• facebook
  • whatsapp
  • telegram

ఎం.ఎం.పూంచీ కమిషన్

మదన్‌మోహన్ పూంచీ కమిషన్
   కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై అధ్యయనం చేసి, తగిన సూచనలు చేసేందుకు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మదన్‌మోహన్ పూంచీ నేతృత్వంలో 2007, ఏప్రిల్ 28న ఒక కమిషన్‌ను ఏర్పాటు చేశారు.

 

కమిషన్‌లోని సభ్యులు:
* ధీరేంద్రసింగ్
* వినోద్‌కుమార్ దుగ్గల్
* అమరేష్ బాగ్చి
* ఎన్.ఆర్. మాధవమీనన్

పూంచీ కమిషన్ 7 అధ్యాయాలతో కూడిన తన నివేదికను 2010, ఏప్రిల్ 20న సమర్పించింది అవి:
1. మొదటి అధ్యాయంలో కేంద్ర, రాష్ట్ర సంబంధాల పరిణామ క్రమం.
2. రెండో అధ్యాయంలో ఆర్టికల్ 19, 355, 356, 263.
3. మూడో అధ్యాయంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య ఆర్థిక, విత్త సంబంధాలు.
4. నాలుగో అధ్యాయంలో 73, 74 రాజ్యాంగ సవరణలు, VIవ షెడ్యూల్‌కు సంబంధించిన విషయాలు.
5. ఐదో అధ్యాయంలో తీవ్రవాదం, నక్సలిజం, తిరుగుబాట్లు, మత కల్లోలాలు, హింస లాంటి అంశాలతో కూడిన జాతీయ ఆంతరంగిక భద్రతకు సంబంధించిన సూచనలు.
6. ఆరో అధ్యాయంలో పర్యావరణ సమస్యలు, వనరుల విభజన అంశాలు.
7. ఏడో అధ్యాయంలో సామాజికాభివృద్ధి, సుపరిపాలనకు సంబంధించిన అంశాలు.

 

పూంచీ కమిషన్ సిఫార్సులు
* గవర్నర్ల పదవీ కాలం నిర్దిష్టంగా 5 సంవత్సరాలు ఉండాలి.
* రాష్ట్ర ప్రభుత్వం అనుమతితో సంబంధం లేకుండా మంత్రులపై న్యాయ విచారణ జరపడానికి అనుమతించే అధికారం గవర్నర్‌కు కల్పించాలి.
* విపత్తుల నివారణ అనే అంశాన్ని ఉమ్మడి జాబితాలో చేర్చాలి.
* అంతర్ రాష్ట్ర కౌన్సిల్‌ను పునర్ వ్యవస్థీకరించి సంవత్సరానికి కనీసం 3 సార్లు తప్పనిసరిగా సమావేశపరచాలి.
* రాష్ట్రపతి పాలనను రాష్ట్రం మొత్తంమీద కాకుండా ఒక ప్రత్యేక ప్రాంతంలో అంటే జిల్లాలో కూడా విధించే అవకాశం కల్పించాలి.
* జోనల్ కౌన్సిళ్లు, ప్రాంతీయ మండళ్లను పునరుద్ధరించి వాటిని నియమబద్ధంగా సంవత్సరానికి 2 సార్లు తప్పనిసరిగా సమావేశపరచాలి.
* రాష్ట్రంలోని ప్రాంతీయ విశ్వవిద్యాలయాలకు వైస్ చాన్సలర్లను నియమించే అధికారాన్ని గవర్నర్ నుంచి తప్పించాలి.
* రాష్ట్రపతిని పదవి నుంచి తొలగించడానికి ఏ విధంగా పార్లమెంటుకు అధికారం ఉందో, రాష్ట్రాల్లోని గవర్నర్లు రాజ్యాంగ ధిక్కరణకు పాల్పడినప్పుడు రాష్ట్ర శాసనసభలు 2/3వ వంతు మెజారిటీతో గవర్నర్లను తొలగించే అధికారాన్ని కల్పించాలి.
* మతపరమైన సంఘర్షణలు జరిగిన ప్రాంతాల్లో కేంద్రం తన సాయుధ బలగాలను పరిమిత కాలానికి రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో సంబంధం లేకుండానే మోహరించవచ్చు.
* ప్రణాళికా సంఘం దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తుంది. అది కేవలం రాష్ట్రాల ప్రయోజనాలను సమన్వయపరచే సాధనంగా మాత్రమే పనిచేయాలి. కానీ రాష్ట్రాలపై ఆధిపత్యాన్ని వహించే సంస్థగా పనిచేయకూడదు.
* రాష్ట్రాల్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడినప్పుడు ప్రభుత్వాల ఏర్పాటు విషయంలోనూ, అదే విధంగా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు మెజారిటీ కోల్పోయినప్పుడు ఆ ప్రభుత్వాలకు మెజారిటీ నిరూపించుకునే అవకాశాన్ని కల్పించడంలోనూ గవర్నర్లు తీసుకోవాల్సిన నిర్ణయాలపై రాజ్యాంగం ద్వారా కొన్ని మార్గదర్శక సూత్రాలను ఏర్పాటు చేయాలి.
* రాష్ట్ర గవర్నర్‌కు కల్పించిన విచక్షణాధికారాల విషయంలో విస్తృతమైన చర్చ చేయడంతో పాటు ఆ అధికారాల్లో సహేతుకమైన పరిమితులను విధించాలి.
* రాజ్యాంగంలోని ఆర్టికల్ 307లో పేర్కొన్న విధంగా రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని సాధించేందుకు జాతీయ స్థాయిలో ఒక అంతర్ రాష్ట్ర వ్యాపార వాణిజ్య మండలిని ఏర్పాటు చేయాలి.
* ప్రణాళికా సంఘం, ఆర్థిక సంఘం మధ్య సమన్వయాన్ని సాధించాలి. దీనికోసం అవసరమైతే నిపుణుల కమిటీని నియమించడం ద్వారా ప్రణాళికా లక్ష్యాలకు అనుగుణంగా నిధులను కేటాయించాలి.
* కొన్ని ప్రత్యేకమైన తీవ్ర ఇబ్బందులు కలిగిన ప్రదేశాలను పరిమిత కాలం పాటు కేంద్ర పాలనలోకి తీసుకొచ్చేందుకు ఆర్టికల్ 355, 356 ల్లో సవరణ చేయాలి.
* స్థానిక సంస్థలకు అధికారాల బదిలీకి చట్టబద్ధతను కల్పించాలి.
* జాతీయ సమగ్రతా మండలికి రాజ్యాంగ హోదాను కల్పించాలనే లిబర్‌హాన్ కమిషన్ అభిప్రాయాన్ని పూంచీ కమిషన్ వ్యతిరేకించింది.
* జాతీయ సమగ్రతా మండలి కనీసం సంవత్సరానికి రెండు సార్లు సమావేశం కావాలి.
* రాష్ట్రాల మధ్య సమానత్వాన్ని సాధించడానికి రాజ్యసభలో రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యాన్ని కల్పించాలి.
* గవర్నర్లను రాజకీయ ఫుట్‌బాల్ లా వ్యవహరించడాన్ని నిలువరించి, వారి పదవీ కాలాన్ని 5 సంవత్సరాలుగా నిర్దేశించాలి.
* రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన పూర్తి స్థాయి మెజారిటీ రాని పక్షంలో గవర్నర్ పాటించాల్సిన విధాన క్రమాన్ని కమిషన్ కింది విధంగా పేర్కొంది.
ఎ. ఎన్నికల కంటే ముందే సంకీర్ణ కూట‌మిగా పార్టీల‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ మొదటగా ఆహ్వానించాలి (లేదా)
బి. ఇతరుల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగిన అతిపెద్ద పార్టీని ఆహ్వానించాలి (లేదా)
సి. ఎన్నికల తర్వాత కొన్ని పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగిన బలం ఉంటే వారిని ఆహ్వానించాలి (లేదా)
డి. ఎన్నికల తర్వాత కొన్ని పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగి (లేదా) బయట నుంచి స్వతంత్ర అభ్యర్థుల మద్దతు కూడా కలిగిన సంకీర్ణాన్ని ఆహ్వానించాలి.


* గవర్నర్ల నియామకంలో కింది కమిటీ సూచనను అనుసరించి రాష్ట్రపతి గవర్నర్లను నియమించాలి.
ఎ. ప్రధానమంత్రి - ఛైర్మన్
బి. కేంద్ర హోంశాఖ మంత్రి - సభ్యుడు
సి. లోక్‌సభ స్పీకర్ - సభ్యుడు
డి. లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకులు - సభ్యులు
ఇ. సంబంధిత రాష్ట్ర ముఖ్యమంత్రి - సభ్యుడు
ఎఫ్. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ - సభ్యుడు
* అంతర్ రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి అంతర్ రాష్ట్ర ఆర్థిక మంత్రుల కమిటీని ఏర్పాటు చేసినట్లే ఆరోగ్య, పర్యావరణ రంగాల్లో ఏర్పాటు చేయాలి. వీటిని సమీక్షించడానికి ముఖ్యమంత్రుల ఫోరంను నియమించాలి.

 

ఆనందపూర్ సాహెబ్ తీర్మానం
* పంజాబ్‌కు చెందిన అకాలీదళ్ పార్టీ 1973లో ఆనందపూర్ సాహెబ్ గ్రామంలో సమావేశమై పంజాబ్ రాష్ట్రానికి సంబంధించిన కొన్ని సమస్యలు, సిక్కు మతానికి సంబంధించిన అంశాలు, కేంద్ర రాష్ట్ర సంబంధాలపై కొన్ని తీర్మానాలు ఆమోదించింది.
అవి:
* కేంద్రం తరచుగా రాష్ట్రాల విషయాల్లో జోక్యం కల్పించుకోవడానికి అవకాశం కల్పించే ఆర్టికల్ 356, 357, 365లను రాజ్యాంగం నుంచి తొలగించాలి.
* భారత్‌ను అమెరికాతరహా సమాఖ్యగా ఏర్పాటు చేయాలి.
* రాజ్యాంగంలో పేర్కొన్న అధికారాల పంపిణీని పునర్విభజన చేస్తూ రాష్ట్రాలకు ఎక్కువ అధికారాలను కల్పించాలి.
* జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యత ఉన్న దేశ రక్షణ, విదేశీ వ్యవహారాలు, కమ్యూనికేషన్, కరెన్సీ, బ్యాంకింగ్, ఆయుధాలు లాంటి విషయాలను కేంద్రానికి నిర్దేశించి, మిగిలిన అధికారాలను రాష్ట్రాలకు బదిలీ చేయాలి.
* కశ్మీర్‌కు కేటాయించిన విధంగానే పంజాబ్ రాష్ట్రానికి కూడా ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించాలి.
* ప్రస్తుత ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి దాని స్థానంలో రాజ్యాంగబద్ధ సంస్థను స్వతంత్ర ప్రాతిపదికపై ఏర్పాటు చేయాలి.
* అన్ని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం కల్పించే విధంగా అంతర్ రాష్ట్ర మండలిని ఏర్పాటు చేయాలి.
* గవర్నర్ వ్యవస్థను తక్షణం రద్దు చేయాలి.


మొదటి పరిపాలనా సంస్కరణల సంఘం
* మన దేశంలో 4వ సాధారణ ఎన్నికల అనంతరం 1967లో అనేక రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు, ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వచ్చాయి. ఇవి రాష్ట్రాలకు ఎక్కువ అధికారాలు కావాలనే డిమాండును ప్రారంభించాయి. ఇందిరా గాంధీ ప్రభుత్వం మొరార్జీ దేశాయ్ అధ్యక్షతన మొదటి పరిపాలనా సంఘాన్ని నియమించింది.
* మొరార్జీ దేశాయ్ మొదటి పరిపాలనా సంస్కరణల సంఘం ఛైర్మన్ పదవికి రాజీనామా చేయడంతో కె.హనుమంతయ్య ఈ కమిషన్‌కు ఛైర్మన్‌గా వ్యవహరించారు.
* కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై అధ్యయనం కోసం మొదటి పరిపాలనా సంస్కరణల సంఘం ఎం.సి.సెతల్వాడ్ నేతృత్యంలో ఒక అధ్యయన బృందాన్ని కూడా నియమించింది.
* మొదటి పరిపాలనా సంస్కరణల సంఘం తన తుది నివేదికను 1969లో సమర్పించింది. ఈ నివేదికలో 22 సిఫార్సులు ఉన్నాయి.


సిఫార్సులు
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆదాయ పంపిణీ కేంద్ర ఆర్థిక సంఘం సూచనలను అనుసరించి మాత్రమే జరగాలి.
* వివాదాస్పదం కాని వ్యక్తులను మాత్రమే గవర్నర్లుగా నియమించాలి.
* రాష్ట్రాలకు ఎక్కువ అధికారాలను కల్పించడానికి రాజ్యాంగాన్ని సవరించాల్సిన అవసరం లేదు.
* ఆర్టికల్ 263 ప్రకారం అంతర్ రాష్ట్ర మండలిని ఏర్పాటు చేయాలి.
* ఆర్టికల్ 356 దుర్వినియోగం కాకుండా చూడాలి.
* రాష్ట్రాల కోరిక మేరకే కేంద్రం బలగాలను పంపాలి.
* రాష్ట్రాలకు మరిన్ని ఆర్థిక వనరులను బదిలీ చేయాలి.


రెండో పరిపాలనా సంస్కరణల సంఘం
   

ప్రభుత్వ పాలనలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడానికి భారత ప్రభుత్వం 2005లో వీరప్ప మొయిలీ అధ్యక్షతన రెండో పరిపాలనా సంస్కరణల సంఘాన్ని నియమించింది. దీని నిర్మాణం
1. వీరప్ప మొయిలీ - ఛైర్మన్
2. వి.రామచంద్రన్ - సభ్యుడు
3. వి.హెచ్.కర - సభ్యుడు
4. డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ - సభ్యుడు
5. డాక్టర్ వినీతారాయ్ - సభ్య కార్యదర్శి
* ఈ కమిషన్ ప్రభుత్వ పాలనా వ్యవస్థను సమగ్రంగా పునర్ వ్యవస్థీకరించడానికి బాధ్యతాయుత, సమర్థవంతమైన పాలనకు సంబంధించి మొత్తం 15 నివేదికలను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. అవి:
1. రైట్ టు ఇన్‌ఫర్మేషన్, మాస్టర్ కీ టు గుడ్ గవర్నెన్స్
2. అన్‌లాకింగ్ హ్యూమన్ కాపిటల్, ఎన్‌టైటిల్‌మెంట్ అండ్ గవర్నెన్స్: ఎ కేస్‌స్టడీ.
3. క్రైసిస్ మేనేజ్‌మెంట్
4. ఎథిక్స్ ఇన్ గవర్నెన్స్
5. పబ్లిక్ ఆర్డర్
6. లోకల్ గవర్నెన్స్
7. కెపాసిటీ బిల్డింగ్ ఫర్ కాన్‌ఫ్లిక్ట్ రిజల్యూషన్
8. కంబాటింగ్ టెర్రరిజమ్: ప్రొటెక్టింగ్‌బై రైటియస్‌నెస్
9. సోషల్ కాపిటల్: ఎ షేర్డ్ డెస్టినీ
10. రిఫర్‌బిషింగ్ ఆఫ్ పర్సనల్ అడ్మినిస్ట్రేషన్: స్కేలింగ్ న్యూ హైట్స్
11. ప్రమోటింగ్ ఈ-గవర్నెన్స్: ద స్మార్ట్ వే ఫార్వర్డ్
12. సిటిజన్ సెంట్రిక్ అడ్మినిస్ట్రేషన్
13. ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా
14. ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషన్
15. స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్


రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్
    50 సంవత్సరాల భారత రాజ్యాంగాన్ని పునఃసమీక్ష చేయడానికి అటల్ బిహారి వాజ్‌పేయీ ప్రభుత్వం 2000 సంవత్సరంలో జస్టిస్ ఎం.ఎన్.వెంకటాచలయ్య అధ్యక్షతన 11 మంది సభ్యులతో ఒక కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ దేశంలోని కేంద్ర, రాష్ట్ర సంబంధాల్లో రావాల్సిన మార్పులను సిఫార్సు చేసింది.


సిఫార్సులు
* విశిష్ట వ్యక్తులను, వివాదాస్పదం కాని వ్యక్తులను మాత్రమే గవర్నర్లుగా నియమించాలి.
* రాష్ట్ర శాసనసభ ఆమోదించి పంపిన బిల్లులపై గవర్నర్లు 6 నెలల్లోగా తమ నిర్ణయం తెలిపే విధంగా రాజ్యాంగ సవరణ చేయాలి.
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యష్టిగానూ, సమష్టిగానూ అంతర్ రాష్ట్ర మండలి ద్వారా సహకార సమాఖ్య విధానాన్ని నెలకొల్పేందుకు కృషి చేయాలి.
* స్థానిక స్వపరిపాలనా సంస్థలకు అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చడానికి 11, 12వ షెడ్యూళ్లలో సవరణలు చేయడానికి రాజ్యాంగ సవరణ చేయాలి.
* ప్రకృతి సంబంధమైన విపత్తు నిర్వహణ అనే అంశాన్ని ఉమ్మడి జాబితాలో చేర్చాలి.
* అంతర్ రాష్ట్ర నదీ జలాలపై ముగ్గురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో కూడిన ఒక ట్రైబ్యునల్ నిర్ణయం తీసుకోవాలి.
* 3 నెలల్లోగా ఈ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పులు అమలు అయ్యేలా చూడాలి. దీన్ని పాటించని రాష్ట్రాలపై కేంద్రం చర్యలు తీసుకోవాలి.
* కేంద్ర ప్రభుత్వం గవర్నర్లను నియమించేటప్పుడు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పనిసరిగా సంప్రదించే విధంగా రాజ్యాంగ సవరణ చేయాలి.
* పార్లమెంటు ఆమోదం అనంతరమే ఏదైనా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధించాలి.


పశ్చిమ బెంగాల్ వామపక్ష ప్రభుత్వ తీర్మానం
   జ్యోతిబసు నాయకత్వంలో 1977లో పశ్చిమబెంగాల్‌లో అధికారానికి వచ్చిన వామపక్ష ప్రభుత్వం కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై ఒక తీర్మానాన్ని ఆమోదించింది. దీనిలో ముఖ్యాంశాలు
* గవర్నర్ వ్యవస్థను, ఆర్టికల్ 355, 356, 365లను తొలగించాలి.
* లోక్‌సభతో పాటు రాజ్యసభకు సమాన అధికారాలను కల్పించాలి.
* అఖిల భారత సర్వీసులను రద్దు చేయాలి.
* బలమైన కేంద్ర ప్రభుత్వంతో పాటు బలమైన రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ఏర్పాటు చేయాలి.


నీతి ఆయోగ్
  1950లో జవహర్‌లాల్ నెహ్రూ ఏర్పాటు చేసిన ప్రణాళికా సంఘంను రద్దు చేసి దాని స్థానంలో 2014, ఆగస్టు 13న నీతి ఆయోగ్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రివర్గ తీర్మానం ద్వారా నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. నీతి ఆయోగ్ భారతీయతతో కూడిన అభివృద్ధి ప్రణాళికలకు అంకురార్పణ చేస్తుందని తీర్మానంలో పేర్కొన్నారు. ఈ తీర్మానానికి అనుగుణంగా 2015, జనవరి 1న నీతి ఆయోగ్ ఏర్పడింది.
* నీతి ఆయోగ్ (NITI Aayog) అంటే National Institution for Transforming India Aayog (భారతీయ జాతీయ పరివర్తన సంస్థ)


నీతి ఆయోగ్ విశేషాలు
* నీతి ఆయోగ్‌కు అనేక అర్థాలున్నా పాలసీ కమిషన్ అనే అర్థాన్ని గ్రహించాలి.
* నీతి ఆయోగ్ అనేది ఒక సలహాపూర్వక సంస్థ (Advisory Board).
* దీనిని మేథోనిలయం (Think Tank) గా, జ్ఞాన ఆవిష్కరణల స్థావరం ((Knowledge and Innovation)గా వర్ధిల్లుతుంది. సహకార సమాఖ్యను స్థాపించడం నీతి ఆయోగ్ లక్ష్యం.


నీతి ఆయోగ్ లక్ష్యాలు
* జాతీయ, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాల మధ్య సహకారం పెంపొందించి, ఆయా ప్రభుత్వాలు ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లను సమష్టిగా పరిష్కరించడం ద్వారా సహకార సమాఖ్య (Cooperative Federalism) సాధన కోసం కృషి చేయడం.
* ఆర్థికాంశాలతో పాటు జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యం ఉన్న విషయాలపై సూచనలు ఇవ్వడం.
* జాతీయ అభివృద్ధి ప్రాధాన్యతలు, ప్రధాన రంగాల అభివృద్ధి వ్యూహాలను రాష్ట్రాలతో చర్చించి, వారి అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం.
* దేశ ప్రజలందరికీ సమాన అవకాశాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు కృషి చేయడం.
* ఆర్థిక వ్యూహాలు, విధానాల్లో భాగంగా జాతీయ భద్రతకు సంబంధించి అంశాలను పునఃసమీక్షించడం.
* ఆర్థిక పురోగతిని అందుకోలేని సమాజ అభ్యున్నతిపై ప్రత్యేక దృష్టిని నిలపడం.
* గ్రామీణ స్థాయిలో విలువను చేకూర్చే ప్రణాళికలను రూపొందించి అవసరమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం.


నీతి ఆయోగ్ విధులు
* భారతదేశానికి అవసరమైన వ్యూహాత్మక, దీర్ఘకాలిక విధానాలు, కార్యక్రమాలను రూపొందించడం. వాటి అమలును, ప్రగతిని పర్యవేక్షించడం.
* ఆర్థిక, విధానపరమైన అంశాలకు సంబంధించి వ్యూహాత్మక, సాంకేతిక సలహాలతో కూడిన జాతీయ కార్యక్రమాలను సిఫార్సు చేయడం.
* సుస్థిర, సమాన ప్రగతికి అనుసరించాల్సిన అభిలషణీయ విధానాలు, సుపరిపాలనకు అవసరమైన విధానాలపై పరిశోధనలు చేయడానికి అత్యాధునిక వనరుల కేంద్రాన్ని నిర్వహించడం.
* ఆర్థిక ప్రగతి ఫలితాలను పొందడంలో విఫలమైన అట్టడుగు వర్గాలకు వాటిని చేరవేయడం.
* రాష్ట్రాల క్రియాశీలక భాగస్వామ్యంతో జాతీయాభివృద్ధికి అవసరమైన ప్రాధాన్యతలు, రంగాలు, వ్యూహాలను రూపొందించడం.
* జాతీయ, అంతర్జాతీయ వ్యాపార నిపుణులు, ప్రాక్టీషనర్లు తదితరుల సహకారంతో వ్యాపారాభివృద్ధికి అవసరమైన విజ్ఞానవంతమైన, వినూత్న మద్దతు వ్యవస్థను ఏర్పాటు చేయడం.
* గ్రామీణ స్థాయిలో ప్రణాళికల రూపకల్పనకు అవసరమైన యంత్రాంగాన్ని అభివృద్ధి చేయడం.
* ఆర్థిక విధానాలు, వ్యూహాల రూపకల్పనలో జాతీయ భద్రత, ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యతను ఇవ్వడం.


నీతి ఆయోగ్ నిర్మాణం
* నీతి ఆయోగ్‌కు ప్రధానమంత్రి ఎక్స్ అఫీషియో అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు.
* దీనికి ఒక ఉపాధ్యక్షుడిని ప్రధానమంత్రి నియమిస్తారు.
* అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లతో కూడిన పాలకమండలి ఉంటుంది.
* నీతి ఆయోగ్‌కు ఒక సెక్రటేరియట్ ఉంటుంది.
* నలుగురు కేంద్ర మంత్రులను ఎక్స్ అఫీషియో సభ్యులుగా ప్రధాని నియమిస్తారు.
* విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థల నుంచి ఇద్దరిని పూర్తి కాల సభ్యులుగా నియమిస్తారు.
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమలకు సంబంధించిన నిపుణులతో కూడిన 4 డివిజన్లు నీతి ఆయోగ్‌లో ఉన్నాయి. అవి:
1. అంతర్ రాష్ట్ర మండలి
2. ప్రణాళికా మూల్యాంకనం
3. ఆఫీస్, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా
4. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్


నీతి ఆయోగ్ సభ్యులు
     అధ్యక్షులు
     ఉపాధ్యక్షుడు
     పరిపాలక మండలి - అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు
నీతి ఆయోగ్ ఎక్స్ అఫీషియో సభ్యులు
     1. అరుణ్ జైట్లీ - కేంద్ర ఆర్థిక మంత్రి
     2. రాజ్‌నాథ్‌సింగ్ - కేంద్ర హోంమంత్రి
     3. సురేష్ ప్రభు - రైల్వే మంత్రి
     4. రాధామోహన్ సింగ్ - కేంద్ర వ్యవసాయ మంత్రి


నీతి ఆయోగ్ పూర్తి కాల సభ్యులు
     1. వి.కె.సారస్వత్
     2. బిబేక్ దేబ్రాయ్
* నీతి ఆయోగ్‌కు ముఖ్య కార్యనిర్వహణాధికారి - సింధుశ్రీ ఖుల్లర్ (భారత ప్రభుత్వ కార్యదర్శి హోదా)
* నీతి ఆయోగ్ సామాజిక విభాగానికి ప్రధాన సలహాదారుగా ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి రతన్‌వాటల్ నియమితులయ్యారు.
* 2015, ఫిబ్రవరి 6న 'నీతి ఆయోగ్ మొదటి సమావేశం 'టీమ్ ఇండియా పేరుతో న్యూదిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తప్ప మిగిలిన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు హాజరయ్యారు.
* ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ (అందరితో కలిసి అందరి అభివృద్ధి) అనేది నీతి ఆయోగ్ లక్ష్యమని వ్యాఖ్యానించారు.
* 2015, జులై 15న 'నీతి ఆయోగ్ రెండో సమావేశం న్యూదిల్లీలో జరగగా 16 రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు.
* గోదావరి పుష్కర వివాదం వల్ల ఈ సమావేశానికి హాజరు కాలేనని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రధానికి సమాచారం అందించారు.
* రెండో సమావేశాన్ని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు బహిష్కరించారు.

 


నీతి ఆయోగ్, ప్రణాళికా సంఘాల మధ్య వ్యత్యాసాలు

నీతి ఆయోగ్ ప్రణాళికా సంఘం
* నీతి ఆయోగ్ కేవలం సలహా సంఘం మాత్రమే. దీనికి నిధులు కేటాయించే అధికారం లేదు * జాతీయ, రాష్ట్ర స్థాయిలో దీనికి నిధులు కేటాయించే అధికారం ఉంది
* నీతి ఆయోగ్‌లో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కీలక పాత్ర పోషిస్తాయి. * రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు జాతీయాభి వృద్ధి మండలి సమావేశాలకు, వార్షిక ప్రణాళికా సమావేశాలకు మాత్రమే పరిమితమవుతాయి.
* విధానాల రూపకల్పన, నిధుల కేటాయింపు విషయాల్లో రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను నీతి ఆయోగ్ తప్పనిసరిగా సంప్రదించాలి. వీటి ఆమోదంతోనే అంతిమ విధానాన్ని ప్రకటిస్తుంది. * ముందుగా ప్రణాళికా సంఘం విధానాలను రూపొందిస్తుంది. తర్వాత నిధుల కేటాయింపు కోసం రాష్ట్రాలను సంప్రదిస్తుంది.
* నీతి ఆయోగ్ కేవలం ఒక సలహాలిచ్చే మేధో నిలయం మాత్రమే. తాను రూపొందించిన విధానాలను అమలు చేసే అధికారం లేదు. * ప్రణాళికా సంఘం తన విధానాలను రాష్ట్రాలపై బలవంతంగా అమలు చేస్తుంది.
* నీతి ఆయోగ్ ప్రధాన లక్ష్యం కోఆపరేటివ్ ఫెడరి లిజం సాధించడం. ప్రధాని నరేంద్ర మోదీ అభి ప్రాయం ప్రకారం విధాన నిర్ణయీకరణ ప్రక్రియ పైనుంచి కింది స్థాయికి, కింది నుంచి పైస్థాయికి మారాల్సిన అవసరం ఉంది. * ప్రణాళిక సంఘంలో ఇలాంటి దృక్పథం లేదు. కేంద్ర నిర్ణయాలను రాష్ట్రాలు తప్పనిసరిగా పాటించాల్సిందే.
Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌