• facebook
  • whatsapp
  • telegram

శాతవాహనులు

శాతవాహన వంశం శ్రీముఖుడితో ఆరంభమై చివరి శాతవాహన రాజు మూడో పులోమావితో అంతరించింది. శాతవాహనులు ఆంధ్రులే అనడానికి ఆధారాలు, వాటిని సమర్థిస్తూ లభించిన స్తూపాలు, శాసనాలు, నాణేలు; గ్రంథాలు; రచయితలు, చరిత్రకారుల అభిప్రాయాలు... ఇంకా శాతవాహన కాలంలో రాజకీయ, సామాజిక, ఆర్థిక, మత పరిస్థితులు; విద్యా, వాస్తు, కళారంగాల అభివృద్ధి... ఇలా మరెన్నో ఆసక్తికర అంశాల సమాహారమే ఈ 'శాతవాహనులు' పాఠం. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్ర శాతవాహనులతో ప్రారంభమవుతుంది. వీరు బ్రాహ్మణులైనప్పటికీ రాజకీయంగా సమర్థవంతమైన పాలనను అందించడమే కాకుండా ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా ఆంధ్రదేశ ఔన్నత్యానికి ఎంతో కృషి చేశారు.
ఆధారాలు: శాతవాహనుల చరిత్రను పునఃనిర్మించడానికి ఉన్న ఆధారాలను రెండు రకాలుగా పేర్కొనవచ్చు. అవి: 1) పురావస్తు ఆధారాలు 2) వాఞ్మయ లేదా లిఖిత ఆధారాలు. పురావస్తు ఆధారాల్లో శాసనాలు, నాణేలు, కట్టడాలు, మృణ్మయ పాత్రలు లాంటివి ఉన్నాయి. లిఖిత ఆధారాల్లో దేశీయ, విదేశీ రచనలు ఉన్నాయి.

పురావస్తు ఆధారాలు
అనేక శాసనాలు శాతవాహనుల రాజకీయ, సాంస్కృతిక చరిత్రను వివరిస్తున్నాయి. దేవి నాగానిక వేయించిన నానాఘాట్ శాసనం ఆమె భర్త మొదటి శాతకర్ణి విజయాలను వివరిస్తుంది. గౌతమీ బాలశ్రీ వేయించిన నాసిక్ శాసనం గౌతమీపుత్ర శాతకర్ణి విజయాలను, వివిధ బిరుదులను తెలుపుతుంది. గౌతమీపుత్ర శాతకర్ణి వేయించిన కార్లే శాసనం, వాశిష్ఠీపుత్ర పులోమావి/ రెండో పులోమావి వేయించిన అమరావతి శాసనం, యజ్ఞశ్రీ శాతకర్ణి వేయించిన చినగంజాం శాసనం, మూడో పులోమావి కాలంలో వేసిన మ్యాకదోని శాసనాలు శాతవాహనుల చరిత్రను వివరిస్తున్నాయి. ఇవే కాకుండా వారి సమకాలీన పాలకుల శాసనాల్లో కూడా అనేక ఆధారాలు లభిస్తున్నాయి. అశోకుడి 13వ శిలాశాసనం, ఎర్రగుడి శాసనాలు, ఖారవేలుడి హతిగుంఫా శాసనం, చస్తనుడి అంథే శాసనం, రుద్రదాముని జునాగఢ్ శాసనాల్లో కూడా అనేక ఆధారాలు లభిస్తున్నాయి.
శాతవాహనుల కాలంలో సీసం-రాగితో తయారుచేసిన ఫోటేన్ నాణేలతోపాటు అనేక రోమన్ నాణేలు, జోగల్ తంబి నాణేలు నాటి ఆర్థిక, మత పరిస్థితులను వివరిస్తున్నాయి. శాద్వాహణ శ్రీముఖ పేరుతో ఉన్న నాణేలు కరీంనగర్ జిల్లాలోని కోటిలింగాల, మునులగుట్ట ప్రదేశాల్లో లభించాయి. నహపాణుడిని ఓడించి గౌతమీపుత్ర శాతకర్ణి పునర్ముద్రించిన జోగల్ తంబి నాణేలు మహారాష్ట్ర ప్రాంతంలో లభించాయి. రెండో పులోమావి వేయించిన ఓడ బొమ్మ నాణేలు, యజ్ఞశ్రీ శాతకర్ణి వేయించిన తెరచాప ఓడ బొమ్మ నాణేలు నాటి నౌకా వాణిజ్య అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధిని తెలియజేస్తున్నాయి. శాతవాహనుల కాలంనాటి ప్రధాన బంగారు నాణెం సువర్ణం కాగా నాటి వెండి నాణెం కర్షాపణం.

 నాడు ఒక సువర్ణం 35 కర్షాపణాలతో సమానమని తెలుస్తోంది. శాతవాహన రాజు అపీలకుని నాణెం చత్తీస్‌గఢ్ ప్రాంతంలో లభించింది. నాటి కట్టడాల్లో ముఖ్యమైన అమరావతి, భట్టిప్రోలు, జగ్గయ్యపేట, శాలిహుండం లాంటి స్తూప, చైత్య విహారాలు శాతవాహన కాలం నాటి వాస్తు, కళారంగాల అభివృద్ధిని తెలియజేస్తున్నాయి. కోటిలింగాల ప్రాంతంలో బట్టి ఇటుకలతో నిర్మించిన బావులు బయల్పడినవి.
 

లిఖిత/ వాఞ్మయ/ సాహిత్య ఆధారాలు
* శాతవాహనుల చరిత్రను తెలియజేస్తూ అనేక రచనలు వెలువడ్డాయి. పురాణాలు, జైన, బౌద్ధ సాహిత్యం, విదేశీయుల రచనలు అనేకం శాతవాహనుల గురించి వివరిస్తున్నాయి. మత్స్యపురాణం 30 మంది శాతవాహన చక్రవర్తులు 400 సంవత్సరాలు ఆంధ్ర దేశాన్ని పాలించారని వివరిస్తుంది. ప్రాకృత భాషలో హాలుడు రచించిన గాథాసప్తశతి, గుణాఢ్యుడు రచించిన బృహత్ కథ, శాతవాహన కాలంనాటి ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక, మత పరిస్థితులను వివరిస్తున్నాయి.  

* శాతవాహనుల సాంఘిక, మత పరిస్థితులు తెలుసుకోవడానికి ఉన్న ప్రధాన ఆధారం గాథాసప్తశతి, శర్వవర్మ సంస్కృత భాషలో రచించిన కాతంత్ర వ్యాకరణం, కుతూహలుడి రచన - లీలావతి పరిణయం, సోమదేవసూరి రచించిన కథా సరిత్సాగరం నాటి ప్రధాన సాహిత్య ఆధారాలు. ఇవే కాకుండా విదేశీయులు, గ్రీకు నావికులు, రచయితలు రచించిన గ్రంథాలు కూడా ఎంతో విలువైన సమాచారాన్ని అందిస్తున్నాయి. ప్లినీ రచించిన నేచురల్ హిస్టరీ, టాలమీ గ్రంథం జాగ్రఫీ, పేరు తెలియని గ్రీకు నావికుడు రాసిన పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ గ్రంథాలు కూడా ఎంతో సమాచారాన్ని ఇస్తున్నాయి. 
 

శాతవాహనుల జన్మస్థలం, రాజధానులపై ఉన్న భిన్నాభిప్రాయాలు
శాతవాహనుల జన్మస్థలం, రాజధానులపై చరిత్రకారుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. శాసన, సాహిత్య ఆధారాలను అనుసరించి శాతవాహనులు ఆంధ్రులని అనేకమంది చరిత్రకారులు చెప్పారు. ముఖ్యంగా స్మిత్, రాప్సన్; భండార్కర్, గుత్తి వెంకటరావు, నేలటూరి వెంకట రామయ్య, మల్లంపల్లి సోమశేఖర శర్మ... వీరంతా శాతవాహనులు ఆంధ్రులు అనే అభిప్రాయాన్ని వెల్లడించారు. 'శాతవాహనులు ఆంధ్రులకు భృత్యులు' అని భండార్కర్ పేర్కొన్నాడు. కానీ, శ్రీనివాస అయ్యంగార్, పుసాల్కర్ లాంటి చరిత్రకారులు శాతవాహనులు మహారాష్ట్రులు అని పేర్కొన్నారు. సుక్తాంకర్ లాంటి చరిత్రకారులు మాత్రం శాతవాహనులను కన్నడిగులు అన్నారు. వి.వి.మిరాసి అనే చరిత్రకారుడు శాతవాహనుల జన్మస్థలం విదర్భ అని తెలిపాడు. అయితే పురావస్తు, సాహిత్య ఆధారాలను అనుసరించి చాలామంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం శాతవాహనులు ఆంధ్రులే. ఇక రాజధాని విషయంలో కూడా అనేక భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. బార్నెట్, బర్జెస్, స్మిత్ లాంటి చరిత్రకారులు శాతవాహనుల తొలి రాజధాని కృష్ణాజిల్లాలోని శ్రీకాకుళం అని పేర్కొన్నారు. ఆర్.జి.భండార్కర్ ధాన్యకటకాన్ని శాతవాహనుల రాజధాని అని వివరించాడు. రాయ్ చౌదరి ప్రకారం శాతవాహనుల రాజధాని విజయవాడ. కానీ జైన వాఞ్మయం ప్రకారం శాతవాహనుల తొలి రాజధాని ప్రతిష్ఠానపురం లేదా పైఠాన్. ఆధునిక చరిత్రకారులు కొందరు శాతవాహనుల తొలి రాజధాని కోటిలింగాల అని పేర్కొంటున్నారు. ఈ భిన్నాభిప్రాయాలను పరిశీలించిన తర్వాత అత్యధికులు శాతవాహనుల తొలి రాజధాని నేటి మహారాష్ట్రలోని పైఠాన్ లేదా ప్రతిష్ఠానపురం అని, మలి రాజధాని అమరావతి లేదా ధాన్యకటకం (గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్) అని అంగీకరిస్తున్నారు. శాతవాహనుల పరిపాలన ప్రారంభకాలం గురించి కూడా భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. బి.ఎస్.ఎల్.హనుమంతరావు శ్రీముఖుడి పాలన క్రీ.పూ.271లో ప్రారంభమైనట్లు పేర్కొనగా, బుహ్లర్, ఖండవల్లి లక్ష్మీరంజనం లాంటి చరిత్రకారులు క్రీ.శ.225లో ప్రారంభమైనట్లుగా పేర్కొన్నారు. 

రాజకీయ చరిత్ర
శాతవాహనులు బ్రాహ్మణ కులానికి చెందినవారు. వైదిక మతస్తులు. ఆంధ్ర అనేది జాతి శబ్దం కాగా, శాతవాహన అనేది వంశ నామం. శాతవాహనుల పాలన శ్రీముఖుడితో ప్రారంభం కాగా, చివరి శాతవాహన రాజు మూడో పులోమావితో వంశం అంతరించింది.
శ్రీముఖుడు 
శాతవాహన వంశ మూలపురుషుడు శ్రీముఖుడు. ఇతడిని బ్రహ్మాండ పురాణం సింద్రకుడు అని, విష్ణుపురాణం బలిపుచ్ఛక అని, మత్స్య పురాణం సిమకుడు అని, 'భాగవత పురాణం' బలి అని పేర్కొంటున్నాయి. ఇతడు క్రీ.పూ.271 నుంచి 248 వరకు పరిపాలించినట్లు బీఎస్ఎల్ హనుమంతరావు పేర్కొన్నారు. 23 సంవత్సరాలు పాలన చేశాడు. తన కుమారుడు మొదటి శాతకర్ణికి మహారథి త్రణకైరో కుమార్తె నాగానికతో వివాహం జరిపించాడు. 'శాద్వాహణ' పేరుతో ముద్రించిన నాణేలు కరీంనగర్ జిల్లాలోని కోటిలింగాల, మెదక్ జిల్లాలోని కొండాపూర్ ప్రాంతాల్లో లభించాయి. శ్రీముఖుడు తొలుత జైనమతాభిమాని. కొరవి గోపరాజు రచించిన సింహాసన ద్వాత్రంశిక గ్రంథం శ్రీముఖుడు జైనుడని పేర్కొంది. శ్రీముఖుడి కాలంలో కుంద కుందాచార్యుడు/కొండ కుందాచార్యుడు దిగంబర జైనాన్ని ప్రచారం చేశాడు.

కృష్ణ (లేదా) కన్హ (248 - 230 BC)
శ్రీముఖుడి అనంతరం అతడి సోదరుడు కన్హ రాజ్యానికి వచ్చాడు. ఇతడు మౌర్య చక్రవర్తి అశోకుడికి సమకాలికుడు అని చరిత్రకారులు పేర్కొంటారు. కన్హ నాసిక్‌లో శ్రమణులకు గుహాలయాలు తవ్వించాడు. కన్హేరి గుహాలయాలు నిర్మించాడు. మాళ్వాను జయించిన తొలి శాతవాహన చక్రవర్తి ఇతడే.

మొదటి శాతకర్ణి
తొలి శాతవాహన చక్రవర్తుల్లో గొప్పవాడు మొదటి శాతకర్ణి. ఇతడి విజయాలను తెలుపుతూ ఇతడి భార్య దేవి నాగానిక నానాఘాట్ శాసనాన్ని వేయించింది. రెండు అశ్వమేధ యాగాలు, ఒక రాజసూయ యాగం చేసిన శాతవాహన రాజు ఇతడే. మొదటి శాతకర్ణికి దక్షిణాపథపతి, అప్రతిహతచక్ర బిరుదులున్నాయి. కళింగ పాలకుడు ఖారవేలుడు ఇతడిని ఓడించినట్లు హతిగుంఫా, గుంటుపల్లి శాసనాలు పేర్కొంటున్నాయి. మొదటి శాతకర్ణిని పుష్యమిత్ర శుంగునికి సమకాలీనుడిగా పేర్కొంటారు. శ్రీముఖుడు, మొదటి శాతకర్ణి నాణేలపై ఉజ్జయిని ముద్ర ఉంది. మొదటి శాతకర్ణి తర్వాత పూర్ణోత్సుంగుడు అనే రాజు పాలనకు వచ్చాడు.

 

రెండో శాతకర్ణి
ఆంధ్రదేశాన్ని అతి ఎక్కువకాలం అంటే 56 సంవత్సరాలు పాలించిన శాతవాహన చక్రవర్తి రెండో శాతకర్ణి. శక-శాతవాహన ఘర్షణలు ఇతడి కాలంలోనే ప్రారంభమయ్యాయి. ఇతడు మగధపై దండెత్తి సాంచీ స్తూప దక్షిణ ద్వారంపై శాసనం వేయించినట్లుగా యుగపురాణం పేర్కొంటుంది. ఇతడు పాటలీపుత్రాన్ని ఆక్రమించాడు.  విదిశ, కళింగలను ఓడించాడు. ఇతడి కాలంనాటి శక-శాతవాహన ఘర్షణల గురించి పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ గ్రంథం వివరిస్తుంది. భిల్సా శాసనంలో పేర్కొన్న శాతవాహనరాజు రెండో శాతకర్ణే. 

 

మొదటి పులోమావి
కణ్వ చక్రవర్తి సుశర్మను చంపి మగధను ఆక్రమించిన శాతావాహన రాజు మొదటి పులోమావి. (కానీ పురాణాల ప్రకారం శ్రీముఖుడే సుశర్మను చంపి మగధను ఆక్రమించాడు). మొదటి పులోమావినే కుంతల శాతకర్ణి అని కొందరు చరిత్రకారులు పేర్కొన్నారు. అయితే కుంతల శాతకర్ణి తర్వాత మొదటి పులోమావి పాలకుడయ్యాడని మరికొంతమంది చరిత్రకారుల అభిప్రాయం.

 

కుంతల శాతకర్ణి
కుంతల శాతకర్ణిని 13వ శాతవాహన చక్రవర్తిగా పేర్కొంటారు. ఇతడి ఆస్థానంలో గుణాఢ్యుడు, శర్వవర్మ అనే పండితులు ఉండేవారు. గుణాఢ్యుడు పైశాచి ప్రాకృత భాషలో బృహత్‌కథను రచించగా, శర్వవర్మ సంస్కృత భాషలో కాతంత్ర వ్యాకరణం అనే గ్రంథాన్ని రచించాడు. సంస్కృత భాషకు ప్రాధాన్యం ఇచ్చిన తొలి శాతవాహన చక్రవర్తి కుంతల శాతకర్ణి. ఇతడికి సంస్కృత భాష నేర్పడానికే శర్మవర్మ కాతంత్ర వ్యాకరణంను రచించాడు. కుంతల శాతకర్ణి కరిర్త అనే కామక్రీడ ద్వారా భార్య మరణానికి కారకుడయ్యాడని ఏటుకూరి బలరామమూర్తి పేర్కొన్నారు. క్రీ.పూ.58లో శకులను ఓడించి ఉజ్జయినిని జయించి విక్రమ శకం ప్రారంభించిన విక్రమాదిత్యుడే కుంతల శాతకర్ణి అని కాలకాచార్య కథానిక(జైన గ్రంథం) పేర్కొంటుంది.

 

హాలుడు
శాతవాహన 17వ చక్రవర్తి హాలుడు. ఇతడు ప్రాకృత భాషలో గాథాసప్తశతి (సట్టసి) అనే గ్రంథాన్ని రచించాడు. ఇతడికి కవివత్సలుడు అనే బిరుదు ఉంది. హాలుడి వివాహం సింహళ రాకుమారితో సప్తగోదావరి (ద్రాక్షారామం)లో జరిగినట్లు కుతూహలుడు రచించిన లీలావతి పరిణయం గ్రంథం వివరిస్తుంది. ఇతడు క్రీ.శ.7 నుంచి 12 వరకు (5 సంవత్సరాలు) పాలన చేశాడు. రాధను గురించి ప్రస్తావించిన తొలి వాజ్ఞ్మయం గాథాసప్తశతి.

 

గౌతమీపుత్ర శాతకర్ణి (క్రీ.శ.75 - 110)
శాతవాహన చక్రవర్తులందరిలోకి గొప్పవాడు గౌతమీపుత్ర శాతకర్ణి. ఇతడి విజయాలను వివరిస్తూ తల్లి గౌతమీ బాలశ్రీ నాసిక్ శాసనాలు వేయించింది. బాలశ్రీ నాసిక్ శాసనాన్ని తన మనుమడు వాసిష్ఠీపుత్ర పులోమావి 19వ పాలనా సంత్సరంలో వేయించింది. ఈ శాసనంలో గౌతమీపుత్ర శాతకర్ణిని ఆగమనిలయ, ఏకబ్రాహ్మణ, త్రిసముద్రతోయ పీతవాహన (త్రిసముద్రలోయ శాతవాహన), వర్ణాశ్రమ ధర్మోద్ధారక, క్షత్రియ దర్పమానమర్థన లాంటి బిరుదులతో ప్రస్తావించారు. క్షహరాట పాలకుడు (శకరాజు) నహపాణుడిని ఓడించి 'క్షహరాట వంశ నిరవశేషకర' బిరుదు పొందాడు. నహపాణుడి నాణేలను పునర్ముద్రించాడు. వాటినే జోగల్ తంబి నాణేలు అంటారు. నాసిక్ శాసనాన్ని శివస్వామి, మహాగుప్తులు రచించారు. గౌతమీపుత్ర శాతకర్ణికి బెనకటక స్వామి అనే బిరుదు కూడా ఉంది. ఇతడి కాలంలోనే రాజధానిని ప్రతిష్ఠానపురానికి మార్చారని తెలుస్తోంది. రుద్రదాముని చేతిలో గౌతమీపుత్ర శాతకర్ణి ఓడిపోయినట్లుగా జునాగఢ్ శాసనం పేర్కొంటుంది. తల్లి పేరును తన పేరు ముందు పెట్టుకున్న తొలి శాతవాహన రాజు ఇతడే. ఇతడు 23వ శాతవాహన రాజు.

 

వాసిష్ఠీపుత్ర పులోమావి (రెండో పులోమావి)
గౌతమీపుత్ర శాతకర్ణి తర్వాత అతడి కుమారుడు రెండో పులోమావి 24వ శాతవాహన రాజుగా వచ్చాడు. నాసిక్ శాసనంలో ఇతడిని దక్షిణా పథేశ్వరుడుగా పేర్కొనడమైంది. నవనగర స్వామి అనే బిరుదు కూడా ఉంది. ఇతడు వేయించిన అమరావతి శాసనంలోనే తొలి తెలుగు పదం నాగబు ఉంది. ఓడ గుర్తు ఉన్న నాణేలను ముద్రించిన తొలి శాతవాహన రాజు కూడా ఇతడే. ఇతడి 19వ పాలనా సంవత్సంలోనే ఇతడి నానమ్మ గౌతమీ బాలాశ్రీ నాసిక్ శాసనాన్ని వేయించింది. ఈ శాసనాన్ని రచించినవారు శివస్వామి, మహాగుప్తులు. చస్తనుడు అనే పశ్చిమ క్షాత్రపురాజు (శకరాజు) రెండో పులోమావిని ఓడించి కథియవాడ్ ప్రాంతాన్ని ఆక్రమించినట్లు అంధే శాసనం తెలియజేస్తుంది.

 

యజ్ఞశ్రీ శాతకర్ణి
చివరి గొప్ప శాతవాహన రాజు యజ్ఞశ్రీ శాతకర్ణి. ఇతడి ఆస్థానంలోనే ఆచార్య నాగార్జునుడు ఉండేవాడు. నాగార్జున కొండ లేదా శ్రీపర్వతం వద్ద ఆచార్య నాగార్జునుడి కోసం పారావతి విహారంను నిర్మించాడు. బాణుడు తన హర్ష చరిత్రలో యజ్ఞశ్రీ శాతకర్ణిని 'త్రిసముద్రాధీశ్వరుడు' అనే బిరుదుతో ప్రస్తావించాడు. సంగం సాహిత్యంలో యజ్ఞశ్రీని పోసోండ సత్తాన్‌గా వ్యవహరించారు. ఆచార్య నాగార్జునుడు ధాన్యకటక మహాస్తూపానికి శిలాప్రాకారం నిర్మించాడు. యజ్ఞశ్రీ శాతకర్ణి అమరావతి స్తూపాన్ని నిర్మించి చలువరాయితో బుద్ధుడి విగ్రహాన్ని రూపొందింపజేశాడు. (వాస్తవానికి అమరావతి స్తూపానికి పునాది వేసింది నాగాశోకుడనే యక్షుడు). యజ్ఞశ్రీ శాతకర్ణి వేయించిన చినగంజాం శాసనంలో మోటుపల్లిరేవు ప్రస్తావన ఉంది. జునాగఢ్ శాసనం ప్రకారం రుద్రదాముడితో యుద్ధం చేసింది గౌతమీపుత్ర శాతకర్ణి కాగా, పురాణాల ప్రకారం యజ్ఞశ్రీ శాతకర్ణి రుద్రదాముడితో యుద్ధం చేసినట్లు తెలుస్తోంది. రుద్రదమనికను శివశ్రీ శాతకర్ణి వివాహం చేసుకున్నాడు. (శివశ్రీనే వాసిష్టీపుత్ర శాతకర్ణి అని, అతడు యజ్ఞశ్రీ కంటే ముందు శాతవాహన రాజ్యాన్ని పాలించాడని బి.ఎస్.ఎల్. హనుమంతరావు పేర్కొన్నారు). ఆచార్య నాగార్జునుడు శాతవాహన యువరాజు చేతిలో హత్యకు గురైనట్లు సోమదేవుడి కథాసరిత్సాగరం గ్రంథం తెలియజేస్తోంది.

 

మూడో పులోమావి
చివరి శాతవాహన చక్రవర్తి మూడో పులోమావి లేదా శ్రీ పులోమావి. ఇతడి కాలంలోనే మ్యాకదోని శాసనం వేశారు. శ్రీ పులోమావి ఎనిమిదో పాలనా సంవత్సరంలో వేసిన ఈ శాసనం కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో లభించింది. దీని ప్రకారం శాతవాహన ఆహారం (రాష్ట్రం) పాలకుడు ఖండనాగుడు లేదా కుబేరనాగుడు వేపుర గ్రామ అధిపతి. వేపుర గ్రామంలోని కాంత తెగ అధిపతి/ గాహపతి సమ్హ. సమ్హ తన తెగ ప్రజల అభివృద్ధికి వేపుర గ్రామంలో చెరువు తవ్వించినట్లు ఈ శాసనం వివరిస్తుంది.

పాలనాంశాలు
శాతవాహనుల కాలంనాటి పాలనా విశేషాలను ఉన్నాఘర్ శాసనం వివరిస్తుంది. వీరు ఎక్కువగా మౌర్యుల పాలనా విధానాలనే అనుసరించారు. కౌటిల్యుని అర్థశాస్త్రం, మనుధర్మ శాస్త్రాల ఆధారంగా పాలన కొనసాగించారు. సప్తాంగ సిద్ధాంతాన్ని అనుసరించారు. పితృస్వామిక, వంశ పారంపర్య రాచరిక విధానాన్ని పాటించారు. శాతవాహనులు తమ రాజ్యాన్ని ఆహారాలు (రాష్ట్రాలు), విషయాలు (జిల్లాలు), గ్రామాలుగా విభజించారు. సామంతరాజ్యాలు కూడా వీరి ఆధీనంలో ఉండేవి. ఆహారానికి అధిపతి అమాత్యుడు. కేంద్రంలో రాజుకు పాలనలో సహాయపడటానికి మంత్రిమండలి, ఉద్యోగ బృందం ఉండేది. నాటి మంత్రిమండలిని రాజోద్యోగులు అనేవారు. ప్రత్యేక కార్యనిర్వహణ కోసం నియమితులైన మంత్రులను మహామాత్యులు అని, రాజు సమక్షంలో పనిచేస్తూ రాజుకు సలహాలిచ్చే మంత్రులను రాజామాత్యులు అని, అధికార, అనధికార రహస్యాలను కాపాడే మంత్రులను విశ్వాసామాత్యులని పిలిచేవారు. రాష్ట్రాలు/ ఆహారాల పాలకులను అమాత్యులు అనేవారు. వస్తురూపంలో వచ్చే ఆదాయాన్ని భద్రపరిచే అధికారిని భండాగారికుడు అని, ద్రవ్యరూపంలో వచ్చే ఆదాయాన్ని భద్రపరిచే అధికారిని హేరణికుడు అని పిలిచేవారు. వీరే కాకుండా ప్రభుత్వ రికార్డులను భద్రపరిచే కార్యాలయ ఉద్యోగులుగా నిబంధనకార అక్షపటలిక (శ్రవణామాత్యులు) అనే ఉద్యోగులు ఉండేవారు. నాటి సామంత రాజ్యాల పాలకుల గురించి కార్లే, కన్హేరి శాసనాలు వివరిస్తున్నాయి. సామంత రాజులను మహారథి, మహాభోజక లాంటి బిరుదులతో ప్రస్తావించారు. విషయం (జిల్లా) అధిపతిని విషయపతి అని, గ్రామ అధిపతిని గ్రామిఖ/ గ్రామణి అని పిలిచేవారు. నగర పాలనకు నిగమసభలు ఉండేవి.
ఈ నిగమసభలు ప్రముఖ వర్తక కేంద్రాలుగా పనిచేసేవి. నిగమ సభ సభ్యులైన పెద్దలను గాహపతులు అనేవారు. గ్రామాల్లో మత వ్యవహారాలు చూసే అధికారిని మహా ఆర్యక అని పిలిచేవారు. సామంత రాజ్యాల్లో శాంతి భద్రతలు కాపాడే వ్యక్తిని మహాతలవరి అనేవారు. ఆహార పాలకులైన అమాత్యులకు వంశపారంపర్య హక్కులు లేవు. వారు బదిలీ అయ్యేవారు. మ్యాకదోని శాసనంలో పేర్కొన్న గౌల్మిక అనే పదం నాటి భూస్వాములు, సామంత రాజ్య పాలనాధికారులను సూచిస్తుంది.

 

సైనిక పాలన
శాతవాహనుల సైనిక పాలన గురించి హతిగుంఫా శాసనం, అమరావతి శిల్ప ఫలకాలు, విదేశీ, దేశీయ సాహిత్యాలు వివరిస్తున్నాయి. హతిగుంఫా శాసనం నాటి చతురంగ బలగాల గురించి పేర్కొంటుంది. నాటి యుద్ధ వ్యూహ రచనను అమరావతి శిల్ప ఫలకం వివరిస్తుంది. యుద్ధసమయంలో పదాతిదళానికి పార్శ్వ భాగంలో అశ్వ, గజ దళాలు; పృష్ట భాగంలో ధనుష్క దళం ఉండేవని తెలుస్తోంది. నాటి తాత్కాలిక సైనిక శిబిరాల (camps) ను స్కంధావరాలు అని, సైన్యాగారాల (కంటోన్మెంట్ల)ను కటకాలు అని పిలిచేవారు. ఖారవేలుడు శాతవాహన రాజ్యంపై దండెత్తి వచ్చి పిథుండ నగరాన్ని ధ్వంసం చేసినట్లు హతిగుంఫా శాసనం వివరిస్తుంది.

 

ఆర్థిక పరిస్థితులు
శాతవాహనులు వ్యవసాయ, వాణిజ్య పరిశ్రమల రంగాలను సమపాళ్లలో వృద్ధి చేయడం ద్వారా రాజ్య ఆర్థిక సౌష్ఠవాన్ని పెంపొందించారు. నాటి ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. రాజ్యానికి ప్రధాన ఆదాయం భూమి శిస్తు. పంటలో 1/6వ వంతు భూమి శిస్తు (భాగ)గా వసూలు చేసేవారు. కారుకర అనే వృత్తి పన్నును వసూలు చేసేవారు. రాజు సొంత భూమిని రాజ కంఖేట అనేవారు. ప్రజలు రాజుకు చెల్లించే శిస్తును దేవమేయ/ రాజమేయ/ దాయమేయ అనేవారు (భూమిశిస్తు - భాగ, రాజు సొంత భూమి వాడుకున్నందుకు చెల్లించే శిస్తు - దేవమేయ). పంటలు పండే పొలాలను సీతాక్షేత్రాలు అని వాటి అధిపతిని సీతాధ్యక్షుడు అని పిలిచేవారు. మొదటి శాతకర్ణి అధికంగా పశువులను దానం చేశాడు. వ్యవసాయ అభివృద్ధికి, నీటి పారుదల సౌకర్యాల కల్పనకు కృషి చేశాడు. శాతవాహనుల కాలంలో వాణిజ్యం ఎంతో అభివృద్ధి చెందింది. దేశీయంగా అనేక రవాణా సౌకర్యాలను అభివృద్ధి చేశారు. మచిలీపట్నం, వినుకొండ - హైదరాబాద్ రహదారుల గురించి ప్లీట్ పండితుడు పేర్కొన్నాడు. తూర్పు తీరంలో మైసోలియా (మచిలీపట్నం), ఘంటశాల లాంటి రేవులు, పశ్చిమ తీరంలో సోపార, కళ్యాణి, బరుకచ్ఛ లాంటి ఓడ రేవులు విదేశీ వాణిజ్యానికి తోడ్పడేవి. శాతవాహనులు రోమ్, వియత్నాం దేశాలతో విరివిగా విదేశీ వాణిజ్యం నిర్వహించేవారు. మద్రాస్ వద్ద ఉన్న అరికమేడు ప్రాంతంలో అనేక రోమన్ బంగారు నాణేలు లభించాయి. కరీంనగర్ జిల్లాలోని పెద్దబంకూరు, దూళికట్ట, కడప జిల్లాలోని అత్తిరాల ప్రాంతాల్లో కూడా రోమన్ నాణేలు లభించాయి. నాటి సంచార వ్యాపారులను సార్థవాహులు అనేవారు. తూర్పు తీరంలోని కోడూరు, కోరంగి/ అల్లోసిగ్ని ఓడరేవులు కూడా ప్రధానమైనవే. నాటి శ్రేణులు బ్యాంకులుగా కూడా పనిచేసేవి. 12% వడ్డీ చెల్లించేవి. ఋషభదత్తుడు చెల్లించిన వడ్డీతో గోవర్థన ఆహారంలోని కోలిక శ్రేణి శ్రమణులకు వస్త్రదానం చేసేది. నాటి ప్రధాన రవాణా సాధనం ఎడ్లబండి. అల్లూరు శాసనం ప్రకారం అక్కడి బౌద్ధ సంఘం ఎడ్లబండ్లకు దానంగా స్వీకరించింది. ప్లినీ, టాలమీల రచనలతోపాటు నాటి శాతవాహనుల విదేశీ నౌకా వాణిజ్యం గురించి విపులంగా వివరించిన మరొక ప్రధాన గ్రంథం పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రయన్ సీ (ఎర్ర సముద్రపు డైరీ). 
శాతవాహనుల కాలంలో పరిశ్రమల అభివృద్ధి కూడా బాగా జరిగింది. లోహ, వస్త్ర, వజ్ర పరిశ్రమలతోపాటు అనేక చేతి వృత్తి పరిశ్రమలు కూడా వృద్ధి చెందాయి. నాటి కులారుల (కుమ్మరుల) పనితనం గురించి పేర్కొంటూ కళా దృష్టిలో శిల్పులకు ఏ మాత్రం తీసిపోరు' అని యజ్ధానీ పండితుడు పేర్కొన్నాడు. శాతవాహనుల కాలంలో గూడూరు సన్నని వస్త్రాలకు, వినుకొండ లోహ పరిశ్రమకు, పల్నాడు వజ్ర పరిశ్రమకు ఎంతో పేరుగాంచాయి. మచిలీపట్నం మజ్లిన్ వస్త్రాలకు పేరొందింది. శాతవాహనుల కాలంలో శుల్క, బలి, కర లాంటి ఇతర పన్నులు వసూలు చేసేవారు. యజ్ఞాల సమయంలో వసూలు చేసే పన్నును బలి, నీటి తీరువా పన్నును శుల్క, కూరగాయలు, పండ్ల తోటలపై విధించే పన్నును కర అని పిలిచేవారు.

 

సాంఘిక పరిస్థితులు
 శాతవాహనుల కాలంలో పితృస్వామిక, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండేది. సమాజంలో చాతుర్వర్ణ, కుల వ్యవస్థలు ఉండేవి. దక్షిణ భారత దేశంలో తొలిసారిగా వీరి కాలంలోనే వృత్తిని బట్టి కుల వ్యవస్థ ఆవిర్భవించింది. నాటి శాసనాల్లో, సాహిత్యంలో అనేక కులాలు, వృత్తుల గురించి ప్రస్తావనలు ఉన్నాయి.
 స్త్రీలు సతీసహగమనం, బాల్య వివాహలు, బహు భార్యత్వం, వేశ్యావృత్తి లాంటి సాంఘిక దురాచారాలను ఎదుర్కొనప్పటికి, గౌరవ స్థానం పొందిన సంఘటనలు ఉన్నాయి. నాగానిక, గౌతమీ బాలశ్రీ లాంటివారు పాలకులుగా పనిచేశారు. నాటి శాసన, సాహిత్య ఆధారాల్లో ఆరు రకాల స్త్రీ ధనం గురించి పేర్కొన్నారు. అమరావతి శిల్పం, గాథాసప్తశతి నాటి సాంఘిక వ్యవస్థను తెలుపుతున్నాయి. కులాలు మారకుండా సమయ ధర్మం పాటించేవారు. అనులోమ, విలోమ వివాహాలు అమల్లో ఉండేవి. అగ్రవర్ణం వరుడు నిమ్నవర్ణం వధువును వివాహం చేసుకుంటే దాన్ని అనులోమ వివాహం అని, అగ్రవర్ణ వధువు నిమ్నవర్ణ వరుడిని వివాహం చేసుకుంటే విలోమ వివాహం అని పేర్కొనేవారు. అనులోమ వివాహం చేసుకున్న దంపతులకు జన్మించినవారిని ఉగ్ర సంతానం అనేవారు. హాలుని గాథాసప్తశతిలో మాధవి, శ్రోత, ఆంగిక లాంటి రచయిత్రుల గురించి పేర్కొన్నారు. నాటి ప్రజలు బంగారు, వెండి ఆభరణాలు ధరించేవారు. నాట్యగత్తెలు అరదళం అనే మైపూతను వాడేవారు. రామిరెడ్డిపల్లి, గుమ్మడిదుర్రు, అమరావతి, నాగార్జున కొండ ప్రాంతాల్లో నాడు వాడిన హారాలు, ఆభరణాలు లభించాయి. అగస్త్యుడి ద్వారా ఆర్య సంస్కృతి దక్షిణానికి విస్తరించింది.

 

మత పరిస్థితులు
శాతవాహనుల కాలంలో వైదిక, జైన, బౌద్ధ మతాలను ఆదరించారు. తొలి శాతవాహనులు జైన మతాన్ని అవలంబించారు. శాతవాహనులది వైదిక మతం. నాడు రాజులు వైదిక మతాన్ని అవలంబిస్తే, రాణులు, వైశ్యులు, సామాన్య ప్రజలు బౌద్ధమతాన్ని ఆచరించారు. తొలి శాతవాహన చక్రవర్తి శ్రీముఖుడు జైనుడని కొరవి గోపరాజు రచన సింహాసన ద్వాత్రంశిక పేర్కొంటుంది. కొండ కుందాచార్యుడు అనే జైన పండితుడు అతడి కాలంలోనే నివసించాడు. కృష్ణ లేదా కన్హ నాసిక్‌లో శ్రమణులకు గుహాలయాలు తవ్వించాడు. కానీ మొదటి శాతకర్ణి అశ్వమేధ, రాజసూయ లాంటి వైదిక క్రతువులను నిర్వహించాడు. మహా ఆర్యకుడు అనే బౌద్ధ సన్యాసి ఇతడి ఆస్థానంలో ఉండేవాడు. రాజధానిలో జైనులకు చైత్యాలను నిర్మించాడు. రెండో శాతకర్ణి సాంచీ స్తూపానికి దక్షిణ తోరణం నిర్మించాడు. గౌతమీ బాలశ్రీ భద్రనీయ బౌద్ధ శాఖకు నాసిక్ గుహలను దానం చేసింది. యజ్ఞశ్రీ శాతకర్ణి ఆస్థానంలో ఆచార్య నాగార్జునుడు ఉండేవాడు. శాతవాహనులు అమరావతి, భట్టిప్రోలు, నాగార్జునకొండ, జగ్గయ్యపేట, గుడివాడ, శాలిహుండం మొదలైన చోట్ల స్తూప, చైత్య, విహారాలు నిర్మించారు. నాడు ధాన్యకటకాన్ని - పూర్వ శైలం, జగ్గయ్యపేట - ఉత్తర శైలం , నాగార్జున కొండ - అపరశైలం, గుంటుపల్లి - రాజగిరిక, గుడివాడను - సిద్దార్థిక అని పిలిచేవారు. ఆంధ్రప్రదేశ్‌లో అతి ప్రాచీన బౌద్ధ స్తూపం భట్టిప్రోలు (ప్రతీపాలపురం). శాతవాహనులు వేదశ్రీ, యజ్ఞశ్రీ లాంటి వైదిక నామాలను ఉపయోగించారు. గౌతమీపుత్ర శాతకర్ణి ఆగమనిలయ, ఏక బ్రాహ్మణ లాంటి బిరుదులు ధరించాడు. నానాఘాట్ శాసనంలో ఇంద్ర, వాసుదేవ, సూర్యచంద్ర, యమ, వరుణ, కుబేర లాంటి వైదిక దేవతల పేర్లున్నాయి. హాలుడి గాథాసప్తశతి శివస్తోత్రంతో ప్రారంభమవుతుంది. క్రీ.శ.మొదటి శతాబ్దంలోని లకులిశ శివాచార్యుడి (లకులీశుడు) పాశుపత శైవధర్మం ప్రచారం పొందింది. శాతవాహనుల కాలంలో పూజలందుకున్న గుడిమల్లం శివలింగం నేటి చిత్తూరు జిల్లాలో ఉంది. కానీ, నానాఘాట్ శాసనంలో శివుడి ప్రస్తావన లేదు. అశోకుడి మనుమడైన సంప్రతి వల్ల దక్షిణ దేశంలో జైనం ప్రచారమైంది. అమరావతి సమీపంలో వడ్డమాను కొండ వద్ద సంప్రతి విహారం ఏర్పడింది. కొండ కుందాచార్యుడు అనంతపురం జిల్లాలోని కొనగండ్ల వద్ద ఆశ్రమం (జైనం) నడిపి సమయసార అనే గ్రంథాన్ని రచించాడు.
 శాద్వాద తాంత్రిక సంప్రదాయం ప్రచారం చేసి శాద్వాద సింహ బిరుదు పొందాడు. పద్మనంద భట్టారకుడనే మరొక జైన మతాచార్యుడు నాడు జీవించాడు. కాలసూరి ప్రబంధం అనే గ్రంథం శాతవాహనుల కాలంనాటి జైనమతాన్ని గురించి వివరిస్తుంది. ఆచార్య నాగార్జునుడు మాధ్యమిక, శూన్యవాదాలను ప్రచారం చేశాడు (బౌద్ధ మతం). శంకరుడి మాయావాదానికి మార్గదర్శి ఆచార్య నాగార్జునుడే. ఈ విధంగా శాతవాహనుల కాలంలో జైన, బౌద్ధ, వైదిక మతాలను ఆదరించి, పరమత సహనాన్ని చూపారు.

 

విద్య, సారస్వతాల అభివృద్ధి
తవాహనుల అధికార భాష ప్రాకృతం. నాడు ప్రజలు మాట్లాడేది దేశీభాష. కుంతల శాతకర్ణి కాలం నుంచి సంస్కృత భాషకు ప్రాధాన్యం లభించింది. మత్స్యపురాణంను యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో రచించారని పారిట్జర్ అనే పండితుడి అభిప్రాయం. నాటి శాసనాలు ప్రాకృత భాషలో, బ్రాహ్మీలిపిలో ఉన్నాయి. శాతవాహనుల కాలాన్ని ప్రాకృత భాషకు స్వర్ణయుగంగా వర్ణించారు. రత్నావళి రాజపరికథ గ్రంథంలో శ్రేయోరాజ్య సిద్ధాంతాన్ని నాగార్జునుడు ప్రతిపాదించాడు. సుహృల్లేఖ గ్రంథాన్ని ప్రతి విద్యార్థి కంఠస్తం చేసేవాడని ఇత్సింగ్ అనే చైనా యాత్రికుడు పేర్కొన్నాడు. ఇండియన్ ఐన్‌స్టీన్‌గా, భారతీయ తర్కశాస్త్రానికి పితామహుడిగా నాగార్జునుడు పేరుగాంచాడు. వాత్సాయన కామసూత్రాలు శాతవాహనుల కాలంలోనే రాశారని చరిత్రకారుల అభిప్రాయం. ఇంకా నాటి గ్రంథాల్లో సోమదేవుడి కథాసరిత్సాగరం, బుద్ధస్వామి బృహత్ కథాశ్లోక సంగ్రహ, ప్రవరసేనుడి సేతుబంధం, జయవల్లభుడి వెజ్జలగ్గ లాంటివి ఉన్నాయి. ఆచార్య నాగార్జునుడు వేదలి అనే గ్రామానికి చెందినవాడని లంకావతార సూత్ర గ్రంథం తెలుపుతోంది. సోమదేవుడి కథాసరిత్సాగరం గ్రంథం ఆచార్య నాగార్జునుడు శాతవాహన యువరాజు చేతిలో మరణించినట్లు వివరిస్తోంది.

వాస్తు, కళారంగాల అభివృద్ధి
శాతవాహనుల కాలంలో వాస్తుశిల్పం, చిత్రలేఖనం లాంటి కళారంగాలు ఎంతో అభివృద్ధి చెందాయి. అనేక స్తూప, చైత్య, విహారాలు, గుహాలయాలు నిర్మితమయ్యాయి. బుద్ధుడి శారీరక అవశేషాలపై నిర్మించిన పొడవాటి స్తంభాన్ని స్తూపం అంటారు. స్తూపాలు మూడు రకాలు. అవి (1) ధాతుగర్భాలు (2) ఉద్దేశిక స్తూపాలు (3) పారిభోజకాలు. బుద్ధుడి శారీరక అవశేషాలపై నిర్మించిన వాటిని ధాతుగర్భాలు అంటారు. భట్టిప్రోలు, అమరావతి, జగ్గయ్యపేట, ఘంటశాల, శాలిహుండం లాంటివి ధాతుగర్భాలు. బుద్ధుడు ఉపయోగించిన వస్తువులపై నిర్మించిన వాటిని పారిభోజకాలు అంటారు. ధాతువులు/ వస్తువులు లేకుండా నిర్మించేవి ఉద్దేశిక స్తూపాలు. లింగాలమెట్టు (విశాఖ జిల్లా), గుంటుపల్లి (పశ్చిమ గోదావరి జిల్లా) ఉద్దేశిక స్తూపాలకు ఉదాహరణ. అమరావతి స్తూపంపై బుద్ధుడి జీవితానికి చెందిన పంచ కళ్యాణాలను (జననం, మహాభినిష్క్రమణం, సంబోధి, ధర్మచక్ర పరివర్తన, మహాపరి నిర్యాణం) చిత్రించారు. 
బుద్ధుడి ప్రతిమలను ఉంచి పూజించే గృహాన్ని చైత్యం అంటారు. ఆంధ్రప్రదేశ్‌లో అతి ప్రాచీన చైత్యం గుంటుపల్లి. బౌద్ధ భిక్షువుల విశ్రాంతి గృహాలను విహారాలు అంటారు. స్తూపం, చైత్యం, విహారం ఒకేచోట ఉంటే దాన్ని ఆరామం అంటారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రసిద్ధ బౌద్ధారామం నాగార్జున కొండ. అక్కడ ఒక స్తూపం, రెండు చైత్యాలు, మూడు విహారాలు ఉన్నాయి. విశాఖపట్నం జిల్లా శంకరంలో బౌద్ధ గుహాలయాలున్నాయి. ఆంధ్రదేశంలో 40 సంఘారామాలు ఉన్నాయని హుయాన్‌త్సాంగ్ (Huyantsang) పేర్కొన్నాడు. యజ్ఞశ్రీ శాతకర్ణి నాగార్జునకొండపై తొలిపించిన ఏడు అంతస్తుల విహారంలో 1500 గదులున్నాయని పాహియాన్ పేర్కొన్నాడు. అజంతా గుహల్లోని 9, 10, 12, 13 గుహలు వీరి కాలానికి చెందినవి. 8, 12, 13 గుహలు విహారాలు కాగా, 9, 10 గుహ చిత్రాలు. శాతవాహనుల కాలంనాటి అమరావతి శిల్పాలపై పెర్గుసన్ అనే చరిత్రకారుడు పరిశోధనలు చేశాడు. 1797లో కల్నల్ మెకంజీ అనే ఆంగ్లేయుడు అమరావతి స్తూపాన్ని కనుక్కున్నాడు. ధాన్యకటకం తూర్పున వజ్రపాణి ఆలయం ఉందని హుయాన్‌త్సాంగ్ పేర్కొన్నాడు. అజంతా 10వ గుహలో ఉన్న శ్వేత గజ జాతక చిత్రం శాతవాహనుల కాలానిదే. అమరావతి శిల్పంలోనే నలగిరి ఏనుగును బుద్ధుడు శాంతింపజేస్తున్న దృశ్యం కనిపిస్తుంది. అమరావతి శిల్పం నగర జీవనాన్ని వివరించగా సాంచి, బార్పూత్ శిల్పాలు గ్రామీణ జీవనవిధాన్ని వివరిస్తున్నాయి. స్త్రీ, పురుషులిద్దరూ జంటలుగా నాట్యం చేస్తున్న 12 దృశ్యాలు కార్లే గుహల్లో ఉన్నాయి. మెదక్ జిల్లాలోని కొండాపూర్‌లో శాతవాహనుల కాలంనాటి టంకశాల బయల్పడింది. బర్మాలోని ప్రోం స్తూప శిల్పాలు అమరావతి శైలిని పోలి ఉన్నాయి. జావాలోని బోరోబుదురు బౌద్ధ స్తూపం సంకరం/ లింగాలమెట్ట (విశాఖ జిల్లా) నమూనాలో నిర్మించారు. శాతవాహనుల అధికార చిహ్నం పంజా ఎత్తిన సింహం, సూర్యుడు.

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌