• facebook
  • whatsapp
  • telegram

ద్రవ్య సరఫరా కొలమానాలు

వినిమయ సాధనాల విలువల నిధి!


ఒక దేశ ఆర్థిక స్థిరత్వం ఆ ఆర్థిక వ్యవస్థలో జరిగే ద్రవ్యసరఫరా, చెలామణిపై ఆధారపడి ఉంటుంది. వడ్డీ రేట్లు మారుస్తూ బ్యాంకుల్లో డిపాజిట్లు పెంచడం లేదా తగ్గించడం, ప్రజల చేతిలో ఉండే నగదును నియంత్రించి ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడం లాంటివన్నీ ద్రవ్య సరఫరాతో ముడిపడినవే. అభివృద్ధిలో, ఆర్థిక విధానంలో కీలకమైన ద్రవ్య సరఫరాకు నిర్దిష్ట కొలమానాలున్నాయి. పూర్తిగా కేంద్రం, కేంద్ర బ్యాంకు పర్యవేక్షణలో జరిగే ఈ ప్రక్రియపై పరీక్షార్థులకు తగిన పరిజ్ఞానం ఉండాలి. దీనికి సంబంధించి ప్రాచుర్యం పొందిన  సిద్ధాంతాలు, అందులోని ముఖ్యాంశాలను తెలుసుకోవాలి.


ద్రవ్య సరఫరాకు సంబంధించి రెండు రకాల నిర్వచనాలు ఉన్నాయి. మొదటిది సంప్రదాయంగా వ్యవహారంలో ఉన్నదైతే, రెండోదాన్ని చికాగో ఆర్థికవేత్తలు ఇచ్చారు.  1) సంప్రదాయ నిర్వచనం ప్రకారం ద్రవ్య సరఫరా అంటే ప్రజల వద్ద ఉన్న కరెన్సీ, బ్యాంకుల్లో ఉన్న డిమాండ్‌ డిపాజిట్ల మొత్తం. 

2) చికాగో ఆర్థికవేత్తలైన మిల్టన్‌ ఫ్రీడ్‌మన్‌ తదితరుల ప్రకారం ద్రవ్య సరఫరా అంటే ప్రజల వద్ద ఉన్న కరెన్సీ, బ్యాంకుల్లోని డిమాండ్‌ డిపాజిట్లతోపాటు టైమ్‌ డిపాజిట్ల మొత్తం. సంప్రదాయ నిర్వచనం పరిమిత అర్థాన్ని ఇస్తే, చికాగో ఆర్థికవేత్తలు దాన్ని మరింత విస్తృత పరిచారు. 


భారతదేశంలో ద్రవ్య సరఫరా: 1967-68 వరకు దేశంలో సంప్రదాయ ఆర్థికవేత్తల నిర్వచనాన్ని అమలు చేశారు. కానీ 1968 తర్వాత చికాగో ఆర్థికవేత్తల నిర్వచనాన్ని భారత రిజర్వ్‌ బ్యాంకు ప్రకటించింది. 1977లో ఆర్‌బీఐ నాలుగు రకాల ద్రవ్య సరఫరా కొలమానాలను ప్రకటించింది. అవి ఎమ్‌-1, ఎమ్‌-2, ఎమ్‌-3, ఎమ్‌-4. 

ఎమ్‌-1 ద్రవ్యం: ప్రజల వద్ద ఉన్న కరెన్సీ, బ్యాంకుల్లోని డిమాండ్‌ డిపాజిట్లు, రిజర్వ్‌ బ్యాంకు వద్ద ఉన్న ఇతర డిపాజిట్ల మొత్తం.

ఎమ్‌-2 ద్రవ్యం: ఎమ్‌-1 ద్రవ్యంలోని అంశాలతోపాటు పోస్టాఫీసుల్లోని పొదుపు డిపాజిట్ల మొత్తం.

ఎమ్‌-3 ద్రవ్యం: ఎమ్‌-1 ద్రవ్యంలోని అంశాలతోపాటు బ్యాంకు వద్ద ఉండే కాలపరిమితి డిపాజిట్ల మొత్తం.

ఎమ్‌-4 ద్రవ్యం: ఎమ్‌-3 ద్రవ్యంలోని అంశాలతోపాటు పోస్టాఫీసుల్లోని మొత్తం డిపాజిట్లు.


ఎమ్‌-1ను సంకుచిత ద్రవ్యం అంటారు. దీనికి ద్రవ్యత్వం అధికం. ఎమ్‌-3ని విశాల ద్రవ్యం, సమష్టి ద్రవ్య వనరులు అని వ్యవహరిస్తారు. 


నూతన ద్రవ్యం-ద్రవ్యత్వ వనరులు: 1997లో డాక్టర్‌    వై.వి.రెడ్డి అధ్యక్షతన నియమించిన ఆర్‌బీఐ వర్కింగ్‌ గ్రూపు, ద్రవ్య సరఫరాపై అధ్యయనం చేసి 1998లో నివేదిక సమర్పించింది. ఇది మూడు నూతన ద్రవ్య కొలమానాలను, మూడు ద్రవ్యత్వ కొలమానాలను ప్రకటించింది. ఈ నివేదిక ప్రకారం పోస్టాఫీసులోని పొదుపు డిపాజిట్లను, మొత్తం డిపాజిట్లను, ద్రవ్యసరఫరా పరిధి నుంచి తొలగించారు. దాంతో నూతన ద్రవ్య కొలమానాలు మూడు రకాలుగా ఉన్నాయి.

ఎమ్‌-1 ద్రవ్యం: ప్రజల వద్ద ఉన్న కరెన్సీ, బ్యాంకుల్లోని డిమాండ్‌ డిపాజిట్లు, రిజర్వ్‌ బ్యాంకు వద్ద ఉన్న ఇతర డిపాజిట్ల మొత్తం.

ఎమ్‌-2 ద్రవ్యం: ఎమ్‌-1 ద్రవ్యంలోని అంశాలతోపాటు బ్యాంకుల వద్ద సంవత్సరంలోపు కాలపరిమితి ఉన్న టైమ్‌ డిపాజిట్లు, బ్యాంకులు జారీ చేసిన డిపాజిట్‌ సర్టిఫికెట్లు, కాలపరిమితితో చెల్లించే బ్యాంకు డిపాజిట్లు. 

 వాణిజ్య బ్యాంకులు జారీ చేసే డిపాజిట్‌ సర్టిఫికెట్లను మొదటిసారిగా 1989లో ప్రవేశపెట్టారు. వీటి పరిపక్వత కాలం 3 నెలల నుంచి సంవత్సరం వరకు ఉంటుంది. వీటిపై వడ్డీ అధికంగా ఉంటుంది. రూ.కోటి కనీస మొత్తానికి వీటిని జారీ చేస్తారు.

ఎమ్‌-3 ద్రవ్యం:  ఎమ్‌-2 ద్రవ్యంలోని అంశాలతోపాటు సంవత్సరం కంటే ఎక్కువ కాలపరిమితి ఉన్న టైం డిపాజిట్లు సహా స్వల్పకాల, దీర్ఘకాల బ్యాంకు రుణాలు.


ద్రవ్యత్వ వనరులు: రిజర్వ్‌ బ్యాంక్‌ వర్కింగ్‌ గ్రూప్‌ నూతనంగా 3 రకాల ద్రవ్యత్వ వనరులను ప్రవేశపెట్టింది.

ఎల్‌-1: నూతన ఎమ్‌-3 ద్రవ్యం సహా పోస్టాఫీసుల్లోని అన్ని రకాల డిపాజిట్లు. 

ఎల్‌-2: ఎల్‌-1 సహా విత్త సంస్థల కాలపరిమితి డిపాజిట్లు, విత్త సంస్థలు జారీ చేసిన డిపాజిట్‌ సర్టిఫికెట్లు, విత్త సంస్థల దీర్ఘకాలిక రుణాలు.  

ఎల్‌-3: ఎల్‌-2 సహా బ్యాంకేతర విత్త సంస్థల వద్ద ఉన్న ప్రజల డిపాజిట్లు. 


రిజర్వ్‌ ద్రవ్యం: ద్రవ్య సరఫరాని నిర్ణయించే అంశాల్లో ముఖ్యమైంది రిజర్వ్‌ ద్రవ్యం. రిజర్వ్‌ బ్యాంకు జారీ చేసి ప్రజలు, ఇతర వాణిజ్య బ్యాంకుల వద్ద నిల్వ ఉండే ద్రవ్యంతోపాటు రిజర్వ్‌ బ్యాంకు దగ్గర ఉన్న ఇతర డిపాజిట్లను కలిపి రిజర్వ్‌ ద్రవ్యం అంటారు. దీనిని ప్రభుత్వ ద్రవ్యం, మూలాధార ద్రవ్యం, హైపర్‌ ద్రవ్యం, ప్రాథమిక ద్రవ్యం అని వివిధ పేర్లతో వ్యవహరిస్తారు.


1991, మార్చి నాటికి ప్రజల వద్ద ఉన్న కరెన్సీ 63 శాతం అయితే, అది 2021, ఆగస్టు నాటికి 79.46 శాతానికి పెరిగింది. ఇదే సమయంలో ఆర్‌బీఐ వద్ద ఉన్న బ్యాంకుల డిపాజిట్లు 36.2 శాతం నుంచి 19.03 శాతానికి తగ్గాయి. ఆర్‌బీఐ వద్ద ఉన్న ఇతర డిపాజిట్లు 2021 నాటికి 1.2% మాత్రమే. నీ సాధారణ ద్రవ్యంలో డిమాండ్‌ డిపాజిట్లు ఉంటాయి. రిజర్వు ద్రవ్యంలో బ్యాంకుల వద్ద ఉన్న నగదు నిల్వలు ఉంటాయి.    


ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సరఫరా అనేది రిజర్వ్‌ ద్రవ్య పరిమాణం, ద్రవ్య గుణకం మీద ఆధారపడి ఉంటుంది.


ద్రవ్య ప్రసార వేగం: ఒక నిర్ణీత కాలంలో ఒక యూనిట్‌ ద్రవ్యం ఎన్నిసార్లు వస్తుసేవల కొనుగోలుకు చేతులు మారుతుందో తెలియజేసే దాన్ని ద్రవ్యప్రసార వేగం అంటారు. ద్రవ్యప్రసార వేగం పలు అంశాలపై ఆధారపడుతుంది. అవి 1) పరపతి సంస్థలు 2) నగదు వ్యవహారాలు 3) వినియోగ ప్రవృత్తి 4) ఆదాయ పంపిణీ 5) ఆర్థిక వ్యవస్థ పరిస్థితులు 6) వేతన విధానం 7) రెగ్యులర్‌ ఆదాయం 8) పారిశ్రామిక అభివృద్ధి    9) రవాణా అభివృద్ధి 10) ప్రసార సాధనాల అభివృద్ధి



ద్రవ్య డిమాండ్‌ సిద్ధాంతాలు:

1) సంప్రదాయ ద్రవ్య డిమాండ్‌ సిద్ధాంతం: దీనిలో ఫిషర్‌ సిద్ధాంతం ముఖ్యమైంది. ఇతడి ప్రకారం ద్రవ్యం వినిమయ మాధ్యమంగా పనిచేయడంతో వస్తుసేవలు కొనడానికి ఉపయోగపడుతుంది. అందువల్ల ద్రవ్యాన్ని డిమాండ్‌ చేస్తారు.

2) నవ్య సంప్రదాయ ద్రవ్య డిమాండ్‌ సిద్ధాంతం: దీనిని కేంబ్రిడ్జి ఆర్థికవేత్తలు ప్రతిపాదించారు. ద్రవ్యం విలువల నిధిగా పనిచేయడం వల్ల భవిష్యత్తు ఖర్చు   కోసం ద్రవ్యాన్ని డిమాండ్‌ చేస్తారు.

3) కీన్స్‌ ద్రవ్య డిమాండ్‌ సిద్ధాంతం: జె.ఎం.కీన్స్‌ ప్రకారం ద్రవ్యాన్ని వినిమయ సాధనంగా మాత్రమే కాకుండా విలువల నిధిగా కూడా ఉపయోగిస్తారు. ద్రవ్య డిమాండ్‌ను ద్రవ్యత్వాభిరుచి నిర్ణయిస్తుంది. ఇది 3 అంశాలపై ఆధారపడుతుంది. 1) దైనందిన వ్యవహారాల ఉద్దేశం 2) ముందు జాగ్రత్తల కోసం 3) అంచనా వ్యాపారం కోసం.

దైనందిన వ్యవహారాల డిమాండ్, ముందు జాగ్రత్తల కోసం చేసే డిమాండ్‌ ఆదాయంపై ఆధారపడి ఉంటుంది. కీన్స్‌ తర్వాత ద్రవ్య డిమాండ్‌ సిద్ధాంతాలు 3 రకాలుగా ఉన్నాయి.


1) బౌమల్‌ ద్రవ్య సిద్ధాంతం: బౌమల్‌ ప్రకారం వ్యాపార వ్యవహారాల ద్రవ్య డిమాండ్‌కు వడ్డీ రేటుతో వ్యాకోచత్వ సంబంధం ఉంటుంది. వ్యక్తులు, సంస్థలు వ్యాపార వ్యవహారాల కోసం ద్రవ్యాన్ని తమ వద్ద ఉంచుకుంటే వడ్డీని కోల్పోతారు. మార్కెట్‌లో వడ్డీ రేటు ఎక్కువగా ఉంటే తమ వద్ద తక్కువ ద్రవ్యం ఉంచుకుంటారు. అంటే వ్యాపార వ్యవహారాల ద్రవ్య డిమాండ్‌కు, వడ్డీ రేటుకు విలోమ సంబంధం ఉంటుంది. ఆదాయం పెరిగితే వ్యాపార వ్యవహారాల కోసం ఉంచుకునే ద్రవ్యం ఎక్కువగా ఉంటుంది. అంటే ఆదాయానికి, వ్యాపార వ్యవహారాల ద్రవ్య డిమాండ్‌కు అనులోమ సంబంధం ఉంటుంది. బౌమల్‌ ప్రకారం వ్యాపార వ్యవహారాల ద్రవ్య డిమాండ్‌ అనేది వడ్డీ రేటు, ఆదాయం అనే రెండు అంశాలపై  ఆధారపడి ఉంటుంది.


2) టోబిన్‌ ద్రవ్య డిమాండ్‌ సిద్ధాంతం: కీన్స్‌ ప్రకారం వ్యక్తులు తమ ఆస్తిని ఎల్లప్పుడూ బాండ్లు లేదా నగదు రూపంలో నిల్వ చేస్తారు. టోబిన్‌ దీనిని వ్యతిరేకించాడు. సాధారణంగా వ్యక్తులు తమ ఆస్తి మొత్తాన్ని ఒకే రూపంలో కాకుండా, కొంతభాగాన్ని బాండ్ల మీద, మరికొంత భాగాన్ని నగదు రూపంలో ఉంచుతారు. సంపదలో కొంత భాగాన్ని బాండ్ల రూపంలోకి మారిస్తే దానిపై ప్రతిఫలం వస్తుంది. పైగా మూలధనం వృద్ధి జరుగుతుంది. అయితే ఒక్కోసారి వడ్డీ రేటు తగ్గితే మూలధనం నష్టం కూడా 
సంభవించవచ్చు.

3) ఫ్రీˆడ్‌మన్‌ ద్రవ్య డిమాండ్‌ సిద్ధాంతం: దీనినే ఆధునిక ద్రవ్యరాశి సిద్ధాంతం అని కూడా అంటారు. ఇతడి ప్రకారం ద్రవ్యం సంపన్నుల సంపదను పెంచే ఒక సాధనం. ద్రవ్య డిమాండ్‌ను 4 అంశాలు నిర్ణయిస్తాయి. అవి  1) ధరల స్థాయి 2) ఆదాయ స్థాయి 3) ప్రస్తుత వడ్డీ రేటు 4) సాధారణ ధరల స్థాయిలోని మార్పు రేటు. ద్రవ్య డిమాండ్‌కు మొదటి రెండు అంశాలతో ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. అంటే ధరల స్థాయి పెరిగినా, ఆదాయ స్థాయి పెరిగినా ద్రవ్య డిమాండ్‌ పెరుగుతుంది. అలాగే ద్రవ్య డిమాండ్‌కు 3, 4 అంశాలతో విలోమ సంబంధం ఉంటుంది. అంటే వడ్డీ రేటు పెరిగితే ద్రవ్యానికి డిమాండ్‌ తగ్గుతుంది. ధరల స్థాయి మారినప్పుడు ద్రవ్యం విలువ మారుతుంది.



రచయిత: ధరణి శ్రీనివాస్‌ 

Posted Date : 01-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌