• facebook
  • whatsapp
  • telegram

తూర్పు చాళుక్యులు - పరిపాలనా విధానం

యుద్ధాలు చేసే సేనలకు జీతపు రాళ్లు!


ఆంధ్ర దేశంలో సుమారు అయిదు శతాబ్దాల పాటు సాగిన తూర్పు చాళుక్యుల పాలన అనేక చారిత్రక, సామాజిక మార్పులకు నాంది పలికింది. పాలకులు సనాతన ధర్మశాస్త్రాన్ని ఆచరించారు. బౌద్ధం ప్రభ తగ్గి హిందూ మతానికి ప్రాధాన్యం పెరిగింది. ఎన్నో బౌద్ధారామాలు శివాలయాలుగా మారాయి. రాజ్యాన్ని రాష్ట్రం, విషయం, గ్రామం లాంటి రాజకీయ విభాగాలుగా విభజించారు. సమాజంలో చాతుర్వర్ణ వ్యవస్థ స్థిరపడింది. వ్యవసాయం, వ్యాపారాలతో పాటు సంస్కృతి, సాహిత్యాలు వర్ధిల్లాయి. నిరంతర యుద్ధాలు, అంతర్గత కలహాలు ఉన్నప్పటికీ ఆర్థిక, రాజకీయ స్థిరత్వం నెలకొంది. వీరి కాలం నాటి ఆర్థిÄక పరిస్థితులు, పన్నుల వ్యవస్థ, సైనిక బలగాల కూర్పు, మత, సాంఘిక పరిస్థితులు, సాహిత్యం గురించి పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి.

పరిపాలన: రాజు సర్వాధికారి. రాజ్యాధికారం సాధారణంగా జ్యేష్ఠపుత్రుడికి వారసత్వంగా సంక్రమిస్తుంది. పరిపాలనలో రాజు, మంత్రి, రాజ్యం, దుర్గం, కోశం, సైన్యం, మిత్రులు అనేవి సప్తాంగాలు. పరిపాలన 18 కార్యాలయాల ద్వారా జరిగేది. వాటిని అష్టాదశ తీర్థాలు అంటారు. రాజు తర్వాత రాజ్యాధికారం యువరాజుది. ఇతన్ని ఉపరాజు అని కూడా అంటారు. పరిపాలనలో రాజుకి యువరాజు తోడ్పడేవాడు. ఒకవేళ రాజుకి కుమారులు లేకపోతే అతని సోదరుడు/ సోదరుడి కుమారుడిని యువరాజుగా నియమించేవారు.

రాజుకి మంత్రి, పురోహితుడు, సేనాధిపతి, కోశాధికారులు సలహాలిచ్చేవారు. ఈ ఉద్యోగాలను సాధారణంగా విశ్వాసపాత్రులు, శీలవంతులు, ధర్మనీతి శాస్త్రజ్ఞులైన బ్రాహ్మణులు వంశపారంపర్యంగా నిర్వహించేవారు. పరిపాలనా సౌలభ్యం కోసం రాజ్యాన్ని రాష్ట్రం, విషయాలు, కొట్టం (గ్రామం) లుగా విభజించారు. రాష్ట్రాన్ని కుమారామాత్యులు, విషయాలు విషయపతి, గ్రామాన్ని రట్టడి లాంటి అధికారులు పరిపాలించేవారు.

* చాళుక్యుల కాలం నాటి మంత్రిమండలిని తీర్థాలు అంటారు. తీర్థాల్లో ముఖ్యుడు-‘సమాహర్త’. రెండో అమ్మరాజు మాంగల్లు శాసనంలో అష్టాదశ తీర్థాల గురించి ఉంది. మచిలీపట్నం శాసనంలో ద్వాదశ స్థానాధిపతుల గురించి తెలుస్తుంది. నియోగాధికృత పదవి చాళుక్య రాజుల కాలంలో విశిష్టమైంది. నియోగ అంటే రాజోద్యోగి అని అర్థం. ‘పట్టువర్ధని’ వంశస్థులు తరతరాలుగా నియోగాధికృతులుగా పనిచేశారు.

* విషయాలను నాడులు అని కూడా అంటారు. వీటి అధిపతి నియోగ వల్లభుడు. వీరికాలంలో 30 నాడులు ఉన్నట్లు శాసనం ద్వారా తెలుస్తోంది.

ఉదా: పల్నాడు - మాచర్ల, గురజాల

    కమ్మనాడు - బాపట్ల, ఒంగోలు, నర్సరావుపేట

    పాకనాడు - నెల్లూరు

    వేంగినాడు - కృష్ణా, గోదావరి

గ్రామ పరిపాలన

గ్రామాలు స్వయం పోషకాలు. గ్రామాధికారిని గ్రామేయక, గ్రామణి, ఊర్గపుండ అనే పేర్లతో పిలిచేవారు. గ్రామాల్లో పన్ను వసూలు చేసేవారిని మన్నియులు అని పిలిచేవారు. గ్రామాల్లోని తగవులను ‘పంచవర’ అనే గ్రామసభల ద్వారా పరిష్కరించేవారు. గ్రామ పెద్దలు శాంతిభద్రతలు కాపాడేవారు. గ్రామసభలు కూడా ఉండేవి.

రెండో చాళుక్య భీముడి బందరు శాసనం ద్వారా గ్రామాల్లో 8 వారగోష్ఠి (సభా సమావేశాలు), వ్యక్తలు అని పిలుచుకున్న వారిని పంచవారలుగా నియమించేవారని తెలుస్తోంది. కుంగనూరు (పుంగనూరు)లో ‘అడవల్లం’ అనే వ్యక్తిని గ్రామకరణంగా గ్రామసభ నియమించినట్లు తెలుస్తుంది. ‘ప్రాడ్వివాక్కులు’ గ్రామాల మధ్య పొలిమేర వివాదాలను, నీటికాల్వల వివాదాలను పరిష్కరించేవారు. ‘గ్రామ తలారి’ గ్రామ రక్షణ బాధ్యతలు నిర్వహించేవారు. గ్రామంలో దొంగతనం జరిగితే దొంగను పట్టి సొమ్మును అసలు (పొగొట్టుకున్న) వారికి ఇవ్వాలి. దొంగను పట్టుకోకపోతే ఆ సొమ్ము విలువకు సమానంగా తలారి చెల్లించాలి.

ఆర్థిక పరిస్థితులు

ప్రధాన వృత్తి వ్యవసాయం. ఆహార, వాణిజ్య పంటలు పండించేవారు. ప్రధాన ఆదాయ వనరు భూమిశిస్తు. పంటలో ‘ఆరో వంతు’ పన్నుగా చెల్లించేవారు. దీన్ని ‘కోరు’ అనేవారు. రాజుకు చెల్లించే భూమి శిస్తును కోరుకు/అరిపన్ను/సిద్ధయం అని అంటారు. పన్నును ధన/ధాన్య రూపంలో చెల్లించేవారు. బ్రాహ్మణులకు అగ్రహారాలు ఇచ్చే సమయంలో కొన్నిరకాల పన్నులు తొలగించేవారు. సర్వకర పరిహారవు అంటే పన్నుల నుంచి మినహాయింపు పొందిన గ్రామాలు.

పన్నులు - రకాలు

అరిపన్ను - పంటల నూర్పిడి తర్వాత చెల్లించాల్సిన పన్ను

సిద్ధాయం -  పంటలు పండినా, పండకపోయినా చెల్లించే పన్ను

పుల్లరి పన్ను - పచ్చిక బీళ్లపై చెల్లించే పన్ను

సంధి విగ్రహ పన్ను - శత్రువుల దాడి నుంచి రాజ్యాన్ని కాపాడినందుకు విధించే పన్ను

పడివలె పన్ను - సైన్యం నిర్వహణ కోసం వసూలు చేసే పన్ను

దొగరాజు పన్ను - యువరాజు భృతిగా చెల్లించే పన్ను 

కొదేను పన్ను - గొడుగులు తయారుచేసేవారిపై విధించే పన్ను

ఇవేకాకుండా పడియేరి పన్ను, కల్లనక్కం, విషయ, సుంకం, బీరదాయం, చిట్టివాటం, తగ్గు లాంటి పన్నులు ఉన్నాయి. గ్రామాల నుంచి వచ్చే పన్నులే కాకుండా, వ్యాపారుల వద్ద నుంచి పెద్ద మొత్తంలో రహదారి సుంకాలను రాజు వసూలు చేసేవారు. వస్తుమార్పిడి విధానం తక్కువగా, ధన వినిమయం విరివిగా ఉండేది. రాజులు నాణేలు ముద్రించేవారు. ఈ కాలం నాటి వర్తక సంఘాలను ‘నకరాలు’ అని పిలిచేవారు. ఉదాహరణకు దేశ, విదేశీ పెనుగొండ నకరం, అయ్యవోలు వర్తక సంఘం, బలిజ సంఘం మొదలైనవి.

అయ్యవోలు వర్తక సంఘం - కన్నడ దేశానికి చెందింది. పెనుగొండ వర్తక సంఘానికి 18 స్థలాల్లో వ్యాపార కేంద్రాలుండేవి. సరకు రవాణా సమయంలో దొంగల నుంచి రక్షణకు వ్యాపార సంఘాలకు సొంత సైన్యం ఉండేది. నకరాల కార్యకలాపాలను సమయ కార్యం అనేవారు. త్రిపురాంతకంలోని ఒక శాసనంలో నకరంలోని అందరు సభ్యుల పేర్లు ఉన్నాయి. పరదేశీ వ్యాపారం జరిగేది. ఆనాటి ప్రధాన రేవు పట్టణాలు కళింగ పట్నం, కోరంగి, మచిలీపట్నం, విశాఖపట్నం, ఘంటసాల. ప్రధానంగా థాయిలాండ్, ఇండొనేసియా, మలేసియా, శ్రీలంకతో వ్యాపారం చేశారు.

చాళుక్య చంద్ర అనే పేరుతో ఉన్న శక్తివర్మ, రాజరాజ నరేంద్రుడి బంగారు నాణేలు బర్మాలోని అరకాను వద్ద లభ్యమయ్యాయి. వీరికాలం నాటి వాణిజ్య వివరాల గురించి ‘అహదనకర శాసనం’ తెలుపుతుంది.

పన్ను వసూలు అధికారులుసుంక పెర్గడీ - వ్యాపార పన్ను.

కొలగ్రాండ్రు - కొలతలు, తూకాలు నిర్వహించేవారు.

తీర్పరులు - వస్తువుల నాణ్యతను బట్టి వసూలు చేసేవారు.

వస్తువులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరవేసేవారు పెంకలు. వీరిపై వృత్తి పన్ను విధించేవారు. పశుపోషకులు కూడా పన్ను చెల్లించేవారు.

న్యాయవిచారణ శిక్షలు: సామాన్యమైన వివాదాలను గ్రామ సభలోనే పరిష్కరించేవారు. రాజు స్థానంలో ప్రాడ్వివాకులనే ప్రత్యేక న్యాయాధికారులు ఉండేవారు. గ్రామాల మధ్య వివాదాలు వచ్చినప్పుడు రాజులు వాటిని ప్రాడ్వివాకులు/మంత్రుల సాయంతో పరిష్కరించేవారు. ధర్మాసనాల ద్వారా పరీక్షించేవారు. ఈ ధర్మాసనాలు యాజ్ఞవల్క్య స్మృతి లాంటి ప్రాచీన గ్రంథాల్లోని సూత్రాలను అనుసరించేవి. ధర్మాసనాలు ఇచ్చిన తీర్పులను ‘జయపత్రాలు’ పేరుతో రాజముద్రికతో ఇచ్చేవారు. ఈ ముద్రలు వేయడానికి ‘ముద్రవర్తులు’ అనే ప్రత్యేక ఉద్యోగులుండేవారు.

సైనిక వ్యవస్థ

రథ, గజ, తురగ, పదాతి వంటి చతురంగ దళాలుండేవి. రథ బలానికి అధిక ప్రాధాన్యం ఉండేది. రాజ్యం పొలిమేరలోని దుర్గాలను రక్షించడానికి సేనాపతులు, పాలెగాండ్రు ఉండేవారు. వీరు నిర్ణీతమైన సైన్యాన్ని పోషిస్తూ అవసరమైనప్పుడు యుద్ధంలో పాల్గొనేవారు. వీరి సేనలకు రాజులు ‘జీతపు రాళ్లు’ ఇచ్చేవారు. యుద్ధం ప్రారంభించడానికి ముందు ‘ఎలగోలు’ సైన్యం పంపేవారు. సైన్యానికి ముందు, వెనక, పక్క భాగాల్లో సేనాపతులు ఉండేవారు. సాధ్యమైనంత వరకు ధర్మ యుద్ధం జరిగేది. చీకటి పడగానే ఉభయ సేనలు రణాన్ని ఆపేవి. సంధి చేసుకోవడానికి ‘కొమ్ము’ ఊదేవారు. దీన్ని ‘ధర్మధార’ అనేవారు. కత్తి వదిలేసి యుద్ధ భూమి నుంచి పారిపోయేవారిని చంపేవారు కాదు.

సాంఘిక పరిస్థితులు

వీరికాలం నాటికి వాటి సామాజిక పరిస్థితుల గురించి వివరించింది హుయాన్‌త్సాంగ్‌. వైదిక మతంలో వర్ణవ్యవస్థ ఉండేది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే నాలుగు వర్ణాలవారు ఉండేవారు.

* బ్రాహ్మణులు 3 వర్గాలుగా ఉండేవారు.

స్తోత్రీయ - మంత్రాలు ఉచ్చరించేవారు.

వైదిక - దేవాలయ నిర్వహణ చేసేవారు.

నియోగులు - రాజ్యపాలనలో రాజుకి సహకరించేవారు.


* క్షత్రియులు: 2 స్థానాలు గలవారు

సూర్య వంశ క్షత్రియలు - చోళులు, గజపతులు

చంద్రవంశ క్షత్రియలు - తూర్పుచాళుక్యలు, విజయనగర రాజులు

* వైశ్యులు 3 వర్గాలుగా ఉండేవారు.

* శూద్రులు సమాజంలో నాలుగో స్థానంలో ఉండేవారు. వీరిలో కొందరు వ్యవసాయం, మరికొందరు వృత్తిపనులు చేసేవారు. శాతవాహనుల కాలం నాటి వృత్తి సంఘాలే కాలక్రమంలో సంఘటితమై కుల నియమాలు ఏర్పరచుకున్నాయి. ఈ కుల నియమాలను ‘సమయ ధర్మ’ అనేవారు. ఈ ధర్మాన్ని అతిక్రమించిన వారిని కులపెద్దలు శిక్షించేవారు. ఈ శిక్షలకు అంగీకరించని వారిని వెలి వేసేవారు. గ్రామంలోని ప్రతి వ్యవహారానికి సంబంధించిన ఒప్పందాలు ఉండేవి.

మతం: ఈ కాలంలో అనేక మతాలు వర్ధిల్లాయి.

బౌద్ధమతం: శాతవాహనుల కాలం నుంచే ఈ మతం ఆదరణ కోల్పోయింది. చాళుక్యుల కాలంలో బౌద్ధారామాలు శైవాలయాలుగా మారాయి. ధాన్యకటకం అమరేశ్వర ఆలయంగా, చేబ్రోలులోని బౌద్ధ ఆరామం శివాలయంగా మారాయి. హుయాన్‌త్సాంగ్‌ కూడా అమరావతి, నాగార్జున కొండ బౌద్ధ క్షేత్రాలు క్షీణదశలో ఉన్నాయని పేర్కొన్నారు.

జైనమతం: ఈ మతానికి జనాదరణ ఉంది. కుబ్జ విష్ణువర్ధనుడి భార్య అయ్యణదేవి బెజవాడలో నెడుంబిబసదికి ముషిణికొండ గ్రామం దానం చేసింది. చాళుక్య విమలాదిత్యుడు జైనమతాన్ని ఆదరించాడు. విశాఖపట్నం వద్ద జైనబసది నిర్మించారు. తీరాంధ్రలో అనేక జైన విగ్రహాలున్నాయి. కడప జిల్లా జమ్మలమడుగు సమీపంలోని దానవులపాడు వద్ద జైన క్షేత్రం ఉంది. తెలంగాణలోనూ అనేక జైన క్షేత్రాలున్నాయి.

హిందూ మతం: పూజా విధానంలో పంచాయతన పద్ధతి ఉండేది. శివుడు, విష్ణువు, దేవి, గణపతి, ఆదిత్యుడు అనే ఐదుగురు దేవతలను పూజించేవారు. ఈ ఆరాధనలో భక్తి, జ్ఞాన, కర్మ మార్గాలకు సమాన ప్రతిపత్తి ఉండేది.

శైవం: వీరికాలంలో అనేక బౌద్ధ ఆరామాలు శైవక్షేత్రాలుగా మారాయి. శైవంలో పాశుపతం, కాలాముఖం, కాపాలిక అనే శాఖలుండేవి. శైవ శాఖలు అన్నింటికీ శ్రీశైలం ప్రధాన కేంద్రం. ప్రకాశం జిల్లాలోని భైరవకోన కాపాలికులకు ఒక కేంద్రం.

* శైవమత అభివృద్ధికి రాజులు భూములు, గ్రామాలు విరాళంగా ఇచ్చారు.


వైష్ణవం: వీరి కాలంలో అనేక వైష్ణవ ఆలయాలు నిర్మించారు. సర్పవరంలో భావనారాయణ స్వామి, పిఠాపురం కుంతీ మాధవస్వామి, శ్రీకాకుళం ఆంధ్రమహావిష్ణువు; ధర్మపురి, అహోబిలం, వేదాద్రి నరసింహస్వామి ఆలయాలను నిర్మించారు. వీరి కాలంలో గ్రామదేవతల వీర పూజ ఉండేది.

సాహిత్యం: తూర్పు చాళుక్యుల ప్రధాన భాష సంస్కృతం. నాటి విద్యాలయాల పేరు ఘటికలు. వాటి అధిపతుల్ని ఘటిక సామాన్యులు అనేవారు. వీటిలో వేద, వేదాంగాలతో పాటు ఆయుర్వేదం, ధనుర్వేదం, గాంధర్వవేదం, అర్థ, ధర్మ శాస్త్రాలు బోధించేవారు. కుల వృత్తుల శిక్షణా ఉండేది. మూడో విష్ణువర్ధనుడు స్వయంగా కవి. కామధేనువు, కవిగాయక కల్పతరువు అని బిరుదు పొందిన అమ్మరాజు ఆస్థాÄనంలో మాధవ భట్టు, పోతన భట్టు, భట్ట దేవుడు కవులు ఉండేవారు. భట్టదేవుడి బిరుదు కవి చక్రవర్తి. రాజరాజ నరేంద్రుడి ఆస్థానంలో ఆది కవి, వాగనుశాసనుడైన నన్నయ భట్టు, అష్టభాషాకవి శేఖరుడైన నారాయణభట్టు, పావులూరి మల్లన ఉండేవారు. నాడు తెలుగు సాహిత్యం కూడా అభివృద్ధి చెందింది. పావులూరి మల్లన గణితసార సంగ్రహం అనే గణిత గ్రంథం రాశారు.

రచయిత: గద్దె నరసింహారావు

Posted Date : 24-09-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌