• facebook
  • whatsapp
  • telegram

అంతర్జాతీయ పర్యావరణ రక్షణ చట్టాలు

   మానవ మనుగడకు మూలాధారం ప్రకృతి. మనిషి భౌతిక అవసరాలను తీరుస్తూ మానసిక వికాసానికి దోహదం చేస్తోంది. అమెరికా పర్యావరణవేత్త ఎడ్వర్డ్‌ గోల్డ్‌ స్మిత్‌ 'అనేక అవసరాలకు ఆధారమైన ప్రకృతిని ఆధునిక మానవుడు వేగంగా నాశనం చేస్తున్నాడు' అని తెలిపాడు. పర్యావరణ పరిరక్షణకు అమెరికా పార్లమెంటు అనేక చట్టాలు చేయడంతో ‘అంతర్జాతీయ పర్యావరణ పరిరక్షణ’ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
          వాతావరణ మార్పుల కారణంగా భూగోళం వేడెక్కుతుందని 1827లో మొదటిసారి ఫోరీర్‌ అనే శాస్త్రవేత్త గుర్తించాడు. బొగ్గు లాంటి శిలాజ ఇంధనాల నుంచి వచ్చిన CO2, ఇతర వాయువుల వల్ల భూగోళంపై ఉష్ణోగ్రత పెరిగి భూతాపానికి దారితీస్తుందని 1886లో స్వాంటీ ఆర్హీనియన్‌ పేర్కొన్నాడు.


స్టాక్‌హోం సదస్సు - 1972


  ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో 1972 జూన్‌ 5 - 16 మధ్య స్టాక్‌హోం (స్వీడన్‌)లో మొదటి అంతర్జాతీయ పర్యావరణ సదస్సు జరిగింది. ఈ సమావేశంలో 26 సూత్రాలతో పర్యావరణం అభివృద్ధిపై డిక్లరేషన్‌ చేస్తూ కార్యాచరణ ప్రణాళిక కింద 109 సిఫారసులను తీర్మానం చేశారు. పర్యావరణ సమస్యలను పరిష్కరించడానికి 1972 జూన్‌ 5న ఐరాస ఏజెన్సీగా ‘ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (యూఎన్‌ఈపీ)’ ను ఏర్పాటు చేశారు.

దీని ప్రధాన కార్యాలయం కెన్యా రాజధాని నైరోబిలో ఉంది. దీని మొదటి ఛైర్మన్‌ మారిస్‌ స్ట్రాంగ్‌. ప్రస్తుత ఛైర్మన్‌ జోయిసే మసూయ. ప్రపంచ వాతావరణ సంస్థ, ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం (యూఎన్‌ఈపీ) ఆధ్వర్యంలో 1988లో ‘వాతావరణ మార్పులపై అంతరప్రభుత్వ ప్యానల్‌ (Intergovernmental Panel on Climate Change - IPCC)’  ను ఏర్పాటుచేశారు.1972 నుంచి ఏటా జూన్‌ 5న అంతర్జాతీయ పర్యావరణ అవగాహన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.


ధరిత్రి లేదా పృథ్వి సదస్సు - 1992


1992 జూన్‌ 3 - 14 మధ్య బ్రెజిల్‌ రాజధాని రియోడిజెనీరోలో ఐక్యరాజ్యసమితి పర్యావరణ, అభివృద్ధి సదస్సు లేదా పృథ్వి సదస్సును నిర్వహించారు.


ఈ సమావేశంలో చర్చించిన అంశాలు: 


ఎ) రియో పర్యావరణ, అభివృద్ధి డిక్లరేషన్‌
బి) వాతావరణ మార్పు (UNFCCC)
సి) అజెండా - 21 (సుస్థిరాభివృద్ది)
డి) అటవీ సంరక్షణ సూత్రాలు
ఇ) జీవవైవిధ్యం
ఎఫ్‌) ఎడారీకరణ

 1992, మే 9న కుదిరిన అంతర్జాతీయ పర్యావరణ సంధి ఫలితంగా అదే ఏడాది జూన్‌లో నిర్వహించిన ధరిత్రి సదస్సు వాతావవరణ మార్పులపై ప్రధానంగా చర్చించింది. ఫలితంగా ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పుల చట్టం (యూఎన్‌ఎఫ్‌సీసీసీ) రూపొందింది. ఇది 1994, మార్చి 21న అమల్లోకి వచ్చింది. ఈ సంధి ప్రకారం వాతావరణ మార్పులపై ఏటా సమీక్ష జరపాలని నిర్ణయించారు. 1995 నుంచి వీటిని క్రమం తప్పకుండా నిర్వహించాలని తీర్మానించారు. వీటినే యూఎన్‌ఎఫ్‌సీసీసీ లేదా COP సదస్సులు అంటారు. 1995 నుంచి 2018 వరకు మొత్తం 24 COP సదస్సులను నిర్వహించారు.


ఇటీవల జరిగిన సదస్సులు


COP - 21: 2015 నవంబరు 30 - డిసెంబరు 12, పారిస్‌ 
COP - 22: 2016 నవంబరు 7 - 18, మర్రకేష్‌
COP - 23: 2017 నవంబరు 6 - 17, బాన్‌
COP - 24: 2018 డిసెంబరు 3 - 14, కాటోవిస్‌ (పోలెండ్‌)
COP - 25: 2019 నవంబరు 11 - 22, చిలీలో జరగనుంది. (వాస్తవానికి ఈ సదస్సు బ్రెజిల్‌లో జరగాలి. కానీ ఆ దేశ అధ్యక్ష ఎన్నికల దృష్ట్యా వేదికను మార్చారు)

* రియోడిజెనీరో ధరిత్రి సదస్సులో మరో అంశంగా జీవవైవిధ్య చట్టాన్ని (Convention on  Biological Diversity) ఆమోదించారు. 1993, డిసెంబరు 29 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. వివిధ జాతులకు చెందిన జీవులు ఒకే సమూహంలో కలిసి జీవించడాన్ని జీవవైవిధ్యం అంటారు. అలాగే వివిధ రకాల జీవులను సంరక్షించడానికి 2000 జనవరిలో కార్టజీనా ప్రోటోకాల్‌ ఆన్‌ బయోసేఫ్టీ ఒప్పందం జరిగింది. ఇది 2003, సెప్టెంబరు 11 నుంచి అమల్లోకి వచ్చింది. ప్రపంచంలో అతిపెద్ద జీవవైవిధ్య దేశం బ్రెజిల్‌. ఏటా మే 22న అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవాన్ని, ఏప్రిల్‌ 22న అంతర్జాతీయ ధరిత్రి దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
*  స్విట్జర్లాండ్‌లోని వరల్డ్‌ వైల్డ్‌ లైఫ్‌ ఫండ్‌ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌) ప్రపంచంలో అంతరించిపోతున్న జీవులను ‘రెడ్‌ డాటా బుక్‌’ (రెడ్‌లిస్ట్‌)లో ప్రచురిస్తుంది. ప్రస్తుతం మన దేశంలో బట్టమేకల పక్షి, కలివికోడి, ఏనుగులు, చిరుతలు అంతరించిపోతున్నట్లు పేర్కొంది.


ధరిత్రి సదస్సులు


మొదటి సదస్సు - 1999, రియోడిజెనీరో (బ్రెజిల్‌)
రెండో సదస్సు - 2002,  జొహెన్నస్‌బర్గ్‌ (దక్షిణాఫ్రికా) (రియో + 10)
మూడో సదస్సు - 2012,  రియోడిజెనీరో (బ్రెజిల్‌) (రియో + 20)


క్యోటో ప్రోటోకాల్‌ ఒప్పందం - 1997


జపాన్‌ రాజధాని క్యోటో వేదికగా 1997, డిసెంబరు 11న జ‌రిగిన స‌ద‌స్సులో ఈ ఒప్పందం కుదిరింది. ఈ సమావేశంలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలు కర్బన ఉద్గారాలను తగ్గించాలని సమావేశ సభ్య దేశాలు తీర్మానించాయి. కార్బన్‌ ట్రేడింగ్, పరిశుభ్రత అభివృద్ధి విధానాలు, ఉమ్మడి అమలు కార్యక్రమాలను అన్ని దేశాలు పాటించాలని పేర్కొన్నారు. దీన్నే క్యోటో ప్రోటోకాల్‌ ఒప్పందం అంటారు. ఈ తీర్మానం 2005, ఫిబ్రవరి 16 నుంచి అమల్లోకి వచ్చింది.


మాంట్రియల్‌ ప్రోటోకాల్‌ ఒప్పందం - 1987


భూ ఉపరితలం నుంచి 30 - 34 కి.మీ. ఎత్తులో స్ట్రాటో ఆవరణంలో ఓజోన్‌ పొర ఉంటుంది. ఇది సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలను భూమి పైకి రాకుండా అడ్డుకుంటుంది. అయితే భూమిపై క్లోరో ఫ్లోరో కార్బన్ల సంఖ్య పెరగడం వల్ల ఓజోన్‌ పొర ఛిద్రమైంది. దీన్ని మొదట 1975లో అంటార్కిటిక్‌ ఖండంపై గుర్తించారు. ఓజోన్‌ క్షీణతను తగ్గించడానికి 1987, సెప్టెంబరు 16న ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో మాంట్రియల్‌లో ఓజోన్‌ తరుగుదల సదస్సును నిర్వహించారు. దీన్నే మాంట్రియల్‌ ప్రోటోకాల్‌ ఒప్పందం అంటారు. ఈ ఒప్పందం 1989, ఆగస్టు 26 నుంచి అమల్లోకి వచ్చింది. అందువల్ల ఏటా సెప్టెంబరు 16న అంతర్జాతీయ ఓజోన్‌ అవగాహన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.             

         ఇటీవల 28వ మాంట్రియల్‌ ప్రోటోకాల్‌ ఒప్పందం, COP - 21 పారిస్‌ వాతావరణ మార్పుల సదస్సులకు అనుగుణంగా 2016, అక్టోబరు 15న ఆఫ్రికా దేశమైన రువాండా రాజధాని కిగాలిలో ఓజోన్‌ తరుగుదల సమీక్ష సదస్సు జరిగింది. ఈ సమావేశంలో 2045 నాటికి 80 - 85% వరకు హైడ్రోఫ్లోరో కార్బన్లను తగ్గించాలని, 2100 సంవత్సరానికి 0.5 డిగ్రీల ఉష్ణోగ్రతను తగ్గించాలని తీర్మానం చేశారు.


అంతర్జాతీయ సౌరకూటమి (ఐఎస్‌ఏ) - 2018


  భూమిపై శిలాజ ఇంధన వనరులను తగ్గిస్తూ, శిలాజేతర వనరులను పెంపొందించడానికి ప్రపంచవ్యాప్తంగా ఒక కూటమి ఏర్పాటైంది. భారత ప్రధాని మోదీ కృషితో COP -  21 పారిస్‌ సదస్సులో దీనికి బీజం పడింది. కర్కాటక, మకర రేఖల మధ్య ఉష్ణోగ్రత ఎక్కువగా పొందుతున్న 121 దేశాలతో సౌరకూటమిని ఏర్పాటు చేశారు. వీటినే సూర్యపుత్ర దేశాలు అంటారు. ఈ కమిటీ ప్రధాన ఉద్దేశం ఖనిజ చమురుకు ప్రత్యామ్నాయంగా సౌరశక్తి వనరును వినియోగించడం. దీన్నే ఇంటర్నేషనల్‌ ఏజెన్సీ ఫర్‌ సోలార్‌ పాలసీ అండ్‌ అప్లికేషన్‌ (IASPA) అని పిలుస్తారు. దీని ప్రధాన కార్యాలయం గ్యాల్‌పహరి, గురుగ్రామ్‌ (హరియాణా)లో ఉంది. మొదటి సదస్సు 2018, మార్చి 11న న్యూదిల్లీలో జరిగింది. ఈ సమావేశం 2002 నాటికి 175 గిగావాట్ల సౌరశక్తిని ఉత్పత్తి చేయాలని తీర్మానించింది. ఈ కమిటీ ప్రపంచబ్యాంక్‌ భాగస్వామ్యంగా ఉంటుంది. ఈ సదస్సుకు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఫ్రాన్సిస్‌ హొలాండే ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Posted Date : 10-07-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌