• facebook
  • whatsapp
  • telegram

జాతీయ సమగ్రత - అవరోధాలు

ప్రధానమైన అవరోధాలు/ ముప్పు

మతతత్వం (Communalism): 
* మతాన్ని వ్యక్తిగత జీవితానికి పరిమితం చేయకుండా, సామాజికీకరణ చేసే ప్రయత్నాన్ని మతతత్వం అంటారు. బ్రిటిష్‌వారి పాలనా కాలం (1909) లోనే అప్పటి మింటో- మార్లే సంస్కరణల చట్టం ద్వారా మనదేశంలో తొలిసారిగా ముస్లింలకు మతప్రాతిపదికన నియోజకవర్గాలను కేటాయించారు. ఇది భారత్‌లో మతతత్వానికి పునాదిగా నిలిచింది. 
* మనదేశంలో కొందరు రాజకీయ నాయకులు సైతం మతాన్ని మరింత ప్రోత్సహించడం వల్ల ఇది మరింత విస్తరించింది. అకాలీదళ్, ముస్లింలీగ్, రామరాజ్యపరిషత్, హిందూ మహాసభ, శివసేన మొదలైన రాజకీయ పార్టీలు మతం ప్రాతిపదికన ఏర్పడ్డాయి.
* బలవంతపు మత మార్పిడులు, వివిధ మతాలవారి మధ్య పరస్పర దాడులు, సాంస్కృతిక జాతీయవాదం పేరుతో అతివాద ప్రవర్తనా ధోరణులు జాతీయ సమగ్రతకు ముప్పుగా పరిణమిస్తున్నాయి.
* 1947లో మతకల్లోలాల ఫలితంగా దేశ విభజన జరిగింది. 
* 1984లో ఇందిరా గాంధీ హత్యానంతరం సిక్కులపై దాడులు జరిగాయి. 1992, డిసెంబరు 6న జరిగిన‘బాబ్రీ మసీద్‌’ విధ్వంసం; గుజరాత్‌లోని గోద్రాలో జరిగిన మత ఘర్షణలు జాతీయ సమగ్రతకు పెను సవాలుగా నిలిచాయి.
* రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్, విశ్వహిందూ పరిషత్, జమాత్‌-ఈ-ఇస్లామీ, ఆంగ్లో ఇండియన్‌ క్రిస్టియన్‌ అసోసియేషన్‌ మొదలైన సంస్థలన్నీ మత ప్రాతిపదికన ఏర్పడినవే. వీటి విధానాలు సైతం మతతత్వానికి కారణమై జాతీయ సమగ్రతకు సవాలుగా నిలుస్తున్నాయి.
* 2011 జనాభా లెక్కల ప్రకారం మన దేశంలో హిందువులు 80.5%, ముస్లింలు 13.4%, క్రిస్టియన్లు 2.3%, సిక్కులు 1.9%, బౌద్ధులు 0.8%, జైనులు 0.4% ఉన్నారు. ఏ మతాన్నీ అనుసరించని వారు కూడా ఇక్కడ నివసిస్తున్నారు. వీరందరి మధ్య నమన్వయాన్ని సాధించాలి. లౌకిక వాదం విఫలమైతే దేశ సమగ్రత ప్రశ్నార్థకం అవుతుంది.

 

రాజ్యాంగ రక్షణ
రాజ్యాంగంలోని 3వ భాగంలో పేర్కొన్న ప్రాథమిక హక్కుల్లోని మతస్వాతంత్య్రపు హక్కు భారతదేశ లౌకిక పునాదులను వివరిస్తుంది. ఇందిరాగాంధీ ప్రభుత్వం 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగ ప్రవేశికను సవరించి ‘సామ్యవాద, లౌకిక, సమగ్రత’ అనే పదాలను చేర్చింది.


భాషావాదం  (Linguism) 
* తమ భాష పట్ల మితిమీరిన అభిమానం కలిగి, ఇతర భాషలను ద్వేషించడాన్ని ‘భాషావాదం’గా పేర్కొంటారు.
* 1953, అక్టోబరు 1న భాష ప్రాతిపదికన మొదటగా ‘ఆంధ్రరాష్ట్రం’ ఏర్పడింది. దీని ఫలితంగా భాష ఆధారంగా ‘రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ’ జరగాలని దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రజలు డిమాండ్‌ చేశారు.
* 1956లో ఫజల్‌ అలీ కమిషన్‌ సిఫార్సుల మేరకు జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రభుత్వం 7వ రాజ్యాంగ సవరణ చట్టం చేసింది. దీని ద్వారా రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ చట్టాన్ని రూపొందించి 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం మనదేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి.
* 1963లో భారత ప్రభుత్వం రూపొందించిన జాతీయ అధికార భాషా చట్టం ప్రకారం ‘హిందీ’ని కేంద్ర అధికార భాషగా ప్రకటించారు. దీంతో దక్షిణాది రాష్ట్రాలు, హిందీయేతర భాషా రాష్ట్రాలు ‘హిందీ భాష’ వ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభించాయి.
* తమిళనాడులో డీఎంకే పార్టీ ఆధ్వర్యంలో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమం భారీ హింసకు దారితీసింది. దీనివల్ల అపారమైన ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. ఉద్యమంలో భాగంగా హిందీ భాషలో ఉన్న రాజ్యాంగ ప్రతులను ధ్వంసం చేశారు. ఈ ఉద్యమం దేశసమగ్రతను సవాలు చేసింది.
* అప్పటి ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రి ఈ ఉద్యమాన్ని అరికట్టేందుకు దక్షిణాది రాష్ట్రాలు కోరినంత కాలం హిందీతో పాటు ఇంగ్లిష్‌ను  సమానంగా కొనసాగిస్తామని ప్రకటించారు.
* దేశ సమగ్రతను పరిరక్షించే లక్ష్యంతో విద్యాసంస్థల్లో డీఎస్‌ కొఠారి కమిషన్‌ ‘త్రిభాషా’ సూత్రాన్ని అమలు చేయాలని సిఫార్స చేసింది. దీని ప్రకారం అన్ని రాష్ట్రాల్లో ఇంగ్లిష్, హిందీతో పాటు ఒక ప్రాంతీయ భాషను అమలు చేయాలి. కానీ తమిళనాడు రాష్ట్రం ఇప్పటికీ ఈ సూత్రాన్ని అమలుచేయడం లేదు. దీనివల్ల మనదేశంలో ఒక అనుసంధాన భాషగా హిందీ కొనసాగాలనే మన రాజ్యాంగ నిర్మాతలు ఆశయం నెరవేరలేదు.
* ఉత్తర్‌ ప్రదేశ్, బిహార్, హరియాణా తదితర ఉత్తరాది రాష్ట్రాల్లో ‘ఆంగ్రేజీ హఠావో’ పేరుతో ఇంగ్లిష్‌ భాషా వ్యతిరేక ఉద్యమాలు ప్రారంభమయ్యాయి.
* మనదేశ బహుభాషా స్వభావాన్ని గుర్తించి అన్ని ప్రాంతాల వారు ఇతరులు ఉపయోగించే భాషల పట్ల సహనం, గౌరవం చూపనంత కాలం, భాషా వాదం దేశసమైక్యతకు ముప్పుగానే పరిణమిస్తుంది.


ప్రాంతీయతత్వం (Regionalism) 
* ఒక దేశంలోని నిర్దిష్ట ప్రాంతంలో ఉన్న ప్రజలు రాజకీయంగా సమీకృతమై, సాంఘిక, ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలను సాధించుకోవడానికి జరిపే ఉద్యమాన్ని ‘ప్రాంతీయ వాదం’గా పేర్కొంటారు.
* కొత్త రాష్ట్రాలను కోరుకోవడం, ప్రాంతీయ స్వయంప్రతిపత్తిని డిమాండ్‌ చేయడం, దేశం నుంచి విడిపోయి ప్రత్యేక దేశంగా ఏర్పడాలనే ఆకాంక్ష మొదలైన రూపాల్లో ప్రాంతీయవాదం వెల్లడై, దేశ సమగ్రతకు ముప్పుగా మారుతుంది.
* లాల్‌డెంగా నేతృత్వంలో మిజో నేషనల్‌ ఫ్రంట్‌ ప్రారంభించిన ప్రత్యేక దేశ ఉద్యమం; ఏజెడ్‌ ఫిజో నేతృత్వంలో గ్రేటర్‌ నాగాలాండ్‌ కోసం జరిగిన పోరాటం; భింద్రేన్‌వాలా నేతృత్వంలో పంజాబ్‌లో ప్రారంభమైన ‘ప్రత్యేక ఖలిస్థాన్‌’ ఉద్యమం; దక్షిణ భారత్‌లో ప్రత్యేక ద్రవిడనాడు ఉద్యమం మొదలైనవి జాతీయ సమగ్రతకు విఘాతం కలిగించాయి. 
* వివిధ ప్రాంతాల మధ్య అభివృద్ధి విషయంలో జరిగిన అసమానతలు కూడా ప్రాంతీయ వేర్పాటువాదానికి కారణమయ్యాయి.
ఉదా: పశ్చిమ్‌ బెంగాల్‌ రాష్ట్రంలోని డార్జిలింగ్‌ ప్రాంతంలో నివసించే గూర్ఖాలు, అసోంలోని బోడో తెగవారు చేపట్టిన ఉద్యమాలు హింసాత్మకంగా మారాయి.
* ‘భూమిపుత్రుల సిద్ధాంతం’ జాతీయ సమగ్రతకు పెనుసవాలుగా మారింది. దీని ప్రకారం ఆయా రాష్ట్రాల్లో నివసించేవారికే అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగాల నియామకాల్లో స్థానికులకే ప్రాధాన్యం ఉంటుంది.
ఉదా: మహారాష్ట్రీయులకే మహారాష్ట్ర; అస్సామీయులకే అసోం ఉద్యమాలు.


రాజకీయ నాయకులకు - నేరస్తులకు ఉన్న సంబంధం
కొంతమంది రాజకీయ నాయకులు తమ స్వప్రయోజనాల సాధన కోసం నేరస్తులతో సంబంధాలను కొనసాగిస్తూ, దేశ సమగ్రతకు విఘాతం కలిగిస్తున్నారు. ఈ విషయాన్ని ఓహ్రా కమిషన్‌ ఆధారాలతో సహా రుజువు చేసింది.

 

సీమాంతర ఉగ్రవాదం
జాతీయ సమగ్రతకు మరో ముప్పు ‘సీమాంతర ఉగ్రవాదం’. దేశాన్ని అస్థిరపర్చడం దీని లక్ష్యం. ఇందులో పొరుగు దేశాల సాయంతో దేశంలోని వివిధ వర్గాల వారిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రదాడులు జరుపుతారు. దీనివల్ల ప్రజలు  అభద్రతాభావానికి గురై సమగ్రత లోపిస్తుంది. దేశంలోని వివిధ దేవాలయాలు, మసీదులు, చర్చిలు ఇతర ప్రార్థనా మందిరాలపై జరిగే దాడులు జాతీయ సమగ్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.


కులతత్వం  (Casteism)
* దేశ ప్రయోజనాల కంటే సొంత కులానికి చెందిన ప్రయోజనాల కోసం  చేసే ప్రయత్నాలను కులతత్వంగా పేర్కొంటారు.
* వివిధ రాజకీయ పార్టీలు ఎన్నికల్లో లబ్ధిపొందడానికి కుల ప్రాతిపదికన సీట్లు కేటాయిస్తున్నాయి. మంత్రిమండలి నిర్మాణంలోనూ దాని ఆధారంగానే పదవులను ఇస్తున్నాయి. అగ్ర, నిమ్న కులాల మధ్య చెలరేగే ఘర్షణలు జాతీయ సమగ్రతను దెబ్బతీస్తున్నాయి.
* కొన్ని ఆధిపత్య కులాలు తమకు ప్రత్యేక రిజర్వేషన్లు కావాలని డిమాండ్‌ చేయడం, మిగిలిన వర్గాల వారు దాన్ని వ్యతిరేకించడం హింసకు దారితీస్తుంది.
* ఆంధ్రప్రదేశ్‌లోని కాపులు, మహారాష్ట్రలోని మరాఠాలు, గుజరాత్‌లోని పత్తేదార్లు, రాజస్థాన్‌లోని గుజ్జార్లు, ఉత్తర్‌ ప్రదేశ్, హరియాణ రాష్ట్రాల్లోని జాట్‌లు తమకు రిజర్వేషన్లు కావాలని కోరుతూ ఉద్యమాలు నిర్వహించారు.
* వివిధ రాష్ట్రాల్లో రాజకీయాలన్నీ ప్రధాన కులాల మధ్య పోరుగా సాగుతున్నాయి. కులాంతర వివాహాలు చేసుకున్న వారిని కుటుంబ సభ్యులే గౌరవం, సంప్రదాయాల పేరుతో పరువు హత్యలకు పాల్పడుతున్నారు. వీటన్నింటితో హింస చెలరేగి, ప్రజల్లో సమైక్యత లోపిస్తోంది.


ప్రముఖుల అభిప్రాయాలు
* కులమే నిజమైన జాతివ్యతిరేకి. ఎందుకంటే అది దేశాన్ని వర్గాలుగా విడదీస్తుంది. జాతీయ సమగ్రత అంటే కులాల్ని, అన్ని విభజనలను నిర్మూలించడమే. - నోబెల్‌ బహుమతి గ్రహీత అమర్త్యసేన్‌
* వివిధ వర్గాలవారికి కల్పించిన రిజర్వేషన్లు సదరు వ్యక్తులకు ఏ కులంలో పుట్టామనే అంశాన్ని గుర్తుచేస్తూ, కులాన్ని మరిచిపోకుండా చేస్తున్నాయి. ఇది జాతీయ సమగ్రతకు ప్రమాదకరంగా పరిణమిస్తుంది. - బ్రజ్‌ కుమార్‌ నెహ్రూ 
(భారత మాజీ దౌత్యవేత్త)


నమూనా ప్రశ్నలు
1. మనదేశంలో ఏ చట్టం ప్రకారం మత ప్రాతిపదికన నియోజకవర్గాల ఏర్పాటు జరిగింది?
1) 1773 రెగ్యులేటింగ్‌ చట్టం 
2) 1813 చార్టర్‌ చట్టం
3) 1858 భారతప్రభుత్వ చట్టం 
4) 1909 మింటో - మార్లే సంస్కరణల చట్టం


2. 1984లో ఇందిరాగాంధీ హత్యానంతరం ఏ మతస్తులపై తీవ్రమైన దాడులు జరిగాయి?
1) ముస్లిం        2) సిక్కు       3) క్రైస్తవ         4) హిందూ


3. బాబ్రీ మసీద్‌ విధ్వంసం దుర్ఘటన ఎప్పుడు జరిగింది?
1) 1992, డిసెంబరు 6       2) 1993, డిసెంబరు 6
3) 1994, డిసెంబరు 6       4) 1995, డిసెంబరు 6


సమాధానాలు: 1-4; 2-2; 3-1.

Posted Date : 22-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌