• facebook
  • whatsapp
  • telegram

పర్యావరణం - సమకాలీన అంశాలు

  ఎలక్ట్రానిక్ వ్యర్థాలకు (e-waste) సంబంధించి అసోచామ్ (ASSOCHAM) - KPMG సంయుక్తంగా ఒక అధ్యయనాన్ని నిర్వహించాయి. ఇ-వ్యర్థాలను ఉత్పత్తి చేసే ప్రపంచ దేశాలన్నింటిలో భారత్ అయిదో స్థానంలో నిలిచిందని ఈ అధ్యయనం వెల్లడించింది. మనదేశంలో ఏటా సుమారు 18.5 లక్షల టన్నుల ఎలక్ట్రానిక్ వ్యర్థాలు విడుదలవుతున్నాయి.


  ఝార్ఖండ్‌లో గంగానది సంరక్షణ, గ్రామీణ శుభ్రత కోసం కేంద్ర ప్రభుత్వం తొమ్మిది ప్రాజెక్ట్‌లను ప్రారంభించింది. ఈ రాష్ట్రంలో గంగానది ప్రవహిస్తున్న 83 కి.మీ. తీరప్రాంతానికి ఆనుకుని ఉన్న సుమారు 78 గ్రామాల్లో స్వచ్ఛత, శుభ్రత, ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఇవి సహకరిస్తాయి. ఐక్యరాజ్య సమితికి చెందిన United Nations Developmet Programme వీటికి సాంకేతిక సాయం అందించనుంది.


అత్యంత కాలుష్య వాయువు...


* నగర వాయు గుణాత్మక డేటాబేస్ (Urban Air Quality Database) - 2016 ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇటీవల వెలువరించింది. ఈ నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యంత కలుషితమైన వాయువును ఇరాన్‌లోని జబోల్ నగరంలో గుర్తించారు.

* హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన మత్స్య సంవర్థక శాఖ గోల్డెన్ మసీర్ చేప (Golden Mahseer Fish ) పునరావాసం, సంరక్షణ కోసం వాటిని కృత్రిమంగా వృద్ధి చేసే కార్యక్రమాన్ని ప్రారంభించింది. విచక్షణారహితంగా వేటాడటం, ఆవాసాలు కోల్పోవడం, కాలుష్యం కారణంగా హిమాచల్‌ప్రదేశ్‌లో ఈ చేపల సంతతి క్షీణించిపోయింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గోల్డెన్ మసీర్ చేప ఎక్కువకాలం బతికే మంచినీటి చేప. దీన్ని 'భారత నదీజలాల పులి'గా (Tiger of Indian Rivers) పిలుస్తారు. IUCN(International Union of Conversion of Natural Resources) ఈ చేపను అంతరించిపోతున్న జీవజాతుల జాబితాలో చేర్చింది.
*  అసోంలోని గువాహటి నగర జంతువు (City Animal) ను ప్రకటించిన మొట్టమొదటి నగరంగా చరిత్రలో నిలిచింది. ప్రత్యేకంగా నిర్వహించిన ఓటింగ్ ప్రక్రియ ద్వారా గంగానది డాల్ఫిన్ (Gangetic River Dolphin) ను గువాహటి నగర జంతువుగా ఎంపిక చేశారు. ఈ డాల్ఫిన్‌ను అధికారికంగా భారత జాతీయ జల జంతువుగా (National Aquatic Animal of India) ప్రకటించారు. దీన్ని స్థానికంగా సిహు (Sihu) అని పిలుస్తారు. ప్లాంటానిస్టా గేంగటికా (Plantanista Gangetica) అనే శాస్త్రీయనామం కలిగిన ఈ డాల్ఫిన్‌ను గంగా పులి (Tiger of Ganga) గా కూడా వ్యవహరిస్తారు. భారత ప్రభుత్వం ఈ డాల్ఫిన్‌ల జనాభా పునరుద్ధరణ, వ్యాప్తిని అధ్యయనం చేయడానికి 1997 లో సంరక్షణా కార్యక్రమాన్ని (Ganges River Dolphin Conservation Programme) ప్రారంభించింది.
*  ప్రపంచంలో అటవీ నిర్మూలనను (Deforestation) నిషేధించిన మొట్టమొదటి దేశంగా నార్వే చరిత్రలో నిలిచింది. నార్వే పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సూచనల మేరకు నార్వే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నార్వేలో ఇకపై అటవీ నిర్మూలనకు కారణమయ్యే ఎలాంటి చర్యలనూ అంగీకరించరు.

* ఆసియాలోనే ప్రప్రథమ గిప్స్ రాబందుల పునర్‌ప్రవేశన కార్యక్రమాన్ని (Gyps Vulture Reintrodution Programme) పింజోర్‌లోని జటాయు సంరక్షణ, ప్రజనన కేంద్రం (Jatayu Conservation Breeding Centre) లో హరియాణా ప్రభుత్వం ప్రారంభించింది. హిమాలయాల్లోని గ్రిఫాన్ రాబందులతో ఈ గిప్స్ రాబందులకు దగ్గరి పోలికలు ఉంటాయి.


* రాబందుల ఆహారమైన పశువుల కళేబరాల్లోని డైక్లోఫినాక్ అనే ఔషధం వల్ల రాబందులు మూత్రపిండ సంబంధ వ్యాధులకు గురవుతున్నాయి. (పశువుల్లో నొప్పుల నివారణకు డైక్లోఫినాక్ ఔషధం ఉపయోగిస్తుంటారు). దీంతో కేంద్ర ప్రభుత్వం 2006లో పశువులకు డైక్లోఫినాక్ వాడకాన్ని నిషేధించింది.


దినోత్సవాలు

*  అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవాన్ని (International Biodiversity Day) మే 22న నిర్వహిస్తారు.


*   జీవవైవిధ్య సంరక్షణ, స్థిరమైన అభివృద్ధిపై సరైన అవగాహన కల్పించడం దీని ప్రధాన లక్ష్యం.


*   'జీవవైవిధ్యం - ప్రధాన జీవన స్రవంతి: ప్రజలు వారి జీవనోపాయాల కొన సాగింపు' (Mainstreaming Biodiversity; Sustaining people and their livelihoods) అనేది 2016 ఏడాదికి జీవవైవిధ్య దినోత్సవ నినాదం.


* ప్రపంచ వలస పక్షుల దినోత్సవాన్ని (World Migrating Bird Day) 2016 మే 10న నిర్వహించారు. వలస పక్షుల నివాసాలు, సంతతిని సంరక్షించడం ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం.


*  ' వలస పక్షుల అక్రమ సంహారం, వాణిజ్యాలను ఆపేయండి' (Stop the lilegal Killing, Taking and Trading of Migratory Birds) అనేది 2016 ఏడాది నినాదం.


* ఐక్యరాజ్య సమితి 2006 నుంచి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది.


* ప్రపంచ సముద్రాల దినోత్సవాన్ని (World Oceans Day) 2016 జూన్ 8న నిర్వహించారు. సముద్ర ఆవాసాల పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడం ఈ దినోత్సవ ఉద్దేశం. సముద్రాల్లో ప్లాస్టిక్ సంబంధ వ్యర్థ పదార్థాల నిర్మూలనను ఈ ఏడాది లక్ష్యంగా నిర్ణయించారు. 2016 ఏడాదికి 'ఆరోగ్యకరమైన సముద్రాలు, ఆరోగ్యవంతమైన గ్రహం' (Healthy Oceans, Healthy Planet ) అనే ఉద్దేశంతో ఈ దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఐక్యరాజ్య సమితి సాధారణ సభ 2008లో అధికారికంగా ఈ దినోత్సవాన్ని నిర్వహించడానికి ఆమోదం తెలిపింది. అయితే 1992లో బ్రెజిల్‌లోని రియో డిజనిరోలో జరిగిన ధరిత్రీ సదస్సులో కెనడా తొలిసారిగా దీన్ని ప్రతిపాదించింది.


* ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని (World Environment Day) 2016 జూన్ 5న నిర్వహించారు. 'జీవనం కోసం వన్యంలోకి' (Go Wild for Life) అనేది 2016 పర్యావరణ దినోత్సవం ముఖ్య ఉద్దేశం. పర్యావరణాన్ని, వన్య ప్రాణులను సంరక్షించడమే ప్రపంచ పర్యావరణ దినోత్సవ లక్ష్యం. పులులపై అవగాహన కల్పించడానికి రైల్వే మంత్రి సురేశ్ ప్రభు 2016 జూన్ 5న టైగర్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించారు. ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ 1972లో ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి ఆమోదం తెలిపింది. 1973లో మొట్టమొదటి పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించారు.


ప్రపంచ హైడ్రోగ్రఫీ దినోత్సవం..


* ప్రపంచ హైడ్రోగ్రఫీ దినోత్సవాన్ని (World Hydrography day) 2016 జూన్ 21న నిర్వహించారు. 'హైడ్రోగ్రఫీ - చక్కగా నిర్వహిస్తున్న సముద్రాలు, జల మార్గాలకు ఒక కీలక అంశం' (Hydrography - the key to well managed seas and water ways) అనేది 2016 ఏడాది నినాదం. సముద్రాలు, సరస్సులు, నదులు లాంటి జల సంబంధ అంశాల కొలతలు, వర్ణనకు సంబంధించిన ఒక అనువర్తిత శాఖగా హైడ్రోగ్రఫీని పేర్కొనవచ్చు. అంతర్గత జలాశయాలు, సముద్రాల్లో నావిగేషన్‌ను చక్కగా నిర్వహించడానికి ఈ శాస్త్ర పరిజ్ఞానం తోడ్పడుతుంది.


మరుభూమీకరణపై పోరు దినోత్సవం


* మరుభూమీకరణపై పోరు దినోత్సవాన్ని (The World Day to Combat Deforestation) ప్రపంచవ్యాప్తంగా జూన్ 17న నిర్వహించారు. ఎడారులు, కరవు భూములు ఏర్పడకుండా ప్రపంచ దేశాలు పరస్పరం సహకరించుకోవడమే దీని లక్ష్యం. 'భూ హాని పట్ల తటస్థత సాధన దిశగా సంఘటిత సహకారం' అనేది 2016 ఏడాదికి ఈ దినోత్సవ ముఖ్యఉద్దేశం. 'భూమిని కాపాడు, నేలను పునరుద్ధరించు, ప్రజలను పనిలో నియమించు' (Protect Eath, Restore Land, Engage People) అనేది 2016 నినాదంగా ప్రకటించారు. ఈ దినోత్సవాన్ని తొలిసారిగా 1995లో నిర్వహించారు.


*  అరుణాచల్‌ప్రదేశ్‌లోని తూర్పు కామెంగ్ జిల్లాలో ఉన్న పక్కే పులుల సంరక్షణ కేంద్రానికి (Pakke Tiger Reserve) భారత దేశ జీవవైవిధ్య పురస్కారం (India Biodiversity Award) 2016 లభించింది.

Posted Date : 10-07-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌