• facebook
  • whatsapp
  • telegram

ఆంధ్రలో చరిత్ర పూర్వ యుగం, చారిత్రక యుగం

ఆనాడే ఆంధ్రలో ఆదిమానవుడు!

  మూడు లక్షల సంవత్సరాల క్రితమే ఆదిమానవుడు ఆంధ్ర ప్రాంతంలో ఆవిర్భవించాడు. చరిత్ర పూర్వయుగం నుంచి బృహత్‌ శిలా యుగం వరకు ఎన్నో పరిణామాలకు సాక్ష్యంగా నిలిచాడు. సంచార జీవనాన్ని దాటి స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. ఆహార అన్వేషణను వదిలి పండించడం నేర్చుకున్నాడు. నిప్పును కనిపెట్టాడు. చక్రాన్ని తిప్పాడు. మోటు రాతి పనిముట్లతో మొదలుపెట్టి ఇనుప ఆయుధాలనూ ప్రయోగించడం ప్రారంభించాడు. ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర అధ్యయనంలో భాగంగా ఆ యుగాలకు సంబంధించిన ఆసక్తికర అంశాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. 

రాతి యుగాలు - లోహ యుగాలు

  ఆంధ్ర ప్రాంతంలో సుమారు 3 లక్షల సంవత్సరాల క్రితం ప్లిస్టోసిన్‌ లేదా హిమ యుగం నుంచే మానవులు నివసించినట్లు ఆధారాలున్నాయి. ఆంధ్రాలో వీరి సంచారం, ఉపయోగించిన వస్తువులపై పరిశోధనలు జరిపిన మొదటి వ్యక్తి రాబర్ట్‌ బ్రూస్‌ ఫుట్‌. ఆ తర్వాత పరిశోధనలు చేసినవారిలో మెడోస్‌ టేలర్, కాగ్లిన్‌ బ్రౌన్, పి.టి.శ్రీనివాస అయ్యంగారు ఉన్నారు.

చారిత్రక యుగం మూడు భాగాలు

1. చరిత్ర పూర్వయుగం (Pre Historic Period) 

2. సంధికాల చారిత్రక యుగం (Proto Historic Period)

3. చారిత్రక యుగం (Historic Period)

* చరిత్ర పూర్వయుగం అంటే ఆ కాలం నాటి మానవుడికి లిపి, అక్షరాల గురించి తెలియదు.

* సంధికాల చారిత్రక యుగం నాటి మానవుడికి లిపి తెలుసు, కానీ అక్షరాల గురించి తెలియదు.

ఉదా: సింధు ప్రజల లిపి బొమ్మల లిపి. కానీ అక్షరాలు లేవు. 

* చారిత్రక యుగంలో మానవులకు లిపి, అక్షరాలు తెలుసు.

ఉదా: ఆర్య నాగరికత. వీరి కాలంలో వేద సాహిత్యాన్ని బ్రాహ్మీ లిపిలో, సంస్కృత భాషలో రాశారు.

చరిత్ర పూర్వయుగం: ఈ కాలం నాటి మానవుడు తన దైనందిన జీవన విధానంలో భాగంగా రాతితో తయారు చేసిన పనిముట్లను ఉపయోగించేవాడు. అందుకే ఈ యుగాన్ని ‘శిలాయుగం’ (స్టోన్‌ ఏజ్‌) అని పిలుస్తారు. ఈ యుగం క్రీ.పూ. 3 లక్షల సంవత్సరాల నుంచి 5 వేల సంవత్సరాల వరకు కొనసాగింది. డేనియల్‌ విల్సన్‌ అనే స్కాటిష్‌ చరిత్రకారుడు ప్రి-హిస్టారిక్‌ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించాడు.  క్రీ.శ.1851లో The Archaeology and Pre Historic Annals of Scotland అనే గ్రంథాన్ని రచించాడు.  1865లో ఇంగ్లండ్‌కు చెందిన జాన్‌ లబ్బక్‌ రచించిన  Pre Historic Times గ్రంథంలో Pre Historic పదాన్ని ఉపయోగించాడు.


 చరిత్ర పూర్వయుగాన్ని ప్రాచీన శిలాయుగం, మధ్య శిలాయుగం, నవీన శిలాయుగాలుగా వర్గీకరించారు.

1) ప్రాచీన శిలాయుగం: ప్రాచీన శిలాయుగాన్ని Paleolithic Age/Preston Age లేదా పాత రాతియుగంగా పిలుస్తారు. ఈ కాలంలో మానవుడు ఆహార అన్వేషణ దశలో ఉండేవాడు. ఉపయోగించే రాతి పనిముట్లు మోటుగా ఉండేవి. నాటి రాతి పనిముట్లు కర్నూలు జిల్లాలోని బేతంచర్లకు సమీపంలో బిల్ల సర్గం (బిల్ల సొరంగం)లో లభించాయి. ఆ పరికరాలను స్ఫటికశిల (క్వార్ట్‌జైట్‌)తో చేశారు. ప్రాచీన శిలాయుగంలో మొదటి భాగమైన పూర్వ ప్రాచీన శిలాయుగంలో గులకరాళ్లతో పరికరాలు తయారయ్యాయి. వీటిని ‘పెచ్చల్‌ టూల్స్‌’ అంటారు.ఈ కాలపు రాతి పరికరాల్లో ముఖ్యమైంది ‘గొడ్డలి’.

  మధ్య ప్రాచీన శిలాయుగంలో రాళ్లను పెచ్చులుగా ఊడగొట్టి రాతి పరికరాలు తయారుచేసేవారు. వీటిలో ముఖ్యమైనవి ‘చక్రాలు’, బరమా. ఉత్తర ప్రాచీన శిలా యుగంలో మానవుడు ఉపయోగించిన ముఖ్యమైన రాతి పనిముట్లు ‘బ్లేడు’, బ్యూరిన్‌. కర్నూలు జిల్లా చింతమానుగవి వద్ద నాటి రాతి సూది లభించింది. 1892లో రాబర్ట్‌ బ్రూస్‌ఫుట్‌ కర్నూలు జిల్లాలోని బిల్ల సర్గంలో జరిపిన పరిశోధనల్లో తలలు లేని జంతు కళేబరాలు బయల్పడ్డాయి.

2) మధ్య శిలాయుగం: దీన్ని సూక్ష్మ రాతియుగం అని, మిసోలిథిక్‌ ఏజ్, మిడిల్‌ స్టోన్‌ ఏజ్‌ అని పిలుస్తారు. ఈ యుగంలో ఉపయోగించిన రాయిని చెకుముకి రాయి (క్రిస్టల్‌ చెర్ట్‌) అని పిలుస్తారు. ఈ కాలం రాతి పరికరాల్లో ముఖ్యమైనవి కత్తులు, బొరిగెలు, గీకుడు రాళ్లు. నాటి స్థావరాల్లో గంభీరం నదీ లోయ, విశాఖపట్నం జిల్లా (ప్రస్తుత అల్లూరి సీతారామరాజు జిల్లా) లోని బొర్రా గుహలు, కర్నూలు జిల్లాలోని కేతవరంలో చిత్రాలు ముఖ్యమైనవి. రాతి పనిముట్లు త్రిభుజాకార, చతుర్భుజాకారంలో ఉండేవి. ఈ యుగంలోనే మానవుడు నిప్పును కనుక్కున్నాడు.

3) నవీన శిలాయుగం: దీన్నే కొత్త రాతియుగం అని, Neolithic Age/ New Stone Age అని పిలుస్తారు. ఈ కాలంలో మానవుడు స్థిరనివాసం ఏర్పరచుకున్నాడు. రాబర్ట్‌ బ్రూస్‌ఫుట్‌ అనంతపురం జిల్లాలో 25 జనావాసాలను కనుక్కున్నాడు. నాటి వ్యవసాయ క్షేత్రాలు అనంతపురం జిల్లాలోని పాలవాయి, లత్తవరం, కర్నూలు జిల్లాలోని బేతంచర్ల వద్ద కనిపించాయి. ఉట్నూరు వద్ద బూడిద కుప్పలు బయటపడ్డాయి. అప్పటి మానవుడు చక్రాన్ని కనుక్కున్నాడు. కుండలు తయారు చేయడం ప్రారంభించాడు. చక్రం ఆవిష్కరణను నాగరికతా విప్లవంగా పిలిచినవారు సర్‌ గార్డెన్‌ చైల్డ్‌. ఈ యుగానికి చెందిన పూడ్చిపెట్టిన మట్టి పాత్రలు నాగార్జున కొండ వద్ద తవ్వకాల్లో, పెన్నానది ఆనకట్ట నిర్మాణ తవ్వకాల్లో బయటపడ్డాయి.

తామ్ర శిలాయుగం (Chalcolithic Age): తామ్రం అంటే రాగి. ప్రపంచంలో మానవుడు మొదటగా కనుక్కున్న లోహం రాగి. ఏపీలో కృష్ణా జిల్లాలోని కేశరపల్లి వద్ద రాగి పనిముట్లు లభించాయి. కర్నూలు జిల్లాలోని పాతపాడు వద్ద చిత్రాలు ఉన్న మృణ్మయ పాత్రలు బయటపడ్డాయి. రాగి, తగరం మిశ్రమంతో కంచు లోహం తయారవుతుంది.

ఇనుపలోహ యుగం: క్రీ.పూ.1000 సంవత్సరాల నుంచి క్రీ.పూ.900 సంవత్సరాల మధ్య ఈ యుగం ఆంధ్రాలో ప్రారంభమైనట్లు అల్లూరు వద్ద జరిపిన రేడియో కార్బన్‌ డేటింగ్‌-14 పరిశోధనలో తేలింది. అప్పట్లో ఆంధ్ర దేశంలో వరి పండించి తినేవారని డాక్టర్‌ సంకాలియా అనే పురావస్తు శాస్త్రవేత్త తెలిపారు. నాటి మానవుడు నలుపు, ఎరుపు మట్టి పాత్రలు ఎక్కువగా ఉపయోగించేవాడు. భారతదేశంలో ఈ యుగం గురించి ఎక్కువగా పరిశోధనలు జరిపినవారు ఎస్‌.ఆర్‌.బెనర్జీ. ఆ కాలంలో అతి ముఖ్యమైనది బృహత్‌ శిలా సంస్కృతి (లేదా) రాక్షస గుళ్ల సంస్కృతి.

బృహత్‌ శిలాయుగం: ఆంధ్రదేశంలో ఇనుపలోహ యుగం నాటి ఆయుధాలు వింతైన సమాధుల్లో లభించాయి. వాటినే బృహత్‌ శిలలు/రాక్షస గుళ్లు/మెగాలిత్స్‌ అని పిలుస్తారు. అవి ఎక్కువగా బ్రహ్మగిరి, గుడివాడ, నాగార్జునకొండ ప్రాంతాల్లో లభించాయి. ఏలేశ్వరం వద్ద ఒకే సమాధిలో స్త్రీ, పురుష కళేబరాలు ఉన్న శవపేటిక దొరికింది. ఈ రాక్షస గుళ్లు సుమారు 12 రకాలున్నాయి. చనిపోయిన వారి స్మృతికి చిహ్నంగా శిలాస్తంభాలను నిలబెట్టేవారు. వీటినే ‘మెన్‌హిర్‌’లు అని పిలుస్తారు. మెన్‌హిర్‌లు కృష్ణా జిల్లాలోని రేవరాల వద్ద లభించాయి.

రాక్షసగుళ్లు లేదా మెగాలిత్స్‌లో పలు రకాలు ఉన్నాయి.

సిస్ట్‌: ఇది మొదటిరకం సమాధి/శవపేటిక. గ్రానైట్‌ బండరాయితో శవపేటిక తయారుచేసి భూమిలో పాతిపెడతారు. శవపేటిక పైన కప్పిన రాయికి ‘రంధ్రం’ ఉంటుంది. ఈ రకమైన సమాధులు విశాఖపట్నం తప్ప ఆంధ్రాలో అన్ని ప్రాంతాల్లో కనిపించాయి.

డోల్మన్‌: ఇది రెండో రకం శవపేటిక. దీన్ని భూమిలో పూడ్చరు. భూమిపైనే ఉంచుతారు. ఇవి తూర్పు గోదావరి, కృష్ణా, చిత్తూరు జిల్లాల్లో కనిపించాయి.

సార్కోఫగి: ఇది మూడో రకం సమాధి/శవపేటిక. దీన్ని కాల్చిన బంకమట్టి లేదా టెర్రకోటతో తయారుచేస్తారు. ఇవి గొర్రె ఆకారంలో ఉంటాయి. కర్నూలు జిల్లా శంకవరంలో గుర్తించారు.

మెన్విర్‌: ఇది నాలుగో రకం శవపేటిక. దీన్ని భూమిలో పాతిపెట్టి, ఆ సమాధిపై వివిధ ఆకారాల్లో 2 నుంచి 6 మీటర్ల ఎత్తున్న రాతి స్తంభాలు నిలబెడతారు.

* పురావస్తు శాస్త్రవేత్తలు జరిపిన తవ్వకాల్లో బయల్పడిన అవశేషాల వయసును తెలుసుకోవడానికి ఉపయోగించే పద్ధతిని ‘కార్బన్‌ డేటింగ్‌-14’ అని పిలుస్తారు.

మరికొన్ని ముఖ్యాంశాలు

* గుంటూరు జిల్లా వడ్లమానులో రాతిగొడ్డలిని   కనుక్కున్నవారు రాబర్ట్‌ బ్రూస్‌ ఫుట్‌.

* కమియెడ్, బర్కిట్‌ అనే పరిశోధకులు తమ పరిశోధనల్లో బయటపడిన రాతి వస్తువులను నాలుగు భాగాలుగా విభజించి వాటికి ‘సిరీస్‌’ అని పేరు పెట్టారు.

* ప్రాంక్‌ పి.మాన్లే అనే అమెరికన్‌ పెన్నానది ప్రాంతంలో పరిశోధనలు జరిపి పాతరాతి యుగపు అవశేషాలు కనుక్కున్నాడు.

* 1865లో గోదావరి నదీ తీరంలో పరిశోధనలు జరిపిన వ్యక్తి ‘వైన్‌’.

* నాగార్జున కొండ వద్ద పరిశోధనలు జరిపినవారు బి.ఆర్‌. సుబ్రహ్మణ్యం.

* కృష్ణా జిల్లాలోని ఉస్తపల్లి ప్రదేశంలో మాత్రమే ప్రాచీన శిలాయుగపు అవశేషాలు లభించాయి.

* 1960లో గుండ్లకమ్మ నదీ తీరాన పరిశోధనలు జరిపినవారు హైజాక్‌.

* చిత్తూరు జిల్లా రాళ్లవాగు వద్ద పరిశోధనలు జరిపినవారు కృష్ణమూర్తి.

* 1968లో కడప జిల్లా ‘సగిలేరు’ లోయలో పరిశోధనలు జరిపివారు తిమ్మారెడ్డి.

* 1985లో తిరుపతిలో పరిశోధనలు జరిపినవారు జాకబ్‌ జయరాజు.

రచయిత: రెడ్డి ఉమా మహేశ్వరరావు  

Posted Date : 22-02-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌