• facebook
  • whatsapp
  • telegram

పర్యావరణ పరిరక్షణ చట్టం - భారతదేశం

పర్యావరణ సంతులనాన్ని పరిరక్షించి జీవరాశిని కాపాడటానికి పర్యావరణ యాజమాన్యానికి పటిష్ఠమైన శాసనాలు, చట్టాలు అవసరం. మనదేశంలో కాలుష్య సంబంధిత సమస్యలు పెనుసవాళ్లుగా మారాయి. వీటి నియంత్రణ, పర్యావరణాన్ని రక్షించడానికి ప్రభుత్వం కొన్ని చట్టాలను రూపొందించింది. అదేవిధంగా పర్యావరణ కాలుష్యాన్ని నివారించి ప్రకృతి సహజసిద్ధ లక్షణాలను కాపాడటం; అడవులు, వన్యప్రాణుల శ్రేయస్సు దృష్ట్యా పర్యావరణ పరిరక్షణను ప్రభుత్వం బాధ్యతగా గుర్తించింది.


పర్యావరణ పరిరక్షణ - లక్ష్యాలు


ఎ) పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడటం.
బి) కాలుష్య కారకాల వల్ల కలిగే హానికర ప్రభావాల నుంచి జీవరాశులన్నింటినీ కాపాడటం.
సి) సహజ వనరులను పరిరక్షించడం.
డి) హక్కులు, స్వేచ్ఛ, సమానత్వానికి భంగం వాటిల్లకుండా ప్రజలందరూ సగౌరవంగా, హుందాగా జీవించే అవకాశాన్ని కల్పించడం.


పర్యావరణ రక్షణ - రాజ్యాంగ ప్రస్తావన


  పర్యావరణాన్ని పరిరక్షించే విషయంలో ప్రభుత్వం, ప్రజలు బాధ్యత వహించాలని రాజ్యాంగం నిర్దేశించింది. మొదట రాజ్యాంగంలో ఈ ప్రస్తావన లేదు. కానీ 1972 జూన్‌లో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో స్టాక్‌హోం (స్వీడన్‌)లో నిర్వహించిన పర్యావరణ సదస్సులో దీన్ని సవరించారు. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 48(A), 51(A) (g)  నిబంధనల కింద పర్యావరణ పరిరక్షణను పొందుపరిచారు. ఇలా జీవవైవిధ్యాన్ని కాపాడటానికి ప్రభుత్వానికి సర్వ హక్కులను ఇచ్చిన మొదటి దేశం భారత్‌.


ఉదా:


* రాజ్యాంగంలోని 21వ నిబంధన ప్రకారం జీవించే హక్కులో భాగంగా ఆరోగ్యకరమైన పర్యావరణ హక్కును సుప్రీంకోర్టు ఒక సాధనంగా పేర్కొంది.
* రాజ్యాంగంలో 47వ నిబంధన కింద ప్రజల జీవన ప్రమాణాలు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడం; పౌష్టికాహార స్థాయిని పెంచడం లాంటి అంశాలను చేర్చింది.
* రాజ్యాంగంలో 48(A) నిబంధనలో అడవులు, వన్యప్రాణులు, సహజ పర్యావరణ పరిరక్షణ ప్రభుత్వ బాధ్యత అని పేర్కొంది.
* రాజ్యాంగంలో 51(A) నిబంధన కింద ప్రాథమిక విధుల్లో భాగంగా చెరువులు, నదులు, సరస్సులు, వన్యప్రాణులు, వన సంరక్షణ, జీవవైవిధ్యాన్ని కాపాడటం పౌరుల విధిగా పేర్కొంది.


పర్యావరణ రక్షణకు ప్రభుత్వం అమలు చేసిన చట్టాలు


* 1857 పారిశ్రామిక వ్యర్థాల చట్టం


* 1879 ఏనుగు సంరక్షణ చట్టం


* 1897 మత్స్యసంపద పరిరక్షణ చట్టం


* 1905 బెంగాల్‌ పొగ ఇబ్బందుల నివారణ చట్టం


* 1927 భారతీయ అడవుల చట్టం


* 1938 మోటారు వాహనాల చట్టం


* 1946 బిహార్‌ నిరుపయోగ భూముల చట్టం


స్వాతంత్య్రం తర్వాత ప్రభుత్వం అమలు చేసిన చట్టాలు


1) కర్మాగారాల చట్టం - 1948:
1887 చట్టాన్ని సవరించి కర్మాగారాల్లో పనిచేసే కార్మికుల ఆరోగ్యం, భద్రత, సంక్షేమం కోసం 1948లో కర్మాగారాల చట్టాన్ని రూపొందించింది. పరిశ్రమల చుట్టుపక్కల నివసించే ప్రజల ఆరోగ్యం, భద్రత, పర్యావరణం గురించి ఈ చట్టంలో నిబంధనలు రూపొందించారు.


2) క్రిమిసంహారక మందుల చట్టం - 1968:
మందుల తయారీ, దిగుమతి, విక్రయం, రవాణా, పంపిణీ, వినియోగం లాంటి కార్యకలాపాలను క్రిమిసంహారక మందుల చట్టం - 1968 ద్వారా నియంత్రించవచ్చు.


3) వన్యప్రాణి సంరక్షణ చట్టం - 1972:
1972లో స్టాక్‌హోం (స్వీడన్‌)లో నిర్వహించిన పర్యావరణ సదస్సు తర్వాత దేశంలో మొదటి వన్యప్రాణులు, పక్షులు అంతరించిపోకుండా రక్షించే లక్ష్యంతో జాతీయ వన్యప్రాణి సంరక్షణ చట్టం - 1972ను రూపొందించారు. వన్య మృగాలను వేటాడటాన్ని ఈ చట్టం పూర్తిగా నిషేధిస్తుంది. దీన్ని 2002లో సవరించారు. ఈ చట్టం కింద ప్రధానమంత్రి అధ్యక్షతన ఒక జాతీయ మండలిని ఏర్పాటు చేయవచ్చు. తర్వాత ఈ చట్టాన్ని 2006లో మరోసారి పార్లమెంటు ద్వారా సవరించి పులుల రిజర్వు హాట్‌స్పాట్‌లలో ‘టైగర్‌ టాస్క్‌ ఫోర్స్‌’లను ఏర్పాటుచేశారు. దీని ప్రకారం జంతువులు ప్రధానంగా పులుల చర్మం, గోర్లు లాంటి వాటితో వ్యాపారం చేయడం చట్ట వ్యతిరేకం.


4) నీటి కాలుష్య నివారణ, నియంత్రణ చట్టం - 1974:
నీటిలో నివసించే, నీటిని వినియోగించే జీవరాశులకు హాని కలగకుండా; పరిశ్రమల ద్వారా నదులు, చెరువుల్లోకి పంపే విషపూరిత రసాయన వ్యర్థాల వల్ల నీటి కాలుష్యం పెరగడాన్ని నిషేధిస్తూ 1974లో కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని రూపొందించింది. ఇది కాలుష్య నివారణ మొదటి జాతీయ చట్టం. దీని ప్రకారం నీటి నాణ్యతను కాపాడుతూ నదులు, సరస్సులు, చెరువులు, కాలువల్లోని నీటి కాలుష్యాన్ని నియంత్రించాలి. ఈ చట్టం ప్రకారం కేంద్ర - రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండళ్లను ఏర్పాటు చేశారు.

* జాతీయ కాలుష్య నియంత్రణ మండలి న్యూదిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. దీని కింద 7 ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి.


5) వాయు కాలుష్య నివారణ, నియంత్రణ చట్టం - 1981:
పారిశ్రామిక విసర్జితాలు లేదా వాహనాల నుంచి వెలువడే వివిధ ఉద్గారాలను నియంత్రించడానికి 1981లో కేంద్ర ప్రభుత్వం వాయు కాలుష్య నియంత్రణ చట్టాన్ని రూపొందించింది. ఈ నిబంధనలను అతిక్రమించిన వ్యక్తులు, సంస్థలు శిక్షార్హులు. ఏడాదిన్నర నుంచి గరిష్ఠంగా 6 సంవత్సరాలు జైలు శిక్ష, పదివేల జరిమానా విధిస్తారు.


6) పర్యావరణ సంరక్షణ చట్టం - 1986:
1974 నీటి కాలుష్య నియంత్రణ చట్టం, 1981 వాయు కాలుష్య నియంత్రణ చట్టం రెండూ సమర్థంగా పర్యావరణ కాలుష్య నివారణకు ఉపయోగపడలేదని కేంద్ర ప్రభుత్వం గ్రహించింది. అన్ని రకాల కాలుష్యాల నియంత్రణ, పర్యావరణ నాణ్యత కాపాడటం కోసం కేంద్రం పార్లమెంటు ద్వారా 1986లో ఒక సమగ్ర, సార్వత్రిక చట్టాన్ని ప్రవేశపెట్టింది. దీన్ని పర్యావరణ పరిరక్షణ చట్టం అంటారు.


7) జీవ వైవిధ్య చట్టం - 2002:
వివిధ జాతులకు చెందిన జీవులు ఉండే సమూహ ప్రాంతాలు లేదా భౌమ, సముద్ర, ఇతర జలావరణ వ్యవస్థల్లోని విభిన్న జీవరాశులు, వాటి మధ్య ఉండే వైవిధ్యాల స్వరూపాన్నే జీవవైవిధ్యం అంటారు. మన దేశంలో దీన్ని మొదటిసారిగా 2002 పార్లమెంటు చట్టం ద్వారా ఆమోదించగా 2003, అక్టోబరు 1 నుంచి అమల్లోకి వచ్చింది. దీని ప్రధాన కార్యాలయం చెన్నైలో ఉంది. ప్రస్తుతం ప్రపంచంలోని జీవవైవిధ్య దేశాల్లో 17వ పెద్ద దేశంగా భారత్‌ గుర్తింపు పొందింది.


8) అటవీ హక్కుల గుర్తింపు చట్టం - 2006:
1988లో కేంద్ర ప్రభుత్వం అటవీ అభివృద్ధిలో గిరిజనులకు భాగస్వామ్యం కల్పించాలని తీసుకున్న నిర్ణయానికి పొడిగింపుగా 2006, డిసెంబరు 18న పార్లమెంట్‌ ద్వారా అటవీ హక్కుల అమలు చట్టం ఆమోదం పొందింది. ఇది 2007, డిసెంబరు 31 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం అనాధిగా నివాసముంటున్న వివిధ జాతుల సంప్రదాయ హక్కులను గుర్తించి 2005, డిసెంబరు 13కు ముందు, ఆ తర్వాత కూడా అటవీ భూములు సేద్యం చేస్తున్నవారికి వాటి మీద హక్కు లభిస్తుంది.


9) జాతీయ హరిత ట్రైబ్యునల్‌ చట్టం - 2010:
రాజ్యాంగంలోని 21వ నిబంధనకు స్ఫూర్తిగా పర్యావరణ సమస్యలను పరిష్కరించేందుకు భారత పార్లమెంటు 2010, మే 5న దీన్ని ఆమోదించింది. ఈ చట్టం న్యూదిల్లీ కేంద్రంగా 2010, అక్టోబరు 28న అమల్లోకి వచ్చింది. 2011, జులై 4 నుంచి విధులను నిర్వర్తిస్తుంది. ఈ ట్రైబ్యునల్‌ జీవ వైవిధ్యం, వన్యప్రాణులు; అటవీ, పర్యావరణ సమస్యలను బెంచ్‌ ద్వారా పరిష్కరిస్తుంది. దీని కింద నాలుగు ట్రైబ్యునల్‌ బెంచ్‌లు ఉన్నాయి. అవి:
1) సెంట్రల్‌ బెంచ్‌ - భోపాల్‌
2) పశ్చిమ బెంచ్‌ - పుణె
3) తూర్పు బెంచ్‌ - కోల్‌కతా
4) దక్షిణ బెంచ్‌ - చెన్నై


10) జాతీయ కార్యచరణ ప్రణాళిక - 2016:
వాతావరణ మార్పులపై 2015 డిసెంబరులో COP-21 సదస్సును నిర్వహించారు. దీనికి అనుగుణంగా భారత ప్రభుత్వం 2016 డిసెంబరులో జాతీయ కార్యచరణ ప్రణాళికను రూపొందించింది. దీనిలో భాగంగా 8 జాతీయ మిషన్‌లను ప్రారంభించారు.
1) సోలార్‌ మిషన్‌

2) శక్తి సామర్థ్య మిషన్‌
3) సుస్థిరాభివృద్ధి ఆవాస మిషన్‌
4) వాటర్‌ మిషన్‌
5) హిమాలయ ఆవరణ మిషన్‌
6) గ్రీన్‌ ఇండియా మిషన్‌
7) సుస్థిరాభివృద్ధి వ్యవసాయ మిషన్‌
8) వాతావరణ మార్పు వ్యూహాత్మక మిషన్‌

 

మరికొన్ని చట్టాలు....
1) హానికర వ్యర్థాల నియంత్రణ చట్టం - 1989
2) బయో మెడికల్‌ వ్యర్థాల నివారణ నిబంధనల చట్టం - 1998
3) ధ్వని కాలుష్య నియంత్రణ చట్టం - 2000
4) ప్లాస్టిక్‌ రీసైకిల్‌ ఉత్పత్తి వాడక చట్టం - 2003

Posted Date : 10-07-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌