• facebook
  • whatsapp
  • telegram

ప్రాథమిక హక్కులు

* రాజ్యం ద్వారా గుర్తింపు పొంది, చట్టబద్దత కలిగి, విశ్వజనీన స్వభావం ఉన్న సదుపాయాలను హక్కులు అంటారు.
* మానవుడు సంపూర్ణంగా అభివృద్ధి సాధించడానికి కావాల్సిన కనీస సదుపాయాలను ప్రాథమిక హక్కులు అని పేర్కొంటారు.
* ''భారత ప్రజాస్వామ్యానికి పునాదిరాళ్లు ప్రాథమిక హక్కులు" అని నానీఫాల్కీ వాలా పేర్కొన్నారు.
* ''ప్రభుత్వం యొక్క గొప్పదనం అది ప్రజలకు కల్పించే హక్కులపై ఆధారపడి ఉంటుంది" అని హెచ్.జె.లాస్కి పేర్కొన్నారు.
* హక్కులు అనేవి ప్రభుత్వ నిరపేక్ష అధికారాలపై పరిమితులను విధిస్తాయి. వ్యక్తి తన శక్తి, తెలివితేటల ఆధారంగా తన ఔన్నత్యానికి, సంపూర్ణ వికాసం పొందడానికి దోహదపడే పరిస్థితులనే హక్కులుగా చెప్పవచ్చు.
* ప్రాథమిక హక్కుల లక్ష్యం రక్షణ, పౌర సమానత్వం, న్యాయాన్ని అందరికీ సమాన పరిస్థితుల్లో కల్పించడానికి అవసరమైన భౌతిక, నైతిక స్వచ్ఛతను పెంపొందించడం.

హక్కుల చరిత్ర
మాగ్నాకార్టా (1215):  ఇంగ్లండ్ రాజు కింగ్ జాన్ ఎడ్వర్డ్ క్రీ.శ.1215లో ప్రజలకు మొదటిసారిగా కొన్ని హక్కులను గుర్తిస్తూ ఒక ప్రమాణ ప్రకటనను జారీచేశాడు. దీన్నే మాగ్నాకార్టా అంటారు. లాటిన్ భాషలో మాగ్నా అంటే పెద్దది. కార్టా అంటే ఒప్పందం అని అర్థం. ఈ ప్రకటనను హక్కులకు మూలంగా భావిస్తారు.
* మహావిప్లవం తర్వాత 1689లో బ్రిటిష్ పార్లమెంటు చేసిన హక్కుల ప్రకటన ప్రజల రాజకీయ హక్కులను, పౌరుల హక్కులను గుర్తించింది.

 

బిల్ ఆఫ్ రైట్స్: 1789
అమెరికా మౌలిక రాజ్యాంగంలో హక్కుల ప్రస్తావన లేదు. ఆ తర్వాత 10 రాజ్యాంగ సవరణలను ప్రతిపాదించి, అందులో భాగంగా బిల్ ఆఫ్ రైట్స్ పేరుతో ప్రాథమిక హక్కులను రాజ్యాంగంలో చేర్చారు. వీటిని అమెరికా రాజ్యాంగ సభ 1791, డిసెంబరు 15న ధ్రువీకరించింది. స్వేచ్ఛా, స్వాతంత్య్రాలతో జన్మించిన మానవులు జీవితాంతం వాటితోనే కొనసాగుతారని 1776 నాటి అమెరికా స్వాతంత్య్ర ప్రకటన సందర్భంగా, థామస్ జఫర్‌సన్ పేర్కొన్న అంశం ఆధారంగా దీన్ని చరిత్రలో మైలు రాయి (బిల్ ఆఫ్ రైట్స్)గా పేర్కొన్నారు. జేమ్స్ మాడిసన్ అమెరికా రాజ్యాంగ పితామహుడు. ఇతడే 'బిల్ ఆఫ్ రైట్స్' రూపకర్త.

ఫ్రెంచి హక్కుల ప్రకటన: 1789
1789లో ఫ్రెంచి జాతీయ సభ చేసిన మానవ హక్కుల ప్రకటన, తద్వారా ఇచ్చిన నినాదాలైన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే ఆదర్శాలు ప్రపంచ రాజ్యాంగాలన్నింటినీ ప్రభావితం చేశాయి.

 

రష్యా విప్లవం: 1917
రష్యాలో బోల్ష్‌విక్ విప్లవం తర్వాత కొత్త రాజ్యాంగంలో సామాజిక, రాజకీయ హక్కులను ప్రకటించారు. ఇవి అనేక రాజ్యాంగాలకు దిక్సూచిలా నిలిచాయి.

 

UNO విశ్వమానవ హక్కుల ప్రకటన: 1948
ఐక్యరాజ్యసమితి (UNO) 1948, డిసెంబరు 10న విశ్వమానవ హక్కుల ప్రకటనను జారీ చేసింది. దీని ప్రకారం ప్రపంచ పౌరులందరికీ గుర్తింపునిచ్చి, సమాన హక్కులు కలగజేయడం ద్వారా ప్రపంచంలో స్వేచ్ఛ, న్యాయం, శాంతి భావనలకు పునాది వేయవచ్చని పేర్కొంది. వ్యక్తులందరూ స్వేచ్ఛతో జన్మించారని, వారికి సమాన హక్కులు, గుర్తింపు ఉన్నాయని UNO ప్రకటన తెలియజేస్తుంది. ఈ హక్కుల్లో కేవలం పౌర, రాజకీయ హక్కులే కాకుండా ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కులతోపాటు పనిచేసే హక్కు, విద్యార్జన చేసే హక్కులు కూడా ఉన్నాయి.

 

ప్రాథమిక హక్కుల లక్షణాలు 
* ప్రాథమిక హక్కులు రాజ్యాంగ ఆమోదం పొందాయి.
* వీటిని ఏ పౌరుడూ వదులుకోవడానికి వీల్లేదు.
* ప్రాథమిక హక్కులకు న్యాయ సంరక్షణ ఉంది. వీటి రక్షణ కోసం ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టు, ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టులు రిట్లు జారీ చేస్తాయి.
* ప్రవేశికలో పేర్కొన్న స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం అనే ఆదర్శాలకు విస్తృత రూపమే ప్రాథమిక హక్కులు.
* కొన్ని ప్రాథమిక హక్కులు పౌరులతోపాటు విదేశీయులకు కూడా వర్తిస్తాయి.
* ప్రాథమిక హక్కులు ప్రభుత్వ నిరపేక్ష అధికారాలపై పరిమితులు విధిస్తాయి.
* ప్రాథమిక హక్కులను రాజ్యాంగ బద్ధంగా, వాటి స్ఫూర్తికి భంగం కలగని రీతిలో తగ్గించవచ్చు లేదా వాటిపై పరిమితులు విధించవచ్చు.
* ఈ హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు ఉంది.
* కొన్ని ప్రాథమిక హక్కులు సకారాత్మకమైనవి (Positive). ఇవి ప్రభుత్వ బాధ్యతలను తెలియజేస్తాయి.
ఉదా: ఆర్టికల్ 17 - అస్పృశ్యతా నిషేధం, ఆర్టికల్ 24 - బాలకార్మిక వ్యవస్థ నిషేధం.
* ప్రాథమిక హక్కులన్నీ స్వతహాగా అమల్లోకి వస్తాయి. కానీ ఆర్టికల్స్ 17, 23, 24లలో ప్రస్తావించిన అంశాలు స్వతహాగా అమల్లోకి రావు. వాటి అమలు కోసం పార్లమెంటు ప్రత్యేక చట్టాల చేయాల్సి ఉంటుంది.
» ప్రాథమిక హక్కుల్లో పేర్కొన్న నిషేధాలు, వివక్షలు ప్రభుత్వాలకు, పౌరులకు సమానంగా వర్తిస్తాయి.
ఉదా: కుల, మత, జాతి, లింగ, జన్మ సంబంధమైన వివక్షలను ఎవరూ పాటించరాదు.
* ప్రాథమిక హక్కులను అతిక్రమించడం నేరం.
* కొన్ని హక్కులను అల్పసంఖ్యాక వర్గాల ప్రయోజనాలను కాపాడి, జాతీయ సమగ్రతను నిలపడానికి ఉద్దేశించారు.
ఉదా: మతస్వేచ్ఛ హక్కు, విద్యా సాంస్కృతిక హక్కు.

* ఆర్టికల్ 352 ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితిని విధిస్తే ఆర్టికల్ 20, 21 మినహా ఇతర ప్రాథమిక హక్కులను రద్దు చేయవచ్చు.
* ''ప్రాథమిక హక్కులు ప్రభుత్వాలు రూపొందించే ఇతర సాధారణ చట్టాల కంటే సర్వోన్నతమైనవి. అవి ప్రభుత్వ అధికారానికి పరిమితులను విధించడంతోపాటు, శాసనసభల మెజార్టీ నియంతృత్వాన్ని అరికట్టి వ్యక్తికి రక్షణ కల్పిస్తాయి. ప్రాథమిక హక్కులనేవి ప్రజాస్వామ్యానికి రక్షక కవచం లాంటివి".  -  సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి - పతంజలిశాస్త్రి                                                                             

* ప్రాథమిక హక్కులన్నీ చట్టబద్ధమైన హక్కులే, కానీ చట్టబద్ధమైన హక్కులన్నీ ప్రాథమిక హక్కులు కావు.
 

మనదేశంలో ప్రాథమిక హక్కుల అభివృద్ధి క్రమం
* 1895లో బాల గంగాధర్ తిలక్ స్వరాజ్ అనే బిల్లును ప్రతిపాదించి భారతీయులకు వాక్ స్వాతంత్య్రాన్ని కల్పించాలని, ప్రజల ఇళ్లకూ, ఆస్తికి రక్షణ కల్పించి తీరాలని మొదటిసారిగా డిమాండ్ చేశారు.
* 1911లో కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో హక్కులపై తీర్మానాన్ని ఆమోదించారు.
* 1918లో బొంబాయిలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం బ్రిటిష్ పౌరులకు ఉన్నట్లే భారతీయ ప్రజలకూ హక్కులుండాలని కోరింది.
* 1922లో యంగ్ ఇండియా పత్రికలో ప్రజల హక్కుల గురించి గాంధీజీ ప్రస్తావించారు.
* 1925లో అనిబిసెంట్ కామన్వెల్త్ ఆఫ్ ఇండియా అనే బిల్లును ప్రతిపాదించి ఐరిష్ ప్రజలకు ప్రసాదించిన హక్కుల లాంటివే భారతీయులకు కూడా ఇవ్వాలని కోరారు.
* 1927లో మద్రాస్‌లో ఎం.ఎ. అన్సారీ అధ్యక్షతన జరిగిన 'భారత జాతీయ కాంగ్రెస్' సమావేశంలో ఒక తీర్మానం ఆమోదిస్తూ భవిష్యత్తులో భారతీయుల కోసం రూపొందించబోయే రాజ్యాంగానికి ప్రాథమిక హక్కులు ప్రాతిపదిక కావాలని పేర్కొన్నారు.
* 1928లో మోతీలాల్ నెహ్రూ కమిటీ తన నివేదికలో భారత్‌లో ప్రవేశపెట్టే చట్టాలన్నింటిలో కూడా ప్రాథమిక హక్కులను చేర్చాలని, అన్ని వర్గాల ప్రజల ప్రయోజనాలను సంరక్షించే విధంగా హక్కులు ఉండాలని పేర్కొంది.
* 1931లో కరాచీలో సర్ధార్ వల్లభాయ్ పటేల్ అధ్యక్షతన జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం భారతీయులకు ప్రాథమిక హక్కులు, ఆర్థిక విధానంపై తీర్మానాన్ని ఆమోదించింది.
* 1931లో లండన్‌లో జరిగిన రెండో రౌండ్‌టేబుల్ సమావేశంలో మహాత్మాగాంధీ ప్రాథమిక హక్కులను డిమాండ్ చేశారు. ఆనాటి బ్రిటన్ ప్రధాని రాంసే మెక్‌డొనాల్డ్ భారతీయులకు ప్రాథమిక హక్కులను కల్పించాల్సిన ఆవశ్యకతను గుర్తించినప్పటికీ, కొన్ని రాజకీయ కారణాల వల్ల ఇవ్వలేకపోయారు.
* 1945లో సర్ తేజ్ బహదూర్ సప్రూ నేతృత్వంలో ఏర్పడిన భారతీయ మేధావుల కమిటీ భవిష్యత్‌లో రూపొందించబోయే భారత రాజ్యాంగానికి ప్రాథమిక హక్కులను కావాలని పేర్కొంది.
* అల్పసంఖ్యాక వర్గాలకు తగిన విధంగా రక్షణలను, హామీలను రాజ్యాంగ చట్టబద్ధంగా కల్పించడానికి ప్రాథమిక హక్కులను పొందుపరచడం ఒక్కటే సరైన మార్గమని, రాజ్యాంగ పరిషత్తు ప్రాథమిక హక్కుల జాబితాను సిద్ధంచేసి, వాటిలో ఏవి న్యాయస్థానాల రక్షణ గలవో, ఏవికావో స్పష్టం చేయాలని సప్రూ కమిటీ పేర్కొంది.
* 1947, జనవరి 24న సర్ధార్ వల్లభాయ్ పటేల్ అధ్యక్షతన 1+54 సభ్యులతో కూడిన ప్రాథమిక హక్కుల సలహా సంఘాన్ని రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేసింది. ఇది అల్పసంఖ్యాకుల హక్కులు, ఆటవిక జాతులు, వారి ప్రాంతాలను గురించి నివేదికను సమర్పించవలసిందిగా కోరింది.
* ఈ సలహా సంఘాన్ని 1947, ఫిబ్రవరి 12న అయిదు ఉపసంఘాలుగా విభజించారు. వీటిలో ఒకటి ప్రాథమిక హక్కుల ఉపసంఘం. ప్రాథమిక హక్కులను నిర్దేశించడానికి ఆచార్య జె.బి.కృపలాని అధ్యక్షతన తొమ్మిది మంది సభ్యులతో ఇది ఏర్పడింది.

ఈ ఉపసంఘంలోని సభ్యులు
   1. ఎ.కృష్ణస్వామి అయ్యర్ 
   2. కె.టి.షా
   3. ఎం.ఆర్.మసాని 
   4. రాజకుమారి అమృతకౌర్
   5. హరనామ్ సింగ్
    6. కె.ఎం.మున్షీ
   7. జైరాందాస్ - దౌలత్‌రామ్
   8. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్
   9. మౌలానా అబుల్‌కలాం ఆజాద్

ప్రాథమిక హక్కులపై ప్రముఖుల అభిప్రాయాలు
* ''సమాజంచేత కోరబడి, రాజ్యంచేత గుర్తించబడిన అంశాలే హక్కులు"  - గార్నర్
* ''ప్రాథమిక హక్కులు అనేవి రాజ్యాంగానికి శాశ్వతత్వాన్ని కలిగించే లంగరు"  - ఎన్.ఎ.ఫాల్కీవాలా                                                                                            
* ''ప్రాథమిక హక్కులు రాజ్యాంగానికి ఆత్మ, అంతరంగం"   - జవహర్‌లాల్ నెహ్రూ

ప్రాథమిక హక్కుల - వర్గీకరణ 
* 1950, జనవరి 26 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అప్పుడు మన రాజ్యాంగంలో 7 రకాల ప్రాథమిక హక్కులు ఉన్నాయి. అవి:
   1. సమానత్వపు హక్కు - ఆర్టికల్ 14 నుంచి 18
   2. స్వేచ్ఛా స్వాతంత్య్రపు హక్కు - ఆర్టికల్ 19 నుంచి 22
   3. పీడనాన్ని నిరోధించే హక్కు - ఆర్టికల్ 23 నుంచి 24
   4. మత స్వాతంత్య్రపు హక్కు - ఆర్టికల్ 25 నుంచి 28
   5. విద్యా, సాంస్కృతిక హక్కు - ఆర్టికల్ 29 నుంచి 30
   6. ఆస్తి హక్కు - ఆర్టికల్ 31
   7. రాజ్యాంగ పరిరక్షణ హక్కు - ఆర్టికల్ 32
* భారత రాజ్యాంగంలోని IIIవ భాగంలో 12 నుంచి 35 వరకు ఉన్న ఆర్టికల్స్‌లో ప్రాథమిక హక్కులను గురించి పరిపూర్ణంగా వివరించారు.

 

ఆర్టికల్-12: భారత రాజ్య నిర్వచనం
* దీని ప్రకారం రాజ్యానికి సంబంధించిన నిర్వచనాన్ని భారత రాజ్యాంగం ఇచ్చింది. రాజ్యం అంటే:
      A. భారత ప్రభుత్వం
     B. రాష్ట్ర ప్రభుత్వాలు
     C. పార్లమెంటు
     D. రాష్ట్ర శాసనసభలు
     E. భారత ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ఇతర అధికార సంస్థలు
* రాజ్య నిర్వచనానికి సంబంధించి, సుప్రీంకోర్టు తీర్పుల్లోని సారాంశం:

అజయ్ హాసియా Vs ఖలీద్ ముజీద్ కేసు: 1981
* ఈ కేసులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి.ఎన్. భగవతి నేతృత్వంలో, ధర్మాసనం ఇచ్చిన తీర్పు రాజ్యనిర్వచనానికి ఒక స్పష్టతను ఇచ్చింది. దీని ప్రకారం
A. ఒక సంస్థ చేస్తున్న మొత్తం ఖర్చును రాజ్యం ఇస్తున్నప్పుడు దాన్ని రాజ్యసంస్థగా పేర్కొనవచ్చు.
B. ఒక సంస్థ మూలధనం యొక్క పూర్తి వాటాను ప్రభుత్వం కలిగి ఉంటే దాన్ని రాజ్యసంస్థగా పేర్కొనవచ్చు.
C. ఒక సంస్థపై రాజ్యం పూర్తి నియంత్రణను కలిగి ఉన్నట్లయితే ఆ సంస్థను రాజ్య ఏజెన్సీగా భావించవచ్చు.
D. ఒక ప్రభుత్వ శాఖను ప్రత్యేకంగా ఒక సంస్థకు బదిలీ చేసినప్పుడు దాన్ని రాజ్యసంస్థగా భావించవచ్చు.
E. ఒక సంస్థ కార్యకలాపాలు ప్రజాప్రాముఖ్యం, ప్రభుత్వ కార్యకలాపాలతో సంబంధం కలిగి ఉన్నప్పుడు దాన్ని రాజ్యసంస్థగా భావించవచ్చు.
F. ఒక సంస్థను రాజ్యం ద్వారా నిర్వహిస్తున్నప్పుడు ఆ సంస్థ గుత్తాధిపత్యాన్ని కలిగి ఉంటే దాన్ని రాజ్యసంస్థగా భావించవచ్చు.

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌