• facebook
  • whatsapp
  • telegram

పారిశ్రామిక అవస్థాపన సౌకర్యాలు - పారిశ్రామిక కారిడార్లు

ప్రగతి సాధనకు ప్రత్యేక సదుపాయాలు!

భారత్‌లో వాణిజ్య ప్రగతికి కీలకమైన తూర్పు తీరంలో, దేశ, విదేశీ వర్తకాల రవాణాను అనుసంధానం చేయడానికి అనువైన స్థానంలో ఆంధ్రప్రదేశ్‌ ఉంది. పరిశ్రమల ఏర్పాటుకు, పారిశ్రామిక వృద్ధికి కావాల్సిన వాతావరణం, వనరులు, సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. ఇటీవలి కాలంలో తయారీ రంగాన్ని ప్రేరేపించే విధంగా రాష్ట్రంలో దీర్ఘకాలిక వ్యూహంతో ఓడరేవులు, జాతీయ రహదారులు, రైలు - రోడ్డు వసతులను మెరుగుపరుస్తున్నారు. విశాఖ-చెన్నై, చెన్నై-బెంగళూరు, హైదరాబాద్‌-బెంగళూరు పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధిలో భాగంగా ఏపీలో జరుగుతున్న పనుల గురించి పోటీ పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. దేశంలో పారిశ్రామిక ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేయగలిగిన ఈ కారిడార్లకు ఉన్న ప్రాధాన్యం, ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర బిందువులుగా గుర్తించిన ప్రాంతాలు, ప్రత్యేక పార్కులు, వాటి ప్రస్తుత స్థితిగతులతో పాటు రాష్ట్రంలో ఇప్పటివరకు పారిశ్రామికంగా సాధించిన పురోగతి గురించి సమగ్రంగా తెలుసుకోవాలి.

ఏ రంగమైనా, ఆర్థిక వ్యవస్థ అయినా అభివృద్ధి చెందడానికి అవస్థాపన సౌకర్యాలు కీలకం.అవి ఆర్థిక, సామాజిక అభివృద్ధికి మూలస్తంభాలుగా పనిచేస్తాయి. రహదారులు, రైల్వేలు, విమానాశ్రయాలు, నౌకాశ్రయాల సదుపాయాలు, విద్యుత్తు, గ్యాస్, బొగ్గు, ఇంధన వనరులు, గిడ్డంగి సౌకర్యాలు, బ్యాంకింగ్‌ సదుపాయాలు, వర్తక సౌకర్యాలు, మార్కెటింగ్‌ సదుపాయాలు తదితరాలను     అవస్థాపన సౌకర్యాలు అంటారు. పరోక్షంగా విద్య, నైపుణ్యాభివృద్ధి, బీమా సౌకర్యాలు, ఆరోగ్య పరిరక్షణ, సాంకేతిక పరిజ్ఞానం వాడకం లాంటివి కూడా   అవస్థాపన సౌకర్యాలే. వాటి నాణ్యత మీద ఆర్థిక అభివృద్ధి స్థాయి ఆధారపడి ఉంటుంది.

గతంలో ప్రభుత్వ రంగంలోని పారిశ్రామిక సంస్థలకే అధిక ప్రాధాన్యం, పెట్టుబడుల అవసరం ఉండేది. వాటికి కావాల్సిన అవస్థాపన సౌకర్యాలను ప్రభుత్వమే కల్పించేది. 1991 ఆర్థిక సంస్కరణల తర్వాత అవస్థాపన సౌకర్యాల కల్పన, విస్తరణలో ప్రైవేటు రంగం పాత్ర పెరిగింది. ఇటీవలి కాలంలో అవస్థాపన సౌకర్యాల కల్పనలో విదేశీ సంస్థల పెట్టుబడులు కూడా పెరిగాయి. రిస్క్‌ షేరింగ్, కాస్ట్‌ రికవరీ, జవాబుదారీతనం లాంటి విషయాల్లో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం సమర్థమైందిగా గుర్తించారు. పన్ను రాయితీలు, వడ్డీ రాయితీలు, డివిడెండ్‌ చెల్లింపులు మొదలైన ప్రోత్సాహకాలు కూడా అవస్థాపన సౌకర్యాల కల్పనకు ఊతమిచ్చి, పారిశ్రామిక అభివృద్ధికి దోహదం చేస్తున్నాయి. 1997లో రూ.5,000 కోట్లతో ఏర్పాటు చేసిన    ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ ఫైనాన్స్‌ కంపెనీ  పారిశ్రామిక అవస్థాపన సౌకర్యాల కల్పనకు ఎంతగానో ఉపయోగపడింది.

ఏపీలో పారిశ్రామిక అవస్థాపన సౌకర్యాల కల్పన: పారిశ్రామిక అభివృద్ధి కోసం 1973లో ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక అవస్థాపన సౌకర్యాల కార్పొరేషన్‌ (ఏపీఐఐసీ)ను నెలకొల్పారు. పారిశ్రామిక క్షేత్రాల అభివృద్ధికి భూమి సేకరణ, రోడ్లు, డ్రైనేజీ, వీధి   దీపాలు, నీటి సరఫరా లాంటి వసతుల కల్పన, వ్యవస్థాపకులకు ప్లాట్ల కేటాయింపు, వాటిలో పరిశ్రమలు ఏర్పాటుచేసేలా చూడటం ఈ సంస్థ ప్రధాన విధులు. సాధారణంగా పారిశ్రామిక క్షేత్రాలు 15 నుంచి 2500 ఎకరాల్లో విస్తరించి ఉంటాయి. వీటి లే-అవుట్లకు అనుమతులు ఇవ్వడం, పరిశ్రమల వ్యర్థాలు, కలుషితాలను నియంత్రించే ఏర్పాట్లు కూడా ఏపీఐఐసీ చేపడుతుంది.

ఏపీఐఐసీ ప్రధాన లక్ష్యాలు:

1) పరిశ్రమలకు అవసరమైన సౌకర్యాల కల్పనకు తగిన పథకాలు, ప్రణాళికలు తయారుచేయడం. విత్త సౌకర్యాలు కల్పించడం.

2) పరిశ్రమల స్థలాల అభివృద్ధి, షెడ్ల నిర్మాణానికి కావాల్సిన ఆర్థిక వనరులు లభించే విధంగా చూడటం. పరపతి సౌకర్యాలు కల్పించి ఉత్పత్తిని వృద్ధి చేయడం.

3) రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే  పరిశ్రమల ప్రోత్సాహక పథకాలు అమలు చేయడం, పరిశ్రమలకు రాయితీలు అందేలా చూడటం.

4) వస్తువులు, యంత్రాలు, పరికరాలతో హైర్‌ - పర్జేజస్‌ పద్ధతిలో వ్యాపారం చేయడం.

ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక అభివృద్ధి చట్టం-2017: ఈ చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక కారిడార్‌ అభివృద్ధి సంస్థ (ఏపీఐసీడీఏ) ఏర్పాటైంది. దీనికి ఒక పాలకమండలిని ఏర్పాటు చేసి, ఒక కమిషనర్‌ను నియమించారు. ఈ సంస్థ కేంద్ర బిందువుల (నోడ్స్‌)   ప్రణాళిక రచన, అభివృద్ధి, నిర్వహణ, నియంత్రణ బాధ్యతలను చూస్తుంది. పారిశ్రామిక అభివృద్ధి  కారిడార్లలో అంతర్భాగమే నోడ్‌. ఈ సంస్థ ప్రధానంగా విశాఖపట్నం - చెన్నై, చెన్నై - బెంగళూరు పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధిని పర్యవేక్షిస్తుంది.

ఏపీ పారిశ్రామిక కారిడార్‌ అభివృద్ధి సంస్థ విధులు:

1) పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటు చేయడం, వర్గీకరించిన పారిశ్రామిక కారిడార్లను  అభివృద్ధి చేయడం.

2) నోడ్స్‌లో భూమిని సేకరించి కొనుగోలు లేదా లీజు సౌకర్యాలు కల్పించడం.  

3) నోడ్స్‌లో ఉపవిభాగాలను అభివృద్ధి చేసే విధంగా సమగ్ర ప్రణాళిక తయారుచేయడం.    

4) అయిదేళ్లకు ఒకసారి నోడ్స్‌ సమగ్ర ప్రణాళికను సవరించి ఆమోదించడం.

5) నోడ్స్‌ చుట్టూ ఉన్న ప్రాంతాల అభివృద్ధికి చర్యలు చేపట్టడం.

విశాఖపట్నం - చెన్నై పారిశ్రామిక కారిడార్‌ (విసీఐసీ): తూర్పుతీర ఆర్థిక కారిడార్‌ (ఈసీఈసీ) ఏర్పాటులో భాగంగా దేశ తీరప్రాంతాల కారిడార్‌ అభివృద్ధి చేయాలని సంకల్పించారు. ఇందుకోసం ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ)ను భాగస్వామిగా భారత ప్రభుత్వం ఎంచుకుంది. ఈ ప్రాజెక్టు పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఏపీ, తమిళనాడుల్లో విస్తరించింది. దక్షిణ తూర్పు, తూర్పు ఆసియాలోని గ్లోబల్‌ వ్యాల్యూ చైన్‌తో దేశాన్ని అనుసంధానం చేసేందుకు తూర్పుతీరం వెంట వ్యూహాత్మక స్థానాల్లో ఉన్న నౌకాశ్రయాలను అంతర్జాతీయ బహుళ మార్గాలుగా అభివృద్ధి పరిచేందుకు విశాఖ-చెన్నై కారిడార్‌ వ్యూహాన్ని రూపొందించారు. ఈ మార్గంలోని వైజాగ్, మచిలీపట్నం, దొనకొండ, ఏర్పేడు-శ్రీకాళహస్తిలను నోడ్స్‌గా ఎంపిక చేశారు. వీసీఐసీ ప్రాజెక్టులో భౌతిక అవస్థాపన సౌకర్యాలు సమకూర్చడమే కాకుండా, పెట్టుబడుల అనుకూల వాతావరణం (ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌) కల్పించి అనుమతులన్నీ సత్వరం ఇస్తున్నారు. ప్రపంచబ్యాంకు నివేదిక ప్రకారం ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో 2018, జులైలో ఆంధ్రప్రదేశ్‌ 98.42% స్కోర్‌తో దేశంలోనే తొలిస్థానంలో నిలిచింది. 

విశాఖ-చెన్నై కారిడార్‌ కోసం ఆసియా అభివృద్ధి బ్యాంకు 2016, సెప్టెంబరులో మల్టీ బ్రాంచ్‌ పార్కింగ్‌ ఫెసిలిటీ ద్వారా 500 మిలియన్‌ డాలర్లు, విధాన ఆధారిత రుణం కింద 120 మి.డాలర్లు. ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. రాబోయే అయిదేళ్లకు 2.8 బి.డాలర్లు ఇవ్వనున్నట్లు పేర్కొంది. 2018, జూన్‌లో ఈ కారిడార్‌ కింద రెండు నోడ్స్‌ను ప్రాధాన్యంగా గుర్తించారు. అవి.

1) కొప్పర్తి పారిశ్రామిక ప్రాంతం

2) చిత్తూరు పారిశ్రామిక ప్రాంతం.

చెన్నై- బెంగళూరు పారిశ్రామిక  కారిడార్‌ (సీబీఐసీ): దీన్ని కేంద్రం మెగా ప్రాజెక్టుగా చేపట్టింది. చెన్నై, శ్రీ పెరంబుదూర్, పొన్నపంతనంగల్, రాణిపేట, వేలూరు చుట్టుపక్కల ప్రాంతాలతోపాటు ఏపీలోని చిత్తూరు, బంగారుపాళ్యం, పలమనేరు; కర్ణాటకలోని బంగారుపేట, హోస్‌కోట్, బెంగళూరు ప్రాంతాలకు విస్తరించింది. దక్షిణ భారత్‌ నుంచి దక్షిణాసియా దేశాలకు చెన్నై, ఎన్నూర్‌ నౌకాశ్రయాల ద్వారా వాణిజ్య సౌకర్యాలు విస్తరించే వ్యూహం ఇందులో ఉంది. ఈ పారిశ్రామిక కారిడార్‌ను తమిళనాడులోని కోయంబత్తూర్‌ నగరానికి, కేరళలోని కొచ్చి నగరానికి కూడా విస్తరించారు. జాతీయ పారిశ్రామిక కారిడార్‌ అభివృద్ధి ట్రస్ట్‌ కనెక్టివిటీ ఆధ్వర్యంలో చేపట్టిన 5 పారిశ్రామిక కారిడార్లలో ఇదొకటి. దీన్ని జపాన్‌ అంతర్జాతీయ సహకార ఏజెన్సీ (జైకా) సహకారంతో మూడు దక్షిణాది రాష్ట్రాల్లో అమలు చేస్తారు. దిల్లీ-ముంబై పారిశ్రామిక అభివృద్ధి కారిడార్‌ మాదిరిగా సీబీఐసీని 100 బి.డాలర్లతో నిర్మిస్తారు. ఈ ప్రాజెక్టు 30 డిసెంబరు, 2020న  ఆమోదం పొందింది. ఇందులోని భాగాలు నోడ్‌-1 పొన్నేరి (తమిళనాడు), నోడ్‌-2 తుమకూరు (కర్ణాటక), నోడ్‌- 3 కృష్ణపట్నం పోర్టు ప్రాంతం (ఏపీ). కృష్ణపట్నం పారిశ్రామిక ప్రాంతంలో 2500 ఎకరాల్లో ఇప్పటికే మాస్టర్‌ ప్లాన్‌ పూర్తయింది. అవస్థాపన సౌకర్యాల అభివృద్ధికి సంబంధించిన పనులు టెండర్‌ దశలో ఉన్నాయి.

హైదరాబాద్‌-బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌ (హెచ్‌బిఐసి): ఈ కారిడార్‌ మధ్య భారతదేశంలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రాంతాలను దేశ తూర్పు తీర ప్రాంతాలతో అనుసంధానం చేస్తుంది. దీని కింద 2 ప్రధాన నోడ్స్‌ ఉన్నాయి.

నోడ్‌-1: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు నోడ్‌: 9,800 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ నోడ్‌ జిల్లాలోని 11 గ్రామాలతోపాటు రైలు, రహదారి మార్గాల వెంట విస్తరించింది.  ఓర్వకల్లు మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌గా గుర్తింపు పొందింది.

నోడ్‌-2. కర్ణాటకలోని యాదగిరి జిల్లాలోని కాడెచ్చురు నోడ్‌: ఇది మొత్తం 6,500 ఎకరాల్లో ఉంది. ఇందులో 3,200 ఎకరాలు బ్రౌన్‌ఫీల్డ్‌ ఏరియా, 3300 ఎకరాల గ్రీన్‌ఫీల్డ్‌ ఏరియాలో విస్తరించింది.

రాష్ట్రంలో పారిశ్రామిక ఎస్టేట్స్‌ విభాగం - అవస్థాపన సౌకర్యాల కల్పన:  2020-23 పారిశ్రామిక అభివృద్ధి విధానంలో భాగంగా ఫుడ్‌ పార్కులు, ఎంఎస్‌ఎంఈ పార్కుల అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చారు. రాజాం మండలంలోని కాలువచెల్లి గ్రామంలో ఎంఎస్‌ఎంఈ పార్కు అభివృద్ధి చేశారు. పెద్దాపురంలో ఎంఎస్‌ఎంఈ, ఫుడ్‌ పార్కుల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు.

చిత్తూరు నోడ్‌: విశాఖ-చెన్నై కారిడార్‌ కింద చిత్తూరు నోడ్‌ను ఇండస్ట్రియల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌గా మారుస్తున్నారు. ఈనోడ్‌ను 8,967 ఎకరాలుగా గుర్తించి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు.

ఇండోస్పేస్‌ ఇండస్ట్రియల్‌ పార్కు: ఏపీలోని అనంతపురం జిల్లా పెనుగొండ మండలంలోని మునిమడుగు గ్రామంలో ప్రపంచబ్యాంకు గుర్తింపు పొందిన ఈ పార్కు నెలకొల్పారు. ఇందులోని పారిశ్రామికకారిడార్‌లో బర్జర్‌ పెయింట్స్, పేజ్‌ ఇండస్ట్రీస్, భారత్‌ ఎలక్ట్రానిక్స్, కియా మోటార్స్‌ లాంటి సంస్థలను నెలకొల్పారు. వీటికి దక్షిణకొరియా తదితర దేశాలు పెట్టుబడి అందించాయి. ఈ పార్కుకి 29 ఎకరాలు కేటాయించారు.

పారిశ్రామిక కేంద్రంగా విశాఖ: ఏపీలో అతిపెద్ద నగరమైన విశాఖపట్నంలో అనేక ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీల పరిశ్రమలు నడుస్తున్నాయి. స్టీలు, ఖనిజాలు, పెట్రోలియం, పాలిమర్స్, ఎరువులు, భారీ ఇంజినీరింగ్‌ పరిశ్రమలే కాకుండా, నౌకా నిర్మాణం, ఫిషింగ్‌ కార్యక్రమాలు చురుగ్గా జరుగుతున్నాయి.  

 

 

ర‌చ‌యిత‌: ధ‌ర‌ణి శ్రీనివాస్‌
 

Posted Date : 03-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌