• facebook
  • whatsapp
  • telegram

సుస్థిర అభివృద్ధి

  అభివృద్ధి అనేది అతి ప్రాచీనమైన మానవ వ్యక్తిగత, సామూహిక కార్యక్రమం. దీనిలో భాగంగా గుహలు విడిచి గృహాలను నిర్మించారు. ఇది కుమ్మరి చక్రంతో మొదలైన మొదటి ఉత్పత్తి. ద్రవ్యం సంపద, సంతోషానికి మారుపేరుగా మారి పర్యావరణాన్ని బాధిస్తున్న విధ్వంసక ప్రక్రియ. ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ 74వ సమావేశాల్లో భాగంగా 2019 సెప్టెంబరు 24, 25న న్యూయార్క్‌లో జరిగిన వాతావరణ కార్యాచరణ సదస్సులో 16 ఏళ్ల స్వీడన్‌ పర్యావరణ ఉద్యమకారిణి గ్రేటా థెన్‌బర్గ్‌  ‘మా తరాన్ని ముంచేస్తారా’ అని పాలకులను ప్రశ్నించింది. నేటి తరం ఇలా ఎందుకు స్పందిస్తుందో అర్థం కావాలంటే మనిషి అభివృద్ధి భావనా ప్రస్థానాన్ని అవగాహన చేసుకోవాలి. ఆర్థిక, సామాజిక శాస్త్రవేత్తలు మొదట తక్కువ కాలంలో అభివృద్ధి చెందిన దేశాల్లో వాస్తవిక ఆదాయంలోని పెరుగుదలనే ఆర్థిక వృద్ధిగా పరిగణించారు. సాంకేతికతను అందిపుచ్చుకొని సంపదను వస్తువుల రూపంలో సేకరించి, మార్కెటింగ్‌ చేసుకోవడాన్నే ముఖ్యంగా భావించారు. ఈ క్రమంలో పర్యావరణ జాగ్రత్తలను విస్మరించారు. రెండో ప్రపంచ యుద్ధానంతరం రాజకీయంగా స్వతంత్ర దేశంగా అవతరించిన భారత్‌ లాంటి దేశాలను పరిశీలిస్తే వెనుకబడిన దేశాలకు ఆర్థికవృద్ధితోపాటు ఆర్థికాభివృద్ధి కూడా అవసరమని తేల్చారు. దీర్ఘకాలంలో వాస్తవిక ఆదాయంతో పాటు సామాజిక, సంస్థాగత, సాంకేతిక మార్పులను తెలిపే విశాల ప్రక్రియను ఆర్థికాభివృద్ధి అని గుర్తించారు.   


  ఆర్థికాభివృద్ధి అనేది ఆర్థికవృద్ధిలా సంపద సృష్టికి ప్రాధాన్యం ఇస్తుంది. అంటే జాతీయాదాయ పెంపుదలే ముఖ్యం. ఇది తక్కువ కాలంలో అధిక వృద్ధిరేటు కోసం ప్రయత్నిస్తుంది. ఉత్పత్తి ఉపాధికి దారితీసి మరెన్నో పరోక్ష ప్రయోజనాలను కల్పిస్తుంది. దీని వల్ల అభివృద్ధి జరుగుతుందనేది సైద్ధాంతిక విశ్వాసం. దీన్నే ట్రికిల్‌ డౌన్‌ థియరీ అంటారు. ఈ సిద్ధాంతం ఆధారంగానే అభివృద్ధి చెందుతున్న దేశాలు అనేక ఆదాయ అభివృద్ధి పనులను చేపట్టాయి. మన దేశంలో 1951-1970 మధ్య కాలంలో సామాజిక అభివృద్ధి, గ్రామాల్లో భూసంస్కరణలు, వ్యవసాయ విస్తరణ, భారీ ప్రాజెక్టులు, పరిశ్రమల నిర్మాణం, హరిత విప్లవాలతో ఆర్థికాభివృద్ధి కోసం అనేక ప్రయత్నాలు జరిగాయి.


ఆర్థిక సంక్షేమం 


  ఆర్థికాభివృద్ధి ఫలాలు కొన్ని సామాజిక వర్గాలు, ప్రాంతాలకే పరిమితమయ్యాయని ఆర్థిక, సామాజిక శాస్త్రవేత్తల పరిశీలనలో తేలింది. పేద ప్రజల స్థితిలో ఎలాంటి మార్పు లేదు. దీన్ని అధిగమించడానికి ఆర్థిక సంక్షేమం ఏర్పడింది. అంటే పేద, బలహీన వర్గాలకు అభివృద్ధి ఫలాలను అందించడానికి ప్రత్యేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. మన దేశంలో 1971 - 1990 కాలంలో అనేక పేదరిక, నిరుద్యోగ నిర్మూలన, గ్రామీణ - పట్టణ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. ఇవి దారిద్య్రరేఖ కింద జీవించేవారి ప్రాథమిక అవసరాలను కొంతమేర తీర్చాయి. కానీ ఆశించిన ఫలితాలు కనిపించలేదు. ఈ పథకాలు ప్రజాస్వామ్య దేశాల్లో క్రమంగా ఓట్ల కోసం పేదలను ఆకర్షించే నినాదాలుగా మారాయి. వీటిలో జరిగే అవినీతి వల్ల ఖజానాపై భారం పెరిగింది.

ఆర్థిక సంక్షేమం = ఆర్థికాభివృద్ధి + ప్రత్యక్ష సంక్షేమ పథకాలు


మానవాభివృద్ధి 


  1991 నుంచి ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ చాలా దేశాల్లో అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఆర్థిక శాస్త్రవేత్తలు పునరాలోచనలో పడ్డారు. మానవుడి కేంద్రీకృతమైన అభివృద్ధి జరగాలని భావించారు. ముఖ్యంగా పేదలు స్వయంగా ఎదిగే వాతావరణాన్ని ప్రభుత్వాలు కల్పించాలి. సంక్షేమ పథకాల పేరుతో వారిని ప్రభుత్వ పథకాల లబ్ధిదారుగా మాత్రమే కాకుండా వారికి స్వేచ్ఛను ఇచ్చి సామర్థ్యాల మేరకు అభివృద్ధిలో చురుకైన భాగస్వాములను చేయాలి. ఇది వారి ఆర్థిక, సామాజిక సాధికారతకు దోహదపడుతుంది. ఇదే నిజమైన మానవాభివృద్ధి. ఆదాయంతోపాటు ప్రజలకు విద్య, ఆరోగ్యాన్ని అందించాలి. ప్రపంచ దేశాలు శ్రామికులను మానవ వనరులుగా గుర్తించి పలు చర్యలు చేపట్టాయి.

మానవాభివృద్ధి = ఆర్థికాభివృద్ధి  +  విద్య + ఆరోగ్యం


  మానవాభివృద్ధి, ఆర్థికాభివృద్ధిలో అభివృద్ధికి ప్రధాన అంశమైన పర్యావరణం గురించి చర్చించలేదు. ప్రకృతి మనిషి కంటే ప్రాచీనమైంది. సృష్టిలోని జీవ, నిర్జీవ పదార్థాలను ఉపయోగించుకుని మానవ నాగరికత రూపుదాల్చింది. ప్రస్తుతం మనుషుల సంఖ్య పెరిగింది. దాంతోపాటు పర్యావరణంలో అనేక మార్పులు వచ్చాయి. అభివృద్ధి పేరుతో సహజ వనరులను అతిగా ఉపయోగించడం వల్ల నేటి తరానికి సహజ సంపద తగ్గిపోయింది. ముఖ్యంగా 18వ శతాబ్దంలో పారిశ్రామిక విప్లవం తర్వాత వనరుల దుర్వినియోగం వేగంగా జరిగి కాలుష్యం అధికమైంది. ఇది రేపటి తరాల భవిష్యత్తును ప్రభావితం చేస్తుందని ప్రపంచ మేధావులు, పర్యావణ వేత్తలు భావించారు. 1970 దశాబ్దంలో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని సమావేశాల్లో ఈ ఆలోచన ప్రారంభమైంది. 1980లో మొదటిసారిగా ప్రకృతి పరిరక్షణ అంతర్జాతీయ యూనియన్‌ సుస్థిర అభివృద్ధి అనే పదాన్ని ప్రయోగించింది. 1987లో పర్యావరణం, అభివృద్ధిపై ఐక్యరాజ్య సమితి ప్రపంచ కమిషన్‌ విడుదల చేసిన ‘అవర్‌ కామన్‌ ఫ్యూచర్‌’లో ఈ పదానికి శాస్త్రీయ నిర్వచనం ఇచ్చింది. దీన్నే సాధారణంగా బ్రంట్‌లాండ్‌ రిపోర్ట్‌ అని పిలుస్తారు. ‘భవిష్యత్తు తరాల అవసరాలు తీర్చుకునే సామర్థ్యాలను దెబ్బతీయకుండా ప్రస్తుత తరాలు తమ అవసరాలను తీర్చుకునే అభివృద్ధే సుస్థిరాభివృద్ధి’.


*  ప్రజలందరి అవసరాలు ముఖ్యంగా పేదలకు ప్రాధాన్యత. 


*  పర్యావరణంపై సాంకేతికత విధించే పరిమితులు


*  ప్రస్తుత, భవిష్యత్తు తరాల మధ్య సమన్యాయం 


*  అభివృద్ధిని ముందు తరాలకు కొనసాగించడం. అందుకే దీన్ని కొనసాగించగల అభివృద్ధి అని కూడా అంటారు.


  ఈ నివేదిక తర్వాత ప్రపంచవ్యాప్తంగా సుస్థిరాభివృద్ధిపై చర్చలు, అవగాహన సదస్సులు ప్రారంభమయ్యాయి. 1992లో బ్రెజిల్‌లోని రియో-డి-జెనీరోలో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో జరిగిన ధరిత్రీ సదస్సులో అజెండా - 21 పేరుతో 21వ శతాబ్దంలో సుస్థిరాభివృద్ధి సాధనకు సాధ్యాసాధ్యాలు, పరిమితులను చర్చించారు. తర్వాత 20 ఏళ్లకు రియో నగరంలోనే రియో + 20 పేరుతో 2012లో సుస్థిరాబివృద్ధిపై ఐక్యరాజ్య సమితి సదస్సు జరిగింది. ఈ సదస్సులో గత అనుభవాలను సమీక్షించారు. ముఖ్యంగా వాతావరణ మార్పులు - ప్రభావంపై అవగాహన ఏర్పడింది. దీని ఆధారంగానే పారిస్‌ ఒప్పందం (2016) అమల్లోకి వచ్చింది.


భారత్‌ పనితీరు 


  ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ధి సూచిక - 2019 ప్రకారం సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో డెన్మార్క్‌ ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది. అమెరికా 35, చైనా 39, భారత్‌ 115వ స్థానంలో ఉన్నాయి. నీతి ఆయోగ్‌ విడుదల చేసిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచిక - బేస్‌ లైన్‌ రిపోర్ట్, 2018 తొలి నివేదిక ప్రకారం 100 పాయింట్లకు మన దేశం 58 పాయింట్లు సాధించింది. ఈ లక్ష్యాల సాధనలో హిమాచల్‌ ప్రదేశ్, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ వరుసగా మొదటి నాలుగు స్థానాల్లో ఉన్నాయి.


లక్ష్యాలు


ఐక్యరాజ్య సమితి 2015 సెప్టెంబరులో న్యూయార్క్‌లో జరిగిన పర్యావరణ సదస్సులో 2015 - 30 మధ్యకాలంలో అన్ని దేశాలు సాధించాల్సిన 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను ఆమోదించింది. 

    1) పేదరిక నిర్మూలన  
    2) ఆకలి చావులను పూర్తిగా తగ్గించడం 
    3) మంచి ఆరోగ్యం  
    4) నాణ్యమైన విద్య  
    5) లింగ సమానత్వం 
    6) పరిశుభ్రమైన నీరు, పరిసరాలు 
    7) పునరుజ్జీవన ఇంధన వాడకం 
    8) ఉపాధి, ఆర్థికవృద్ధి  
    9) పరిశ్రమలు, నూతన ఆవిష్కరణలు, అవస్థాపనా సౌకర్యాల కల్పన
    10) అసమానతల తగ్గింపు  
    11) సుస్థిర నగరాలు, సమాజాలు
    12) బాధ్యతాయుతమైన వినియోగం, ఉత్పత్తి 
    13) వాతావరణ మార్పులపై చర్యలు 
    14) నీటిలోని ప్రాణుల సంరక్షణ 
    15) నేలపై జీవుల రక్షణ 
    16) శాంతి, న్యాయం 
    17) ఉమ్మడి లక్ష్యాల కోసం భాగస్వామ్యం. 

    సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను స్థూలంగా 17గా విభజించినప్పటికీ అవి ఒకదానితో మరొకటి అవినాభావ సంబంధాన్ని కలిగి ఉన్నాయి. కాబట్టి అభివృద్ధి సామాజిక, ఆర్థిక, పర్యావరణపరంగా సుస్థిరంగా ఉండాలి. మొదటిసారి ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ 74వ సమావేశాల్లో భాగంగా 2019 సెప్టెంబరు 24, 25న న్యూయార్క్‌లో వాతావరణ కార్యాచరణ సదస్సును నిర్వహించింది. ఈ సదస్సుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో పాటు పలువురు నేతలు, పర్యావణ శాస్త్రవేత్తలు హాజరయ్యారు. ఇప్పటివరకు సుస్థిరాభివృద్ధి కోసం చేపట్టిన చర్యలను సమీక్షించారు. సుస్థిరాభివృద్ధి అంటే అసలైన అర్థం నాలుగు కాలాల పాటు కాదు నాలుగు తరాల పాటు అందరినీ సంతోషపెట్టేది. 

P - People;  P - Planet;  P - Prosperity;  P - Partnership;  P - Peace  అనే 5 P'sను సాధించడానికి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఉపయోగపడతాయి. 2000-2015 మధ్య ఎనిమిది సహస్రాబ్ది లక్ష్యాలు ఉన్నాయి.
ఒక చేపను ఒకరికి ఇస్తే ఒక రోజు మాత్రమే ఆకలి తీరుతుంది. అదే అతడికి చేపలు పట్టడం నేర్పిస్తే జీవితాంతం ఆకలి తీర్చుకుంటాడు. -  ప్రముఖ తత్వవేత్త - కన్ఫ్యూసియస్‌


సుస్థిరాభివృద్ధి - ప్రపంచ దేశాల కృషి


* ‘మానవ పర్యావరణం’ అనే అంశంపై ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (UNEP) 1972 జూన్‌ 5న స్టాక్‌ హోంలో ఓ సమావేశాన్ని నిర్వహించింది. ప్రపంచవ్యాప్తంగా ఏటా ఆ తేదీని ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అప్పటి నుంచే పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం పెరిగింది. 


* 1980లో ప్రపంచ సంరక్షణ వ్యూహం అనే పరిశోధనా పత్రంలో మొదటిసారి ‘కొనసాగించాల్సిన అభివృద్ధి’ అనే పదాన్ని వాడారు.


* 1987లో సుస్థిరాభివృద్ధి సాధన కోసం ఐక్యరాజ్యసమితి అప్పటి నార్వే ప్రధాని హార్లెం బ్రంట్‌లాండ్‌ నేతృత్వంలో World Commission on Environment and Development ను ఏర్పాటు చేసింది.


* సుస్థిరతపై అంతర్జాతీయంగా సహకారాన్ని పెంపొందించడానికి 1992లో ప్రపంచ దేశాధినేతలు బ్రెజిల్‌లోని రియోలో సమావేశమయ్యారు. దీన్నే UN Conference on Environment and Development, ధరిత్రీ సదస్సు, రియో సమ్మిట్‌గా పిలుస్తారు.


* రియో సదస్సు జరిగి 2012కి 20 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ప్రపంచ దేశాధినేతలు రియోలో సమావేశమై సుస్థిరాభివృద్ధి లక్ష్యాల గురించి చర్చించారు. ఇందులో చర్చకు వచ్చిన అంశాలకు 2015లో ఐక్యరాజ్యసమితి సర్వ సభ్య సమావేశంలో ఆమోదం తెలిపారు. వీటినే అజెండా 2030 అని పిలుస్తారు. ఇందులో మొత్తం 17 లక్ష్యాలు, 169 ఉపలక్ష్యాలు ఉన్నాయి. 2016 జనవరి నుంచి ప్రారంభించి 2030 డిసెంబరు నాటికి వీటిని సాధించాలని తీర్మానించారు.


లక్ష్యాలు  


1. పేదరికాన్ని నిర్మూలించడం: 2030 నాటికి పేదరికాన్ని సగానికి తగ్గించాలి. దీనికోసం సాంఘిక భద్రతా పథకాలు అమలుచేయాలి. ఆర్థిక వనరులపై అందరికీ సమాన హక్కులు ఉండేలా చూడాలి.


2. ఆకలిని నిర్మూలించడం: సురక్షితమైన పౌష్ఠికాహారాన్ని అందరికీ తగినంతగా అందుబాటులో ఉంచి, 2030 నాటికి ఆకలిని నిర్మూలించాలి.
* అయిదేళ్లలోపు పిల్లల్లో వయసుకు తగిన ఎత్తు (Stunting), ఎత్తుకు తగిన బరువు (Wasting) లేకపోవడం లాంటి అంశాల్లో అంతర్జాతీయ అంగీకార లక్ష్యాలను చేరుకోవాలి. 2025 నాటికి ఎత్తు తక్కువతో బాధ పడుతున్న పిల్లల సంఖ్యను 40 శాతానికి తగ్గించాలని, శారీరక బరువు సరిగాలేని వారి సంఖ్యను 5 శాతంలోపునకు తీసుకురావాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.
* 2030 నాటికి వ్యవసాయ ఉత్పాదకతను, చిన్న-కౌలు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలి.
* 2001 నవంబరులో ఖతార్‌లోని దోహాలో ప్రపంచ వాణిజ్య సంస్థ ్బజూగివ్శీ ఓ సమావేశాన్ని నిర్వహించింది. దీన్నే దోహా రౌండ్‌గా పేర్కొంటారు. ఇందులో వ్యవసాయ ఎగుమతుల సబ్సిడీలను తొలగించాలని; ప్రపంచ వ్యవసాయ మార్కెట్‌లో ఉన్న వాణిజ్యపరమైన షరతులు, ఆటంకాలను ఎత్తివేయాలని తీర్మానించారు.


3. అందరికీ మంచి ఆరోగ్యాన్ని అందించాలి
* 2030 నాటికి  ప్రతి లక్ష జననాలకు మాతృత్వ మరణాల రేటును 70కి తగ్గించాలి.
* 2030 నాటికి  ప్రతి 1000 సజీవ జననాలకు Neonatal Mortality Rate (0 - 28 రోజులు)ను 12కి తగ్గించాలి.
* అయిదేళ్లలోపు వయసున్న పిల్లల మరణ రేటును ్బగీ5లీళ్శి ప్రతీ 1000 సజీవ జననాలకు 25కి తగ్గించాలి.
* 2030 కల్లా ఎయిడ్స్, టీబీ, మలేరియా లాంటి వ్యాధులను పూర్తిగా నిర్మూలించాలి. 
* 2030 నాటికి అంటువ్యాధులు కాని రోగాలను 1/3వ వంతు తగ్గించాలి. ప్రపంచవ్యాప్తంగా ఈ జబ్బుల్లో గుండె సంబంధ వ్యాధులు ప్రథమస్థానంలో ఉండగా, క్యాన్సర్‌ రెండో స్థానంలో ఉంది.
* ఆల్కహాల్, డ్రగ్స్‌ వినియోగం, రోడ్డు ప్రమాదాలు, పర్యావరణ కాలుష్యం, పొగాకు మొదలైన వాటి వల్ల సంభవించే మరణాలను 2030 నాటికి   పెద్ద మొత్తంలో తగ్గించాలి.
* ప్రజారోగ్యానికి సంబంధించి దోహా డిక్లరేషన్‌లోని TRIPS (Trade Related Aspects Of Intellectual Property Agreements)  ఒప్పందం ప్రకారం అభివృద్ధి చెందుతున్న దేశాలకు తక్కువ ధరలకే నాణ్యమైన-సురక్షితమైన మందులు, టీకాలను అందించాలి.


4. నాణ్యమైన విద్య
* 2030 నాటికి బాలబాలికలందరికీ నాణ్యమైన పూర్వ ప్రాథమిక, ప్రాథమిక, సెకండరీ విద్యను ఉచితంగా అందించాలి. ప్రమాణాలతో కూడిన సాంకేతిక, వృత్తి, టెరిటరీ విద్యలను అందుబాటు ధరల్లో ఉంచాలి. టెరిటరీ విద్య సెకండరీ విద్య పూర్తయ్యాక 3వ స్థాయిలో ఉంటుంది. ఇది సాధారణంగా కళాశాల విద్య.
* లింగ సంబంధ వ్యత్యాసాలను అన్ని స్థాయుల్లో నిర్మూలించాలి. 2030 నాటికి అర్హత కలిగిన ఉపాధ్యాయుల సంఖ్యను గణనీయంగా పెంచాలి.


5. లింగసమానత్వం, మహిళా సాధికారిత సాధించడం:
మహిళల పట్ల ఉన్న అన్ని రకాల వివక్షను రూపుమాపాలి. ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థల్లో వీరిపై జరిగే హింసను అరికట్టాలి. మహిళల అక్రమ రవాణా, లైంగిక దాడులు మొదలైన వాటిని నిర్మూలించాలి. బాల్య వివాహాలు, బలవంతపు పెళ్లిళ్లను నిరోధించాలి.
* ఆర్థిక, రాజకీయ, ప్రజా జీవితంలోని అన్ని స్థాయుల్లో మహిళా భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలి. నిర్ణయాలు తీసుకునే చోట పురుషులతో సమానంగా వారికీ అవకాశాలు కల్పించాలి.
* ఆర్థిక వనరులు, భూయాజమాన్యం, సహజ వనరులు మొదలైన వాటిపై మహిళలకు సమాన హక్కులు కల్పించేలా సంస్కరణలు తేవాలి.


6. పరిశుభ్రమైన నీరు, పారిశుద్ధ్యం: 2030 నాటికి ప్రజలందరికీ సురక్షితమైన తాగునీటిని అందుబాటు ధరకే పంపిణీచేయాలి. బహిరంగ మలమూత్ర విసర్జనను అరికట్టాలి.


7. అందుబాటు ధరల్లో శుద్ధ ఇంధనాలు అందించడం: 2030 నాటికి నమ్మకమైన శక్తి సేవలను అందరికీ అందుబాటు ధరల్లో అందించాలి. ప్రపంచ శక్తి వనరుల్లో పునర్వినియోగ శక్తి వనరుల వాటాను గణనీయంగా పెంచాలి.


8. ఆర్థికవృద్ధి, నాణ్యమైన ఉపాధిని సాధించడం: అల్పాభివృద్ధి దేశాల్లో కనీసం 7% జీడీపీ వృద్ధిని సుస్థిరంగా సాధించాలి.
* 2030 నాటికి ఉపాధి, విద్య లేదా శిక్షణలో లేని యువత వాటాను గణనీయంగా తగ్గించాలి. 
* 2025 నాటికి నిర్బంధ శ్రామికత్వం, బాలకార్మిక వ్యవస్థ, బానిసత్వం, మానవ అక్రమ రవాణాను పూర్తిగా నిర్మూలించాలి.
* 2030 నాటికి అందరికీ ఉత్పాదక ఉపాధిని అందించాలి. సమాన విలువ ఉన్న పనికి సమాన వేతనాన్ని అందించాలి.
* కార్మికుల హక్కులను రక్షించాలి. పనివాళ్లకు ముఖ్యంగా వలస కార్మికులకు సురక్షితమైన పని వాతావరణాన్ని కల్పించాలి.
* యువత ఉపాధి కోసం 2020 నాటికి  ప్రపంచ వ్యూహాన్ని అభివృద్ధిచేసి అమల్లోకి తేవాలి.


9. పరిశ్రమలు, మౌలిక వసతులు, ఆవిష్కరణలు: మానవ సంక్షేమం, ఆర్థికాభివృద్ధి పెంపొందించేందుకు నాణ్యమైన, నమ్మకమైన, సుస్థిర మౌలికవసతులను అభివృద్ధి చేయాలి.
* 2030 నాటికి  ఆదాయం, ఉపాధిలో పరిశ్రమల వాటాను గణనీయంగా పెంచాలి. దీనికోసం సుస్థిర, సమ్మిళిత పారిశ్రామికీకరణను ప్రోత్సహించాలి. అల్పాభివృద్ధి దేశాల్లో పరిశ్రమల వాటాను రెట్టింపు చేయాలి.
* అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చిన్నతరహా పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందించాలి.
* శాస్త్రీయ పరిశోధనలు ప్రోత్సహించాలి. 2030 నాటికి ప్రతి మిలియన్‌ జనాభాలో పరిశోధన రంగంలో పనిచేస్తున్నవారి సంఖ్యను గణనీయంగా పెంచాలి.


10. దేశం లోపల, వివిధ దేశాల మధ్య ఉన్న ఆర్థిక అసమానతలను తగ్గించాలి: 2030 నాటికి జనాభాలో అట్టడుగున ఉన్న 40% మంది ప్రజల ఆదాయ వృద్ధి రేటు జాతీయ సగటు కంటే ఎక్కువ ఉండేలా చర్యలు చేపట్టాలి.
* వయసు, లింగ, అంగవైకల్యం, జాతి, పుట్టుక, మతం మొదలైనవాటితో సంబంధం లేకుండా అందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ సాధికారత కల్పించాలి.
* అసమానతలను ప్రోత్సహించే విధానాలు, చట్టాలను పూర్తిగా తొలగించాలి.
* అంతర్జాతీయ విత్త, ఆర్థిక వ్యవస్థల్లో అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రాతినిధ్యం పెంచాలి.
* అల్పాభివృద్ధి దేశాలకు అభివృద్ధి సాయం, విత్త వనరుల ప్రవాహాన్ని ప్రోత్సహించాలి. ఇందులో భాగంగానే ఎఫ్‌డీఐలను రాబట్టాలి.


11. నగరాలను నివాసయోగ్యంగా, సురక్షితంగా, సమ్మిళితంగా తయారుచేయడం: 2030 నాటికి అందరికీ సురక్షితమైన ఇళ్లను తక్కువ ధరలకు అందించాలి.
* ప్రజారవాణాను పెంచాలి.
* విపత్తుల వల్ల సంభవించే ప్రాణ, ఆస్తి నష్టాన్ని గణనీయంగా తగ్గించాలి.
* 2015, మార్చి 8న జపాన్‌లోని సెంధాయ్‌లో ఐక్యరాజ్యసమితి మూడో డిజాస్టర్‌ రిస్క్‌ రిడక్షన్‌ సమావేశం జరిగింది. దీనికి ‘సెంథాయ్‌ ఫ్రేమ్‌ వర్క్‌ ఫర్‌ డిజాస్టర్‌ రిస్క్‌ రిడక్షన్‌ 2015-30’ అని పేరుపెట్టారు. ఇందులో కొన్ని నిబంధనలను పేర్కొన్నారు. వీటిప్రకారం విపత్తులను తట్టుకునేలా సమగ్ర విధానాలను అమలుచేసే నగరాల సంఖ్యను పెంచాని తీర్మానించారు.
* పట్టణాల్లో వాయుకాలుష్యం, ఘనవ్యర్థాల నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి.


12. సుస్థిర వినియోగం, ఉత్పత్తి విధానాల రూపకల్పన: ఉత్పత్తి, సరఫరా స్థాయిలో ఆహార వృథాను అరికట్టాలి. వినియోగదారు స్థాయిలో తలసరి ఆహార వృథాను సగానికి తగ్గించాలి.
* 2030 నాటికి  నివారణ, RRR (Reduce, Reuse and Recycle) ద్వారా వ్యర్థాల సృష్టిని తగ్గించాలి.
* అభివృద్ధి చెందుతున్న దేశాలకు వినియోగం, ఉత్పత్తిలో సుస్థిర పద్ధతులను అవలంబించేందుకు తగిన సాంకేతిక సామర్థ్యాన్ని పెంపొందించుకునేలా మద్దతు ఇవ్వాలి.
* వృథా వినియోగాన్ని ప్రోత్సహిస్తున్న ఇంధన సబ్సిడీలను హేతుబద్ధీకరించాలి.


13. పర్యావరణ మార్పు, దాని ప్రభావంపై సత్వర చర్యలు: సహజ విపత్తులు, శీతోష్ణస్థితి సంబంధ విపత్తులను తట్టుకోగలిగే సామర్థ్యాన్ని అందరిలో బలోపేతం చేయాలి.
* దేశ ప్రణాళిక, విధానాలు, వ్యూహాల్లో శీతోష్ణస్థితి మార్పులను సమీకృతం చేయాలి.
* వీటికి సంబంధించిన (ముందస్తు హెచ్చరిక, మార్పులు తగ్గించగలగడం, వాటిని తట్టుకోగలగడం) విద్య, చైతన్య కార్యక్రమాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలి.
* శీతోష్ణస్థితి మార్పుల ప్రభావాలను తట్టుకునేలా UNFCCC (United Nations Framework Convention on Climate Change) కింద అభివృద్ధి చెందిన దేశాలు సంవత్సరానికి 100 బిలియన్‌ డాలర్లను అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇచ్చేందుకు అంగీకరించాయి. వీటిని సాధ్యమైనంత త్వరగా అమలుచేయాలి.


14. సముద్రాలు, జలవనరుల సంరక్షణ: అన్నిరకాల సముద్ర కాలుష్యాలను తగ్గించాలి. ముఖ్యంగా భూసంబంధ కార్యకలాపాల ద్వారా జరిగే కాలుష్యాన్ని నివారించాలి.
* సముద్రాల ఆమ్లీకరణను తగ్గించాలి. దాని ప్రభావాలను దీటుగా ఎదుర్కోవాలి.
* అధికంగా చేపలు పట్టడానికి కారణమైన మత్స్యరంగ సబ్సిడీలను పూర్తిగా నిషేధించాలి.


15. అడవులు, ఇతర ఆవరణ వ్యవస్థలను పరిరక్షించడం, భూక్షీణతను, జీవవైవిధ్య నష్టాన్ని అరికట్టడం
అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం అడవులు, పర్వతాలు, చిత్తడి నేలలను సంరక్షించాలి.
* అన్నిరకాల అడవుల్లో సుస్థిర యాజమాన్య పద్ధతులను అవలంబించాలి. అడవులు నరకడాన్ని అరికట్టాలి. క్షీణతకు గురైన అడవులను పునరుద్ధరించాలి. అన్ని ప్రాంతాల్లో మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టాలి.
* కరవులు, వరదల వల్ల క్షీణతకు గురయ్యే మృత్తికను పునరుద్ధరించాలి.
* పర్వత ఆవరణ వ్యవస్థను సంరక్షిస్తూ జీవవైవిధ్యాన్ని కాపాడాలి. వీటి ఉత్పత్తులు సుస్థిరాభివృద్ధికి దోహదపడతాయి. రక్షిత జీవజాతుల అక్రమరవాణా, వేటను అడ్డుకోవాలి.


16. అందరికీ శాంతి, న్యాయాన్ని అందించాలి, దీనికోసం బలమైన వ్యవస్థలను ఏర్పాటుచేయాలి
అన్నిరకాల హింసలను, వాటివల్ల జరిగే మరణాలను గణనీయంగా తగ్గించాలి.
* జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అందరికీ సమాన న్యాయాన్ని అందించాలి.
* అవినీతి, లంచగొండితనాన్ని అరికట్టాలి.
* గ్లోబల్‌ గవర్నెన్స్‌కు సంబంధించిన సంస్థల్లో అభివృద్ధి చెందుతున్న దేశాల భాగస్వామ్యాన్ని బలోపేతం చేయాలి.
* 2030 నాటికి అందరికీ చట్టబద్ధమైన గుర్తింపు లభించాలి. 
* తీవ్రవాదం, నేరాలు, హింసలు మొదలైనవాటిని అడ్డుకునే జాతీయస్థాయి సంస్థలను బలోపేతం చేయాలి.


17. సార్వత్రిక భాగస్వామ్యాన్ని పెంపొందించడం: దేశీయ వనరుల సేకరణను బలోపేతం చేయాలి. అభివృద్ధి చెందిన దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలకు పర్యావరణ అనుకూల సాంకేతికతను తక్కువ ధరలకే అందించాలి.

Posted Date : 10-07-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌