• facebook
  • whatsapp
  • telegram

ఏపీపై పునర్‌వ్యవస్థీకరణ ప్రభావం

విభజన చట్టం... చిక్కుల చట్రం!

  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజనతో అన్నివిధాలుగా నష్టపోయిన రాష్ట్రంగా అవశేష ఆంధ్రప్రదేశ్‌ అవతరించింది. పంపకాల్లో ఆర్థిక వనరులు తక్కువగా, అప్పుల భారం ఎక్కువగా దక్కడంతో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. పూర్తి శాస్త్రీయ పరిశీలన లేకుండా, హడావుడిగా చేసిన పునర్వవస్థీకరణ చట్టమే ఇందుకు కారణం. ఈ చట్టంలో ఉన్న చిక్కుముడుల వంటి సెక్షన్లు, వాటి పర్యవసానాలను పోటీ పరీక్షార్థులు సమగ్రంగా అర్థం చేసుకొని అవగాహన పెంచుకోవాలి.

  ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టం - 2014ను  రాష్ట్రపతి ఆమోదం అనంతరం  భారత గెజిట్‌ నంబర్‌-6 ద్వారా 2014, మార్చి 1న ప్రకటించారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ 2014, మార్చి 4న భారత గెజిట్‌ నంబర్‌ - 560 ద్వారా 2014, జూన్‌ 2ను అపాయింటెడ్‌ డే (అవతరణ రోజు) అని నిర్ణయించింది. దీంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ 2014, జూన్‌ 2న రెండు రాష్ట్రాలుగా (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌) విడిపోయింది.

  సరికొత్త ఆంధ్రప్రదేశ్‌ ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టం - 2014 మూల కారణమని చెపవచ్చు. ఈ చట్టంలో రూపొందించిన నిబంధనలు స్వల్ప, మధ్యకాలాల్లో అవశేష ఆంధ్రప్రదేశ్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. 

సెక్షన్‌-3 ఆంధ్రప్రదేశ్‌ ప్రాదేశిక ప్రాంతం: పదమూడు జిల్లాలతో పాటు 2005, జూన్‌ 27న జలవనరుల శాఖ ఉత్తర్వు జీఓ ఎంఎస్‌ నం.111లో పేర్కొన్న గ్రామాలు, ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలంలోని బూర్గంపాడు, సీతానగరం, కొండ్రెక రెవెన్యూ గ్రామాలను మాత్రమే నవ్యాంధ్రప్రదేశ్‌లో కలిపారు. దీనివల్ల పోలవరం బహుళ ప్రయోజన సాగునీటి ప్రాజెక్టు పూర్తయితే ముంపునకు గురయ్యే అనేక గ్రామాలు తెలంగాణ రాష్ట్రంలో ఉండిపోతాయి. దీంతో వ్యాజ్యాలు పెరుగుతాయి. ఇది పోలవరం ప్రాజెక్టుకు ప్రతిబంధకంగా మారుతుంది. అన్నింటికీ మించి ప్రాజెక్టు నిర్వాసితులకు సహాయం, పునరావాసం కల్పించడం అసాధ్యం అవుతుంది.

  అయితే విభజన చట్టంలోని సెక్షన్‌ 3ని 2014, జులై 17న భారత ప్రభుత్వం సవరించింది. ఖమ్మం జిల్లాలో ముంపునకు గురయ్యే 7 మండలాల్లోని (5 పూర్తి + 2 పాక్షిక) 211 చిన్న గ్రామాలు (హామ్లెట్‌లు), 136 రెవెన్యూ గ్రామాలను అవశేష ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేసింది. ఈ చర్య వల్ల ప్రతికూల పరిస్థితి కొంత మేర తగ్గింది. ఆంధ్రప్రదేశ్‌లోని పొరుగు జిల్లాలతో ఈ గ్రామాలను కలపడానికి, సమర్థ పాలన సంస్థలను ఏర్పాటు చేయడానికి, తీవ్ర నిర్వహణ సవాళ్లు ఎదురయ్యాయి. చివరకు ఏడు మండలాల్లోని 3 మండలాలు (వాలైర్‌పాడు, బూర్గంపాడు, కుకునూర్‌) పశ్చిమ గోదావరి జిల్లాలో; మిగిలిన 4 మండలాలు (భద్రాచలం, కూనవరం, చింతూరు, వరరామచంద్రాపురం) తూర్పుగోదావరి జిల్లాలో విలీనం చేశారు.

సెక్షన్‌-5, సెక్షన్‌-8 - ఉమ్మడి రాజధాని, పాలన: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు హైదరాబాద్‌ పదేళ్లకు మించని కాలానికి ఉమ్మడి రాజధానిగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టం - 2014లోని సెక్షన్‌ - 5లో పేర్కొన్నారు. అంటే 10 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని లేదు. ఈ సమయం లోపు రాజధాని నిర్మాణం జరగాలి. ఇది కొత్తరాష్ట్రం అభివృద్ధికి ప్రధాన ప్రతిబంధకం.

* గ్రేటర్‌ హైదరాబాద్‌ (జీహెచ్‌ఎంసీ) ప్రాంతంలో నివసిస్తున్న ప్రజల భద్రత, స్వేచ్ఛ, వారి ఆస్తులకు రక్షణ కల్పించే ప్రత్యేక బాధ్యతలను ఉమ్మడి గవర్నర్‌కు సెక్షన్‌-8 ద్వారా అప్పగించారు. అయితే గవర్నర్‌ తన బాధ్యతలు నిర్వర్తించేటప్పుడు తెలంగాణ మంత్రిమండలిని సంప్రదించడాన్ని, సెక్షన్‌-8 (3) ద్వారా తప్పనిసరి చేశారు. దీంతో పౌరుల రక్షణ, బాధ్యతల విషయంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు సమాన స్థాయిని కల్పించలేదని అర్థమవుతోంది. ఉమ్మడి గవర్నర్‌కు తెలంగాణ పైన ఎక్కువ అధికారాలు ఇవ్వడం సమాఖ్య సూత్రాలకు విరుద్ధంగా ఉందని చెప్పవచ్చు. అలాగే సెక్షన్‌ - 6లో పేర్కొన్న విధంగా ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధాని నగరం కోసం 6 నెలల్లో సిఫార్సులు చేసే విధంగా భారత ప్రభుత్వం శివరామకృష్ణన్‌ అధ్యక్షతన నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. దీనిని రాజధాని నగరాన్ని నిర్ణయించుకునే అధికారాన్ని, హక్కును కేంద్రం లాగేసుకునే ప్రయత్నంగా భావించవచ్చు.

సెక్షన్‌-9 - గ్రేహౌండ్స్, ఆక్టోపస్‌కు సహాయం: విభజన చట్టంలోని సెక్షన్‌-9 ప్రకారం రెండు రాష్ట్రాలకు అదనపు పోలీసు బలగాలు సమకూరే విధంగా కేంద్రం సహకరిస్తుంది. సెక్షన్‌ 9(2) ప్రకారం అపాయింటెడ్‌ డే నుంచి హైదరాబాద్‌లోని గ్రేహౌండ్స్‌ శిక్షణ కేంద్రాన్ని రెండు రాష్ట్రాలకు ఉమ్మడి శిక్షణ కేంద్రంగా కేంద్ర ప్రభుత్వమే మూడేళ్లపాటు నిర్వహిస్తుంది. ఆ తర్వాత అది తెలంగాణ శిక్షణ కేంద్రం అవుతుంది.

* సెక్షన్‌ 9(3) ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో ఆ రాష్ట్రం నిర్ణయించిన చోట ఇలాంటి అత్యాధునిక శిక్షణ కేంద్రం ఏర్పాటుకు కేంద్రం సహాయం చేస్తుంది. అయితే గ్రేహౌండ్స్‌ దళాలకు, ఆక్టోపస్‌కు మూడేళ్ల పాటు ఉమ్మడి శిక్షణ ఇవ్వాలనే నిబంధన వామపక్ష, ఉగ్రవాద, తీవ్రవాద సంస్థలను నియంత్రించడంలో ఆటంకంగా పరిణమించే అవకాశముంది.

5వ భాగం - రాబడి, వ్యయం:  13వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం కేంద్రం నుంచి పన్ను సంక్రమణను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి పంపిణీ చేయాలని విభజన చట్టంలోని 46(1) సెక్షన్‌ పేర్కొంటోంది. 13వ ఆర్థిక సంఘం ఫార్ములా ఆధారంగా కేంద్ర రాబడులను రెండు రాష్ట్రాలకు పంచితే, అంతకు ముందు వచ్చేదానికంటే 2014-15 ఆర్థిక సంవత్సరంలో అవశేష ఆంధ్రప్రదేశ్‌కు రూ.840 కోట్లు తక్కువగా వస్తుంది. అసలే వనరుల కొరతతో ఉన్న అవశేష ఆంధ్రప్రదేశ్‌కు ఇది మరింత ప్రతికూలంగా మారింది.

6వ భాగం- ఆస్తులు, అప్పుల పంపకం:  ఆస్తులను భౌగోళిక ప్రదేశం ఆధారంగా, అప్పులను జనాభా నిష్పత్తిలో (ఆంధ్రప్రదేశ్‌కి 58.32%, తెలంగాణకు 41.68%) పంచాలని విభజన చట్టం 6వ భాగంలో వివరించారు. అన్ని ప్రధాన ఆస్తులు హైదరాబాద్‌ నగరం, పరిసర ప్రాంతాల్లోనే ఉండటంతో అవశేష ఆంధ్రప్రదేశ్‌ వాటిని కోల్పోయింది. అప్పులు తీర్చే మార్గం లేక భారీగా రుణ బాధ్యత మిగిలిపోయింది. అంతేకాకుండా భౌగోళికంగా అవశేష ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర తుపానులు, వరదలు, సునామీలు సంభవిస్తుంటాయి. ఏటా అనేకసార్లు సహాయ పునరావాసంపై భారీగా వ్యయం చేయాల్సి ఉంటుంది. విభజన చట్టాన్ని రూపొందించేటప్పుడు ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోలేదు.

* ఆస్తి ఏ రాష్ట్రంలో ఉంటే దానికి సంబంధించిన భూమిశిస్తు, పన్ను రాబడి బకాయిలు ఆ రాష్ట్రానికే చెందుతాయి. అపాయింటెడ్‌ డే నాటికి ఆస్తుల మీద పన్ను మదింపు చేసే చోటు ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రానికే పన్ను బకాయిలు వసూలు చేసే అధికారం ఉంటుందని విభజన చట్టంలోని సెక్షన్‌ 50 పేర్కొంటోంది.

* ఉమ్మడి రాష్ట్రానికి సుమారు 45 శాతం ‘వ్యాట్‌’ను అందించే ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు, బేవెరేజెస్‌ కార్పొరేషన్లతో కలిపి పన్నులు, డ్యూటీల మదింపునకు హైదరాబాద్‌ ప్రధాన కేంద్రం. దీంతో సెక్షన్‌ 50 నిబంధన కారణంగా రూ.వందల కోట్ల మేర పన్ను బకాయిల్లో వాటాను అవశేష ఆంధ్రప్రదేశ్‌ కోల్పోయింది.

* సెక్షన్‌-51లో రుణాలు, అడ్వాన్సులు వసూలు చేసే హక్కుల గురించి పేర్కొన్నారు. సెక్షన్‌-51(1) ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలోని ఒక ప్రాంతంలోని ఏదైనా స్థానిక సంస్థ/సొసైటీ వ్యవసాయదారు లేదా ఇతర వ్యక్తికి అపాయింటెడ్‌ డేకు ముందు ఇచ్చిన రుణాలు, అడ్వాన్సులు వసూలు చేసే అధికారం ఆ ప్రాంతం ఉన్న రాష్ట్రానికే దక్కుతుంది.

* సెక్షన్‌-51(2) ప్రకారం ఉమ్మడి రాష్ట్రం హద్దుల వెలుపల ఎవరైనా వ్యక్తి లేదా సంస్థకు అపాయింటెడ్‌ డే ముందు ఇచ్చిన రుణాలు లేదా అడ్వాన్సులను వసూలు చేసే హక్కు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఉండాలి. అయితే అలా వసూలైన సొమ్మును జనాభా నిష్పత్తి ప్రాతిపదికన రెండు రాష్ట్రాల మధ్య పంచాలి.

* విభజన చట్టంలోని సెక్షన్‌ - 51 సాధారణంగా పారిశ్రామిక యూనిట్లకు ప్రోత్సాహకంగా 14 ఏళ్లపాటు ఇచ్చిన పన్ను నిలుపుదలకు సంబంధించింది. 14 ఏళ్ల తర్వాత పన్నును వార్షిక వాయిదాల్లో చెల్లించే విధంగా వడ్డీ లేని రుణంగా ప్రతిపాదించారు. సెక్షన్‌ - 51 (1) ప్రకారం ఆపి ఉంచిన పన్నులు ఆ పారిశ్రామిక ప్రాంతం ఉన్న రాష్ట్రానికి చెందుతాయి. అయితే ఇలా ఆపి ఉంచిన పన్నులన్నీ విభజనకు ముందు ఉమ్మడి రాష్ట్రమంతటా ఉన్న పారిశ్రామిక యూనిట్లతో జరిపిన లావాదేవీలే. ఈ పన్ను వసూళ్లను జనాభా నిష్పత్తిలో రెండు రాష్ట్రాల మధ్య పంచడం సముచితం. కానీ అలా జరగలేదు. పారిశ్రామిక ప్రాంతం ఎక్కువగా తెలంగాణలోనే ఉండటంతో చట్టంలోని నిబంధన ప్రకారం ఆ ప్రాంతానికే లాభం చేకూరింది.

* అధికంగా వసూలు చేసిన పన్నులను తిరిగి చెల్లించడం గురించి ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టం - 2014లోని సెక్షన్‌ - 56లో పేర్కొన్నారు. సెక్షన్‌ 56(1) ప్రకారం అధికంగా వసూలు చేసిన ఆస్తి పన్ను, సుంకం, భూమి శిస్తుకు సంబంధించి ఉమ్మడి రాష్ట్రంపై ఉన్న తిరిగి చెల్లింపు బాధ్యత, ఆ ఆస్తి నెలకొని ఉన్న కొత్త రాష్ట్రానికి చెందుతుంది. అధికంగా వసూలు చేసిన ఇతర పన్నులు, శిస్తులకు సంబంధించి ఉమ్మడి రాష్ట్రం తిరిగి చెల్లించే బాధ్యత కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య జనాభా ప్రాతిపదికన పంచాలి. తిరిగి చెల్లింపులు చేసిన రాష్ట్రానికి, ఇతర రాష్ట్రం నుంచి దాని వాటా తీసుకునే హక్కు ఉంటుంది. అలాగే సెక్షన్‌ 56(2) ప్రకారం ఉమ్మడి రాష్ట్రం అధికంగా వసూలు చేసిన ఇతర పన్నులు, శిస్తులు తిరిగి చెల్లించే బాధ్యత ఏ రాష్ట్రం హద్దుల్లో ఆ పన్ను మదింపు చేసే ప్రాంతం ఉందో ఆ రాష్ట్రానికి చెందుతుంది. అపాయింటెడ్‌ డే రోజున అధికంగా వసూలు చేసిన పన్ను గానీ, శిస్తుగానీ తిరిగి చెల్లించాల్సిన ఉమ్మడి రాష్ట్ర బాధ్యతను కొత్తగా ఏర్పడే రెండు రాష్ట్రాల మధ్య జనాభా ప్రాతిపదికపై పంచాలి. బకాయిలు తీర్చిన రాష్ట్రానికి మరొక రాష్ట్రపు వాటాను రాబట్టుకునే హక్కు ఉంటుంది.

* ప్రధానంగా పై రెండు సెక్షన్లు (56(1), 56(2)) పరస్పరం విరుద్ధమైనవి. పన్ను బకాయి విషయంలో మదింపు ప్రాంతం ఉన్న రాష్ట్రానికి వసూలు చేసే హక్కు ఉంటుంది. అయితే, వాపసు (తిరిగి చెల్లింపు బాధ్యత) విషయంలో మదింపు ప్రాంతాన్ని కలిగి ఉన్న రాష్ట్రం మొదట రుణ బాధ్యతను తీర్చినప్పటికీ జనాభా నిష్పత్తి ఆధారంగా ఆ రెండు రాష్ట్రాలు భారాన్ని పంచుకోవాల్సి ఉంటుంది. జనాభా నిష్పత్తిలో రెండు రాష్ట్రాల మధ్య బకాయిలను పంచినట్లయితే మదింపు ప్రదేశం ఉన్న రాష్ట్రానికి చెందుతుండటం, ఎక్కువగా పన్ను చెల్లింపుదారులు హైదరాబాదులోనే ఉండటం అవశేష ఆంధ్రప్రదేశ్‌కు ప్రతికూలం. దీంతో వ్యత్యాసాలు, వైరుధ్యాలు, అసంగతాలతో ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టం - 2014 సమన్యాయం, నిష్పక్షపాతం ప్రదర్శించడంలో విఫలమై సమస్యాత్మకంగా మారినట్లు స్పష్టమవుతోంది.

8వ భాగం - అఖిల భారత సర్వీసులు: ఎనిమిదో భాగంలోని సెక్షన్లు 76 నుంచి 83 వరకు రెండు రాష్ట్రాల మధ్య స్థానిక, జిల్లా, జోనల్, మల్టీ జోనల్, రాష్ట్ర కేడర్లలోని అఖిల భారత సర్వీసులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పంపిణీని వివరిస్తాయి. గతంలో కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలు అపాయింటెడ్‌ డే రోజున లేదా ముందుగా వారి సిబ్బందిని పంచుకున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్‌ విభజన విషయంలో ఆ విధంగా జరగలేదు. 

  అఖిల భారత సర్వీసుల అధికారుల విభజనపై ఏర్పాటు చేసిన ప్రత్యూష్‌ సిన్హా కమిటీ చాలా సమయం తీసుకుంది. అదేవిధంగా 10 వేల మందికి తక్కువ కాకుండా రాష్ట్ర కేడరు ఉద్యోగులను తెలంగాణ రాష్ట్రానికి పనిచేయాలని తాత్కాలికంగా ఆదేశించారు. ఇది పాలనా వ్యవస్థ పటిష్టతపై, రెండు రాష్ట్రాల్లోని అధికార యంత్రాంగం ప్రతిస్పందనపై ప్రతికూల ప్రభావం చూపింది.

IX, X షెడ్యూల్‌ సంస్థలు

  విభజన చట్టంలోని 9వ షెడ్యూల్‌లో 89 ప్రభుత్వ రంగ సంస్థలను చేర్చినట్లు సెక్షన్‌-68 సూచిస్తోంది. ప్రభుత్వరంగ సంస్థల ఆస్తులు, అప్పుల పంపకం గురించి సెక్షన్‌-53 తెలియజేస్తోంది.

* సెక్షన్‌ 53(1) ప్రకారం రాష్ట్రానికి చెందిన ఏదైనా వాణిజ్య లేదా పారిశ్రామిక సంస్థలకు సంబంధించిన ఆస్తులు, అప్పులను అపాయింటెడ్‌ డే రోజున ఆ సంస్థ ప్రధాన కార్యస్థానం ఉన్న ప్రదేశంతో సంబంధం లేకుండా ఆ సంస్థలు ఉన్న ప్రాంతాన్ని ఏ రాష్ట్రంలో చేర్చారో ఆ రాష్ట్రానికి అందజేయాలి. అయితే ఆ సంస్థ కార్యకలాపాలు విభజన చట్టంలోని రెండో భాగంలోని నిబంధనల దృష్ట్యా అంతర్‌ రాష్ట్రానికి చెందినవి అయితే 1) సంస్థకు చెందిన ఆపరేషన్‌ యూనిట్ల ఆస్తులు, అప్పులను ప్రాదేశిక ప్రాతిపదికపై రెండు రాష్ట్రాల మధ్య పంచాలి. 2) ఆ సంస్థ ప్రధాన కార్యస్థానం ఆస్తులు, అప్పులను జనాభా ప్రాతిపదికపై 2 రాష్ట్రాల మధ్య పంపకం చేయాలి.

* 9వ షెడ్యూల్‌లో 89 సంస్థలు చేర్చినప్పటికీ నమోదైన సొసైటీలు లేదా కంపెనీలు 70 మాత్రమే. మిగిలినవి అనుబంధ సంస్థలు.

* కేంద్రం విభజన చట్టాన్ని రూపొందించేందుకు రాష్ట్ర సంస్థల పునర్‌వ్యవస్థీకరణ, రెండు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పుల పంపిణీకి సంబంధించిన సూత్రాలు, విధానాలపై తగినంత శ్రద్ధ చూపలేదు. ఇది రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థల నిర్వహణలో అనిశ్చితికి కారణమైంది.

* విభజన చట్టంలోని సెక్షన్‌- 75, 10వ షెడ్యూల్‌లో పేర్కొన్న 107 సంస్థల గురించి చెబుతోంది. అయితే 10వ షెడ్యూల్‌లోని జాబితాలో చేర్చిన సంస్థల్లో 22 ప్రభుత్వ శాఖలు, 10 శాసనబద్ధ సంస్థలు, 17 సొసైటీలు అని, రెండింటిని మండలి/కౌన్సిల్‌గా వర్గీకరించినట్టు సూచిస్తుంది. ఈ 55 సంస్థలన్నీ వాటి సమగ్రత విషయంలో రెండు రాష్ట్రాలకు అవసరమవుతాయి. వీటిని రెండు రాష్ట్రాల మధ్య పంచడం వీలుకాదు. 107 సంస్థల్లో నాలుగు నిర్వహణలో లేవు. 9 విశ్వవిద్యాలయాలు, 16 సంస్థలు ప్రభుత్వ శాఖల్లో అంతర్భాగంగా ఉన్నాయి. వీటికితోడు 2015, మే 7న అదనంగా మరో 35 సంస్థలను 10వ షెడ్యూల్‌ జాబితాలో చేర్చారు. దీంతో ప్రస్తుతం 10వ షెడ్యూల్‌లో మొత్తం 142 సంస్థలున్నాయి.

* విభజన చట్టం కేంద్ర, రాష్ట్ర చట్టాల కింద ఏర్పాటైన అనేక ఇతర సంస్థలను మినహాయించి, రాష్ట్ర పరిపాలనలో అంతర్భాగంగా ఉన్న శాఖాధిపతులు (హెచ్‌ఓడీ), రెగ్యులేటరీ ఏజెన్సీలను 10వ షెడ్యూల్‌లో చేర్చింది. రెండు రాష్ట్రాల మధ్య ఆయా సంస్థల సిబ్బంది, ఆస్తుల పంపిణీపై ఏమీ చెప్పలేదు.

* 9వ షెడ్యూల్‌లో పేర్కొన్న మెజారిటీ సంస్థల కార్యస్థానం హైదరాబాద్‌ కావడంతో, అవశేష ఆంధ్రప్రదేశ్‌లో వీటిని తిరిగి ఏర్పాటు చేయడానికి చాలాకాలం పడుతుంది. ఇంకా చట్టం ద్వారా ఏర్పాటైన సమాచార కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్, లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్‌ వంటి అనేక సంస్థలను విభజన చట్టంలో ఎక్కడా ప్రస్తావించలేదు.

11వ భాగం, సెక్షన్‌ 95 - ఉన్నత విద్యకు అవకాశాలు:  రెండు రాష్ట్రాల్లోని విద్యార్థులందరికీ నాణ్యమైన ఉన్నత విద్య కోసం సమాన అవకాశాలు కల్పించే విధంగా చూడటానికి ‘‘రాజ్యాంగంలోని అధికరణ- 371డి కింద పేర్కొన్న విధంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, అన్‌ఎయిడెడ్, ఉన్నత, సాంకేతిక, వైద్య విద్యాసంస్థల్లో ప్రస్తుతం ఉన్న ప్రవేశ కోటాలు, ఉమ్మడి ప్రవేశ ప్రక్రియను మరో పదేళ్లు కొనసాగించాలి’’ అని విభజన చట్టంలోని సెక్షన్‌-95 పేర్కొంటుంది. అయితే దీని అమలులో ఎదురయ్యే సమస్యల గురించి చట్టం పట్టించుకోలేదు. ఈ నిబంధనను అమలుచేసే సంస్థాగత నిర్మాణాన్ని రూపొందించలేదు.

రచయిత: వి.కరుణ

Posted Date : 26-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌