• facebook
  • whatsapp
  • telegram

అటవీ వనరులు - సంరక్షణ

తరగని సంపదకు.. తరాల సంక్షేమానికి!

భూగోళమనే శరీరానికి అడవులే ఊపిరితిత్తులు. అవి వాయు కాలుష్యాన్ని నివారించి జీవరాశికి స్వచ్ఛమైన గాలి, నీరు, ఆహారాన్ని అందిస్తాయి. అత్యంత విలువైన, ఎన్నటికీ తరిగిపోని ఆ సహజ సంపదను అందరూ కాపాడుకోవాలి. వనాలు క్షీణించే కొద్దీ కాలుష్యం, భూతాపం పెరిగిపోతాయి. వర్షాలు గతి తప్పుతాయి. దాంతో ఆహార సంక్షోభం సంభవిస్తుంది. అలాంటి సమస్యల నిరోధానికి, భవిష్యత్తు తరాల సంక్షేమానికి అడవులను రక్షించుకోవడం చాలా అవసరం. అందుకే మన దేశంలో అడవుల స్థితిగతులు, వాటిలో రకాలు, సంరక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు తదితర వివరాలను కాబోయే ప్రభుత్వ ఉద్యోగులు తెలుసుకోవాలి.

ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన సంపదలో అడవులు, ఉద్భిజ్జ సంపద అత్యంత ప్రధానమైనవి. ఏదైనా ఒక భౌగోళిక ప్రాంతంలో సహజసిద్ధంగా పెరిగే వృక్షాలను అడవులుగా భావిస్తే, వాటితో పాటు ఉండే గడ్డి మైదానాలు, పొదలు, మొక్కలు, లతలు అన్నింటినీ కలిపి ఉద్భిజ్జ సంపదగా పరిగణిస్తారు. ఫారెస్ట్‌ అనే పదం ఫోరెస్‌ (Fores) అనే లాటిన్‌ పదం నుంచి పుట్టింది. అడవులు పర్యావరణాన్ని పరిరక్షించడమే కాకుండా, మానవుడి ఆర్థిక, సామాజిక అవసరాలను తీరుస్తున్నాయి. మన దేశంలో 1987 నుంచి ప్రతి రెండేళ్లకు ఒకసారి అడవుల లెక్కలను ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియా సేకరిస్తోంది. 2021లో సేకరించిన 17వ ఇండియన్‌ స్టేట్‌ ఫారెస్ట్‌ రిపోర్ట్‌ ప్రకారం (ISFR) దేశంలో 7,13,789 చ.కి.మీ. (71.37 మిలియన్ల హెక్టార్లు) మేర అడవులున్నాయి. దేశ వైశాల్యంలో 21.71% విస్తరించాయి. 2019 నాటి ఐఎస్‌ఎఫ్‌ఆర్‌ లెక్కలతో పోలిస్తే 1,540 చ.కి.మీ. మేర అడవులు పెరిగాయి. ఈ పెరుగుదల అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌లో, ఆ తర్వాత తెలంగాణ, ఒడిశాలలో ఉంది.

విస్తరణ స్థితిగతులు

మన దేశ అడవులు ప్రపంచ అడవుల్లో 2% మాత్రమే ఉన్నప్పటికీ 10వ స్థానంలో ఉన్నాయి. ఐక్యరాజ్య సమితిలోని ఫుడ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ వారి గ్లోబల్‌ ఫారెస్ట్‌ రిసోర్సెస్‌ అంచనా ప్రకారం ప్రపంచంలో అత్యధిక అడవులు ఉన్న దేశాలు వరుసగా 1) రష్యా 2) బ్రెజిల్‌ 3) కెనడా.

దేశంలో అడవులు అత్యధికంగా విస్తరించిన రాష్ట్రం మధ్యప్రదేశ్‌ అయితే, అడవుల శాతం అత్యధికంగా ఉన్న రాష్ట్రం మిజోరం.


అడవుల విస్తీర్ణం రాష్ట్రాల్లో..

అత్యధికం                       

1. మధ్యప్రదేశ్‌               

2. అరుణాచల్‌ప్రదేశ్‌       

3. ఛత్తీస్‌గఢ్‌                 

అత్యల్పం

1. హరియాణా

2. పంజాబ్‌

3. గోవా

             

కేంద్రపాలిత ప్రాంతాల్లో..

అత్యధికం                                

1. జమ్ము-కశ్మీర్‌                     

2. అండమాన్‌ నికోబార్‌ దీవులు    

3. లద్దాఖ్‌                               

అత్యల్పం

1. చండీగఢ్‌

2. లక్షదీవులు

3. పుదుచ్చేరి

అడవుల శాతం రాష్ట్రాల్లో..

అత్యధికం                               

1. మిజోరం (85%)               

2. అరుణాచల్‌ ప్రదేశ్‌ (79%)   

3. మేఘాలయ (76%)         

అత్యల్పం

1. హరియాణా (3.63%)

2. పంజాబ్‌ (3.67%)

3. రాజస్థాన్‌ (4.87%)

కేంద్రపాలిత ప్రాంతాల్లో...

అత్యధికం                             

1. లక్షదీవులు (90.33%)     

2. అండమాన్‌ నికోబార్‌ దీవులు (82%)    

3. జమ్ము-కశ్మీర్‌ (39%)    

అత్యల్పం

1. లద్దాఖ్‌ (1.35%)   

2. పుదుచ్చేరి (11%)

3. దిల్లీ (13%)

                      

దేశంలో అడవుల ప్రాంతీయ వర్గీకరణను గమనిస్తే అత్యధిక శాతం అడవులు ద్వీపకల్ప పీఠభూమిపై (57%) ఉన్నాయి. హిమాలయాలపైన 18%; పశ్చిమ కనుమలు, పశ్చిమ తీరంలో 10%; తూర్పు కనుమలు, తూర్పు తీరంలో 10%; మిగిలిన 5 శాతం ఉత్తర మైదానాల మీద విస్తరించి ఉన్నాయి.


అడవుల్లో రకాలు 

సాధారణంగా అడవులు వర్షపాతం, గాలిలో తేమ, ఉష్ణోగ్రత, సముద్ర మట్టం నుంచి ఎత్తు వంటి వాటిపై ఆధారపడి పెరుగుతాయి. భారతదేశంలో అనేక నిమ్నోన్నతాలు, శీతోష్ణ స్థితిగతుల్లో ప్రాంతాల మధ్య వ్యత్యాసాల వల్ల వివిధ రకాల అడవులు విస్తరించి ఉన్నాయి. కొంతమంది శాస్త్రవేత్తలు భారతదేశ అడవులను ఎన్నో విధాలుగా విభజించినప్పటికీ సాధారణ అవగాహన కోసం దేశంలో అడవులను కింది విధంగా వర్గీకరించవచ్చు.

ఉష్ణ మండల సతతహరిత అరణ్యాలు: ఈ రకం దేశంలో 21 శాతం విస్తరించి ఉన్నాయి. ఇవి పెరగడానికి 200 సెం.మీ. కంటే ఎక్కువ వర్షపాతం, సముద్ర మట్టం నుంచి 500 - 1500 మీ. కంటే ఎత్తయిన ప్రాంతం కావాలి. అందువల్ల ఇవి పశ్చిమ కనుమల పశ్చిమ భాగాల్లోనూ, అన్ని ఈశాన్య రాష్ట్రాల్లోనూ, అండమాన్‌ - నికోబార్‌ దీవుల్లో విస్తరించి ఉంటాయి. ఈ అడవుల్లో మహాగని, ఎబోని, రోజ్‌వుడ్, సింకోనా, సేముల్, ఇరులా లాంటి పొడవైన కాండాలు, వెడల్పయిన ఆకులు, గట్టి కలపనిచ్చే చెట్లు పెరుగుతాయి.

ఉష్ణమండల ఆకురాల్చు అడవులు: మన దేశ అడవుల్లో ఈ రకం అత్యధికంగా 65 శాతం ఉన్నాయి. 100 - 200 సెం.మీ. వర్షపాతం, సముద్ర మట్టం నుంచి 500 మీటర్ల ఎత్తు వరకు ఉన్న ప్రాంతాల్లో పెరుగుతాయి. కొండవాలులు, పీఠభూములు, మైదాన ప్రాంతాలు వీటికి అనుకూలం. ద్వీపకల్పం మీద, అన్ని పీఠభూముల్లో, తూర్పు కనుమల వెంబడి శివాలిక్‌ హిమాలయాల్లోనూ, లక్షదీవులు, అండమాన్‌ నికోబార్‌ తూర్పు ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. ఈ అడవుల్లోనూ గట్టి కలప, వెడల్పు ఆకులుండే టేకు, మద్ది, సాల్, గంధపు చెట్లు, వెదురులాంటి వృక్ష సంపద ఉంటుంది.

ఉష్ణమండల పొదలు లేదా ఎడారి పొదలు: ఇవి ఎక్కువగా వాయవ్య భారత దేశంలోనూ, ద్వీపకల్పంలో కొండల తూర్పు భాగాల్లోని వర్షచ్ఛాయా ప్రాంతాల్లో 2% మేర విస్తరించి ఉన్నాయి. వీటికి 100 సెం.మీ. కంటే తక్కువ వర్షం సరిపోతుంది. ఇందులో తాటి, ఈత, కర్జూరం చెట్లు, బ్రహ్మజెముడు, నాగజెముడు వంటి పొదలు, చిన్న ఆకులు, దళసరి ఆకులుండే వృక్ష సంపద పెరుగుతుంది. ఇవి బాష్పోత్సేకాన్ని నిరోధిస్తాయి. కాబట్టి వీటిని ‘జీరోఫైట్స్‌’ వృక్షసంపద అంటారు.

హిమాలయ పర్వత అడవులు: ఎత్తయిన హిమాలయాల్లో పెరిగే వృక్షసంపద. ఇవి మిగతా ప్రాంతాలతో పోలిస్తే మంచులో పెరిగే ఆల్ఫైన్‌ అడవులు, సమశీతల శృంగాకార అడవుల వృక్ష సంపద ఉంటాయి. ఉదా: విల్లో, ఆల్టర్, దేవదారు, ఓక్‌ సిల్వర్‌ పర్‌.

మడ అడవులు: ఇవి ఉప్పు నీరు కలిసిన డెల్టాలు, ఈస్చ్యురీల్లో (నదీముఖాలు) పెరుగుతాయి. వీటినే టైడల్‌ ఫారెస్ట్‌ లేదా క్షారజల అరణ్యాలు అంటారు. ఇవి మన దేశంలో 2% మాత్రమే ఉన్నాయి. సముద్రతీరం ఉన్న 9 రాష్ట్రాలు, అండమాన్‌-నికోబార్‌ దీవులు, పుదుచ్చేరి, దాద్రానగర్‌ హవేలి ప్రాంతాల్లో అక్కడక్కడా విస్తరించి ఉన్నాయి. ఇవి సునామీలకు సహజ అడ్డుగోడలుగా ఉపయోగపడతాయి. వీటికి శ్వాసవేళ్లు, కాండాలలో గాలి గదులు ఉంటాయి. వీటితో చేపల వేటకు వాడే సంప్రదాయ పడవలను ఎక్కువగా తయారు చేస్తుంటారు.


అటవీ సంరక్షణకు ప్రభుత్వ చర్యలు

* అటవీ చట్టం - 1927

* వన్యప్రాణి సంరక్షణ చట్టం - 1972

* పులిని జాతీయ జంతువుగా ప్రకటించిన సంవత్సరం - 1972

* మొదటిసారిగా పులుల సంరక్షణ ప్రాంతాలను ఏర్పాటు చేసిన సంవత్సరం - 1973

* అటవీ పరిరక్షణ చట్టం - 1980

* పర్యావరణ చట్టం - 1986

* జీవ వైవిధ్య చట్టం - 2002

* వన మహోత్సవ కార్యక్రమం - ప్రతి సంవత్సరం జులైలో

* 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా అడవులను ఉమ్మడి జాబితాలో చేర్చారు. ఆదేశిక సూత్రాల్లో కూడా పొందుపరిచారు.

* సామాజిక అడవుల కార్యక్రమం - 1980-82


మాదిరి ప్రశ్నలు


1. కిందివాటిలో మడ అడవులు లేని రాష్ట్రం ఏది?

1) పశ్చిమ బెంగాల్‌     2) తమిళనాడు     3) ఆంధ్రప్రదేశ్‌       4) అస్సాం

జ: అస్సాం

2. అడవుల విస్తీర్ణం అత్యధికంగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం ఏది?

1) లద్దాఖ్‌      2) జమ్ము-కశ్మీర్‌      3) అండమాన్‌ - నికోబార్‌ దీవులు     4) లక్షదీవులు

జ: జమ్ము-కశ్మీర్‌

3. కింది ఏ అడవుల్లో జీవవైవిధ్యం ఎక్కువగా కనిపిస్తుంది?

1) దట్టంగా పెరిగే సతతహరిత అరణ్యాలు 

2) గడ్డి భూములు ఎక్కువగా ఉండే ఆకురాల్చు అడవులు

3) ముళ్ల పొదలు ఎక్కువగా ఉండే ఎడారి పొదలు

4) హిమాలయాల్లోని అడవులు

జ: గడ్డి భూములు ఎక్కువగా ఉండే ఆకురాల్చు అడవులు

4. కోరింగ అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది?

1) ఒడిశా      2) తమిళనాడు     3) కేరళ     4) ఆంధ్రప్రదేశ్‌

జ: ఆంధ్రప్రదేశ్‌​​​​​​​

5. జాతీయ అటవీ విధాన తీర్మానం ప్రకారం దేశంలో ఎంత శాతం అడవులు ఉండాలి?

1) 33.3%     2) 23.3%    3) 43.3%     4) 53.3%

జ: 33.3%

6. ఫారెస్ట్‌ అనే పదం ఏ భాషా పదం నుంచి వచ్చింది?

1) గ్రీకు      2) అరబ్బీ     3) లాటిన్‌      4) స్పానిష్‌

జ: లాటిన్‌​​​​​​​

7. మన దేశంలో 90% కి మంచి అడవులు ఉన్న ప్రాంతం ఏది?

1) మిజోరం      2) లక్షదీవులు      3) అండమాన్‌ - నికోబార్‌      4) మధ్యప్రదేశ్‌

జ: లక్షదీవులు​​​​​​​

8. కింది ఏ దేశం మొదటిసారిగా అడవుల నరికివేతను నిషేధించింది?

1) డెన్మార్క్‌       2) నార్వే       3) అమెరికా      4) రష్యా

జ: నార్వే​​​​​​​

9. అడవి గాడిదల వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది?

1) కచ్, గుజరాత్‌     2) రాంచి, ఝార్ఖండ్‌     3) జోర్హాట్, అస్సాం    4) ఎర్నాకులం, కేరళ

జ: కచ్, గుజరాత్‌​​​​​​​

10. దేశంలో అత్యల్పంగా అడవులున్న రాష్ట్రం?

1) పంజాబ్‌       2) హరియాణా      3) రాజస్థాన్‌        4) సిక్కిం

జ: హరియాణా​​​​​​​


రచయిత: జల్లు సద్గుణరావు

Posted Date : 25-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌