• facebook
  • whatsapp
  • telegram

ప్రత్యేక హోదా ప్రతిపత్తి

మాట తప్పి.. సాయంతో సరిపెట్టి!




ఉమ్మడి రాష్ట్ర విభజనతో ఆర్థికంగా దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్‌కు కాస్తంత అండగా నిలుస్తుందనుకున్న ‘ప్రత్యేక హోదా’ హామీ ఎప్పటికీ అందని ద్రాక్షలాగా మిగిలిపోయింది. ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చి ఆదుకుంటామని స్పష్టంగా చెప్పిన కేంద్ర ప్రభుత్వం తర్వాత మాట నిలబెట్టుకోలేదు. ఆర్థిక సంఘం సిఫార్సులను కారణంగా చూపి ప్రత్యేక హోదాను కాస్తా ప్రత్యేక ఆర్థిక సాయంగా మార్చేసింది. ఆ సాయంతో ఆర్థిక వెసులుబాటు కల్పించకుండా, వడ్డీల చెల్లింపులకు పరిమితం చేయడంతో రాష్ట్రంపై అప్పుల భారం పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో నవ్యాంధ్రలో ప్రధాన రాజకీయ, ఆర్థిక అంశమైన ప్రత్యేక హోదాపై అభ్యర్థులకు సమగ్ర అవగాహన ఉండాలి. దాని వల్ల లభించే ప్రయోజనాలు, హామీ పూర్వాపరాల నుంచి ప్రస్తుత స్థితి వరకు పరిణామాలను పూర్తిగా తెలుసుకోవాలి.


ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు-2014పై చర్చ సందర్భంగా 2014, ఫిబ్రవరి 20న నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ రాజ్యసభలో ప్రసంగిస్తూ విభజిత ఆంధ్రపదేశ్‌కు 6 రకాల హామీలిచ్చారు. వాటిలో కీలకమైంది ‘ప్రత్యేక హోదా’ అంశం. ‘‘కేంద్ర సహాయం అందించేందుకు ప్రత్యేక హోదా ప్రతిపత్తి sSpecial Category Statuszని విభజిత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి 5 సంవత్సరాల పాటు ఇస్తాం. ఇది విభజిత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఆర్థికంగా తన కాళ్ల మీద తాను నిలబడేందుకు దోహదపడుతుంది’’ అని ప్రధాని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్రతిపత్తి ఇవ్వాలని సూచిస్తూ 2014, మార్చిలో కేంద్ర మంత్రిమండలి కూడా నిర్ణయం తీసుకుంది. కానీ నేటివరకు కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రత్యేక హోదా కావాలని రాష్ట్ర ప్రభుత్వం, ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు పెద్దఎత్తున కోరుతున్నా కేంద్రం నుంచి సానుకూల స్పందన రావడం లేదు.


ఆర్థిక సంఘాల సిఫార్సులతో సంఘర్షణ:  కేంద్ర ప్రభుత్వ ఉద్దేశంలో 2014, ఫిబ్రవరి 20న ప్రధానమంత్రి ఇచ్చిన 6 రకాల హామీల్లోని 5 హామీల విషయంలో వివాదం లేదు. అయితే మొదటి హామీగా పేర్కొన్న ‘ప్రత్యేక హోదా ప్రతిపత్తి’పై అప్పటి ప్రధాని ప్రకటనకు, తర్వాత వచ్చిన 14వ ఆర్థిక సంఘం సిఫార్సులకు మధ్య సంఘర్షణ వచ్చింది. 14వ ఆర్థిక సంఘం నివేదికలోని పేరా 2.29, పేరా 2.30లో ‘‘ఆర్థిక వనరుల పంపిణీపై ప్రతిపాదనలు, సిఫార్సులు చేయడంలో ప్రత్యేక హోదా ప్రతిపత్తి ఉన్న రాష్ట్రాలకు, సాధారణ కేటగిరీ రాష్ట్రాలకు మధ్య ఎలాంటి వ్యత్యాసం చూపలేదు. రాష్ట్ర వనరులను అంచనా వేయడంలో, ఒక్కో రాష్ట్రానికి ఉన్న బలహీనతలను, అడ్డంకులను పరిగణనలోకి తీసుకుని వాటికి కావాల్సిన ఆర్థిక వ్యయ అవసరాలను అంచనా వేశాం. ఈ విషయంలో ఈశాన్య రాష్ట్రాలకు, పర్వత ప్రాంత రాష్ట్రాలకు మధ్య భౌతిక సారూప్యతలు అనేకం (ఎక్కువ) ఉండటాన్ని గమనించాం. ఆర్థిక కార్యకలాపాలు తక్కువగా ఉండటం, వెనుకబాటుతనం, అంతర్జాతీయ సరిహద్దులకు సమీపంగా ఉండటం వల్ల వాటి ద్రవ్యవనరులపై ప్రభావం ఉండటంతో, వ్యయ అవసరాలు అధికంగా ఉన్నాయి. ప్రతి రాష్ట్రం ఆర్థిక లోటును సాధ్యమైనంతగా పన్నుల పంపకం ద్వారా భర్తీ చేయాలనేదే మా లక్ష్యం. అయితే అంచనా వేసిన లోటును పూడ్చలేని రాష్ట్రాలకు, పన్ను పంపకాలకు అదనంగా (పోస్ట్‌ డివల్యూషన్‌) రెవెన్యూ లోటు గ్రాంట్లు ప్రతిపాదించాం. అంతర్రాష్ట్ర అసమానతలు ఆయా రాష్ట్రాలు విధానాల పరిధిలోనివే అయినప్పటికీ, పన్నుల పంపకం ద్వారా రాష్ట్రాలకు ఎక్కువ ఆదాయం సమకూర్చి తద్వారా అంతర్రాష్ట్ర అసమానతలను రాష్ట్రాలే సమర్థవంగా పరిష్కరించుకునే అవకాశం కల్పించాం’’ అని పేర్కొంది.


పన్నుల పంపకం (ట్యాక్స్‌ డివల్యూషన్‌)కు ప్రతిపాదనల తయారీలో 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా రాష్ట్రాలు, సాధారణ కేటగిరీ రాష్ట్రాలకు మధ్య ఎలాంటి వ్యత్యాసం చూపకపోయినప్పటికీ రాష్ట్ర ద్రవ్య సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకుని ‘‘ఆంధ్రప్రదేశ్‌ 2019-20లో కూడా ఆర్థికలోటులోనే ఉంటుంది’’ అని చెబుతూ 2015-16 నుంచి 2019-20 వరకు అయిదేళ్ల పాటు ప్రత్యేక ఆర్థిక లోటు గ్రాంటును ప్రకటించింది.


 2018, అక్టోబరు 11న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో 15వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా అంశం తమ పరిధిలోకి రాదని పేర్కొంది.


ప్రత్యేక ఆర్థిక సహాయంపై కేంద్రం ప్రకటన: ప్రజాఉద్యమాలు, రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 2016, సెప్టెంబరు 8న ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. ప్రత్యేక హోదా వల్ల కలిగే ప్రయోజనాలన్నీ దీనిద్వారా సమకూరతాయని, ‘ప్రత్యేక హోదా’కు, ‘ప్రత్యేక ఆర్థిక సహాయం’కు పేరులో తప్ప ఇంకెందులోనూ తేడా ఉండదని చెప్పింది. ఈ హామీకి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్ర మంత్రిమండలి 2017, మార్చి 15న ఆంధ్రప్రదేశ్‌కు ‘ప్రత్యేక ఆర్థిక సహాయం (pecial Assistance Measure) ఆమోదించింది. దీనిలో భాగంగా ఎక్స్‌టర్నల్లీ ఎయిడెడ్‌ ప్రాజెక్టులు (EAP)కు నిధులు సమకూర్చడంలో ప్రత్యేక మినహాయింపు, వెసులుబాటు కల్పించింది.


 కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన దాని ప్రకారం ప్రత్యేక ఆర్థిక సహాయం ద్వారా కేంద్ర ప్రాయోజిత పథకాలు 90:10 నిష్పత్తిలో అమలుచేసి ఉంటే రాష్ట్రానికి కేంద్రం నుంచి అయిదేళ్లకు (2015-20) అదనంగా రావాల్సిన మొత్తాన్ని అదనపు సాయంగా అందిస్తుంది. ఈ మొత్తాన్ని 2015-16 నుంచి 2019-20 వరకు అయిదేళ్లలో విదేశీ సాయంతో నడిచే EAP ప్రాజెక్టులకు రుణవడ్డీ చెల్లింపుల రూపంలో ఇస్తుంది. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుకు 2014, ఏప్రిల్‌ 1 నుంచి అయిన వ్యయాన్ని 100 శాతం కేంద్రం సమకూరుస్తుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను కేంద్రం తరఫున రాష్ట్ర ప్రభుత్వమే చేపడుతుంది.


 ప్రత్యేక ఆర్థిక సహాయంలో భాగంగా 2015-16 నుంచి 2022-23 సంవత్సరాల మధ్య 17 విదేశీ సహాయ ప్రాజెక్టుల కింద ఆసియన్‌ అభివృద్ధి బ్యాంకు (ADB), ఆసియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకు (AIIB), ప్రపంచబ్యాంకు (IBRD), ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌ అసోసియేషన్‌ (IDA), IFAD, GODE(జర్మనీ), GOJP (జపాన్‌)ల ద్వారా రూ.7,797.69 కోట్ల రుణం అందించినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అయితే ప్రత్యేక ఆర్థిక సహాయం ద్వారా కేంద్ర ప్రాయోజిత పథకాల (CSS)కు 90:10 నిష్పత్తిలో కేంద్రం అదనపు వాటా కింద 5 సంవత్సరాల పాటు అంటే 2015 నుంచి 2020 వరకు రూ.16,447 కోట్లు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఈ మొత్తాన్ని వాడుకునేందుకు అనుమతులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం 2015-16 నుంచి 2019-20 వరకు చేసుకున్న EAPలకు సంబంధించిన రుణాలు, వడ్డీలను మాత్రమే ప్రత్యేక ఆర్థిక సహాయం కింద కేంద్రం చెల్లిస్తుందని చెప్పింది. FRBM నిబంధనల మేరకే EAP రుణాలు అందజేస్తుందని, రుణాల చెల్లింపులు లాంటి వాటికి ప్రత్యేక ఆర్థిక సహాయం ఉండదని కేంద్రం పేర్కొంది. కేంద్రం పేర్కొన్న 5 సంవత్సరాలు (2015-20) గడువు ముగిసినప్పటికీ, ఇంతవరకు నిధులు అనుకున్న స్థాయిలో అందలేదు.


నాబార్డు/హడ్కో/బ్యాంకుల ద్వారా ప్రత్యేక ఆర్థిక సహాయం సమకూర్చాలని రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థించింది. కానీ కేంద్ర ప్రభుత్వం స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ (SPV) ఏర్పాటు చేయాలని ప్రతిపాదించి, అప్పు భారాన్ని రాష్ట్రంపై పెట్టింది. ప్రత్యేక హోదా ఉన్న ఇతర రాష్ట్రాలు వేటికీ కేంద్ర సహాయాన్ని అందించేందుకు ఈ విధంగా SPV ఏర్పాటును కోరలేదు. అంటే కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదు ప్రత్యేక ఆర్థిక సహాయం అందించడంలోనూ పూర్తి సహకారం అందించలేదు.


ప్రత్యేక హోదా ప్రతిపత్తి: 1969లో 5వ ఆర్థిక సంఘం సిఫార్సుల్లో భాగంగా రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ప్రతిపత్తి కల్పించే విధానం ప్రవేశపెట్టారు.1969లో తొలుత జమ్ము-కశ్మీర్, అస్సాం, నాగాలాండ్‌లకు ప్రత్యేక హోదా కల్పించారు. అనంతరం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన డిమాండ్ల మేరకు మరో 8 రాష్ట్రాలకు (అరుణాచల్‌ ప్రదేశ్, హిమాచల్‌ ప్రదేశ్, మణిపుర్, మేఘాలయ, మిజోరం, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్‌) ప్రత్యేక హోదా కల్పించారు. ఇప్పటివరకు దేశంలో మొత్తం 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చారు. (చివరగా 2010లో ఉత్తరాఖండ్‌కు ప్రత్యేక హోదా వచ్చింది). గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్‌తో పాటు బిహార్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలు ప్రత్యేక హోదా కోసం డిమాండ్‌ చేస్తున్నాయి. బిహార్‌కు ప్రత్యేక ప్రణాళిక అమలవుతోంది.


 ప్రధానమంత్రి అధ్యక్షతన ఉన్న జాతీయ అభివృద్ధి మండలి సలహా మేరకు ప్రత్యేక హోదా నిర్ణయం తీసుకుంటారు. అయితే ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించేటప్పుడు ఆ రాష్ట్రంలోని కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. అవి         1) పర్వత ప్రాంతాలు ఉండి రవాణా సౌకర్యాలు సరిగా లేకపోవడం 2) జనసాంద్రత తక్కువగా ఉండి, గిరిజన జనాభా ఎక్కువగా ఉండటం 3) ఆర్థిక వనరులు, సరైన మౌలిక సదుపాయాలు లేని ప్రాంతాలు  4) పొరుగు దేశాలతో సరిహద్దులు ఉండి వ్యూహాత్మకంగా ప్రాధాన్యమున్న రాష్ట్రాలు 5) ఆర్థిక వనరులు ఉన్నప్పటికీ ఆర్థికంగా పటిష్టంగా లేని ప్రాంతం.


ప్రత్యేక హోదా అనేది నిధులు కేటాయింపునకు సంబంధించింది కావడంతో కేంద్ర ఆర్థిక సంఘం సిఫార్సు కూడా కీలకమవుతుంది. 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా ఇవ్వలేమని స్పష్టంగా చెప్పడంతో ఇకపై ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా డిమాండ్‌ను కేంద్రం పరిగణనలోకి తీసుకోదని గతంలోనే కేంద్ర ఆర్థికమంత్రి పేర్కొన్నారు.


ప్రత్యేక హోదా కల్పించిన రాష్ట్రాలకు కేంద్రం గ్రాంట్ల రూపంలో ఆర్థిక సహాయం అందిస్తుంది. కేంద్ర ప్రభుత్వం పథకాల్లో 90 శాతం నిధులు గ్రాంట్లుగా, 10 శాతం నిధులు రుణంగా ఇస్తుంది. కేంద్రప్రభుత్వ నిధుల్లో ప్రాధాన్యం ఉంటుంది. పరిశ్రమల ఏర్పాటుకు రాయితీలు, ప్రోత్సాహకాలు అందుతాయి. ఈ రాష్ట్రాలు రుణమార్పిడి, రుణ ఉపశమన పథకాల ప్రయోజనం పొందొచ్చు. పెట్టుబడులు   ఆకర్షించడం కోసం కస్టమ్స్‌ డ్యూటీ, కార్పొరేట్‌ టాక్స్, ఇతర పన్నుల నుంచి మినహాయింపులు ఉంటాయి.

 



రచయిత: వి.కరుణ 

Posted Date : 09-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌