• facebook
  • whatsapp
  • telegram

ఆంధ్ర ప్రాంత, ఆంధ్ర జాతి తొలి ప్రస్తావనలు 

          ఆంధ్రులు నివసించే దేశం కాబట్టి ఆంధ్రదేశం అనే పేరు వచ్చింది. పురాణాలు, జైన, బౌద్ధ గ్రంథాలు, శాసనాలు, విదేశీయుల రచనల్లో కూడా ఆంధ్ర దేశ, ఆంధ్ర జాతి ప్రస్తావనలు ఉన్నాయి. బౌద్ధ జాతక కథల్లో ఆంధ్ర ప్రాంతాన్ని మంజీర దేశం, వజ్ర దేశం, నాగభూమిగా పేర్కొన్నారు. ప్రాచీన ఆంధ్ర దేశంలోని కృష్ణా, గోదావరి మైదానాలను 'నాగభూములు'గా టాలమీ తన జాగ్రఫీ (A guide to geography) గ్రంథంలో ప్రస్తావించారు. గుంటుపల్లి గుహాలయ శాసనాలు అదే ప్రాంతాన్ని 'మహానాగ పర్వతం'గా పేర్కొన్నాయి. ఆంధ్ర అనే పదాన్ని జాతి పరంగా, దేశ పరంగా, భాషాపరంగా అనేక రచనలు పేర్కొన్నాయి. మనుస్మృతి, భరతుని నాట్యశాస్త్రం, వ్యాసుని మహాభారతం, కువలయమాల లాంటి గ్రంథాలు ఆంధ్రులను జాతిపరంగా ప్రస్తావించాయి. వాల్మీకి రామాయణం, శివస్కంధవర్మ మైదవోలు శాసనం, వరాహమిహిరుని 'బృహత్ సంహిత' లాంటి గ్రంథాలు ఆంధ్రులను దేశ పరంగా పేర్కొన్నాయి. కానీ నన్నయ నందంపూడి శాసనం, విద్యానాథుని ప్రతాపరుద్ర యశోభూషణం, విన్నకోట పెద్దన 'కావ్యాలంకార చూడామణి' లాంటి గ్రంథాలు ఆంధ్రను భాషాపరంగా పేర్కొన్నాయి. సుత్తనిపాత' అనే బౌద్ధ రచన అస్మక, ములక అనే అంధక రాష్ట్రాల గురించి వివరించింది. ఆంధ్ర నగరి తేలివాహన నదిపై ఉందని 'సెరివణిజ జాతకం' వివరిస్తుంది. ఆంధ్ర పథాన్ని ప్రస్తావించిన 'భీమసేన జాతకం' ఆంధ్రదేశం వస్త్ర పరిశ్రమకు ఎంతో ప్రసిద్ధి చెందిందని వ్యాఖ్యానించింది.
        ఆంధ్రులను గురించి ప్రస్తావించిన తొలి గ్రంథం 'ఐతరేయ బ్రాహ్మణం'. ఇందులో ఆంధ్రులు విశ్వామిత్రుని సంతతి వారని, దక్షిణాదిలో అతడి సంతానమే పుండ్రులు, పుళిందులు, మూతిబలు, శబరులు, గదబలుగా స్థిరపడ్డారని పేర్కొంది. ఆంధ్రుల గురించి పేర్కొన్న తొలి విదేశీయుడు మెగస్తనీస్. తన 'ఇండికా' గ్రంథంలో ఆంధ్రులు 30 నగరాలను అత్యంత సైనిక సంపత్తితో పాలిస్తున్నారని పేర్కొన్నాడు. ఎరియన్ కూడా ఆంధ్రులు 30 రాజ్యాలను కలిగి ఉన్నారని పేర్కొన్నాడు. ఆంధ్రుల గురించి పేర్కొన్న తొలి శాసనం అశోకుడి 13వ శిలాశాసనం (దౌళి/జౌగాడ శాసనం). దీంతోపాటు 'ఎర్రగుడి', 'రాజులమందగిరి' శాసనాలు కూడా ఆంధ్రుల గురించి ప్రస్తావించాయి. అశోకుడి శాసనాలు ఆంధ్రులను 'ఆంధ్రభృత్యులు' అని పేర్కొన్నాయి. పురాణాల్లో ఆంధ్రులను ఆంధ్ర దేశీయులు, ఆంధ్ర జాతీయులుగా పేర్కొన్నారు. 'మత్స్య పురాణం' ప్రకారం ఆంధ్ర దక్షిణాది తొలి తెగ 'నాగులు'. కశ్యపుడి భార్యలు కద్రుక, వినత. వినతకు గరుత్మంతుడు జన్మించగా, కద్రుకకు వెయ్యిమంది నాగులు జన్మించారు. గరుత్మంతుడి నుంచి తన సంతానాన్ని కాపాడుకోవడానికి కద్రుక దండకారణ్య ప్రాంతానికి వచ్చినట్లు మత్స్య పురాణ కథనం చెబుతుంది. 'సుత్తనిపాత' గ్రంథం ప్రకారం నాగముచలిందుడు బుద్ధుడిని తన ఏడు పడగలతో రక్షణ కల్పించినట్లు తెలుస్తోంది. దీపాల దిన్నె/వజ్రాలదిన్నె/అమరావతి పాలకుడైన నాగాశోకుడు అక్కడ బౌద్ధ స్తూపానికి పునాదులు వేశాడు. 'చద్దా నిర్దేశన' అనే బౌద్ధ గ్రంథం దక్షిణ దేశంలో నివసించిన యక్షుల గురించి వివరిస్తుంది. కుబేరుడనే యక్షరాజు భట్టిప్రోలు (ప్రతీపాలపురం) శాసనం వేయించాడు. 'ధర్మామృతం' అనే జైన గ్రంథం యశోధర్ముడనే రాజు ప్రతీపాలపుర రాజ్యాన్ని స్థాపించాడని తెలుపుతోంది. మూడో బౌద్ధ సంగీతిలో అంధకులు ప్రధాన పాత్ర పోషించారని 'కథావత్తు' గ్రంథం తెలియజేస్తుంది. విమానవత్తు భాష్యం ప్రకారం మహాకాత్యాయనుడు అస్మక రాజుకు బౌద్ధమత దీక్షను ఇచ్చాడు. అలాగే, దక్షిణ దేశంలో భావరి అనేవాడు బౌద్ధాన్ని ప్రచారం చేసినట్లు 'సుత్తనిపాత' గ్రంథం తెలుపుతుంది. దక్షిణ భారతదేశంలో జైనమత విస్తరణ గురించి 'పరిశిష్ఠ పర్వం' అనే గ్రంథం వివరిస్తుంది. గుంటుపల్లి శాసనంలో కళింగాధిపతికి 'మహిశకాధిపతి' అనే బిరుదు ప్రస్తావన ఉంది.
 

రాతియుగంలో ఆంధ్ర దేశం
         ఆదిమానవుడి కాలాన్ని 'రాతియుగం' లేదా 'ప్రాక్‌చ‌రిత్ర' అంటారు. ఈ మొత్తం కాలాన్ని ప్రాచీన, మధ్య, నవీన శిలాయుగాలుగా విభజిస్తారు. ఆంధ్రదేశంలోని రాతియుగంపై పరిశోధనలు చేసి ప్రాక్‌చరిత్ర పితామహుడుగా 'రాబర్ట్ బ్రూస్‌పుట్' పేరొందారు. క్రీ.శ.1892లో రాబర్ట్ బ్రూస్‌పుట్, కమియెడ్‌ల కృషి ఫలితంగా అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ప్రాచీన శిలాయుగంలో ఆది మానవుడు మొరటు రాళ్లను పెచ్చులుగా కొట్టి ఆయుధాలుగా వాడాడు. వాటిని చేధకాలు, దరకాలు, చేతిగొడ్డళ్లు, గీకుడు రాళ్లుగా చరిత్రకారులు వర్ణించారు. అలాంటి పాత రాతియుగ పనిముట్లు నందికనుమ (గిద్దలూరు) వద్ద అధిక మొత్తంలో లభ్యమయ్యాయి. మధ్యరాతియుగంలో మానవుడు అతిచిన్న రాతి పనిముట్లను ఉపయోగించడం, జంతువులను మచ్చిక చేసుకోవడం, నిప్పును కనుక్కోవడం చేశాడు. నవీన శిలాయుగం నాటికి ఆహార అన్వేషణ దశ నుంచి ఆహార ఉత్పాదక దశకు చేరాడు. కర్నూలు జిల్లా భిల్లసర్గం గుహల్లో జంతుబలి ఆధారాలు లభించాయి.
గిద్దలూరు, సంగనకల్లు ప్రాంతాల్లో ఆహార ఉత్పాదకత దశకు చేరిన ఆనవాళ్లు లభించాయి. మహబూబ్‌నగర్ జిల్లాలోని ఉట్నూరు, అనంతపురం జిల్లాలోని పాల్వాయి ప్రాంతాల్లో మసిదిబ్బలు లేదా బూడిద దిబ్బలు నాటి పశుపాలక సమాజ ఆచారాలను తెలుపుతున్నాయి. రాతియుగ మానవుడు నిర్మించిన సమాధులను రాక్షసగుళ్లు అంటారు. వాటిలో 12 రకాల సమాధులు బయల్పడ్డాయి. వాటిలో డోల్మెన్‌లు, మెన్‌హిర్‌లు, సర్కోఫగిలు, సిస్త్‌లు, గుండ్రనిరాళ్లు లాంటివి ఉన్నాయి. శవాన్ని రాతి పెట్టెలో పెట్టి భూమిలో పాతిపెట్టి దానిపై పెద్ద బండరాయిని ఉంచితే దాన్ని 'మెన్‌హిర్' అంటారు. శవాన్ని మూత ఉన్న రాతి పెట్టెలో (గది) పెట్టి భూమి మీద ఉంచితే, దాన్ని 'డోల్మెన్' అంటారు. మట్టితో తయారుచేసిన పెట్టెలో శవాన్ని ఉంచితే 'సర్కోఫగి' అంటారు. గొర్రె ఆకారం సమాధిపెట్టె కర్నూలు జిల్లాలోని శంఖవరంలో, ఏనుగు ఆకారంలోని సమాధిపెట్టె నల్గొండ జిల్లాలోని ఏలేశ్వరంలో బయల్పడ్డాయి. సతీ సహగమనాన్ని సూచించే స్త్రీ, పురుష కళేబరాలున్న సమాధి ఏలేశ్వరంలో లభించింది. రాతియుగం నాటి చిత్రాలంకృత మృణ్మయ పాత్రలు కర్నూలు జిల్లాలోని పాతపాడులో దొరికాయి. నవీన శిలాయుగంలో వాడిన రాతి గొడ్డలి నెల్లూరు జిల్లాలోని కామకూరులో లభించింది. ఆదిమానవుడి 10 రాతి చిత్రకళా స్థావరాలు కడప జిల్లాలోని చింతకుంట గ్రామంలో బయల్పడ్డాయి. లోహయుగంలో వాడిన రాగి పనిముట్లు కృష్ణా జిల్లాలోని కీసరపల్లిలో బయల్పడ్డాయి.
 

వైదిక సంస్కృతి విస్తరణ
 ఆర్యులు ఉత్తర భారతదేశంలో అభివృద్ధి చేసిన సంస్కృతిని వైదిక సంస్కృతి అంటారు. స్థానికులైన దాసి దాస్యుల నుంచి వ్యవసాయం సహా వృత్తిపరమైన, సామాజిక విభజన, పురోహిత వ్యవస్థ, పూజా విధానం లాంటివి గ్రహించి ఆర్యులు నూతన సంస్కృతిని స్థాపించారు. రుగ్వేద ఆర్యులకు దక్షిణాపథం గురించి తెలియదు. హ్మణాల కాలం నుంచి దక్షిణ ప్రాంతంపై దృష్టి సారించారు. క్రీ. పూ. 800 సంవత్సరాలనాటి ఐతరేయ బ్రాహ్మణంలో విదర్భ రాజ్యాన్ని, దాని రాజు భీముడి గురుంచి పేర్కొన్నారు. మహాభారతంలో అగస్త్యుడి కథ ఉంది. ఆర్య సంస్కృతిని దక్షిణాదికి విస్తరింప చేసింది అగస్త్యుడే అని కథనం. తమిళభాషలోని తొలి వ్యాకరణ గ్రంథం 'అగత్తీయం' అతడు రచించిందే. స్థానిక సంస్థల మనుగడ కోసం అపస్తంభుడు అనే రుషి స్థానిక మతాచారాలను అధర్వణ వేదంలో చేర్చి వాటికి ఉన్నత స్థానాన్ని కల్పించాడు. కాత్యాయనుడు, కౌటిల్యుడు కూడా దక్షిణ ప్రాంతానికి చెందినవారనే సంప్రదాయం ఉంది. గౌతమబుద్ధుడు స్వయంగా ధాన్యకటకం దగ్గర 'కాలచక్ర తంత్రం' బోధించి ధారణులను నిక్షేపితం చేశాడు కాబట్టి దానికి 'ధరణికోట' అనే పేరు వచ్చిందని కథనం ఉంది. మహాపద్మనందుడు కళింగను జయించి జైన ప్రతిమలను తీసుకెళ్లినట్లు ఖారవేలుని 'హతిగుంఫా' శాసనం తెలుపుతోంది. అస్మక రాజ్యాన్ని ఆక్రమించినట్లు పురాణాలు వివరిస్తున్నాయి. మౌర్యుల కాలంలో ఆంధ్రులు వారి సామంతులుగా ఉన్నట్లు శాసన ఆధారం ద్వారా తెలుస్తోంది. మహిష మండలానికి (దక్షిణ ప్రాంతం) అశోకుడు మహాదేవ భిక్షువును పంపాడు. అనురాధాపురం (శ్రీలంక)లోని స్తూప ఆవిష్కరణకు పల్లవ బొగ్గ నుంచి అనేక మంది మహాదేవభిక్షు నాయకత్వంలో వెళ్లినట్లు సింహళ గ్రంథం 'మహావంశం' తెలియజేస్తుంది.

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌