• facebook
  • whatsapp
  • telegram

జస్టిస్ బి.ఎన్. శ్రీకృష్ణ కమిటీ

  తెలంగాణలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తారస్థాయికి చేరడంతో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి వివిధ ప్రత్యామ్నాయాల గురించి నివేదికను సమర్పిండానికి కేంద్ర ప్రభుత్వం జస్టిస్ బి.ఎన్. శ్రీకృష్ణ అధ్యక్షతన నలుగురు సభ్యులతో 2010, ఫిబ్రవరి 3న కమిటీని నియమించింది.
దీనిలోని సభ్యులు
1. జస్టిస్ బి.ఎన్. శ్రీకృష్ణ - అధ్యక్షులు
2. బి.కె.దుగ్గల్ - కార్యదర్శి (కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి)
3. రవీందర్ కౌర్ - దిల్లీ ఐఐటీ ప్రొఫెసర్
4. రణ్‌బీర్‌సింగ్ - నల్సార్ వ్యవస్థాపక డైరెక్టర్
5. అబూసలే షరీఫ్ - ఆర్థికవేత్త
    శ్రీకృష్ణ కమిటీ 505 పేజీలతో కూడిన నివేదికను 2010 డిసెంబరులో కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది.


శ్రీకృష్ణ కమిటీకి కేంద్రం నిర్దేశించిన అంశాలు
* ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక తెలంగాణ, సమైక్యాంధ్ర డిమాండ్ వల్ల ఏర్పడిన పరిస్థితిని అధ్యయనం చేయడం.
* రాష్ట్రంలో ఇటీవల ఏర్పడిన పరిణామాల ప్రభావం జనాభాలోని మహిళలు, పిల్లలు, విద్యార్థులు, మైనార్టీ వర్గాలు, వెనుకబడిన వర్గాలు, షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలపై ఏ విధంగా ఉందో పరిశీలించడం.
* 1956, నవంబరు 1న ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుంచి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని పరిశీలించి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల అభివృద్ధి, ఉన్నతికి దాని ప్రభావాన్ని పరిశీలించడం.
* పైన పేర్కొన్న 3 అంశాల్లో దృష్టి సారించి ఇతర ముఖ్యాంశాలను గుర్తించడం.
* అన్ని వర్గాల ప్రజలతో ముఖ్యంగా అన్ని రాజకీయ పార్టీలతో పైన తెలిపిన అంశాలపై సంప్రదింపులు జరపడం, వారి అభిప్రాయాలను తెలుసుకోవడం.
* ప్రస్తుత విపత్కర పరిస్థితుల వల్ల ప్రజల్లోని అన్ని వర్గాల సంక్షేమాన్ని కాపాడేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలో రాజకీయ పార్టీల నుంచి, ఇతర సంస్థల నుంచి అడిగి తెలుసుకోవాలి.
* పైన పేర్కొన్న అంశాల మీద ఇతర సంస్థలైన పరిశ్రమ, వాణిజ్య రంగాలతో కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలతో సంప్రదింపులు జరిపి వివిధ ప్రాంతాల సమగ్రాభివృద్ధికి వారి అభిప్రాయాలను సేకరించడం.


శ్రీకృష్ణ కమిటీ సిఫార్సులు
  శ్రీకృష్ణ కమిటీ తన నివేదికలో మొత్తం 6 సూత్రాలను వెల్లడించింది. అవి:
1. యథాతథస్థితి కొనసాగింపు
* రాష్ట్రంలో యథాతథస్థితి కొనసాగించడం వల్ల సమస్యను ప్రాథమిక శాంతి భద్రతల సవాలుగా పరిగణించి, కేంద్రం పెద్దగా జోక్యం చేసుకోకుండా అదుపు చేసే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వానికి వదిలివేయాలి.
* ఈ ప్రతిపాదనకు ప్రాతిపదిక గత 54 సంవత్సరాల తెలంగాణ చరిత్ర. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం డిమాండు తలెత్తినప్పుడల్లా ఆయా వర్గాలకు ప్రభుత్వంలో, పార్టీ వ్యవస్థలో తగిన స్థానమిస్తూ రాజకీయంగానే పరిష్కరించేవారు.
* అయితే యథాతథస్థితి ఒక ప్రతిపాదన మాత్రమే. దానికి చిట్టచివరి ప్రాధాన్యం మాత్రమే ఇస్తున్నామని శ్రీకృష్ణ కమిటీ అభిప్రాయపడింది.
2. సీమాంధ్ర, తెలంగాణలను విడగొట్టి హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయడం
* ఆంధ్రప్రదేశ్‌ను సీమాంధ్ర, తెలంగాణలుగా విడగొట్టి హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయడం, కాలక్రమంలో రెండు రాష్ట్రాలు సొంతంగా తమ రాజధానులను అభివృద్ధి చేసుకోవడం.
* హైదరాబాద్‌ను కలపకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే ప్రత్యేక రాష్ట్రం సాధించామన్న సంతృప్తి తెలంగాణవాదులకు ఉండదు. తీవ్ర అసంతృప్తి చెలరేగుతుంది.
* ఆందోళనలు, సమస్యలు కొనసాగుతాయి. తక్షణ ఆందోళనలు చెలరేగే ప్రమాదం ఉంది. ఇది ఆచరణలో సాధ్యం కాదని కమిటీ అభిప్రాయపడింది.
3. రాయల తెలంగాణ, కోస్తాంధ్ర రాష్ట్రాలుగా విభజించడం
* ఆంధ్రప్రదేశ్‌ను రాయల తెలంగాణ, కోస్తాంధ్ర అనే రెండు రాష్ట్రాలుగా విభజించాలి. హైదరాబాద్‌ను రాయల తెలంగాణకు రాజధానిగా చేయాలని సూచించింది.
* ముస్లింల సంక్షేమం, అభివృద్ధి కోణంలో సమైక్యాంధ్రనే గట్టిగా కోరుతున్న ఎంఐఎం పార్టీ కూడా రాష్ట్రాన్ని విభజించాల్సి వస్తే తెలంగాణ, రాయలసీమలను కలపాలని కోరుతోంది.
* రాయలసీమలో 12 శాతం ముస్లింలు ఉన్నారు. తెలంగాణలో హైదరాబాద్‌ను మినహాయిస్తే ఇతర జిల్లాల్లో ముస్లింలు 8 శాతం మాత్రమే ఉన్నారు. రాయల తెలంగాణలో ముస్లింలు రాజకీయంగా ఎక్కువ ప్రభావం చూపగలరు.
4. సీమాంధ్ర, తెలంగాణలుగా విభజించడం, హైదరాబాద్ మహా నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతం చేయడం
* ఆంధ్రప్రదేశ్‌ను సీమాంధ్ర, తెలంగాణలుగా విభజించడం. హైదరాబాద్ మహానగరాన్ని కేంద్రపాలిత ప్రాంతం (యూటీ)గా ప్రకటించాలి.
* నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల సరిహద్దుల్లోని 20 మండలాలను కేంద్రపాలిత ప్రాంతంలో భాగం చేయాలి.
* హైదరాబాద్ యూటీని సీమాంధ్రలోని గుంటూరు, కర్నూలు జిల్లాల సరిహద్దులతో భౌగోళిక అనుసంధానం చేయాలి. రెండింటికీ హైదరాబాద్‌ను రాజధానిగా చేయాలి.
5. సీమాంధ్ర, తెలంగాణల విభజన - తెలంగాణకు హైదరాబాద్‌ను, సీమాంధ్రకు కొత్త రాజధానిని ఏర్పాటు చేయడం
* రాష్ట్రాన్ని సీమాంధ్ర, తెలంగాణలుగా విభజించడం. తెలంగాణకు హైదరాబాద్‌ను రాజధానిగా చేయడం. సీమాంధ్రకు మరో కొత్త రాజధానిని ఏర్పాటు చేయడం.
* కొత్తగా ఏర్పడే రెండు రాష్ట్రాలకు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా చేయడం.
* కాలక్రమంలో సీమాంధ్రకు వేరే రాజధానిని ఏర్పాటు చేయడం. కొత్త రాజధాని ఏర్పాటు కోసం భారీగా నిధులను సమీకరించాలి. కేంద్ర ప్రభుత్వం సాయం చేయాలి.
* తీవ్ర నిర్లక్ష్యానికి, వివక్షకూ గురవుతున్నామని భావిస్తున్న అధిక సంఖ్యాక తెలంగాణ ప్రజల మనోభావాలకు ప్రాధాన్యమిస్తూ వారి డిమాండ్లను ఆమోదించినట్లు అవుతుంది.
6. సమైక్యంగా ఉంచడం, తెలంగాణ ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేయడం
* ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా ఉంచడం, తెలంగాణకు సామాజిక, ఆర్థిక, రాజకీయ సాధికారతకు నిర్దిష్టమైన, రాజ్యాంగబద్ధమైన చర్యలు తీసుకోవాలి.
* చట్టబద్ధమైన తెలంగాణ ప్రాంతీయ మండలిని పూర్తి స్థాయి అధికారాలతో ఏర్పాటు చేయడం.
* రాష్ట్రంలోని మూడు ప్రాంతాల శ్రేయస్సుకు సమైక్యత కీలకం. రాష్ట్రాన్ని ముక్కలు చేయడం వల్ల ప్రస్తుత సమస్యలకు సుస్థిర పరిష్కారాలు లభించే అవకాశం లేదు.
* చట్టబద్ధ తెలంగాణ ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేయడం ద్వారా సమైక్యతను సాధించవచ్చు. 1956, ఫిబ్రవరి 20 నాటి పెద్ద మనుషుల ఒప్పందం స్ఫూర్తిగా దానికి తగిన నిధులను, అధికారాలను కల్పించాలి.
* రాష్ట్ర శాసనసభ ఆయా అంశాలపై చట్టాలు చేయాలంటే ముందుగా ఈ మండలి సిఫార్సులను తీసుకోవాలి.
* ప్రాంతీయ మండలికి, అసెంబ్లీకి మధ్య భేదాభిప్రాయాలు వస్తే పరిష్కరించేందుకు గరవ్నర్ సారథ్యంలో సమాన సంఖ్యలో ఇరు ప్రాంతాలకు చెందిన సభ్యులతో ఏర్పడే ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలి.
* ఈ ఉన్నత స్థాయి కమిటీలో ముఖ్యమంత్రి, స్పీకర్, శాసనమండలి ఛైర్మన్, విపక్ష నేతలు, తెలంగాణ ప్రాంతీయ మండలి ఛైర్మన్, రాజకీయేతర న్యాయవేత్త సభ్యులుగా ఉండాలి.
* నీటి పారుదల, ప్రణాళిక, ఆర్థికాభివృద్ధి, విద్య, వృత్తి విద్య, స్థానిక సంస్థలు, ప్రజారోగ్యం లాంటి కీలక రంగాలన్నింటినీ మండలికి అప్పగించాలి. ఈ మండలికి ప్రత్యేక సచివాలయం ఉండాలి.
* తెలంగాణ ప్రజల్లో విశ్వాసం నెలకొల్పడానికి పదవుల్లో ప్రాధాన్యం ఇవ్వాలి. ఒక ప్రాంతం వారు ముఖ్యమంత్రి అయితే మరో ప్రాంతం వారికి ఉపముఖ్యమంత్రి పదవిని ఇవ్వాలి.
* తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమల సమగ్రాభివృద్ధి కోసం కృషి జరపాలి. దీన్ని సాధించడానికి విస్తృత స్థాయి ఆర్థిక, రాజకీయ వికేంద్రీకరణ వ్యూహాన్ని అనుసరించాలి.


వివిధ పాలనా సంబంధ కమిటీలు - అధ్యయనం చేసిన అంశాలు
* 1949లో గోపాలస్వామి అయ్యంగార్ కమిటీ - ప్రధాన కార్యాలయాల పునర్ వ్యవస్థీకరణ
* 1950 - 51 ఎ.డి.గోర్వాలా కమిటీ - అభివృద్ధి కార్యక్రమాల అమలు, ప్రభుత్వ రంగ సంస్థల పనితీరుపై సమీక్ష
* 1952 - పాల్ ఆపిల్ బీ కమిటీ - భారతీయ పాలనపై సర్వే
* 1955 - 57 జె.బి. కృపలానీ కమిటీ - రైల్వేలో అవినీతిపై సమీక్ష
* 1956 - రామస్వామి మొదలియార్ కమిటీ - పబ్లిక్ సర్వీసుల్లో ప్రతిభ ఆధారంగా భర్తీ

* 1964 - కె.సంతానం కమిటీ - కేంద్ర, రాష్ట్ర పబ్లిక్ సర్వీసులు - జిల్లా పాలనపై పరిశీలన
* 1976 - డి.ఎస్. కొఠారీ కమిటీ - సివిల్ సర్వీసులు - పరిశీలన
* 1979 - ధరమ్ వీర్ - జాతీయ పోలీస్ కమిషన్
* 1989 - సతీష్ చంద్ర - సివిల్ సర్వీసు పరీక్షా విధానంపై సమీక్ష
* 1997 - ఎన్.ఎన్. వోహ్రా - రాజకీయ నాయకులు, నేరస్థుల మధ్య సన్నిహిత సంబంధాలపై పరిశీలన
* 1998 - పి.సి. జైన్ - పాలనా చట్టాలపై సమీక్ష
* 2000 - వై.కె. అలఘ్ - సివిల్ సర్వీసు పరీక్షల మూల్యాంకనం, సంస్కరణలు
* 2004 - హోతా కమిటీ - సివిల్ సర్వీసు ఉద్యోగుల అవినీతిని తగ్గించడానికి సిఫార్సులు
* 2005 - వీరప్ప మొయిలీ - సిబ్బంది, ప్రజాక్లేశ పరిష్కారాలు.

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌