• facebook
  • whatsapp
  • telegram

రాజకీయ పార్టీలు 

జాతీయం, ప్రాంతీయం

రాజకీయ పార్టీ అంటే ఏమిటి?

     ''కొన్ని సిద్ధాంతాలకు కట్టుబడి రాజ్యాంగబద్ధమైన, శాంతియుత పద్ధతుల ద్వారా అధికారాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నించే కొంతమంది వ్యక్తుల వ్యవస్థీకృత స్వరూపమే రాజకీయ పార్టీ".

రాజకీయ పార్టీలు - ఆవశ్యకత

* ప్రజాస్వామ్య వ్యవస్థను క్రియాశీలం చేసి బలోపేతం చేస్తాయి.

* ప్రజల్లో రాజకీయ చైతన్యాన్ని కలిగిస్తాయి.

* ప్రాతినిధ్య ప్రజాస్వామ్యాన్ని ఫలపద్రం చేస్తాయి.

* ప్రజల క్షేత్రస్థాయి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతాయి.

* అధికారాన్ని చేపట్టిన పార్టీలు ప్రభుత్వ విధానాలను రూపొందిస్తాయి.

* ప్రజాసంక్షేమం కోసం కృషి చేస్తాయి.

* ఎన్నికల ప్రక్రియలో పాల్గొని సామరస్య, శాంతియుత అధికార మార్పిడికి కృషి చేస్తాయి.

* తమ సిద్ధాంతాలను, చేపట్టే కార్యక్రమాలను ఎన్నికల మేనిఫెస్టోలలో పొందుపరచి, ప్రజాతీర్పును కోరతాయి.

* ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబిస్తాయి.

తొలి రాజకీయ పార్టీలు

* భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1) (C)లో వివరించిన అసోసియేషన్‌ల ఏర్పాటు అనే అంశాన్ని ఆధారంగా చేసుకుని రాజకీయ పార్టీలను స్థాపించుకోవచ్చు.

* రాజీవ్‌గాంధీ ప్రభుత్వం 1985లో 52వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 10వ షెడ్యూల్‌ను రాజ్యాంగానికి చేర్చి అందులో రాజకీయ పార్టీలు అనే పదాన్ని పేర్కొంది.

* 1951 నాటి భారత ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘం వద్ద తమ పార్టీ పేరును నమోదు చేయించుకోవాలి.

రాజకీయ పార్టీలు - రకాలు 

1. జాతీయ పార్టీ:

* ఒక రాజకీయ పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే కింద పేర్కొన్న షరతుల్లో ఒకదాన్ని నెరవేర్చాలి.

ఎ. లోక్‌సభకు లేదా 4, అంతకంటే ఎక్కువ రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఒక పార్టీ నుంచి అభ్యర్థులు పోటీచేసి పోలై చెల్లుబాటు అయిన ఓట్లలో కనీసం 6% ఓట్లు సాధించాలి. దాంతోపాటు కనీసం 4 లోక్‌సభ సీట్లు గెలుపొందాలి.

                                       లేదా

బి. కనీసం 4 రాష్ట్రాల్లో రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందాలి.

                                       లేదా

సి. లోక్‌సభలోని మొత్తం సీట్లలో కనీసం 2% సీట్లు సాధించాలి. దాంతోపాటు ఈ అభ్యర్థులు కనీసం 3 రాష్ట్రాల నుంచి ఎన్నిక కావాలి.

2014 ఎన్నికల నాటికి భారత దేశంలోని జాతీయ పార్టీల సంఖ్య: 6

1. భారత జాతీయ కాంగ్రెస్

2. భారతీయ జనతా పార్టీ

3. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (CPI)

4. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) CPI(M)

5. బహుజన సమాజ్ పార్టీ (BSP)

6. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)

2. రాష్ట్ర/ ప్రాంతీయ రాజకీయ పార్టీ:

* రాష్ట్ర లేదా ప్రాంతీయ రాజకీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే కింద పేర్కొన్న వాటిలో ఏదో ఒక షరతును నెరవేర్చాలి.

ఎ. లోక్‌సభ ఎన్నికల్లో ఒక రాష్ట్రంలో ఒక పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు పోలై చెల్లుబాటు అయిన ఓట్లలో కనీసం 6% ఓట్లు సాధించాలి. దీనికి తోడు కనీసం ఒక అభ్యర్థి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నిక కావాలి.

                         లేదా

బి. రాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో ఒక పార్టీ తరఫున పోటీచేసిన అభ్యర్థులు పోలై చెల్లుబాటు అయిన ఓట్లలో కనీసం 6% ఓట్లు సాధించాలి. దీనికి తోడు కనీసం ఇద్దరు సభ్యులు రాష్ట్ర శాసన సభ్యులుగా ఎన్నిక కావాలి.

                         లేదా

సి. రాష్ట్ర శాసన సభ మొత్తం సీట్లలో కనీసం 3% సీట్లు సాధించాలి.

* 2014 ఎన్నికల నాటికి మనదేశంలోని ప్రాంతీయ/ రాష్ట్ర పార్టీలు: 47.

3. రిజిస్టర్డ్ పార్టీలు

* జాతీయ పార్టీ లేదా రాష్ట్ర/ ప్రాంతీయ పార్టీ హోదాలేని పార్టీలను రిజిస్టర్డ్ పార్టీలు అంటారు.

* 2014 ఎన్నికల నాటికి భారత్‌లోని రిజిస్టర్డ్ పార్టీల సంఖ్య 1634.

* కేంద్ర ఎన్నికల సంఘం రిజిస్టర్డ్ పార్టీలకు ఎన్నికల గుర్తింపు చిహ్నాలు కేటాయిస్తుంది. దీనికి సంబంధించిన వివాదాల్లో కోర్టులు జోక్యం చేసుకోరాదు.

మరికొన్ని ముఖ్యాంశాలు

* 1906లో ముస్లింలీగ్ పార్టీని ఢాకా నవాబు సలీముల్లాఖాన్ స్థాపించారు.

* 1913లో గదర్ పార్టీని అమెరికాలో లాలా హరదయాళ్ స్థాపించారు. భారత స్వాతంత్రోద్యమానికి మద్దతుగా ఈ పార్టీ పోరాడింది. ఈ పార్టీలో చేరిన ఏకైక ఆంధ్రుడు: దర్శి చెంచయ్య.

* 1922లో స్వరాజ్య పార్టీని చిత్తరంజన్ దాస్, మోతీలాల్ నెహ్రూ ప్రారంభించారు. కేంద్ర శాసనసభలోకి ప్రవేశించి, ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడటం ఈ పార్టీ లక్ష్యం.* 2006లో లోక్‌సత్తా పార్టీని జయప్రకాష్ నారాయణ ప్రారంభించారు. సామాజిక, రాజకీయ అంశాలపై ప్రజలను చైతన్యపరచి సుపరిపాలన, అవినీతిరహిత పాలన అందించడం ఈ పార్టీ లక్ష్యం.
ఈ పార్టీ గుర్తు ఈల..

                                   
 

* ఇందిరాగాంధీ, రాయ్‌బరేలి లోక్‌సభ నియోజక వర్గం నుంచి ఎన్నికైన ఎన్నిక చెల్లదని అలహాబాద్ హైకోర్టు తీర్పునివ్వడంతో 1975లో ఆమె జాతీయ అత్యవసర పరిస్థితిని విధించారు.

* 1977లో కాంగ్రెస్ పార్టీ తొలిసారిగా కేంద్రంలో అధికారం కోల్పోయి మొరార్జీ దేశాయ్ నాయకత్వంలోని జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది.

* 1952లో మొదటి లోక్‌సభ ఎన్నికలు జరుగగా 45% ఓట్లతో కాంగ్రెస్ పార్టీ 364 సీట్లు సాధించింది.

* మొదటి లోక్‌సభ ఎన్నికల్లో కమ్యూనిస్ట్ పార్టీ 16 స్థానాలు సాధించి రెండో స్థానంలో నిలిచింది.

* ఈ ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య = 17.3 కోట్లు

* మొదటి లోక్‌సభకు ఎన్నికైన మహిళలు: 22

                               

1. సాధారణ ఎన్నికలు:

* సాధారణంగా 5 సంవత్సరాలకొకసారి జరిగే ఎన్నికలు.

2. మధ్యంతర ఎన్నికలు:

* రెండు సాధారణ ఎన్నికల మధ్యలో ప్రభుత్వం అధికారాన్ని కోల్పోవడం ద్వారా జరిగే ఎన్నికలు.

3. ఉప ఎన్నికలు:

* రెండు సాధారణ ఎన్నికల మధ్యలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ స్థానాలకు జరిగే ఎన్నికలు.

16వ లోక్‌సభ ఎన్నికలు

* 16వ లోక్‌సభ ఎన్నికలు 2014, ఏప్రిల్ 7 నుంచి 2014, మే 12 వరకు మొత్తం 10 విడతల్లో జరిగాయి. మనదేశ ఎన్నికల చరిత్రలోనే ఇవి సుదీర్ఘమైనవి.

* ఈ ఎన్నికల నాటికి ఓటర్ల సంఖ్య 81.57 కోట్లు.

* ఈ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 66.38% పోలింగ్ నమోదైంది. ఇప్పటివరకు లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో ఇదే అత్యధిక రికార్డు.

* ఈ ఎన్నికల్లో పోటీచేసిన మొత్తం పార్టీల సంఖ్య: 1687

* కనీసం ఒక్కస్థానం కూడా సాధించని పార్టీల సంఖ్య: 1452

* 35 పార్టీల నుంచి గెలుపొందిన మొత్తం సభ్యుల సంఖ్య: 540

* ఈ ఎన్నికల్లో గెలిచిన స్వతంత్ర అభ్యర్థుల సంఖ్య: 3

* 16వ లోక్‌సభకు ఎన్నికైన మహిళల సంఖ్య: 62

* ఈ ఎన్నికల్లో NOTA (None of the Above) ను EVMలలో పొందుపరిచారు.

* దేశంలో అత్యధికంగా 22,268 NOTA ఓట్లు పుదుచ్చేరిలో నమోదయ్యాయి. (కేంద్రపాలిత ప్రాంతం విభాగంలో)

* అత్యధికంగా NOTA ఓట్లు పోలైన లోక్‌సభ నియోజకవర్గం: నీలగిరీస్ (తమిళనాడు). (46,559)

దేశంలో ఎక్కువ లోక్‌సభ స్థానాలున్న రాష్ట్రాలు

1. ఉత్తర్ ప్రదేశ్           80

2. మహారాష్ట్ర              48

3. పశ్చిమ్ బంగా         42

ఓటర్ల సంఖ్య ఆధారంగా అతిపెద్ద లోక్‌సభ నియోజక వర్గాలు

1. మల్కాజ్‌గిరి (తెలంగాణ):          29,53,915 ఓటర్లు.

2. ఘజియాబాద్ (ఉత్తరప్రదేశ్):       22,63,961 ఓటర్లు.

3. బెంగళూర్ నార్త్ (కర్ణాటక):          22,29,063 ఓటర్లు.

Posted Date : 05-06-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌