• facebook
  • whatsapp
  • telegram

కేంద్ర, రాష్ట్ర సంబంధాలు - సంస్కరణల అవసరం

రాజ్యాంగ నిర్మాతలు మన దేశాన్ని పరిపాలనాపరమైన సమాఖ్యగా ఏర్పాటు చేశారు. కానీ సిద్ధాంతపరమైన సమాఖ్యగా ఏర్పాటు చేయలేదు.
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలను నెలకొల్పాల్సిన ఆవశ్యకతను రాజ్యాంగ నిర్మాతలు గ్రహించారు.
* మన రాజ్యాంగంలో సమాఖ్య అనే పదాన్ని ఎక్కడా ప్రయోగించక పోయినప్పటికీ, భారతదేశాన్ని సమాఖ్యగానే కొనసాగిస్తున్నారు.
* సమాఖ్యలో అత్యంత ముఖ్య లక్షణం అధికారాల విభజన.
* రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య 3 రకాలైన అధికారాల విభజన జరిగింది. ఈ విభజన విస్తృతంగా, స్పష్టంగా ఉంది.
* 1964 వరకు జవహర్‌లాల్ నెహ్రూ దేశ పరిపాలనాధికారాన్ని చెలాయించారు. అతడిని ప్రశ్నించే స్థాయి గల నాయకులు అరుదుగా ఉండటంతో కేంద్ర, రాష్ట్రాల మధ్య సంబంధాలు సక్రమంగానే కొనసాగాయి.
* కానీ, 1967లో జరిగిన 4వ సాధారణ ఎన్నికల అనంతరం అనేక రాష్ట్రాల్లో అధికారానికి వచ్చిన ప్రాంతీయ పార్టీలు, ప్రతిపక్ష రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగంలోని కేంద్రీకృత ధోరణిని ప్రశ్నించాయి. కేంద్ర, రాష్ట్రాల సంబంధాల్లో విభేదాలు ప్రారంభమయ్యాయి.
* పశ్చిమబెంగాల్‌లోని వామపక్ష ప్రభుత్వం, పంజాబ్‌లోని అకాళీదళ్ ప్రభుత్వం, తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగుదేశం ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చాయి. కేంద్ర, రాష్ట్ర సంబంధాల్లో రావాల్సిన మార్పుల గురించి ప్రస్తావించాయి. దీంతో కేంద్ర, రాష్ట్ర సంబంధాల్లో గణనీయమైన వ్యత్యాసాలు ప్రారంభమయ్యాయి.
* 1967లో జరిగిన ఎన్నికల్లో 8 రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు, ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి రావడం కేంద్ర ఆధిపత్య ధోరణి క్షీణతకు కారణమైంది.
* మన దేశంలో కేంద్రానికి ఎక్కువ, రాష్ట్రాలకు తక్కువ అధికారాలు కేటాయించడం; ఉమ్మడి జాబితాపై పరోక్షంగా కేంద్రానికి అధికారాలు ఉండటం, అవశిష్టాధికారాలు కేంద్రానికి సంక్రమించడం లాంటి కారణాలు కేంద్ర, రాష్ట్ర సంబంధాల సంస్కరణల ఆవశ్యకతను తెలియజేశాయి.
* కేంద్ర ఆదాయవనరులు ఎక్కువగా ఉండటం, రాష్ట్రాలు నేరవేర్చాల్సిన బాధ్యతలు ఎక్కువగా ఉండటంతో కేంద్ర, రాష్ట్రాల మధ్య వివాదాలు ప్రారంభమవుతున్నాయి.
* కేంద్రంలో ఒక పార్టీ, రాష్ట్రాల్లో మరో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజకీయపరమైన విభేదాలు చెలరేగి కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై ప్రభావం చూపుతాయి.
* కేంద్ర ప్రతినిధులుగా రాష్ట్రాల్లో నియమితులైన గవర్నర్లు కేంద్రం ఆదేశాల మేరకు రాష్ట్రాల పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై ప్రభావం చూపుతోంది.
* రాష్ట్రాల్లో రాజ్యాంగ యంత్రాంగం వైఫల్యం చెందినప్పుడు కేంద్రం ఆర్టికల్, 356ను ప్రయోగించి రాష్ట్రపతి పాలనను విధిస్తోంది. అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు, ఇతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలను తరచూ రద్దు చేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడటం కూడా కేంద్ర, రాష్ట్ర సంబంధాలను సంస్కరించాల్సిన ఆవశ్యకతను తెలుపుతోంది.
* భిన్నత్వంలో ఏకత్వం ఉన్న మన దేశంలో జాతీయ రాజకీయాలను కూడా ప్రాంతీయ పార్టీలు శాసించడం.
* ప్రాంతీయ పార్టీలు తమ ప్రాంత ప్రయోజనాల కోసం జాతి ప్రయోజనాలను ఫణంగా పెడుతూ స్థానిక దృక్పథంతో ఆలోచించడం.
* కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అనుసరిస్తున్న విధానాలు రాష్ట్రాలకు నచ్చకపోవడం లాంటి అంశాల ఆధారంగా కేంద్ర, రాష్ట్ర సంబంధాలను సంస్కరించాలి.
* 7వ షెడ్యూల్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజ్యాంగం 3 రకాలైన అధికారాల విభజనను కేంద్రానికి అనుగుణంగా చేసింది.

కేంద్ర జాబితాలోని అంశాలు
1. భారతదేశ రక్షణ వ్యవహారాలు
2. మిలటరీ, నౌకా, వైమానిక దళాలు; రాష్ట్రాల్లో శాంతి భద్రతల పరిరక్షణ కోసం కేంద్ర బలగాలను మోహరించడం
3. కంటోన్మెంట్ ప్రాంతాలు, స్థానిక ప్రభుత్వాలు
4. ఆయుధాలు, పేలుడు పదార్థాలు
5. నౌకా, మిలటరీ, వైమానిక పనులు
6. అణుశక్తి, ఖనిజ వనరులు
7. రక్షణ పరిశ్రమలు
8. కేంద్ర నేర పరిశోధన విభాగం
9. భారత రక్షణ కోసం ముందస్తు వ్యూహాలు
10. విదేశీ వ్యవహారాలు
11. ఐక్యరాజ్యసమితి వ్యవహారాలు
12. దౌత్య, వాణిజ్య ప్రాతినిధ్యం
13. అంతర్జాతీయ సమావేశాలు, సంస్థలు
14. విదేశీ ఒప్పందాలు
15. యుద్ధం, శాంతి
16. విదేశీ పరిధి - న్యాయ పరిధి
17. పౌరసత్వం, సంబంధాలు
18. విదేశీ నేరస్థుల అప్పగింత
19. పాస్‌పోర్టులు, వీసాలు
20. భారత్‌కు వెలుపల ఉన్న దర్శనీయ స్థలాలు
21. పైరసీలు; సముద్ర, వాయుయానంలో దేశ చట్టాలకు విరుద్ధంగా నేరాలు
22. రైల్వేలు
23. జాతీయ రహదారులు
24. సముద్ర తీరాల్లో నౌకాయాన సంబంధం
25. జాతీయ జలమార్గాల్లో షిప్పింగ్, నేవిగేషన్
26. ఓడలు, విమాన రక్షణ కోసం ఏర్పాటు చేసే లైట్‌హౌస్‌లు
27. ముఖ్యమైన ఓడరేవులు
28. అంటురోగాలు; సముద్ర తీరాల్లో పనిచేసే నౌకాదళాల, వైద్యశాలల నిర్వహణ
29. వాయు మార్గాలు, విమానాలు, వాయు యానం, ఏరోడ్రోమ్‌లు
30. ప్రయాణికులు; వస్తువులను సముద్ర, వాయు, జాతీయ జల మార్గాల ద్వారా రవాణా చేయడం
31. తంతి, తపాలా, టెలిఫోన్, ప్రసారాలు
32. కేంద్ర ప్రభుత్వ ఆస్తులు
33. తొలగించారు (7వ సవరణ ద్వారా 1956)
34. భారతదేశ సంస్థానాధిపతుల ఎస్టేట్‌లకు సంబంధించిన కోర్ట్ ఆఫ్ వార్డ్స్
35. ప్రజల నుంచి కేంద్రం చేసిన అప్పులు
36. ద్రవ్యం, కాగితపు కరెన్సీ, విదేశీ మారకద్రవ్యం
37. విదేశీ రుణాలు
38. భారతీయ రిజర్వ్ బ్యాంక్
39. పోస్టాఫీస్ సేవింగ్స్ బ్యాంకు
40. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే లాటరీలు
41. విదేశాల్లో వర్తక వాణిజ్యాలు, కస్టమ్స్
42. అంతర్‌రాష్ట్ర వర్తక వాణిజ్యాలు
43. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఫైనాన్షియల్ కార్పొరేషన్లు
44. కేవలం ఒకే రాష్ట్రానికి పరిమితం కాని వివిధ రకాల కార్పొరేషన్లు
45. బ్యాంకింగ్
46. బిల్స్ ఆఫ్ ఎక్స్ఛేంజ్, చెక్కులు, ప్రామిసరీ నోట్లు, ఇతర పత్రాలు
47. బీమా రంగం
48. స్టాక్ ఎక్స్ఛేంజ్, ఫ్యూచర్స్ మార్కెట్
49. పేటెంట్లు, ఇన్వెన్షన్స్, డిజైన్స్, కాపీ రైట్, ట్రేడ్ మార్కులు, వ్యాపార సంబంధమైన చిహ్నాలు
50. తూనికలు, కొలతలకు ప్రామాణికాల నిర్ధారణ
51. భారత్ నుంచి విదేశాలకు ఎగుమతి అయ్యే వస్తువులు; ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి రవాణా చేసే వస్తువులకు క్వాలిటీ నియంత్రణ
52. ప్రజా సంక్షేమం దృష్ట్యా కేంద్ర ప్రభుత్వ నియంత్రణ అవసరమని పార్లమెంటు ప్రకటించిన పరిశ్రమలు
53. చమురు క్షేత్రాలు, మినరల్ ఆయిల్, పెట్రోలియం, పెట్రోలియం ఉత్పత్తులు
54. ప్రజా సంక్షేమం దృష్ట్యా గనులు, ఖనిజాల అభివృద్ధి, నియంత్రణ
55. గనులు, చమురు శుద్ధి రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల భద్రత కోసం నియమ నిబంధనలు
56. అంతర్ రాష్ట్రీయ నదులు, నదీ లోయల నియంత్రణ
57. అంతర్జాతీయ జలాల్లో చేపలు పట్టడం
58. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా ఉప్పు తయారీ
59. నల్ల మందు (ఒపియం) సాగు చేయడం, ఉత్పత్తి, ఎగుమతి
60. ప్రదర్శన కోసం సినిమాటోగ్రఫీ చిత్రాలకు అనుమతి
61. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పారిశ్రామిక వివాదాలు
62. రాజ్యాంగం అమల్లోకి వచ్చే నాటికి ఉన్న జాతీయ గ్రంథాలయం, భారత మ్యూజియం, ఇంపీరియల్ వార్ మ్యూజియం, విక్టోరియా మెమోరియల్
63. రాజ్యాంగం అమల్లోకి వచ్చే నాటికి ఉన్న బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం, అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం, దిల్లీ విశ్వవిద్యాలయం, ఆర్టికల్ 371 (E) ప్రకారం నెలకొల్పిన కేంద్రీయ విశ్వవిద్యాలయం
64. కేంద్ర ప్రభుత్వం పాక్షికంగా లేదా పూర్తిగా ఆర్థిక సహాయం అందజేస్తూ జాతీయ ప్రాముఖ్యత ఉన్నవని పార్లమెంటు శాసన పూర్వకంగా ప్రకటించిన శాస్త్రీయ, సాంకేతిక విద్య కోసం ఏర్పాటు చేసిన సంస్థలు
65. కింద పేర్కొన్న కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు, సంస్థలు
ఎ) పోలీసు అధికారుల శిక్షణా సంస్థలతో సహా ప్రొఫెషనల్, వొకేషనల్ శిక్షణా సంస్థలు
బి) ప్రత్యేక విద్యా కోర్సుల అభివృద్ధి లేదా పరిశోధన
సి) నేర పరిశోధన, పరిశీలనలో శాస్త్రీయ, సాంకేతిక సహకారం
66. ఉన్నత విద్య, పరిశోధన, సాంకేతిక విద్యా సంస్థల మధ్య సహకారం, ప్రమాణాల నిర్ధారణ
67. పురాతన చారిత్రక కట్టడాలు, రికార్డులు, పురావస్తు ప్రదేశాలు, అవశేషాలు
68. సర్వే ఆఫ్ ఇండియా, బయోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా, జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఆంత్రోపాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, మెటీరియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా
69. జనాభా గణాంకాలు
70. అఖిల భారత సర్వీసులు, కేంద్ర ప్రభుత్వ సర్వీసులు, యూపీఎస్సీ
71. కేంద్ర సంఘటిత నిధి నుంచి చెల్లించే కేంద్ర ప్రభుత్వ పెన్షన్లు
72. పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలకు ఎన్నికలు; రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు; ఎన్నికల కమిషన్
73. పార్లమెంటు సభ్యులు; రాజ్యసభ అధ్యక్ష, ఉపాధ్యక్షులు; లోక్‌సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ల జీతభత్యాలు, అలవెన్సులు
74. పార్లమెంటు ఉభయ సభల అధికారాలు, ప్రత్యేక అధికారాలు, పార్లమెంటు సభాసంఘాల ఎదుట వ్యక్తులు హాజరవ్వడం
75. రాష్ట్రపతి, గవర్నర్, కేంద్ర మంత్రులు, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ మొదలైన వారి జీతభత్యాలు, హక్కులు, అధికారాలు
76. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అకౌంట్లు, ఆడిటింగ్
77. సుప్రీంకోర్టు వ్యవస్థీకరణ, అధికార పరిధి, సుప్రీంకోర్టులో చెల్లించాల్సిన ఫీజులు, సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేయడానికి అర్హతల నిర్ధారణ
78. హైకోర్టుల వ్యవస్థీకరణ, నిర్మాణం, హైకోర్టులో ప్రాక్టీస్ చేయడానికి అర్హతల నిర్ధారణ
79. కేంద్రపాలిత ప్రాంతాలకు హైకోర్టు పరిధిని విస్తరించడం. హైకోర్టు పరిధి నుంచి ఏదైనా కేంద్రపాలిత ప్రాంతాన్ని మినహాయించడం
80. ఒక రాష్ట్రంలోని పోలీసు బలగాల అధికారాలను ఆ రాష్ట్రం వెలుపల ఉన్న మరో రాష్ట్రానికి విస్తరింపజేయడం (ఇందుకు అవతల రాష్ట్రం అంగీకరించాలి)
81. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వలస వెళ్లడం, ఇంటర్ స్టేట్ క్వారంటైన్
82. వ్యవసాయేతర ఆదాయంపై పన్ను
83. ఎగుమతి డ్యూటీలతో సహా కస్టమ్స్ పన్ను
84. కింద పేర్కొన్నవి మినహాయించి భారత్‌లో ఉత్పత్తి లేదా తయారయ్యే పొగాకు, ఇతర వస్తువులపై ఎక్సైజ్ డ్యూటీ
ఎ) మానవ అవసరాల నిమిత్తం ఉపయోగించే ఆల్కహాల్ లిక్కర్
బి) ఓపియం, ఇండియన్ గంజాయి, ఇతర మత్తు పదార్థాలు
85. కార్పొరేషన్ పన్ను
86. వ్యక్తులు, కంపెనీల ఆస్తుల క్యాపిటల్ విలువపై పన్ను
87. వ్యవసాయ భూములను మినహాయించి ఇతర ఆస్తులపై ఎస్టేట్ డ్యూటీ
88. వ్యవసాయ భూములు మినహాయించి వారసత్వం ద్వారా సంక్రమించిన ఆస్తులపై పన్నులు
89. భూ, జల, వాయు మార్గాల ద్వారా వస్తువుల, ప్రజల చేరవేతపై ట్యాక్స్, రైల్వే ఛార్జీలపై పన్ను
90. స్టాక్ ఎక్స్ఛేంజ్, ఫ్యూచర్ మార్కెట్ లావాదేవీలపై స్టాంప్ డ్యూటీలు కాకుండా ఇతర పన్నులు
91. బిల్స్ ఆఫ్ ఎక్స్ఛేంజ్, చెక్కులు, ప్రామిసరీ నోట్లు, బిల్ ఆఫ్ లాండరింగ్, లెటర్స్ ఆఫ్ క్రెడిట్, ఇన్సూరెన్స్ పాలసీలు, షేర్ల బదలాయింపు, రసీదులపై స్టాంప్ డ్యూటీ
92. వార్తాపత్రికల కొనుగోలు, అమ్మకాలపై; వార్తాపత్రికల్లో ప్రచురించే ప్రకటనలపై పన్ను
92. (A) అంతర్రాష్ట్రీయ వర్తక, వాణిజ్యాల్లో భాగంగా జరిపే కొనుగోలు, అమ్మకాలపై పన్ను (వార్తాపత్రికలను మినహాయించి) (6వ రాజ్యాంగ సవరణ 1956 ద్వారా చేర్చారు)
92. (B) అంతర్రాష్ట్రీయ వర్తక, వాణిజ్యాల్లో భాగంగా జరిగే వస్తువుల రవాణాపై పన్ను (దీన్ని 46వ రాజ్యాంగ సవరణ 1982 ద్వారా ప్రవేశపెట్టారు)
92. (C) సేవలపై పన్నులు (దీన్ని 88వ రాజ్యాంగ సవరణ 2003 ద్వారా చేర్చారు)
93. ఈ జాబితాలోని అంశాల ఉల్లంఘనకు సంబంధించిన నేరాలు
94. ఈ జాబితాలోని అంశాలకు సంబంధించిన విచారణలు, సర్వేలు, గణాంకాలు
95. ఈ జాబితాలోని అంశాలకు సంబంధించి సుప్రీంకోర్టు మినహాయించి, మిగిలిన న్యాయస్థానాల విచారణాధికారాలు
96. ఈ జాబితాలోని అంశాలకు సంబంధించి చెల్లించాల్సిన ఫీజులు
97. రెండు లేదా మూడో జాబితాలో లేని ఇతర అంశాలు.

రాష్ట్ర జాబితా

1. శాంతి భద్రతలు
2. మొదటి జాబితాలోని 2A ఎంట్రీకి లోబడి పోలీసు వ్యవస్థ
3. హైకోర్టు అధికారులు, గుమస్తాలు; సుప్రీంకోర్టు మినహాయించి ఇతర న్యాయస్థానాల్లో చెల్లించాల్సిన ఫీజులు
4. జైళ్లు, సంస్కరణ గృహాలు
5. మున్సిపల్ కార్పొరేషన్లు, అభివృద్ధి ట్రస్టులు, జిల్లా బోర్డులు, మైనింగ్ సెటిల్‌మెంట్ అథారిటీలు, స్థానిక స్వపరిపాలనా సంస్థలు
6. ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం, ఆసుపత్రులు, డిస్పెన్సరీలు
7. తీర్థయాత్రలు (భారతదేశం వెలుపల మినహాయించి)
8. ఉత్ప్రేరకాలైన పానీయాల ఉత్పత్తి, తయారీ, రవాణా, క్రయవిక్రయాలు
9. వికలాంగులకు, నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం
10. స్మశానవాటికలు; మృతులను ఖననం చేయడం, ఖననం చేసే ప్రదేశాలు
11. * తొలగించారు (42వ సవరణ ద్వారా 1976లో)
12. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సహాయం పొందే లేదా నియంత్రణలో ఉండే గ్రంథాలయాలు, మ్యూజియంలు, ఇతర పురాతన చారిత్రక కట్టడాలు, రికార్డులు
13. రహదారులు, వంతెనలు, రోప్ వేలు, జల మార్గాలు
14. వ్యవసాయం, వ్యవసాయ విద్య, పరిశోధన
15. పశుసంపద సంరక్షణ, అభివృద్ధి, జంతువుల్లో రోగ నిరోధకం, పశువైద్యంలో శిక్షణ
16. బందెల దొడ్లు, పశువుల అక్రమ ప్రవేశ నిషేధం
17. మంచి నీటి సరఫరా, పంట కాలువలు, మురుగు నీటి పారుదల, నీటిని నిల్వ చేయడం
18. భూమి, భూమిపై హక్కులు, భూకమతాలు, వ్యవసాయ రుణాలు
19. * తొలగించారు (42వ సవరణ ద్వారా 1976లో)
20. * తొలగించారు (42వ సవరణ ద్వారా 1976లో)
21. ఫిషరీస్
22. మొదటి జాబితాలోని 34వ ఎంట్రీలోని నిబంధనలకు లోబడి జప్తు చేసిన ఎస్టేట్లు, కోర్ట్ ఆఫ్ వార్డ్స్
23. గనుల నియంత్రణ, ఖనిజాల అభివృద్ధి
24. పరిశ్రమలు
25. గ్యాస్, గ్యాస్ ఆధారిత పరిశ్రమలు
26. రాష్ట్రం లోపల వర్తక వాణిజ్యాలు
27. వస్తువుల ఉత్పత్తి, పంపిణీ, సరఫరా
28. మార్కెట్లు, సంతలు
29. * తొలగించారు (42వ సవరణ ద్వారా 1976లో)
30. వడ్డీ వ్యాపారం, వడ్డీ వ్యాపారులు, వ్యవసాయ రుణ భారం నుంచి విముక్తి
31. సత్రాలు (Inns), సత్రాల పాలనాధికారులు
32. మొదటి జాబితాలో ఉదహరించినవి మినహాయించి ఇతర కార్పొరేషన్ల వ్యవస్థీకరణ, నియంత్రణ, విశ్వవిద్యాలయాలు, కార్పొరేట్ చేయని వాణిజ్యం, అక్షరాస్యత, శాస్త్రీయ, మతపరమైన, ఇతర సొసైటీలు, అసోసియేషన్లు
33. థియేటర్లు, నాటకాలు, సినిమాలు, వినోదాలు, క్రీడలు
34. పందాలు, జూదం
35. ప్రభుత్వానికి చెందిన/ ప్రభుత్వ ఆధీనంలోని భూములు, భవనాలు
36. * తొలగించారు (7వ సవరణ ద్వారా 1956లో)
37. రాష్ట్ర శాసన సభలకు ఎన్నికలు
38. శాసన సభ్యుల వేతనాలు, అలవెన్సులు; శాసన సభాధిపతి, ఉప సభాధిపతుల వేతనాలు, అలవెన్సులు
39. శాసనసభ్యులు, సభా కమిటీల అధికారాలు, ప్రత్యేక హక్కులు, రక్షణలు
40. రాష్ట్ర మంత్రుల వేతనాలు, అలవెన్సులు
41. రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులు, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్
42. రాష్ట్ర సంచిత నిధి నుంచి చెల్లించే పెన్షన్
43. రాష్ట్ర ప్రభుత్వ రుణం
44. దొరికిన నిధులు, నిక్షేపాలు
45. భూమి శిస్తు, భూమికి సంబంధించిన రికార్డుల నిర్వహణ
46. వ్యవసాయ ఆదాయాలపై పన్ను
47. వారసత్వంగా పొందిన వ్యవసాయ భూమిపై సుంకం
48. వ్యవసాయ భూమికి సంబంధించిన ఎస్టేట్ డ్యూటీ
49. భూములు, భవనాలపై పన్ను
50. గనులకు సంబంధించిన హక్కులపై పన్నులు
51. రాష్ట్రంలో మానవ వినియోగానికి తయారుచేసిన లిక్కర్లు, సారాయి, మత్తు పదార్థాలు, నల్లమందు (వైద్య సంబంధిత టాయిలెట్లు, పరిశ్రమలకు వినియోగించేవి మినహాయింపు)
52. ఒక స్థానిక ప్రాంతంలో వస్తువుల ప్రవేశంపై పన్ను
53. విద్యుత్ వినియోగం, విద్యుత్ వినియోగంపై పన్ను
54. వార్తా పత్రికల్లో ప్రచురించే ప్రకటనలు మినహా ఇతర విధాలైన ప్రకటనలపై పన్ను; రేడియో, దూరదర్శన్‌లలో ప్రసారమయ్యే ప్రకటనలపై పన్ను విధింపులు
55. భూ, జల, వాయు మార్గాల ద్వారా ప్రయాణికుల ప్రయాణం, వస్తు రవాణాపై పన్ను
56. రోడ్లపై నడిచే వాహనాలపై పన్ను
57. జంతువులు, పశువులపై పన్ను
58. వార్తా పత్రికలు మినహా ఇతర వస్తువుల క్రయ విక్రయాలపై పన్ను
59. రహదారి సుంకాలు
60. వృత్తి, వ్యాపారం, ఉద్యోగులపై పన్ను
61. కాంపిటీషన్‌పై పన్ను
62. విలాసాలపై పన్ను, వినోదపు పన్ను, పందెం కాయడం లేదా జూదంపై పన్ను
63. దస్తావేజులు, డాక్యుమెంట్లపై స్టాంప్ డ్యూటీ
64. శాసన ఉల్లంఘనకు సంబంధించిన నేరాలు
65. అన్ని కోర్టుల అధికారాలు, అధికార పరిధి (సుప్రీంకోర్టు మినహాయించి)
66. రాష్ట్ర జాబితాలో ఉదహరించిన అంశాలపై చెల్లించాల్సిన ఫీజు (న్యాయస్థానాల్లో వసూలు చేసే ఫీజులు మినహాయించి)

ఉమ్మడి జాబితా
1. ఇండియన్ పీనల్ కోడ్‌లోని అంశాల్లో ఉన్న క్రిమినల్ లా
2. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లో ఉన్న అన్ని అంశాలతో కూడిన నేర విచారణ విధానం
3. రాష్ట్ర భద్రతకు సంబంధించిన విషయాల్లో ముందు జాగ్రత్త చర్యగా అదుపులోకి తీసుకోవడం, శాంతి భద్రతలు, సమాజానికి అవసరమైన సేవల నిర్వహణ
4. ఖైదీలు, శిక్షపడిన నేరస్థులను ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి తరలించడం
5. వివాహం, విడాకులు, శిశువులు, మైనర్ల దత్తత, వీలునామాలు, వారసత్వం, ఉమ్మడి కుటుంబం
6. వ్యవసాయ భూమి మినహా ఇతర ఆస్తుల బదలాయింపు, దస్తావేజులు, డాక్యుమెంట్లు
7. ఒప్పందాలు
8. చర్య తీసుకోదగిన తప్పిదాలు
9. దివాలా
10. ధార్మిక సంఘాలు, ధర్మకర్తలు
11. న్యాయపాలన (సుప్రీంకోర్టు, హైకోర్టు మినహాయించి), ఇతర కోర్టుల నిర్మాణం
12. సాక్ష్యాలు, ప్రమాణాలు, శాసనాల గుర్తింపు, రికార్డులు, న్యాయ ప్రక్రియ
13. సివిల్ ప్రొసీజర్, సివిల్ ప్రొసీజర్ కోడ్‌లోని నిబంధనలు
14. కోర్టు ధిక్కారం (సుప్రీంకోర్టుకు సంబంధించిన కోర్టు ధిక్కరణ మినహాయించి)
15. సంచార జాతులు, దేశ దిమ్మరులు, వలస వెళ్లే తండాలు
16. మనో వైకల్యం, మానసిక అపరిపక్వత
17. జంతువుల పట్ల క్రూరంగా ప్రవర్తించడం నిషేధం
17. (A) అడవులు
17. (B) క్రూర జంతువులు, పక్షుల సంరక్షణ
18. ఆహార పదార్థాలు, ఇతర వస్తువుల కల్తీ
19. మందులు, విషతుల్యాలు
20. ఆర్థిక, సామాజిక అంశాలు
20. (A) జనాభా నియంత్రణ, కుటుంబ నియంత్రణ ప్రణాళికలు
21. వాణిజ్య, పారిశ్రామిక గుత్తాధికారం, ట్రస్టులు
22. కార్మిక సంఘాలు, పారిశ్రామిక కార్మికుల వివాదాలు
23. సామాజిక భద్రత, సామాజిక బీమా, ఉపాధి, నిరుద్యోగం
24. కార్మిక సంక్షేమం
25. విద్య, సాంకేతిక విద్య, వైద్య విద్య, విశ్వవిద్యాలయాలు
26. న్యాయవాద వృత్తి, వైద్య వృత్తి, ఇతర వృత్తులు
27. దేశ విభజన ఫలితంగా స్థాన చలనం పొందినవారి పునరావాసం
28. వితరణ సంస్థలు, మతపరమైన ధార్మిక సంస్థలు
29. మనుషులు, జంతువులు, వృక్షాలకు అంటువ్యాధులు సోకకుండా నిరోధించడం
30. జనన మరణాలతో సహా అతి ప్రధానమైన విషయాలపై గణాంకాల సేకరణ
31. ఓడరేవులు (భారీ ఓడరేవులను మినహాయించి)
32. దేశీయ జలమార్గాల్లో షిప్పింగ్, నావిగేషన్ ద్వారా రవాణా
33. కింది అంశాలకు సంబంధించిన వర్తక వాణిజ్యాలు
      A. ఉత్పత్తి, వస్తు సరఫరా, పంపిణీ
      B. తైలాలు, నూనె గింజలు, ఆహార పదార్థాలు
      C. పశుగ్రాసం
      D. ముడి పత్తి, పత్తి గింజలు
      E. ముడి జనపనార (3వ సవరణ ద్వారా 1954లో చేర్చారు)
33. (A) తూనికలు, కొలతలు (ప్రమాణాల నిర్ధారణ మినహా)
34. ధరల నియంత్రణ
35. యంత్ర సహాయంతో నడిచే వాహనాలు, అలాంటి వాహనాలపై పన్ను విధింపు
36. కర్మాగారాలు
37. విద్యుచ్ఛక్తి
38. బాయిలర్లు
39. వార్తాపత్రికలు, గ్రంథాలయాలు, ముద్రణాలయాలు
40. పురావస్తు ప్రదేశాలు, పురావస్తు చిహ్నాలు
41. నిర్వాసితుల ఆస్తిగా చట్టం ద్వారా ప్రకటించిన ఆస్తి స్వాధీనం, నిర్వహణ, పరిష్కారం
42. ఆస్తి స్వాధీనం, రాతపూర్వకమైన ఆదేశాలు
43. భూమి శిస్తు బకాయిలతో సహా రాష్ట్రానికి గల ఆస్తిపై హక్కులు
44. జ్యుడీషియల్ స్టాంపులు, ఫీజులు మినహాయించి స్టాంపు డ్యూటీలు
45. రెండు, మూడో జాబితాల్లో ఉదహరించిన అంశాలకు సంబంధించి పరిశోధనలు, గణాంక సేకరణ
46. సుప్రీంకోర్టు మినహాయించి ఇతర న్యాయస్థానాల విచారణాధికారాల పరిధి
47. న్యాయస్థానాల ఫీజులు మినహాయించి, ఉమ్మడి జాబితాలోని ఇతర అంశాలకు సంబంధించిన ఫీజులు

   పైన పేర్కొన్న అంశాల ఆధారంగా తరచూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వస్తున్న వైరుధ్యాల ఫలితంగా కేంద్ర, రాష్ట్ర సంబంధాల మెరుగుదలకు అవసరమైన సంస్కరణలు చేపట్టాలి.
* విద్య , తూనికలు కొల‌త‌లు, కుటుంబ నియంత్రణ‌, అడ‌వులు, విద్యుత్ శక్తి  వంటి అంశాల‌ను 1976లో  ఇందిరా గాంధీ ప్రభుత్వం రాష్ట్ర జాబితా నుంచి తొల‌గించి ఉమ్మడి జాబితాలో పొందుప‌రిచారు.

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ఎం.ఎం.పూంచీ కమిషన్

మదన్‌మోహన్ పూంచీ కమిషన్
   కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై అధ్యయనం చేసి, తగిన సూచనలు చేసేందుకు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మదన్‌మోహన్ పూంచీ నేతృత్వంలో 2007, ఏప్రిల్ 28న ఒక కమిషన్‌ను ఏర్పాటు చేశారు.

 

కమిషన్‌లోని సభ్యులు:
* ధీరేంద్రసింగ్
* వినోద్‌కుమార్ దుగ్గల్
* అమరేష్ బాగ్చి
* ఎన్.ఆర్. మాధవమీనన్

పూంచీ కమిషన్ 7 అధ్యాయాలతో కూడిన తన నివేదికను 2010, ఏప్రిల్ 20న సమర్పించింది అవి:
1. మొదటి అధ్యాయంలో కేంద్ర, రాష్ట్ర సంబంధాల పరిణామ క్రమం.
2. రెండో అధ్యాయంలో ఆర్టికల్ 19, 355, 356, 263.
3. మూడో అధ్యాయంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య ఆర్థిక, విత్త సంబంధాలు.
4. నాలుగో అధ్యాయంలో 73, 74 రాజ్యాంగ సవరణలు, VIవ షెడ్యూల్‌కు సంబంధించిన విషయాలు.
5. ఐదో అధ్యాయంలో తీవ్రవాదం, నక్సలిజం, తిరుగుబాట్లు, మత కల్లోలాలు, హింస లాంటి అంశాలతో కూడిన జాతీయ ఆంతరంగిక భద్రతకు సంబంధించిన సూచనలు.
6. ఆరో అధ్యాయంలో పర్యావరణ సమస్యలు, వనరుల విభజన అంశాలు.
7. ఏడో అధ్యాయంలో సామాజికాభివృద్ధి, సుపరిపాలనకు సంబంధించిన అంశాలు.

 

పూంచీ కమిషన్ సిఫార్సులు
* గవర్నర్ల పదవీ కాలం నిర్దిష్టంగా 5 సంవత్సరాలు ఉండాలి.
* రాష్ట్ర ప్రభుత్వం అనుమతితో సంబంధం లేకుండా మంత్రులపై న్యాయ విచారణ జరపడానికి అనుమతించే అధికారం గవర్నర్‌కు కల్పించాలి.
* విపత్తుల నివారణ అనే అంశాన్ని ఉమ్మడి జాబితాలో చేర్చాలి.
* అంతర్ రాష్ట్ర కౌన్సిల్‌ను పునర్ వ్యవస్థీకరించి సంవత్సరానికి కనీసం 3 సార్లు తప్పనిసరిగా సమావేశపరచాలి.
* రాష్ట్రపతి పాలనను రాష్ట్రం మొత్తంమీద కాకుండా ఒక ప్రత్యేక ప్రాంతంలో అంటే జిల్లాలో కూడా విధించే అవకాశం కల్పించాలి.
* జోనల్ కౌన్సిళ్లు, ప్రాంతీయ మండళ్లను పునరుద్ధరించి వాటిని నియమబద్ధంగా సంవత్సరానికి 2 సార్లు తప్పనిసరిగా సమావేశపరచాలి.
* రాష్ట్రంలోని ప్రాంతీయ విశ్వవిద్యాలయాలకు వైస్ చాన్సలర్లను నియమించే అధికారాన్ని గవర్నర్ నుంచి తప్పించాలి.
* రాష్ట్రపతిని పదవి నుంచి తొలగించడానికి ఏ విధంగా పార్లమెంటుకు అధికారం ఉందో, రాష్ట్రాల్లోని గవర్నర్లు రాజ్యాంగ ధిక్కరణకు పాల్పడినప్పుడు రాష్ట్ర శాసనసభలు 2/3వ వంతు మెజారిటీతో గవర్నర్లను తొలగించే అధికారాన్ని కల్పించాలి.
* మతపరమైన సంఘర్షణలు జరిగిన ప్రాంతాల్లో కేంద్రం తన సాయుధ బలగాలను పరిమిత కాలానికి రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో సంబంధం లేకుండానే మోహరించవచ్చు.
* ప్రణాళికా సంఘం దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తుంది. అది కేవలం రాష్ట్రాల ప్రయోజనాలను సమన్వయపరచే సాధనంగా మాత్రమే పనిచేయాలి. కానీ రాష్ట్రాలపై ఆధిపత్యాన్ని వహించే సంస్థగా పనిచేయకూడదు.
* రాష్ట్రాల్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడినప్పుడు ప్రభుత్వాల ఏర్పాటు విషయంలోనూ, అదే విధంగా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు మెజారిటీ కోల్పోయినప్పుడు ఆ ప్రభుత్వాలకు మెజారిటీ నిరూపించుకునే అవకాశాన్ని కల్పించడంలోనూ గవర్నర్లు తీసుకోవాల్సిన నిర్ణయాలపై రాజ్యాంగం ద్వారా కొన్ని మార్గదర్శక సూత్రాలను ఏర్పాటు చేయాలి.
* రాష్ట్ర గవర్నర్‌కు కల్పించిన విచక్షణాధికారాల విషయంలో విస్తృతమైన చర్చ చేయడంతో పాటు ఆ అధికారాల్లో సహేతుకమైన పరిమితులను విధించాలి.
* రాజ్యాంగంలోని ఆర్టికల్ 307లో పేర్కొన్న విధంగా రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని సాధించేందుకు జాతీయ స్థాయిలో ఒక అంతర్ రాష్ట్ర వ్యాపార వాణిజ్య మండలిని ఏర్పాటు చేయాలి.
* ప్రణాళికా సంఘం, ఆర్థిక సంఘం మధ్య సమన్వయాన్ని సాధించాలి. దీనికోసం అవసరమైతే నిపుణుల కమిటీని నియమించడం ద్వారా ప్రణాళికా లక్ష్యాలకు అనుగుణంగా నిధులను కేటాయించాలి.
* కొన్ని ప్రత్యేకమైన తీవ్ర ఇబ్బందులు కలిగిన ప్రదేశాలను పరిమిత కాలం పాటు కేంద్ర పాలనలోకి తీసుకొచ్చేందుకు ఆర్టికల్ 355, 356 ల్లో సవరణ చేయాలి.
* స్థానిక సంస్థలకు అధికారాల బదిలీకి చట్టబద్ధతను కల్పించాలి.
* జాతీయ సమగ్రతా మండలికి రాజ్యాంగ హోదాను కల్పించాలనే లిబర్‌హాన్ కమిషన్ అభిప్రాయాన్ని పూంచీ కమిషన్ వ్యతిరేకించింది.
* జాతీయ సమగ్రతా మండలి కనీసం సంవత్సరానికి రెండు సార్లు సమావేశం కావాలి.
* రాష్ట్రాల మధ్య సమానత్వాన్ని సాధించడానికి రాజ్యసభలో రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యాన్ని కల్పించాలి.
* గవర్నర్లను రాజకీయ ఫుట్‌బాల్ లా వ్యవహరించడాన్ని నిలువరించి, వారి పదవీ కాలాన్ని 5 సంవత్సరాలుగా నిర్దేశించాలి.
* రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన పూర్తి స్థాయి మెజారిటీ రాని పక్షంలో గవర్నర్ పాటించాల్సిన విధాన క్రమాన్ని కమిషన్ కింది విధంగా పేర్కొంది.
ఎ. ఎన్నికల కంటే ముందే సంకీర్ణ కూట‌మిగా పార్టీల‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ మొదటగా ఆహ్వానించాలి (లేదా)
బి. ఇతరుల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగిన అతిపెద్ద పార్టీని ఆహ్వానించాలి (లేదా)
సి. ఎన్నికల తర్వాత కొన్ని పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగిన బలం ఉంటే వారిని ఆహ్వానించాలి (లేదా)
డి. ఎన్నికల తర్వాత కొన్ని పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగి (లేదా) బయట నుంచి స్వతంత్ర అభ్యర్థుల మద్దతు కూడా కలిగిన సంకీర్ణాన్ని ఆహ్వానించాలి.


* గవర్నర్ల నియామకంలో కింది కమిటీ సూచనను అనుసరించి రాష్ట్రపతి గవర్నర్లను నియమించాలి.
ఎ. ప్రధానమంత్రి - ఛైర్మన్
బి. కేంద్ర హోంశాఖ మంత్రి - సభ్యుడు
సి. లోక్‌సభ స్పీకర్ - సభ్యుడు
డి. లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకులు - సభ్యులు
ఇ. సంబంధిత రాష్ట్ర ముఖ్యమంత్రి - సభ్యుడు
ఎఫ్. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ - సభ్యుడు
* అంతర్ రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి అంతర్ రాష్ట్ర ఆర్థిక మంత్రుల కమిటీని ఏర్పాటు చేసినట్లే ఆరోగ్య, పర్యావరణ రంగాల్లో ఏర్పాటు చేయాలి. వీటిని సమీక్షించడానికి ముఖ్యమంత్రుల ఫోరంను నియమించాలి.

 

ఆనందపూర్ సాహెబ్ తీర్మానం
* పంజాబ్‌కు చెందిన అకాలీదళ్ పార్టీ 1973లో ఆనందపూర్ సాహెబ్ గ్రామంలో సమావేశమై పంజాబ్ రాష్ట్రానికి సంబంధించిన కొన్ని సమస్యలు, సిక్కు మతానికి సంబంధించిన అంశాలు, కేంద్ర రాష్ట్ర సంబంధాలపై కొన్ని తీర్మానాలు ఆమోదించింది.
అవి:
* కేంద్రం తరచుగా రాష్ట్రాల విషయాల్లో జోక్యం కల్పించుకోవడానికి అవకాశం కల్పించే ఆర్టికల్ 356, 357, 365లను రాజ్యాంగం నుంచి తొలగించాలి.
* భారత్‌ను అమెరికాతరహా సమాఖ్యగా ఏర్పాటు చేయాలి.
* రాజ్యాంగంలో పేర్కొన్న అధికారాల పంపిణీని పునర్విభజన చేస్తూ రాష్ట్రాలకు ఎక్కువ అధికారాలను కల్పించాలి.
* జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యత ఉన్న దేశ రక్షణ, విదేశీ వ్యవహారాలు, కమ్యూనికేషన్, కరెన్సీ, బ్యాంకింగ్, ఆయుధాలు లాంటి విషయాలను కేంద్రానికి నిర్దేశించి, మిగిలిన అధికారాలను రాష్ట్రాలకు బదిలీ చేయాలి.
* కశ్మీర్‌కు కేటాయించిన విధంగానే పంజాబ్ రాష్ట్రానికి కూడా ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించాలి.
* ప్రస్తుత ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి దాని స్థానంలో రాజ్యాంగబద్ధ సంస్థను స్వతంత్ర ప్రాతిపదికపై ఏర్పాటు చేయాలి.
* అన్ని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం కల్పించే విధంగా అంతర్ రాష్ట్ర మండలిని ఏర్పాటు చేయాలి.
* గవర్నర్ వ్యవస్థను తక్షణం రద్దు చేయాలి.


మొదటి పరిపాలనా సంస్కరణల సంఘం
* మన దేశంలో 4వ సాధారణ ఎన్నికల అనంతరం 1967లో అనేక రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు, ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వచ్చాయి. ఇవి రాష్ట్రాలకు ఎక్కువ అధికారాలు కావాలనే డిమాండును ప్రారంభించాయి. ఇందిరా గాంధీ ప్రభుత్వం మొరార్జీ దేశాయ్ అధ్యక్షతన మొదటి పరిపాలనా సంఘాన్ని నియమించింది.
* మొరార్జీ దేశాయ్ మొదటి పరిపాలనా సంస్కరణల సంఘం ఛైర్మన్ పదవికి రాజీనామా చేయడంతో కె.హనుమంతయ్య ఈ కమిషన్‌కు ఛైర్మన్‌గా వ్యవహరించారు.
* కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై అధ్యయనం కోసం మొదటి పరిపాలనా సంస్కరణల సంఘం ఎం.సి.సెతల్వాడ్ నేతృత్యంలో ఒక అధ్యయన బృందాన్ని కూడా నియమించింది.
* మొదటి పరిపాలనా సంస్కరణల సంఘం తన తుది నివేదికను 1969లో సమర్పించింది. ఈ నివేదికలో 22 సిఫార్సులు ఉన్నాయి.


సిఫార్సులు
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆదాయ పంపిణీ కేంద్ర ఆర్థిక సంఘం సూచనలను అనుసరించి మాత్రమే జరగాలి.
* వివాదాస్పదం కాని వ్యక్తులను మాత్రమే గవర్నర్లుగా నియమించాలి.
* రాష్ట్రాలకు ఎక్కువ అధికారాలను కల్పించడానికి రాజ్యాంగాన్ని సవరించాల్సిన అవసరం లేదు.
* ఆర్టికల్ 263 ప్రకారం అంతర్ రాష్ట్ర మండలిని ఏర్పాటు చేయాలి.
* ఆర్టికల్ 356 దుర్వినియోగం కాకుండా చూడాలి.
* రాష్ట్రాల కోరిక మేరకే కేంద్రం బలగాలను పంపాలి.
* రాష్ట్రాలకు మరిన్ని ఆర్థిక వనరులను బదిలీ చేయాలి.


రెండో పరిపాలనా సంస్కరణల సంఘం
   

ప్రభుత్వ పాలనలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడానికి భారత ప్రభుత్వం 2005లో వీరప్ప మొయిలీ అధ్యక్షతన రెండో పరిపాలనా సంస్కరణల సంఘాన్ని నియమించింది. దీని నిర్మాణం
1. వీరప్ప మొయిలీ - ఛైర్మన్
2. వి.రామచంద్రన్ - సభ్యుడు
3. వి.హెచ్.కర - సభ్యుడు
4. డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ - సభ్యుడు
5. డాక్టర్ వినీతారాయ్ - సభ్య కార్యదర్శి
* ఈ కమిషన్ ప్రభుత్వ పాలనా వ్యవస్థను సమగ్రంగా పునర్ వ్యవస్థీకరించడానికి బాధ్యతాయుత, సమర్థవంతమైన పాలనకు సంబంధించి మొత్తం 15 నివేదికలను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. అవి:
1. రైట్ టు ఇన్‌ఫర్మేషన్, మాస్టర్ కీ టు గుడ్ గవర్నెన్స్
2. అన్‌లాకింగ్ హ్యూమన్ కాపిటల్, ఎన్‌టైటిల్‌మెంట్ అండ్ గవర్నెన్స్: ఎ కేస్‌స్టడీ.
3. క్రైసిస్ మేనేజ్‌మెంట్
4. ఎథిక్స్ ఇన్ గవర్నెన్స్
5. పబ్లిక్ ఆర్డర్
6. లోకల్ గవర్నెన్స్
7. కెపాసిటీ బిల్డింగ్ ఫర్ కాన్‌ఫ్లిక్ట్ రిజల్యూషన్
8. కంబాటింగ్ టెర్రరిజమ్: ప్రొటెక్టింగ్‌బై రైటియస్‌నెస్
9. సోషల్ కాపిటల్: ఎ షేర్డ్ డెస్టినీ
10. రిఫర్‌బిషింగ్ ఆఫ్ పర్సనల్ అడ్మినిస్ట్రేషన్: స్కేలింగ్ న్యూ హైట్స్
11. ప్రమోటింగ్ ఈ-గవర్నెన్స్: ద స్మార్ట్ వే ఫార్వర్డ్
12. సిటిజన్ సెంట్రిక్ అడ్మినిస్ట్రేషన్
13. ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా
14. ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషన్
15. స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్


రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్
    50 సంవత్సరాల భారత రాజ్యాంగాన్ని పునఃసమీక్ష చేయడానికి అటల్ బిహారి వాజ్‌పేయీ ప్రభుత్వం 2000 సంవత్సరంలో జస్టిస్ ఎం.ఎన్.వెంకటాచలయ్య అధ్యక్షతన 11 మంది సభ్యులతో ఒక కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ దేశంలోని కేంద్ర, రాష్ట్ర సంబంధాల్లో రావాల్సిన మార్పులను సిఫార్సు చేసింది.


సిఫార్సులు
* విశిష్ట వ్యక్తులను, వివాదాస్పదం కాని వ్యక్తులను మాత్రమే గవర్నర్లుగా నియమించాలి.
* రాష్ట్ర శాసనసభ ఆమోదించి పంపిన బిల్లులపై గవర్నర్లు 6 నెలల్లోగా తమ నిర్ణయం తెలిపే విధంగా రాజ్యాంగ సవరణ చేయాలి.
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యష్టిగానూ, సమష్టిగానూ అంతర్ రాష్ట్ర మండలి ద్వారా సహకార సమాఖ్య విధానాన్ని నెలకొల్పేందుకు కృషి చేయాలి.
* స్థానిక స్వపరిపాలనా సంస్థలకు అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చడానికి 11, 12వ షెడ్యూళ్లలో సవరణలు చేయడానికి రాజ్యాంగ సవరణ చేయాలి.
* ప్రకృతి సంబంధమైన విపత్తు నిర్వహణ అనే అంశాన్ని ఉమ్మడి జాబితాలో చేర్చాలి.
* అంతర్ రాష్ట్ర నదీ జలాలపై ముగ్గురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో కూడిన ఒక ట్రైబ్యునల్ నిర్ణయం తీసుకోవాలి.
* 3 నెలల్లోగా ఈ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పులు అమలు అయ్యేలా చూడాలి. దీన్ని పాటించని రాష్ట్రాలపై కేంద్రం చర్యలు తీసుకోవాలి.
* కేంద్ర ప్రభుత్వం గవర్నర్లను నియమించేటప్పుడు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పనిసరిగా సంప్రదించే విధంగా రాజ్యాంగ సవరణ చేయాలి.
* పార్లమెంటు ఆమోదం అనంతరమే ఏదైనా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధించాలి.


పశ్చిమ బెంగాల్ వామపక్ష ప్రభుత్వ తీర్మానం
   జ్యోతిబసు నాయకత్వంలో 1977లో పశ్చిమబెంగాల్‌లో అధికారానికి వచ్చిన వామపక్ష ప్రభుత్వం కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై ఒక తీర్మానాన్ని ఆమోదించింది. దీనిలో ముఖ్యాంశాలు
* గవర్నర్ వ్యవస్థను, ఆర్టికల్ 355, 356, 365లను తొలగించాలి.
* లోక్‌సభతో పాటు రాజ్యసభకు సమాన అధికారాలను కల్పించాలి.
* అఖిల భారత సర్వీసులను రద్దు చేయాలి.
* బలమైన కేంద్ర ప్రభుత్వంతో పాటు బలమైన రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ఏర్పాటు చేయాలి.


నీతి ఆయోగ్
  1950లో జవహర్‌లాల్ నెహ్రూ ఏర్పాటు చేసిన ప్రణాళికా సంఘంను రద్దు చేసి దాని స్థానంలో 2014, ఆగస్టు 13న నీతి ఆయోగ్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రివర్గ తీర్మానం ద్వారా నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. నీతి ఆయోగ్ భారతీయతతో కూడిన అభివృద్ధి ప్రణాళికలకు అంకురార్పణ చేస్తుందని తీర్మానంలో పేర్కొన్నారు. ఈ తీర్మానానికి అనుగుణంగా 2015, జనవరి 1న నీతి ఆయోగ్ ఏర్పడింది.
* నీతి ఆయోగ్ (NITI Aayog) అంటే National Institution for Transforming India Aayog (భారతీయ జాతీయ పరివర్తన సంస్థ)


నీతి ఆయోగ్ విశేషాలు
* నీతి ఆయోగ్‌కు అనేక అర్థాలున్నా పాలసీ కమిషన్ అనే అర్థాన్ని గ్రహించాలి.
* నీతి ఆయోగ్ అనేది ఒక సలహాపూర్వక సంస్థ (Advisory Board).
* దీనిని మేథోనిలయం (Think Tank) గా, జ్ఞాన ఆవిష్కరణల స్థావరం ((Knowledge and Innovation)గా వర్ధిల్లుతుంది. సహకార సమాఖ్యను స్థాపించడం నీతి ఆయోగ్ లక్ష్యం.


నీతి ఆయోగ్ లక్ష్యాలు
* జాతీయ, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాల మధ్య సహకారం పెంపొందించి, ఆయా ప్రభుత్వాలు ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లను సమష్టిగా పరిష్కరించడం ద్వారా సహకార సమాఖ్య (Cooperative Federalism) సాధన కోసం కృషి చేయడం.
* ఆర్థికాంశాలతో పాటు జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యం ఉన్న విషయాలపై సూచనలు ఇవ్వడం.
* జాతీయ అభివృద్ధి ప్రాధాన్యతలు, ప్రధాన రంగాల అభివృద్ధి వ్యూహాలను రాష్ట్రాలతో చర్చించి, వారి అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం.
* దేశ ప్రజలందరికీ సమాన అవకాశాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు కృషి చేయడం.
* ఆర్థిక వ్యూహాలు, విధానాల్లో భాగంగా జాతీయ భద్రతకు సంబంధించి అంశాలను పునఃసమీక్షించడం.
* ఆర్థిక పురోగతిని అందుకోలేని సమాజ అభ్యున్నతిపై ప్రత్యేక దృష్టిని నిలపడం.
* గ్రామీణ స్థాయిలో విలువను చేకూర్చే ప్రణాళికలను రూపొందించి అవసరమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం.


నీతి ఆయోగ్ విధులు
* భారతదేశానికి అవసరమైన వ్యూహాత్మక, దీర్ఘకాలిక విధానాలు, కార్యక్రమాలను రూపొందించడం. వాటి అమలును, ప్రగతిని పర్యవేక్షించడం.
* ఆర్థిక, విధానపరమైన అంశాలకు సంబంధించి వ్యూహాత్మక, సాంకేతిక సలహాలతో కూడిన జాతీయ కార్యక్రమాలను సిఫార్సు చేయడం.
* సుస్థిర, సమాన ప్రగతికి అనుసరించాల్సిన అభిలషణీయ విధానాలు, సుపరిపాలనకు అవసరమైన విధానాలపై పరిశోధనలు చేయడానికి అత్యాధునిక వనరుల కేంద్రాన్ని నిర్వహించడం.
* ఆర్థిక ప్రగతి ఫలితాలను పొందడంలో విఫలమైన అట్టడుగు వర్గాలకు వాటిని చేరవేయడం.
* రాష్ట్రాల క్రియాశీలక భాగస్వామ్యంతో జాతీయాభివృద్ధికి అవసరమైన ప్రాధాన్యతలు, రంగాలు, వ్యూహాలను రూపొందించడం.
* జాతీయ, అంతర్జాతీయ వ్యాపార నిపుణులు, ప్రాక్టీషనర్లు తదితరుల సహకారంతో వ్యాపారాభివృద్ధికి అవసరమైన విజ్ఞానవంతమైన, వినూత్న మద్దతు వ్యవస్థను ఏర్పాటు చేయడం.
* గ్రామీణ స్థాయిలో ప్రణాళికల రూపకల్పనకు అవసరమైన యంత్రాంగాన్ని అభివృద్ధి చేయడం.
* ఆర్థిక విధానాలు, వ్యూహాల రూపకల్పనలో జాతీయ భద్రత, ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యతను ఇవ్వడం.


నీతి ఆయోగ్ నిర్మాణం
* నీతి ఆయోగ్‌కు ప్రధానమంత్రి ఎక్స్ అఫీషియో అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు.
* దీనికి ఒక ఉపాధ్యక్షుడిని ప్రధానమంత్రి నియమిస్తారు.
* అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లతో కూడిన పాలకమండలి ఉంటుంది.
* నీతి ఆయోగ్‌కు ఒక సెక్రటేరియట్ ఉంటుంది.
* నలుగురు కేంద్ర మంత్రులను ఎక్స్ అఫీషియో సభ్యులుగా ప్రధాని నియమిస్తారు.
* విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థల నుంచి ఇద్దరిని పూర్తి కాల సభ్యులుగా నియమిస్తారు.
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమలకు సంబంధించిన నిపుణులతో కూడిన 4 డివిజన్లు నీతి ఆయోగ్‌లో ఉన్నాయి. అవి:
1. అంతర్ రాష్ట్ర మండలి
2. ప్రణాళికా మూల్యాంకనం
3. ఆఫీస్, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా
4. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్


నీతి ఆయోగ్ సభ్యులు
     అధ్యక్షులు
     ఉపాధ్యక్షుడు
     పరిపాలక మండలి - అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు
నీతి ఆయోగ్ ఎక్స్ అఫీషియో సభ్యులు
     1. అరుణ్ జైట్లీ - కేంద్ర ఆర్థిక మంత్రి
     2. రాజ్‌నాథ్‌సింగ్ - కేంద్ర హోంమంత్రి
     3. సురేష్ ప్రభు - రైల్వే మంత్రి
     4. రాధామోహన్ సింగ్ - కేంద్ర వ్యవసాయ మంత్రి


నీతి ఆయోగ్ పూర్తి కాల సభ్యులు
     1. వి.కె.సారస్వత్
     2. బిబేక్ దేబ్రాయ్
* నీతి ఆయోగ్‌కు ముఖ్య కార్యనిర్వహణాధికారి - సింధుశ్రీ ఖుల్లర్ (భారత ప్రభుత్వ కార్యదర్శి హోదా)
* నీతి ఆయోగ్ సామాజిక విభాగానికి ప్రధాన సలహాదారుగా ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి రతన్‌వాటల్ నియమితులయ్యారు.
* 2015, ఫిబ్రవరి 6న 'నీతి ఆయోగ్ మొదటి సమావేశం 'టీమ్ ఇండియా పేరుతో న్యూదిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తప్ప మిగిలిన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు హాజరయ్యారు.
* ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ (అందరితో కలిసి అందరి అభివృద్ధి) అనేది నీతి ఆయోగ్ లక్ష్యమని వ్యాఖ్యానించారు.
* 2015, జులై 15న 'నీతి ఆయోగ్ రెండో సమావేశం న్యూదిల్లీలో జరగగా 16 రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు.
* గోదావరి పుష్కర వివాదం వల్ల ఈ సమావేశానికి హాజరు కాలేనని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రధానికి సమాచారం అందించారు.
* రెండో సమావేశాన్ని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు బహిష్కరించారు.

 


నీతి ఆయోగ్, ప్రణాళికా సంఘాల మధ్య వ్యత్యాసాలు

నీతి ఆయోగ్ ప్రణాళికా సంఘం
* నీతి ఆయోగ్ కేవలం సలహా సంఘం మాత్రమే. దీనికి నిధులు కేటాయించే అధికారం లేదు * జాతీయ, రాష్ట్ర స్థాయిలో దీనికి నిధులు కేటాయించే అధికారం ఉంది
* నీతి ఆయోగ్‌లో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కీలక పాత్ర పోషిస్తాయి. * రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు జాతీయాభి వృద్ధి మండలి సమావేశాలకు, వార్షిక ప్రణాళికా సమావేశాలకు మాత్రమే పరిమితమవుతాయి.
* విధానాల రూపకల్పన, నిధుల కేటాయింపు విషయాల్లో రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను నీతి ఆయోగ్ తప్పనిసరిగా సంప్రదించాలి. వీటి ఆమోదంతోనే అంతిమ విధానాన్ని ప్రకటిస్తుంది. * ముందుగా ప్రణాళికా సంఘం విధానాలను రూపొందిస్తుంది. తర్వాత నిధుల కేటాయింపు కోసం రాష్ట్రాలను సంప్రదిస్తుంది.
* నీతి ఆయోగ్ కేవలం ఒక సలహాలిచ్చే మేధో నిలయం మాత్రమే. తాను రూపొందించిన విధానాలను అమలు చేసే అధికారం లేదు. * ప్రణాళికా సంఘం తన విధానాలను రాష్ట్రాలపై బలవంతంగా అమలు చేస్తుంది.
* నీతి ఆయోగ్ ప్రధాన లక్ష్యం కోఆపరేటివ్ ఫెడరి లిజం సాధించడం. ప్రధాని నరేంద్ర మోదీ అభి ప్రాయం ప్రకారం విధాన నిర్ణయీకరణ ప్రక్రియ పైనుంచి కింది స్థాయికి, కింది నుంచి పైస్థాయికి మారాల్సిన అవసరం ఉంది. * ప్రణాళిక సంఘంలో ఇలాంటి దృక్పథం లేదు. కేంద్ర నిర్ణయాలను రాష్ట్రాలు తప్పనిసరిగా పాటించాల్సిందే.
Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

సర్కారియా కమిషన్

* కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై అధ్యయనం కోసం ఇందిరా గాంధీ ప్రభుత్వం 1983లో మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయిన రంజిత్‌సింగ్ సర్కారియా అధ్యక్షతన బి.శివరామన్, ఎస్.ఆర్.సేన్ సభ్యులుగా ఒక కమిషన్‌ను నియమించింది.
* ఈ కమిషన్‌కు ఆర్.ఎం.సుబ్రహ్మణ్యంను కార్యదర్శిగా, ఎల్.ఎన్. సిన్హాను రాజ్యాంగ సలహాదారుగా నియమించారు.
* సర్కారియా కమిషన్ 247 సిఫార్సులతో కూడిన నివేదికను 1987, అక్టోబరు 27న రాజీవ్‌గాంధీ ప్రభుత్వానికి సమర్పించింది.
* 1988, జనవరిలో ఈ నివేదికను వెలువరించారు.
* మొత్తం 247 సిఫార్సుల్లో 170 సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం అమలు చేసింది

సిఫార్సులు
గవర్నర్ వ్యవస్థ
* గవర్నర్లను నియమించే ముందు కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా సంబంధిత రాష్ట్ర ముఖ్యమంత్రిని సంప్రదించాలి.
* గవర్నర్ల పేర్లను సూచించడానికి ప్రధాని అధ్యక్షతన ఒక స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేయాలి.
* ఒక వ్యక్తిని తన సొంత రాష్ట్రానికి గవర్నర్‌గా నియమించకూడదు.
* వివాదాస్పదం కాని, విశిష్టమైన వ్యక్తిత్వం ఉన్నవారిని మాత్రమే గవర్నర్‌గా నియమించాలి.
* గవర్నర్ పదవిని నిర్వహించినవారు పదవీ విరమణ అనంతరం తిరిగి క్రియాశీలక రాజకీయాల్లోకి ప్రవేశించకూడదు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులకు పోటీ చేయవచ్చు.
* గవర్నర్లకు ప్రవర్తనా నియమావళిని ఏర్పాటు చేయాలి.
* కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి చెందిన వ్యక్తులను ఇతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు గవర్నర్లుగా నియమించకూడదు.
* ఆర్టికల్ 356ను చివరి అస్త్రంగా మాత్రమే వినియోగించాలి.
* శాసనసభకు సభ్యుల నియామకం విషయంలో గవర్నర్‌కు విచక్షణాధికారం ఉండకూడదు.
* గవర్నర్ విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్‌గా వ్యవహరించేటప్పుడు స్వతంత్రంగా వ్యవహరించవచ్చు.
* ఒక రాష్ట్ర ప్రభుత్వం ఆపద్ధర్మ ప్రభుత్వంగా కొనసాగే వీలు లేనప్పుడు గవర్నర్ విధాన సభను రద్దు చేయకుండా రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయాలి.
* గవర్నర్ తన విచక్షణాధికారాన్ని గత్యంతరం లేని పరిస్థితుల్లో చిట్టచివరి అస్త్రంగా మాత్రమే వినియోగించాలి.
* బ‌ల‌మైన కార‌ణం ఉంటే త‌ప్ప గ‌వ‌ర్నర్‌ని తొల‌గించ‌రాదు.
* ఏదైనా రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఏర్పడినప్పుడు, ప్రభుత్వ యంత్రాంగం పని చేయలేని పరిస్థితి ఏర్పడినప్పుడు, కేంద్ర ప్రభుత్వ రాజ్యాంగపరమైన ఆదేశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ధిక్కరించినప్పుడు మాత్రమే రాష్ట్రపతి పాలన విధించాలి.
* గవర్నర్‌ను ఎంపిక చేసే ముందు అల్ప సంఖ్యాక వర్గాల వారికి సముచిత ప్రాధాన్యతను కల్పించాలి.

ఆర్థిక సంబంధాలు
* కేంద్రం ఇచ్చిన వనరులను దుర్వినియోగం చేసినట్లయితే రాష్ట్రాలను శిక్షించే విధంగా చర్యలు తీసుకోవచ్చు.
* బ్యాంకుల నుంచి ఒక సంవత్సర కాల వ్యవధికి అప్పు తీసుకునే హక్కు రాష్ట్రాలకు ఉండాలి.
* వివిధ రాష్ట్రాల నుంచి ఆర్థిక నిపుణులను ఆర్థిక సంఘంలో నియమించి వారి సేవలను ఉపయోగించుకోవాలి.
* విపత్కర పరిస్థితుల్లో కాల పరిమతి లేని రుణాలను రాష్ట్రాలకు అందించాలి.
* జాతీయాభివృద్ధి మండలి పేరును జాతీయ ఆర్థికాభివృద్ధి మండలిగా మార్చాలి.
* ఆర్థిక సంఘం సూచించిన పద్ధతిలో రైల్వే ప్రయాణికుల నుంచి వచ్చిన ఆదాయంలో రాష్ట్రాలకు వాటా కల్పించాలి.
* కార్పొరేషన్ పన్నులో కొంత భాగాన్ని రాష్ట్రాలకు ఇవ్వాలి.

శాసన సంబంధాలు
* అన్ని రకాల సూచనలు చేసిన తర్వాత మాత్రమే కేంద్రం రాష్ట్రాలకు ఆర్టికల్ 365 ప్రకారం ఆదేశాలను జారీ చేయాలి.
* భాషాపరమైన అల్పసంఖ్యాక వర్గాల వారికి ప్రత్యేక కమిషన్‌ను నియమించి క్రియాత్మకం చేయాలి.
* అవశిష్ట అంశాల్లోని పన్నులకు సంబంధించిన అధికారం పార్లమెంటు పరిధిలోనే ఉండాలి.
* అఖిల భారత సర్వీసుల ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వాలు క్రమశిక్షణా చర్యలు తీసుకోకూడదు.
* నూతన అఖిల భారత సర్వీసులను ఏర్పాటు చేయాలి.
* కేంద్ర, రాష్ట్ర సంబంధాలను మెరుగుపరచడానికి శాశ్వత ప్రాతిపదికన అంతర్ రాష్ట్ర మండలిని ఏర్పాటు చేయాలి.
* ఈ విధంగా ఏర్పాటైన అంతర్ రాష్ట్ర మండలికి ప్రధాని అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉండాలి.

ఇతర అంశాలు
* ప్రసారభారతికి స్వయం ప్రతిపత్తిని కల్పించాలి.
* ప్రజాస్వామ్య వికేంద్రీకరణలో భాగంగా స్థానిక స్వపరిపాలనా సంస్థలకు నియమబద్ధంగా ఎన్నికలు జరపాలి.
* శాంతి భద్రతలు క్షీణించినప్పుడు ఆయా రాష్ట్రాలు కోరనప్పటికీ కేంద్రం సాయుధ బలగాల్ని పంపవచ్చు.
* దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి ఆర్థిక నిపుణులతో కూడిన ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేసి, వారి సేవలను వినియోగించాలి.
* భారత్‌లో త్రిభాషా సూత్రాన్ని అన్ని రాష్ట్రాల్లో తప్పనిసరిగా అమలుచేయాలి.
* ఉమ్మడి జాబితాలోని ఏదైనా ఒక అంశంపై కేంద్రం చట్టాలను చేసేటప్పుడు రాష్ట్రాల అభిప్రాయాలను, వాటి ప్రయోజనాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి.
* శాసనమండలి రద్దు లేదా ఏర్పాటు విషయంలో పార్లమెంటు నిర్ణీత సమయంలోనే తన అభిప్రాయాన్ని తెలియజేయాలి.
* గనులకు సంబంధించిన విషయాల్లో రాష్ట్రాల అభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
* జాతీయ వ్యవహారాల విషయంలో కేంద్రం, రాష్ట్రాలు తరచూ సంప్రదింపులు జరపాలి.
* జోనల్ కౌన్సిళ్లను పునర్ వ్యవస్థీకరించాలి.
* భారతదేశ సమష్టి, సంస్కృతిని సంరక్షించేందుకు జాతీయ కార్యక్రమాలను ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేయాలి.

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారత రాజ్యాంగం సమాఖ్య, ఏక కేంద్ర లక్షణాలు

* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న సంబంధాల ఆధారంగా ప్రభుత్వ వ్యవస్థను సమాఖ్య, ఏక కేంద్ర ప్రభుత్వాలుగా వర్గీకరించవచ్చు.
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాల విభజన ఉంటే సమాఖ్య వ్యవస్థగానూ, అధికారాలన్నీ కేంద్రం గుప్పిట్లో ఉంటే ఏక కేంద్ర ప్రభుత్వ వ్యవస్థగానూ పేర్కొంటారు.
* సమాఖ్య అనే పదాన్ని ఆంగ్లంలో Federation అంటారు. ఈ పదం లాటిన్ భాషలోని ఫోడస్ (Foedus) అనే పదం నుంచి ఆవిర్భవించింది. ఫోడస్ అంటే ఒప్పందం.
* 'ప్రతిదీ రాజ్యాంగం వల్ల పుట్టి, రాజ్యాంగం చేత నియంత్రితమయ్యే అనేక సమన్వయ అంశాల మధ్య రాజ్యాధికారాలను పంచడమే సమాఖ్య అని ఎ.వి. డైసీ పేర్కొన్నారు.


భారత సమాఖ్య ప్రభుత్వ లక్షణాలు
* భారత రాజ్యాంగంలో సమాఖ్య అనే పదాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. రాజ్యాంగంలో కేవలం రాష్ట్రాల యూనియన్‌గానే భారతదేశాన్ని పేర్కొన్నారు.
* 'భారత రాజ్యాంగం పరిస్థితులను బట్టి ఏకకేంద్రంగానూ, సమాఖ్యగానూ మార్పు చెందే స్వభావం గలది అని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ పేర్కొన్నారు.
* 1935 భారత ప్రభుత్వ చట్టం మన దేశ రాజ్యాంగానికి ప్రధాన ఆధారం.

 

భారత సమాఖ్యకు కింది లక్షణాలు ఉన్నాయి
అధికారాల విభజన
  సమాఖ్య మౌలిక లక్షణం అధికారాల విభజన. మన దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య 3 రకాల అధికారాల విభజన, పంపిణీ జరిగింది.
* భారత రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్‌లో రాజ్యాంగం 3 రకాలైన అధికారాల విభజన జరిపింది. అవి:
1. కేంద్ర జాబితా: దీనిలో ప్రారంభంలో 97 అంశాలుండగా ప్రస్తుతం 100 అంశాలు ఉన్నాయి.
2. రాష్ట్ర జాబితా: దీనిలో ప్రారంభంలో 66 అంశాలుండగా ప్రస్తుతం 61 అంశాలు గలవు
3. ఉమ్మడి జాబితా: దీనిలో ప్రారంభంలో 47 అంశాలుండగా ప్రస్తుతం 52 అంశాలు ఉన్నాయి.
* పైన పేర్కొన్న మూడు జాబితాల్లో లేని అంశాలను అవశిష్టాధికారాలు అంటారు. ఒక అంశం అవశిష్టాధికారమా? కాదా? అని సుప్రీంకోర్టు నిర్ణయిస్తుంది.


ద్వంద్వ ప్రభుత్వం
   సమాఖ్యలో జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో రెండు రకాల ప్రభుత్వాలు ఏర్పడి పనిచేస్తాయి. మన దేశంలో జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగం ద్వారా ఏర్పడి పనిచేస్తున్నాయి.

ద్విసభా విధానం
  సమాఖ్య విధానంలో కేంద్ర శాసన వ్యవస్థలో ద్విసభలు వర్ధిల్లుతాయి. ఎగువ సభ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తూ రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడుతుంది. మన దేశంలో కేంద్ర శాసనవ్యవస్థలో భాగంగా పార్లమెంటులో లోక్‌సభ, రాజ్యసభ ఉన్నాయి.
* మన దేశంలో రాజ్యసభ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. అందుకే రాజ్యసభను రాష్ట్రాల మండలి అంటారు.


లిఖిత రాజ్యాంగం
* సమాఖ్య వ్యవస్థ ప్రధాన లక్షణం లిఖిత రాజ్యాంగాన్ని కలిగి ఉండటం.
* భారత రాజ్యాంగం ప్రపంచ రాజ్యాంగాల్లో కెల్లా అత్యంత సుదీర్ఘమైంది. ప్రస్తుతం భారత రాజ్యాంగంలో 395 ఆర్టికల్స్, 22 భాగాలు, 12 షెడ్యూళ్లు ఉన్నాయి.
రాజ్యాంగ ఆధిక్యత
* సమాఖ్య వ్యవస్థలో ఆదేశ రాజ్యాంగమే అత్యున్నత శాసనంగా వర్ధిల్లుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, స్థానిక సంస్థలకు అధికారాలన్నీ రాజ్యాంగం నుంచే లభిస్తాయి.
* మన దేశంలో రాజ్యాంగమే అత్యున్నత శాసనంగా వర్ధిల్లుతుంది. రాజ్యాంగానికి వ్యతిరేకంగా రూపొందించే శాసనాలు చెల్లవు అని ఉన్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వగలదు.
సర్వోన్నత న్యాయవ్యవస్థ
* సమాఖ్య వ్యవస్థకు అతి ముఖ్యమైన లక్షణం న్యాయ వ్యవస్థ ఔన్నత్యం. మన దేశ రాజ్యాంగానికి సంరక్షకుడిగా సుప్రీంకోర్టు వ్యవహరిస్తుంది. సుప్రీంకోర్టు స్వయం ప్రతిపత్తిని కలిగి ఉండి, న్యాయ సమీక్షాధికారాన్ని కూడా కలిగి ఉంది. భారత రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించేది, రాజ్యాంగానికి అర్థ వివరణను ఇచ్చేది సుప్రీంకోర్టు మాత్రమే.
దృఢ రాజ్యాంగం
* భారత రాజ్యాంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సవరించడంలో అనేక పరిమితులు ఉన్నాయి. రాజ్యాంగ సవరణలో రాష్ట్రాల పాత్ర నామమాత్రం. రాజ్యాంగంలోని అనేక అంశాలను ఆర్టికల్ 368 ప్రకారం పార్లమెంటు సవరించాలంటే 2/3వ వంతు ప్రత్యేక మెజారిటీ ద్వారానే సాధ్యం. అంటే భారత రాజ్యాంగ సవరణా విధానం కఠినమైన పద్ధతిలో ఉంది.


రాజ్యాంగ సవరణలో రాష్ట్రాల పాత్ర
* భారత రాజ్యాంగంలోని కొన్ని సమాఖ్య లక్షణాలను సవరించాలంటే పార్లమెంటు 2/3 వ వంతు ప్రత్యేక మెజారిటీతో పాటు దేశంలోని మొత్తం రాష్ట్రాల్లో సగం కంటే ఎక్కువ రాష్ట్రాల ఆమోదం తప్పనిసరి.


భారత రాజ్యాంగంలోని ఏక కేంద్రం - లక్షణాలు 
బలమైన కేంద్ర ప్రభుత్వం
* వాస్తవ సమాఖ్యలో బలమైన రాష్ట్రాలు, బలహీనమైన కేంద్ర ప్రభుత్వం ఉంటాయి. మన దేశంలో రాజ్యాంగ నిర్మాతలు బలమైన కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు.
* కేంద్ర ప్రభుత్వం కేంద్ర జాబితాలోని 100 అంశాలపైన, రాష్ట్ర జాబితాలోని 61 అంశాలపైన, ఉమ్మడి జాబితాలోని 52 అంశాలపైన అసాధారణ పరిస్థితుల్లో శాసనాలు రూపొందించగలదు.
* ఆర్టికల్ 248 ప్రకారం అవశిష్ట అధికారాలన్నీ కేంద్రం గుప్పిట్లోనే ఉంటాయి.


ఏక పౌరసత్వం
* భారత్‌లోని భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించడానికి, దేశ సుస్థిరత, సమగ్రతలను పరిరక్షించడానికి రాజ్యాంగ నిర్మాతలు రెండో భాగంలో ఆర్టికల్ 5 నుంచి 11 వరకు భారతీయులందరికీ ఏక పౌరసత్వాన్ని ప్రసాదించారు.
* విచ్ఛిన్నకర శక్తులైన ప్రాంతీయతత్వం, స్థానికతత్వాలు బలపడకుండా భారతీయులంతా ఒకటే అనే ఉన్నత భావాన్ని పెంపొందించడానికి రాజ్యాంగ నిర్మాతలు ఏక పౌరసత్వాన్ని కల్పించారు.
* ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి ఉండటం వల్ల జమ్మూ కశ్మీర్ రాష్ట్ర పౌరులకు
ద్వంద్వ పౌరసత్వం ఉంది.

ఏకీకృత న్యాయవ్యవస్థ
* మన దేశంలో ఏకీకృత న్యాయవ్యవస్థ అమల్లో ఉంది. దీని ప్రకారం జాతీయ స్థాయిలో అత్యున్నత న్యాయస్థానంగా సుప్రీంకోర్టు వర్ధిల్లుతుంది. దీని తీర్పులు దేశంలోని మిగిలిన న్యాయస్థానాలన్నింటికీ శిరోధార్యమే. రాష్ట్రాల్లో ఉన్నత న్యాయస్థానాలుగా హైకోర్టులు వర్ధిల్లుతాయి. హైకోర్టులకు దిగువన సబార్డినేట్ కోర్టులు ఉంటాయి.


ఎన్నికల సంఘం
* భారత రాజ్యాంగం ఒకే ఒక ఎన్నికల సంఘాన్ని ఏర్పరచింది. ఈ ఎన్నికల సంఘానికి చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌ను, ఇతర కమిషనర్‌లను రాష్ట్రపతి నియమిస్తారు. పార్లమెంటు, రాష్ట్ర శాసనసభల ఎన్నికలను, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలను ఈ కేంద్ర ఎన్నికల సంఘమే నిర్వహిస్తుంది.
గవర్నర్ వ్యవస్థ
* రాజ్యాంగం ద్వారా రాష్ట్రానికి అధిపతి గవర్నర్. రాష్ట్ర పరిపాలనను మొత్తం గవర్నర్ పేరు మీదుగానే నిర్వహిస్తారు. గవర్నర్ల నియామకం, బదిలీలు, తొలగింపు మొదలైన అధికారాలన్నీ కేంద్రం పరిధిలోనే ఉంటాయి.
ఒకే రాజ్యాంగం
* భారతదేశం మొత్తానికి ఒకే రాజ్యాంగం అమల్లో ఉంటుంది. ఈ రాజ్యాంగం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు శిరోధార్యంగా, అత్యున్నత శాసనంగా వర్ధిల్లుతుంది.
* ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక స్వయం ప్రతిపత్తి ఉండటం వల్ల జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక రాజ్యాంగం ఉంది.


అత్యవసర పరిస్థితి అధికారాలు
¤ భారత రాజ్యాంగంలోని 18వ భాగంలో పేర్కొన్న 3 రకాల అత్యవసర పరిస్థితి అధికారాలు మన దేశ ఏక కేంద్ర లక్షణాలను ప్రతిఫలిస్తున్నాయి. అవి:
1. ఆర్టికల్ 352 - జాతీయ అత్యవసర పరిస్థితి
2. ఆర్టికల్ 356 - రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన
3. ఆర్టికల్ 360 - ఆర్థిక అత్యవసర పరిస్థితి


అఖిల భారత సర్వీసులు
* అఖిల భారత సర్వీసుల ఉద్యోగులను భారత ప్రభుత్వం తరఫున యూపీఎస్సీ ఎంపిక చేస్తుంది. వీరిని కేంద్ర ప్రతినిధులుగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కీలక పదవుల్లో నియమిస్తారు. కేంద్ర, రాష్ట్ర చట్టాలను అమలు చేస్తారు.
రాజ్యాంగ, రాజ్యాంగేతర సంస్థల అధిపత్యం
* ఆర్టికల్ 148 ద్వారా ఏర్పడిన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) రాష్ట్ర ప్రభుత్వాల ఖాతాలను తనిఖీ చేస్తారు.
* ఆర్టికల్ 280 ద్వారా ఏర్పడిన కేంద్ర ఆర్థిక సంఘం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆదాయ వనరుల పంపిణీని సిఫార్సు చేస్తుంది.
* ఆర్టికల్ 263 ద్వారా ఏర్పడిన అంతర్ రాష్ట్ర మండలి కేంద్రానికి, రాష్ట్రాలకు, వివిధ రాష్ట్రాల మధ్య తలెత్తే వివాదాలను పరిష్కరిస్తుంది.
* ఆర్టికల్ 365 ప్రకారం కేంద్రం జారీ చేసిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వాలు పాటించాలి.
* ఆర్టికల్ 275 ప్రకారం కేంద్రం తన ఇష్టానుసారం రాష్ట్రాలకు సహాయక గ్రాంట్లను మంజూరు చేస్తుంది.
* నీతి ఆయోగ్ కేంద్రం, రాష్ట్రాలు అనుసరించాల్సిన ప్రణాళికా విధానాలను రూపొందించి వాటి అమలును నియంత్రిస్తుంది.
* ప్రధాని అధ్యక్షతన ఉన్న జాతీయాభివృద్ధి మండలి రాష్ట్రాలను నియంత్రిస్తుంది.

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారత రాజ్యాంగంలోని సమాఖ్య లక్షణాలు - పరిశీలన

  జాతీయ, ప్రాంతీయ ప్రభుత్వాల స్వభావాలను అనుసరించి రాజనీతిజ్ఞులు ఏక కేంద్ర, సమాఖ్య ప్రభుత్వాలను వివరించారు. ఏకకేంద్ర ప్రభుత్వంలో అధికారాలన్నీ కేంద్ర ప్రభుత్వానికే ఉంటాయి. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నా, వాటికి అధికారం కేంద్రమే ఇస్తుంది. సమాఖ్య ప్రభుత్వంలో రాజ్యాంగమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాలను విభజిస్తుంది. రెండు ప్రభుత్వాలు స్వతంత్రంగా తమతమ పరిధుల్లో పని చేస్తాయి.

 సమాఖ్య - అర్థం
   'సమాఖ్య' లాటిన్ భాషలోని ఫోడస్ అనే పదం నుంచి వచ్చింది. ఫోడస్ అంటే ఒడంబడిక లేదా ఒప్పందం. సమాఖ్య కొన్ని రాష్ట్రాల సమితి. అయితే కొన్ని రాష్ట్రాలతో కూడిన ప్రతి సమితిని సమాఖ్య అనలేం. సమాఖ్యలో రాష్ట్రాలు ఉమ్మడి అంశాలపై ఏకరాజ్యంగా, ఇతర అంశాలపై స్వతంత్రంగా వ్యవహరిస్తాయి. ఇలా ఐక్యంగా, స్వతంత్రంగా పని చేయడానికి రాష్ట్రాలు, కేంద్రం మధ్య జరిగిన ఒప్పందమే సమాఖ్య.

 

 సమాఖ్య నిర్వచనం

 1987 లో డేనియల్ జె.ఎలాజర్ తను రచించిన ఎక్స్‌ప్లోరింగ్ ఫెడరేషన్ అనే పుస్తకంలో సమాఖ్య అంటే 'స్వయంపాలన భాగస్వామ్య పరిపాలన అనే విధానంలో సహజీవనం సాగించడం' అని పేర్కొన్నాడు.

 సమాఖ్య ఏర్పడే విధానం
 సమాఖ్య వ్యవస్థను ఏకీకరణ, వికేంద్రీకరణ అని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. ఏకీకరణ పద్ధతిలో సైనికపరంగా బలహీనమైన లేదా ఆర్థికంగా వెనుకబడిన స్వతంత్ర రాజ్యాలన్నీ కలసి ఒక శక్తివంతమైన పెద్ద యూనిట్‌గా ఏర్పడతాయి. ఉదాహరణ: అమెరికా
  వికేంద్రీకరణ పద్ధతిలో ఒక పెద్ద ఏకకేంద్రరాజ్యం సమాఖ్య వ్యవస్థగా మారి, ప్రాంతీయ ప్రయోజనాలను పెంపొందించడానికి ప్రావిన్స్‌లను ఏర్పరచి వాటికి స్వతంత్ర ప్రతిపత్తి ఇస్తుంది. ఉదాహరణ: కెనడా.

 

భారత రాజ్యాంగం - సమాఖ్య భావన

 భారత రాజ్యాంగంలో సమాఖ్య (Federation) అనే పదాన్ని ఎక్కడా వాడలేదు. అయితే రాజ్యాంగంలోని మొదటి ప్రకరణం భారతదేశాన్ని ఒక 'రాష్ట్రాల యూనియన్ (Union of States) 'అని పేర్కొంది. రాష్ట్రాల సమాఖ్య అని కాకుండా యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనే పదానికి ప్రాధాన్యం ఇవ్వడానికి రెండు అంశాలను డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ వివరించారు. అవి.. 1) అమెరికా సమాఖ్యలా రాష్ట్రాల మధ్య ఒప్పందంతో భారత్ సమాఖ్య ఏర్పడలేదు. 2) సమాఖ్య నుంచి రాష్ట్రాలకు విడిపోయే అధికారం లేదు. విచ్ఛిన్నం కాని సమాఖ్య భారత్ యూనియన్.

 సమాఖ్య లక్షణాలు - పరిశీలన


కేంద్ర-రాష్ట్రాల మధ్య రాజ్యాంగబద్ధ అధికార విభజన
‣ ఇది అతి ముఖ్యమైన సమాఖ్య లక్షణం. సమాఖ్యలో కేంద్ర రాష్ట్రాలు రాజ్యాంగం నుంచే అధికారాన్ని పొందుతాయి. సమాఖ్య స్వరూపం ఎలాంటిదైనా, ఏ పద్ధతిలో సమాఖ్య ఏర్పడినా, అధికార విభజన ఏదో ఒక స్వరూపంలో సమాఖ్యలో తప్పనిసరి. అధికార విభజన ఏ పద్ధతిలో జరగాలనే విషయానికి సంబంధించి కచ్చితమైన నియమాలు లేవు. ప్రతి సమాఖ్య తనకు సరిపడే అధికార విభజన విధానాన్ని స్వయంగా రూపొందించాల్సి ఉంటుంది. ఇది ఆయా దేశాల ప్రత్యేక పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. విభజన ఎలా జరిగినా సమాఖ్య విధానానికి అధికార విభజన మూలం.

‣ భారత రాజ్యాంగం కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా అనే అంశాల ద్వారా కేంద్ర-రాష్ట్రాల మధ్య అధికారాన్ని విభజిస్తుంది. కేంద్ర జాబితా అంశాలపై కేంద్రం, రాష్ట్ర జాబితా అంశాలపై రాష్ట్రాలు, ఉమ్మడి జాబితా అంశాలపై కేంద్ర, రాష్ట్రాలు చట్టాలు చేస్తాయి. ఈ చట్టాల మధ్య వైరుధ్యం ఏర్పడితే కేంద్రం చేసిన చట్టం చెల్లుతుంది. పై మూడు జాబితాల్లో లేని అవశిష్ట అధికారాలు కేంద్రానికి చెందుతాయి.
 

రాజ్యాంగ ఔన్నత్యం

‣  సమాఖ్య విధానంలో అధికార విభజనకు అనుగుణంగా కేంద్ర రాష్ట్రాలు చట్టాలు చేస్తాయి. ఈ చట్టాలు రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా ఉండాలి. అందువల్ల సమాఖ్య వ్యవస్థలో రాజ్యాంగం అత్యున్నత శాసనం.
  భారతదేశంలో సుప్రీంకోర్టు లేదా హైకోర్టులు రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా లేని శాసనాలను అవి చెల్లవని న్యాయసమీక్షాధికారం ద్వారా కొట్టివేస్తాయి. కేంద్ర రాష్ట్ర స్థాయుల్లో ఉన్న ప్రభుత్వాంగాలు శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయ శాఖ రాజ్యాంగం నిర్దేశించిన పరిధిలోనే పని చేయాలి.

 

ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థలు
‣  సమాఖ్యలో కేంద్రరాష్ట్రాల మధ్య అధికార విభజన ఫలితంగా ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థలు ఏర్పడతాయి. ఒకే దేశంలో రెండు రకాల ప్రభుత్వాలు ఏర్పడి, పౌరులపై అధికారాన్ని కలిగి ఉంటాయి. పౌరులు రెండు ప్రభుత్వాల పట్ల విధేయత కలిగి ఉంటారు.

 రాజ్యాంగం కేంద్రంలో యూనియన్ ప్రభుత్వాన్ని, కింది స్థాయుల్లో రాష్ట్ర ప్రభుత్వాలను ఏర్పరిచింది. రాజ్యాంగం ఇచ్చిన సార్వభౌమాధికారాన్ని రెండు స్థాయిల్లోని ప్రభుత్వాలు నిర్వహిస్తాయి. జాతీయ ప్రాముఖ్యం ఉన్న అంశాలను యూనియన్; ప్రాంతీయ, స్థానిక ప్రాముఖ్యం ఉన్న అంశాలను రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తాయి.
 

లిఖిత రాజ్యాంగం
‣  సమాఖ్య అనేది కేంద్రరాష్ట్రాల మధ్య ఒప్పందం. కాబట్టి వాటి మధ్య ఉన్న సంబంధాలు రాజ్యాంగం ద్వారా లిఖిత రూపంలో ఉండటం తప్పనిసరి. వివాదాలు తలెత్తినప్పుడు వాటిని పరిష్కరించడానికి రాజ్యాంగం ప్రామాణిక గ్రంథంగా పని చేస్తుంది.

‣  భారత రాజ్యాంగం లిఖితపూర్వకమైంది, ప్రపంచంలోనే అతి పెద్దది. మూల రాజ్యాంగంలో ఒక ప్రవేశిక. ఇందులో 395 ప్రకరణలు (22 భాగాలు), 8 షెడ్యూళ్లు ఉండేవి. ప్రస్తుతం ఒక ప్రవేశిక, 448 ప్రకరణలు, (25 భాగాలు) 12 షెడ్యూళ్లు ఉన్నాయి. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను, విధులను, వాటి నిర్వహణలో పరిమితులను రాజ్యాంగం నిర్దేశిస్తుంది.
 

దృఢ రాజ్యాంగం
‣  అధికార విభజనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండటానికి దృఢ రాజ్యాంగం సమాఖ్యలో తప్పనిసరి. రాజ్యాంగాన్ని కేంద్రరాష్ట్రాల ఆమోదంతో సవరిస్తారు.

‣   భారత రాజ్యాంగంలో సమాఖ్య వ్యవస్థకు సంబంధించిన అంశాలను (కేంద్రరాష్ట్ర సంబంధాలు, న్యాయవ్యవస్థ) సవరించడానికి రాజ్యాంగం దృఢమైన పద్ధతిని నిర్దేశించింది. ఈ అంశాలను సవరించడానికి పార్లమెంట్ ప్రత్యేక మెజారిటీతోపాటు రాష్ట్ర శాసనసభల ఆమోదం తప్పనిసరి.
 

 స్వతంత్ర న్యాయశాఖ
‣  రాజ్యాంగ ఔన్నత్యం సమాఖ్య ముఖ్య లక్షణమైనప్పుడు స్వతంత్ర న్యాయశాఖ ఉండటం తప్పనిసరి. కేంద్రం లేదా రాష్ట్రాలకు ఆధీనంగా ఉండని స్వతంత్ర న్యాయవ్యవస్థ కావాల్సి ఉంటుంది. రాజ్యాంగ విరుద్ధమైన చట్టాలు, చర్యలు ఉండటానికి వీలులేదు. అలాంటివాటిని రద్దు చేసే అధికారం న్యాయస్థానాలకు ఉంటుంది.
‣  భారతదేశంలో సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఒక స్వతంత్ర న్యాయశాఖను రాజ్యాంగం ఏర్పరిచింది. న్యాయసమీక్ష ద్వారా రాజ్యాంగ ఔన్నత్యాన్ని కేంద్రరాష్ట్రాల మధ్య వివాదాలను ఇది పరిష్కరిస్తుంది. న్యాయశాఖ స్వాతంత్రాన్ని కాపాడటానికి న్యాయమూర్తుల పదవీ భద్రత, నిర్ణీతమైన సర్వీసు నియమాలను రాజ్యాంగంలో పొందుపరిచారు.

 

ద్విసభా విధానం
‣  ఇది సమాఖ్య ముఖ్య లక్షణం. దిగువసభ ప్రజలకు, ఎగువసభ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. ప్రపంచంలోని వివిధ సమాఖ్య రాజ్యాంగాల్లో ఈ అంశాలు విభిన్నంగా ఉంటాయి.

‣  భారత రాజ్యాంగం, ఎగువ సభ (రాజ్యసభ), దిగువ సభ (లోక్‌సభ) అనే ద్వివిధ శాసనసభా విధానాన్ని ఏర్పరచింది. రాష్ట్రాలకు రాజ్యసభ, మొత్తం భారత ప్రజలకు లోక్‌సభ ప్రాతినిధ్యం వహిస్తాయి. కేంద్ర ప్రభుత్వ జోక్యం నుంచి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతూ సమాఖ్య సమతుల్యతను రాజ్యసభ కాపాడుతుంది.
 

రాజ్యాంగ పండితుల విభిన్న అభిప్రాయాలు

‣  రాజ్యాంగపరంగా యూనిటరీగా ప్రకటించకపోవడం వల్ల భారతదేశం సమాఖ్య వ్యవస్థగా రూపుదిద్దుకుంది.
‣  భారతదేశం యూనిటరీ (single ). ఎందుకంటే ఫెడరల్ అనే పదాన్ని రాజ్యాంగంలో ఎక్కడా వాడలేదు.
‣  అధికారాల పంపిణీ, ద్వంద్వ ప్రభుత్వం, సహకార ఫెడరలిజం గుణాలు ఉండటంతో అది పాక్షిక సమాఖ్యగా కనిపిస్తుంది.
‣  ఇది కేంద్రీకృత ఫెడరలిజం. ఎందుకంటే యూనియన్ అనే పదం రాజ్యాంగంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
‣  రాజ్యాంగ పదాలు, జాతీయాలు బ్రిటన్ రాజ్యాంగానికి దగ్గరగా, యూరోపియన్ సంప్రదాయాలకు సమీపంగా ఉండటం వల్ల ఇది పార్లమెంటరీ ఫెడరలిజం.
‣  సుప్రీంకోర్టు - ఎస్.ఆర్.బొమ్మై కేసులో భారత రాజ్యాంగాన్ని ఫెడరలిజంగా పేర్కొంది.
‣  కె.సి.వేర్ - భారత రాజ్యాంగం అర్ధ సమాఖ్య
‣  పాల్ ఆపిల్ బి - తీవ్రమైన సమాఖ్య
‣  మోరిస్ జోన్స్ - బేరసారాల సమాఖ్య
‣  ఐవర్ జెన్నింగ్స్ - బలమైన కేంద్రీకృత ధోరణులున్న సమాఖ్య
‣  అలెగ్జాండ్రోవిక్జ్, సుయి జెనరీస్ - వినూత్న స్వభావం కలది.
‣  గ్రాల్‌విల్ ఆస్టిన్ - సహకార సమాఖ్య

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

రాజమన్నార్ కమిటీ

రాజమన్నార్ కమిటీ 
కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై ఎం.సి.సెతల్వాడ్ కమిటీ చేసిన సిఫార్సులు రాష్ట్రాలను సంతృప్తి పరచలేకపోయాయి. దీంతో 1969 సెప్టెంబరులో తమిళనాడులో అధికారాన్ని చేపట్టిన కరుణానిధి నాయకత్వంలోని డీఎంకే ప్రభుత్వం కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై అధ్యయనం చేసి, సిఫార్సులు ఇచ్చేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసింది.ఈ కమిటీకి మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి పి.వి.రాజమన్నార్ అధ్యక్షుడు కాగా లక్ష్మణస్వామి మొదలియార్, పి.పి.చంద్రారెడ్డి సభ్యులు.
* రాజమన్నార్ కమిటీ కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై అధ్యయనం చేసి అనేక సిఫార్సులతో కూడిన నివేదికను తమిళనాడు ప్రభుత్వానికి సమర్పించింది. దీనికి సంబంధించి ఒక కాపీని కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపింది.

ఈ కమిటీ ప్రధాన సిఫార్సులు 
* అవశిష్ట అధికారాలను రాష్ట్రాలకు కేటాయించాలి.
* రాష్ట్రాలకు ఎక్కువ అధికారాలు కల్పించడం కోసం ఉమ్మడి జాబితాలోని అంశాలను వెంటనే పునఃసమీక్షించి రాజ్యాంగ సవరణ చేసి రాష్ట్రాలకు బదిలీ చేయాలి.
* రాజ్యసభలో రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యాన్ని కల్పించాలి.
* రాజ్యసభకు రాష్ట్రపతి 12 మంది విశిష్ట వ్యక్తులను నియమించే పద్ధతిని రద్దు చేయాలి.
* అంతర్ రాష్ట్ర వివాదాలను సుప్రీంకోర్టు ద్వారా పరిష్కరించాలి.
* అఖిల భారత సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్‌లను రద్దు చేయాలి.
* కేంద్ర మంత్రివర్గంలో రాష్ట్రాల వారీగా ప్రాతినిధ్యం కల్పించాలి.
* ఆర్టికల్ 356, 357, 257 లను రాజ్యాంగం నుంచి తొలగించాలి.
* ప్రధాని అధ్యక్షతన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఒక అంతర్ రాష్ట్ర మండలిని ఏర్పాటు చేయాలి.
* 'గవర్నర్ సంతృప్తి ఉన్నంత వరకే మంత్రిమండలి పదవిలో ఉంటుంది అనే నిబంధనను తొలగించాలి.
* ప్రణాళికా సంఘం ఒక శాశ్వత సంస్థగా ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నియంత్రణ తగ్గాలి.
* కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ అవలంబించే ఏకపక్ష నియంతృత్వ చర్యలను నిరోధించడానికి, రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడటానికి రాష్ట్రాలకు తగినన్ని రక్షణలు కల్పించాలి.
* హైకోర్టు న్యాయమూర్తుల తొలగింపులో రాష్ట్ర శాసనసభల అభిప్రాయాన్ని కూడా తీసుకోవాలి.
* శాసనసభకు జరిగిన ఎన్నికల అనంతరం ఏ రాజకీయ పక్షానికీ పూర్తి స్థాయి మెజారిటీ లభించని పక్షంలో, శాసనసభను సమావేశపరచి, మెజారిటీ సభ్యులు బలపరచిన వ్యక్తిని ముఖ్యమంత్రిగా గవర్నర్ నియమించాలి.
* ఆర్టికల్ 252 ప్రకారం పార్లమెంటు చేసిన చట్టాన్ని మార్పు చేసే అధికారం రాష్ట్ర శాసనసభలకు కల్పించాలి.
* రాష్ట్రాల అవసరాలను ప్రభావితం చేసే బిల్లులను అంతర్ రాష్ట్ర మండలి అనుమతితోనే పార్లమెంటులో ప్రవేశపెట్టాలి.
* రాజ్యాంగాన్ని పార్లమెంటు 2/3వ వంతు మెజారిటీతోనే సవరించాలి. రాజ్యాంగ సవరణలో రాష్ట్రాల పాత్రను పెంచాలి.
* ఎగుమతులు, దిగుమతులపై రాష్ట్రాలకు వాటాను కల్పించాలి.
* గవర్నర్ నివేదిక లేనిదే రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలనను విధించకూడదు.
* ప్రజాస్వామ్యాన్ని పటిష్ఠపరచాలంటే స్థానిక సంస్థలకు తగినన్ని ఆర్థిక వనరులు కల్పించాలి. దీనికోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి.
* ప్రాంతీయ మండళ్లను క్రియాశీలకం చేయాలి. రాష్ట్రాల ఆర్థిక వనరులను పెంచడానికి పన్నుల వ్యవస్థలో అవసరమైన మార్పులు చేయాలి.
* కార్పొరేట్ ట్యాక్స్, విదేశీ ఎగుమతులు, దిగుమతులపై విధించే సుంకాల్లో కూడా రాష్ట్రాలకు వాటాను కల్పించాలి.
* గవర్నర్లను నియమించేటప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను సంప్రదించాలి.
* రాజమన్నార్ కమిటీ చేసిన సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. ఈ సిఫార్సులను పలువురు నిపుణులు తీవ్రంగా వ్యతిరేకించారు. దేశంలో ఎన్నో వేర్పాటు శక్తులు తలెత్తుతుండగా జాతి నిర్మాణం, సమైక్యతా క్రమంలో విద్య, వ్యవసాయ, ఉత్పత్తి రంగాలను విస్తృతం చేసి సామాన్య మానవుడి నిజమైన సమస్యలను పరిష్కరించాల్సి ఉండగా ప్రాంతీయతత్వాన్ని బలోపేతం చేసే విధంగా సిఫార్సులు చేయడం సరైంది కాదని ప్రముఖులు వ్యాఖ్యానించారు.
* 'రాజమన్నార్ కమిటీ సిఫార్సులను యధాతథంగా ఆమోదించి అమలు పరచినట్లయితే భారతదేశం ముక్కలు చెక్కలు అవుతుంది. మన దేశం సమైక్యత, సమగ్రతలు ప్రమాదంలో పడతాయి. అనేక రంగాలు అభివృద్ధికి నోచుకోకుండా వెనకబడిపోతాయి అని ఎం.సి.సెతల్వాడ్ వ్యాఖ్యానించారు.

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

కేంద్ర, రాష్ట్ర శాసన సంబంధాలు

సమాఖ్య వ్యవస్థకు సమన్వయ సూత్రాలు!


భారతదేశం పటిష్ఠమైన సమాఖ్య వ్యవస్థగా ఉండాలని రాజ్యాంగ నిర్మాతలు భావించారు. అందుకు తగినట్లుగా ప్రభుత్వాల పరిధులు, శాసనాలు చేయాల్సిన అంశాలతో జాబితాలు సిద్ధం చేసి కేంద్ర, రాష్ట్రాల మధ్య విభజించారు. దేశ సమైక్యత, సమగ్రత లక్ష్యం కావడంతో జాతీయ ప్రభుత్వానికి ఎక్కువ అధికారాలు దక్కాయి. సాధారణ పరిస్థితుల్లో సమాఖ్యగా, అసాధారణ పరిస్థితుల్లో ఏకకేంద్ర వ్యవస్థగా వ్యవహరించే విధంగా రూపొందిన ఈ శాసన సంబంధాలపై పోటీ పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర, ఉమ్మడి జాబితాల్లో జరిగిన సవరణలు, రాష్ట్ర చట్టాలపై కేంద్రం నియంత్రణ తదితర వివరాలను సమగ్రంగా తెలుసుకోవాలి.


పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు ఏయే అంశాలపై శాసనాలు చేయవచ్చో వివరించే ప్రక్రియనే ‘కేంద్ర, రాష్ట్ర శాసన సంబంధాలు’గా పేర్కొంటారు. పార్లమెంటు రూపొందించే శాసనాలు దేశంలోని అన్ని ప్రాంతాలకు వర్తిస్తాయి. రాష్ట్ర శాసనసభలు రూపొందించే శాసనాలు సంబంధిత రాష్ట్ర భూభాగ పరిధికి మాత్రమే పరిమితమవుతాయి.

అధికారాల విభజన: రాజ్యాంగంలోని ఏడో షెడ్యూల్‌లో కేంద్ర, రాష్ట్రాల మధ్య మూడు రకాల అధికారాల విభజనను పేర్కొన్నారు.


1) కేంద్ర జాబితా: దీనిలో ప్రారంభంలో 97 అంశాలు ఉండేవి. ప్రస్తుతం 98 ఉన్నాయి. ఈ జాబితాలో జాతీయ ప్రాధాన్యం ఉన్న రక్షణ, కరెన్సీ, రైల్వేలు, తంతితపాలా, విదేశీ వ్యవహారాలు, విమాన, నౌకాయానం, బ్యాంకింగ్, పౌరసత్వం, అఖిలభారత సర్వీసులు, జనాభా లెక్కలు, సర్వే ఆఫ్‌ ఇండియా, నల్లమందు, సుప్రీంకోర్టు, హైకోర్టుల అధికార పరిధి లాంటి అంశాలు ఉన్నాయి.

* 1956లో 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ప్రజాప్రయోజనాల దృష్ట్యా వస్తువుల ఉత్పత్తి, పంపిణీ అనే అంశాన్ని (33వ ఎంట్రీ) ఈ జాబితా నుంచి తొలగించారు.

* 1956లో 6వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ‘అంతర్‌ రాష్ట్ర వ్యాపార వాణిజ్యం’పై పన్నులు విధించడానికి కేంద్ర ప్రభుత్వానికి అధికారం కల్పిస్తూ ఈ అంశాన్ని కేంద్ర జాబితాలో చేర్చారు (ఎంట్రీ 92(A) అంశం ద్వారా).

* 1982లో 46వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాష్ట్రాల్లో వస్తువుల దిగుమతిపై కన్‌సైన్‌మెంట్‌ ట్యాక్స్‌ను విధించడానికి కేంద్ర ప్రభుత్వానికి అధికారం కల్పిస్తూ ఈ అంశాన్ని కేంద్ర జాబితాలో చేర్చారు. (ఎంట్రీ 92 (B))

* 2004లో 88వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సేవలపై పన్నులు విధించడానికి కేంద్ర ప్రభుత్వానికి అధికారం కల్పిస్తూ ఈ అంశాన్ని కేంద్ర జాబితాలో చేర్చారు (ఎంట్రీ 92(C)).

* 2016లో 101వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా కేంద్ర జాబితాలోని ఎంట్రీ 92, 92(C)లను తొలగించారు.

* కేంద్ర జాబితాలోని అంశాలపై శాసనాలు రూపొందించే అధికారం పార్లమెంటుకు ఉంటుంది.

2) రాష్ట్ర జాబితా: ఈ జాబితాలో ప్రారంభంలో ప్రాంతీయ ప్రాధాన్యం ఉన్న 66 అంశాలు ఉండేవి. 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈ జాబితాలోని 5 అంశాలు (విద్య, అడవులు, తూనికలు-కొలతలు, న్యాయ వ్యవహారాలు, జనాభా నియంత్రణ) తొలగించి ఉమ్మడి జాబితాలోకి బదిలీ చేశారు.

* 2016లో 101వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాష్ట్ర జాబితాలోని ఎంట్రీ 52, 55 అంశాలను తొలగించారు.

* ప్రస్తుతం రాష్ట్ర జాబితాలోని అంశాలు 59. వీటిలో కీలకమైనవి శాంతిభద్రతలు, వ్యవసాయం, స్థానిక స్వపరిపాలన, జైళ్లు, మార్కెట్లు, వినోదం, ఆరోగ్యం, భూములు, భవనాలు, సత్రాలు, దస్తావేజులు, భూమిశిస్తు, శ్మశాన వాటికలు, పశుసంపద మొదలైనవి. రాష్ట్ర జాబితాలోని అంశాలపై శాసనాలు రూపొందించే అధికారం రాష్ట్ర శాసనసభకు ఉంటుంది.

* రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌ 249, 250, 252 ప్రకారం ప్రత్యేక పరిస్థితుల్లో రాష్ట్ర జాబితాలోని అంశాలపై శాసనాలు రూపొందించే అధికారం పార్లమెంటుకు లభిస్తుంది.

3) ఉమ్మడి జాబితా: ఈ జాబితాలో ప్రాంతీయ ప్రాధాన్యం, జాతీయ దృక్పథానికి సంబంధించిన అంశాలు ఉన్నాయి. ప్రారంభంలో దీనిలో 47 అంశాలు ఉండేవి. 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఇందిరా గాంధీ ప్రభుత్వ కాలంలో రాష్ట్ర జాబితాలోని 5 అంశాలను ఉమ్మడి జాబితాలోకి బదిలీ చేయడంతో 52కు చేరింది. ఈ జాబితాలో కీలకమైనవి వివాహం, విడాకులు, సామాజిక, ఆర్థిక ప్రణాళికలు, పత్రికలు, ధరల నియంత్రణ, సివిల్‌ ప్రొసీజర్‌ కోడ్, క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్, న్యాయవాద వృత్తి, ఇతర వృత్తులు, వార్తాపత్రికలు, కర్మాగారాలు, జ్యుడీషియల్‌ స్టాంపులు, కార్మిక సంఘాలు.

* ఉమ్మడి జాబితాలోని అంశాలపై శాసనాలు రూపొందించే అధికారం పార్లమెంటు, రాష్ట్రాల శాసనసభలకు ఉంటుంది. అయితే ఉమ్మడి జాబితాలోని ఏదైనా అంశంపై పార్లమెంటు, రాష్ట్ర శాసనసభ రూపొందించిన శాసనాల మధ్య వైరుధ్యం ఏర్పడితే పార్లమెంటు శాసనమే చెల్లుబాటవుతుంది.

* ఈ మూడు జాబితాల్లో లేని వాటిని ‘అవశిష్ట అంశాలు’ అంటారు. వీటిపై శాసనాలు రూపొందించే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. ఏదైనా ఒక అంశం అవశిష్టాంశమా, కాదా అని సుప్రీంకోర్టు ధ్రువీకరిస్తుంది.

రాజ్యాంగ వివరణ: భారత రాజ్యాంగంలోని శ్రీఖివ భాగంలో 245 నుంచి 255 వరకు ఉన్న ఆర్టికల్స్‌ కేంద్రం, రాష్ట్రాల మధ్య శాసన సంబంధాల గురించి పేర్కొంటున్నాయి.

ఆర్టికల్‌ 245: పార్లమెంటు, రాష్ట్ర శాసనసభల శాసనాధికార పరిధిని తెలియజేస్తుంది.

ఆర్టికల్‌ 245(1): పార్లమెంటు రూపొందించే శాసనాలు దేశంలోని అన్ని ప్రాంతాలకు వర్తిస్తాయి. రాష్ట్ర శాసనసభలు రూపొందించే శాసనాలు సంబంధిత రాష్ట్ర భూభాగ పరిధికి మాత్రమే వర్తిస్తాయి.

ఆర్టికల్‌ 245(2): పార్లమెంటు రూపొందించే శాసనాలు ఇతర దేశాల్లో నివసిస్తున్న భారతీయులకూ వర్తిస్తాయి.

ఆర్టికల్‌ 246: పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు రాజ్యాంగ పరిధికి లోబడి రూపొందించే శాసనాల రూపకల్పనను వివరిస్తుంది.

ఆర్టికల్‌ 246(1): రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్‌లో పేర్కొన్న కేంద్ర జాబితాలో ఉన్న అంశాలపై శాసనాలు రూపొందించే సర్వాధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది.

ఆర్టికల్‌ 246(2): రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్‌లో పేర్కొన్న ఉమ్మడి జాబితాలో ఉన్న అంశాలపై శాసనాలు రూపొందించే అధికారం పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలకు ఉంటుంది. అయితే ఈ జాబితాలోని ఏదైనా అంశంపై పార్లమెంటు రూపొందించిన శాసనానికి, రాష్ట్ర శాసనసభ రూపొందించిన శాసనానికి మధ్య విభేదాలు వస్తే పార్లమెంటు చేసిన శాసనమే కొనసాగుతుంది.

ఆర్టికల్‌ 246(3): 7వ షెడ్యూల్‌లో పేర్కొన్న రాష్ట్ర జాబితాలోని అంశాలపై శాసనాలు రూపొందించే అధికారం రాష్ట్ర శాసనసభలకు ఉంటుంది. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో రాష్ట్ర జాబితాలోని అంశాలపై కూడా శాసనాలు రూపొందించే అధికారం పార్లమెంటుకు ఉంటుంది.

సుప్రీంకోర్టు తీర్పు:  వాదియా జు( స్టేట్‌ ఆఫ్‌ బాంబే కేసు: భారత ప్రభుత్వం రూపొందించే ఆదాయ పన్ను చట్టాలు భారత్‌లో శాఖలు ఉన్న విదేశీ సంస్థలకు కూడా వర్తిస్తాయని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.

ఆర్టికల్‌ 247: కేంద్ర జాబితాలోని పేర్కొన్న అంశాలపై పార్లమెంటు రూపొందించిన శాసనాలను సమర్థంగా అమలు చేయడానికి అవసరమైన అదనపు న్యాయస్థానాలను ఏర్పాటుచేసే అధికారం పార్లమెంటుకు ఉంది.

ఆర్టికల్‌ 248: అవశిష్టాంశాలపై శాసనాలు రూపొందించే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. దీనికి స్ఫూర్తి కెనడా రాజ్యాంగం. కేంద్ర, రాష్ట్ర, ఉమ్మడి జాబితాల్లో లేని విషయాలను, నూతనంగా వచ్చే అంశాలను ‘అవశిష్టాంశాలు’ అంటారు.

ఆర్టికల్‌ 249: జాతీయ ప్రయోజనాలరీత్యా రాష్ట్ర జాబితాలోని ఏదైనా అంశంపై పార్లమెంటు శాసనాన్ని రూపొందిస్తుంది. దీని కోసం ముందుగా రాజ్యసభ 2/3 ప్రత్యేక మెజార్టీతో ఒక తీర్మానాన్ని ఆమోదించాలి. రాజ్యసభ చేసిన తీర్మానాన్ని అనుసరించి పార్లమెంటు రూపొందించిన చట్టం ఒక సంవత్సరం పాటు అమల్లో ఉంటుంది. ఆ తర్వాత కూడా ఈ చట్టాన్ని కొనసాగించాలంటే మరో తీర్మానాన్ని ఆమోదించాలి. ఆ విధంగా ఎంతకాలమైనా పొడిగించవచ్చు.

ఆర్టికల్‌ 250: రాష్ట్రపతి ఆర్టికల్‌ 352 ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితిని విధిస్తే, ఆర్టికల్‌ 250 ప్రకారం రాష్ట్ర జాబితాలోని అంశాలపై శాసనాలు రూపొందించే అధికారం పార్లమెంటుకు లభిస్తుంది. ఈ విధంగా పార్లమెంటు రూపొందించిన శాసనాలు జాతీయ అత్యవసర పరిస్థితి ముగిసిన తర్వాత 6 నెలల వరకు కొనసాగి రద్దవుతాయి.

ఆర్టికల్‌ 251: ఆర్టికల్‌ 249, 250 ప్రకారం పార్లమెంటు రాష్ట్ర జాబితాలోని అంశాలపై రూపొందించిన శాసనాలకు వ్యతిరేకంగా రాష్ట్ర శాసనసభ ఎలాంటి శాసనాలు రూపొందించరాదు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధించినప్పుడు రాష్ట్ర జాబితాలోని అంశాలపై పార్లమెంటు శాసనాలు రూపొందిస్తుంది.

ఆర్టికల్‌ 252: రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు తమ ఉమ్మడి ప్రయోజనాల కోసం రాష్ట్ర జాబితాలోని అంశాలపై శాసనాలను రూపొందించాలని పార్లమెంటును కోరితే రాష్ట్ర జాబితాలోని అంశాలపై శాసనాలు రూపొందిస్తుంది. ఈ విధంగా రూపొందించిన శాసనాలు సంబంధిత రాష్ట్రాలకు మాత్రమే వర్తిస్తాయి.

ఉదా: * ఎస్టేట్‌ సుంకం చట్టం-1955 

* ప్రైజ్‌ కాంపిటీషన్‌ చట్టం-1955 

* వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972 

* జలకాలుష్య సంరక్షణ చట్టం-1974 

* పట్టణ ఆస్తుల భూపరిమితి చట్టం-1976

పార్లమెంటు రూపొందించిన ఈ చట్టాలను సవరించే లేదా రద్దు చేసే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. ఈ చట్టాలను ఇతర రాష్ట్రాలు శాసనసభ తీర్మానం ద్వారా తమకు కూడా అన్వయించుకోవచ్చు.

ఆర్టికల్‌ 253: భారత ప్రభుత్వం విదేశాలతో కుదుర్చుకునే ఒప్పందాలు, శాంతి సంధి లాంటివి మనదేశంలో అమలుపరిచే సందర్భంలో పార్లమెంటు రూపొందించే శాసనాలు దేశంలోని అన్ని రాష్ట్రాలకు వర్తిస్తాయి. ఈ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వాల శాసనాలు అవరోధంగా ఉంటే వాటిని పార్లమెంటు సవరించవచ్చు.

ఉదా: * యూఎన్‌ఓ ప్రత్యేక సౌకర్యాలు, రక్షణల చట్టం-1947 

* జెనీవా ఒప్పంద చట్టం-1960 

* హైజాకింగ్‌ వ్యతిరేక చట్టం-1982

ఆర్టికల్‌ 254: ఉమ్మడి జాబితాలోని ఏదైనా అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాసనాలు రూపొందించినప్పుడు రెండింటి మధ్య విభేదాలు వస్తే పార్లమెంటు రూపొందించిన శాసనమే చెల్లుతుంది. అయితే ఉమ్మడి జాబితాలోని ఏదైనా ఒక అంశంపై కేంద్రం గతంలో రూపొందించిన శాసనానికి విరుద్ధంగా రాష్ట్రాలు రాష్ట్రపతి అనుమతితో ప్రత్యేక శాసనం రూపొందించినప్పుడు రాష్ట్ర శాసనమే చెల్లుబాటు అవుతుంది.

ఆర్టికల్‌ 255: కీలకమైన బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టాలంటే రాష్ట్రపతి ముందస్తు అనుమతి, శాసనసభలో ప్రవేశపెట్టాలంటే గవర్నర్‌ ముందస్తు అనుమతి తప్పనిసరి.

ఆర్టికల్‌ 200: రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్‌ రాష్ట్రపతికి రిజర్వ్‌ చేయవచ్చు.

ఆర్టికల్‌ 201: రాష్ట్ర గవర్నర్‌ రాష్ట్రపతికి రిజర్వ్‌ చేసిన బిల్లులను రాష్ట్రపతి ఆమోదించవచ్చు లేదా పునఃపరిశీలనకు పంపవచ్చు లేదా తిరస్కరించవచ్చు.

రచయిత: బంగారు సత్యనారాయణ

Posted Date : 27-09-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌