• facebook
  • whatsapp
  • telegram

భారత రాజ్యాంగం సమాఖ్య, ఏక కేంద్ర లక్షణాలు

* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న సంబంధాల ఆధారంగా ప్రభుత్వ వ్యవస్థను సమాఖ్య, ఏక కేంద్ర ప్రభుత్వాలుగా వర్గీకరించవచ్చు.
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాల విభజన ఉంటే సమాఖ్య వ్యవస్థగానూ, అధికారాలన్నీ కేంద్రం గుప్పిట్లో ఉంటే ఏక కేంద్ర ప్రభుత్వ వ్యవస్థగానూ పేర్కొంటారు.
* సమాఖ్య అనే పదాన్ని ఆంగ్లంలో Federation అంటారు. ఈ పదం లాటిన్ భాషలోని ఫోడస్ (Foedus) అనే పదం నుంచి ఆవిర్భవించింది. ఫోడస్ అంటే ఒప్పందం.
* 'ప్రతిదీ రాజ్యాంగం వల్ల పుట్టి, రాజ్యాంగం చేత నియంత్రితమయ్యే అనేక సమన్వయ అంశాల మధ్య రాజ్యాధికారాలను పంచడమే సమాఖ్య అని ఎ.వి. డైసీ పేర్కొన్నారు.


భారత సమాఖ్య ప్రభుత్వ లక్షణాలు
* భారత రాజ్యాంగంలో సమాఖ్య అనే పదాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. రాజ్యాంగంలో కేవలం రాష్ట్రాల యూనియన్‌గానే భారతదేశాన్ని పేర్కొన్నారు.
* 'భారత రాజ్యాంగం పరిస్థితులను బట్టి ఏకకేంద్రంగానూ, సమాఖ్యగానూ మార్పు చెందే స్వభావం గలది అని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ పేర్కొన్నారు.
* 1935 భారత ప్రభుత్వ చట్టం మన దేశ రాజ్యాంగానికి ప్రధాన ఆధారం.

 

భారత సమాఖ్యకు కింది లక్షణాలు ఉన్నాయి
అధికారాల విభజన
  సమాఖ్య మౌలిక లక్షణం అధికారాల విభజన. మన దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య 3 రకాల అధికారాల విభజన, పంపిణీ జరిగింది.
* భారత రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్‌లో రాజ్యాంగం 3 రకాలైన అధికారాల విభజన జరిపింది. అవి:
1. కేంద్ర జాబితా: దీనిలో ప్రారంభంలో 97 అంశాలుండగా ప్రస్తుతం 100 అంశాలు ఉన్నాయి.
2. రాష్ట్ర జాబితా: దీనిలో ప్రారంభంలో 66 అంశాలుండగా ప్రస్తుతం 61 అంశాలు గలవు
3. ఉమ్మడి జాబితా: దీనిలో ప్రారంభంలో 47 అంశాలుండగా ప్రస్తుతం 52 అంశాలు ఉన్నాయి.
* పైన పేర్కొన్న మూడు జాబితాల్లో లేని అంశాలను అవశిష్టాధికారాలు అంటారు. ఒక అంశం అవశిష్టాధికారమా? కాదా? అని సుప్రీంకోర్టు నిర్ణయిస్తుంది.


ద్వంద్వ ప్రభుత్వం
   సమాఖ్యలో జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో రెండు రకాల ప్రభుత్వాలు ఏర్పడి పనిచేస్తాయి. మన దేశంలో జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగం ద్వారా ఏర్పడి పనిచేస్తున్నాయి.

ద్విసభా విధానం
  సమాఖ్య విధానంలో కేంద్ర శాసన వ్యవస్థలో ద్విసభలు వర్ధిల్లుతాయి. ఎగువ సభ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తూ రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడుతుంది. మన దేశంలో కేంద్ర శాసనవ్యవస్థలో భాగంగా పార్లమెంటులో లోక్‌సభ, రాజ్యసభ ఉన్నాయి.
* మన దేశంలో రాజ్యసభ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. అందుకే రాజ్యసభను రాష్ట్రాల మండలి అంటారు.


లిఖిత రాజ్యాంగం
* సమాఖ్య వ్యవస్థ ప్రధాన లక్షణం లిఖిత రాజ్యాంగాన్ని కలిగి ఉండటం.
* భారత రాజ్యాంగం ప్రపంచ రాజ్యాంగాల్లో కెల్లా అత్యంత సుదీర్ఘమైంది. ప్రస్తుతం భారత రాజ్యాంగంలో 395 ఆర్టికల్స్, 22 భాగాలు, 12 షెడ్యూళ్లు ఉన్నాయి.
రాజ్యాంగ ఆధిక్యత
* సమాఖ్య వ్యవస్థలో ఆదేశ రాజ్యాంగమే అత్యున్నత శాసనంగా వర్ధిల్లుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, స్థానిక సంస్థలకు అధికారాలన్నీ రాజ్యాంగం నుంచే లభిస్తాయి.
* మన దేశంలో రాజ్యాంగమే అత్యున్నత శాసనంగా వర్ధిల్లుతుంది. రాజ్యాంగానికి వ్యతిరేకంగా రూపొందించే శాసనాలు చెల్లవు అని ఉన్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వగలదు.
సర్వోన్నత న్యాయవ్యవస్థ
* సమాఖ్య వ్యవస్థకు అతి ముఖ్యమైన లక్షణం న్యాయ వ్యవస్థ ఔన్నత్యం. మన దేశ రాజ్యాంగానికి సంరక్షకుడిగా సుప్రీంకోర్టు వ్యవహరిస్తుంది. సుప్రీంకోర్టు స్వయం ప్రతిపత్తిని కలిగి ఉండి, న్యాయ సమీక్షాధికారాన్ని కూడా కలిగి ఉంది. భారత రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించేది, రాజ్యాంగానికి అర్థ వివరణను ఇచ్చేది సుప్రీంకోర్టు మాత్రమే.
దృఢ రాజ్యాంగం
* భారత రాజ్యాంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సవరించడంలో అనేక పరిమితులు ఉన్నాయి. రాజ్యాంగ సవరణలో రాష్ట్రాల పాత్ర నామమాత్రం. రాజ్యాంగంలోని అనేక అంశాలను ఆర్టికల్ 368 ప్రకారం పార్లమెంటు సవరించాలంటే 2/3వ వంతు ప్రత్యేక మెజారిటీ ద్వారానే సాధ్యం. అంటే భారత రాజ్యాంగ సవరణా విధానం కఠినమైన పద్ధతిలో ఉంది.


రాజ్యాంగ సవరణలో రాష్ట్రాల పాత్ర
* భారత రాజ్యాంగంలోని కొన్ని సమాఖ్య లక్షణాలను సవరించాలంటే పార్లమెంటు 2/3 వ వంతు ప్రత్యేక మెజారిటీతో పాటు దేశంలోని మొత్తం రాష్ట్రాల్లో సగం కంటే ఎక్కువ రాష్ట్రాల ఆమోదం తప్పనిసరి.


భారత రాజ్యాంగంలోని ఏక కేంద్రం - లక్షణాలు 
బలమైన కేంద్ర ప్రభుత్వం
* వాస్తవ సమాఖ్యలో బలమైన రాష్ట్రాలు, బలహీనమైన కేంద్ర ప్రభుత్వం ఉంటాయి. మన దేశంలో రాజ్యాంగ నిర్మాతలు బలమైన కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు.
* కేంద్ర ప్రభుత్వం కేంద్ర జాబితాలోని 100 అంశాలపైన, రాష్ట్ర జాబితాలోని 61 అంశాలపైన, ఉమ్మడి జాబితాలోని 52 అంశాలపైన అసాధారణ పరిస్థితుల్లో శాసనాలు రూపొందించగలదు.
* ఆర్టికల్ 248 ప్రకారం అవశిష్ట అధికారాలన్నీ కేంద్రం గుప్పిట్లోనే ఉంటాయి.


ఏక పౌరసత్వం
* భారత్‌లోని భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించడానికి, దేశ సుస్థిరత, సమగ్రతలను పరిరక్షించడానికి రాజ్యాంగ నిర్మాతలు రెండో భాగంలో ఆర్టికల్ 5 నుంచి 11 వరకు భారతీయులందరికీ ఏక పౌరసత్వాన్ని ప్రసాదించారు.
* విచ్ఛిన్నకర శక్తులైన ప్రాంతీయతత్వం, స్థానికతత్వాలు బలపడకుండా భారతీయులంతా ఒకటే అనే ఉన్నత భావాన్ని పెంపొందించడానికి రాజ్యాంగ నిర్మాతలు ఏక పౌరసత్వాన్ని కల్పించారు.
* ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి ఉండటం వల్ల జమ్మూ కశ్మీర్ రాష్ట్ర పౌరులకు
ద్వంద్వ పౌరసత్వం ఉంది.

ఏకీకృత న్యాయవ్యవస్థ
* మన దేశంలో ఏకీకృత న్యాయవ్యవస్థ అమల్లో ఉంది. దీని ప్రకారం జాతీయ స్థాయిలో అత్యున్నత న్యాయస్థానంగా సుప్రీంకోర్టు వర్ధిల్లుతుంది. దీని తీర్పులు దేశంలోని మిగిలిన న్యాయస్థానాలన్నింటికీ శిరోధార్యమే. రాష్ట్రాల్లో ఉన్నత న్యాయస్థానాలుగా హైకోర్టులు వర్ధిల్లుతాయి. హైకోర్టులకు దిగువన సబార్డినేట్ కోర్టులు ఉంటాయి.


ఎన్నికల సంఘం
* భారత రాజ్యాంగం ఒకే ఒక ఎన్నికల సంఘాన్ని ఏర్పరచింది. ఈ ఎన్నికల సంఘానికి చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌ను, ఇతర కమిషనర్‌లను రాష్ట్రపతి నియమిస్తారు. పార్లమెంటు, రాష్ట్ర శాసనసభల ఎన్నికలను, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలను ఈ కేంద్ర ఎన్నికల సంఘమే నిర్వహిస్తుంది.
గవర్నర్ వ్యవస్థ
* రాజ్యాంగం ద్వారా రాష్ట్రానికి అధిపతి గవర్నర్. రాష్ట్ర పరిపాలనను మొత్తం గవర్నర్ పేరు మీదుగానే నిర్వహిస్తారు. గవర్నర్ల నియామకం, బదిలీలు, తొలగింపు మొదలైన అధికారాలన్నీ కేంద్రం పరిధిలోనే ఉంటాయి.
ఒకే రాజ్యాంగం
* భారతదేశం మొత్తానికి ఒకే రాజ్యాంగం అమల్లో ఉంటుంది. ఈ రాజ్యాంగం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు శిరోధార్యంగా, అత్యున్నత శాసనంగా వర్ధిల్లుతుంది.
* ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక స్వయం ప్రతిపత్తి ఉండటం వల్ల జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక రాజ్యాంగం ఉంది.


అత్యవసర పరిస్థితి అధికారాలు
¤ భారత రాజ్యాంగంలోని 18వ భాగంలో పేర్కొన్న 3 రకాల అత్యవసర పరిస్థితి అధికారాలు మన దేశ ఏక కేంద్ర లక్షణాలను ప్రతిఫలిస్తున్నాయి. అవి:
1. ఆర్టికల్ 352 - జాతీయ అత్యవసర పరిస్థితి
2. ఆర్టికల్ 356 - రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన
3. ఆర్టికల్ 360 - ఆర్థిక అత్యవసర పరిస్థితి


అఖిల భారత సర్వీసులు
* అఖిల భారత సర్వీసుల ఉద్యోగులను భారత ప్రభుత్వం తరఫున యూపీఎస్సీ ఎంపిక చేస్తుంది. వీరిని కేంద్ర ప్రతినిధులుగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కీలక పదవుల్లో నియమిస్తారు. కేంద్ర, రాష్ట్ర చట్టాలను అమలు చేస్తారు.
రాజ్యాంగ, రాజ్యాంగేతర సంస్థల అధిపత్యం
* ఆర్టికల్ 148 ద్వారా ఏర్పడిన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) రాష్ట్ర ప్రభుత్వాల ఖాతాలను తనిఖీ చేస్తారు.
* ఆర్టికల్ 280 ద్వారా ఏర్పడిన కేంద్ర ఆర్థిక సంఘం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆదాయ వనరుల పంపిణీని సిఫార్సు చేస్తుంది.
* ఆర్టికల్ 263 ద్వారా ఏర్పడిన అంతర్ రాష్ట్ర మండలి కేంద్రానికి, రాష్ట్రాలకు, వివిధ రాష్ట్రాల మధ్య తలెత్తే వివాదాలను పరిష్కరిస్తుంది.
* ఆర్టికల్ 365 ప్రకారం కేంద్రం జారీ చేసిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వాలు పాటించాలి.
* ఆర్టికల్ 275 ప్రకారం కేంద్రం తన ఇష్టానుసారం రాష్ట్రాలకు సహాయక గ్రాంట్లను మంజూరు చేస్తుంది.
* నీతి ఆయోగ్ కేంద్రం, రాష్ట్రాలు అనుసరించాల్సిన ప్రణాళికా విధానాలను రూపొందించి వాటి అమలును నియంత్రిస్తుంది.
* ప్రధాని అధ్యక్షతన ఉన్న జాతీయాభివృద్ధి మండలి రాష్ట్రాలను నియంత్రిస్తుంది.

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌