• facebook
  • whatsapp
  • telegram

 వ్యవసాయ విత్త వనరులు, రాయితీలు

అన్నదాతకు ఆర్థిక భరోసా!

ప్రతి ప్రభుత్వం వ్యవసాయానికే మొదటి ప్రాధాన్యం అని ప్రకటిస్తుంది. రైతు సంక్షేమమే లక్ష్యమని చాటుతుంది. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ పాలన కూడా ఆ మార్గంలోనే సాగుతోంది. అన్నదాతలకు అవసరమైన పెట్టుబడి రుణాలను అందిస్తోంది. వడ్డీల్లో రాయితీలను అమలు చేస్తోంది. ఆత్మహత్యల నివారణకు అనేక చర్యలు చేపడుతోంది.  కౌలుదారుల హక్కులను కాపాడేందుకూ కృషి జరుగుతోంది. రుణమాఫీలు చేయడంతోపాటు, పలు సంస్థల ద్వారా పరపతి సౌకర్యాలు, వ్యవసాయ రాయితీలు అందిస్తోంది. మరోవైపు కేంద్రం కూడా వివిధ పథకాల కింద ఆర్థికంగా వ్యవసాయదారులను ఆదుకుంటోంది. ఈ అంశాలన్నింటిపైనా పోటీ పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. 


  

ఆంధ్రప్రదేశ్‌లో 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెండింతలు చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి విధాన పరమైన చర్యలు చేపట్టింది. అవి 

1) పెట్టుబడి మద్దతు అందించడం.

2) పరపతి, బీమా, సాగునీటి సౌకర్యాలు కల్పించడం. 

3) శీతల గిడ్డంగి సౌకర్యాలు కల్పించడం. 

4) ఇ-నామ్‌ ద్వారా ఆదాయాలు పెంచడం.

5) నిల్వ సామర్థ్యాన్ని పెంచడం.

6) ధరల స్థిరీకరణ నిధి, ప్రకృతి వైపరీత్యాల నిధి ద్వారా విపత్తుల ప్రభావాన్ని తగ్గించడం.

7) రైతు ఆత్మహత్యల నివారణ..


వ్యవసాయ రుణాలు:

కాలపరిమితి ఆధారంగా 3 రకాలు:  

1) స్వల్పకాలిక రుణాలు - 15 నెలల్లోపు తిరిగి చెల్లించేవి. 

2) మధ్యకాలిక రుణాలు - 15 నెలల నుంచి 5 సంవత్సరాల్లోపు చెల్లించేవి. 

3) దీర్ఘకాలిక రుణాలు - 5 నుంచి 20 సంవత్సరాల్లోపు చెల్లించేవి.


వినియోగం ప్రకారం 2 రకాలు: 1) పంట రుణాలు (క్రాప్‌ లోన్స్‌) - (స్వల్పకాలిక) 

ఉదా: విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల కోసం తీసుకునే రుణాలు. 2) టర్మ్‌ రుణాలు - (మధ్యకాలిక, దీర్ఘకాలిక). ఉదా: యంత్రాలు, పరికరాలు, అదనపు భూమి కొనుగోలు కోసం పొందే రుణాలు.


రుణమార్గాలు 2 రకాలు

1) సంస్థాగత మార్గాలు: ప్రభుత్వం, వాణిజ్య బ్యాంకులు, సహకార బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు.

2) సంస్థాగతం కాని మార్గాలు: వడ్డీ వ్యాపారులు, వ్యాపార ఏజెంట్లు, భూస్వాములు, బంధువులు, స్నేహితులు.

* 2022-23 ఆర్థిక సంవత్సరంలో వార్షిక రుణాలు - రూ.163.350 లక్షల కోట్లు

* 2021-22 నాటికి అందించిన రుణాలు - రూ.148.500 లక్షల కోట్లు

* ఇచ్చిన రుణంలో పంట రుణాలు - 79%, టర్మ్‌ రుణాలు - 21%.

అత్యధిక వ్యవసాయ రుణాలు పొందుతున్న జిల్లాలు: గుంటూరు, తూర్పు గోదావరి, కృష్ణా, చిత్తూరు (చివరి స్థానంలో విజయనగరం)

వ్యవసాయ రుణాలు, వడ్డీ రేట్లు: 2006-07లో కేంద్ర ప్రభుత్వం వడ్డీ రాయితీ పథకం (ఇంట్రెస్ట్‌ సబ్‌వెన్షన్‌ స్కీమ్‌) ప్రవేశపెట్టి పంట రుణాలు రూ.3 లక్షల్లోపు ఉంటే వడ్డీ 7 శాతంగా నిర్ణయించింది. సకాలంలో రుణాలు చెల్లిస్తే 3 శాతం వడ్డీ మాత్రమే వర్తిస్తుంది.

* 2008లో వైఎస్‌ఆర్‌ ప్రభుత్వం పావలా వడ్డీ రుణ సదుపాయాన్ని అమలు చేసింది.

* 2011లో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం రైతుశ్రీ పేరిట రూ.లక్ష లోపు పంట రుణాలకు సున్నా వడ్డీ అమలు చేసింది.

* 2019-20లో రుణ అర్హత కార్డులను 7,11,393 మంది రైతులకు జారీ చేసి రూ.548 కోట్ల రుణాన్ని 1,33,000 మంది కౌలు రైతులకు అందించారు.

* 2019 ఖరీఫ్‌ నుంచి ‘వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ పంటరుణాలు’ పథకాన్ని అమలుచేసి 15 లక్షల మంది రైతులకు వడ్డీ లేని రుణాలు అందించారు.

రైతుల ఆత్మహత్యలు: వ్యవసాయదారులు, వ్యవసాయ కూలీల మరణాల ఆధారంగా కేంద్ర హోంశాఖ 2020లో నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం ఆత్మహత్యలు చేసుకున్న రైతుల్లో అధికశాతం కౌలు రైతులు, సన్నకారు, చిన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలున్నారు. ఈ మరణాలు ఏడాదికి సగటున 199గా నమోదయ్యాయి.

ఆత్మహత్యలకు ప్రధాన కారణాలు:  1) అప్పులబాధ 2) కుటుంబ సమస్యలు 3) పంట వైఫల్యం 4) అనారోగ్యం 5) ఆల్కహాల్, మత్తుమందు


ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వ చర్యలు: 

 * 2004, సెప్టెంబరు 8న రాష్ట్ర వ్యవసాయ అభివృద్ధికి ‘జయతీఘోష్‌’ కమిటీని నియమించారు. ఈ కమిటీ 284 సిఫార్సులతో నివేదిక సమర్పించింది. దాని ప్రకారం రైతుల్లో 48% కౌలు రైతులు. వీరికి సంస్థాగతంగా రుణాలు అందటం లేదు. దీంతో తప్పని పరిస్థితుల్లో వడ్డీ వ్యాపారులపై ఆధారపడుతున్నారు.

* 2004, డిసెంబరులో రైతుల ఆత్మహత్యలపై రాంచెన్నారెడ్డి కమిషన్‌ను నియమించారు. చనిపోయిన రైతుల కుటుంబాలకు రూ.1,50,000 సహాయం అందించాలని ఈ కమిటీ సిఫార్సు చేసింది. ఈ పరిహారం వల్ల ఆత్మహత్యలు మరింతగా పెరగడంతో 2007 నుంచి చెల్లించటం నిలిపేశారు.

* 2006లో అధిక ఆత్మహత్యలు జరుగుతున్న 31 జిల్లాలను దేశవ్యాప్తంగా అంచనా వేసి రూ.9,300 కోట్లతో ప్రధానమంత్రి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు. 

* 2007లో కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రుణగ్రస్థత, ఆత్మహత్యలపై ప్రొఫెసర్‌ రాధాకృష్ణ కమిటీని నియమించింది. 

* 2011లో దేశంలో మొదటిసారి కౌలుదారులకు ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేసి గరిష్ఠంగా రూ.లక్ష వరకు పంట రుణాలు అందించారు.

* బ్యాంకులకు కౌలు రైతుల పంటను తాకట్టు పెట్టి గరిష్ఠంగా రూ.లక్ష వరకు పంట రుణం పొందే అవకాశం కల్పించే ‘సర్టిఫికెట్‌ ఆఫ్‌ కల్టివేషన్‌’ విధానాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రయోగాత్మకంగా అమలుచేసింది. రాష్ట్రంలో అత్యధిక కౌలుదారు గుర్తింపు కార్డులున్న జిల్లా పశ్చిమ గోదావరి.

* 2014లో రాష్ట్ర ప్రభుత్వం ఆత్మహత్య చేసుకొన్న రైతుకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించింది. 2019, జులై 1న ఈ పరిహారాన్ని 7 లక్షలకు పెంచారు.


వైఎస్‌ఆర్‌ రైతు భరోసా - పీఎం కిసాన్‌:  ఈ పథకాన్ని 2019, అక్టోబర్‌ 15న నెల్లూరు జిల్లా కాకుటూరు గ్రామంలో ప్రారంభించారు. ప్రతి రైతు కుటుంబానికి వారి వ్యవసాయ అవసరాల కోసం రూ.13,500 వార్షిక పెట్టుబడి సహాయం అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్‌ పథకంలో భాగంగా మూడు విడతలుగా అందించే రూ.6000తో కలిపి మొత్తం రూ.13,500 అందుతాయి.

* 2021-22 నాటికి 52.38 లక్షల రైతు కుటుంబాలకు ఈ పథకం కింద ఆర్థిక సహాయం లభిస్తోంది. వీరిలో 1.51 లక్షల మంది కౌలుదారులున్నారు.

* మొదటి విడత మే - రూ.7,500 

* రెండో విడత అక్టోబరు - రూ.4,000 * మూడో విడత జనవరి - రూ.2000

ఆర్థిక సర్వే ప్రకారం ఈ పథకంలో అత్యధిక ప్రయోజనం పొందిన రైతులున్న జిల్లాలు అనంతపురం, కర్నూలు, గుంటూరు, నెల్లూరు.


ప్రధానమంత్రి కిసాన్‌ పెన్షన్‌ యోజన:  కేంద్ర ప్రభుత్వం 2019, మే 30న 5 కోట్ల మంది సన్న, చిన్నకారు రైతులకు నెలకు రూ.3 వేల పింఛను అందించే కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ పథకాన్ని ప్రవేశపెట్టింది. 18-40 సంవత్సరాల్లోపు అర్హత ఉన్న రైతులు ప్రతి నెలా నిర్దేశించిన బీమా ప్రీమియం చెల్లించాలి.


కౌలు రైతులు - ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం - 2019 బడ్జెట్‌:  15.36 లక్షల మంది కౌలు రైతులకు వైఎస్‌ఆర్‌ రైతు భరోసా వర్తించే విధంగా 11 నెలల కాలానికి పంట సంబంధ హక్కులకు చట్టబద్ధ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసింది.


రుణమాఫీ: కేంద్ర ప్రభుత్వం 1990లో మొదటిసారి సన్న, చిన్నకారు రైతులు, చేనేతలకు రూ.10 వేల వరకు రుణమాఫీ చేసింది.

 * 2008లో కేంద్రం రెండోసారి సన్న, చిన్నకారు రైతులకు గరిష్ఠంగా రూ.50 వేల మేర రుణమాఫీ చేసింది. దీనివల్ల దేశవ్యాప్తంగా 9.3 కోట్ల మంది ప్రయోజనం పొందగా, ఆంధ్రప్రదేశ్‌లో 63.4 లక్షల మంది రైతులకు లాభం చేకూరింది. సకాలంలో రుణం చెల్లించినవారికి ప్రోత్సాహం పేరిట రూ.5 వేలు చెల్లించారు.

 * 2014, ఆగస్టు 14న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కోటయ్య కమిటీ సిఫార్సులతో కుటుంబానికి గరిష్ఠంగా రూ.1,50,000 రుణమాఫీ అమలుచేసింది.


ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కోఆపరేటివ్‌ బ్యాంకు: రాష్ట్ర సహకార పరపతి వ్యవస్థకు శిఖరాగ్ర సంస్థ ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కోఆపరేటివ్‌ బ్యాంకు. 1963, ఆగస్టు 4న హైదరాబాద్‌ కేంద్రంగా ఒక షెడ్యూల్డు రాష్ట్ర ప్రభుత్వ సహకార బ్యాంకుగా ఏర్పడింది. ప్రస్తుత కేంద్ర కార్యాలయం విజయవాడ. ఈ బ్యాంకుకు మూలధనాన్ని నాబార్డు సమకూరుస్తుంది. దీనికి 4 జోనల్‌ కార్యాలయాలున్నాయి. అవి విశాఖపట్నం, విజయవాడ, ఒంగోలు, కడప. ఈ బ్యాంకు మూడు అంచెల విధానంలో రుణాలు అందిస్తుంది. 1) రాష్ట్ర స్థాయిలో - రాష్ట్ర సహకార బ్యాంకు. 2) జిల్లా స్థాయిలో - జిల్లా కేంద్ర సహకార బ్యాంకు. 3) ప్రాంతీయ స్థాయిలో - ప్రాథమిక వ్యవసాయ, పరపతి సహకార సంస్థ.

ఆంధ్రప్రదేశ్‌లో ఒక రాష్ట్ర సహకార బ్యాంకు, 13 జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు, 2,051 ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంస్థలు ఉన్నాయి. వీటి ద్వారా 15 లక్షల మంది రైతులకు కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు అందించారు. అత్యధిక ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంస్థలున్న జిల్లా కృష్ణా. తక్కువగా ఉన్న జిల్లా శ్రీకాకుళం. * 2020-21 నాటికి రూ.10,954 కోట్లను 3 అంచెల విధానంలో వ్యవసాయ రుణాలుగా అందించారు. ఇందులో కౌలుదారులకు రూ.307 కోట్ల రుణం అందింది.* 1963లో జాతీయ సహకార అభివృద్ధి సంస్థ ప్రారంభమైంది. దేశంలోని సహకార సంస్థల అభివృద్ధికి ఇది దోహదం చేస్తుంది.

ఆంధ్రప్రదేశ్‌ కో-ఆపరేటివ్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ (ఏపీ మార్క్‌ఫెడ్‌):  సహకార సంఘాల ద్వారా రైతు వ్యవసాయ మార్కెటింగ్‌ అవసరాలు తీర్చేందుకు 1957లో విజయవాడలో ఏపీ మార్క్‌ఫెడ్‌ను స్థాపించారు. 1965లో ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్‌కు మార్చారు. ప్రస్తుతం విజయవాడలోనే ఉంది. ఇది మూడు అంచెల్లో పనిచేస్తుంది. 

* రాష్ట్రస్థాయిలో మార్క్‌ఫెడ్‌. 

* జిల్లాస్థాయిలో జిల్లా కేంద్ర సహకార మార్కెట్‌. 

* ప్రాంతీయ స్థాయిలో ప్రాథమిక సహకార వ్యవసాయ మార్కెట్‌.

ఆంధ్రప్రదేశ్‌ గిరిజన సహకార సంస్థ: రాష్ట్రంలో గిరిజనుల అభివృద్ధికి, దళారీ వ్యవస్థ మోసాల నుంచి గిరిజనులను రక్షించి వారి సంక్షేమానికి తోడ్పడేందుకు 1956లో గిరిజన సహకార సంస్థ ఏర్పాటైంది. గిరిజన ప్రాంతాల్లో నిరంతరం నిత్యావసర సరకుల సరఫరా, పంట రుణాల పంపిణీ వంటి విధులు నిర్వహిస్తుంది. దీని ప్రధాన కార్యాలయం విశాఖపట్నంలో ఉంది.


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సహకార యూనియన్‌:  సహకార సంఘాల వ్యవస్థకు సంబంధించి శిక్షణ, విద్య అందించేందుకు 1964లో విజయవాడ కేంద్రంగా సహకార యూనియన్‌ ప్రారంభమైంది. విజయవాడ, రాజమండ్రి, అనంతపురం, కడపలో శిక్షణ కేంద్రాలున్నాయి.


ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ విద్యుత్తు సరఫరా సహకార సొసైటీ (రెస్కో):  విద్యుత్తును కొనుగోలు చేసి తమకు కేటాయించిన ప్రాంతాలకు సరఫరా చేయడానికి రెస్కోలను ఏర్పాటుచేశారు. రాష్ట్రంలో 3 రెస్కోలున్నాయి.1) కుప్పం - చిత్తూరు 2) చీపురుపల్లి - విజయనగరం 3) అనకాపల్లి - విశాఖపట్నం.


ఆంధ్రప్రదేశ్‌ కో-ఆపరేటివ్‌ ట్రైబ్యునల్‌: సహకార వ్యవస్థలోని వివాదాలు పరిష్కరించేందుకు సహకార సంఘ చట్టం-1964 ప్రకారం విశాఖపట్నం కేంద్రంగా ట్రైబ్యునల్‌ ఏర్పాటైంది.


వ్యవసాయ రాయితీలు

వస్తువులు లేదా సేవలు అందించినప్పుడు వాటికి అయ్యే ఖర్చు కంటే తక్కువ వసూలు చేసి, ఆ తేడాను ప్రభుత్వం భరిస్తే దాన్ని రాయితీ (సబ్సిడీ) అంటారు. ఈ రాయితీలు ప్రభుత్వ ఖజానాపై భారం పెంచుతాయి. వ్యవసాయ రంగంలో ముఖ్యంగా 3 రకాల రాయితీలున్నాయి. 1) విద్యుత్తు రాయితీ 2) విత్తన రాయితీ 3) ఎరువుల రాయితీ.

1) విద్యుత్తు రాయితీ: వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే 2004, మే 14న తొలిఫైలుపై సంతకం చేసి వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు సరఫరా అమలుచేశారు. రాష్ట్రంలో 2021, నవంబరు నాటికి మొత్తం వ్యవసాయ పంపుసెట్ల సంఖ్య 19.64 లక్షలు. వీటిలో 18.5 లక్షల పంపుసెట్లకు ఉచిత విద్యుత్తు లభిస్తోంది. 2005 ఏప్రిల్‌ 1 నుంచి పెద్ద రైతులకు 3కు మించి పంపుసెట్లు ఉంటే ఉచిత విద్యుత్తు నిలిపేశారు.

* పగటిపూట 9 గంటల నిరంతర నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేస్తున్నారు. ఆక్వా రైతులకు యూనిట్‌కు రూ.1.50 చొప్పున రాయితీతో సరఫరా చేస్తున్నారు.

2) విత్తన రాయితీ (సన్న, చిన్న కారు రైతులకు):  2021-22 రబీలో 4.14 లక్షల క్వింటాళ్ల విత్తనాలను సబ్సిడీపై పంపిణీ చేశారు. అధిక వర్షపాతం వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో 80% రాయితీపై విత్తనాలు అందించారు.రాష్ట్రంలో 3 సంస్థల ద్వారా ఇలా విత్తన పంపిణీ జరుగుతుంది. 1) ఆంధ్రప్రదేశ్‌ విత్తనాభివృద్ధి సంస్థ 2) ఆంధ్రప్రదేశ్‌ మార్క్‌ఫెడ్‌ 3) ఆంధ్రప్రదేశ్‌ ఆయిల్‌ఫెడ్‌

3) ఎరువుల రాయితీ: ఎరువుల రాయితీ భారాన్ని కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. సగటున ఒక హెక్టారుకు అధిక ఎరువులు వినియోగించే రాష్ట్రాలు 1) పంజాబ్‌ 2) ఆంధ్రప్రదేశ్‌. వివిధ పరిశోధనల ప్రకారం ఒక కిలో యూరియా వినియోగంతో 10 కిలోల వరి లేదా గోధుమ ఉత్పత్తి చేయవచ్చు.


2021-22లో రాయితీల భారం: * నత్రజని 1 కేజీకి - రూ.18.78 * ఫాస్ఫరస్‌ 1 కేజీకి - రూ.14.88 * పొటాష్‌ 1 కేజీకి - రూ.10.16.* సల్ఫర్‌ 1 కేజీకి - రూ.2.37

రచయిత: ధరణి శ్రీనివాస్‌

Posted Date : 04-07-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌