వాణిజ్య బ్యాంకులు, ఇతర విత్త సంస్థలు ఈ లావాదేవీల్లో పాల్గొంటాయి.

ద్రవ్యత్వ సర్దుబాటు సౌకర్యం: ద్రవ్యసమస్య ఎదుర్కొంటున్న షెడ్యూల్డ్‌ వాణిజ్య బ్యాంకులకు ఆర్‌బీఐ డబ్బును అందించి, వసూలు చేసే వడ్డీ రేటు. బ్యాంకింగ్‌ వ్యవస్థలో ద్రవ్య లభ్యతకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ద్రవ్యత్వ సర్దుబాటు సౌకర్యం ఉపయోగపడుతుంది.

మార్జినల్‌ స్టాండింగ్‌ ఫెసిలిటీ పథకం: దీన్ని 2011లో ప్రవేశపెట్టారు. బ్యాంకులు అతి స్వల్పకాలిక రుణాలు పొందడానికి ఉపయోగపడే పథకం.


గుణాత్మక నియంత్రణ సాధనాలు 

పరపతి రేషనింగ్‌: వాణిజ్య బ్యాంకులు వివిధ అవసరాలకు ఇచ్చే రుణాలపై ఆర్‌బీఐ గరిష్ఠ పరిమితిని నిర్ణయిస్తుంది. బ్యాంకులు మంజూరుచేసే రుణాలను నియంత్రించడం, క్రమబద్ధీకరించడంలో కేంద్రబ్యాంకు దీన్ని అమలు చేస్తుంది.

మార్జిన్లలో మార్పు: బ్యాంకులకు రుణాలు మంజూరు చేయడానికి ఆర్‌బీఐ కొన్ని షరతులను (అర్హత, తాకట్టు, సెక్యూరిటీ మొదలైనవి) విధిస్తుంది. దీనిలో మార్పులు చేయడం ద్వారా ఆర్‌బీఐ వివిధ రంగాల మధ్య రుణ పంపిణీలో విచక్షణ చూపొచ్చు.

వ్యత్యాస వడ్డీ రేట్ల మార్పు: వివిధ అవసరాలకు వేర్వేరుగా వడ్డీ రేట్లు నిర్ణయిస్తుంది. వడ్డీ రాయితీల్లోనూ తేడా ఉండొచ్చు.

నైతికోద్భోద: అవసరాలను బట్టి ఆయా రంగాలకు అధికంగా రుణాలు ఇవ్వమని లేదా తగ్గించమని కేంద్రబ్యాంకును విత్త సంస్థలు కోరొచ్చు.

ఆదేశాలు జారీచేయడం: పరపతి విషయంలో ఆర్‌బీఐ కచ్చితమైన ఆదేశాలు జారీ చేస్తుంది. పాటించకపోతే చర్యలు తీసుకుంటుంది.

Posted Date : 13-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌