• facebook
  • whatsapp
  • telegram

జాతీయాదాయ వృద్ధి రేటు 

 ఒక దేశ అభివృద్ధి గురించి రాజకీయ వర్గాల్లో చర్చ జరిగినప్పుడు అందరి దృష్టి ఒకే అంశంపై ఉంటుంది. అదే ఆ దేశ జాతీయాదాయ వృద్ధిరేటు. దీని గురించి అవగాహన ఉంటే ఆర్థికాభివృద్ధిలోని ఎత్తుపల్లాలను సులభంగా అర్థం చేసుకోవచ్చు.

 ఒక దేశ ప్రగతిని ఆ దేశ స్థూల జాతీయాదాయం ద్వారా తెలుసుకోవచ్చు. ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తయిన అంతిమ వస్తుసేవల మార్కెట్‌ విలువల మొత్తాన్ని స్థూల జాతీయాదాయం ( Gross National Income) అంటారు. దేశ సరిహద్దు లోపల ఒక ఏడాదిలో ఉత్పత్తయ్యే వస్తుసేవల మార్కెట్‌ విలువల మొత్తాన్ని స్థూల దేశీయ ఆదాయం (Gross Domestic Income)అంటారు. ఎక్కువ దేశాలు జీడీపీని దేశ అభివృద్ధికి కొలమానంగా ఉపయోగిస్తున్నాయి. 

GNP = GDP + విదేశీ ఆదాయం

 అంటే ఒక ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తయిన మొత్తం వస్తుసేవల విలువల నుంచి మాధ్యమిక వస్తువుల విలువను తీసివేయగా మిగిలిన అంతిమ వస్తుసేవల విలువలను కూడితే జాతీయాదాయం వస్తుంది. మాధ్యమిక వస్తువుల విలువ కూడా అంతిమ వస్తువు విలువలో కలిసి ఉంటుంది. కాబట్టి మాధ్యమిక వస్తువుల విలువ తీసివేయకపోతే జాతీయాదాయం అధికంగా, అవాస్తవంగా లెక్కించబడుతుంది. 

ఉదా: సెల్‌ఫోన్‌ తయారీలో దాని విడిభాగాలు మాధ్యమిక వస్తువులు అవుతాయి. వాటన్నింటి విలువలు కలిసి సెల్‌ఫోన్‌ విలువ అవుతుంది. కాబట్టి విడిభాగాల విలువలు విడిగా లెక్కించనవసరం లేదు. 

లభించే మార్గాలు
* ఒక దేశానికి జాతీయాదాయం ప్రధానంగా నాలుగు మార్గాల ద్వారా లభిస్తుంది. 
* ప్రజలు ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాల్లో ప్రవేశించి కింది విధులు నిర్వర్తించడం ద్వారా జాతీయాదాయం లభిస్తుంది.
 
ప్రజల వినియోగం (Consumption): కుటుంబాలు తమ అవసరాలు తీర్చుకోవడానికి అనేక రకాల వస్తు సేవలపై వ్యయం చేస్తుంటారు. అలా ఖర్చు చేసే ప్రతి రూపాయి అమ్మకందారుడికి ఆదాయం అవుతుంది. ఆ ఆదాయం మరో కొత్త వస్తుసేవలకు డిమాండ్‌ను సృష్టిస్తుంది. అలా ఆర్థిక వ్యవస్థలో ఆదాయం చక్రంలా ఒకరి నుంచి మరొకరికి ప్రయాణించి జాతీయాదాయాన్ని పెంచుతుంది.

పెట్టుబడి వ్యయం (Investment): వ్యాపార సంస్థలు ప్రజల డిమాండ్‌ ఆధారంగా వస్తువులను తయారుచేసి సప్లయ్‌ చేయడానికి పెట్టుబడులు పెడతాయి. ఇది కొత్త ఉద్యోగాలను కల్పిస్తుంది. వారి జీతాలు పెరిగి, కొనుగోలు శక్తిని పెంచుతుంది. యజమానుల లాభాలు పెరిగితే మూలధన సంచయనం జరిగి కొత్త సంస్థలు, వస్తువులు, ఉద్యోగాల ద్వారా జాతీయాదాయం పెరుగుతుంది.

ప్రభుత్వ వ్యయం (Government Income): ఇది మరో ప్రధాన సూత్రధారి. ప్రజల అవసరాలు, అవస్థాపన సౌకర్యాలు కల్పించడానికి, శాంతిభద్రతల కోసం ప్రభుత్వం ఏటా లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. ఈ వ్యయం ప్రజల ఉపాధిని, ఆదాయాలను, కొనుగోలుశక్తిని, జీవన ప్రమాణాలను పెంచుతుంది. సంస్థలకు అనుకూల పెట్టుబడి వాతావరణాన్ని కల్పిస్తుంది. 

 

విదేశీ ఆర్థిక వ్యవహారాలు (Forein economic transactions): ఒక దేశం వివిధ ప్రపంచ దేశాలతో వస్తుసేవల వ్యాపారం చేస్తుంది. దాంతో పెట్టుబడులు వివిధ దేశాల మధ్య ప్రవహిస్తాయి. దీనివల్ల ఇతర దేశాలకు చెల్లింపులు జరిగి వాటి నుంచి ఆదాయాలు వస్తాయి. చెల్లింపుల కంటే ఆదాయాలు ఎక్కువగా ఉంటే ఆ దేశ ఆదాయానికి కలుపుతాం. తక్కువగా ఉంటే దేశ ఆదాయం నుంచి తీసివేస్తాం. 

 ప్రస్తుతం ప్రపంచీకరణ కాలంలో మన దేశంతో పాటు అనేక దేశాలు అంతర్జాతీయ వ్యాపారంలో భాగమయ్యాయి. ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థల పనితీరు ప్రభావం మన ఆదాయవృద్ధిపై పడుతుంది.

   GNP = C + I + G + (X - M) + (R - P)

    C  = వినియోగం,  I  = పెట్టుబడులు,  
    G  = ప్రభుత్వ వ్యయం
    X - M = విదేశీ వ్యాపార శేషం, 
    R - P = విదేశీ చెల్లింపుల శేషం


లెక్కింపు 

జాతీయాదాయం లెక్కింపు పద్ధతి వీలైనంత సమగ్రంగా, శాస్త్రీయంగా ఉంటే ఒక దేశ అభివృద్ధి తాలూకు దశదిశలను సులభంగా అంచనా వేయవచ్చు.
జాతీయాదాయం విలువ రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది. 
1) వస్తు సేవల పరిమాణంలో మార్పు
2) వాటి ధరల్లో మార్పు

 ఈ రెండింటలో కలిసి లేదా ఏ ఒక్కదానిలోనైనా మార్పు వచ్చినప్పుడు జాతీయాదాయం విలువ మారుతుంది. వస్తుసేవల పరిమాణం పెరగడమే నిజమైన అభివృద్ధి. అయితే ఒక్కోసారి వస్తుసేవల సంఖ్య పెరగకుండానే కేవలం వాటి ధరలు పెరగడం వల్ల జాతీయాదాయం పెరిగినట్లుగా కనిపిస్తుంది. కానీ అది వాంఛనీయ అభివృద్ధి కాదు. 
 మన దేశంలో జీడీపీ డిఫ్లేటర్‌ను కేంద్ర గణాంక, కార్యక్రమ అమలు శాఖ నిర్ణయిస్తుంది. జీడీపీని త్రైమాసికానికి ఒకసారి చొప్పున ప్రతి ఏడాది కేంద్ర గణాంక సంస్థ లెక్కిస్తుంది. మన దేశంలో గత 7 త్రైమాసికాలుగా జీడీపీ వృద్ధిరేటు క్షీణిస్తూ వస్తుంది. ఇటీవల సవరించిన అంచనాల ప్రకారం 201920 ఏప్రిల్‌ - డిసెంబరు మధ్య కాలంలో కేవలం 5.1%  వృద్ధి రేటు నమోదైంది. 
2012 - 13లో నమోదైన 4.3% తర్వాత ఇదే అతి తక్కువ వృద్ధిరేటు. మన దేశ వృద్ధిరేటు పడిపోయి ప్రపంచ అత్యధిక వృద్ధిరేటు కలిగిన దేశంగా చైనా నిలిచింది. పైన పేర్కొన్న ప్రజల వినియోగం, పెట్టుబడులు, విదేశీ ఎగుమతుల్లో (ప్రైవేటు రంగం) క్షీణత కనిపిస్తుంది. డిమాండ్‌ కొరత వల్ల వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెట్టడానికి, రుణాలు తీసుకోవడానికి ముందుకు రావడం లేదు.
ప్రధానంగా కీలక పరిశ్రమల వృద్ధి బాగా తగ్గింది. అమెరికా, చైనా వాణిజ్య యుద్ధ ప్రభావం ప్రపంచ ప్రగతిపై పడి మన దేశ వృద్ధిరేటు తగ్గుదలకు కారణమైంది. 
2016లో నోట్ల రద్దు, 2017లో జీఎస్‌టీ అమలుచేయడం వల్ల స్వదేశీ మార్కెట్‌లో కొంత అనిశ్చితి ఏర్పడింది. దీనివల్ల ముఖ్యంగా గ్రామీణ ఆదాయాలు తగ్గి, డిమాండ్‌ తగ్గింది. వ్యాపారాల్లో మార్పు సంధి దశలో అనుమానాలు, భయాలు కూడా కొంతమేర అమ్మకాలు పడిపోవడానికి కారణమయ్యాయని నిపుణుల అంచనా.

    నమోదైన వృద్ధిరేటుకు ప్రధాన చోధకం ప్రభుత్వ వ్యయం. ఇప్పటికే ప్రభుత్వం విత్తలోటుకు సమానంగా నిధులు అప్పులుగా తెచ్చి వివిధ కార్యక్రమాలపై వెచ్చిస్తుంది. మన ఆర్థిక వ్యవస్థలో ప్రైవేటురంగం సుమారు 87% కలిగి ఉన్నా, గత తొమ్మిది నెలల్లో కేవలం 4.01% వృద్ధి నమోదు కావడం పరిస్థితి తీవ్రతను తెలుపుతోంది. అయితే ప్రభుత్వ వ్యయం అంచనాలకు మించి 15.64% పెరిగింది. ఆర్థిక మందగమన కాలంలో ప్రైవేటురంగం వెనకడుగు వేసినప్పుడు ప్రభుత్వ రంగం కీలకపాత్ర పోషించాల్సి వస్తుందని ఇది రుజువు చేస్తుంది.

మార్పులు - గణన

జాతీయాదాయంలో మార్పులను రెండు రకాల మార్కెట్‌ ధరల సహాయంతో గణిస్తారు.

ఆధార సంవత్సర ధరల్లో ( GNP at Base Year or Constant Price)
ప్రజలకు అవసరమైన వస్తుసేవలు పెరగడమే నిజమైన అభివృద్ధి. కాబట్టి ధరలతో ప్రమేయం లేకుండా వస్తుసేవల పరిమాణంలో మార్పులు లెక్కించాలి. దీనికి గణాంక శాస్త్రవేత్తలు ఆధార సంవత్సరాన్ని సూచించారు. ఒడిదొడుకులు లేని  సాధారణ పరిస్థితులు కలిగిన సంవత్సరాన్ని ఎన్నుకుంటారు. ఒక నిర్దిష్ట కాల వ్యవధి తర్వాత ఈ ఆధార సంవత్సరాన్ని మారుస్తుంటారు. ఆధార సంవత్సర ధరల్లో తర్వాతి సంవత్సరాల వస్తుసేవల ఉత్పత్తి విలువను లెక్కిస్తారు. దీనివల్ల ధరలు మారకుండా కేవలం వస్తుసేవల పరిమాణం మార్పులను తెలుపుతుంది. ధరలు మారవు కాబట్టి దీన్ని స్థిర ధరల్లో జాతీయాదాయం లేదా వాస్తవిక ఆదాయం అని పిలుస్తారు. మన దేశంలో ఇప్పుడు  ఆధార సంవత్సరంగా 2011 - 12ను ఉపయోగిస్తున్నారు. త్వరలో 2017 - 18కి మారాలని గణాంక మంత్రిత్వ శాఖ ఆలోచిస్తుంది. పట్టికలోని చక్కెర, పాలు, టీ పొడి విలువలను 2011 - 12 నాటి ధరల్లో 2018, 2019 నాటి ఉత్పత్తులను లెక్కిస్తారు. అప్పుడు ధరల్లో మార్పు ఉండకుండా వాస్తవ ఆదాయంలో మార్పులను సులభంగా తెలుసుకోవచ్చు. 
సాధారణంగా వాస్తవ ఆదాయం కంటే ద్రవ్యోల్బణం సమయంలో ధరలు పెరుగుతుండటం వల్ల నామమాత్ర ఆదాయం ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక మాంద్యకాలంలో వాస్తవ ఆదాయం కంటే నామమాత్రపు ఆదాయం తక్కువగా ఉంటుంది. వాస్తవ ఆదాయ విలువను కింది సూత్రం ఆధారంగా లెక్కిస్తారు.


* డిఫ్లేటర్‌ అంటే ప్రస్తుత సంవత్సర ధరలకు, ఆధార సంవత్సర ధరలకు మధ్య ఉన్న నిష్పత్తి. ఇది వినియోగదారుల సూచిక మాదిరి ధరల స్థాయిని తెలియజేస్తుంది.

ప్రస్తుత ధరల్లో జాతీయాదాయం ( GNP at Current Price)

    ఏ సంవత్సరంలో ఉత్పత్తయిన వస్తుసేవల విలువలను అదే సంవత్సర ధరల్లో లెక్కిస్తే దాన్ని నామమాత్రపు జాతీయాదాయం అంటారు. 2018లో ఒక లక్ష కార్లు తయారైతే వాటి విలువను అదే సంవత్సర ధరల్లో లెక్కిస్తాం. ఇక్కడ ధరల మార్పు జాతీయాదాయ విలువపై పడుతుంది. వస్తువుల సంఖ్య పెరిగినా, తగ్గినా, స్థిరంగా ఉన్నా వాటి ధరల్లో పెరుగుదల ఉంటే జాతీయాదాయం పెరుగుతుంది. ధరలు తగ్గితే జాతీయాదాయం తగ్గుతుంది. ఇది ద్రవ్యోల్బణం వల్ల  పెరిగినట్లు కనిపిస్తుంది. అసలైన అభివృద్ధిని తెలుపదు.

పట్టికలో చూపినట్లుగా ధరల్లో మార్పు వచ్చినప్పుడు వస్తువు విలువలో మార్పు కనిపిస్తుంది. కానీ, ప్రజలకు కావాల్సిన వస్తుసేవల పరిమాణంలో మార్పులను ఇది తెలపడం లేదు. 

Posted Date : 03-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

జీడీపీ వృద్ధిరేటు - కొవిడ్-19 ప్ర‌భావం

జాతీయ గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ 2020 ఆగస్టు 31న ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ( 2020 - 21) సంబంధించి తొలి త్రైమాసికం (ఏప్రిల్‌-జూన్‌) జీడీపీ గణాంకాలను విడుదల చేసింది. ఇందులో భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) భారీగా క్షీణించినట్లు ప్రకటించింది. ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు, సేవల విలువను జీడీపీ వృద్ధి అంటారు. ఈ విలువను ఏడాదిలో మూడు నెలల కాలానికి లెక్కిస్తే దాన్ని త్రైమాసిక (క్వార్టర్‌) వృద్ధిరేటు అంటారు. గత సంవత్సరంతో ఈ ఏడాది వస్తు, సేవల విలువను పోలిస్తే వృద్ధి రేటు పెరిగిందో తగ్గిందో అర్థమవుతుంది. ఉదాహరణకు, గత ఏడాది మనదేశం 100 రూపాయలు ఆర్జించిందని, ఈ సంవత్సరం 105 రూపాయలు సంపాదించిందని అనుకుంటే, జీడీపీ వృద్ధిరేటు - 5% సాధించినట్లు. ఒకవేళ గత ఏడాది 100 రూపాయలు సంపాదించి, ఈ సంవత్సరం 95 రూపాయలే ఆర్జిస్తే అప్పుడు దాన్ని 5% వృద్ధిరేటు అని అంటారు. అలాకాకుండా ఈ ఏడాది కూడా 100 రూపాయలే సంపాదిస్తే 0% శాతం వృద్ధిరేటు అని అంటారు. 

* జీడీపీని రెండు రకాలుగా భావించవచ్చు. అవి 

1. వాస్తవ స్థూల దేశీయోత్పత్తి(Real GDP)

2. తాత్కాలిక జీడీపీ (Nominal GDP)

వాస్తవ స్థూల దేశీయోత్పత్తి

వాస్తవ స్థూల దేశీయోత్పత్తి అంటే ఒక నిర్దిష్ట సమయానికి ధరలను స్థిరంగా ఉంచి, అప్పటి నుంచి ఇప్పటివరకు ఉన్న ద్రవ్యోల్బణాన్ని లెక్కిస్తారు. అంటే ఎంత శాతం ధరలు పెరిగాయో లెక్కిస్తారు. ఉదా: 100 కోట్లు ఉత్పత్తి జరిగి, ధరలు 5% శాతం పెరిగాయనుకుంటే, 95 కోట్లు మాత్రమే ఉత్పత్తి జరిగినట్లు భావిస్తారు. ఇలా ద్రవ్యోల్బణాన్ని కూడా లెక్కించి చూపినప్పుడు దాన్ని వాస్తవ స్థూల దేశీయోత్పత్తి అంటారు. 

* ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ప్రస్తుత ధరల ప్రకారం లెక్కిస్తే దాన్ని తాత్కాలిక జీడీపీ (నామినల్‌ జీడీపీ) అని వ్యవహరిస్తారు.

* వస్తు, సేవల ఉత్పత్తి మందగించడమే జీడీపీ తగ్గుదల. కొనేవారు తగ్గితే ఉత్పత్తి మందగిస్తుంది. ఆదాయాలు పడిపోతే కొనుగోలుదారులు తగ్గుతారు. ఉపాధి లేకపోతే ఆదాయం ఉండదు. ఉత్పత్తి అవసరం లేకపోతే ఉపాధి ఉండదు. డిమాండ్‌ తగ్గితే ఉత్పత్తి పడిపోతుంది. ఇవన్నీ ఒకదానితో మరొకటి ముడిపడిన అంశాలు. దీన్నే ‘విషవలయం’   అంటారు. 

భారత ఆర్థిక వ్యవస్థ కొవిడ్‌-19 వల్ల విషవలయంలో చిక్కుకుంది. దీన్ని వర్చువల్‌ సర్కిల్‌గా మార్చాలంటే ప్రజలకు ఉపాధి కల్పించాలి. తద్వారా ప్రజల ఆదాయాలు, వస్తు, సేవల కొనుగోలు శక్తి పెరుగుతాయి. వస్తు సేవల ఉత్పత్తి, డిమాండ్, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. ఉపాధిని సృష్టించాలంటే దాన్ని కల్పించే రంగాలపై ప్రభుత్వం దృష్టి సారించాలి. ఉదా: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (MSME)  పరిశ్రమలు లేదా వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో ఉపాధి కల్పనకు చర్యలు తీసుకోవాలి. ప్రజల ఆదాయాలు పెరగాలంటే ప్రభుత్వ ఆర్థిక విధానాలు, సంక్షేమ పథకాల ద్వారా ప్రజలపై ఖర్చు పెట్టాలి. ప్రముఖ ఆర్థిక వేత్త జె.ఎం. కీన్స్‌ ‘‘గోతులు తవ్వినప్పుడు, వాటిని పూడ్చినప్పుడు డబ్బులు ఇవ్వండి’’ అని సూచించారు. అంటే ప్రభుత్వాలు తమ ఆర్థిక విధానాల ద్వారా ప్రజలపై ఖర్చుపెట్టాలని ఆయన భావన. 

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం

2005 లో మనదేశంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ్బవిళినిబిత్శి చట్టం వచ్చింది. ఈ పథకాన్ని 2006 ఫిబ్రవరి 2 న ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా బండ్లపల్లి గ్రామంలో అప్పటి ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ ప్రారంభించారు. 2009 అక్టోబరు 2న మహాత్మా గాంధీ పేరును జోడించి (NREGA) (మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం)గా పేరు మార్చారు. దీని ద్వారా ప్రజలకు ఉపాధి కల్పించి వారి ఆదాయాలు పెంచారు.  

* ప్రస్తుతం దేశ ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేదు. కొవిడ్‌-19 ప్రభావం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆర్థికరంగంలో మందగమనం చోటు చేసుకుంది. మనం ఎదుర్కొంటున్న మందగమనంలో ఒక భాగం కరోనా వల్ల ఏర్పడింది. కానీ మన దేశంలో సమస్యలకు ఇతర కారణాలూ ఉన్నాయి. భారత్‌ కొన్నేళ్ల పాటు వేగంగా వృద్ధి చెందుతున్న తొలి మూడు ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉంది. ప్రస్తుతం 23వ స్థానానికి దిగజారింది. కరోనా ప్రభావానికి రెండేళ్ల ముందే భారత్‌లో తీవ్రమైన మందగమనం ప్రారంభమైంది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అమలుచేసిన లాక్‌డౌన్‌ తీరు వల్ల ఆర్థిక రంగం మరింత పతనమైంది. లాక్‌డౌన్‌ అనంతరం భారత్‌లో నిరుద్యోగితరేటు 20 శాతానికి చేరిందని ప్రముఖ ఆర్థికవేత్త, పద్మభూషణ్‌ అవార్డు గ్రహీత కౌశిక్‌ బసు పేర్కొన్నారు.

* సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ్బదిలీఖిన్శి 2020 సెప్టెంబరు 13న ప్రకటించిన నివేదిక ప్రకారం, మనదేశంలో ఉపాధి రేటు 37.9%. అయితే కొవిడ్‌-19 నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ కారణంగా దేశంలో నిరుద్యోగిత రేటు 62.1% ఉందని దిలీఖిని అంచనా వేసింది. ఇది ప్రపంచంలోనే ఎక్కువ.  ఈ నివేదిక ప్రకారం 2020 ఆగస్టు నాటికి ఏపీలో నిరుద్యోగిత రేటు 7%, తెలంగాణ రాష్ట్రంలో 5.8%గా ఉంది.

* భారత్‌కున్న ఆర్థిక మూలాలు, సామర్థ్యాలను పరిగణనలోకి తీసుకుంటే ప్రపంచంలో వేగంగా ఎదిగే ఆర్థికశక్తిగా రూపొందే అవకాశం ఉంది. కొవిడ్‌-19 ప్రభావం వల్ల భారతదేశ ఆర్థిక వృద్ధిరేటు స్వాతంత్య్రం తర్వాత ఎప్పుడూ లేనంత తక్కువగా నమోదైంది. 1979లో నమోదైన 5.2%  వృద్ధిరేటే ఇప్పటి వరకు భారత్‌లో కనిష్ఠమైంది. ఈసారి అంతకంటే తక్కువగా నమోదైంది. 

* దేశ ఆర్థిక వ్యవస్థ మళ్లీ పుంజుకుంటుందని భారత ఆర్థిక సర్వే 201920 నివేదిక పేర్కొంది. దీని ప్రకారం స్థిర మార్కెట్‌ ధరల వద్ద వాస్తవ జీడీపీ వృద్ధిరేట్లు 201617లో 8.2%, 201718లో 7.2%, 201819లో 6.8%, 201920 తొలి త్రైమాసికంలో 5% కాగా, ద్వితీయ త్రైమాసికంలో 4.5% తగ్గింది.

* గ్లోబల్‌ ఎకనమిక్‌ ప్రాస్పెక్ట్స్‌ (వరల్డ్‌ బ్యాంక్‌ గ్రూప్‌) జూన్‌ - 2020 నివేదిక ప్రకారం దేశంలో వాస్తవ స్థూల దేశీయోత్పత్తి వార్షిక వృద్ధి అంచనాలు వరుసగా... 2017 లో 7%, 2018 లో 6.1%, 2019 లో 4.2%గా నమోదయ్యాయి. అయితే ఇది 2020 లో 3.2%, 2021 లో 3.1% ఉంది (2017లో 7% నుంచి కొవిడ్‌-19 సమయంలో లాక్‌డౌన్‌ వల్ల వాస్తవ జీడీపీ వార్షిక వృద్ధి రేటు 2021 నాటికి 3.1% శాతానికి తగ్గుతుందని అంచనా).   

* 2020 ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభమయ్యే నూతన ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 6 - 6.5% మధ్య ఉంటుందని భారత ఆర్థిక సర్వే 2019 - 20 నివేదిక అంచనా వేసింది. ఇందుకోసం ‘విస్తరణ విధానాలు’ అమలు చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అందులో ప్రధానంగా మూడు సూచనలు చేసింది. అవి

1)  బడ్జెట్‌లోటుపై ఉన్న పరిమితులు ఎత్తివేయాలి.

2) ఆహార రాయితీల్లో కోత విధించాలి.

3) సంపద - ఉద్యోగాలు సృష్టిస్తున్న వ్యాపారులను గౌరవించాలి.

* ఐఎంఎఫ్‌ 2019 అక్టోబరులో విడుదల చేసిన వరల్డ్‌ ఎకనమిక్‌ ఔట్‌లుక్‌ ్బజూనివ్శీ నివేదిక మనదేశం ప్రపంచంలో అయిదో పెద్ద ఆర్థిక వ్యవస్థగా (దాదాపు 2.9 ట్రిలియన్‌ డాలర్లు) ఉందని పేర్కొంది. ప్రపంచంలోని పది పెద్ద ఆర్థిక వ్యవస్థలు ఉన్న దేశాలు వరుసగా: అమెరికా, చైనా, జపాన్, జర్మనీ, భారత్, యూకే, ఫ్రాన్స్, ఇటలీ, బ్రెజిల్, దక్షిణ కొరియా.
* 2014-19 లో సగటు జీడీపీ వృద్ధిరేటు 7.4%గా నమోదైంది. 2019 జులైలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ 2019-20) లో, 2024-25 నాటికి భారత్‌ను 5 ట్రిలియన్‌ డాలర్ల (350 లక్షల కోట్లు) ఆర్థిక వ్యవస్థగా రూపొందించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. దీన్ని సాధించాలంటే,  ప్రభుత్వం వ్యాపార అనుకూల విధానాలను అవలంబించాలి. పారిశ్రామికవేత్తలు సంపద సృష్టిస్తేనే పన్ను వసూళ్లు పెరుగుతాయి.  




 

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

జాతీయాదాయం

ఒక దేశ ఆర్థిక స్థితి, ప్రగతిని స్థూలంగా తెలుసుకోవడానికి 


జాతీయాదాయం, ఉత్పత్తి, వ్యయాలు ప్రధాన కొలమానాలు. స్థూల ఆర్థిక శాస్త్రంలో ఇవి ముఖ్యమైన భాగాలు. వీటిని శాస్త్రీయంగా గణించే విధానాలు, మదింపు పద్ధతులు, ఇందుకు పరిగణనలోకి తీసుకునే అంశాలపై పోటీ పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. ఆర్థిక వ్యవస్థలోని ప్రధాన రంగాలు, వాటి ప్రాధాన్యం, వృద్ధి రేటును నిర్ణయించే అంశాలు, ప్రణాళికల కాలంలో నమోదైన గణాంకాలతో పాటు జాతీయాదాయంలోని ముఖ్యమైన భావనల గురించి తెలుసుకోవాలి.


1. ఉత్పత్తి మదింపు పద్ధతిలో కిందివాటిలో చేరే అంశం?

1) స్వయం వినియోగం     2) వడ్డీ      3) సొంత ఇంటి అద్దె      4) పైవన్నీ

జవాబు : పైవన్నీ


 

2. ఉత్పత్తి మదింపు పద్ధతిలో మినహాయించేవి?

ఎ) గృహిణి సేవలు     బి) పాత వస్తువుల అమ్మకం       సి) షేర్లు, బాండ్ల వల్ల వచ్చే ఆదాయం

1) ఎ మాత్రమే      2) ఎ, బి మాత్రమే      3) సి మాత్రమే     4) పైవన్నీ

జవాబు : పైవన్నీ
 

3. ఆదాయ మదింపు పద్ధతిని ప్రవేశపెట్టినవారు?

1) రాబిన్‌సన్‌         2)కీన్స్‌      3) జె.ఆర్‌.హిక్స్‌       4) 2, 3

జవాబు: కీన్స్‌
 


4.  ఆదాయ మదింపు పద్ధతిలో కిందివాటిలో చేర్చే భాగం?

1) వేతనం     2) డివిడెండ్‌     3) భాటకం     4) పైవన్నీ

జవాబు: పైవన్నీ



5. మాధ్యమిక వస్తువుల వినియోగాన్ని మినహాయించగా వచ్చే ఆదాయం?

1) GVA at MP     2) GDP at MP     3) GNP at MP     4) 1, 2

జవాబు : 1, 2



6.  వ్యయ మదింపు పద్ధతిలో కుటుంబాలు చేసేవ్యయం?

1) వినిమయం    2) వినియోగం    3) ఎంపిక     4) 1, 2

జవాబు : వినియోగం


7.  నికర ఎగుమతులు అంటే

1) ఎగుమతులు + దిగుమతులు    2) ఎగుమతులు - దిగుమతులు

3) ఎగుమతులు/దిగుమతులు    4) ఎగుమతులు x దిగుమతులు

జవాబు : ఎగుమతులు - దిగుమతులు


8. మూలధన ఆదాయంలో యాజమాన్య ఆదాయం కానిది?

1) డివిడెండ్‌     2)భాటకం      3) కార్పొరేట్‌ పన్ను    4) పంపిణీ కాని లాభాలు

జవాబు : భాటకం

 

9. విదేశీ వ్యాపారంలో ఉండేది?

1) ఎగుమతులు      2) దిగుమతులు       3) చెల్లింపులు     4) 1, 2

జవాబు : 1, 2

 

10. ద్వితీయ రంగం + గనుల తవ్వకాన్ని ఏమంటారు?

1) ద్వితీయ రంగం      2) పారిశ్రామిక రంగం     3) ఆర్థిక రంగం    4) పైవన్నీ

జవాబు : పారిశ్రామిక రంగం

 

11. ‘హిందూ వృద్ధి రేటు’ గురించి చెప్పినవారు?

1) అట్కిన్‌సన్‌    2) దాదాభాయ్‌ నౌరోజి     3) రాజ్‌కృష్ణ      4) డి.ఆర్‌.గాడ్గిల్‌

జవాబు : రాజ్‌కృష్ణ

 

12. భారతదేశంలో అధిక వృద్ధి రేటు నమోదైన ప్రణాళిక?

1) 10వ       2) 11వ      3) 12వ       4) 9వ

జవాబు : 11వ

 

13. ప్రస్తుతం జాతీయ ఆదాయంలో అతితక్కువ వాటా అందించే రంగం?

1)  వ్యవసాయం     2) పరిశ్రమలు      3)సేవలు     4) కార్పొరేట్‌

జవాబు : వ్యవసాయం

 

14. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో అధిక వాటా అందించే రంగం?

1) ప్రభుత్వ      2) ప్రైవేట్‌     3)1, 2      4) కార్పొరేట్‌

జవాబు : ప్రైవేట్‌ 



15. ప్రస్తుత జాతీయ ఆదాయంలో ఆధార సంవత్సరం?

1) 2004-05     2) 2011-12      3) 2015-16       4) 2020-21

జవాబు : 2011-12
 

16. చక్రీయ ఆదాయ ప్రవాహంలో కారకాల మార్కెట్‌ అంటే?

1) వ్యాపార రంగం    2) ప్రభుత్వ రంగం      3) గృహ రంగం       4) పారిశ్రామిక రంగం

జవాబు : గృహ రంగం  

 

17. చక్రీయ ఆదాయ ప్రవాహంలో చివరిగా ఆదాయాన్ని పొందేవారు?

1) ప్రభుత్వ రంగం      2) ఉత్పాదక రంగం      3)గృహ రంగం      4) విదేశీ రంగం

జవాబు : ఉత్పాదక రంగం 
 

18. జాతీయ ఆదాయాన్ని శాస్త్రీయంగా అంచనా వేసినవారు?

 1) ఆర్‌.సి.దేశాయ్‌      2) వి.కె.ఆర్‌.వి.రావు      3) నటరాజన్‌    4) కె.టి.షా

జవాబు : వి.కె.ఆర్‌.వి.రావు
 

19. ప్రభుత్వానికి ఆదాయం పన్నుల ద్వారా లభిస్తుంది. అయితే వాటిని ఏయే రంగాల ద్వారా చెల్లిస్తారు?

1) గృహ రంగాలు    2) వ్యాపార రంగాలు      3) ప్రభుత్వ రంగాలు    4) 1, 2

జవాబు : 1, 2

 

20. మూడు రంగాల నమూనాల్లో లీకేజీ ఏది?

1) పొదుపు      2) వ్యయాలు     3) పన్నులు    4) దిగుమతులు

జవాబు : వ్యయాలు   


 

21. పొదుపు పెట్టుబడిని అధిగమిస్తే ఆర్థిక వ్యవస్థ స్వరూపం?

1) ఆదాయ ప్రవాహం పెరుగుతుంది      2) ఆదాయ ప్రవాహం తగ్గుతుంది

3)ఆదాయ ప్రవాహం స్థిరం     4) ఆదాయ ప్రవాహం సమతుల్యం

జవాబు : ఆదాయ ప్రవాహం స్థిరం 

 

22. నాలుగు రంగాల నమూనాలో ఇన్‌జెక్షన్‌గా పనిచేసే వరుస క్రమం?

1) ఎగుమతులు+ప్రభుత్వ వ్యయం + పెట్టుబడి

2) పెట్టుబడి+ ప్రభుత్వ వ్యయం + ఎగుమతులు

3)ప్రభుత్వ వ్యయం + ఎగుమతులు + పెట్టుబడి

4) ఎగుమతులు+ పెట్టుబడి + ప్రభుత్వ వ్యయం

జవాబు : ఎగుమతులు+ప్రభుత్వ వ్యయం + పెట్టుబడి

 

23. జాతీయ ఆదాయంలో సరైంది?

ఎ) తలసరి ఆదాయం × జనాభా      బి) NNP at FC

 సి) NDP at FC     డి) NVA at FC

1)  బి మాత్రమే       2) ఎ, బి      3) ఎ, బి, డి       4) ఎ, బి, సి, డి

జవాబు : ఎ, బి, డి  


 

24. 2015 జాతీయాదాయాన్ని లెక్కించడానికి తీసుకునే అంశం?

 1) GDP at MP    2) GDP at FC 

3) GNP at MP     4) GNP at FC

జవాబు : GDP at MP 

 

25. ఆదాయ మదింపు పద్ధతిలో చేర్చని ఆదాయాలు?

ఎ) స్మగ్లింగ్‌ ఆదాయం      బి) జాతీయ రుణాలపై వడ్డీ

 సి) గాలి వాటా లాభాలు     డి) ప్రైవేటు బదిలీ చెల్లింపులు

1) ఎ, బి     2) బి, సి    3) ఎ, బి, సి     4) పైవన్నీ

జవాబు : పైవన్నీ

 

26. ఒక దేశ పౌరులచే ఉత్పత్తి అయ్యే అంతిమ వస్తువు?

1) జాతీయ ఉత్పత్తి     2) దేశీయ ఉత్పత్తి      3)తలసరి ఉత్పత్తి        4) స్థూల ఉత్పత్తి

జవాబు : జాతీయ ఉత్పత్తి

 

27. జీడీపీ అంతరం అంటే?

1) వనరుల ఉత్పత్తి వాస్తవ ఉత్పత్తికి సమానం      2) వాస్తవ ఉత్పత్తికి, వనరుల ఉత్పత్తికి మధ్య తేడా

3) జీడీపీ, జీఎన్‌పీ మధ్య తేడా       4) జీడీపీ = జీఎన్‌పీ

జవాబు : వాస్తవ ఉత్పత్తికి, వనరుల ఉత్పత్తికి మధ్య తేడా

 

28. గ్రీన్‌ జీడీపీ అంటే?

1) పర్యావరణ నష్టాన్ని జీడీపీ ద్వారా సర్దుబాటు చేయడం

2) జీడీపీ నష్టాన్ని పర్యావరణం ద్వారా సర్దుబాటు చేయడం

3) పర్యావరణాన్ని పెంచడం

4) పర్యావరణాన్ని తగ్గించడం

జవాబు : పర్యావరణ నష్టాన్ని జీడీపీ ద్వారా సర్దుబాటు చేయడం

 

29. కిందివాటిలో బదిలీ చెల్లింపులు?

1) జీతాలు   2) వడ్డీలు     3) పింఛన్లు     4) విదేశీ ఆదాయం

జవాబు : పింఛన్లు

 

30. నామమాత్రపు ఆదాయం వచ్చే విధానం?

1) ప్రస్తుత ఉత్పత్తి × ఆదాయ సంవత్సర ధరలు        2) ప్రస్తుత ఉత్పత్తి/ఆదాయ సంవత్సర ధరలు

3) ప్రస్తుత ఉత్పత్తి × ప్రస్తుత ధరలు       4) ప్రస్తుత ధరలు/ప్రస్తుత ఆదాయం

జవాబు : ప్రస్తుత ఉత్పత్తి × ప్రస్తుత ధరలు

 

31. సెకండ్‌ హ్యాండ్‌ వస్తువులను జాతీయ ఆదాయంలో లెక్కించేటప్పుడు- 

1) వాటి పాత ధరలను తీసుకోవాలి        2)వాటి ప్రస్తుత ధరలను తీసుకోవాలి

3)వాటిపై వచ్చే కమిషన్‌ తీసుకోవాలి     4) పైవన్నీ

జవాబు : వాటిపై వచ్చే కమిషన్‌ తీసుకోవాలి 

 

32.NFIA లో ఉండే కారకాలు?

1)  రాబడి      2) వ్యయం      3) నికర లాభాలు     4) 1, 2

జవాబు : 1, 2

 

33. NDP =

1) GDP - NFIA      2) GDP -  పన్నులు  

3) GNP - D     4) GDP - D

జవాబు : GDP - D

 

34. కేంద్ర గణాంక సంస్థ ఎప్పుడు ఏర్పడింది?

1) 1951     2)1954       3) 1960       4) 1970

జవాబు : 1951   

 

35. జాతీయ ఆదాయ వృద్ధి రేటు అధికంగా ఎప్పుడు నమోదైంది?

1) 1957-58      2) 1965-66       3)1966-67     4) 1988-89

జవాబు : 1988-89


36. జాతీయ ఆదాయ వృద్ధి రేటు = 

1) జాతీయ ఆదాయ వృద్ధి రేటు - జనాభా వృద్ధి రేటు

 2) జాతీయ ఆదాయ వృద్ధి రేటు x జనాభా వృద్ధి రేటు

3)జాతీయ ఆదాయ వృద్ధి రేటు/తలసరి ఆదాయ వృద్ధి రేటు

4) జాతీయాదాయం/ధరల సూచీ

జవాబు : జాతీయ ఆదాయ వృద్ధి రేటు - జనాభా వృద్ధి రేటు

 

37. ఉత్పత్తి మదింపు పద్ధతిని ‘ఉత్పత్తి సేవా పద్ధతి’ అని పేర్కొన్నవారు?

1) రాబర్ట్‌ సన్, బౌలే      2) జె.ఎం.కీన్స్‌      3) కుజ్‌నెట్స్‌     4) ఆడంస్మిత్‌

జవాబు : కుజ్‌నెట్స్‌

 

38. ప్రస్తుత ధరల్లో జాతీయాదాయం లెక్కించేటప్పుడు వాస్తవ ఆదాయంలోకి మార్చాలి అంటే ఏంచేయాలి?

1) ఇన్‌ఫ్లేటర్‌ చేయాలి    2) డిఫ్లేటర్‌ చేయాలి      3) రెండు సార్లు లెక్కించాలి     4) వ్యయం కలపాలి 

జవాబు : డిఫ్లేటర్‌ చేయాలి 

 

39. దేశీయ కారక ఆదాయం + NFIA =

1) జాతీయ ఆదాయం     2) తలసరి ఆదాయం    3) వ్యష్టి ఆదాయం      4) వ్యయార్హ ఆదాయం

జవాబు : జాతీయ ఆదాయం

 

40. వ్యయార్హ ఆదాయంలో ఉండేది?

1) వినియోగం       2) పొదుపు       3) రాబడి      4) 1, 2

జవాబు : 1, 2


41. కిందివాటిలో సరైంది?

1) భాటకం + వేతనం + వడ్డీలు + లాభాలు + మిశ్రమ ఆదాయం = N1

 2) భాటకం + వేతనం + వడ్డీలు + మిశ్రమ ఆదాయం = N1

3)వేతనం + లాభాలు = N1

4) మిశ్రమ ఆదాయం =N1

జవాబు : భాటకం + వేతనం + వడ్డీలు + లాభాలు + మిశ్రమ ఆదాయం = N1

 

42. ఉత్పత్తి మదింపు పద్ధతిలో ఉండే రంగాలు

1) ప్రాథమిక రంగం      

2) తయారీ రంగం (రిజిస్టర్‌ అయినవి)

3)నిర్మాణ రంగం (పట్టణంలో ఉండేవి) 

4) పైవన్నీ

జవాబు : పైవన్నీ

 

43. కేంద్ర గణాంక కార్యాలయం ప్రకారం 1954లో దేశ తలసరి ఆదాయం?

1) రూ.20     2) రూ.225   3) రూ.27     4) రూ.8,710

జవాబు : రూ.225


44. ప్రస్తుతం దేశంలో 202223 సర్వే ప్రకారం తలసరి ఆదాయం

1) రూ.1,70,620     2) రూ.1,69,770       3) రూ.1,89,420      4) రూ.1,60,340

జవాబు : రూ.1,70,620

45. నాలుగు రంగాల నమూనాలో ఆర్థిక వృద్ధికి సమీకరణం?

1) పొదుపు = పన్నులు = దిగుమతులు

 2) పెట్టుబడి = వ్యయం = దిగుమతులు

3) పొదుపు = పెట్టుబడి = పన్నులు

4) ఎగుమతులు = దిగుమతులు = పన్నులు

జవాబు : పొదుపు = పన్నులు = దిగుమతులు


46. 1954 కేంద్ర గణాంక కార్యాలయం (CSO) తుది నివేదిక ప్రకారం సరికానిది?

1) జాతీయాదాయంలో సగభాగం వ్యవసాయం నుంచి వస్తుంది.

2) ద్వితీయ రంగం నుంచి 1/6వ వంతు జాతీయాదాయంలో భాగం

3) తృతీయ రంగంలో 1/6వ వంతు జాతీయాదాయంలో భాగం

4) NDP  లో ప్రభుత్వ రంగం వాటా 7 - 9% గా ఉంది 

జవాబు : NDP  లో ప్రభుత్వ రంగం వాటా 7 - 9% గా ఉంది 


సమాధానాలు

1-4; 2-4; 3-2; 4-4; 5-4; 6-2; 7-2; 8-2; 9-4; 10-2; 11-3; 12-2; 13-1; 14-2; 15-2; 16-3; 17-2; 18-2; 19-4; 20-2; 21-3; 22-1; 23-3; 24-1; 25-4; 26-1; 27-2; 28-1; 29-3; 30-3; 31-3; 32-4; 33-4; 34-1; 35-4; 36-1; 37-3; 38-2; 39-1; 40-4; 41-1; 42-4; 43-2; 44-1; 45-1; 46-4.

రచయిత: ధరణి శ్రీనివాస్‌ 

Posted Date : 23-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌