• facebook
  • whatsapp
  • telegram

భారత్‌లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎఈ)

* ఏ దేశమైనా ఆర్థికంగా స్వయం సమృద్ధిని సాధించాలంటే స్థానిక ఉత్పత్తుల వాడకంతోపాటు, వాటి ఎగుమతుల ద్వారానే సాధ్యమవుతుంది. ఈ వస్తువుల తయారీకి ఎంఎస్‌ఎంఈలు ముఖ్యం.

* స్థానిక వస్తు ఉత్పత్తులకు, డిమాండ్‌ సృష్టించడానికి, మార్కెట్‌ పోటీని తట్టుకుని నిలబడటానికి ఎంఎస్‌ఎంఈల ఆర్థిక విస్తృతిని పెంచాలి.

* మనదేశం నుంచి నమోదయ్యే ఎగుమతుల్లో దాదాపు సగభాగం ఈ విభాగానికి చెందిన యూనిట్ల నుంచే వస్తున్నాయి. 

* 2022-23 ఆర్థిక సర్వే ప్రకారం, 2018లో స్థూల అదనపు విలువ (జీవీఏ)లో ఎంఎస్‌ఎంఈల వాటా 29.3% ఉండగా, 2020లో 30.5 శాతానికి పెరిగింది. అయితే 2021 నాటికి కరోనా కారణంగా వీటి వాటా 26.8 శాతానికి తగ్గింది. 

* ఎంఎస్‌ఎంఈలలో తయారీ రంగం వాటా 2021 నాటికి 36 శాతానికి తగ్గింది.

* సూక్ష్మ పరిశ్రమల ద్వారా సుమారు 70-80% వలస కార్మికులకు ఉపాధి లభిస్తోంది. స్థూల దేశీయోత్పత్తిలో వీటి వాటా 35 శాతంగా ఉన్నట్లు అంచనా. 


కరోనా సమయంలో ఎంఎస్‌ఎంఈల కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలు

* మనదేశ జీడీపీలో మూడో వంతు భాగం ఎంఎస్‌ఎంఈలదే. కేంద్ర ప్రభుత్వం 2020, మే 13న ప్రకటించిన ప్యాకేజీలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా వ్యాపారాలు, వాణిజ్య సంస్థలను ఆదుకుని, ఉద్యోగాలను  కాపాడటంపై దృష్టి సారించింది.

* ఈ ప్యాకేజీలో ఎంఎస్‌ఎంఈలు సహా చిన్న వ్యాపారాల కోసం హామీ లేని రూ.3 లక్షల కోట్ల రుణాలను ప్రకటించారు.

* వీటివల్ల 45 లక్షల సంస్థలకు ప్రయోజనం కలుగుతుందని, ఉద్యోగాలు తొలగించకుండా కార్యకలాపాలు ప్రారంభించడానికి వీలవుతుంది ప్రభుత్వం పేర్కొంది.

ఈ రుణాలు తీర్చేందుకు నాలుగేళ్ల గడువు ఇచ్చారు. 12 నెలల పాటు అసలుపై మారటోరియం ఉంటుంది. వడ్డీ కట్టాల్సిందే.

* 100 శాతం ప్రభుత్వ హామీతో ఈ రుణాలు లభ్యమవుతాయి.

* 2020, అక్టోబరు 31 నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చింది.

హామీ రుసుము ఉండదు.

* రూ.25 కోట్ల పెట్టుబడులు, రూ.100 కోట్ల వరకు టర్నోవర్‌ ఉన్న చిన్న వ్యాపారులకు ఈ పథకం వర్తిసుంది.

రుణ ఒత్తిళ్లలో ఉన్న ఎంఎస్‌ఎంఈలకు రూ.20,000 కోట్ల సబ్‌-ఆర్డినేట్‌ రుణాలు కల్పించారు. అంటే బ్యాంకుల ద్వారా ఎంఎస్‌ఎంఈ ప్రమోటర్లకు రుణం ఇస్తారు. దీన్ని ప్రమోటర్‌ ఈక్విటీ రూపంలో కంపెనీలోకి ప్రవేశపెడతారు. (ఈక్విటీ అంటే వాటాదార్లు షేర్ల రూపంలో ఒక కంపెనీలో కలిగి ఉండే వాటా)

దీనివల్ల 2 లక్షల మంది వ్యాపారులకు ప్రయోజనం కలిగింది.

నికర నిరర్ధక ఆస్తులుగా మారిన లేదా ఒత్తిడిలో ఉన్న ఎంఎస్‌ఎంఈలకు వీటిని మంజూరు చేశారు.

ద్రవ్యలభ్యత సమస్యలను ఎదుర్కొన్న ఎంఎస్‌ఎంఈల కోసం ‘ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌’ను ఏర్పాటు చేశారు. దీనివల్ల రూ.50,000 కోట్ల మేర ద్రవ్య లభ్యత ప్రయోజనాలు సమకూరాయి.

కంపెనీలు తమ పరిమాణాన్ని, సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఇవి ఉపయోగపడ్డాయి. అవి స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో నమోదు అయ్యేలా ఈ మొత్తం సహాయపడింది.

భారతదేశ ఎంఎస్‌ఎంఈలకు విదేశీ కంపెనీల నుంచి ఊహించని రీతిలో పోటీ ఉంటోంది. ఈ నేపథ్యంలో రూ.200 కోట్ల వరకు ప్రభుత్వ ప్రొక్యూర్‌మెంట్‌ టెండర్లలో విదేశీ కంపెనీలను అనుమతించకుండా జనరల్‌ ఫైనాన్షియల్‌ రూల్స్‌లో సవరణలు చేశారు. 

భారత్‌లో తయారీ రంగానికి ఇది ఎంతగానో సహాయపడుతుంది. ఎంఎస్‌ఎంఈలు తమ వ్యాపారాన్ని పెంచుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది.

కరోనా సమయంలో రుణ మార్కెట్ల నుంచి బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు(NBFC), గృహ ఆర్థిక కంపెనీలు (HFC), మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థల (MFI) కు నిధులు 

సమీకరించడం క్లిష్టంగా మారింది. అందుకే కేంద్రం రూ.30,000 కోట్లతో ప్రత్యేక ద్రవ్య లభ్యత పథకాన్ని ప్రకటించింది.

ప్రాథమిక, సెకండరీ మార్కెట్లోని వితీనీది, బీనీది, లీనీఖి ల రుణపత్రాల్లో ఈ పెట్టుబడులు పెడతారు. ద్రవ్యలభ్యత పెరగడానికి ఈ చర్య ఉపయోగపడుతుంది. వీటికి ప్రభుత్వమే 100 శాతం హామీ ఇస్తుంది.

తక్కువ క్రెడిట్‌ రేటింగ్‌ ఉన్న వితీనీది, బీనీది, లీనీఖి లు చిన్న వ్యాపారులకు రుణాలు ఇచ్చేలా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పాక్షిక రుణ హామీ పథకాన్ని విస్తరించింది. తొలి 20 శాతం నష్టాన్ని హామీదారు అంటే ప్రభుత్వమే భరిస్తుంది. ఈ పథకం వల్ల రూ.45,000 కోట్ల ద్రవ్యం అందుబాటులోకి వచ్చింది.

కరోనా సమయంలో ఎంఎస్‌ఎంఈలకు మార్కెటింగ్, ద్రవ్య లభ్యత విషయంలో సమస్యలు ఎదురయ్యాయి. దీన్ని అధిగమించేందుకు వాణిజ్య ప్రదర్శనలు, ట్రేడ్‌ ఫెయిర్స్‌ స్థానంలో ఈ-మార్కెట్‌ లింకేజ్‌ను ఎంఎస్‌ఎంఈలకు అనుసంధానం చేశారు. ఫిన్‌టెక్‌ సాయంతో లావాదేవీ ఆధారిత రుణాలను పెంచారు.

కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల నుంచి ఎంఎస్‌ఎంఈ వెండర్ల బకాయిల సెటిల్‌మెంట్‌లను ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తుంది. 

సంబంధిత బకాయిలను 45 రోజుల్లోగా ప్రభుత్వం విడుదల చేస్తుంది.

దేశవ్యాప్తంగా సుమారు 90 శాతం సూక్ష్మ పరిశ్రమలే ఉన్నాయి.

రాష్ట్రాలవారీగా చూస్తే ఎంఎస్‌ఎంఈ యూనిట్లు ఉత్తర్‌ ప్రదేశ్‌లో అత్యధికంగా ఉన్నాయి. పశ్చిమ్‌ బంగా, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు మొదటి 10 రాష్ట్రాల జాబితాలో ఉన్నాయి.

ముడిసరకు, విడిభాగాల కోసం దేశీయ యూనిట్లు చైనాపై అధికంగా ఆధారపడుతున్నాయి. అవి మనదేశంలో దొరుకుతున్నప్పటికీ ఖర్చు తక్కువగా ఉండటం, చైనా వస్తువుల సప్లయ్‌ చైన్‌ వ్యవస్థ బలంగా ఉండటం వల్ల ఆయా సంస్థలు వాటిని అక్కడ నుంచే దిగుమతి చేసుకుంటున్నాయి.

దీన్ని అధిగమించేందుకు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే విడిభాగాలపై పన్ను భారం పెంచి, స్వదేశీ ఉత్పత్తులపై పన్ను మినహాయింపులు ఇవ్వాలని ఆర్థిక నిపుణులు కోరుతున్నారు.


ఎంఎస్‌ఎంఈ సంస్థల మంత్రిత్వ శాఖకు సంబంధించిన చట్టబద్ధ సంస్థలు

ఖాదీ గ్రామ పరిశ్రమల కమిషన్‌ (1956)

జాతీయ చిన్న పరిశ్రమల సంస్థ (1955)

కొబ్బరి పీచు పరిశ్రమ చట్టం, 1953 (Coir Board)

సూక్ష, చిన్న, మధ్య తరహా సంస్థల జాతీయ సంస్థ (1960)

ఖాయిలాపడిన పారిశ్రామిక సంస్థల చట్టం, 1985 (Sick Industries)

పారిశ్రామిక, విత్త పునర్నిర్మాణ మండలి (1987)

జిల్లా పారిశ్రామిక కేంద్రాల ఏర్పాటు (1978)


ఎంఎస్‌ఎంఈల నిర్వచనం మార్పు

ఎంఎస్‌ఎంఈల నిర్వచనాన్ని కేంద్ర ప్రభుత్వం 2020లో మార్చింది. దీని ప్రకారం, ఈ రంగంలో పెట్టుబడుల పరిమితిని పెంచడంతోపాటు అదనంగా టర్నోవరు అర్హతను జతచేశారు. దీనిద్వారా ఎక్కువ కంపెనీలు ఈ పరిధిలోకి వచ్చే వీలు కలిగింది. 

ఇంతకుముందు వరకు తయారీ, సేవా రంగాలను విడిగా పరిగణించారు. కొత్త దానిలో ఈ రెండు రంగాలకు ఒకే నిర్వచనం ఇచ్చారు. దీనికి అవసరమైన చట్ట సవరణ చేశారు.


సవరించక ముందు అర్హత (ప్లాంట్లు, మిషనరీలో పెట్టుబడులు రూ.లలో)

వర్గీకరణ తయారీ రంగం సేవా రంగం
సూక్ష్మ పరిశ్రమలు 25  లక్షల లోపు 10 లక్షలలోపు
చిన్న పరిశ్రమలు 5 కోట్ల లోపు 2 కోట్ల లోపు
మధ్యతరహా పరిశ్రమలు  5 కోట్ల లోపు 2 కోట్ల లోపు

సవరించిన అర్హత (పెట్టుబడులు, వార్షిక టర్నోవర్‌ రూ.లలో)

వర్గీకరణ తయారీ, సేవా రంగం
సూక్ష్మ పరిశ్రమలు కోటి లోపు పెట్టుబడులు, 5 కోట్ల లోపు టర్నోవర్‌
చిన్న పరిశ్రమలు 10 కోట్ల లోపు పెట్టుబడులు  50 కోట్ల లోపు టర్నోవర్‌
మధ్యతరహా పరిశ్రమలు 20 కోట్ల లోపు పెట్టుబడులు, 100 కోట్ల లోపు టర్నోవర్‌
 

 ఎంఎస్‌ఎంఈలకు అత్యవసర రుణ హామీ పథకం

ఎంఎస్‌ఎంఈ సంస్థలకు ద్రవ్య లభ్యతను పెంచేందుకు ప్రభుత్వం అత్యవసర రుణ అనుసంధానిత హామీ పథకాన్ని(Emergency Credit line Guarantee Scheme) ప్రవేశపెట్టింది. 

దీనిద్వారా  202122 ఏడాదికి రూ.1.50 లక్షల కోట్ల అదనపు గ్యారంటీ ఇవ్వాలని 2021, జూన్‌ 28న కేంద్రం నిర్ణయించింది. 

ఈ పథకం కింద పాత, కొత్త బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, సూక్ష్మరుణ సంస్థలకు, బ్యాంకులు ఇచ్చే రుణాలకు హామీ ఇస్తారు. ఈ సంస్థలు రూ.1.25 లక్షల రుణాన్ని 25 లక్షల మంది వరకు ఇవ్వొచ్చు. బ్యాంకులిచ్చే రుణాలపై అదనంగా 2 శాతం ఛార్జి వసూలు చేస్తారు. కాల పరిమితి మూడేళ్లు.

2023-24 బడ్జెట్‌ ప్రకారం, రుణ హామీ పథకం కింద ఎంఎస్‌ఎంఈలకు రూ.9000 కోట్లు కేటాయించారు. 

రుణాల మంజూరు సమర్థంగా సాగేందుకు, ఆర్థిక స్థిరత్వాన్ని బలోపేతం చేసేందుకు‘నేషనల్‌ ఫైనాన్షియల్‌ ఇన్ఫర్మేషన్‌ రిజిస్ట్రీని’ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 

* భారత్‌లోని ఎంఎస్‌ఎంఈ కంపెనీలు ఆర్థిక ఒత్తిళ్లలో కూరుకుపోకుండా అత్యవసర రుణ అనుసంధానిత హామీ పథకం కాపాడిందని 2022 - 23 ఆర్థిక సర్వే తెలిపింది.

* 2022, జనవరి- నవంబరులో ఈ రంగానికి ఇచ్చిన రుణాల్లో సగటున 30.6 శాతం వృద్ధి నమోదైనట్లు కేంద్రం ప్రకటించింది. సుమారు 83 శాతం ఎంఎస్‌ఎంఈలు ఈ అత్యవసర రుణ అనుసంధానిత హామీ పథకాన్ని వినియోగించుకున్నాయి. వీటిలో సగం పైగా కంపెనీలు రూ.10 లక్షలలోపు రుణాలు తీసుకున్నాయని 2022 - 23 ఆర్థిక సర్వే తెలిపింది.

Posted Date : 08-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌