• facebook
  • whatsapp
  • telegram

రాజమన్నార్ కమిటీ

రాజమన్నార్ కమిటీ 
కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై ఎం.సి.సెతల్వాడ్ కమిటీ చేసిన సిఫార్సులు రాష్ట్రాలను సంతృప్తి పరచలేకపోయాయి. దీంతో 1969 సెప్టెంబరులో తమిళనాడులో అధికారాన్ని చేపట్టిన కరుణానిధి నాయకత్వంలోని డీఎంకే ప్రభుత్వం కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై అధ్యయనం చేసి, సిఫార్సులు ఇచ్చేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసింది.ఈ కమిటీకి మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి పి.వి.రాజమన్నార్ అధ్యక్షుడు కాగా లక్ష్మణస్వామి మొదలియార్, పి.పి.చంద్రారెడ్డి సభ్యులు.
* రాజమన్నార్ కమిటీ కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై అధ్యయనం చేసి అనేక సిఫార్సులతో కూడిన నివేదికను తమిళనాడు ప్రభుత్వానికి సమర్పించింది. దీనికి సంబంధించి ఒక కాపీని కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపింది.

ఈ కమిటీ ప్రధాన సిఫార్సులు 
* అవశిష్ట అధికారాలను రాష్ట్రాలకు కేటాయించాలి.
* రాష్ట్రాలకు ఎక్కువ అధికారాలు కల్పించడం కోసం ఉమ్మడి జాబితాలోని అంశాలను వెంటనే పునఃసమీక్షించి రాజ్యాంగ సవరణ చేసి రాష్ట్రాలకు బదిలీ చేయాలి.
* రాజ్యసభలో రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యాన్ని కల్పించాలి.
* రాజ్యసభకు రాష్ట్రపతి 12 మంది విశిష్ట వ్యక్తులను నియమించే పద్ధతిని రద్దు చేయాలి.
* అంతర్ రాష్ట్ర వివాదాలను సుప్రీంకోర్టు ద్వారా పరిష్కరించాలి.
* అఖిల భారత సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్‌లను రద్దు చేయాలి.
* కేంద్ర మంత్రివర్గంలో రాష్ట్రాల వారీగా ప్రాతినిధ్యం కల్పించాలి.
* ఆర్టికల్ 356, 357, 257 లను రాజ్యాంగం నుంచి తొలగించాలి.
* ప్రధాని అధ్యక్షతన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఒక అంతర్ రాష్ట్ర మండలిని ఏర్పాటు చేయాలి.
* 'గవర్నర్ సంతృప్తి ఉన్నంత వరకే మంత్రిమండలి పదవిలో ఉంటుంది అనే నిబంధనను తొలగించాలి.
* ప్రణాళికా సంఘం ఒక శాశ్వత సంస్థగా ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నియంత్రణ తగ్గాలి.
* కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ అవలంబించే ఏకపక్ష నియంతృత్వ చర్యలను నిరోధించడానికి, రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడటానికి రాష్ట్రాలకు తగినన్ని రక్షణలు కల్పించాలి.
* హైకోర్టు న్యాయమూర్తుల తొలగింపులో రాష్ట్ర శాసనసభల అభిప్రాయాన్ని కూడా తీసుకోవాలి.
* శాసనసభకు జరిగిన ఎన్నికల అనంతరం ఏ రాజకీయ పక్షానికీ పూర్తి స్థాయి మెజారిటీ లభించని పక్షంలో, శాసనసభను సమావేశపరచి, మెజారిటీ సభ్యులు బలపరచిన వ్యక్తిని ముఖ్యమంత్రిగా గవర్నర్ నియమించాలి.
* ఆర్టికల్ 252 ప్రకారం పార్లమెంటు చేసిన చట్టాన్ని మార్పు చేసే అధికారం రాష్ట్ర శాసనసభలకు కల్పించాలి.
* రాష్ట్రాల అవసరాలను ప్రభావితం చేసే బిల్లులను అంతర్ రాష్ట్ర మండలి అనుమతితోనే పార్లమెంటులో ప్రవేశపెట్టాలి.
* రాజ్యాంగాన్ని పార్లమెంటు 2/3వ వంతు మెజారిటీతోనే సవరించాలి. రాజ్యాంగ సవరణలో రాష్ట్రాల పాత్రను పెంచాలి.
* ఎగుమతులు, దిగుమతులపై రాష్ట్రాలకు వాటాను కల్పించాలి.
* గవర్నర్ నివేదిక లేనిదే రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలనను విధించకూడదు.
* ప్రజాస్వామ్యాన్ని పటిష్ఠపరచాలంటే స్థానిక సంస్థలకు తగినన్ని ఆర్థిక వనరులు కల్పించాలి. దీనికోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి.
* ప్రాంతీయ మండళ్లను క్రియాశీలకం చేయాలి. రాష్ట్రాల ఆర్థిక వనరులను పెంచడానికి పన్నుల వ్యవస్థలో అవసరమైన మార్పులు చేయాలి.
* కార్పొరేట్ ట్యాక్స్, విదేశీ ఎగుమతులు, దిగుమతులపై విధించే సుంకాల్లో కూడా రాష్ట్రాలకు వాటాను కల్పించాలి.
* గవర్నర్లను నియమించేటప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను సంప్రదించాలి.
* రాజమన్నార్ కమిటీ చేసిన సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. ఈ సిఫార్సులను పలువురు నిపుణులు తీవ్రంగా వ్యతిరేకించారు. దేశంలో ఎన్నో వేర్పాటు శక్తులు తలెత్తుతుండగా జాతి నిర్మాణం, సమైక్యతా క్రమంలో విద్య, వ్యవసాయ, ఉత్పత్తి రంగాలను విస్తృతం చేసి సామాన్య మానవుడి నిజమైన సమస్యలను పరిష్కరించాల్సి ఉండగా ప్రాంతీయతత్వాన్ని బలోపేతం చేసే విధంగా సిఫార్సులు చేయడం సరైంది కాదని ప్రముఖులు వ్యాఖ్యానించారు.
* 'రాజమన్నార్ కమిటీ సిఫార్సులను యధాతథంగా ఆమోదించి అమలు పరచినట్లయితే భారతదేశం ముక్కలు చెక్కలు అవుతుంది. మన దేశం సమైక్యత, సమగ్రతలు ప్రమాదంలో పడతాయి. అనేక రంగాలు అభివృద్ధికి నోచుకోకుండా వెనకబడిపోతాయి అని ఎం.సి.సెతల్వాడ్ వ్యాఖ్యానించారు.

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌