• facebook
  • whatsapp
  • telegram

భారత రాజ్యాంగంలోని సమాఖ్య లక్షణాలు - పరిశీలన

  జాతీయ, ప్రాంతీయ ప్రభుత్వాల స్వభావాలను అనుసరించి రాజనీతిజ్ఞులు ఏక కేంద్ర, సమాఖ్య ప్రభుత్వాలను వివరించారు. ఏకకేంద్ర ప్రభుత్వంలో అధికారాలన్నీ కేంద్ర ప్రభుత్వానికే ఉంటాయి. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నా, వాటికి అధికారం కేంద్రమే ఇస్తుంది. సమాఖ్య ప్రభుత్వంలో రాజ్యాంగమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాలను విభజిస్తుంది. రెండు ప్రభుత్వాలు స్వతంత్రంగా తమతమ పరిధుల్లో పని చేస్తాయి.

 సమాఖ్య - అర్థం
   'సమాఖ్య' లాటిన్ భాషలోని ఫోడస్ అనే పదం నుంచి వచ్చింది. ఫోడస్ అంటే ఒడంబడిక లేదా ఒప్పందం. సమాఖ్య కొన్ని రాష్ట్రాల సమితి. అయితే కొన్ని రాష్ట్రాలతో కూడిన ప్రతి సమితిని సమాఖ్య అనలేం. సమాఖ్యలో రాష్ట్రాలు ఉమ్మడి అంశాలపై ఏకరాజ్యంగా, ఇతర అంశాలపై స్వతంత్రంగా వ్యవహరిస్తాయి. ఇలా ఐక్యంగా, స్వతంత్రంగా పని చేయడానికి రాష్ట్రాలు, కేంద్రం మధ్య జరిగిన ఒప్పందమే సమాఖ్య.

 

 సమాఖ్య నిర్వచనం

 1987 లో డేనియల్ జె.ఎలాజర్ తను రచించిన ఎక్స్‌ప్లోరింగ్ ఫెడరేషన్ అనే పుస్తకంలో సమాఖ్య అంటే 'స్వయంపాలన భాగస్వామ్య పరిపాలన అనే విధానంలో సహజీవనం సాగించడం' అని పేర్కొన్నాడు.

 సమాఖ్య ఏర్పడే విధానం
 సమాఖ్య వ్యవస్థను ఏకీకరణ, వికేంద్రీకరణ అని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. ఏకీకరణ పద్ధతిలో సైనికపరంగా బలహీనమైన లేదా ఆర్థికంగా వెనుకబడిన స్వతంత్ర రాజ్యాలన్నీ కలసి ఒక శక్తివంతమైన పెద్ద యూనిట్‌గా ఏర్పడతాయి. ఉదాహరణ: అమెరికా
  వికేంద్రీకరణ పద్ధతిలో ఒక పెద్ద ఏకకేంద్రరాజ్యం సమాఖ్య వ్యవస్థగా మారి, ప్రాంతీయ ప్రయోజనాలను పెంపొందించడానికి ప్రావిన్స్‌లను ఏర్పరచి వాటికి స్వతంత్ర ప్రతిపత్తి ఇస్తుంది. ఉదాహరణ: కెనడా.

 

భారత రాజ్యాంగం - సమాఖ్య భావన

 భారత రాజ్యాంగంలో సమాఖ్య (Federation) అనే పదాన్ని ఎక్కడా వాడలేదు. అయితే రాజ్యాంగంలోని మొదటి ప్రకరణం భారతదేశాన్ని ఒక 'రాష్ట్రాల యూనియన్ (Union of States) 'అని పేర్కొంది. రాష్ట్రాల సమాఖ్య అని కాకుండా యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనే పదానికి ప్రాధాన్యం ఇవ్వడానికి రెండు అంశాలను డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ వివరించారు. అవి.. 1) అమెరికా సమాఖ్యలా రాష్ట్రాల మధ్య ఒప్పందంతో భారత్ సమాఖ్య ఏర్పడలేదు. 2) సమాఖ్య నుంచి రాష్ట్రాలకు విడిపోయే అధికారం లేదు. విచ్ఛిన్నం కాని సమాఖ్య భారత్ యూనియన్.

 సమాఖ్య లక్షణాలు - పరిశీలన


కేంద్ర-రాష్ట్రాల మధ్య రాజ్యాంగబద్ధ అధికార విభజన
‣ ఇది అతి ముఖ్యమైన సమాఖ్య లక్షణం. సమాఖ్యలో కేంద్ర రాష్ట్రాలు రాజ్యాంగం నుంచే అధికారాన్ని పొందుతాయి. సమాఖ్య స్వరూపం ఎలాంటిదైనా, ఏ పద్ధతిలో సమాఖ్య ఏర్పడినా, అధికార విభజన ఏదో ఒక స్వరూపంలో సమాఖ్యలో తప్పనిసరి. అధికార విభజన ఏ పద్ధతిలో జరగాలనే విషయానికి సంబంధించి కచ్చితమైన నియమాలు లేవు. ప్రతి సమాఖ్య తనకు సరిపడే అధికార విభజన విధానాన్ని స్వయంగా రూపొందించాల్సి ఉంటుంది. ఇది ఆయా దేశాల ప్రత్యేక పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. విభజన ఎలా జరిగినా సమాఖ్య విధానానికి అధికార విభజన మూలం.

‣ భారత రాజ్యాంగం కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా అనే అంశాల ద్వారా కేంద్ర-రాష్ట్రాల మధ్య అధికారాన్ని విభజిస్తుంది. కేంద్ర జాబితా అంశాలపై కేంద్రం, రాష్ట్ర జాబితా అంశాలపై రాష్ట్రాలు, ఉమ్మడి జాబితా అంశాలపై కేంద్ర, రాష్ట్రాలు చట్టాలు చేస్తాయి. ఈ చట్టాల మధ్య వైరుధ్యం ఏర్పడితే కేంద్రం చేసిన చట్టం చెల్లుతుంది. పై మూడు జాబితాల్లో లేని అవశిష్ట అధికారాలు కేంద్రానికి చెందుతాయి.
 

రాజ్యాంగ ఔన్నత్యం

‣  సమాఖ్య విధానంలో అధికార విభజనకు అనుగుణంగా కేంద్ర రాష్ట్రాలు చట్టాలు చేస్తాయి. ఈ చట్టాలు రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా ఉండాలి. అందువల్ల సమాఖ్య వ్యవస్థలో రాజ్యాంగం అత్యున్నత శాసనం.
  భారతదేశంలో సుప్రీంకోర్టు లేదా హైకోర్టులు రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా లేని శాసనాలను అవి చెల్లవని న్యాయసమీక్షాధికారం ద్వారా కొట్టివేస్తాయి. కేంద్ర రాష్ట్ర స్థాయుల్లో ఉన్న ప్రభుత్వాంగాలు శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయ శాఖ రాజ్యాంగం నిర్దేశించిన పరిధిలోనే పని చేయాలి.

 

ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థలు
‣  సమాఖ్యలో కేంద్రరాష్ట్రాల మధ్య అధికార విభజన ఫలితంగా ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థలు ఏర్పడతాయి. ఒకే దేశంలో రెండు రకాల ప్రభుత్వాలు ఏర్పడి, పౌరులపై అధికారాన్ని కలిగి ఉంటాయి. పౌరులు రెండు ప్రభుత్వాల పట్ల విధేయత కలిగి ఉంటారు.

 రాజ్యాంగం కేంద్రంలో యూనియన్ ప్రభుత్వాన్ని, కింది స్థాయుల్లో రాష్ట్ర ప్రభుత్వాలను ఏర్పరిచింది. రాజ్యాంగం ఇచ్చిన సార్వభౌమాధికారాన్ని రెండు స్థాయిల్లోని ప్రభుత్వాలు నిర్వహిస్తాయి. జాతీయ ప్రాముఖ్యం ఉన్న అంశాలను యూనియన్; ప్రాంతీయ, స్థానిక ప్రాముఖ్యం ఉన్న అంశాలను రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తాయి.
 

లిఖిత రాజ్యాంగం
‣  సమాఖ్య అనేది కేంద్రరాష్ట్రాల మధ్య ఒప్పందం. కాబట్టి వాటి మధ్య ఉన్న సంబంధాలు రాజ్యాంగం ద్వారా లిఖిత రూపంలో ఉండటం తప్పనిసరి. వివాదాలు తలెత్తినప్పుడు వాటిని పరిష్కరించడానికి రాజ్యాంగం ప్రామాణిక గ్రంథంగా పని చేస్తుంది.

‣  భారత రాజ్యాంగం లిఖితపూర్వకమైంది, ప్రపంచంలోనే అతి పెద్దది. మూల రాజ్యాంగంలో ఒక ప్రవేశిక. ఇందులో 395 ప్రకరణలు (22 భాగాలు), 8 షెడ్యూళ్లు ఉండేవి. ప్రస్తుతం ఒక ప్రవేశిక, 448 ప్రకరణలు, (25 భాగాలు) 12 షెడ్యూళ్లు ఉన్నాయి. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను, విధులను, వాటి నిర్వహణలో పరిమితులను రాజ్యాంగం నిర్దేశిస్తుంది.
 

దృఢ రాజ్యాంగం
‣  అధికార విభజనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండటానికి దృఢ రాజ్యాంగం సమాఖ్యలో తప్పనిసరి. రాజ్యాంగాన్ని కేంద్రరాష్ట్రాల ఆమోదంతో సవరిస్తారు.

‣   భారత రాజ్యాంగంలో సమాఖ్య వ్యవస్థకు సంబంధించిన అంశాలను (కేంద్రరాష్ట్ర సంబంధాలు, న్యాయవ్యవస్థ) సవరించడానికి రాజ్యాంగం దృఢమైన పద్ధతిని నిర్దేశించింది. ఈ అంశాలను సవరించడానికి పార్లమెంట్ ప్రత్యేక మెజారిటీతోపాటు రాష్ట్ర శాసనసభల ఆమోదం తప్పనిసరి.
 

 స్వతంత్ర న్యాయశాఖ
‣  రాజ్యాంగ ఔన్నత్యం సమాఖ్య ముఖ్య లక్షణమైనప్పుడు స్వతంత్ర న్యాయశాఖ ఉండటం తప్పనిసరి. కేంద్రం లేదా రాష్ట్రాలకు ఆధీనంగా ఉండని స్వతంత్ర న్యాయవ్యవస్థ కావాల్సి ఉంటుంది. రాజ్యాంగ విరుద్ధమైన చట్టాలు, చర్యలు ఉండటానికి వీలులేదు. అలాంటివాటిని రద్దు చేసే అధికారం న్యాయస్థానాలకు ఉంటుంది.
‣  భారతదేశంలో సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఒక స్వతంత్ర న్యాయశాఖను రాజ్యాంగం ఏర్పరిచింది. న్యాయసమీక్ష ద్వారా రాజ్యాంగ ఔన్నత్యాన్ని కేంద్రరాష్ట్రాల మధ్య వివాదాలను ఇది పరిష్కరిస్తుంది. న్యాయశాఖ స్వాతంత్రాన్ని కాపాడటానికి న్యాయమూర్తుల పదవీ భద్రత, నిర్ణీతమైన సర్వీసు నియమాలను రాజ్యాంగంలో పొందుపరిచారు.

 

ద్విసభా విధానం
‣  ఇది సమాఖ్య ముఖ్య లక్షణం. దిగువసభ ప్రజలకు, ఎగువసభ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. ప్రపంచంలోని వివిధ సమాఖ్య రాజ్యాంగాల్లో ఈ అంశాలు విభిన్నంగా ఉంటాయి.

‣  భారత రాజ్యాంగం, ఎగువ సభ (రాజ్యసభ), దిగువ సభ (లోక్‌సభ) అనే ద్వివిధ శాసనసభా విధానాన్ని ఏర్పరచింది. రాష్ట్రాలకు రాజ్యసభ, మొత్తం భారత ప్రజలకు లోక్‌సభ ప్రాతినిధ్యం వహిస్తాయి. కేంద్ర ప్రభుత్వ జోక్యం నుంచి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతూ సమాఖ్య సమతుల్యతను రాజ్యసభ కాపాడుతుంది.
 

రాజ్యాంగ పండితుల విభిన్న అభిప్రాయాలు

‣  రాజ్యాంగపరంగా యూనిటరీగా ప్రకటించకపోవడం వల్ల భారతదేశం సమాఖ్య వ్యవస్థగా రూపుదిద్దుకుంది.
‣  భారతదేశం యూనిటరీ (single ). ఎందుకంటే ఫెడరల్ అనే పదాన్ని రాజ్యాంగంలో ఎక్కడా వాడలేదు.
‣  అధికారాల పంపిణీ, ద్వంద్వ ప్రభుత్వం, సహకార ఫెడరలిజం గుణాలు ఉండటంతో అది పాక్షిక సమాఖ్యగా కనిపిస్తుంది.
‣  ఇది కేంద్రీకృత ఫెడరలిజం. ఎందుకంటే యూనియన్ అనే పదం రాజ్యాంగంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
‣  రాజ్యాంగ పదాలు, జాతీయాలు బ్రిటన్ రాజ్యాంగానికి దగ్గరగా, యూరోపియన్ సంప్రదాయాలకు సమీపంగా ఉండటం వల్ల ఇది పార్లమెంటరీ ఫెడరలిజం.
‣  సుప్రీంకోర్టు - ఎస్.ఆర్.బొమ్మై కేసులో భారత రాజ్యాంగాన్ని ఫెడరలిజంగా పేర్కొంది.
‣  కె.సి.వేర్ - భారత రాజ్యాంగం అర్ధ సమాఖ్య
‣  పాల్ ఆపిల్ బి - తీవ్రమైన సమాఖ్య
‣  మోరిస్ జోన్స్ - బేరసారాల సమాఖ్య
‣  ఐవర్ జెన్నింగ్స్ - బలమైన కేంద్రీకృత ధోరణులున్న సమాఖ్య
‣  అలెగ్జాండ్రోవిక్జ్, సుయి జెనరీస్ - వినూత్న స్వభావం కలది.
‣  గ్రాల్‌విల్ ఆస్టిన్ - సహకార సమాఖ్య

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌