• facebook
  • whatsapp
  • telegram

సామాజిక‌, సంక్షేమ ప‌థ‌కాలు

పేదల సంక్షేమానికి ప్రభుత్వ భరోసా

  ప్రగతి ఫలాలను అందరికీ అందించేందుకు, సమాజంలోని అన్నివర్గాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. వ్యక్తిగత ప్రయోజనాన్ని నేరుగా అందిస్తూ, తద్వారా సమాజాభివృద్ధి లక్ష్యంగా సాగుతోంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు జనరల్‌ స్టడీస్‌ అధ్యయనంలో భాగంగా  ‘ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ విధానాల’ గురించి తెలుసుకోవాలి. కీలక సంక్షేమ కార్యక్రమాలు, వాటి ఉద్దేశాలు, అమలు విధానం, లబ్ధిదారుల ఎంపికకు పాటిస్తున్న విధివిధానాలపై పూర్తిస్థాయి అవగాహన పెంచుకోవాలి.

  ప్రజల సంక్షేమం కోసం నిర్వహించే అనేక సమాజాభివృద్ధి కార్యక్రమాల ఆధారంగా ఒక ప్రభుత్వం అమలు చేసే విధానాలను అర్థం చేసుకోవచ్చు. రకరకాల పథకాలు,  అర్హతలు, వాటికి బడ్జెట్‌ కేటాయింపులు, మానాభివృద్ధి అందులో భాగంగా ఉంటాయి. ప్రధానంగా వ్యవసాయ, పారిశ్రామిక, గ్రామీణ, పట్టణాల ప్రగతికి చేపడుతున్న చర్యలు ఆ విధమైన పాలనకు సంబంధించిన లక్ష్యాలను తెలియజేస్తాయి. 

వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక

  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం సామాజిక భద్రతా పెన్షన్ల పథకాన్ని ‘వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక’గా పేరు మారుస్తూ 2019, మే 30న ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో దీని పేరు ‘ఎన్టీఆర్‌ భరోసా’గా ఉండేది. వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక పథకం 2019, జులై 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ పథకం కింద వృద్ధాప్య పింఛను లబ్ధిదారుల ఎంపికకు వయసు పరిమితిని 65 నుంచి 60 ఏళ్లకు ప్రభుత్వం తగ్గించింది.

* ఈ పథకంలో భాగంగా వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, కల్లు గీత కార్మికులు, మత్స్యకారులు, ఒంటరి మహిళలు, సంప్రదాయ చర్మకారులతోపాటు హెచ్‌ఐవీ రోగులకు నెలకు రూ.2,250 పింఛను అందిస్తారు. 2022, జనవరి 1 నుంచి ఈ మొత్తాన్ని రూ.2,500లకు పెంచారు. దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్లు (లింగమార్పిడి చేసుకున్నవారు), డప్పు కళాకారులకు ఇచ్చే పింఛన్‌ను నెలకు రూ.3 వేలకు పెంచారు. డయాలసిస్‌ రోగులకు రూ.10 వేల చొప్పున పింఛను అందిస్తారు. ఇలా ఈ పథకం కింద మొత్తం 12 రకాల సామాజిక భద్రతా పెన్షన్లు అందజేస్తున్నారు.

* పథకం లబ్ధిదారుల్లో అత్యధికంగా వృద్ధాప్య పింఛనుదారులు ఉండగా, తర్వాత స్థానంలో వితంతువులున్నారు. అత్యల్పంగా ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు.

* ఆంధ్రప్రదేశ్‌ వార్షిక బడ్జెట్‌ 2022-23 ప్రకారం మొత్తం 61.74 లక్షల మందికి ఈ సామాజిక భద్రతా పింఛన్లు అందిస్తున్నారు. ఇందుకోసం రూ.18 వేల కోట్లు కేటాయించారు.

* జిల్లా స్థాయిలో వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక పథకం అమలును కలెక్టర్‌ పర్యవేక్షణలో జిల్లా గ్రామీణాభివృద్ధి అథారిటీ (డీఆర్‌ డీఏ) ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ పర్యవేక్షిస్తారు.

వైఎస్‌ఆర్‌ బీమా

అసంఘటిత రంగంలోని కార్మికుల కుటుంబాల్లోని సంపాదనపరులు అనారోగ్యం (లేదా) ప్రమాదవశాత్తు అకాల మరణానికి గురైనప్పుడు ఆ కుటుంబాన్ని ఆదుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రమాద బీమా పథకాన్ని 2016, అక్టోబరు 2 నుంచి అమలు చేస్తోంది. గతంలో ‘చంద్రన్న బీమా’ పేరుతో పిలిచే ఈ పథకాన్ని ‘పీఎమ్‌జేజేబీవై’ - వైఎస్‌ఆర్‌ బీమా’ పథకంగా 2019, జులై 22న రాష్ట్ర ప్రభుత్వం పేరు మార్చింది. ఆ తర్వాత ఈ పథకాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అమలుచేస్తూ ‘వైఎస్‌ఆర్‌ బీమా పథకం’గా 2020, ఆగస్టు 28న మార్పు చేసింది. ఆ మేరకు 2020, అక్టోబరు 21న పునఃప్రారంభించింది.

* 2021, జూన్‌ 27న వైఎస్‌ఆర్‌ బీమా పథకానికి మరిన్ని మార్పులు చేసి 2021, జులై 1 నుంచి తిరిగి అమలు చేస్తున్నారు.

* ఈ పథకం కింద లబ్ధిదారుల్లో 18 నుంచి 50 సంవత్సరాలు మధ్య వయసున్నవారి సహజ మరణానికి రూ.లక్ష ఆర్థిక సహాయం అందిస్తారు. 18 - 70 ఏళ్ల వారు ప్రమాదం వల్ల మరణిస్తే లేదా శాశ్వత అంగవైకల్యం సంభవిస్తే రూ.5 లక్షలు అందిస్తారు. దరఖాస్తు చేసిన 15 రోజుల్లో బీమా చెల్లిస్తారు.

* ఈ పథకం కింద అర్హత ఉన్న 1.32 కోట్ల బీపీఎల్‌ కుటుంబాలకు ఉచిత బీమా సౌకర్యం కల్పించారు. పథకం అమలుకు 2022-23 సంవత్సరానికి బడ్జెట్‌లో రూ.372.12 కోట్లు కేటాయించారు.

* ఈ పథకం నోడల్‌ ఏజెన్సీగా కార్మిక శాఖ, అమలు ఏజెన్సీగా గ్రామ/వార్డు వాలంటీర్లు, గ్రామ/వార్డు సచివాలయాల శాఖ వ్యవహరిస్తాయి.

* ఈ పథకం కోసం 2022-23 సంవత్సరానికి రూ.372.12 కోట్ల బడ్జెట్‌ను కేటాయించారు.

వైఎస్‌ఆర్‌ కల్యాణమస్తు/వైఎస్‌ఆర్‌ షాదీ తోఫా

  ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లో ఆడపిల్ల పెళ్లి భారం కాకూడదని రాష్ట్ర ప్రభుత్వం ‘పెళ్లికానుక’ పథకం తీసుకొచ్చింది. పేదింటి ఆడపిల్లలకు ఆర్థిక సహాయంతో అండగా ఉండటమే కాకుండా, బాల్యవివాహాలు నిర్మూలించేందుకు, వివాహం రిజిస్ట్రేషన్‌ ద్వారా వధువుకి రక్షణ కల్పించడం పెళ్లికానుక ముఖ్య ఉద్దేశం.

* ఈ పథకం పేరును గతంలో ‘చంద్రన్న పెళ్లికానుక’ పేరుతో అమలు చేయగా, 2019, సెప్టెంబరులో ‘వైఎస్‌ఆర్‌ పెళ్లికానుక’గా మార్చారు. తిరిగి 2022, అక్టోబరు 1న ‘వైఎస్‌ఆర్‌ కల్యాణమస్తు/వైఎస్‌ఆర్‌ షాదీ తోఫా’గా పేరు మార్చి పునఃప్రారంభించారు. ‘వైఎస్‌ఆర్‌ షాదీ తోఫా’ ద్వారా ముస్లిం మైనార్టీ వర్గాల ఆడపిల్లలకు వివాహ ప్రోత్సాహం కింద ఆర్థిక సాయం అందిస్తారు.

* సంబంధిత అధికారులు క్షేత్ర పరిశీలన చేసిన తరువాత, వివరాలు ధ్రువీకరించుకుని త్రైమాసికానికి ఒకసారి చొప్పున జనవరి, ఏప్రిల్, జులై, అక్టోబరు నెలల్లో లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందిస్తారు.

నవరత్నాల కార్యక్రమం

* రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయం, విద్య, గృహనిర్మాణం, సంక్షేమం, ఇతర రంగాలకు సంబంధించిన తొమ్మిది విభాగాలతో సమగ్ర సంక్షేమ కార్యక్రమం ‘నవరత్నాలు’ను ప్రారంభించింది. దీని ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రప్రభుత్వం నవరత్నాల అమలు, పర్యవేక్షణ కమిటీలను రాష్ట్ర, జిల్లా స్థాయుల్లో ఏర్పాటు చేసింది. 

* రాష్ట్రస్థాయి నవరత్నాలు అమలు, పర్యవేక్షణ కమిటీకి ఛైర్మన్‌గా రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహరిస్తారు. ఈ కమిటీలో నలుగురు ఉప మఖ్యమంత్రులుతోపాటు, ఎనిమిది మంది మంత్రులు సభ్యులుగా ఉంటారు. అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శితోపాటు సంబంధిత మొత్తం 13 మంది కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు.

* జిల్లా స్థాయిలో నవరత్నాలు అమలు, పర్యవేక్షణ కమిటీకి జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. జిల్లా మంత్రులు, నవరత్నాలు అమల్లో సంబంధమున్న జిల్లాస్థాయి అధికారులు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీకి జిల్లా కలెక్టర్‌ ‘మెంబర్‌ కన్వీనర్‌’ గా వ్యవహరిస్తారు. 

* రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలు కార్యక్రమంలో భాగంగా కింది సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది.

1. వైఎస్‌ఆర్‌ రైతు భరోసా, 2. జలయజ్ఞం, 3. అమ్మఒడి, 4. ఫీజు రిఎంబర్స్‌మెంట్, 5. పేదలందరికీ ఇల్లు, 6. పింఛన్ల పెంపు, 7. ఆరోగ్యశ్రీ, 8. వైఎస్‌ఆర్‌ ఆసరా, 9. మద్యపాన నిషేధం

వైఎస్‌ఆర్‌ నవశకం

   సంక్షేమ పథకాల పరిమితులను వివరిస్తూ 2019, నవంబరు 20 నుంచి డిసెంబరు 20 వరకు పారదర్శకంగా సర్వే, సామాజిక తనిఖీ గ్రామ సభల ద్వారా వంద శాతం సంతృప్త స్థాయిలో అర్హులను గుర్తించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. ఈ కార్యక్రమంలో భాగంగా 2020, జనవరి 1 నుంచి బియ్యంకార్డు, ఆరోగ్యశ్రీ కార్డు, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన కార్డు,  వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక కార్డులకు సంబంధించి కొత్త కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా కింది సామాజిక సంక్షేమ పథకాలకు సంబంధించిన లబ్ధిదారులకు అర్హతలను గుర్తించారు.

  బియ్యంకార్డు, వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక కార్డు: * గ్రామీణ ప్రాంతాల్లో నెలసరి ఆదాయం రూ.10,000 లోపు ఉండాలి. * పట్టణ ప్రాంతాల్లో నెలసరి ఆదాయం రూ.12,000 లోపు ఉండాలి.* మూడు ఎకరాల్లోపు మాగాణి లేదా పది ఎకరాలలోపు మెట్టభూమి లేదా మాగాణి, మెట్ట భూమి కలిపి పది ఎకరాల లోపు ఉండాలి. * నెలవారీ విద్యుత్‌ వినియోగం 300 యూనిట్లు దాటకూడదు. * ప్రభుత్వ ఉద్యోగులు/ పెన్షన్‌దారులు అనర్హులు. కానీ పారిశుద్ధ్య కార్మికులకు మినహాయింపు ఉంటుంది. * ఫోర్‌వీలర్‌ ఉన్న కుటుంబాలు అనర్హులు. ట్రాక్టర్, ఆటో, టాక్సీకి మినహాయింపు ఉంటుంది.* కుటుంబంలో ఆదాయపు పన్ను చెల్లించేవారు ఒక్కరున్నా ఆ కుటుంబానికి అర్హత ఉండదు.* పట్టణ ప్రాంతాల్లో ఆస్తులు లేనివారు/750 చదరపు అడుగుల్లోపు నివాస స్థలం (ఇల్లు) కలిగినవారు అర్హులు.

  జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన కార్డులు: * డిగ్రీ, ఉన్నత చదువులు చదువుతున్న ప్రభుత్వ కళాశాలలు, ఎయిడెడ్, ప్రైవేటు కళాశాలలకు చెందిన విద్యార్థులు అర్హులు. * కుటుంబ వార్షిక ఆదాయం 2.5 లక్షల లోపు ఆదాయం ఉన్నవారు అర్హులు. * 10 ఎకరాలలోపు మాగాణి/25 ఎకరాలలోపు మెట్ట/మాగాణి, మెట్ట భూమి కలిపి 25 ఎకరాలలోపు ఉన్నవారు అర్హులు.* కుటుంబంలో ఏ ఒక్కరికైనా ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా, పెన్షన్‌ తీసుకుంటున్నా అనర్హులు. అయితే పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు మినహాయింపు ఉంటుంది.* ఫోర్‌వీలర్‌ ఉన్నవారు అనర్హులు. అయితే ట్రాక్టర్, టాక్సీ, ఆటోకి మినహాయింపు ఉంటుంది. * కుటుంబంలో ఆదాయపు పన్ను చెల్లించేవారు ఒక్కరున్నా ఆ కుటుంబానికి అర్హత ఉండదు.* పట్టణ ప్రాంతాల్లో 1500 చదరపు అడుగులలోపు ఇల్లు కలిగినవారు అర్హులు.

  వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ కార్డు: * కుటుంబ వార్షిక ఆదాయం 5 లక్షల లోపు ఉన్నవారు అర్హులు.* 12 ఎకరాల్లోపు మాగాణి/35 ఎకరాల్లోపు మెట్టభూమి/ మెట్ట, మాగాణి కలిపి 35 ఎకరాల్లోపు ఉన్నవారు అర్హులు.* కుటుంబానికి ఒక కారు ఉన్నవారు కూడా అర్హులే.* 3000 చదరపు అడుగుల్లోపు ఇల్లు కలిగినవారు కూడా అర్హులే.* ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకంలోకి రాని ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పథకం వర్తిస్తుంది.

  వైఎస్‌ఆర్‌ సున్నావడ్డీ కార్డు: * గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో రూ.5 లక్షల్లోపు రుణాలు కలిగిన డ్వాక్రా మహిళందరూ అర్హులే. * 2019, మార్చి నాటికి సెర్ప్, మెప్మా వారి సమాచారం మేరకు నిరర్ధక ఆస్తులుగా గుర్తించిన స్వయం సహాయక సంఘాలు అనర్హులు.

రచయిత: వి.కరుణ


 

Posted Date : 18-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌