• facebook
  • whatsapp
  • telegram

సర్కారియా కమిషన్

* కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై అధ్యయనం కోసం ఇందిరా గాంధీ ప్రభుత్వం 1983లో మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయిన రంజిత్‌సింగ్ సర్కారియా అధ్యక్షతన బి.శివరామన్, ఎస్.ఆర్.సేన్ సభ్యులుగా ఒక కమిషన్‌ను నియమించింది.
* ఈ కమిషన్‌కు ఆర్.ఎం.సుబ్రహ్మణ్యంను కార్యదర్శిగా, ఎల్.ఎన్. సిన్హాను రాజ్యాంగ సలహాదారుగా నియమించారు.
* సర్కారియా కమిషన్ 247 సిఫార్సులతో కూడిన నివేదికను 1987, అక్టోబరు 27న రాజీవ్‌గాంధీ ప్రభుత్వానికి సమర్పించింది.
* 1988, జనవరిలో ఈ నివేదికను వెలువరించారు.
* మొత్తం 247 సిఫార్సుల్లో 170 సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం అమలు చేసింది

సిఫార్సులు
గవర్నర్ వ్యవస్థ
* గవర్నర్లను నియమించే ముందు కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా సంబంధిత రాష్ట్ర ముఖ్యమంత్రిని సంప్రదించాలి.
* గవర్నర్ల పేర్లను సూచించడానికి ప్రధాని అధ్యక్షతన ఒక స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేయాలి.
* ఒక వ్యక్తిని తన సొంత రాష్ట్రానికి గవర్నర్‌గా నియమించకూడదు.
* వివాదాస్పదం కాని, విశిష్టమైన వ్యక్తిత్వం ఉన్నవారిని మాత్రమే గవర్నర్‌గా నియమించాలి.
* గవర్నర్ పదవిని నిర్వహించినవారు పదవీ విరమణ అనంతరం తిరిగి క్రియాశీలక రాజకీయాల్లోకి ప్రవేశించకూడదు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులకు పోటీ చేయవచ్చు.
* గవర్నర్లకు ప్రవర్తనా నియమావళిని ఏర్పాటు చేయాలి.
* కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి చెందిన వ్యక్తులను ఇతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు గవర్నర్లుగా నియమించకూడదు.
* ఆర్టికల్ 356ను చివరి అస్త్రంగా మాత్రమే వినియోగించాలి.
* శాసనసభకు సభ్యుల నియామకం విషయంలో గవర్నర్‌కు విచక్షణాధికారం ఉండకూడదు.
* గవర్నర్ విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్‌గా వ్యవహరించేటప్పుడు స్వతంత్రంగా వ్యవహరించవచ్చు.
* ఒక రాష్ట్ర ప్రభుత్వం ఆపద్ధర్మ ప్రభుత్వంగా కొనసాగే వీలు లేనప్పుడు గవర్నర్ విధాన సభను రద్దు చేయకుండా రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయాలి.
* గవర్నర్ తన విచక్షణాధికారాన్ని గత్యంతరం లేని పరిస్థితుల్లో చిట్టచివరి అస్త్రంగా మాత్రమే వినియోగించాలి.
* బ‌ల‌మైన కార‌ణం ఉంటే త‌ప్ప గ‌వ‌ర్నర్‌ని తొల‌గించ‌రాదు.
* ఏదైనా రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఏర్పడినప్పుడు, ప్రభుత్వ యంత్రాంగం పని చేయలేని పరిస్థితి ఏర్పడినప్పుడు, కేంద్ర ప్రభుత్వ రాజ్యాంగపరమైన ఆదేశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ధిక్కరించినప్పుడు మాత్రమే రాష్ట్రపతి పాలన విధించాలి.
* గవర్నర్‌ను ఎంపిక చేసే ముందు అల్ప సంఖ్యాక వర్గాల వారికి సముచిత ప్రాధాన్యతను కల్పించాలి.

ఆర్థిక సంబంధాలు
* కేంద్రం ఇచ్చిన వనరులను దుర్వినియోగం చేసినట్లయితే రాష్ట్రాలను శిక్షించే విధంగా చర్యలు తీసుకోవచ్చు.
* బ్యాంకుల నుంచి ఒక సంవత్సర కాల వ్యవధికి అప్పు తీసుకునే హక్కు రాష్ట్రాలకు ఉండాలి.
* వివిధ రాష్ట్రాల నుంచి ఆర్థిక నిపుణులను ఆర్థిక సంఘంలో నియమించి వారి సేవలను ఉపయోగించుకోవాలి.
* విపత్కర పరిస్థితుల్లో కాల పరిమతి లేని రుణాలను రాష్ట్రాలకు అందించాలి.
* జాతీయాభివృద్ధి మండలి పేరును జాతీయ ఆర్థికాభివృద్ధి మండలిగా మార్చాలి.
* ఆర్థిక సంఘం సూచించిన పద్ధతిలో రైల్వే ప్రయాణికుల నుంచి వచ్చిన ఆదాయంలో రాష్ట్రాలకు వాటా కల్పించాలి.
* కార్పొరేషన్ పన్నులో కొంత భాగాన్ని రాష్ట్రాలకు ఇవ్వాలి.

శాసన సంబంధాలు
* అన్ని రకాల సూచనలు చేసిన తర్వాత మాత్రమే కేంద్రం రాష్ట్రాలకు ఆర్టికల్ 365 ప్రకారం ఆదేశాలను జారీ చేయాలి.
* భాషాపరమైన అల్పసంఖ్యాక వర్గాల వారికి ప్రత్యేక కమిషన్‌ను నియమించి క్రియాత్మకం చేయాలి.
* అవశిష్ట అంశాల్లోని పన్నులకు సంబంధించిన అధికారం పార్లమెంటు పరిధిలోనే ఉండాలి.
* అఖిల భారత సర్వీసుల ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వాలు క్రమశిక్షణా చర్యలు తీసుకోకూడదు.
* నూతన అఖిల భారత సర్వీసులను ఏర్పాటు చేయాలి.
* కేంద్ర, రాష్ట్ర సంబంధాలను మెరుగుపరచడానికి శాశ్వత ప్రాతిపదికన అంతర్ రాష్ట్ర మండలిని ఏర్పాటు చేయాలి.
* ఈ విధంగా ఏర్పాటైన అంతర్ రాష్ట్ర మండలికి ప్రధాని అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉండాలి.

ఇతర అంశాలు
* ప్రసారభారతికి స్వయం ప్రతిపత్తిని కల్పించాలి.
* ప్రజాస్వామ్య వికేంద్రీకరణలో భాగంగా స్థానిక స్వపరిపాలనా సంస్థలకు నియమబద్ధంగా ఎన్నికలు జరపాలి.
* శాంతి భద్రతలు క్షీణించినప్పుడు ఆయా రాష్ట్రాలు కోరనప్పటికీ కేంద్రం సాయుధ బలగాల్ని పంపవచ్చు.
* దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి ఆర్థిక నిపుణులతో కూడిన ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేసి, వారి సేవలను వినియోగించాలి.
* భారత్‌లో త్రిభాషా సూత్రాన్ని అన్ని రాష్ట్రాల్లో తప్పనిసరిగా అమలుచేయాలి.
* ఉమ్మడి జాబితాలోని ఏదైనా ఒక అంశంపై కేంద్రం చట్టాలను చేసేటప్పుడు రాష్ట్రాల అభిప్రాయాలను, వాటి ప్రయోజనాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి.
* శాసనమండలి రద్దు లేదా ఏర్పాటు విషయంలో పార్లమెంటు నిర్ణీత సమయంలోనే తన అభిప్రాయాన్ని తెలియజేయాలి.
* గనులకు సంబంధించిన విషయాల్లో రాష్ట్రాల అభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
* జాతీయ వ్యవహారాల విషయంలో కేంద్రం, రాష్ట్రాలు తరచూ సంప్రదింపులు జరపాలి.
* జోనల్ కౌన్సిళ్లను పునర్ వ్యవస్థీకరించాలి.
* భారతదేశ సమష్టి, సంస్కృతిని సంరక్షించేందుకు జాతీయ కార్యక్రమాలను ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేయాలి.

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌