• facebook
  • whatsapp
  • telegram

మత్స్యసంపద

అండగా ఆక్వా.. తోడుగా పాడి!

  ఒక ప్రాంతం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే ఉద్యోగాలు ఉండాలి. వ్యక్తులు, సమాజాలకు స్థిరమైన ఆదాయం లభించాలి. ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయం ప్రధానంగా ఆ లక్ష్యాలు నెరవేరుతున్నప్పటికీ, అనుబంధ రంగాలైన పశువుల పెంపకం, మత్స్య సంపదలు కూడా అందుకు మరింత మద్దతుగా నిలిచి, ఆహార భద్రతను కల్పిస్తున్నాయి. పోషకాహారాన్ని అందిస్తున్నాయి. ఎగుమతుల ద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని సమకూరుస్తున్నాయి. వివిధ పన్నుల రూపంలో ప్రభుత్వానికి రాబడిని పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రగతికి అండగా నిలిచిన ఆక్వా, తోడుగా సాయపడుతున్న పాడి పరిశ్రమల విస్తరణ తీరు తెన్నులను, అమలు చేస్తున్న పథకాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. 

  మత్స్య ఉత్పత్తుల్లో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే రెండో స్థానంలో, ఎగుమతుల్లో మొదటి స్థానంలో ఉంది. ఎగుమతుల విలువ సుమారు రూ.14 వేల కోట్లు. ఈ రంగం రాష్ట్రంలో 16.5 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది.


రాష్ట్రంలో తీర రేఖ పొడవు: 974 కిలోమీటర్లు.


అత్యధిక తీర రేఖ ఉన్న జిల్లా: శ్రీకాకుళం (200 కి.మీ.)


అత్యల్ప తీర రేఖ ఉన్న జిల్లా: పశ్చిమ గోదావరి (29 కి.మీ.) 


దేశంలో మత్స్య ఉత్పత్తుల్లో ఆంధ్రప్రదేశ్‌ వాటా: 30.82 శాతం

సముద్ర మత్స్య ఉత్పత్తి అధికంగా ఉన్న రాష్ట్రాలు: గుజరాత్, ఆంధ్రప్రదేశ్‌.

చెరువులు, కాల్వల ద్వారా మత్స్య ఉత్పత్తి అధికంగా ఉన్న రాష్ట్రాలు: ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌.

రాష్ట్రంలో సముద్ర చేపల ఉత్పత్తి ఎక్కువగా ఉన్న జిల్లాలు: విశాఖ, నెల్లూరు, తూర్పు గోదావరి.

చెరువులు, కాల్వల్లో మత్స్య ఉత్పత్తి ఎక్కువగా ఉన్న జిల్లాలు: పశ్చిమ గోదావరి, కృష్ణా, నెల్లూరు.

రొయ్యల సాగు ఎక్కువ ఉన్న జిల్లాలు: కృష్ణా, నెల్లూరు, తూర్పు గోదావరి.

హైదరాబాద్‌ ప్రధాన కేంద్రంగా 2006, సెప్టెంబరులో జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు స్థాపించారు. ఇదే ఏడాదిలో కాకినాడ ప్రధాన కేంద్రంగా పర్యావరణానికి హాని కలగని రీతిలో రైతులకు శిక్షణ ఇచ్చేందుకు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సస్టెయినబుల్‌ కోస్టల్‌ ఆక్వాకల్చర్‌ను ప్రారంభించారు. 2007లో మచిలీపట్నంలో దేశంలోనే రెండో మత్స్య ఉత్పత్తుల ప్రత్యేక ఆర్థికమండలిని ఏర్పాటు చేశారు (మొదటిది గుజరాత్‌లో ఉంది). రాష్ట్రంలో చేపలు, సముద్ర ఉత్పత్తుల యూనివర్సిటీని ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రైవేటు వ్యక్తులు 51% పెట్టుబడిని సమకూరిస్తే, మిగిలిన 49% ప్రభుత్వం గ్రాంటుగా ఇస్తుంది. దీనికోసం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో 200 ఎకరాల భూమిని కేటాయించింది.

* ఏటా ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 14 వరకు (61 రోజులు) సముద్రంలో మోటారు బోట్ల ద్వారా చేపల వేటపై నిషేధం ఉంటుంది. అది చేపల ప్రజనన సమయం. ఈ కాలానికి మోటారు పడవలపై ఆధారపడిన మత్స్య కార్మికులకు ప్రభుత్వం పరిహారం ఇస్తుంది.


వైఎస్‌ఆర్‌ మత్స్యకార భరోసా పథకం:  ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా 2019, నవంబరు 21న ఈ పథకాన్ని ప్రారంభించారు. సముద్రంలో వేటకు వెళ్లే సుమారు 1,33,300 మందికి వేట నిషేధ సమయంలో రూ.10 వేలు ఖాతాలో జమ చేస్తారు. 21 - 60 ఏళ్ల వారికి ఈ పథకం వర్తిస్తుంది. మత్స్యకారులకు డీజిల్‌పై ఇచ్చే రాయితీని లీటర్‌కు రూ.6.03 నుంచి రూ.9కి పెంచారు. మత్స్యకారులు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10 లక్షల బీమా లభిస్తుంది.


ఫిషింగ్‌ హార్బర్లు: రాష్ట్రంలో రూ.3 వేల కోట్లతో 8 ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అవి 1) జువ్వలదిన్నె - నెల్లూరు, 2) నిజాంపట్నం - గుంటూరు, 3) మచిలీపట్నం - కృష్ణా, 4) ఉప్పాడ - తూర్పు గోదావరి, 5) బుడుగట్లపాలెం - శ్రీకాకుళం, 6) పూడిమడక - విశాఖపట్నం 7) కొత్తపట్నం - ప్రకాశం, 8) బియ్యపుతిప్ప - పశ్చిమ గోదావరి


ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఆక్వా డెవలప్‌మెంట్‌ అథారిటీ: ముఖ్యమంత్రి ఛైర్మన్‌గా 2020లో ఈ సంస్థ ఏర్పాటైంది. దీన్ని లక్ష్యాలు: * చేపలు, రొయ్యల పెంపకంలో నూతన వ్యాపార మార్గాలు సృష్టించడం. * ఆక్వాకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి జిల్లా స్థాయిలో ఫోరం ఏర్పాటు. * సీడ్, హేచరీస్, ఫీడ్‌ ప్లాంట్‌ మేనేజ్‌మెంట్, ఆక్వా ఉత్పత్తి చేసే రైతులు, ప్రాసెసింగ్‌ చేసే ఎగుమతిదారుల్ని భాగస్వాములు చేయడం. * రైతు భరోసా కేంద్రాల్లో 36 చోట్ల రూ.50 కోట్ల వ్యయంతో ఆక్వా టెస్టింగ్‌ ల్యాబ్స్‌ ఏర్పాటు. * అసంఘటితంగా ఉన్న ఈ రంగాన్ని సంఘటితంగా మార్చడం.

2015-20 రాష్ట్ర ప్రభుత్వ ఫిషరీస్‌ పాలసీ ముఖ్యాంశాలు:  

* ఆంధ్రప్రదేశ్‌ను ఆక్వా హబ్‌ ఆఫ్‌ ద వరల్డ్‌గా అభివృద్ధి చేయాలి. 

* 2019-20 నాటికి ఆక్వా ఉత్పత్తి లక్ష్యం 42 లక్షల టన్నులు.

* సముద్రాలు, రిజర్వాయర్లలో కేజ్‌ కల్చర్‌ విస్తరించాలి. 

* రాష్ట్రంలో మత్స్యరంగం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 14.5 లక్షల మందికి ఉపాధి కల్పించడం. 

* రాష్ట్రంలో మొత్తం సముద్ర మత్స్యకారుల జనాభా 6.05 లక్షలు ఉండగా, అందులో సముద్రంలో చేపల వేటకు వెళ్లేవారు 1.5 లక్షల మంది ఉన్నారు.

* దేశంలో ఏడాదికి సగటు చేపల వినియోగం 11 కిలోలు ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో 7.4 కిలోలు మాత్రమే. అందువల్ల స్థానిక మార్కెట్లను పెంపొందించి వినియోగాన్ని పెంచాలి. * విపత్తుల సమయంలో చేపల వేటకు వెళ్లి మరణిస్తే ఆ కుటుంబానికి రూ.5 లక్షలు పరిహారం అందిస్తారు. శాశ్వత అంగవైకల్యం కలిగితే రూ.2 లక్షలు ఇస్తారు.

మత్స్య మిత్ర గ్రూపులు: * మత్స్యకార మహిళలకు స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేసే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మత్స్యమిత్ర గ్రూపులను ఏర్పాటు చేసింది. 50 మత్స్యమిత్ర గ్రూపులకు రూ.లక్ష చొప్పున రివాల్వింగ్‌ ఫండ్‌గా సహాయం చేస్తుంది. 

* మత్స్యకారులకు బృంద ప్రమాద బీమా పథకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాన వాటాతో అమలుచేస్తున్నాయి. ఈ పథకం కింద ఒక వ్యక్తి వార్షికంగా రూ.20.27 ప్రీమియం చెల్లించాలి. 

* రాష్ట్రంలో 2,810 మత్స్యకారుల సొసైటీలున్నాయి. ఇందులో 2.86 లక్షల మంది సభ్యులున్నారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ద్వారా రాష్ట్రంలో మత్స్య రంగం అభివృద్ధికి రూ.20 కోట్లు కేటాయించారు.

పాడిపరిశ్రమ

ఆంధ్రప్రదేశ్‌ అపారమైన పశుసంపదకు ఆలవాలం. సుమారు 62.54 లక్షల కుటుంబాలకు పశుసంపదే స్థిరమైన ఆదాయాన్ని ఇస్తోంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఒంగోలు, పుంగనూరు గోజాతులు, శ్రేష్ఠమైన నెల్లూరు జోడిపి జాతి గొర్రెలు, అశిల్‌ జాతి కోళ్లకు ఏపీ పుట్టిల్లు. రాష్ట్ర పశుసంపద ఉత్పత్తి విలువ రూ.66,648 కోట్లు.


దేశంలో మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్‌లోనే పశుగ్రాస భద్రత విధానం 2015లో రూ.250 కోట్లతో ప్రారంభమైంది. స్టేట్‌ మేనేజ్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లైవ్‌ స్టాక్‌ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ (స్మైల్‌) సంస్థను విశాఖపట్నంలో ఏర్పాటు చేశారు. నెల్లూరు జిల్లా చింతలదీవి వద్ద నేషనల్‌ కామధేను బ్రీడింగ్‌ సెంటర్‌ను కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఏర్పాటుచేసి, దేశీయ పశుజాతుల అభివృద్ధికి ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్‌ఆర్‌ దేశీయ గోజాతుల పెంపక కేంద్రాలను ఒంగోలు, పుంగనూరులో ఏర్పాటు చేసి దేశీయ గోజాతులను అభివృద్ధి చేస్తున్నారు. రాష్ట్రంలో పశు ఆరోగ్య పరిరక్షణకు 3119 వెటర్నరీ కేంద్రాలు ఉన్నాయి. అలాగే 48 కామధేను బ్రీడింగ్‌ సెంటర్లు ఏర్పాటయ్యాయి. ఫ్రోజెన్‌ సెమన్‌ బుల్‌ స్టేషన్స్‌ (శీతలీకరించిన దున్నపోతుల వీర్యకేంద్రాలు) నంద్యాల, విశాఖపట్నం, బనవాసి ప్రాంతాల్లో నెలకొల్పారు.

* దేశీయ గోజాతుల పరిరక్షణ అభివృద్ధికి కేంద్రం గోపాలరత్న, కామధేను వంటి అవార్డులు ఇస్తోంది. ప్రకాశం జిల్లా చదలవాడ వద్ద కేంద్ర ప్రభుత్వ పథకం అయిన రాష్ట్రీయ గోకుల్‌ మిషన్‌ ప్రాజెక్టు ప్రారంభమైంది.

* రాష్ట్రంలో గొర్రెల పెంపకం ద్వారా 4 లక్షల కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. కర్నూలు జిల్లా బనవాసి వద్ద మేకలు, గొర్రెల పరిశోధన కేంద్రాన్ని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం సహకారంతో ఏర్పాటు చేశారు. 2021లో జగనన్న జీవక్రాంతి పథకం ద్వారా మొత్తం మూడు దశల్లో 2,49,151 గొర్రెలు, మేకల యూనిట్ల పంపిణీని రూ.1,869 కోట్ల వ్యయంతో ప్రారంభించారు. ఒక్కో యూనిట్‌లో 5-6 నెలల వయసున్న 14 గొర్రె/మేక పిల్లలు, ఒక పొట్టేలు/మేకపోతు ఉంటాయి.

మిల్క్‌ మిషన్‌ ఒప్పందం: మేలుజాతి పశువుల సంతతిని వృద్ధి చేసి, పాలఉత్పత్తిని పెంచేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం యూనివర్సిటీ ఆఫ్‌ పెన్సిల్వేనియాతో 2016, జూన్‌ 1న మిల్క్‌ మిషన్‌ ఒప్పందం కుదుర్చుకుంది. రానున్న అయిదేళ్లలో రాష్ట్రంలో 10 వేల మేలుజాతి పశువుల సంతతి పెంచాలన్నది లక్ష్యం.

వైఎస్‌ఆర్‌ పశు నష్టపరిహార పథకం: 2019లో ఈ పథకాన్ని ప్రారంభించారు. ప్రమాదవశాత్తు చనిపోయిన గేదెలు, ఆవులు వంటి దేశీయ జాతి పశువులకు రూ.15 వేలు, సంకర జాతి పశువులకు రూ.30 వేలు పరిహారంగా చెల్లిస్తారు.

అమూల్‌తో ఒప్పందం: పాల ఉత్పత్తిదారులకు అధిక లాభాలు అందించే విధంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గుజరాత్‌కు చెందిన అమూల్‌తో 2020, జులై 21న ఒప్పందం కుదుర్చుకుంది.

వైఎస్‌ఆర్‌ సంచార పశు ఆరోగ్యసేవ: పశువులు వ్యాధి బారిన పడినప్పుడు చికిత్స కోసం దూరప్రాంతాల్లోని వైద్యశాలకు తీసుకెళ్లాలంటే వ్యయప్రయాలతో కూడిన పని. ఈ పరిస్థితులను అధిగమించేందుకు ప్రభుత్వం పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్‌ సంచార పశు ఆరోగ్యసేవను 2022, మే 19న ప్రారంభించింది. దీనికోసం 340 వాహనాలను సిద్ధం చేస్తోంది. పశువులు అనారోగ్యానికి గురైనప్పుడు టోల్‌ఫ్రీ నంబరు 1962కు ఫోన్‌ చేయాలి.

* నవంబరు 26: జాతీయ పాల దినోత్సవం.

* 1970 - కేంద్రం ఆపరేషన్‌ ఫ్లడ్‌ ప్రకటన.

* 1981 - ఆంధ్రప్రదేశ్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ కో-ఆపరేటివ్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు.

* ప్రతి నెల మొదటి శనివారాన్ని యానిమల్‌ హజ్బెండరీ డేగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది.

జాతీయ పశుసంపద సెన్సెస్‌: భారతదేశంలో మొదటిసారిగా పశు గణాంకాలను 1920లో సేకరించారు. ఇది అయిదేళ్లకు ఒకసారి జరుగుతుంది. 2019, అక్టోబరు 16న విడుదల చేసిన 20వ పశు గణాంకాల ప్రకారం, పశుసంపదలో ప్రపంచంలో భారత్‌ మొదటి స్థానంలో ఉంది. దేశంలో ఆంధ్రప్రదేశ్‌ ఆరో స్థానంలో ఉంది.

* పాల ఉత్పత్తిలో 147 లక్షల టన్నులతో ఆంధ్రప్రదేశ్‌ 5వ స్థానంలో ఉంది. మొదటి స్థానం ఉత్తర్‌ప్రదేశ్‌కి దక్కింది. మాంసం ఉత్పత్తిలో 9.54 లక్షల టన్నులతో ఏపీ 2వ స్థానంలో ఉండగా, ఉత్తర్‌ప్రదేశ్‌ మొదటి స్థానంలో ఉంది. కోడిగుడ్ల ఉత్పత్తిలో ఏపీదే అగ్రస్థానం (2,496 కోట్లు).

రాష్ట్రంలో ముందున్న జిల్లాలు:

అత్యధిక పశుసంపద: 1) అనంతపురం 2) ప్రకాశం

కోళ్ల పెంపకం: 1) తూర్పుగోదావరి 2) పశ్చిమ గోదావరి

గొర్రెల పెంపకం: 1) అనంతపురం 2) కర్నూలు

గేదెల పెంపకం: 1) ప్రకాశం 2) గుంటూరు

మేకల పెంపకం: 1) అనంతపురం 2) కర్నూలు

పాల ఉత్పత్తి: 1) కడప 2) కృష్ణా (చివరి స్థానంలో కర్నూలు)

మాంసం ఉత్పత్తి: 1) చిత్తూరు 2) అనంతపురం (చివరి స్థానంలో శ్రీకాకుళం)

కోడిగుడ్ల ఉత్పత్తి: 1) తూర్పు గోదావరి 2) పశ్చిమ గోదావరి (చివరి స్థానంలో కర్నూలు)

ఏపీలో పశు సంపద (2019) లక్షల్లో

ఆవులు    46 

గేదెలు    62.19

గొర్రెలు   176.27

మేకలు    55.22

కోళ్లు     1075.11

పందులు   0.92

రచయిత: ధరణి శ్రీనివాస్‌

Posted Date : 02-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌