• facebook
  • whatsapp
  • telegram

భారతదేశంలో పార్టీ ఫిరాయింపులు

   భారత రాజకీయ వ్యవస్థ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో పార్టీ ఫిరాయింపులు ఒకటి. 1967 తర్వాత భారత రాజకీయాల్లో ముఖ్యంగా రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయింపులు చాలా అధికమయ్యాయి. దీనికి పరిష్కారంగా 1985లో 52వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా కేంద్ర ప్రభుత్వం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని Xవ షెడ్యూల్‌లో చేర్చింది. ఈ చట్టంలోని లోపాలను సవరిస్తూ 2003లో 91వ రాజ్యాంగ సవరణ చట్టం చేసింది. అయినప్పటికీ దేశంలోని అనేక రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయింపులు జరుగుతున్నాయి. దేశంలోని ఏ ఒక్క రాష్ట్రం / కేంద్రపాలిత ప్రాంతం కూడా పార్టీ ఫిరాయింపులకు అతీతంగా లేదు.


పార్టీ ఫిరాయింపులు అంటే ఏమిటి?
  రాజకీయాల్లో 'ఒక పార్టీ మేనిఫెస్టో ఆధారంగా ఆ పార్టీ గుర్తుపై పోటీ చేసి, గెలిచిన తర్వాత ఆ పార్టీకి కాకుండా మరో పార్టీకి విధేయత చూపించడం, మరో పార్టీలో చేరడం లేదా పార్టీ ఆదేశాలకు వ్యతిరేకంగా (పార్లమెంటు సభ్యులైతే పార్లమెంటులో, రాష్ట్ర శాసన సభ్యులైతే శాసనసభలో) ఓటువేయడం లేదా ఓటు వేయకుండా గైర్హాజరు కావడాన్ని పార్టీ ఫిరాయింపు అంటారు.
  స్వతంత్ర సభ్యుడిగా (పార్టీ గుర్తుపై కాకుండా) ఎన్నికైన సభ్యుడు ఏదైనా పార్టీలో చేరినా, నియమితుడైన సభ్యుడు (నామినేటెడ్) నియామకం జరిగిన ఆరు నెలల తర్వాత (ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి) ఏదైనా పార్టీలో చేరినా దాన్ని పార్టీ ఫిరాయింపుగా భావిస్తారు.


గత చరిత్ర
భారత ప్రజాస్వామ్యంలో పార్టీ ఫిరాయింపులు స్వాతంత్య్రం రాక పూర్వమే ప్రారంభమయ్యాయి. భారత ప్రభుత్వ చట్టం (1935) ప్రకారం 1937లో రాష్ట్ర శాసన సభలకు జరిగిన ఎన్నికల తర్వాత అనేక రాష్ట్రాల్లో భారత జాతీయ కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కొంతమంది ముస్లిం లీగ్ శాసన సభ్యులు భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరి, మంత్రివర్గంలో చోటు సంపాదించారు.

* స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1952 - 67 మధ్యకాలంలో కూడా ఉత్తర్ ప్రదేశ్, మద్రాసు రాష్ట్రం (తమిళనాడు), కేరళ, రాజస్థాన్ లాంటి అనేక రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయింపుల కారణంగా ప్రభుత్వాలు రాజీనామా చేయాల్సి రావడం లేదా మెజారిటీ లేకపోయినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, పార్టీ ఫిరాయింపుల ద్వారా మెజారిటీ సాధించడం లాంటి సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణకు మద్రాసు రాష్ట్రంలో మొదటి సాధారణ ఎన్నికల (1952) తర్వాత మెజారిటీ లేకపోయినప్పటికీ గవర్నర్ ఆహ్వానంతో రాజగోపాలాచారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత జరిగిన పార్టీ ఫిరాయింపుల కారణంగా మెజారిటీ పొందారు. మరికొన్ని సందర్భాల్లో పార్టీ ఫిరాయించి మంత్రివర్గంలో స్థానం పొందడమే కాకుండా ఏకంగా ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన సందర్భాలూ ఉన్నాయి. ఉదాహరణకు హరియాణా.
* భారత రాజకీయాల్లో 1967 సంవత్సరాన్ని ఒక మైలురాయిగా పేర్కొనవచ్చు. 1967లో లోక్‌సభతో పాటు 16 రాష్ట్రాలకు జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 8 రాష్ట్రాల్లో (కేరళ, మద్రాసు రాష్ట్రం, పశ్చిమ బంగ, బిహార్, ఒడిశా, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్) మెజారిటీ కోల్పోయింది. అయితే ఎన్నికల్లో మెజారిటీ సాధించలేకపోయినప్పటికీ అతిపెద్ద పార్టీగా అవతరించి రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, పార్టీ ఫిరాయింపుల ద్వారా మెజారిటీకి కావలసిన సభ్యుల సంఖ్యను సాధించుకుంది.
* పార్టీ ఫిరాయింపుల కారణంగా ప్రభుత్వం రద్దుకావడం లేదా కొత్త ప్రభుత్వం ఏర్పడటం సాధారణ విషయంగా మారిపోయింది. 1967లో మార్చి - డిసెంబరు మధ్య ఉన్న తొమ్మిది నెలల కాలంలో మొత్తం 3447 మంది శాసన సభ్యుల్లో 314 మంది అంటే దాదాపు 9 శాతం మంది పార్టీ ఫిరాయించారు. 1972 - 77 మధ్య కాలంలో 10 రాష్ట్ర ప్రభుత్వాలు పార్టీ ఫిరాయింపుల మూలంగా రాజీనామా చేయాల్సి వచ్చింది. శాసన సభ్యులు (ఉదాహరణకు హరియాణాలో గయాలాల్) కొన్ని సందర్భాల్లో పక్షం రోజుల్లో మూడు రాజకీయ పార్టీలు మారిన సందర్భాలు ఉన్నాయి. ఇది 'ఆయారాం గయారాం సంస్కృతిగా ప్రాచుర్యం పొందింది. ఒక అంచనా ప్రకారం ఇప్పటి రాజకీయాల్లో ఉన్న శాసన సభ్యుల్లో దాదాపు 1/5వ వంతు మంది పార్టీ ఫిరాయించినవారు ఉన్నారు. వెయ్యికి పైగా పార్టీ ఫిరాయింపు సంఘటనలు ఉన్నాయి.
* 2016లో ఉత్తరాఖండ్, అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో రాజకీయ అస్థిరతకు పార్టీ ఫిరాయింపులే కారణమయ్యాయి. అరుణాచల్‌ప్రదేశ్‌లో 45 మంది 'కాంగ్రెస్ పార్టీ సభ్యులకు 44 మంది ముఖ్యమంత్రితో సహా 'పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్‌ప్రదేశ్‌లో విలీనమయ్యారు. ప్రస్తుతం తమిళనాడులో రాజకీయ అనిశ్చితికి పార్టీ ఫిరాయింపులే కారణమవుతున్నాయి.
* కేవలం రాష్ట్రాల్లోనే కాకుండా కేంద్రంలో కూడా ఈ సంస్కృతిని మనం గమనించవచ్చు. 1990 - 95 మధ్యకాలంలో పార్టీ ఫిరాయింపులు జోరుగా సాగాయి. 1990లో పి. చంద్రశేఖర్ ప్రధానమంత్రి కావడానికి, 1991లో పి.వి.నరసింహారావు మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, 1995 నాటికి మెజారిటీ సాధించడానికి పార్టీ ఫిరాయింపులే కారణం.

పార్టీ ఫిరాయింపులకు కారణాలు
   పార్టీ సిద్ధాంతాలతో పనిలేకుండా అనైతికంగా, అవకాశవాదంతో అధికారం కోసం (ముఖ్యమంత్రి, మంత్రి, ఇతర పదవులు) పార్టీ మారుతున్నారు. ప్రభుత్వంలో పలుకుబడి, తమకు అనుకూలంగా ప్రభుత్వ నిర్ణయాలు, ధన సంపాదన లాంటివి ఫిరాయింపులకు దారితీస్తున్నాయి.
i) సంఖ్యాపరంగా శాసనసభలో సాధారణ మెజారిటీకి దగ్గర స్థానాలు (ఎక్కువ లేదా తక్కువ) పొంది ఉన్నట్లయితే పార్టీ ఫిరాయింపులు ఎక్కువగా జరుగుతుంటాయి.
ii) కొన్ని సందర్భాల్లో పార్టీ అధినాయకత్వం నిరంకుశ నిర్ణయాలకు నిరసనగా ఫిరాయింపులు ఉంటాయి.
iii) ఎన్నికలు సమీపిస్తున్నప్పుడు పార్టీ అధికారంలోకి రాదని భావిస్తే ఇతర పార్టీల్లోకి ఫిరాయించడం జరుగుతుంది.
iv) ఎన్నికలైన వెంటనే ఎన్నికైన స్వతంత్ర సభ్యులు ఏదో ఒక పార్టీలోకి ముఖ్యంగా అధికార పార్టీలోకి ఫిరాయించడం జరుగుతుంది. ప్రతిపక్ష పార్టీ సభ్యులు కూడా పార్టీ ఫిరాయింపుల చట్టంలోని లోపాలను ఆధారంగా చేసుకుని ఎన్నికైన పార్టీకి రాజీనామా చేయకుండా అధికార పార్టీకి విధేయత ప్రకటించి, కొన్నిసార్లు మంత్రి పదవులు పొందుతుంటారు.
v) పార్టీ ఫిరాయింపులను ప్రజలు పెద్ద తప్పుగా భావించకపోవడం, తిరిగి ఎన్నుకోవడం.

* ఇవి కాకుండా పార్టీలో సమర్థవంతమైన నాయకత్వం లేకపోవడం, పార్టీలలో ప్రజాస్వామ్యం లోపించడం, ముఠా రాజకీయాలు, వారసత్వ రాజకీయాలు లాంటివి కూడా కారణమవుతున్నాయి.

ఫిరాయింపుల నిరోధానికి ప్రయత్నాలు
i) కేంద్ర హోం మంత్రిత్వశాఖ 1967లో వివిధ పార్టీలకు చెందిన పార్లమెంటు సభ్యులతో వై.బి.చవాన్ అధ్యక్షతన ఒక కమిటీని నియమించింది.
ii) 1973లో కేంద్ర ప్రభుత్వం పార్టీ ఫిరాయింపుల నిరోధానికి రాజ్యాంగ సవరణ బిల్లును ప్రతిపాదించినప్పటికీ, అది చట్టంగా ఆమోదం పొందకముందే 1977లో లోక్‌సభ రద్దయ్యింది.
iii) 1977లో కేంద్రంలో జనతాపార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఒక కేబినెట్ కమిటీని నియమించి, 1978 లో బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పటికీ అది చట్టం కాలేదు.

 

పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం, సవరణ చట్టం
  పార్టీ ఫిరాయింపుల నిరోధానికి 1985లో 52వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా గట్టి ప్రయత్నం జరిగింది. దీని ద్వారా పార్టీ ఫిరాయింపులకు సంబంధించి రాజ్యాంగంలోని 102(2)వ నిబంధన ద్వారా పార్లమెంటు సభ్యులు, 191(2) నిబంధన ద్వారా రాష్ట్ర శాసనసభ్యుల అనర్హతలకు వివరణను 10వ షెడ్యూల్‌లో చేర్చారు. ఆ విధంగా 10వ షెడ్యూల్ రాజకీయ ఫిరాయింపుల చట్టానికి చిరునామాగా మారింది. ఇది 1985, మార్చి 1 నుంచి అమల్లోకి వచ్చింది.

 

* పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం, 1985 ప్రకారం కింది సందర్భాల్లో పార్లమెంటు సభ్యులకు, రాష్ట్ర శాసనసభ్యులకు అనర్హత వర్తిస్తుంది.
1) ఏదైనా ఒక పార్టీ తరపున ఎన్నికై, తర్వాత స్వచ్ఛందంగా పార్టీకి రాజీనామా చేసిన సందర్భంలో
2) పార్టీ ఆదేశాలకు విరుద్ధంగా ఓటు వేయడం లేదా పార్టీ అనుమతి లేకుండా గైర్హాజరైనప్పుడు (అయితే ఓటింగ్ రోజు నుంచి 15 రోజుల్లోపు పార్టీ క్షమించినప్పుడు ఈ చట్టం వర్తించదు)
3) స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికై, ఏదైనా రాజకీయ పార్టీలో చేరినప్పుడు
4) చట్టసభల్లో నియమించిన (నామినేటెడ్) సభ్యుడు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఆరు నెలల తర్వాత ఏదైనా రాజకీయ పార్టీలో చేరినప్పుడు

కింది సందర్భాల్లో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం, 1985 వర్తించదు...
1) పార్టీ మొత్తం సభ్యుల్లో 1/3వ వంతు చీలిక వర్గంగా వేరుపడినప్పుడు,
2) పార్టీ మొత్తం సభ్యుల్లో 2/3వ వంతు సభ్యుల అంగీకారంతో రెండు లేదా అంతకంటే ఎక్కువ పార్టీలు విలీనం అయినప్పుడు,
3) స్పీకర్, డిప్యూటీ స్పీకర్, ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్ తమ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినా లేదా పదవీకాలం తర్వాత తిరిగి అదే పార్టీలో చేరినప్పటికీ ఈ చట్టం వర్తించదు, చట్టసభలో సభ్యత్వం రద్దుకాదు.

 

నిర్ణయాధికారం ఎవరిది..?
పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన ఫిర్యాదులపై ఎగువ సభ అయితే ఛైర్మన్‌కు, దిగువ సభ అయితే స్పీకర్‌కు అంతిమ నిర్ణయాధికారం ఉంటుంది. న్యాయస్థానాలకు అనర్హతకు సంబంధించిన నిర్ణయాధికారం లేదు.
అయితే స్పీకర్‌కు నిర్ణయాధికారం ఉన్నప్పటికీ స్పీకర్ నిర్ణయంపై న్యాయస్థానాలు రాజ్యాంగ సమీక్ష చేసే అధికారం కలిగి ఉంటాయని 'కిహోటో హోలాహాన్ Vs జచిల్హు కేసులో, రవి ఎస్ నాయక్ Vs భారత ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

* కులదీప్ నయ్యర్ Vs భారత ప్రభుత్వం కేసులో రాష్ట్ర శాసనసభ్యుడు, రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ ఆదేశాలకు విరుద్ధంగా ఓటు వేసినప్పటికీ పదో షెడ్యూల్‌లోని అనర్హత చట్టం వర్తించదని స్పష్టం చేసింది. అందుకే రాజ్యసభ ఎన్నికలు, రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర శాసన సభ్యులకు విప్ జారీచేసే అధికారం పార్టీలకు లేదు.

91వ రాజ్యాంగ సవరణ చట్టం, 2003
  పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలోని లోపాలను సవరించడానికి కేంద్ర ప్రభుత్వం 2003లో 91వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా కింది మార్పులను చేసింది.
1. రాజ్యాంగంలోని 75 (1బి) ని చేర్చడం ద్వారా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హులైన పార్లమెంటు సభ్యులను మంత్రులుగా సభ పదవీకాలం ముగిసేవరకు లేదా తిరిగి సభకు ఎన్నికయ్యే వరకు నియమించరాదు. అదేవిధంగా 164 (1బి) ప్రకారం రాష్ట్ర శాసనసభ్యులు అనర్హత పొందితే సభ పదవీకాలం ముగిసే వరకు లేదా తిరిగి సభకు ఎన్నికయ్యే వరకు మంత్రులుగా నియమించరాదు.
2. రాజ్యాంగంలోని 361 (బి) నిబంధనను చేర్చడం ద్వారా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హుడైన చట్టసభ సభ్యుడిని అనర్హత పొందినప్పటి నుంచి పదవీకాలం ముగిసే వరకు లేదా తిరిగి సభకు ఎన్నికయ్యే వరకు లాభదాయకమైన రాజకీయ పదవుల్లో నియమించరాదు.
 పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని సవరించిన తర్వాత కూడా ఫిరాయింపులు జరగడానికి, వివాదాలు రావడానికి కింది అంశాలు కారణమవుతున్నాయి.
1) పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అమలుచేసే నిర్ణయాధికారం స్పీకర్‌కు ఉండటం. స్పీకర్ అధికార పార్టీకి అనుకూలంగా పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన ఫిర్యాదులపై నిర్ణయాలను తీసుకునే కాలం ఆధారపడి ఉంటుంది. అది కొన్ని సంవత్సరాలు, నెలలు, వారాలు లేదా రోజులు కావచ్చు. నిర్ణయాలకు నిర్ణీత కాల వ్యవధి అవసరం. అంతేకాకుండా నిర్ణయాధికారం స్పీకర్‌కు కాకుండా ఎన్నికల సంఘానికి లేదా స్వతంత్ర సంస్థకు అప్పగించాలి.
2) ఫిరాయింపు 2/3వ వంతు చట్టబద్ధం కావడం కూడా అభాసుపాలవుతోంది. కాబట్టి ఒక పార్టీ మేనిఫెస్టోపై ఎన్నికై మరో మేనిఫెస్టో ఉన్న పార్టీతో విలీనం కావడాన్ని రద్దు చేయాలి.
 రాజకీయ అస్థిరతకు, అసమర్థతకు, రాజకీయ అవినీతికి, అనైతిక పాలనకు, రాజకీయ పదవుల ప్రాముఖ్యత తగ్గిపోవడానికి, అధికారుల ప్రాబల్యం పెరగడానికి, ప్రజాస్వామ్యం అంటే అంకెల గారడీ కాకుండా నిజమైన ప్రజాభిప్రాయానికి ప్రతిబింబం కావాలంటే పార్టీ ఫిరాయింపులను సంపూర్ణంగా నిరోధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

నమూన ప్రశ్నలు

1. రాజకీయ పార్టీల ప్రస్తావన రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్‌లో ఉంది?
జ: X


2. కిందివాటిలో రాజకీయ పార్టీలు జారీచేసే విప్‌కు సంబంధించి సరైంది ఏది?
ఎ) రాజకీయ పార్టీలు జారీచేసే విప్ మూడు రకాలు (ఒకే లైను, రెండు లైన్లు, మూడు లైన్లు)
బి) లైన్ల సంఖ్య, అండర్ లైన్ చేయడం విప్ ప్రాధాన్యతా క్రమాన్ని సూచిస్తుంది
సి) 3 లైన్ల విప్‌ను పార్టీ సభ్యులందరూ తప్పక పాటించి తీరాలి
డి) అన్నీ సరైనవి
జ: డి (అన్నీ సరైనవి)


3. రాజకీయ పార్టీలకు రాజ్యాంగపరమైన గుర్తింపును ఇచ్చిన రాజ్యాంగ సవరణ చట్టం ఏది?
జ: 52వ


4. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం దాన్ని అమలు చేసే అంతిమ అధికారం ఎవరికి ఉంది?
జ: స్పీకర్/ ఛైర్మన్


5. 'పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం సభ్యుల అనర్హతను నిర్ణయించే అధికారం స్పీకర్/ ఛైర్మన్‌దే అయినప్పటికీ స్పీకర్/ఛైర్మన్ నిర్ణయం న్యాయ సమీక్షకు లోబడి ఉంటుంది అని సుప్రీంకోర్టు కింది ఏ కేసులో తీర్పునిచ్చింది?
ఎ) కిహోటో హోలాహాన్ Vs జచిల్హు (1993)
బి) కులదీప్ నయ్యర్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా (2006)
సి) జి.విశ్వనాథన్ Vs తమిళనాడు స్పీకర్ (1996)
డి) అన్నీ సరైనవి
జ: ఎ (కిహోటో హోలాహాన్ Vs జచిల్హు (1993))

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌