• facebook
  • whatsapp
  • telegram

రిజర్వ్‌ బ్యాంకు - ద్రవ్యవిధానం

ఆర్థిక స్థిరత్వానికి అద్భుత సాధనం!

ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య లభ్యత, పరపతి పరిమాణాన్ని ప్రభావితం చేసే విధంగా రిజర్వ్‌ బ్యాంకు ఎప్పటికప్పుడు చేపట్టే కార్యకలాపాలే ద్రవ్యవిధానం. దాని ఆధారంగా దేశంలో అన్ని రకాల బ్యాంకులను     ఆర్‌బీఐ నియంత్రిస్తుంది. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేస్తూ, ఆర్థిక వ్యవస్థ పురోగతికి బాటలు వేస్తుంటుంది. ఇలాంటి విధానపరమైన చర్యలతో పాటు ప్రత్యక్ష ప్రమేయంతో చేపట్టే ద్రవ్య నియంత్రణ చర్యలు, వాటి లక్ష్యాలు, ఫలితాల గురించి పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. ద్రవ్యవిధానాల అమలులో ఆర్‌బీఐకి ఉన్న విస్తృత పరిధితో పాటు పరిమితులు, కేంద్ర ప్రభుత్వానికి ఉన్న ఆధిక్యత గురించి తగిన అవగాహన కలిగి ఉండాలి.

బ్యాంకింగ్‌ వ్యవస్థకు శిఖర సంస్థ కేంద్ర బ్యాంకు. బ్యాంకింగ్‌ వ్యవస్థను నియంత్రిస్తూ మార్గదర్శిగా పనిచేయడంతోపాటు ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడటం, ఆర్థికాభివృద్ధికి దోహదపడటం కేంద్ర బ్యాంకు ప్రధాన విధి. అందుకు వీలుగా ఆ సంస్థ ఉపయోగించే సాధనమే ద్రవ్యవిధానం. ఇది పూర్తిగా రిజర్వ్‌ బ్యాంకుకు సంబంధించిన విధానం.

ఆర్థిక వ్యవస్థలో కొన్ని ఆదర్శ లక్ష్యాలను సాధించేందుకు ద్రవ్యం ద్వారా రిజర్వ్‌ బ్యాంకు చేపట్టే విధానాన్ని ద్రవ్యవిధానం అంటారు. ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యాన్ని ప్రవేశపెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలను గరిష్ఠం చేసి, నష్టాలను కనిష్ఠం చేసేందుకు కేంద్రబ్యాంకు ద్రవ్య అధికారాలను అవలంభించే విధానమే ద్రవ్యవిధానం.ఎస్‌.ఎల్‌.నరసింహ అభిప్రాయంలో ఆర్‌బీఐ బాధ్యత పరపతిపై ఆంక్షలు పెట్టడమే కాదు పరిశ్రమలు, వ్యాపారం, లాంటి అవసరాలకు పరపతి ఇవ్వడం; అలాగే అంచనా వ్యాపారం, అనుత్పాదక కార్యక్రమాలకు పరపతి తగ్గించడం. అందుకే పరపతి విధానాన్ని నియంత్రిత విస్తరణ విధానమని కూడా పిలుస్తారు.

ద్రవ్యవిధాన లక్ష్యాలు:

1) ధరల స్థిరత్వం

2) సంపూర్ణ ఉద్యోగిత సాధించడం

3) మారకపు రేట్ల స్థిరత్వం    

4) ఆర్థికాభివృద్ధి

1985లో సుఖమాయ్‌ చక్రవర్తి కమిటీ ధరల స్థిరత్వం, వృద్ధి సమత్వం, సాంఘిక న్యాయం, ద్రవ్య విత్త సంస్థలను ప్రోత్సహించడం అనే అంశాలను ద్రవ్యవిధాన లక్ష్యాలుగా పేర్కొంది. వీటిలో ధరల స్థిరత్వం అతి ముఖ్య లక్ష్యమని కమిటీ అభిప్రాయ పడింది. వై.వేణుగోపాలరెడ్డి అభిప్రాయంలో భారత ద్రవ్యవిధానం ఎప్పుడూ స్థిరత్వం, వృద్ధికే ప్రాధాన్యం ఇచ్చింది. దేశంలో ద్రవ్యోల్బణం ఉన్నప్పుడు ద్రవ్య సరఫరా వృద్ధిపై ఆర్‌బీఐ నియంత్రణ విధిస్తుంది.

ఉర్జిత్‌ పటేల్‌ కమిటీ సిఫార్సుల మేరకు ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని ఆర్‌బీఐ నిర్ణయించాలి. 2015, ఫిబ్రవరిలో రిజర్వ్‌ బ్యాంకుకు, ప్రభుత్వానికి మధ్య ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని నిర్ణయించడం ఆర్‌బీఐ అధికారిక లక్ష్యం. దీనికి అనుగుణంగా 1934 ఆర్‌బీఐ చట్టాన్ని 2016లో సవరించారు. రిజర్వ్‌ బ్యాంకుతో సంప్రదించి ప్రభుత్వం ప్రతి అయిదేళ్లకు ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. 2021 నుంచి 2026 వరకు సీపీఐ ఆధారిత ద్రవ్యోల్బణం 4 శాతం ఉండాలని కేంద్ర ప్రభుత్వం అధికార గెజిట్‌లో ప్రకటించింది.

ద్రవ్యవిధాన ప్రక్రియ: సవరించిన 1934 ఆర్‌బీఐ చట్టంలోని సెక్షన్‌ 45 ZB ప్రకారం భారత ప్రభుత్వం.. ఆరుగురు సభ్యులతో కూడిన మానిటరీ పాలసీ కమిటీని 2016లో ఏర్పాటు చేసింది. ఇది ద్రవ్యోల్బణ లక్ష్యానికి సంబంధించి వడ్డీ రేట్లను నిర్ణయిస్తుంది. ఫైనాన్షియల్‌ మార్కెట్‌ ఆపరేషన్స్‌ డిపార్ట్‌మెంట్‌ (ఎఫ్‌ఎమ్‌ఓడీ) ద్రవ్యవిధానాన్ని నిర్వహిస్తుంది.

ద్రవ్య సప్లయి: అర్థశాస్త్రంలో ద్రవ్య సప్లయి నియంత్రణ అంటే కరెన్సీ, డిపాజిట్‌ ద్రవ్యం నియంత్రణ.

ఆర్‌బీఐ కరెన్సీ నియంత్రణ: కరెన్సీ నియంత్రణ అంటే నాణేలు, కరెన్సీ నోట్ల నియంత్రణ. నాణేల విలువ, పరిమాణం తక్కువ కావడం వల్ల వాటి నియంత్రణకు ప్రత్యేక చర్యలు అవసరం లేదు. కానీ కరెన్సీ నోట్లను నియంత్రించాల్సిన అవసరం ఉంది. నోట్ల ముద్రణలో ఆర్‌బీఐకి గుత్తాధిపత్యం ఉంది. కరెన్సీ నోట్ల జారీకి ప్రత్యేక విభాగం ఉంది. అది ఎంత విలువైన నోట్లు జారీ చేస్తుందో దానికి సమానమైన సెక్యూరిటీలను బ్యాంకింగ్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి పొందుతుంది. 

ద్రవ్యవిధాన రకాలు: ద్రవ్యవిధానం 2 రకాలు.

1) సులభ ద్రవ్యవిధానం: వడ్డీ రేటు తగ్గించడం ద్వారా ద్రవ్య సరఫరా పెంచే విధానం. దీన్ని ప్రతి ద్రవ్యోల్బణం లేదా మాంద్యం కాలంలో అనుసరిస్తారు.

2) కఠిన ద్రవ్యవిధానం: వడ్డీ రేటు పెంచడం ద్వారా ద్రవ్య సరఫరా తగ్గించే విధానం. ద్రవ్యోల్బణ పరిస్థితులు ఉన్నప్పుడు ఈ విధానాన్ని పాటిస్తారు.

ద్రవ్యవిధాన సాధనాలు: రిజర్వ్‌ బ్యాంకు ఆధీనంలో ఉండే పరపతి నియంత్రణ పరికరాలను ద్రవ్యవిధాన పరికరాలుగా పరిగణించవచ్చు. పరపతి నియంత్రణ సాధనాలు రెండు రకాలు.

1) పరిమాణాత్మక పరపతి నియంత్రణ: దీన్ని ‘సంప్రదాయ పద్ధతి’ లేదా ‘బ్లాంకెట్‌ పద్ధతి’ అంటారు. దీనిలో వాణిజ్య బ్యాంకులు సృష్టించే పరపతి పరిమాణాన్ని, పరపతి వ్యయాన్ని కేంద్ర బ్యాంకు నియంత్రిస్తుంది. దాంతో వాణిజ్య బ్యాంకులు సృష్టించే పరపతి పరిమాణాన్ని ఆర్‌బీఐ పెంచుతుంది లేదా తగ్గిస్తుంది. పరిమాణాత్మక పరపతి నియంత్రణ చర్యలు పలు విధాలుగా ఉంటాయి. 

1) బ్యాంకు రేటు లేదా రీడిస్కౌంట్‌ రేటు: వినిమయ బిల్లులు, వాణిజ్య పేపర్లు, ఇతర అనుమతి ఇచ్చిన సెక్యూరిటీలు హామీలుగా పెట్టుకుని ఆర్‌బీఐ రుణం ఇచ్చినప్పుడు విధించే వడ్డీ రేటే బ్యాంకు రేటు. దీన్ని రీ-డిస్కౌంట్‌ రేటు అని కూడా అంటారు. ప్రథమశ్రేణి బిల్లులను హామీగా ఉంచి వాణిజ్య బ్యాంకులు కేంద్ర బ్యాంకు వద్ద రుణాలు తీసుకునేటప్పుడు కేంద్ర బ్యాంకు వాణిజ్య బ్యాంకుపై విధించే వడ్డీని బ్యాంకు రేటు అంటారు. అధిక బ్యాంకు రేటు వల్ల కేంద్ర బ్యాంకు, వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే వడ్డీ రేటు పెరుగుతుంది (పరపతి వ్యయం). దీంతో వాణిజ్య బ్యాంకులు ఖాతాదారులకు ఇచ్చే రుణాల వడ్డీ రేటు ఎక్కువవుతుంది. అధిక వడ్డీ రేటు వల్ల పరపతి తగ్గిపోతుంది. ద్రవ్యోల్బణ కాలంలో ఆర్‌బీఐ బ్యాంకు రేటు పెంచుతుంది. అంటే కఠిన ద్రవ్య విధానాన్ని అవలంబిస్తుంది. ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో బ్యాంకు రేటు తగ్గిస్తుంది. అంటే సులభ ద్రవ్యవిధానాన్ని పాటిస్తుంది.

2) బహిరంగ మార్కెట్‌ చర్యలు: బ్యాంకు రేటు పనితీరులో కొన్ని బలహీనతలు ఉన్నాయి. అందుకే బహిరంగ మార్కెట్‌ చర్యలు అవసరమవుతాయి. కొంతమంది ఆర్థికవేత్తలు బ్యాంకు రేటు, బహిరంగ మార్కెట్‌ చర్యలు అనేవి ద్రవ్య నిర్వహణలో ఒకదానికొకటి పూరకాలని పేర్కొన్నారు. కేంద్ర బ్యాంకు ప్రభుత్వ సెక్యూరిటీలను బహిరంగ మార్కెట్‌లో ప్రజలకు, వాణిజ్య బ్యాంకులకు, ఇతర విత్తసంస్థలకు అమ్మడాన్ని, కొనడాన్ని బహిరంగ మార్కెట్‌ చర్యలు అంటారు.

3) నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్‌): ఆర్‌బీఐ చట్టం -1934 ప్రకారం ప్రతి వాణిజ్య బ్యాంకు డిమాండ్‌ డిపాజిట్లలో 5%, కాలపరిమితి డిపాజిట్లలో 2% రిజర్వుబ్యాంకు వద్ద నగదు నిల్వలుగా ఉంచాలి. ఆర్‌బీఐ సవరణ చట్టం -1962 ద్వారా డిమాండ్‌ డిపాజిట్లు, కాలపరిమితి డిపాజిట్లు అనే తారతమ్యం లేకుండా మొత్తం డిపాజిట్లపై 3 నుంచి 15 శాతం వరకు నగదు నిల్వలు ఆర్‌బీఐ వద్ద ఉండాలి. దీన్నే నగదు నిల్వల నిష్పత్తి అంటారు. ఇది తప్పనిసరి. కాబట్టి సీఆర్‌ఆర్‌పై వడ్డీ రాదు. దీన్ని 15 రోజుల ప్రాతిపదికన నిర్వహిస్తారు. ద్రవ్య సరఫరా నిర్వహణకు, మార్కెట్‌లో ద్రవ్య నిర్వహణకు ఈ విధమైన సీఆర్‌ఆర్‌ని ఆర్‌బీఐ ఉపయోగిస్తుంది. 2020, మార్చి 27న సీఆర్‌ఆర్‌ 4 శాతం నుంచి 3 శాతానికి దించింది. 

4) చట్టబద్ధ ద్రవ్యత్వ నిష్పత్తి (ఎస్‌ఎల్‌ఆర్‌): 1949 బ్యాంకింగ్‌ రెగ్యులేషన్‌ చట్టం ప్రకారం ప్రతి వాణిజ్య బ్యాంకు తన మొత్తం డిపాజిట్లలో కొంత భాగాన్ని నగదుగా లేదా బంగారం రూపంలో, ప్రభుత్వ సెక్యూరిటీల రూపంలో తన వద్దే ఉంచుకోవాలి. దీన్ని ఎస్‌ఎల్‌ఆర్‌ అంటారు. అంటే బ్యాంకు డిపాజిట్లను కచ్చితంగా నిర్దిష్ట ఆస్తులు కొనడానికి ఉపయోగించాలి. ప్రస్తుతం ప్రతి వంద రూపాయల డిపాజిట్లలో రూ.18 ఆర్‌బీఐ ఆమోదించిన ఆస్తుల్లో పెట్టుబడిగా పెట్టాలి. ద్రవ్యోల్బణ కాలంలో ఎస్‌ఎల్‌ఆర్‌ను పెంచుతారు. బ్యాంకింగ్‌ రెగ్యులేషన్‌ చట్టం ప్రకారం 1962లో ఎస్‌ఎల్‌ఆర్‌ కనీసం 25 శాతం, గరిష్ఠంగా 40 శాతం ఉంచాలి. నరసింహ కమిటీ సిఫార్సు మేరకు 38.50 శాతం నుంచి 25 శాతానికి తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్‌బీఐ 1997, అక్టోబరులో ఎస్‌ఎల్‌ఆర్‌ని 25 శాతానికి తగ్గించింది. 2020, ఏప్రిల్‌ 11 నుంచి ఇది 18 శాతంగా ఉంది.

5) రెపో రేటు: కేంద్ర ప్రభుత్వం 1992లో ద్రవ్య సర్దుబాటు సౌకర్యం (ఎల్‌ఎఎఫ్‌) కింద రెపో రేటును ప్రవేశపెట్టింది. రెపో అనేది స్వల్పకాలానికి చెందింది (ఒక రోజు నుంచి 14 రోజుల వరకు). వాణిజ్య బ్యాంకుల వద్ద ద్రవ్య నిల్వలు కొరతగా ఉన్నప్పుడు తమ వద్ద ఉన్న ప్రభుత్వ సెక్యూరిటీలను ఆర్‌బీఐ వద్ద ఉంచి రుణం తీసుకుంటాయి. ఈ స్వల్పకాలిక రుణాలపై రిజర్వ్‌ బ్యాంకు వసూలు చేసే వడ్డీనే రెపో రేటు.

6) రివర్స్‌ రెపో రేటు: దీన్ని 1996లో ప్రవేశపెట్టారు. వాణిజ్య బ్యాంకుల వద్ద అదనపు ద్రవ్య నిల్వలు ఉన్నప్పుడు ఆర్‌బీఐ వద్ద జమ చేస్తే వాటిపై వచ్చే వడ్డీ రేటును రివర్స్‌ రెపో రేటు అంటారు.

2) గుణాత్మక పరపతి నియంత్రణ:  1956 నుంచి మొదటిసారిగా గుణాత్మక పరపతి నియంత్రణ చర్యలు చేపడుతున్నారు. అవి

1) మార్జిన్లు నిర్ణయించడం

2) వినియోగదారుల పరపతి నియంత్రణ

3) పరపతి రేషనింగ్‌  

4) నైతికోద్బోద

5) ప్రత్యక్ష చర్య.


రచయిత: ధరణి శ్రీనివాస్‌ 
 

Posted Date : 04-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌